Bhagavat Gita
7.4
భూమి రాపో అనలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ
{7.4}
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా
భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి ఎనిమిది విధములుగ నున్నది
నా చిన్నప్పటి గ్రామంలో ఒక మసాలా కొట్టు ఉండేది. ఆ కొట్టువాడిని సాంబార్ మసాలా అడిగితే ధనియాలు, ఇంగువ, కారం మొదలైనవాటిని ఒక ఆకులో వేసి, వాటిని కలిపి, పొట్లం కట్టి ఇచ్చేవాడు.
దేవుడు ఇదేపని ప్రకృతిలో చేస్తాడు. సృష్టి లోని మూల పదార్థాలు --అనగా పంచ భూతాలు: ఆకాశం, భూమి, నిప్పు, నీరు, గాలి--ప్రకృతిలోనివి.
శ్రీకృష్ణుడు ప్రకృతి, పురుషుల మధ్య గల భేదాన్ని వివరిస్తున్నాడు. పురుషుడు అన్ని కాలాల్లో ఉండే ఆత్మ. దానిలో మార్పుగాని, పరిమితిగాని లేదు. ప్రకృతికి జననమరణాలు ఉంటాయి. మన దేహం ప్రకృతి లోని పంచభూతాలతో చేయబడినది. మరణించిన తరువాత ఖననం చేసినప్పుడు దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది. మనం ఆవివేకం వలన దేహం చిరకాల ముండేదని తలుస్తాం. మన శరీరంలో ప్రతి అణువు ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. మనస్సు కూడా ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. మనం ఆలోచనలని విశ్లేషణము చేస్తే -- అది ధ్యానంవలన సాధ్యం--మన అంతర్గత౦ కూడా ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి పదార్థము, శక్తి యేకాక భావాలు, ఆలోచనలు, అహంకారం కలిగి ఉంటుంది. ఇవన్నీ దేహం పుట్టినప్పుడు కలసి వస్తాయి. దేహం పడిపోయిన తరువాత అవి వాటి దారిన పోతాయి.
కఠ ఉపనిషత్తు ప్రకృతిని ఈ విధంగా వర్ణించింది:
ఆత్మ రథంలో ప్రయాణించేవాడు
దేహం రథం
రధికుడు బుద్ధి
ఇంద్రియాలు గుఱ్ఱాలు
స్వార్థ పూరిత ఆలోచనలు వెళ్ళే బాట
ఆత్మ తికమక పడినప్పుడు, దేహేంద్రియ మనస్సులతో సుఖదుఃఖాదులు అనుభవించును,
మనమొక కారు అద్దెకు తీసికొని ఒక గమ్యం చేరాలనుకోండి. ప్రయాణ మధ్యలో వింతలు విడ్డూరాలు చూస్తూ ఉంటే ఆ కారులోని ఇంధనం అయిపోయి, గమ్యం చేరకుండా, తిరిగి కారుని అప్పజెప్పేయాలిసి వస్తుంది. అలాగే మన ప్రాణ శక్తిని లక్ష్యం పై కాక వృధాగా వెచ్చిస్తే లక్ష్యం సాధించకుండా దేహం పడిపోతుంది.
ధ్యానం మొదలు పెట్టినప్పటి నుంచీ మన దేహాభిమానం త్యజించాలి. మొదట్లో అది చాలా కష్టమనిపిస్తుంది. అది ఎలాగంటే మన నాలుకకు రుచులు అలవాటు పడితే దానికి సాధారణ పదార్థాలు రుచించవు. ఒక కుక్కకు తర్ఫీదు ఇవ్వకపోతే దాని ఇష్టం వచ్చినట్లు ఉంటుంది.
ఆధ్యాత్మిక జీవనంలో తాజాగా చేయబడిన పౌష్ఠికాహారాన్ని తినాలి. రోజూ వ్యాయామం చెయ్యాలి. తగినంత నిద్ర పోవాలి. అలాగే చెడలవాట్లను విడనాడాలి. నాతో కలసి ధ్యానం చేస్తున్న అనేక మంది ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాల అలవాట్లనుంచి విముక్తి పొందేరు. వాళ్ళు మొదట నన్ను కలసినప్పుడు వారిని విమర్శించను. ఎందుకంటే వాళ్ళు ధ్యానం మొదలపెట్టిన కొన్నాళ్ళకి వాటిని వదిలేస్తారు.
