Bhagavat Gita
9.9
సతతం కీర్తయంతే మాం యతంతశ్చ దృడవ్రతాః
{9.14}
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే
సదా నన్ను కీర్తించవారును, ధృడవ్రతులై ప్రయత్నించు వారును, నన్ను భక్తితో నమస్కరించువారును నైన నిత్యయుక్తులు సదా నన్ను సేవించుచున్నారు
ధ్యానంలో పురోగమించాలంటే ప్రతి నిమిషం కష్ట పడాలి. ప్రతి ఉదయం మన ఆధ్యాత్మికతను గుర్తు తెచ్చుకోవాలి.
ధ్యానంలో మొదటి అడ్డంకు ఆహారం. మనం తగినంత ఆహారమే తినాలి. భోజనాల మధ్య ఆకలి వేసినప్పుడు పట్టుదలతో బయట నడవడంవంటివి చెయ్యాలి. ఏదైనా కళా ప్రదర్శనకి వెళ్లాలనుకుంటే, దాని ప్రవేశ రుసుమును ఎవరికైనా దానం చెయ్యచ్చు. జీసస్ "మమ్మల్ని వాంఛల వైపు త్రిప్పకు" అని భగవంతుడిని ప్రార్థించమన్నాడు. కాబట్టి పట్టుదల సడలే స్థితిలో ఉండకూడదు.
భౌతికమైన వాంఛలనుండి బయట పడితే, ఇక మానసిక పరిస్థితులు వస్తాయి. ధ్యానం మొదట్లో మన సమస్యలు కలుపు మొక్కలు లాంటివి. వాటి వేర్లు లోపలకు చొచ్చుకొని ఉంటాయి. ఇంకా లోతుగా వెళ్తే ఆ వేర్లు ఒక పది వేర్లలోంచి వస్తున్నాయని తెలుస్తుంది. ఇలా పరిశీలన చేసికొని పోతే చివరకు తల్లి వేరు కనబడుతుంది. అది మన చిత్త చాంచల్యానికి ప్రతీక. దీనివలన తెలిసేది మన౦ అహంకారం అనబడే కారాగారంలో బంధింపడి ఉన్నామని. దానినుండి విముక్తి పొందితే గానీ ముందుకు పోలేం.
ధ్యానం కొనసాగించు కొద్దీ అహంకారంతో యుద్ధం చేయాలి. నేను అహింసా వాదిని, శాంతి దూతను అంటే లాభంలేదు. అహంకారంతో యుద్ధంలో గెలిచే మార్గం వెతుక్కోవాలి. దానితో ఆఖరి రక్తపు బొట్టువరకు పోరాడాలి.
నేను ఇద్దరు వ్యక్తులు కొండ నెక్కడం చూసేను. వాళ్ళు తాళ్ళతో, పెద్ద మేకులతో బయల్దేరారు. మేకును కొండ శిలలో కొట్టి, దాని మీదకు మొలకు కట్టుకొన్న తాడును బిగించి, ఆ తాడును చేతితో పట్టుకొని కాళ్లతో శిలను ఎక్కి మీదకు వెళ్తున్నారు. ఒక మారు, మేకు కొట్టడానికి వీలు లేకపోయింది. అప్పుడు వాళ్ళు పూర్వపు గడియారాలలో లోలకము (pendulum) వలె తాడు సహాయంతో ప్రక్కలకు వెళ్ళి మేకుని బిగించి కొండ ఎక్కేరు. వారు ఎక్కడైనా మేకును సరిగ్గా బిగించక పోతే కొండ మీదనుంచి క్రిందకు పడే అవకాశం ఉంది. వారి పట్టుదలే వారిని కొండ పైకి చేర్చింది.
ధ్యానంలో కూడా ఇటువంటి పట్టుదల ఉండాలి. కొండను తాళ్లతో, పెద్ద మేకులతో మీదకు ఎక్కుతున్నట్టు మనం మన సాధనను సాగించాలి. ఎక్కడైనా మన ప్రగతికి నిరోధం వస్తే, వాళ్ళు లోలకం వలె వేళ్ళాడినట్టు, మన మొక ప్రణాళిక చేసుకొని దానిని అధిగమించాలి. మన బాధ్యత కృషి చేయడమే. తక్కినది దేవుడి మీద భారం వేయాలి. దేవుడు మన దీక్షను, పట్టుదలను మెచ్చితే, మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా 16 వ శతాబ్దంలో స్పైన్ దేశంలో ఉండేది. ఆవిడ అనేక మత పరమైన సంస్థలను ఎంత దూరమున్నా, వాతావరణ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, బహు దూరం ప్రయాణించి ప్రారంభించేది. దానికి ఇతర శాఖల వారు అడ్డం వచ్చినా వారితో ఆమె సామరస్యంతో వ్యవహరించేది. ఒకమారు ఆవిడ ఫ్లూ జ్వరంతో మంచాన పడింది. చలికాలం మధ్యలో ఆమెను ఒక క్రొత్త సంస్థను ప్రారంభించమని అడిగేరు. ఆమె ఫ్లూ జ్వరంతో దేవుని ప్రార్ధించగా ఆమెలో ప్రత్యక్షమైన దేవుడు "నేను నిజమైన వెచ్చదనం ఇచ్చేవాడిని; నీకెందుకు భయం" అన్నాడు.
సెయింట్ తెరెసా గుర్రం బగ్గీ ఎక్కి సుదూర ప్రయాణం సాగించింది. ఒకచోట నది నిండుగా పారుతోంది. దాన్ని దాటడానికి ఒక ఇరుకైన వంతెన మీదనుంచి బండి వెళుతోంది. ఆమె ప్రయాణిస్తున్న బండి ప్రక్కకు వంగి ఆమె బండిలో౦చి బయటకు విసర బడింది. ఆమె వంతెనను పట్టుకొని వేలాడుతోంది.
ఆమె "భగవంతుడా, నాకున్న అస్వస్థతో పాటు ఈ కష్టాన్ని ఎందుకిచ్చేవు?" అని ప్రార్ధించింది.
ఆమె చేతన మనస్సు లోతులలో భగవంతుని సమాధానం వినబడింది "నువ్వు బాధపడుకు. నేను నా మిత్రులను ఇలాగే చూస్తాను".
"దేవుడా, అందుకే కాబోలు నీకు ఇంత తక్కువ మంది మిత్రులు ఉన్నారు" అని అనుకొంది.
దేవుని కృపతో ఆమె తన లక్ష్యాన్ని నెరవేర్చుకొంది.
తెరెసా గొప్ప సెయింట్. అందుకే భగవంతుడు ఆమెకు ఎక్కువ బాధ్యతను ఇచ్చేడు. మనలాంటి సామాన్యులను కుటుంబ పరమైన లేదా సామాజిక పరమైన అంశాలలో తన నామ స్మరణ చేసుకోమని మాత్రమే కోరుతాడు. మనలో చాలా మందికి అది ఒక పెద్ద సవాలు.