Thursday, March 10, 2022

Chapter 18 Section 19

Bhagavat Gita

18.19

బుద్ధ్యా విశుద్దయా యుక్తో ధృత్యా ఆత్మానాం నియమ్య చ {18.51}

శబ్దాదీన్ విషయా౦ స్తక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః {18.52}

ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః

విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై, ధైర్యముతో మనో నిగ్రహమును పొంది, శబ్దాది విషయములను మరచి, రాగ ద్వేషములకు దూరుడై, ఏకాంత వాసియు, మితాహారియు, స్వాధీనమైన మనో వాక్కాయములు కలవాడు, సదా ధ్యాన యోగ పరాయణుడై యుండువాడు, వైరాగ్యమును చక్కగా ఆచరించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామమును, క్రోధమును, ద్రవ్య సంగ్రహమును విడిచినవాడు, మమకార రహితుడు, శాంతుడు నగువాడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు.

ఆత్మ జ్ఞానం పొందటానికి నాలుగు అవరోధాలు ఉన్నాయి: శరీరము మరియు ఇంద్రియములతో తాదాత్మ్యము, మనస్సు, బుద్ధి, అహంకారం.

వీటిని ఆత్మను కప్పి పుచ్చిన 4 పొరలులాగ ఊహించవచ్చును. ఇంద్రియములు భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకున్న పై పొర. దాని తరువాత మనస్సు: భావోద్వేగం, భావాలు. అటు తరువాత బుద్ధి: అభిప్రాయాలు, ఎన్నికలు. చివరిగా అహంకారం. అది నేను, నాది అనే భావనని కలిగిస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే వీటన్నిటిని వదిలి వేయాలి.

వీటిని వదిలివేస్తే కలిగే నష్టం ఏమీ లేదు. ఇంద్రియాలు క్షీణించవు. అవి ప్రాణాధారమై, చైతన్యవంతమై, ప్రతిస్పందించి, విధేయతతో ఉంటాయి. మనస్సు నిర్మలమై, బుద్ధి పదునై ఉంటాయి. అందుకే జాన్ ఆఫ్ ది క్రాస్ "మీకు ఒకటి కలిగి ఉండాలంటే, ఏమీ కలిగి ఉండకుండా ఉండాలని కోరుకోండి" అన్నారు.

ఇంద్రియాలను విడనాడితే మనము అన్నిటితో ఆనందిస్తాము. కానీ ప్రస్తుతు కాలంలో ఇంద్రియ తాదాత్మ్యం వలన ఆనందం కలుగుతుందనే నమ్మకం ప్రబలమైయున్నది. కొన్నేళ్ళ క్రితం ఐస్ క్రీమ్ తినాలంటే ఒకేఒక రకం ఉండేది. ఇప్పుడు ఐస్ క్రీమ్ లలో వందల రకాలు ఉన్నాయి.

ఇంద్రియ తాదాత్మ్యము వలన మన వ్యక్తిత్వాన్ని వీడుతాం.

ధ్యానంతో ఇంద్రియాలలో నిక్షిప్తమైన ప్రాణాన్ని వెనక్కు లాగుతాం. ఈ విధంగా ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయి. ఒక చిహ్నం ఏమిటంటే ఇంద్రియాలు నిర్మలమై, ధృడమై ఉంటాయి. ఉంకో చిహ్నం భద్రత, మనలో వృద్ధిచెందుతున్న సఖ్యత.

రుచులు మన జన్యువులవలన కలిగినవి కావు. అవి మన అలవాట్లు బట్టి వస్తాయి. మొదటిసారి మనకి ఒక క్రొత్త రుచి వచ్చినపుడు, ఎక్కువ ప్రాణ శక్తి వ్యచ్చించ కుండా, తక్కువగా స్పందిస్తాము. రెండవమారు, ప్రాణ శక్తిని ఎక్కువ వెచ్చించి ఆ పదార్థాన్ని ఆశ్వాదిస్తాము. ఈ విధంగా క్రమంగా మనం క్రొత్త రుచిని అలవాటు చేసికొ౦టాము. ఇది ఆరోహణ క్రమ మైతే, అవరోహణ క్రమము ఇలాగ ఉంటుంది. మొదటిసారి మనమొక పదార్థాన్ని తిరస్కరిస్తే, తృష్ణ కలిగి, మన ఇంద్రియాలచే బాధింప బడతాము. రెండవసారి, ఇంద్రియాలు తగ్గుతాయి. మూడవమారు మనమా అలవాటునుండి విముక్తి పొందుతా౦.

