Bhagavat Gita
18.15
శుక్ల క్రిష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే
{8.26}
ఏకయా యాత్యనావృత్తి మన్యయా ఆవర్తతే పునః
ఈ శుక్లకృష్ణమార్గములు జగత్తు నందు శాశ్వతముగ నున్నవి. ఇందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యమును, రెండవ దానివలన పునర్జన్మమును కలుగుచున్నవి ఀ
మన శాస్త్రములు మనలో 7 చక్రాలు ఉన్నాయని చెప్తాయి. అవి: మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహిత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారము. వెన్నెముక క్రిందన కుండలిని శక్తి వృత్తాకారంలో ఉంటుంది. అది సాధారణంగా క్రింది 3 చక్రాలలో సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కుండలిని 4 వ చక్రము, లేదా దానిని దాటి ఉంటుందో, పై శ్లోకములో చెప్పిన కాంతి కనిపిస్తుంది.
అలాగ కాంతి పుంజము కనబడితే, జీవితం స్వచ్ఛంగా కనబడుతుంది. ధ్యానంవలన మన దైనింద జీవితంలో మార్పు వస్తుంది. మన నడవడిక, వ్యక్తిత్వము ధ్యానము వలన పురోగమిస్తున్నాయా? అన్న ప్రశ్న దీనికి పరీక్ష. మనము ధ్యానంలో ఉన్నప్పుడు గాని, నిద్రి౦చు నప్పుడు గాని, ఆ కాంతి పుంజము కనిపిస్తే మనకు శుభఫలితాలు వస్తాయి. పాత నిరోధాలు, బంధు మిత్రులతో స్పర్థలు తొలగవచ్చు. ఈ మార్పులు వచ్చేయంటే మన అనుభవము సత్యమైనది. అలా కాకపోతే మనమి౦కా సాధన చేయాలి.
సాధారణ వ్యక్తులకు ఆ కాంతి పుంజము యొక్క అనుభవము రాదు. సాధనతో కుండలిని 4 వ చక్రము చేరితే ఆ కాంతి అంత ప్రజ్వలంగా ఉండక పోవచ్చు. యోగులు చెప్పినట్టు దేహం కాంతితో నిండియున్నది. కానీ అది మనం చూడలేము. కాంతి పుంజము కనబడినప్పటినుంచీ మనకు ధ్యానం చేయడానికి ఉత్సాహం పెంపొంది, జీవుల ఐక్యతను గ్రహిస్తాము. మన బంధుమిత్రులు క్షేమంగా ఉంటే సరిపోదు. మనము మన ప్రేమను అందరికీ పంచి పెట్టాలి.
కుండలిని శక్తి 5 వ చక్రము చేరితే, మన జీవితము పైన అవగాహన ఇంకా ఎక్కువ అవుతుంది. మరింత సాధన చేస్తే కుండలిని మన కనుబొమల మధ్యకు వస్తుంది. దీనిని సవికల్ప సమాధి అంటారు. ఎందుకంటే మన ధ్యానం ఒక దేవత మీద ఉంటుంది. ఆ దేవత సమస్త సృష్టిలో ఉన్నదన్న జ్ఞానము కలుగుతుంది. అంటే వేరొక జీవికి అపకారం తలపెట్టం.
కుండలిని 7 వ చక్రము చేరితే కాంతి పుంజము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. దీని నిర్వికల్ప సమాధి అంటారు. ఇది అనన్యమైన మనస్సుతో సాధన చేస్తేనే సాధ్యము. సూర్యుని కళ్ళతో చూస్తే ఎలాగ చూపు పోతుందో, ఈ కాంతి ప్రకాశం సాధారణ మనుష్యులు చూడలేరు.
కుండలిని 7 చక్రాలలో వ్యాప్తమై ఉన్నప్పుడు, మనము దేవయాన మార్గములో, సూర్యుని వైపు ప్రయాణిస్తాము. అది దేవతల లోకానికి తీసికవెళ్తుంది. ఇది మనము ధ్యానం చేసి, ఇతరులతో సంబంధాలూ లేదా కలహాలు పెట్టుకోకుండా ఉంటేనే సాధ్యము. ముండక ఉపనిషత్తు ఈ విధముగా చెప్పెను:
చిత్తశుద్ధి గలవారు, ధ్యానం చేసేవారు
ఇంద్రియములను, కోరికలను నియంత్రించి
సమస్త కాంతికి, జీవులకు కారణమైన
పరమాత్మను పొందెదరు.
రెండవ మార్గము చంద్రుని వైపు ఉంటుంది. చంద్రునికి సహజమైన కాంతి లేదు. అది చీకటితో నిండి ఉన్నది. మనము ఇంద్రియములతో తాదాత్మ్యము చెంది -- పనికిరాని పదార్థాలను తినడం, మద్యానికి అలవాటు పడడం వంటివి -- దేహం చీకటితో నింపుకుంటే ఈ మార్గాన వెళతాం.
సుఖాలకై ప్రాకులాడే వారు వారి సంపద లేదా యవ్వనమును చూచి ఓర్వలేని వారలను ఎదుర్కొంటారు. యుక్త వయస్సులో మనం చేసిన తప్పులను భగవంతుడు దయతో క్షమించడం వలననే ప్రస్తుత స్థితికి వచ్చేము. కానీ మనం సదా యువకులుగా ఉండలేము. క్రమంగా వృద్ధాప్యంలో చైతన్యము తగ్గి, మన౦ జీవితం యొక్క దిశను నిర్దేశింపలేక ఉంటాము. వృద్ధాప్యంలో మనకు చైతన్యం ఉన్నా, మనకున్న చాపల్యం వలన దేహాన్ని అంటిపెట్టుకొని ఉంటాము.
మనమెంత మూర్ఖత్వంతో ఉంటామో మన దేహంలో అంత చీకటి ఉంటుంది. అది తక్కిన వారితో మన బాంధవ్యాలను ప్రభావితం చేసి, వారితో ఎలా కలసిమెలసి ఉండాలో తెలియజేయదు. ధ్యానంలో చివరకు సంపూర్ణమైన కాంతి ఎలా పొందుతామో, స్వార్థ పూరితులమైతే పూర్తి చీకటిని అనుభవిస్తాము.
స్వార్థం ఎక్కువవుతున్న కొద్దీ మన దృఢసంకల్పం ఎక్కువవుతుంది. అట్టి స్థితిలో మన మాటే నెగ్గాలనే భావనలో ఉంటాం. ఇతరులకు వేరే భావనలు ఉండ వచ్చని ఒప్పుకోము. ఇలాంటి వ్యక్తులకు సహనం ఎలాగ సాధ్య మవుతుంది? నడివయస్సు దాటిన తరువాత సహనం, ఒకప్పుడు లేకపోతే, క్రొత్తగా నేర్చుకోవడం కష్టం. కొందరు నాతో "మేము మారలేము" అని చెప్తారు. నా సమాధానం ఎప్పుడైనా మనము మారవచ్చని. కాకపోతే దానికై కష్టపడాలి. మనమెంతో కాలము చీకటిలో బ్రతికినా, కాంతి మార్గంలోకి మారవచ్చు.