Bhagavat Gita
9.10
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజ౦తో మాముపాసతే
{9.15}
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్
మరికొందరు జ్ఞాన యజ్ఞముతో నన్నారాధించుచున్నారు. విశ్వరూపుడనైన నన్ను కొందరు ఏకరూపుని గను, మరి కొందరు బహు రూపునిగను నానా విధములుగ పూజించుచున్నారు
ఈ శ్లోకంలో ఏదో జ్ఞాన౦ గుప్తమై ఉందని చాలా మంది తలుస్తారు. ఇది ధ్యానంలో చివర కలిగే సృష్టి అంతా భగవంతుడే అన్న భావన వ్యక్త పరుస్తున్నాది. మనం ప్రకృతిలో సౌ౦దర్యాన్ని చూస్తూ, అది భగవంతుని వేర్వేరు రూపాలని అనుకోవాలి. సూఫీలు చెప్పినట్లు భగవంతుడు "ముఖం వెనుకనున్న ముఖం". ఒక హసిడిక్ యోగి ప్రపంచంలో వివిధ వ్యక్తులున్నారని కళ్ల అద్దాలు పెట్టుకుంటేనే గానీ తెలియదన్నాడు. అంటే కళ్ల అద్దాలు పెట్టుకోకపోతే అన్నీ ఒకలాగే ఉంటాయి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఇలా ఉంది:
భగవంతుడు విశ్వం యోక్క యోనిలో ఉన్నాడు,
సృష్టికర్త అన్ని జీవులలోనూ ఉన్నాడు
పుట్టినవన్నీ, పుట్టబోయేవన్నీ అతడే
ఆయన ముఖము అన్ని చోట్లా ఉంది
ఒకమారు నారదుడు అన్నిటికన్నా గుహ్యమైన ఆధ్యాత్మిక విషయము చెప్పమని శ్రీకృష్ణుడిని అడిగేడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు మందహాసము చేసి అంతర్ధాన మయ్యేడు. నారదునికి కొంతసేపటికి ఆకలి వేసి పొరుగునున్న ఇంటికెళ్ళి తలుపు తట్టేడు. ఒక అందమైన యువతి తలుపు తీసి నారదునికి బిక్ష పెట్టింది. ఆమె కళ్ళు అచ్చం శ్రీకృష్ణుని కళ్ల వలె ఉన్నాయి.
నారదుడు వెళ్ళి ఇంకో ఇల్లు తలుపు తట్టేడు. ఒక ఇల్లాలు తలుపు తెరిచింది. ఆమె వెనకి నుంచి ఒక చిన్న పిల్లవాడు దూసుకు వచ్చి "మీరు ఎప్పుడైనా శ్రీకృష్ణుని చూసేరా? ఆయన గురించి పాడండి" అని అడిగేడు. వాని కన్నులు కూడా అచ్చం శ్రీకృష్ణుని కళ్ళలా ఉన్నాయి. ఈ విధంగా నారదుడు ఆ వీధిలోని అన్ని ఇళ్ల తలుపులను తట్టి శ్రీకృష్ణుని ఏదో విధంగా దర్శించేడు. నారదుడు తాను చూసిన వారలలో వయస్సులో లేదా బాహ్యంగా తేడాలున్నా ఆ గ్రామంలో శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరూ లేరని గ్రహించేడు. అలా జ్ఞానోదయము అయిన తడవుననే ఆ గ్రామం మాయమై నారదుడు వైకుంఠంలో శ్రీకృష్ణుని చెంత ఉన్నాడు.