Bhagavat Gita
8.10
సహస్ర యుగ పర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః
{8.17}
రాత్రిం యుగసహస్రా౦తాం తే అహో రాత్రివిదో జనాః
ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని వేయి యుగముల కాలముగను, అట్లే రాత్రిని వేయి యుగముల కాలముగను తెలియుదురో అట్టివారు రాత్రింబవళ్ళు యొక్క పరిణామమును తెలిసికొని యున్నారు
అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవం త్యహరాగమే
{8.18}
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త స౦జ్ఞకే
బ్రహ్మదేవునికి పగలు ప్రారంభమగునపుడు అవ్యక్తము నుండి సర్వ భూతములు ఆవిర్భవించుచున్నవి. మరల రాత్రి ప్రారంభము కాగానే అట్టి అవ్యక్తము నందే విలీనమగుచున్నవి
భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే
{8.19}
రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవ త్యహరాగమే
పార్థా! సర్వభూతములు బ్రహ్మకు పగలగునపుడు ఆవిర్భవించుచు, రాత్రియైనపుడు అంతరించుచు జనన మరణములను మరల మరల పొందుచున్నవి ఀ
మన పురాణాల్లో కాలాన్ని 4 యుగాలుగా విభజించేరు. మొదటిదైన సత్య యుగంలో ప్రతి ఒక్కరూ నిస్వార్థపరులై భూమి స్వర్గతుల్యంగా ఉండేది. దీనిని ఒక ఎద్దు నాలుగు కాళ్లతో నిలబడుతున్నట్టు చిత్రీకరిస్తారు. క్రమంగా ఎద్దు మూడు కాళ్ళ మీద నిలబడి, త్రేతాయుగము ఆవిర్భవించింది. ఈ యుగంలో మనుష్యులు లోభం, స్వార్థం, మోహంతో ఉండేవారు. ఎద్దు రెండు కాళ్ళ మీద నిలబడినప్పుడు ద్వాపర యుగం అన్నారు. ఈ యుగంలో నీకు సగం, నాకు సగం అనే భావన కలిగి, ఒకడు తనకై బ్రతుకుతాడో లేక ఇతరుల మేలుకై పాటు పడతాడో చెప్పలేని స్థితి కలిగింది. చివరగా ఎద్దు వంటి కాలి మీద నిలబడినప్పుడు ప్రస్తుతం మనముండే కలియుగం వచ్చింది. కలి అనగా క్రోధం, హింసలతో కూడినది.
ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహా యుగమవుతుంది. వెయ్యి మహాయుగాలు ఒక కల్పం అంటారు. అది బ్రహ్మ దేవునికి ఒక రోజు కాలము. బ్రహ్మ లేచిన వెంటనే నామ రూపాత్మకమైన సృష్టి ప్రారంభమవుతుంది. పదార్థము, శక్తి, దేశకాలాలు ఆవిర్భవిస్తాయి. కొందరు ఋషులు లెక్కలుకట్టి బ్రహ్మదేవుని ఒక రోజు 432 కోట్ల సంవత్సరాలు అని చెప్పేరు.
బ్రహ్మ సృష్టిని సృజించి అలసిపోయి నిద్రపోతాడు. సృష్టి బ్రహ్మదేవుని ఆలోచనలో ఉన్నదికాబట్టి, బ్రహ్మ ఎప్పుడు పడుకుంటాడో, అది అవ్యక్తం లోకి పోయి అంతరిస్తుంది.
ఖగోళ శాస్త్రజ్ఞులు మన సృష్టి బిగ్ బ్యాంగ్ వలన కలిగిందని అంటారు. మరికొందరు సృష్టి సృజింప బడలేదు ఎప్పుడూ నిలకడగానే ఉంది అంటారు.
బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మన శాస్త్రాలు చెప్పినదానికి దగ్గరగా ఉంటుంది. అబ్బే జార్జ్స్ హెన్రీ లెమైటెర్ అనబడే బెల్జియన్ ప్రీస్ట్ సృష్టి 1000 కోట్ల సంవత్సరముల క్రింద ఆరంభమైనదని చెప్పేడు. దాని ద్రవ్య రాశి సుమారుగా ఇప్పటి లాగాఉండి, ఒక చిన్న ముద్ద వలె ఉండెను. దానిని ఒక గ్రుడ్డుతో లేదా అణువుతో పోలుస్తారు. అదే బ్రహ్మాండం అని కూడా పిలువబడుతుంది. ఆ దశలో దేశకాల మానాలు లేవు.