ధ్యానం ఒక స్క్రూ డ్రైవరు లాంటిది. ఇంద్రియాలు స్క్రూలు. స్క్రూ డ్రైవరు వాడే ముందు స్క్రూలు ఎక్కడున్నాయో తెలిసికోవాలి. మన పంచే౦ద్రియాలు స్క్రూలై ఎంతో కాలం నుంచి గట్టిపడ్డాయి. ధ్యానం ద్వారా ఆ స్క్రూలను విప్పుకొని, మనస్సును స్వాధీనంలో పెట్టుకొంటాం.

ఈ విధంగా ధ్యానం ద్వారా మన పంచేంద్రియాలను జయించ వచ్చు. వాటిలో ధృడత్వం లేకపోతే, ఉద్రిక్తత ఉండదు.

ఇంద్రియాల క్రింద నున్నది మనస్సు. ఇంద్రియాలు తమ ప్రాణ శక్తిని దాని ద్వారా పొందుతాయి. అది విశ్రాంతిగా ఉంటే ఇంద్రియాలు కూడా విశ్రాంతితో ఉంటాయి; లేకపోతే ఉద్దీపన చెందుతాయి. శరీరంలోని ప్రతి అవయవము మనస్సుచే ప్రభావితమైనది. నిజమైన ఆరోగ్యం, పటిష్టమైన నాడీ వ్యవస్థ ఉండాలంటే మన శరీరంతో పాటు మనస్సుకు కూడా తర్ఫీదు ఇవ్వాలి. మనస్సు నిర్మలమై, దయతో కూడి ఉండాలి. ధ్యానంలో మనస్సు విశ్రాంతిని పొంది, సమస్యల చిక్కు విడిపడి, అలజడి లేక ఉంటాము.

భావోద్వేగముల పై నిర్లిప్తత, ప్రస్తుత కాలంలో కలిగే మానసిక ఒత్తిడిని జయించడానికై కాక, ప్రపంచానికి మేలు చేద్దామనే వారికి కూడా చాలా అవసరము. నిర్లిప్తమైన వాడే ఒక సంక్షోభమును పరిష్కరించగలడు.

మనస్సు నిర్లిప్తముగా ఉంటే భావోద్వేగాలను జయించవచ్చు. 439

Chapter 18 Section 18

Bhagavat Gita

18.18

అసక్తబుద్ధి స్సర్వత్ర జితాత్మా విగతస్పృహః {18.49}

నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి

సర్వ విషయములందు ఆసక్తి లేనివాడు, మనో నిగ్రహము కలవాడు, కోరికలు లేనివాడును నగు మనుజుడు కర్మఫల త్యాగముచే నైష్కర్మ్య సిద్ధిని పొందుచున్నాడు

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా ఆప్నోతి నిబోధ మే {18.50}

నమాసేనైన కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా

అర్జునా! సిద్ధిని బొందినవాడు బ్రహ్మమును ఎట్లు పొందగలుగుచున్నాడో, అలాగుననే ఉత్తమమైన జ్ఞాననిష్ఠ ఏదియో దానిని సంక్షేపముగ తెలిపెదను వినుము

దేవుని చేతిలో మనమొక పనిముట్టు. మనము ఆత్మకు కూడా ఒక పనిముట్టు. అనగా మనము భౌతిక లేదా మానసిక ప్రవృత్తులతో కాక ప్రేమతో కర్మ చెయ్యచ్చు. దానికై మన మనస్సును నియంత్రించాలి. మనం మనస్సు తప్ప ఏమీ లేదనుకొంటాము. కానీ ఆత్మ మనస్సుకన్న విశాలమైనది. అదే ప్రేమ పూరితమైనది.

