Bhagavat Gita
8.3
తస్మా త్సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధ్య చ
{8.7}
మయ్యర్పిత మనోబుద్ధి ర్మామేవైష్య స్వసంశయః
అందుచేత సర్వకాలము లందును నన్నే స్మరించుచు యుద్ధము చేయుము. నా యందు సమర్పించబడిన మనో బుద్ధులు గల వాడవైనచో నిస్సంశయముగ నన్నే పొందగలవు
శ్రద్ధ విధికి ఎలా అనుబంధమో, ధ్యానం శ్రద్ధకి అలా అనుసంధానమై యున్నది. గీత ఒక గ్రామంలో, లేదా నగరంలో చెప్పబడలేదు. అది సంగ్రామ స్థలంలో చెప్పబడినది. అక్కడ ఏనుగుల ఘీంకారము, శంఖారావాలు మ్రోగుతున్నాయి. సైనికులు మారణాయుధాలతో యుద్ధం చేయడానికి పూనుకొని ఉన్నారు. అదే ఈ సమయంలో జరిగి ఉంటే విమానాల, ట్యాంకుల మోతతో నిండి ఉంటుంది. వాటి మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునునికి మరణాన్ని ఎలా దాటాలో చెప్తూ ఉంటాడు. మన దైనింద జీవితం కూడా ఒక పోరే. మనం చేసే భయ౦కరమైన యుద్ధము ప్రతిరోజూ, ఉదయం, పగలు, మనము విజయవంత మైనంతవరకు చేయాల్సిందే.
మన చేతన మనస్సులో యుద్ధభూమిలో లాగే అనేక వలయాలు మొహరింపబడి యున్నవి. వాటి నిజమైన శక్తి మనకు చాలా కాలం వరకు తెలియదు. మొదట కాల్బలం. అనగా మనకున్న భయాలు. మనకు తెలియనివి అనేక భయాలు మన అచేతన మనస్సులో దాగి ఉన్నాయి. మనకు భయాలు లేవనుకున్నా, మన వేర్పాటు చేతన మనస్సు లోపలకి చొచ్చుకొని పోయి ఉంది. దాని తరువాత అశ్విక దళం. అదే మన క్రోధం. అశ్విక దళాన్ని తక్కువ అంచనా వేయలేం. తరతరాలుగా రాజులు తమ అశ్విక దళ సామర్థ్యంతో యుద్ధాలలో గెలిచేరు. అది కాల్బలం కన్నా శక్తివంతమైనది. పురాతన కాలంలో భారత దేశంలో ఏనుగు దళాలతో శత్రువుల -- వారు ఇతర దేశాలనుంచి వచ్చిన వారు అవ్వవచ్చు -- గుండెలలో భయాన్ని కల్పించేవారు. అది మన అహంకారంకి చిహ్నం. అది క్రోధం, భయం కన్నా అనేక రెట్లు అధికం. వీటన్నిటినీ దాటుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి. బుద్ధుడు కూడా దీనంతటి కష్టేతరము లేదని చెప్తాడు. అలాగే వీటిని జయిస్తే దాని వలన కలిగే ఆనందం వర్ణనానీతం.
ఉదయం లేచిన దగ్గరనుంచీ ఈ యుద్ధం మనలో సాగుతూనే ఉంటుంది. గడియారం మ్రోగగానే, వెంటనే లేవాలా లేదా ఇంకొంత సేపు నిద్ర పోవాలా అనే అంతర్యుద్ధం మొదలవుతుంది. మంచం మీదనుంచి గడియారం మ్రోగిన వెంటనే లేవడం ఉత్తమం. అలాగ కొన్నాళ్ళు అలవాటు పడితే మొదటి పోరు గెలిచినట్టే.
కాలకృత్యాలు తీర్చుకొని ధ్యానం అయిష్టంగా చేయాలా వద్దా, లేక ఆ రోజు దినపత్రిక కాఫీతో చదవాలా అనే సంశయం మొదలవుతుంది. అలా౦టప్పుడు ధ్యానాన్ని ఎంచుకొంటే రెండవ పోరులో గెలిచినట్టు.