లెమైటెర్ విశ్వంలోకి క్రొత్త ద్రవ్యం రాక, తయారవక ఒకనాటికి అంతమౌతుందని తలచేడు. కానీ శాస్త్రజ్ఞులు అంగీకరింపక ఇలా అన్నారు: విశ్వం నలుదిక్కుల వ్యాపించి నప్పుడు, గురుత్వాకర్షణ సిద్ధాంతం వలన, మళ్ళీ వెనక్కి వచ్చి గ్రుడ్డు వలె పరివర్తిస్తుంది. కొంత వ్యవధి తరువాత మళ్ళీ విస్ఫోటించి, సృష్టి మొదలవుతుంది. ఈ విధంగా విశ్వ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. బ్రహ్మ దేవుడు పగలు మేల్కొని, రాత్రి విశ్రమించి యున్న౦త కాలమూ ఈ విశ్వ చక్రం కదులుతూనే ఉంటుంది.
సృష్టి ఆవిర్భవించలేదు, అది ఎప్పుడూ నిలకడగా ఉందనేవారు, దానికి మొదలు అంతము లేదని చెపుతారు. వారు విశ్వం వ్యాపిస్తూఉంటే క్రొత్త ద్రవ్యము సృజింపబడుతుందని నమ్ముతారు.
సర్ ఫ్రెడ్ హోయిల్ అనబడే శాస్త్రవేత్త నిలకడ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసినవాడు.
ఆయన చెప్పేది ద్రవ్య రాశికి (mass) మొదలు ఉంది గానీ విశ్వానికి ఆద్యంతములు లేవు. అది ద్రవ్యం కన్నా విశాలమైనది. అది ప్రతిచోటా ఉంది. ఇదే శ్రీకృష్ణుడు కూడా చెప్పేడు. విశ్వం అతని కుక్షిలో ఉన్నది. హోయిల్ గురుత్వాకర్షణ శక్తి, అణు శక్తి వలె ద్రవ్య శక్తి ఉండి, దాని నుండి క్రొత్త ద్రవ్యము సృజింపబడుతుందని చెప్పెను. పాత ద్రవ్యము ద్రవ్య శక్తిలోకి వెనక్కి తీసికోబడుతుంది. ఇదే యోగులు విశ్వసించేది కూడా.
ఒక క్రొత్త సిద్ధాంతంలో ద్రవ్యము మారుతూ ఉంటుందని చెప్పబడినది. ద్రవ్య శక్తి వలన ద్రవ్యము ఆవిర్భవిస్తుంది. ఈ ద్రవ్య శక్తి విశ్వ వ్యాప్తమైనది. ఐన్స్టీన్ వంటి శాస్త్రజ్ఞులు దీన్ని ప్రతిపాదించేరు. ఈ మధ్య దానిని హిగ్గిన్స్ బోసాన్ అనే పేరుగల పరమాణువుగా గుర్తించేరు. ఒక పదార్థము యొక్క ద్రవ్యము హిగ్గిన్స్ బోసాన్ చే నిర్ణయింప బడుతుంది. ఎక్కువ హిగ్గిన్స్ బోసాన్ లు ఉన్న క్షేత్రంలో ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పదార్థము ఒకటే అయినా దాని ద్రవ్యము మారుతూ ఉంటుంది. విశ్వం ఎప్పుడూ ఒకే పరిణామంలో ఉంటూ, బిగ్ బ్యాంగ్ వంటి విస్ఫోటములతో కూడి ఉంటుంది. కాబట్టి విశ్వం పుట్టునది కాదు, పోవునది కాదు.
ఇటువంటి సిద్ధాంతాల వలన శాస్త్రజ్ఞులు, ఋషులు మధ్యన ఉన్న అపోహలు తొలగుతాయి. ఈ అపోహ శాస్త్రీయ, ఆధ్యాత్మిక సిద్ధాంతాల వలన కాదు. మనము శాస్త్రజ్ఞులు చెప్పే సిద్ధాంతాలను ఋషులు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలతో అన్వయించుకోవాలి. సమాధి స్థితిలో ఒక ఉత్కృష్టమైన దశను తురీయమందురు. ఆ దశలో జ్ఞేయము-జ్ఞాత- జ్ఞానము అనే త్రిపుటి ఉండదు. పాలపుంతలతో, కృష్ణ బిలాలతో, నక్షత్రాలతో కూడిన విశ్వాన్ని దేవుడు, ఒక క్రీడాకారుడు బంతితో ఆడుతున్నట్టుగా, తన చుట్టూ తిప్పుకొంటున్నాడు అని తెలుస్తుంది.