Bhagavat Gita
9.23
అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్
{9.30}
సాధురేవ స మంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః
మిక్కిలి దురాచారి యైనను, అనన్య భక్తి కలవాడై నన్ను భజించునేని, స్థిరచిత్తము గలవాడైన అతడు సాధువే యని గ్రహింపుము
క్షిప్ర౦ భవతి ధర్మాత్మా శశ్వచ్చా౦తిం నిగచ్ఛతి
{9.31}
కౌన్తేయ! ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి
అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగుచున్నాడు. శాశ్వత శాంతిని పొందుచున్నాడు. అర్జునా! "నా భక్తుడు నశించడు" అని ప్రతిజ్ఞ చేయుము
ఈ శ్లోకాలు తరతరాలుగా అనేక భక్తులకు ఓదార్పుగా ఉన్నవి. మన గతం ఎలా ఉన్నా, ప్రస్తుత పరిస్థితి ఏమైనా, భగవంతుడు మనని విస్మరించడు. మనమంతా దేవునిము౦దు ఆశక్తులం. అలాగే అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసి ఉంటాం.
నేను అనేక తప్పులు చేసిన వారిగురించి తెలిసికొన్నది ఏమిటంటే: వారు పరులకై, కనీసం తమ కొరకై, మంచి జీవనము చెయ్యలేదు. వారు ఒంటరి వారై, బంధుమిత్రులకు దూరమై, మార్పు కోసమై నిరీక్షిస్తున్నారు. వారు గతంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. కానీ వారి హృదయాల్లో దేవుడు కొలువై ఉన్నాడని చెప్తాను. కాబట్టి వారిని తమ గతాన్ని పూర్తిగా మరచి, మంచి కర్మలు చేసి, అందరితోనూ సామరస్యంగా ఉండమని చెప్తాను.
జీసస్ చెప్పినట్లు మనమంతా దేవుని బిడ్డలం. మన నడవడిక ఎంత చెడ్డదైనా, ఒక తల్లి తన బిడ్డలను ఎట్టి పరిస్థితిలోనూ ఎలా విడనాడదో, దేవుడు కూడా మనని అలా ప్రేమిస్తాడు. బైబిల్ లో ఒక కథ ఉంది. ఒక ధనవంతుని కుమారుడు, తన తండ్రిని ఎదిరించ, కొంత ధనము తీసికొని పరదేశాలకు ప్రయాణమౌతాడు. అనేక ప్రదేశాలు తిరిగి, డబ్బును భోగాలకై వెచ్చించి, తిండి లేని స్థితిని పొందుతాడు. చివరికి జ్ఞానోదయము కలిగి, పరదేశంలో ఆకలితో మరణించేకంటే, తన తండ్రికి శుశ్రూష చెయ్యడ౦ మేలని నిర్ణయించుకొని, తన తండ్రి ఇంటికి వెళ్తాడు. తండ్రి వానిని అత్యంత ఆదరంతో ఆహ్వానించి వానిని క్షమిస్తాడు.
ప్రతి సమాజంలో మనకంటే పెద్ద తప్పులు చేసిన వారు, వాటిని సరిదిద్దుకొని మనకంటే ఎక్కువ మన్నన పొందిన వారున్నారు. వారు ఇతరులకు హాని చేసి, క్రోధంతో, హింసతో బ్రతికేరు. కానీ అటువంటి వారే చివరకు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళేరు. ఉదాహరణకు అశోకుడు. సెయింట్ తెరెసా దేవుడు సూర్యుని వలె తన ప్రేమను పంచి పెడుతున్నాడు అనెను. కొందరు తెర దించి చీకటిలో బ్రతుకుతారు. వారు ఎప్పుడైతే తెర ఎత్తుతారో తమ బ్రతుకులను ప్రకాశవంతంగా చేసుకొంటారు.
నా చిన్నప్పుడు అమ్మాయిలు వంట నేర్చుకొంటున్నప్పుడు అన్నాన్ని మాడ్చడం లేదా కొంత కూరని నేల మీద పడేయడం చేసేవారు. వారి తల్లులు లేదా అత్తలు వారిని విమర్శించేవారు. నా అమ్మమ్మ వంట నేర్చుకోవాలంటే చేతులు కాలాలి, కొంచెం పదార్థం నేల మీద చిందాలి అని వాళ్ళకు సద్ది చెప్పేది. కానీ ఆ పిల్లలకు "మీరు అదే పనిగా చేతులు కాల్చుకోవడం లేదా అన్నాన్ని నేల పాలు చేయడం మంచిది కాదు" అని చెప్పేది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా. నా దగ్గరకు చాలా మంది వచ్చి తాము ఎన్నో తప్పులు చేశామని చెప్తారు. మనమంతా గతంలో ఏదో తప్పు చేసినవారలమే అని చెప్పేవాడిని. కానీ వారు అవే తప్పులను మళ్ళీ మళ్ళీ చేసి నన్ను నిరాశ పరిచేవారు.
