Bhagavat Gita
9.8
మహాత్మానస్తు మాం పార్థ! దైవీం ప్రకృతి మాశ్రితాః
{9.13}
భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్
పార్థా! మహాత్ములైనవారు దైవీ ప్రకృతిని ఆశ్రయించినవారై, ఆదియు, అవినాశియునైన నన్ను తెలిసికొని, అనన్య చిత్తముతో భజించుచున్నారు
మన మనస్సు సాధారణంగా పరిపరి విధాలుగా పోతుంది. పండగల వచ్చినపుడు వస్తువులు కొనడానికి బజారుకి వెళ్ళి ఇది కొందామా, అది కొందామా అని తర్జన భర్జన పడుతూ ఉంటాం. అలాగే కొన్నిరోజులు వీణ నేర్చుకొని దానిలో క్రొత్తదనము లేదని వీణ వాయించడం మానేస్తాం. ఈ విధంగా మనస్సు చంచలంగా ఉంటే జీవితంలో ఏమీ సాధించలేము. క్రొత్తవాటికి ఒక పరిమితి ఉంటుంది. మనము నూతన విషయాలకై సదా పరిగెడుతూ ఉంటే, దేనిలోనూ ప్రావీణ్యం రాదు.
అలా కాకూడదు అని అనుకొంటే, ఒకే విషయం మీద ఏకాగ్రత పెట్టాలి. మన విసుగు, మానసిక బాధ మన మనస్సులో కలిగే భావాల వలననే కాని బాహ్య ప్రపంచము వలన కాదు. వీణ నేర్చుకోవడం మొదలుపెట్టి, దాని మీద ఏకాగ్రత లేకపోవడంవలన వదిలేస్తాం. వీణ స్వతహాగా ఉత్తేజ పరిచేది, విసుగు కలిగించేది కాదు. దానిని వాయించడానికి కావలసిన ఏకాగ్రత, ఉత్సాహం ఉండాలి. ఈ విధంగా మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరిస్తే, మనం చేసే ప్రతి కర్మ సంతృప్తి కరంగా ఉండి, మంచి ఫలం ఇస్తుంది.
చిన్నప్పుడు పాఠశాలలో మా ఉపాధ్యాయుడు ఒక భూతద్దాని సూర్యుని వైపు పెట్టి, దాని ముందు కొన్ని కాగితాలను పెట్టి, వాటిని మండేటట్టు చేసేడు. అప్పుడు తెలిసింది సూర్యుని కిరణాలను భూతద్దం కాగితంపై కేంద్రీకరించి౦దని. అలాగే మన మనస్సు, ఆలోచనలు కూడా సూర్య కిరణాలు, భూతద్దం వలె పనిచేస్తాయి.
ధ్యానంవలన మన మనస్సును, ఆలోచనలను నియంత్రింప వచ్చు. సాధారణంగా మనస్సు అనేక విషయాలపై పరుగులెడుతూ వుంటుంది. దాని వలన ఉపయోగం లేదు. మనస్సును ఒకానొక విషయంపై కేంద్రీకరించినప్పుడే శుభ ఫలితాలు వస్తాయి. కానీ మనస్సును కేంద్రీకరించడం ఎలా?
ధ్యానంలో ఆలోచనా పరంపరలను తగ్గించుకోవాలి. ఒకానొక ఆలోచనను పట్టుకొని దాని మీద శ్రద్దతో మనస్సు నిలపాలి. క్రమంగా మన ఆలోచనలు నెమ్మదిగా రావడం మొదలుపెడతాయి. దాని వలన మనలోని వొత్తిడి, ఘర్షణ తగ్గుతుంది. ఇలాగ కొన్నేళ్ళు సాధన చేస్తే మన మనస్సును, బాహ్యంగా లేదా అంతర్గతంలో కానీ ఎటువంటి ఘర్షణలు ఉన్నా శాంతంగా, స్పష్టంగా, ఏకాగ్రతతో ఉంచుకోవచ్చు.
ఆలోచనల పరంపరను నెమ్మది చేయడం ధ్యానంలో చాలా ముఖ్యాంశం. వస్తున్న ప్రతి ఆలోచనను బుద్ధితో పరిశీలించి, అది చెడ్డదయితే విడనాడి, మంచిదయితే దానిమీద దృష్టి కేంద్రీకరించాలి.
మన మనస్సు అన్ని దిక్కులకూ పోతూ వుంటే మన ఆలోచనా శక్తి వృధా అవుతుంది. అదే మనస్సు ను ఒకే విషయము మీద కేంద్రీకరిస్తే మన ఆలోచనా శక్తిని సద్వినియోగం చేస్తాము. ఉదాహరణకి మనం విచారంగా ఉంటే చాలా శక్తి వృధా అవుతుంది. అనేకమంది గూర్చి ఆలోచించి, వారిని ఒకరితో ఒకరిని పోల్చి, మన ప్రణాళికలకు ఎవరు ఆటంకం కలిగిస్తున్నారని విశ్లేషణం చేస్తూ ఉండి, మన మీద మనమే జాలి పెంచుకుంటూ ఉంటే ఆలోచనా శక్తి వృధా అవుతుంది.
మా ఇంటిలో చలికాలంలో వేడికై కర్రలను నిర్ణీత ప్రదేశంలో మండించేవారము. నేను దానికై అనేక కర్రలను వాడవలసి వచ్చేది. అందుకు నేను ఒక పెద్ద కర్రల పోగును పెట్టేవాడిని. నా మిత్రుడు మా ఇంటికి వచ్చినపుడు అది చూసి, అన్ని కర్రల బదులు ఒక దుంగను వాడమని సలహా ఇచ్చేడు. దానిని పాటించి తెలుసుకొన్నదేమిటంటే అనేక కర్రల పోగుక౦టే, కొన్ని దుంగలే మేలు. దుంగలలో అత్యంత ఉష్ణ శక్తి కేంద్రీకరించబడి, వాటిని మండించినపుడు కావలసినంత ఉష్ణమే విడుదలవుతుంది. మన చైతన్యం కూడా ఒక దుంగ లాంటిదే. మన ఆలోచనలను విచ్చలవిడిగా పోనిస్తూ ఉంటే, దాని వలన ఏమీ లాభం లేదు. దాన్ని తెలుసుకోవాలంటే బజారులో ఏమీ కొనకుండా ఒక మారు నడిచిచూడండి. మన ఆలోచనలు, ఇంద్రియాలు అనేక కోర్కెలతో నిండి ఉంటాయి. అదే ఒక విషయం మీద ఏకాగ్రతతో పని చేస్తే మన ఆలోచనా శక్తి వృధా అవ్వదు.