Bhagavat Gita
9.2
రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమం
{9.2}
ప్రత్యక్షావగమ౦ ధర్మ్య౦ సుసుఖం కర్తు మవ్యయమ్
ఈ జ్ఞానము సమస్త విద్యలలో రాజు వంటిది . అతి రహస్యమైనది. ధర్మ స్వరూపమైనది. సులభ సాధ్యమైనది. నాశ రహితమైనది ఀ
ధ్యానంగురించ కొన్ని వేల పుస్తకాలున్నాయి. వాటన్నిటినీ చదవడానికి ఒక జీవితకాలం సరిపోదు. కాబట్టి ధ్యానం ఏదోవిధంగా మొదలెట్టడం మంచిది.
ధ్యానం అత్యంత రమ్యంగా ఉంటుందని కొందరంటారు. మీరు ఆకాశంలో తేలుతూ, సుగంధాలు ఆస్వాదిస్తూ ఉంటారని వారంటారు. కానీ అటువంటి అనుభవాలు చాలా మందికి రావు. ధ్యానంకై చాలా కష్టపడాలి. కొన్నాళ్ళు ధ్యానం చేసి, దాన్ని వదిలేసేవారు కూడా ఉన్నారు. అలాకాకుండా ఉండడానికి నేను కొన్ని సూచనలను ఇస్తాను.
మొదటి సూచన, ధ్యానం ఇతరులతో కలిసి చేస్తే ఉత్తమం. భార్యాభర్తలు కలిసిచేస్తే అది పిల్లలు కూడా అలవరచుకొని వృద్ధి లోకి వస్తారు.
రెండవ సూచన ధ్యానంలో స్థిరంగా ఉండండి. ఒక రోజు ధ్యానం మానేస్తే దాన్ని సవరించుకోడానికి వారం రోజులు పడుతుందని చెప్తారు. కాబట్టి ధ్యానాన్ని రోజూ ఒక నిర్ణీత సమయానికి చేయడం మంచిది.
మూడవది ధ్యానం ఒక పద్దతిలో -- అనగా మంత్రాన్ని జపిస్తూ, పరోపకారాన్ని పాటిస్తూ -- చెయ్యాలి.
నాల్గవది మీ అలవాట్లను పరిశీలించండి. ఉదాహరణకి మీరు తినే ఆహారం , వ్యాయామం. ఒక ఒలింపిక్స్ క్రీడాకారునిలా తగినంత మోతాదులో పోషకాహారాన్ని తింటూ, నిద్రపోతూ, వ్యాయామం చేస్తూ ఉండాలి. మన దేహం కర్మలకై ఇవ్వబడినది. కాబట్టి ధ్యానాన్ని వ్యాయామంతో అనుసంధానం చేయాలి. వ్యాయాయమంటే బరువులెత్తడం మాత్రమేకాదు. కాలి నడక కూడా వ్యాయామమే. యుక్త వయస్కులు బరువులెత్తడం వంటి కష్టమైన క్రియలు చేయవచ్చు.
చివరిగా మీరు అందరితో కలసి మెలసి సామరస్యంతో ఉండాలి. మనము ధ్యానంలో అంతర్ముఖులమై ఉంటాము కనుక, దానిని ఇతరులతో కాలం గడపడానికై అనుసంధానము చెయ్యాలి.
ధ్యానం చేస్తున్నంత కాలం ఉత్సాహం కలిగించే గీత వంటి ఆధ్యాత్మిక గ్రంధాలను నెమరువేసుకోండి. అందుకై మీరు తీరిక దొరికినప్పుడు ఆధ్యాత్మిక గ్రంధాలను చదవటం అలవారుచుకోవాలి. ఇది గాలిపటం ఎగరవేసినంత సులభం. మొదట దారాన్ని క్రమంగా వదలి గాలిపటాన్ని ఆకాశంలో ఎగరివేయాలి. గాలిపటం ఏకాగ్రత, దారం సమయం. దారం వదిలేస్తే గాలిపటం ఎగిరిపోతుంది. కాబట్టి ఏకాగ్రతకై సమయం వెచ్చించండి.
మనస్సు ఎప్పటికీ చంచలమే. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ సేల్స్ చెప్పినట్లు "మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు వేరొక చోటికి పోతే దాన్ని దేవుని వైపు మరల్చండి. మీరు ధ్యానం చేసిన సమయంలో మనస్సును తిరిగి దేవుని మీద పెట్టడానికై పూర్తిగా చేసినా ఫలితం ఉంటుంది." కొన్నాళ్ళు ఇలా సాధన చేస్తే మన అచేతన మనస్సును, చేతనంగా ఉన్నప్పుడే, పరిశీలించే సమర్థత వస్తుంది. దానిలో అనేక అపోహలు, భ్రమలు ఉండవచ్చు. కాబట్టి మంత్ర జపం తోనో, గీత వంటి గ్రంథాలను నెమరు వేసికోవడమో చేయండి.
ధ్యానంలో నిద్ర రావచ్చు. కొంతమంది ధ్యానంలో గాఢనిద్ర పోతారు. కొంత మంది వారికి తెలియకుండా నిద్రలోకి జారుకుంటారు. అలా కాకుండా ఉండడానికి నేలపై పద్మాసనం వేసి, వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేయండి. అదీ సాధ్యం కాకపోతే మంత్రాన్ని జపిస్తూ మీ ఇష్ట దైవాన్ని మనోఫలకంలో నిలుపుకోండి.
క్రొత్త విషయాలను తెలిసికొ౦టూవుంటే ధ్యానంలో వాటిని గుర్తుకు తెచ్చుకొని విశ్లేషణము చేసి మనస్సును ఎప్పుడూ నూతనంగా ఉండేటట్టు చేసికోవచ్చు. అలా కాకపోతే మనస్సు యాంత్రికంగా పాత భావాలే కల్పిస్తుంది. మనం చదివే గ్రంథాలు గీతే కావక్కరలేదు. ఎటువంటి ఆధ్యాత్మిక గ్రంథమైనా ఫరవాలేదు.
భారత దేశంలో ఉసిరికాయను ఇష్టపడని వారు ఉండరు. నేను మొదటిసారి ఉసిరికాయను తిన్నప్పుడు అది చేదుగా ఉండి, ఉమ్మేద్దామని అనుకొన్నాను. నా అమ్మమ్మ దాన్ని నములుతూ ఉండమని చెప్పింది. నేను నములుతూ ఉంటే దాని రుచి తీయగా మారింది. ధ్యానం ఉసిరికాయ వంటిది. మొదట్లో అది ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు. పట్టు వదలక సాధన చేస్తే మీరు ధ్యానంకై వెచ్చించే సమయం అత్యంత విలువైనదని తెలిసికొ౦టారు.