ఇంద్రియాలకు తర్ఫీదివ్వడం భౌతిక ప్రక్రియ కాదు. అది మానసిక పరమైనది. నన్ను కలిసిన కొందరు భౌతిక శాస్త్రజ్ఞులు మేము అంతర్గత ప్రపంచాన్ని నమ్మం; మేము దాన్ని మా పరికారాలతో చూడలేము అని చెప్పేరు. నేను చెప్పే అంతర్గత, బాహ్య ప్రప౦చాలు, ఒకే వస్త్రంతో చేయబడినట్లు. ఆరోగ్యం భౌతిక సిద్ధాంతాలతోనే కాక, ఆధ్యాత్మిక, మానసిక స్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. రోగం సూక్ష్మక్రిముల వలననేకాక, మానసిక వొత్తిడి, చెడు అలవాట్ల వలన రావచ్చు. మనమందరితోనూ పోటీ పడితే కడుపులో పుండు (ulcer) రావచ్చు. మన క్రోధాన్ని అధిగమించకపోతే ఆస్త్మా వంటి శ్వాస సంబంధిత రోగాలు కలుగవచ్చు.
పదార్థము ఎలా ప్రకృతిలో ఒక భాగమో మనస్సు కూడా ప్రకృతిని ఆలంబము చేసికొని ఉన్నది. ఆలోచనలను మనము చూడలేము, పట్టుకోలేము. అవి పదార్థము వంటివి కావు అని మనకు తెలుసు. కానీ దాని మీద ఆధారపడిన వాక్కు ఇతరులను బాధించవచ్చు. ఒక విమర్శ వలన ఇతరులకు నిద్ర పట్టకపోవచ్చు. ఇవి అంతా ఆలోచనల శక్తి వలన కలిగినవి.
మేధ కూడా ప్రకృతి. ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానము మార్పు చెందుతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు పాఠశాల నుంచి తిన్నగా నా అమ్మమ్మ, అమ్మ దగ్గరకు వెళ్ళి ఆ రోజు నేర్చుకున్న విషయాలు చెప్పేవాడిని. ఒక రోజు నేను వాళ్ళకి "భూమి గుండ్రంగా ఉంది" అని చెప్పేను. వాళ్ళు విరగబడి నవ్వేరు. ఇప్పటికీ నా అమ్మ "నా కొడుకు ప్రొఫెసర్, గొప్ప వ్యక్తి, కానీ భూమి గుండ్రంగా ఉందని నమ్ముతాడు" అని ఇతరులకు చెప్తుంది. వచ్చే దశాబ్దాలలో కొందరు శాస్త్రజ్ఞులు భూమి ఆకారం పూర్తిగా గుండ్రంకాదు, దాని ఆకారం మారుతూ ఉంటుందని చెప్పవచ్చు.
చివరగా అహంకారం కూడా ప్రకృతి యనబడును. ఎందుకంటే అది ఆలోచనలు, భావాల వలె శాశ్వతము కాదు. మన ఆలోచనలు, భావాలూ మారుతూఉంటే మన వ్యక్తిత్వము కూడా మారుతూ ఉంటుంది. మనం ఎల్లప్పుడూ ఒకేలా ఉన్నామని తలచవచ్చు. కానీ చాలామంది ఇతరులతో సంభాషించే టప్పుడు వేరేగా ఉంటారు. కానీ మనలో మారనిది ఒకటి ఉందని చాలా మందికి చూచాయిగా తెలుసు. గీత చెప్తుంది: "నువ్వు ఎప్పుడూ ఒకేలాగ ఉన్నావు. నీ మారుతున్న ఆలోచనలు, కోర్కెలు నీవు కాదు. అవి ఒక ముసుగు. నీవు ముసుగే నువ్వనుకొన్నావు. దాని క్రింద నీ ఆత్మ ఉంది. అది ఎప్పటికీ మారనిది".
No comments:
Post a Comment