మనందరికీ బలహీనతను అధిగమించి మంచి మార్గంలో నడిచే సామర్థ్యం ఉంది. కొందరు అనారోగ్యం కలిగించే ఆహారం కొన్నేళ్లగా తింటూ, ఆ అలవాటును ఒక్క మారు మార్చుకొంటారు. కొందరు క్రోధంతో నిండి ఉండి, ధ్యానం చేసి, తమ క్రోధాన్ని కరుణగా, పగని ప్రేమగా మార్చుకొంటారు. మనము కొన్ని దశాబ్దాలు చెడు నడవడికతో గడిపినా, ధ్యానం వలన కొద్ది కాలంలోనే చెడు నడవడికను మార్చుకోవచ్చు. మనమెంత స్వార్థంతో, ధూమపానం చేస్తూ, మద్యాన్ని సేవిస్తూ బ్రతికినా శ్రీకృష్ణుడు క్షిపరం భవతి ధర్మాత్మా అని చెప్తాడు. అంటే మనం మన ఆత్మను ప్రక్షాళనము చేసి, చెడు అలవాట్లతో క్షీణించిన శరీరాన్ని, మనస్సును ధృడంగా చేసుకోవచ్చు.
మన ఆధ్యాత్మికత బలపడుతున్న కొద్దీ మన గతంలో చేసిన తప్పులు జ్ఞప్తికి వస్తాయి. అలాటప్పుడు అపరాధ భావన లేదా విచారము పొందనక్కరలేదు. మంత్ర జపము మనను కడతేరుస్తుంది. మన తప్పులను విశ్లేషణము చేసి వాటికి అపరాధ రుసుము ఎలా చెల్లించాలని సతమతమవడం అవసరము లేదు. ఒకరు దూరపు మిత్రుని పెంపుడు కుక్కని అవమానించవచ్చు. ఆ విషయం ధ్యానంలో జ్ఞప్తికి వచ్చి, క్షమాపణ చెప్పాలని వారు తమ మిత్రుడుని వెదుక్కొంటూ వెళ్ళనక్కరలేదు. దాని బదులు ఒక కుక్కని పెంచుకోవచ్చు లేదా వీధి కుక్కలకు ఆహారం ఇవ్వచ్చు. అలాగే ఒకరు మిత్రుడ్ని అవమానిస్తే, వానికే క్షమాపణ చెప్పడంతో ఆగి పోనక్కరలేదు. ఇతరులను అవమానించ కుండా, మనలోని దేవుని క్షమాపణ పొంది, ఇతరులు తనను అవమానించినా వారిని తిరిగి అవమానించకుండా బ్రతకవచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ "ఇతరులను మనము క్షమిస్తే, మనము క్షమించబడతాము" అని చెప్పెను.
కానీ అలా చెయ్యడం ఎలా? మనం గత స్మృతులను వెలిక తీసికోవడం వ్యర్థమని తెలిసికొని, మరల గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఎలా నియంత్రించుకోవాలి? ఇక్కడ ధ్యానం చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు.
బుద్ధుడు మనం పాపాలు చేసినందుకు శిక్షింప బడం; పాపాల వలన శిక్షింపబడతాం అన్నాడు. గుండెజబ్బు, రక్తపు పోటు మొదలగు వ్యాధులు మనం తినే ఆహారం వలన, మన చెడు అలవాట్ల వలన, పర్యావరణ కాలుష్యం వలన కలుగుతున్నాయి. వీటన్నిటినీ మనం నివారించుకోవచ్చు.
ధ్యానంలో ప్రవేశించేటప్పుడు, మొదట మన ఆహార౦ విషయంలో శ్రద్ధ అవసరం. రుచులు కాకుండా, శరీరానికి పోషకాహారము అందించాలి. వాహనం మీద ప్రక్క వీధికి వెళ్ళడం కంటే, కాలి నడకన వెళ్ళవచ్చు. మంత్రాన్ని జపిస్తూ వ్యాయామం చేస్తే మానసిక వొత్తిడి తగ్గి, శరీరం స్వస్థతో ఉంటుంది. మనకి సలవులు వస్తే ఇతరులకు ఉపయోగపడని విధంగా సలవులను గడపడం కంటే, పరోపకారానికై సేవ చెయ్యవచ్చు. ఈ విధంగా మనం గత స్మృతులను నియంత్రించి, చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.
దేహ శుద్ధితో పాటు మానసిక స్థితినికూడా మెరుగు పరచుకోవాలి. కొంతమందికి దేహం బలంగా ఉంటుంది. కాని వారు ఒ౦టరితనం, అశాంతి, అభద్రత అనుభవిస్తారు. ధ్యానం వలన వారు తమ మానసిక స్థితిని మార్చుకోవచ్చు. దీనికి శారీరిక మార్పులకన్నా ఎక్కువకాలం పడుతుంది. శ్రీకృష్ణుడు షష్వచ్చా౦తిం నిగచ్ఛతి అంటాడు -- అనగా తక్కువ కాలంలోనే, హృదయంలో శాంతి నెలకొంటుంది. ఇతరులతో శాంతియుతంగా బ్రతకడం వీలవుతుంది.
శ్రీకృష్ణుడు, కుంతీ తనయునికి, ఇంకా ఇలా బోధ చేసెను "ఇంద్రియాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, ప్రపంచం ఎదురు తిరిగినప్పుడు, నన్నెవరైతే భక్తితో సేవిస్తారో వారికి ఎటువంటి హాని జరగదు". ఈ అభయాన్ని ఎంతో మంది యోగులు పొందేరు. ఇది ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం