Bhagavat Gita
7.6
ఏతద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ
{7.6}
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయ స్తథా
సకల భూతములును నా ఈ రెండు విధములైన ప్రకృతులు వలననే జనించుచున్నవని గ్రహింపుము. అలాగుననే సమస్తమైన జగత్తు యొక్క పుట్టుకకు, ప్రళయమునకు కారకుడను నేనే
మత్తః పరతరం నాన్య త్కించిదస్తి ధనంజయ
{7.7}
మయి సర్వమిదం ప్రోత౦ సూత్రే మణిగణా
ధనంజయా! నా కంటె శ్రేష్ఠమైనది వేరొకటి లేనేలేదు. దారమందు మణులవలె ఈ సమస్త ప్రపంచము నా యందే కూర్చబడి యున్నది
శ్రీకృష్ణుడు విశ్వంలో ప్రతీదీ తననుండి ఉద్భవించి, తిరిగి తనలోనే లయమవుతుందని చెప్తున్నాడు. అతడు ఇక్కడుండి, ప్రపంచం అక్కడున్నట్టు కాదు. రెండూ కలిసే ఉన్నాయి. దేశాకాలాలు, పదార్థ శక్తులు -- అనగా ప్రకృతి -- సదా మార్పు చెందుతూనే ఉంటాయి. వాటి అంతర్లీనంగా మార్పులేని వాస్తవికత ఉంది. ఇవి భగవత్స్వరూపంలో రెండు అంశాలు. స్పినోజా అనబడే 17 వ శతాబ్దపు యోగి పరిమితమైన ప్రపంచం అపరిమితమైన దేవుని వక్షస్థలం మీద ఉన్నదని అన్నారు. వచ్చే అధ్యాయాలలో శ్రీకృష్ణుడు సృష్టి ఎలా చేస్తాడో, పాలిస్తాడో, లయంచేస్తాడో వివరిస్తాడు. ప్రస్తుతం చెప్పేది నక్షత్ర వీధులు (galaxy), సకల జీవరాసులు ఒక మణుల హారంలాగ ఉండి తన మెడలో వేసుకున్నానని.
కాంతి చందమామ నుండి భూమికి రావడానికి ఒక సెకండ్ పడుతుంది. అంటే మన ప్రక్క ఇంటినుంచి మనయింటికి వచ్చే సమయం. అదే కాంతి సూర్యుడు నుంచి మన దగ్గరకు రావడానికి 8 నిమిషాలు పడుతుంది. అది ఆ సమయంలో 930 లక్షల మైళ్ళు ప్రయాణం చేస్తుంది. కాంతి కొన్న లక్షల కోట్ల మైళ్ళు ఒక సంవత్సరములో ప్రయాణించ గలదు. అలా ప్రయాణిస్తూ పోతే మనకు దగ్గరగానున్న నక్షత్రాన్ని చేరడానికి 4 ఏళ్లు పడుతుంది. అంటే సూర్యుని ప్రక్క ఇ౦టికి వెళ్లాలంటే అంత కాలం పడుతుంది. పాల పుంత (milky way) కోట్ల నక్షత్రాలతో కూడి ఊహించలేని పరిమాణం గలది. కానీ అటువంటి నక్షత్ర వీధులు మనం ఊహించలేని సంఖ్యలో ఉన్నాయి. ఇవి శ్రీకృష్ణుడు చెప్పే మణులతో పొదగబడిన హారంలో ఒక మణికి సమానం.
ఖగోళ శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి మనం చూడలేని సృష్టి కనబడే సృష్టికి ఆవల నుండి, ఊహించలేనంత పరిమాణం గలది అని చెప్తున్నారు. మన సూర్యునికన్నా కోట్ల రెట్లు ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉన్నాయంటున్నారు. అలాగే అనేకమైన కృష్ణ బిలాలు (black hole) -- వేటి నుంచి కాంతి కూడా విడబడ లేదో -- ఉండి అవి తమలో చుట్టుపక్కల నున్న నక్షత్రాలను కలుపుకుంటున్నాయి. అంటే ఆ బిలాలు నక్షత్రాలను తింటాయి. ఇది ఎలా సాధ్యం అని అడిగితే ఏ శాస్త్రజ్ఞుడూ సమాధానం చెప్పలేడు. శ్రీకృష్ణుడు చెప్పక చెప్పేది: మన మె౦త దూరం వెళ్ళినా, చివరికి కాలం యొక్క సమాప్తం వరకు ప్రయాణించినా మనమాతని సృష్టిని పూర్తిగా చూడలేము.
