Bhagavat Gita
8.1
అర్జున ఉవాచ :
కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మ౦ కిం కర్మ పురుషోత్తమ
{8.1}
అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే
పురుషోత్తమా! బ్రహ్మ మనగా నేమి? అధ్యాత్మ మనగా నేమి? కర్మమనగా ఎట్టిది? అధి భూతమని చెప్పబడునది ఏది? అధి దైవమని దేనిని పిలుతురు ?
అధియజ్ఞః కథం కో అత్ర దేహో అస్మిన్ మధుసూదన!
{8.2}
ప్రయాణకాలే చ కథం జ్ఞేయో అసి నియతాత్మభిః
మధుసూదనా ! అధియజ్ఞ్నుడనగా నెవరు? ఈ దేహము నందు అతనిని ఎట్లు గ్రహింపవలెను ? మనోనిగ్రహము గల యోగులు మరణకాలమున నిన్నెట్లు తెలిసి కొందురు? నా కీ విషయములను తెలుపుము.
శ్రీ భగవానువాచ:
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మ ముచ్యతే
{8.3}
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః
నాశరహితమైన సర్వోత్కృష్టమైనదియే బ్రహ్మము. స్వభావము అధ్యాత్మ మనబడును. సకల ప్రాణులకు ఉత్పత్తి కారణమైన విసర్గము కర్మమనబడును
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం
{8.4}
అధియజ్ఞో అహమేవాత్ర దేహే దేహభృతాం వర
అర్జునా! ఈ దేహమునందు నశించు స్వభావము గలది అధిభూతము. పురుషుడు అధిదైవతము. అధియజ్ఞుడను నేనే. ఀ
అర్జునడు తనకు శ్రీకృష్ణుడు ఇంతకు ముందు చెప్పిన విషయముల పై కలిగిన సందేహాలను శ్రీకృష్ణుడు ద్వారా తీర్చికొనుచున్నాడు. ముఖ్యంగా "జీవుని మార్పులన్ని౦టిలోకీ అతి పెద్దదైన మరణం సంభవించినపుడు, చేతన మనస్సులో నిన్ను ఎలా గుర్తించ గలను? నీతో మమేకమై మరణాన్ని ఎలా దాటుతాను?"
చాందోగ్య ఉపనిషత్తులో శ్వేతకేతుడనే బాలుడు, గురువు దగ్గర విద్యనభ్యసించి ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని బ్రహ్మన్ గూర్చి అడుగుతాడు. దానికి బదులుగా వాని తండ్రి తత్ త్వం అసి అనే మహావాక్యాన్ని బోధిస్తాడు. దాని పదార్థము (meaning) బ్రహ్మన్, మన ఆత్మ రెండూ ఒకటే.
ఇది అర్థం చేసికోవడం కొంచెం కష్టమైనప్పటికీ, ఉపనిషత్తులు అనేక శ్లోకాలతో దానిని వివరిస్తాయి. ఒక సాలెపురుగు ఎలా అయితే తన గూడును తనచుట్టూ అల్లుకుంటుందో, అన్ని మార్పులకు, పరిమితులకు అతీతుడైన బ్రహ్మన్ తననే సృష్టిగా మార్చుకొన్నాడు. దీనిని సృష్టి కార్యమనేకాక పరివర్తనము అని కూడా అనవచ్చు. అది మాయచే జరగబడి దేవుని అంశను సృష్టిలోని ప్రతి పదార్థములోనూ నిక్షిప్తము చేయబడినది. శ్రీ రామకృష్ణ బ్రహ్మన్ మరియు మాయ విడదీయ బడనివి అని చెప్పెను. ఎట్ల౦టే మనం అగ్నిని, అది మండించగల శక్తిని విడదీయలేము. మండించలేని అగ్నిని ఊహించలేము. శ్రీకృష్ణుడు చెప్పేది: సృష్టి దేవుని కన్న అన్యమైనది కాదు. ప్రతి పదార్థము దేవునిచే ప్రభావితమై, దేవుడు అంతటా ఉన్నాడు.
