Bhagavat Gita
9.6
మయా అధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరం
{9.10}
హేతునా అనేన కౌన్తేయ జగద్విపరివర్తతే
కౌన్తేయా! నా అధ్యక్షతలోనే చరాచర భూత ప్రపంచము ప్రకృతి సృజించుచున్నది. ఈ కారణము చేతనే జగత్తు ప్రవర్తించుచున్నది ఀ
ఒక పత్రికలో "జీర్ణ కోశము తనను తాను ఎందుకు జీర్ణించకోదు?" అని ప్రశ్న వచ్చింది. మన జీర్ణకోశములోని ఆమ్లములు అన్ని రకాల పదార్థాలను పచనం చేస్తాయి. జీర్ణ కోశము లోపలి ఉపరితలము మ్యూకశ్ అనే పదార్థము యొక్క పొరతో కప్పబడి ఉంటుంది. దానిని ఆమ్లము జీర్ణము చేయలేదు. కానీ ఆ పొరను పెట్టినదెవరు?
శాస్త్రజ్ఞులు మన శరీరములోని విభిన్న అంశాలను కనుగొన్నారు. కానీ ప్రశ్నోపనిషత్తులోని ప్రశ్నలకు వారి శాస్త్రము సమాధానము చెప్పలేదు. ఉదాహరణకి చూసే కన్నువెనుక చూసే దెవరు? శాస్త్రజ్ఞులు అవయవాలను అధ్యయనం చేసి అనేక విషయాలు తెలిసికొన్నారు. కానీ వారు ఒక క్రొత్త జీవిని, దేవుని సృష్టితో సంబంధము లేనిదాన్ని, సృష్టించలేరు.
నేను ఒక పీత సముద్రపుటొడ్డున చూసేను. అది కెరటం మీదకి వస్తే వడివడిగా నడిచి తీరానికి వస్తున్నది. దానికి నడిచే లేదా పరిగెత్తే శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? అదే భగవంతుని సృష్టి రహస్యం.
నక్షత్ర వీధులు, పాల పుంత, మొదలగునవి భగవంతుని శక్తికి నిదర్శనములు. సూర్యునిలో విడుదలయ్యే అణు శక్తి, ఎవరు నియంత్రిస్తున్నారు? మనం ఆహారాన్ని తిని, జీర్ణించుకొని, పొందే శక్తి అటువంటిదే . ఇదంతా దేవుని ఆలోచనా శక్తివలన సాధ్యమవుతున్నాయి. అలాగని నేను న్యూటన్, ఐన్స్టీన్ వంటి వారల సిద్ధాంతాలను కించ పరచటం లేదు. వారి సిద్ధాంతాలు దేవుని సిద్ధాంతం క్రింద ఒదిగి పనిచేస్తాయి.
పై శ్లోకంలో జగద్ విపరివర్తతే అనే పద ప్రయోగము కలదు. దాని అర్థము "విశ్వం భ్రమిస్తూ ఉన్నది". సృష్టి ఆది ముందు పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు ఒక స్పందన కలిగింది. దానివలన సృష్టి ఆరంభమయింది. ప్రకృతిలో శక్తులు ఉద్భవించేయి. సమస్త బ్రహ్మాండము సృష్టింపబడినది. దాని పరిణామ శక్తి భగవంతుడి సృజనాత్మక శక్తినుండి వచ్చింది. విశ్వమంతా ఒక గోళ మనుకొంటే, పరమాత్మ దానిని ఒక్కమారు తిప్పడం మొదలుపెట్టేడు.
శ్రీకృష్ణ భగవానుని శక్తి ఎటువంటిది అన్న అంశ౦పై మహాభారతంలో ఒక కథ చెపుతారు. అర్జునుడు, కర్ణుడు మధ్య బాణాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు, అర్జునుడు అలసిపోతున్నాడు. కర్ణుడు ఒక శక్తివంతమైన బాణాన్ని అర్జునునిపై ప్రయోగించేడు. అది గమనించిన శ్రీకృష్ణుడు భూమిని అణచి పెట్టేడు. తద్వారా కర్ణుని బాణము నుండి అర్జునుడు తప్పించుకొన్నాడు. నా అమ్మమ్మకి అది ఒక గొప్ప విషయం కాదు. ఎందుకంటే భగవంతుడు తనను గాఢంగా నమ్మే ఆపదలో ఉన్న భక్తుని రక్షించడానికి ఎల్లప్పుడూ వస్తాడని ఆమె విశ్వసిస్తుంది. అలాగే తన భక్తుని రక్షించేందుకు సృష్టి క్రమాన్ని మార్చాలన్నా మారుస్తాడు. ఎందుకంటే సృష్టి అంతా భగవంతుని శక్తివలననే నడుస్తున్నది.
ఆది శంకరులు తల్లి, ప్రతి ఉదయం స్నానానికై పలు దూరం వెళ్ళి అక్కడినుంచి దేవాలయం చేరి పూజ చేసేది. ఒక రోజు ఆమె క్రిందపడి, ఇతరుల సహాయంతో ఇల్లు చేరుకొంది. అది తెలిసిన శంకరులు చాలా విచారపడ్డారు. దేవుని "నా అమ్మ ప్రతిరోజూ నిన్ను పూజిస్తున్నదే, మరి నువ్వు ఎందుకు కాపాడవు?"అని ప్రశ్నించేరు. దానికి బదులుగా దేవుడు ఆ నది గతి మార్చి శంకరులు ఇంటి ముందు ప్రవహించేటట్టు చేసేడు. ఆ నది గురించి శాస్త్రజ్ఞులు అనేక పర్యాయాలు అధ్యయనం చేసేరు. దాని గతి ఎప్పుడూ మారుతూ ఉంటుందని గ్రహించేరు. ఈ కథ అతిశయోక్తి కావచ్చు. కానీ దేవునికి ఇటువంటి శక్తి లేదని చెప్పలేము.
శ్రీరామకృష్ణ తన ఇష్ట దేవత చీమ యొక్క అడుగును కూడా వినగలదు అని అన్నారు. జీసస్ "నా తండ్రి ఆజ్ఞ లేనిదే ఒక పక్షి ఎగరలేదు" అన్నారు. పరమాత్మ ప్రతీదీ చూస్తాడు, వింటాడు ఎందుకంటే పరమాత్మ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. మనము భౌతిక లేదా రసాయనిక లేదా జీవ శాస్త్రాలతో విశ్వం యొక్క నలుమూలలా శోధించవచ్చు. కానీ ధ్యానంవలననే ఆ పరమాత్ముని పట్టుకొనుట సాధ్యము.