Bhagavat Gita
8.14
యత్ర కాలే త్వనావృత్తి మావృత్తి౦ చైవ యోగినః
{8.23}
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ
అర్జునా! ఏ కాలమున గతించిన యోగులు జన్మ రాహిత్యము పొందుదురో, ఏ కాలమందు గతించినవారు పునర్జన్మమును పొందుదురో ఆయా విషయములను చెప్పుచున్నాను
అగ్నిర్జ్యోతి రహ శుక్ల ష్షణ్మాసా ఉత్తరాయణం
{8.24}
తత్ర ప్రయాతా గచ్ఛ౦తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః
అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఆరునెలలు గల ఉత్తరాయణము అనెడి మార్గమునందు వెడలిన బ్రహ్మవేత్తలగు వారు బ్రహ్మమునే పొందుచున్నారు
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం
{8.25}
తత్ర చాంద్రమాసం జ్యోతి ర్యోగీ ప్రాప్య నివర్తతే
ధూమము, రాత్రి, కృష్ణపక్షము, ఆరునెలలు గల దక్షిణాయనము అనెడి మార్గమునందు వెడలిన యోగి చంద్ర లోకాదులకు వెళ్ళి తిరిగి పునర్జన్మ నెత్తుచున్నారు
ఈ శ్లోకాలు ఆత్మ మరణం తరువాత రెండు మార్గాల ద్వారా వెళుతుందని చెప్తున్నాయి. ఒకటి ఉత్తరాయణ; రెండవది దక్షిణాయన. ఉత్తరాయణంలో సూర్యుడు ఆరు నెలల పాటు ఉత్తరార్ధ గోళంలో సంచరిస్తాడని, దక్షిణాయనములో ఆరు నెలల పాటు దక్షిణార్థ గోళంలో సంచరిస్తాడని చెప్తారు.
మనం అక్షరాస్యులమైనా, కాకపోయినా, ధనవ౦తులమైనా లేదా పేదవారములైనా ఒకానొక ఎన్నిక చేసుకోవాలి. అది మన బాగుకై కర్మ చేయాలా లేదా ఇతరులకై పాటు పడాలా. మనం ఇతరులకొరకై పాటు పడేవారిని ఆదర్శంగా తీసికొ౦టా౦. కానీ మన వరకూ వచ్చేసరికి ఏమి చేయాలో తెలీదు. మనం స్వార్థ పూరితంగా ఉన్నంతసేపూ ఇతరుల సంక్షేమము గురించి ఆలోచింపక తప్పు ఎన్నికలు అప్రయత్నంగా చేస్తాం.
మహాభారత యుద్ధంలో భీష్ముడు శస్త్రములతో ఛేదింపబడి నేల కొరిగేడు. అప్పుడు దక్షిణాయనం. భీష్మునికి స్వచ్ఛ౦ద మరణం ఉన్నది కనుక అతడు శరతల్పముపై పడుక్కొని, ఉత్తరాయణం కొరకై వేచి, అనేక బాధలను అనుభవించేడు. ఎప్పుడైతే సూర్యుడు విషువత్ (equinox) చేరుకొన్నాడో భీష్ముడు ప్రాణం విడిచేడు.
నా అమ్మమ్మ దక్షిణాయనంలో వ్యాధిగ్రస్తురాలయింది. వైద్యులు ఆమె ఎంతోకాలం బ్రతకదని చెప్పేరు. కానీ ఆమె ప్రాణాన్ని బిగపెట్టుకొని ఉత్తరాయణంలో మరణించింది. దాని వలన మాకు తెలిసినదేమిటంటే ఎవరికైతే దేవుడియందు అమితమైన ప్రేమ ఉంటుందో, ఎవరైతే ఇతరుల సంక్షేమానికై పాటు పడతారో, వారికి అమితమైన పట్టుదల ఉంటుంది.
మనం కూడా దేవుని యందు పరిపూర్ణ భక్తితో, ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. మొదట్లో అది బాధ కలిగించినా, చివర్లో సత్ఫలితాలు ఇస్తుంది.
ఈ శ్లోకాల్లో ఉత్తరాయణ మార్గం వెలుగుతో కూడినదని, దక్షిణాయనం చీకటి మార్గమని చెప్పబడినది. ఎవరైతే తమ ఇంద్రియాలను నిగ్రహించరో వారు చీకటి మార్గంలో పయనిస్తున్నారు. అట్టి వారు తమ చైతన్యమును కోల్పోయి, వ్యాధిగ్రస్తులై ఉంటారు. జీవితం చివరిలో చిన్ననాటి కోర్కెలు ఉండి, వాటిని ఎలా తీర్చుకోవాలో తెలీదు. అలాగే అహంకారంతో కూడి, దానిని ఎవరి మీద ప్రయోగించాలో తెలీదు. జీవితం దుర్భరమై, చావుకై ఎదురుచూస్తూ ఉంటారు. ఇది చీకటి మార్గము. కోట్లమంది ఈ మార్గంలో పయనిస్తున్నారు. ఎందుకంటే వారికి తమ దురలవాట్లను ఎలా వదిలించుకోవాలో తెలియదు. అలాగే అహంకారాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చెయ్యరు. మనము ఈ శ్లోకాల్లో చెప్పిన వెలుగు, చీకటి మార్గాలను గుర్తు పెట్టుకొంటే, ధ్యానం అలవర్చుకోవాలనే గాఢమైన ప్రేరేపణ కలుగుతుంది.