Bhagavat Gita
8.9
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతం
{8.15}
నాప్నువంతి మహాత్మాన స్సంసిద్ధం పరమాం గతాః
ఉత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందిన వారై దుఃఖాలయమును, అనిత్యమునైన జన్మమును తిరిగి పొందరు
ఆ బ్రహ్మభువనా ల్లోకాః పునరావర్తి నో అర్జున
{8.16}
మాముపేత్య తు కౌ౦తేయ పునర్జన్మ న విద్యతే
అర్జునా! బ్రహ్మలోక పర్యంతము గల లోకములకు వెళ్ళిన వారందరు తిరిగి పుట్టుచునే యున్నారు. నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మము లేదు
పై శ్లోకంలో శ్రీకృష్ణుడు పునర్జన్మ గురించి చెప్పుచున్నాడు. ధ్యానం అవలంబించి పునర్జన్మను నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు. మనం ఏమీ సాధన చేయకుండా పునర్జన్మ ఉంటుందని నమ్మవచ్చు. అలాగే పునర్జన్మ లేదని నమ్మి, ఈ జన్మలో నిస్వార్థంగా బ్రతకవచ్చు. పరిణామ సిద్ధాంతానికి, పునర్జన్మ సిద్ధాంతానికి మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. మనం తల్లి గర్భంలో ఒక కణంగా ప్రవేశించి, కోట్ల కణాలతో పరిణామం చెంది బయటపడ్డాం. సూఫీ యోగి జలాలుద్దీన్ రూమి ఇలా చెప్పేరు:
నేను అవ్యక్తంలోనుంచి వచ్చేను
జీవితం అనబడే అడవిలో నా గుడారం వేసికొన్నాను
నేను ఒక కణం, తరువాత ఒక కాయ
అటు తరువాత జంతువు అయ్యాను
క్రమంగా ఒక మంచి వాళ్ళ సంపర్కంతో మనిషినయ్యాను
నేను గుడుల చుట్టూ తిరిగేను
చివరకు దేవుని చేరే మార్గంలో పయనించి
ఆయన తలుపు దగ్గర బంటు నయ్యాను
నేను ఆయన వేరువేరుగా లేము
ఎందుకంటే నేను అతని యందు కలిసిపోయేను
టిబెట్ యోగులు మనకి రెండు శరీరాలున్నాయని చెప్తారు: ఒకటి స్థూలం; మరొకటి సూక్ష్మం. సూక్ష్మ శరీరం మన ఆలోచనలతో, భావాలతో ఉంటుంది. అది అభౌతికం. మన స్థూల శరీరానికి ఒడ్డూ, పొడుగూ మొదలగు లక్షణాలు ఉండి భౌతికంగా ఉంటుంది. దానిలో సూక్ష్మ శరీరం సంస్కారాలతో, తమస్, రజస్, సత్త్వ గుణాలతో కూడి ఉంటుంది.
మరణము సంభవించినపుడు సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని విడుస్తుంది. స్థూల శరీరం పంచ భూతాలతో కలిసిపోతుంది. పిదప మన సూక్ష్మ శరీరం బార్డో అనబడే స్థలానికి వెళుతుంది. అక్కడ చాలా కాలం వేచి ఉన్న తరువాత మరొక జన్మ వస్తుంది. మన ఉపనిషత్తులు దీనికి, సుషుప్తికి పోలిక లున్నాయని చెప్తాయి. సుషుప్తిలో మన సమస్యలు గుర్తుకురావు. మన దేహం గానీ మనస్సు గానీ ఎరుకలోకి రావు. కానీ మనం సుషుప్తినుండి మేల్కొన్న తరువాత అన్ని ఆలోచనలు తిరిగి వచ్చి మనం పూర్వంలాగే ఉంటాము. బార్డో కూడా సుషుప్తి లాంటిదే. మరణంలో మన చేతనమనస్సు దేహంతో విడిపడి, మనం కొంత కాలం ప్రశాంతతను పొందుతాము. అటు తరువాత ఇంకొక శరీరంలో ప్రవేశించి మేల్కొ౦టాం.
శ్రీకృష్ణుడు తనతో ఐక్యమయ్యేవరకు జన్మలు పొందుతూనే ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి మన౦ పునర్జన్మ పొందడం లేదా మోక్షం పొందడం మన చేతుల్లోనే ఉంది. మనం సత్కర్మలు చేస్తూ, మన కుటుంబానికీ, సమాజానికీ ఉపయోగకరంగా ఉంటే పునర్జన్మ ప్రస్తుత జన్మ కన్నా ఉత్కృష్టంగా ఉంటుంది. అలా కాక మనం స్వార్థంతో, ఇతరులకు హాని కలిగిస్తే మరు జన్మలో దానికి తగ్గట్టు నీచ స్థితికి వెళ్తాం. కాబట్టి మనం మన స్థితికి బాధ్యులం. మన తలిదండ్రులను, జీవిత భాగస్వామిని, పిల్లలను నిందించడం వ్యర్థం.