జీవులలో అట్టి పరమాత్మని అధ్యాత్మ లేదా ఆత్మ అందురు. అధిభూతమనగా పంచ భూతాలతో చేయబడిన దేహము. ఆత్మ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహమును ధరించి యున్నది. ఉదాహరణకి మన చిన్నప్పటి దేహము నడి వయస్సులోది కాదు; నడి వయస్సులోని దేహము వృద్ధాప్యములో లేదు. దేహము సదా మారుతూ ఉంటుంది. కాని మార్పుచెందే దేహమును ధరించు దేహి మార్పు చెందుట లేదు.
దీని వలన తెలిసేదేమిటంటే మనకు దేహము భగవంతుడు ఇచ్చి దానిని తిరిగి తీసికొంటాడు. ఈ మధ్యలో దాన్ని బాగా చూసుకొనే బాధ్యత మనకుంది. అంటే దానిని మంచి ఆహారంతో పోషించడం, దానికి తగిన వ్యాయామం ఇవ్వడం, సరిపడిన విశ్రాంతి ఇవ్వడం, మొదలైన కర్మలు.
అధిదైవ అనగా మనలో నిక్షిప్తమై, మనని నియంత్రించునది. అది మన శరీరమునకే పరిమితము కాదు. సృష్టి లోని ప్రతి ఒక్కటీ దేవునిచే నియంత్రింప బడుచున్నది. సూర్యునిలోని ఉష్ణము, కాంతికి అతడే కారణము. అట్లే పువ్వులు పూసిన చెట్లు, గురుత్వాకర్షణ శక్తి, మన జీవ కణాల్లో జరిగే మార్పులు, గుండె కొట్టుకోవడం ఇవన్నీ ఆ పరమాత్మ వలన -- వాటిలోన ఉండి -- జరుపబడుచున్నవి.
అధియజ్ఞ మనగా ఆ పరమాత్మ. అతనికి మన జీవితంలో చేసిన త్యాగము చెందుతుంది. మనమెప్పుడైనా ఇతరుల గురించి త్యాగం చేస్తే -- మనం చూడాలనుకొన్న సినిమా, మనం సలవులకు వెళ్ళాలనుకొన్న ప్రదేశానికి , మనమీద వెచ్చించాలనుకొన్న ధనం -- అది నిజానికి మన ఆత్మ పొందుచున్నది. అలా అని ఇతరులకు ఆ త్యాగం వలన లాభం లేదని కాదు. కాని అది మనకు ఎక్కువ లాభం చేకూర్చి, మన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది.
ఆధ్యాత్మిక పురోగతికి అహంకారాన్ని వీడడం ఎంతో అవసరం. అట్టి త్యాగం మన బదులు వేరొకరు చేయలేరు. అంటే మనమే చెయ్యాలి. గురువులు మన ఆధ్యాత్మిక ప్రయాణ మార్గములో సూచికలు వంటివారు. కానీ ఆ ప్రయాణం చేసేవారలము మనమే. మన సాధన ఉంకొకరు చెయ్యరు. ధ్యానం మనంతట మనమే ఉత్సాహంతో చెయ్యాలి. అలాగే ఇతరులతో వేర్పాటు తగ్గించుకోవాలి.
మన అహంకారాన్ని ఒక రోజులో తీసేయలేము. దాన్ని ఒక పెట్టె లో పెట్టి బంధించ లేము. ఎందుకంటే అది పట్టే పెట్టె చేయలేము కనుక. అందుకే సాధనలో క్రమంగా దాన్ని తగ్గించుకుంటూ రావాలి. ఒకానొక రోజు దేహము, మనస్సుతో కలిగిన తాదాత్మ్యము విడిబడుతుంది. సూఫీ ఆల్-ఘజాలీ మరణిస్తూ ఈ విధంగా చెప్పెను:
నా మిత్రులు నా మృత దేహమును చూసి ఏడిస్తే
"వానిని ఈ దేహంగా తప్పుగా అర్థం చేసికొన్నారా?" అని అడగండి
వాళ్ళకి చెప్పండి దేవుడి మీద సాక్షిగా
ఈ మృతదేహము నేను కాదని.
అది భూమి మీద నే బ్రతికినంత కాలం వేసికొన్న వస్త్రము మాత్రమే