ధ్యానం ఆరంభించిన తరువాత కళ్ళు మూతలబడి నిద్రపోవాలనే ఆలోచన రావచ్చు. ధ్యానం బాగా సాగితే, దానిని యోగనిద్ర అంటారు. యోగ నిద్రతో పోరు తలపెట్టుకోవడం వృధా. కానీ మనం ముందుకు సాగాలంటే దానితో పోరాడక తప్పదు. ఈ సమస్య ధ్యానం చేసినంత కాలం ఉంటుంది. మొక్కై త్రుంచబడనిది మానై త్రుంచబడునా అనే నానుడి ననుసరించి యోగనిద్రని ఎదుర్కోవడమే ఉత్తమం.
ధ్యానం తరువాత ఏదో తినాలి. ఇక్కడ మనకి చాలా ఎన్నికలు ఉన్నాయి. చద్ది, బ్రెడ్, సీరియల్, మొదలైనవి. వాటిలో ఏది ఆరోగ్యానికి, శరీర పోషణకి అవసరమో వాటినే తినాలి. ఉదాహరణకు ఎక్కువ శాతం కొవ్వు ఉన్న పదార్థాలను ప్రక్కన పెట్టవచ్చు. అలాగే కాఫీ కొంచెమే త్రాగవచ్చు. క్రమంగా కాఫీని త్యజించవచ్చు ఎందుకంటే అది శరీర పోషణకు సహకరించదు. నేను ధ్యానంలో విసుగు చెందకూడదని చెప్పడం ఇందుకే. జీవితంలో విసుగు చెందితే మన పోరు విజయవంతం కాలేదు.
తరువాత ఉద్యోగం. కొందరు అతి తక్కువ శ్రమ పడి, ఎక్కువ లాభం కలిగితే బాగుండునని అనుకొంటారు. అది తమకు, తక్కిన వాళ్ళకి తీరని నష్టం. కావున మేనువంచి పని చేయడం ఉత్తమం. విరామ సమయంలో అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, మంత్ర జపం చేసుకోవడానికి అనువైన కాలం. ఇంటికి తిరిగి వాహనం మీద వెళ్తున్నప్పుడు, ఈ పోరు సాగుతూనే ఉండి, మనకు ప్రమాదం, లేదా ఇతరులకు హాని కలగడం జరగచ్చు.
రోజులో ఇంతవరకూ జరిగిన పోరు తరువాత, ఇంటికి వచ్చి సుఖంగా విశ్రమించవచ్చని అనుకోవచ్చు. ధ్యానం మరుసటి రోజు చేయవచ్చని తలంచవచ్చు. ఇందిలో తెలిసికోవలసినది ఏమిటంటే మన ప్రత్యర్థి ఒక పద్ధతిలో మనతో పోరు చేయడు. మన ఇంట్లో, పిల్లలతో, భాగస్వామితో అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు. మొదట్లో అది కష్టమనిపించినా క్రమంగా అందులో సాఫల్యం పొందుతాము.
అలాగే మన చుట్టుప్రక్కల ఉంటున్న వాళ్ళకై కొంత సమయం కేటాయించాలి. వాళ్ళు మనని ఎంతో శాంత హృదయము గలవాడని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనలోని అంతర్యుద్ధం గురించి వాళ్ళకి తెలియదు కనుక.
మీరు ఈ విధంగా రోజు గడుపుతే చివరకు విజయం వరిస్తుంది. ఎటువంటి తల్ప౦ మీద పడుకొన్నా రాని విశ్రాంతి, దైనింద కార్యములను జయించినందువలన వస్తుంది. ఇదే ఆధ్యాత్మిక జీవిత౦ కోరే కుటుంబీకుల సాధన. ఆ తరువాత మంత్ర జపం చేసికొ౦టే దేవుని చేతుల్లో విశ్రాంతి తీసికొన్న అనుభవం వస్తుంది. మంత్ర మహిమ వలన, ఆ రోజు జరిగిన యుద్ధంలో కలిగిన గాయాలు మాని, మరుసటి రోజు చేయవలసిన యుద్ధానికై దేహము, మనస్సు సిద్ధ పడతాయి. మనకు దేవుని గురించయి ఈ యుద్ధాన్ని సాగిస్తే, దేవుడు మనకు కావలసిన ఆరోగ్యం, బలం, ఓర్పు ప్రసాదిస్తాడు. ఇలాగ జీవిత కాలం భగవదార్పణకై కొనసాగిస్తే, చివరకు దేవుడుతోనే ఐక్యమవుతాము.