Bhagavat Gita
7.20
నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః
{7.25}
మూఢో అయం నాభిజానాతి లోకో మా మాజమవ్యయమ్
యోగమాయచే కప్పబడి యుండుట చేత నేను అందరికి గోచరించువాడను కాను. అజ్ఞానులగు ఈ మానవులు నన్ను పుట్టుక లేని వానినిగ, నాశము లేని వానినిగ ఎరుగరు
మనమొక ప్రత్యక్ష సినిమా షూటింగ్ కి వెళ్ళేమనుకోండి. అక్కడ తారలందరూ మొహానికి రంగు పూసుకొని, వింత వింత వేషధారణాలతో చాలా అందంగా ఉండి మనను మైమరిపిస్తారనుకోండి. షూటింగ్ తరువాత వారు తమ రంగు తుడుచుకొని, తమ స్వంత దుస్తులు వేసికొని వస్తే మనము వాళ్ళను గుర్తించలేము.
మనము అ షూటింగ్ కొన్ని రోజులుగా కదలకుండా చూస్తే బయట ప్రపంచం గుర్తుకు రాదు. సమయమంతా సినిమాలు ఎలా తీస్తారో అన్న అంశం మీద వెచ్చించి వారి కేమెరాలు, దుస్తులు, రంగులు మొదలైన వాటిని అవగాహన చేస్తాం. ఎవరైనా బయటకెళదాం అంటే మనం ఇంతకన్నా వేరే ప్రపంచమేముంది అంటాం.
మన శాస్త్రాలు పెద్ద పాలపుంత నుంచి మన దేహం వరకు, సదా మారుతూ ఉన్న శక్తి మాయ అంటాయి. దాని వలన ప్రకృతి అంతా మాయ. అంటే అన్ని పదార్థాలు, మనస్సు, అహంకారం మారుతూ ఉంటాయి. కాలగమనం కూడా నిజంకాక మన మనస్సు వలనే జరిగి మాయకు లోబడి ఉంది. మనకి కనిపించే విశ్వం సంపూర్ణంలో ఒక చిన్న భాగము మాత్రమే. అది కలగానే వాడికి కల ఎంత నిజమో, అంత నిజము. కాని అది కలలాగే ఉండి, దాని నుంచి మేల్కొనవచ్చు.
మనము జీవితమనే కలనుంచి మేల్కొనడానికి ఇష్టపడం. నిజానికి మేల్కొనడం అంటే ఏమిటో తెలీదు. యోగులు చెప్పేది: మనకి ఆధ్యాత్మిక ఆనందం పొందాలనే అభిలాష ఎక్కువవుతున్న కొలదీ, మన కల పాతబడి, మనం ఆనందమయ స్థితిలో మేల్కొంటాం. శ్రీ రామకృష్ణ దేవత క్రీగంట చూపుతో మనవైపు చూస్తే మాయ పఠాపంచలవుతుందని చెప్పేరు.
ఒకమారు నారదుడు, శ్రీకృష్ణుడు వనంలో నడుస్తున్నారు. శ్రీకృష్ణుడు నారదుని ఏదైనా వరం కోరుకోమన్నాడు. దానికి సమాధానంగా నారదుడు సృష్టి రహస్యం చెప్పమన్నాడు. సరేనని శ్రీకృష్ణుడు నారదుడిని పొరుగున్న గ్రామం కెళ్ళి త్రాగటానికి నీళ్ళు తెమ్మన్నాడు. నారదుడు వెళ్ళి ఒక ఇంటి తలుపు కొట్టేడు. ఒక అందమైన యువతి తలుపు తెరిచింది. నారదుడు మోహితుడై తనను పెళ్లి చేసికోమని కోరేడు. ఆమె అందుకు అంగీకరించింది. క్రమంగా నారదుడు సంసారి అయి పిల్లలను కని, మనమలు, మునిమనవులతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆ సమయంలో ఆ గ్రామానికి ఒక పెద్ద వరద వచ్చి నారదుని కుటుంబాన్నినీట ముంచేసింది. నారదుడు ఎంతో దుఃఖపడి శ్రీకృష్ణుని సహాయం కోరేడు. అంతలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై "నారదా నేను అడిగిన నీళ్ళు ఎక్కడ?" అని ప్రశ్నించేడు.
వెంటనే నారదునికి జ్ఞానోదమయి శ్రీకృష్ణుని కాళ్ళపై పడ్డాడు. ఈ విధంగా నారదుడు శ్రీకృష్ణుని మాయను తెలిసికొన్నాడు.