Bhagavat Gita
9.24
మాం హి పార్థ! వ్యపాశ్రిత్య యే అపి స్యుః పాప యోనయః
{9.32}
స్త్రియో వైశ్యాస్తథా శూద్రా స్తే అపి యాంతి పరాంగతిమ్
పాపపు జన్మము లెత్తినవారైనను, స్త్రీలును, వైశ్యులును, శూద్రులును అయినను నన్ను శరణు బొందినచో ఉత్తమమైన గతిని పొందుచున్నారు
కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయ స్తథా
{9.33}
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్
ఇక పుణ్యాత్ములైనట్టి బ్రాహ్మణుల విషయమునను, భక్తులగు రాజుల విషయమునను చెప్పదగిన దేమున్నది? కావున అనిత్యము, సుఖరహితము నైనట్టి ఈ లోకమును పొందిన నీవు నన్ను భజించి ముక్తుడవగుము
ఒక క్రింది వర్ణము బాలుడు శివభక్తుడు. వాడికి ఖాళీ దొరికినప్పుడల్లా శివుని ధ్యానిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లోని శివాలయంలో ఉత్సవాలకి వెళ్లాలని తలచి తను పనిచేసే భూస్వామిని ఒక రోజు శలవు ఇమ్మని అడిగేడు. ఆ భూస్వామికి ఏ దేవుడి మీదా భక్తిలేదు. అతడు "నీకు శివుని గూర్చి ఏమి తెలుసు?" అని అడిగేడు.
"నాకు చదవడం, వ్రాయడం రాదు. శివుని గురించి నాకేమీ తెలియదు. కానీ శివ నామము నాకు ఎక్కువ ప్రీతి నిస్తుంది" అని బాలుడన్నాడు.
"అదంతా సరే. రేపు వరి పంట కోతకు వస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడుండి పని చెయ్యాలి. కోత రేపు ఉదయంలోపల చేస్తే నువ్వు ఉత్సవాలకు వెళ్ళవచ్చు" భూస్వామి అన్నాడు.
వరి కోయడం సాధారణంగా కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి ఒక రాత్రిలో పంట కోత కోయడం సాధ్యం కాదు. ఆ బాలుడు ఇంటికెళ్ళి శివునిపై ధ్యానం చేసి "మంచివాడైన నా భూస్వామి పంట కోత అంతా చేస్తే నీ ఉత్సవాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చేడు. నన్ను నువ్వే నీ ఉత్సవాలకు రప్పించు కోవాలి" అని ప్రార్ధించి పడుకున్నాడు.
మరుసటి ఉదయం గ్రామస్తులంతా వాని ఇంటి బయట గుమిగూడి "విచిత్రం, విచిత్రం" అంటున్నారు. ఎందుకంటే వరి కోత కోయబడి, బస్తాలలో చక్కగా పేర్చబడినది. భూస్వామి ఆ విషయం తెలిసికొని, ఆ బాలుని క్షమాపణ అడిగేడు. ఆ విచిత్రం ఎలా జరిగింది అని అందరూ బాలుని అడిగేరు. "నాకు శివుడంటే భక్తి. అతడు విశ్వానికి అధినేత. నేను నీ ఉత్సవాల కెళ్లాలంటే, ఒక చిన్న పని ఉంది. కాబట్టి సహాయం చేయి అని అడిగేను. దీనిలో విచిత్రమేముంది?" అని బాలుడు సమాధానమిచ్చేడు. ఇటువంటి భక్తి కొండలను కూడా కదిలిస్తుంది. అది మనమే వర్ణము వారలమైనా, సమాజంలో ఎంత పేరు ప్రతిష్ఠ ఉన్నా అలవరచుకోవచ్చు.
నేను ధనవంతులను కించపరచటంలేదు. కొందరు ధనవంతులు, గొప్పవారు విలాసంగా బ్రతికినంత మాత్రాన ఆధ్యాత్మిక జీవనానికి అనర్హులని చెప్పలేము. నా అనుభవంలో వైద్యులు, ఇంజనీర్ లు, న్యాయవాదులు, కళా కారులు, శాస్త్రజ్ఞులు ధ్యానాన్ని అలవరచుకోవచ్చు. వాళ్ళు తమ పనిలో ఎంత శక్తితో ఏకాగ్రత చూపిస్తారో, ప్రయత్నం చేస్తారో అంత ధ్యానం మీద పెడితే చాలా విజయవంతమౌతారు. ఎవరైతే ఏకాగ్రతతో పని చేస్తారో వారు ధ్యానంలో సులభంగా ముందుకు సాగుతారు.