Bhagavat Gita
9.11
అహం క్రతురహం యజ్ఞః స్వధా అహ మహమౌషధ౦
{9.16}
మంత్రో అహ మహమేవాజ్యం అహమగ్నిరహం హుతమ్
నేను క్రతువును, యజ్ఞమును, పితృపిండమును, ఔషధమును, మంత్రమును, హవిస్సును, అగ్ని హోత్రమును, హోమకర్మమునై యున్నాను
ఇక్కడ శ్రీకృష్ణుడు పురాతనమైన వైదిక కర్మలు గూర్చి చెప్పుచున్నాడు. కానీ శ్రీకృష్ణుని దృష్టిలో త్యాగ మనగా మన మాటే నెగ్గాలన్న పట్టుదలని, అహంకారాన్ని వీడడం. నేను ధ్యానంలో పురోగతిని తెలుసుకునేటప్పుడు, అంతరంగంలో మాటలు వినబడుతున్నాయా లేదా దృశ్యాలు కనబడుతున్నాయా అని అడగను. నేను తెలుసుకొనేది నా ఇష్టం వచ్చినట్లు చేస్తాననే అహంకారంకి ఎదురీత ఎలా సాగిందని. ఇదే సాధనలో పురోభివృద్ధి పొందడం అంటే.
గాఢమైన ధ్యానంలో అచేతన మనస్సును శోధించడమంటే, స్ప్రింగ్ కి తగిలి౦చిన తలుపును తెరవడం వంటిది. దానిని తెరిచి ఉంచడం చాలా కష్టం. ఎప్పుడైతే మనము దాన్ని కొంచెం తెరుస్తామో స్ప్రింగ్ దాన్ని మూసేస్తుంది. అది మొదట్లో నిరాశా, నిస్పృహలను కలుగజేస్తుంది. ఇలా అనేకమార్లు చేస్తే మీ ఏకాగ్రత తలుపుకావల దానిమీద ఉంటుంది. దేవుడు తలుపు వెనకాల ఉండి మీతో దాగుడు-మూతలు ఆడుతున్నాడాని అనిపిస్తుంది. మీకు కొంతకాలమైన తరువాత ఎలాగైనా ఆ తలుపును తెరిచి ఉంచాలనే పట్టుదల అధికమౌతుంది. రాత్రింబవళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు.
దీన్ని సాధించాలంటే మొదట మన ఇష్ట౦ వచ్చినట్టు చేద్దామనే భావనను నియంత్రించుకోవాలి. మనకు దినంలో ఇలా చేయడానికి అనేక అవకాశాలు దొరుకుతాయి. ఉదాహరణకు: మన ఆహార విషయాల్లో ఇష్టాయిష్టాలు; పరులతో బాంధవ్యాలు.
రెండవది, బలమైన కోరికను తిరస్కరించడం. సిగరెట్ కాల్చాలనో, మద్యం తాగాలనో, లేదా పరులకుపకరించని కర్మ చేయాలనో గాఢమైన కోరిక రావచ్చు. అలాటప్పుడు దానికి ఎదురు తిరగాలి. ఎందుకంటే ఆ కోరికలో అమితమైన శక్తి నిరుపయోగంగా ఉంటుంది. ధ్యానంలో అవరోధం కలిగినప్పుడు, దాన్ని దాటలేమనే నిరాశ కలిగినప్పుడు, మీరు కోరికకు, పట్టుదలకు ఉన్న అవినాభావ సంబంధం తెలుసుకొంటారు. బలమైన కోరిక కూడా పట్టుదలే. మన పట్టుదల యొక్క శక్తి ఆ కోరికలో మన స్వాధీనంలో లేక బందీ అవుతుంది. ఉదాహరణకు లైంగిక కార్యము తప్పక చేయాలనే కోరిక. ఎప్పుడైతే ఆ కోర్కెకు ఎదురు తిరుగుతామో మన పట్టుదల పెరుగుతుంది. అది మీరు ధ్యానంలో కూర్చోగానే తెలుస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడి, బంధు మిత్రులతో వైరము లేకుండా, మానసిక పరిస్థితి చక్కబడి, మీరు ధ్యానంలో పురోభివృద్ది చెందుతున్నారనే భావన కలుగుతుంది.
ఒక కోరిక అత్యంత గాఢమైనదయితే -- అనేక సంవత్సరాలుగా ఉన్నదైతే -- దాన్ని ఎదిరిస్తూ పోతే గొప్ప శక్తిని కూడబెట్టుకుంటారు. ఇది తెలిసికొన్నాక, మీరు ఆ గాఢమైన కోరిక రావడానికై వేచిచూడరు. మీరే దానిని రాకుండా నియంత్రిస్తారు.
కోర్కెలకు ఎదురు తిరగాలనే కోర్కె అత్యంత ఉత్తమ మైనది. నాలో ఒక బలమైన కోరిక తలెత్తుతే, నేను దానిని ఎదుర్కొంటాను. ఆ తరువాత నా భుజాన్ని నేనే తట్టుకొని మందుకు సాగుతాను. ఇది చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నా చిన్న మనస్సును నియంత్రించే యాజమానిని నేనే కాబట్టి.
ఈ విధంగా ఒక గాఢమైన కోరికను నియంత్రిస్తూ ఉంటే కొన్నాళ్ళకు దాని మూలాన్ని తెలుసుకొంటాం. దాన్ని వేళ్ళతో పీకి అవతల పారేస్తా౦. దాని స్థానంలో చైతన్యం ఒక ధారలా వచ్చి మనని ఉత్తేజపరుస్తుంది. మన సహనం అధికమౌతుంది; బాంధవ్యాలు గట్టి పడతాయి. ధ్యానంలో మనం తప్పక పురోగమించామని తెలియడానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి. మనను చాలా కాలం నుంచి బాధ పెడుతున్న శారీరిక, మానసిక సమస్యలు-- అజీర్ణము, ఆస్తమా, తీవ్రమైన తలనొప్పి, రక్తపు పోటు మొదలైనవి -- తొలగుతాయి. ఇదే శ్రీకృష్ణుడు నేను ఔషధాన్ని అని చెప్పడంలో అంతరార్ధం. అతనికి ఎంత దగ్గర అయితే, అతనంత స్వస్థత నిస్తాడు. అది బాహ్యంగానే కాదు, అంతర్గతంలో కూడా.
నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే పట్టుదల తగ్గించుకోవడానికి మంత్రం బాగా సహకరిస్తుంది. ధ్యానంలా కాక మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు. దానికి ఎక్కువ క్రమశిక్షణ అవసరం లేదు. మనము బయట అనేక ప్రకటనలు చూస్తాం. ఉదాహరణకు సిగరెట్ సంస్థలు చేసే ప్రకటనలు. కొన్ని కోట్ల మంది పొగత్రాగడం అపాయకరమని తెలిసినా ప్రకటనల వలన మోసపోయి దానికి బానిసలవుతున్నారు. ఎందుకంటే ఆ ప్రకటనల లోని మాటలు మన చేతన మనస్సులో హత్తుకు పోతాయి. మనము మంత్ర జపము చేసుకుంటూ ఉంటే అటువంటి దురాలోచనలు సమసి పోతాయి.
ఇది చాలా సులభమైన పద్దతి. దానిని ఒకమారు ఆచరణలో పెడితే మీకే తెలుస్తుంది అది ఎంత శక్తిమంతమో. మీకు ఇంట్లో ఎక్కువ కోపం వచ్చినపుడు, బయటకు వెళ్ళి, మంత్రాన్ని జపించుకొంటూ నడవండి. మీ కోపాన్ని ఇతరులమీద చూపకండి. దాని శక్తిని మంత్ర జపానికై ఉపయోగించండి.
మీకు ఒక పిండివంటను తినాలనే గాఢమైన కోర్కె కలిగినప్పుడు మంత్ర జపం చేస్తూ కొద్ది సేపు బయట నడవండి. ఒక గంటలో ఆ కోర్కె పోతుంది. అలా కాక పోతే ఆ కోర్కెను తీర్చుకోకపోతే, నేను చస్తాను అన్న భావన కలిగితే దైవ నామస్మరణ చేసుకోండి. ఇది ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాలకు బానిస అయినవారికి చాలా సహాయపడుతుంది. కొన్నిమార్లు మంత్రం చాలా కాలం వాడబడని కారులా పనిచేస్తుంది. పాత కారుని అనేక మార్లు ప్రయతనిస్తే కానీ దాని ఇంజిన్ మొదలవ్వదు. కానీ ఒక మారు ఇంజిన్ మొదలైతే, అది బాగా నడవగలదు.