వేరే మాటల్లో చెప్పాలంటే మనమే జన్మలోనైనా సమస్యలను పరిష్కరించుకొని, ఉన్నత స్థితికి ఎదగవచ్చు. మనం దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇతరుల సంసారం మన సంసారం కన్నా ఉన్నతంగా ఉందని తలుస్తాం. నా అమ్మమ్మ "ప్రక్కింటి మల్లె పువ్వు మనదానికన్నా ఎక్కువ సువాసన కలది" అని అనేది. మనలో చాలా మందికి మంచి తలిదండ్రులు, మిత్రులు, పిల్లలు ఉంటారు. వారిలో లోపాలు కూడా ఉంటాయి. మన తలిదండ్రులు ఏ లోపాలు లేకుండా ఉంటే వారికీ జన్మ ఉండేది కాదు. కాబట్టి మన ప్రస్తుత జన్మ మన లోపాలను సరిదిద్దుకోవటానికై ఇవ్వబడినది. యోగులు చెప్పేది మనమందరము తప్పులు చేస్తాము; కొ౦త మోతాదులో తప్పులు చేయకపోతే మనం ఉత్తమ మార్గంలోకి వెళ్లలేము. కాబట్టి మన౦ భూత, వర్తమాన కాలాల గురించి చింతించనక్కరలేదు. ధ్యానం ద్వారా మన భవిష్యత్ ను ఉత్తమంగా మలచుకోవచ్చు.
జీవితం ఒక పాఠశాల వంటిది. మనం భగవదైక్య౦ చెందేవరకు లేదా ప్రాణుల ఐక్యతను తెలిసికొనేవరకు ఆ పాఠశాలకు వెళ్తూ ఉండవలసిందే. ఆత్మహత్య అతి నీచమైన క్రియ. భౌద్ధులు, హిందువులు ఆత్మహత్య చేసికొనేవారు మరల, మరల, జన్మించి, కష్టాలను ఎదుర్కొని తమ స్థితిని మెరుగు పరుచుకునేవరకు భగవదైక్యం పొందలేరు అని అంటారు. ఈ జన్మలో కష్టాలు ఎందుకంటే మనం వాటిని ఎదుర్కొని పరిష్కరించే మార్గాన్ని తెలిసికొనడానికి. అలా కాక పోతే మనం కష్టాల వలయంలో కూరుకుపోతాం. మనమే కష్ట స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని స్వార్థం తగ్గించుకొని, ఇతరుల శ్రేయస్సుకై పాటు పడాలని తలుస్తాడు. అతడు మనకు కష్టాలనుంచి గట్టెక్కించే సులభమైన మార్గాన్ని చూపడు. కానీ మన వేర్పాటును అధిగమి౦చి, భగవంతుడు అందరిలోనూ, మన శత్రువులనుకూడా కలుపుకొని, ఉన్నాడని తెలిసికొ౦టే మన జీవిత లక్ష్యాన్ని సాధించి మరు జన్మ పొందవలసిన అవసరం ఉండదు.
అర్జునుని అన్న ధర్మరాజు, అజాతశత్రు -- అనగా శత్రువులు లేనివాడు -- అనబడేవాడు. పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసము చేస్తున్న రోజుల్లో అనేకమంది ఋషులు వాళ్ళని పరామర్శించడానికి వచ్చేవారు. వారిలో ఒక ఋషి "మిమ్మల్ని కౌరవులు దేశంలో౦చి భహిష్కరించి అరణ్యాలకు పంపించినా నువ్వు అజాతశత్రుగా ఎందుకు ఉన్నావు?" అని అడిగేడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం ఇచ్చేడు: "నన్ను అరణ్యాలకు పంపించి, నా బంధు మిత్రులనుండి వేరు చేసింది నిజమే. కానీ నా రాజ్యాన్ని ఆక్రమించిన వాళ్ళు నా శత్రువులు కారు. ఇతరుల మేలుకై నేను వాళ్ళకు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. వాళ్ళు నన్ను శత్రువు అనవచ్చు. కానీ వాళ్ళు నాకెప్పుడూ మిత్రులే". అతడు దేవుని ప్రతి జీవిలో చూసినవాడు కాబట్టి తనను మోసగించి, తన రాజ్యాన్ని అపహరించిన వాళ్ళను కూడా మిత్రులిగా భావించేడు. ఇది మనం ముఖ్యంగా నేర్చు కోవలసిన పాఠం. పురాణాలు ధర్మరాజు మరణించిన తరువాత మరొక జన్మ లేకుండా భగవంతునితో ఐక్య మయ్యేడని చెప్తాయి.