Bhagavat Gita
9.21
శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః
{9.28}
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి
ఈ విధముగ కర్మలను అర్చించుటచేత పుణ్య పాప ఫలరూపకములైన కర్మ బంధములనుండి విముక్తుడ వయ్యెదవు. ఇట్లు విముక్తుడవై నన్నే పొందగలవు
గతంలో మనమే తప్పుటడుగులు వేసేమో మనను ప్రస్తుతం బాధి౦చవచ్చు. అంటే మనకు తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేసి వాటిని నెమరువేసుకోవడం. ఆధ్యాత్మిక సాధనలో గతాన్ని బాధతో లేదా క్రోధంతో గుర్తుకు తెచ్చుకోకూడదు. గీత ఈ విషయంలో మనని ఓదార్చి, దృఢం చేస్తుంది. ఎందుకంటే తప్పులు చెయ్యడం చాలా సులభం. అందుకే గీత మనని విమర్శించకుండా, నరక౦ గురించి ప్రస్తావించకుండా, మనల్ని ధ్యాన మార్గానికి మళ్లించి తప్పుల్ని ఒప్పులు చేసుకోమంటుంది.
పాత రోజుల్లో రికార్డులు అరిగిపోతే, పాట మళ్ళీ మళ్ళీ వినిపించేది. మనము పదే పదే పశ్చాత్తాప పడడం కూడా అటువంటిదే. రికార్డును సరి చేయాలంటే దానిమీద నడిచే ముల్లు యొక్క గాడిని మార్చాలి. అంటే మన ఆలోచనా క్రమాన్ని మార్చుకోవాలి.
మనను గతంలో చేసిన తప్పులు కన్నా, వాటిని తవ్వి వెలికి తీయడం ఎక్కువగా బాధిస్తుంది. మనం ధ్యానం ద్వారా దానిని నియంత్రించుకొనవచ్చు. గత విషయాలు ధ్యానంలో ఎరుకకు వస్తే, వాటిని పట్టించు కోకండి. ఇతరులను వాటిని గూర్చి మీతో మాట్లాడనీయకండి. మీ తప్పులను మిత్రుల దగ్గర ఏకరువు పెట్టకండి. అలాంటి సమయాల్లో మంత్ర జపం చేసుకోండి.
మనం చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి భగవంతునికి క్షమాపణ చెప్పుకోవచ్చు. కొంతమంది చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తారు. భగవంతుడు దయామయుడు. నిజంగా పశ్చాత్తాపపడితే తప్పక క్షమిస్తాడు. కొంతమంది తప్పు చేసి, క్షమాపణ అడిగి, మళ్ళీ తప్పు చేసి మళ్ళీ క్షమాపణ అడుగుతూ ఉంటారు. దీని పర్యావసానము వారి నాడీ వ్యవస్థ అస్వస్థత.
నా ఉద్దేశంలో క్షమ అడగడమంటే మన చేతన మనస్సు లోపల ఉన్న తప్పుడు ఆలోచనలను, భావాలను మార్చుకోవడం. మనం గతంలో ఏమి చేసినా, మార్పు చెందడం సాధ్యం. యోగులు చెప్పేది దేవుని సహాయం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని స్వీకరించడం మన చేతిలో ఉంది.
నేటికాలంలో ఎవ్వరూ దైవము ఎక్కడో అంతరిక్షంలో ఉండి శిక్ష విధిస్తాడ౦టే నమ్మరు. కాబట్టి నేను పాపము, దానికై విధించే శిక్ష గురించి మాట్లాడను. నేను నమ్మేది తప్పులు, వాటి పర్యావసానము. ఇక్కడ బుద్ధుని మార్గము ఆదర్శం. క్రోధంతో ఉంటే మనను మనమే శిక్షించుకున్నట్టు. భౌతికంగా కోపం వచ్చినపుడు మన శ్వాస అధికమౌతుంది. కాలక్రమేణా అది ఆస్తమా వంటి వ్యాధులకు దారితీయవచ్చు. అలాగే క్రోధం వలన మన జీర్ణశక్తి క్షీణిస్తుంది. పోషకాహారాన్ని తినకుండా, వ్యాయామం చేయకుండా, ధూమపానం లాంటివి చేస్తూ ఉంటే మనము మనల్నే శిక్షించుకొంటున్నాము. అలాటప్పుడు భగవంతుని దయకై ధ్యానం చేసి మన తప్పులను సరిదిద్దు కోవాలి.
ఉదాహరణకి నాకు తెలిసిన తాగుబోతులు ధ్యానంలో ప్రవేశించి తమ పాడు అలవాటును వదులుకొన్నారు. దేవుని దయను ప్రత్యక్షంగా చూసి నాకే ఆశ్చర్యమేసేది. వారు తమ నడవడికను మార్చుకొని ఇతరులతో సామరస్యంగా ఉంటూ, తమ బలహీనతను అధిగమించేరు. మనకి క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పుడు అవి ఎన్నటికీ పరిష్కరింపబడవని చేతులు ముడుచుకొని జీవించకూడదు. గతంలో ఎటువంటి తప్పులు చేసినప్పటికీ, అవి మన శారీరిక లేదా మానసిక వ్యవస్థను ఎంత బలహీనంగా చేసినా, మన అలవాట్లను చేతన మనస్సు శక్తితో మార్చుకొని గతం నుంచి విడుదల పొందవచ్చు.