ఈమధ్య 2011 లో బ్రయన్ స్మిత్ నాయకత్వంలో పనిచేసిన ఖగోళ శాస్త్రజ్ఞులకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేరు. వాళ్ళు జీవితాంతం శ్రమపడి ఖగోళానికి సంబంధించిన అనేక విషయాలను అధ్యయనం చేసేరు. కొన్ని వేల గంటలు చీకటి రాత్రుళ్ళలో దూరదర్శినితో నక్షత్ర వీధులను పరికించేరు. కొన్ని దశాబ్దాలుగా సాగిన వారి పరిశోధన వలన తేలినదేమిటంటే: కొన్ని నక్షత్రాలు, దశాబ్దాల తరబడి, తమ ప్రకాశాన్ని మార్చుకోవు. అంటే ఇవి నడి వయస్కులు లాంటివి. బ్రౌన్ డ్వార్ఫ్(brown dwarf) అనబడే నక్షత్రాలు చరమ దశలో ఉన్నవి. అంటే వాటిలో ఇంధనం అయిపోయి ప్రకాశ౦ క్షీణిస్తుంది. కొన్నాళ్ళకు అవి కృష్ణ బిలాల్లాగ మారవచ్చు. ఏది ఏమైనా కొన్ని నక్షత్రాలను (super novae) ప్రామాణిక క్రొవ్వొత్తులు (standard candles) అంటారు. అంటే వానితో మిగతా నక్షత్రాల ప్రకాశాన్ని పోలిక పెడతారు. ఉదాహరణకు మన అతి దగ్గరలో ఉన్న ఆల్ఫా సెంటారీ అనబడే నక్షత్రాల గుంపు ప్రామాణిక క్రొవ్వొత్తుల కన్నా రెండు రెట్లు ప్రకాశవంతంగా ఉండచ్చు. వారు కొన్ని దశాబ్దాల క్రిందట ఆ ప్రామాణిక క్రొవ్వొత్తుల ప్రకాశాన్ని ఒక ఛాయా చిత్రంగా తీసేరు. అలాగే ప్రతి సంవత్సరం ఛాయా చిత్రాలు తీసేరు. ప్రకాశానికి, దూరానికి మధ్యన గల సంబంధం కనుగొని, ఆ ప్రామాణిక క్రొవ్వొత్తులు మన భూమి నుంచి వేగంగా ఆవలకి వెళుతున్నాయని తీర్మానించేరు. అంటే మనకి, వాటికి మధ్యనున్న దూరం పెరుగుతోంది. కాని వాళ్ళు చూస్తున్న కాంతి కొన్ని వేల ఏళ్ల క్రిందటిది. ఇప్పటికీ అవి మన భూమినుండి ఊహించలేని దూరం ప్రయాణించి, కొన్నేళ్లకు మనకు కనబడకుండా పోతాయి.
స్మిత్ బృందం పరిశోధనలో మరొక ముఖ్యాంశం ఉంది. అది ఏమిటంటే విశ్వం ఒక క్రమంలో ఎటో పోతున్నాది. ఉదాహరణకు ఒక బుంగని ఒక పెట్టెలో పెట్టి దానిలోకి గాలి ఊదితే అది క్రమంగా ఆ పెట్టి పరిమాణం పొంది ఆగిపోతుంది. అంటే ఇంకా ఎంత గాలి ఊదినా అది పెట్టె పరిమితులను దాటదు. అదే బుంగను పెట్టె బయట పెట్టి ఊదితే పెట్టె కన్న ఎక్కువ పరిమాణం పొంద గలదు. ఇక్కడ మనకు కనబడే సృష్టిని బుంగ అనుకొ౦దాము. మనకు ఉదయించవలసిన ప్రశ్నలు: మనకు కనబడే సృష్టి ఆవల కనబడని పెట్టె లాంటి సృష్టి ఉందా? ఇంకా పొడిగిస్తే ఆ పెట్టె చుట్టూ -- కొండపల్లి బొమ్మలో బొమ్మలాగ -- ఉంకో పెట్టె ఉందా? మరియితే భగవంతుడు ఎక్కడున్నాడు? అతని రూపము ఆ పెట్టె లాంటిదా? అతనెందుకు ప్రామాణిక క్రొవ్వొత్తులను మన నుండి దూరంగా ప్రయాణింపచేసి వేరు చేస్తున్నాడు? మానవుడు శక్తిని పరీక్షిస్తున్నాడా? లేదా మానవుడు దానవుడై దేవుని సృష్టిని పరిహసిస్తున్నాడా?