ఆత్మ జ్ఞానము కలుగవలెనన్న మన భావాలను, అభిప్రాయాలను దాటి వెళ్ళాలి. మనం భావాలు, ఆలోచనల సముదాయం కాకపోతే మరి మన మెవ్వరము? మన సహజ స్వరూపము ప్రేమ. ప్రేమ అతి ముఖ్యమైన భావము కాదా? యోగులు కాదు అందురు. ఎందుకనగా అది ఒక మహా శక్తివంతమైన మానసిక స్థితి. ఐకమత్యము యొక్క ప్రతీక. మన ఇష్టాయిష్టాలు, ఆశలు, భయాలు మొదలగునవి స్థానికమైన ప్రేమకు చిహ్నాలు. ఎప్పుడైతే మనస్సు కుదురుగా ఉంటుందో మనము ప్రేమస్వరూపుల మౌతాము; మనం ప్రేమలో జీవిస్తాము; మన కర్మలన్నీ ప్రేమలోనుంచి ఉద్భవిస్తాయి.

మనస్సును దాటి ఎవ్వరూ చూడలేరు. కాని దానికై మనకు తీరని కోరిక ఉంది. ధ్యానము తీవ్రముగా చేస్తే, మనల్ని ప్రవాసులుగా, పర్యాటకులుగా భావిస్తాము. మారిపోయే జగత్తు మన స్వస్థలము కాదు. ఈ విధముగా వ్యామోహం చెందితే మనస్సులోని కోరికలన్నీ ఏకమై, అది మన స్వస్థలానికి వెళ్ళాలి అని అంటుంది. ఈ విధమైన ఏకమైన కోరికలో మనస్సు కరిగిపోతుంది.

మనస్సు చంచలమైనది. మనకు మనస్సు గురించి పూర్తిగా తెలలియదు. మనస్సును బలముతో కట్టడి చేయలేము. పట్టుదలతోనే దానిని స్వాధీనం చేసికోగలం. చివరికి అది మనని వదిలేస్తే మనం బాధపడం. ఇది మన౦ అతలాకుతలం చెందడానికి, మన బంధాలు త్రెంచుకోడానికి, మన దృష్టి చెదరడానికి మూల కారణం.

కొందరు మహనీయులు తమ మనస్సును స్వాధీనం చేసికొన్నారు. కాబట్టి అది సాధ్యమైన పని. దాని పర్యావసానము వారి జీవితాల్లో చూడవచ్చు. వాళ్ళు మనస్సును నిశ్చలంగా చేసి , కోపము, భయము, ఆశ, ఎడబాటు లేకుండా ఉన్నారు. మనమా స్థితిని పొందితే మన దుఃఖాలన్నీ సమసి పోతాయి.

మనో చాంచల్యం లేకుండా ధ్యానంలో ఉంటే మనమనుభవించేది స్వర్గం. సమస్యలు లేని స్థితి. కానీ అది ఎంతో కాలము సాధ్యము కాదు. ధ్యానంనుంచి వచ్చిన తరువాత మన సమస్యలు మళ్ళీ వెంటాడుతాయి.

నడివయస్సు వచ్చేక అలవాట్లు ధృడమై, పట్టుదల సడలి, మన స్వస్థలానికి వెళ్లాలనే కోరిక తగ్గుతుంది. కానీ మన హృదయము అలా కాదు. విసుగు, అభద్రత పొందినపుడు, మనయందు, ఇతరులయందు శాంతంగా వ్యవహరించ లేనప్పుడు, "ఇది నా ఇల్లు కాదు. నేను నన్ను మోసపుచ్చుకుంటున్నాను. నేనొక పరాయి వాడిని" అని హృదయం అంటుంది.

దీనినే మాయ అంటారు. మనను భ్రాంతికి లోనవుట చేసేది. ఇది పరమాత్మ యొక్క శక్తి. మన ప్రపంచమిలా ఉండడానికి అదే కారణం.

మాయ రజస్ మరియు తమస్ గా వ్యక్తమౌతుంది. రజస్ తో అది జిగ్సా పజిల్ లాగ మనతో ఆడుకొంటుంది. మనమా పజిల్ ని చేయాలంటే అంతర్ముఖులమవ్వాలి. మనము సంపూర్ణులమైతే, మనము ప్రపంచాన్ని సంపూర్ణముగా చూడవచ్చు. జీవితం యొక్క నిజమైన అనుభవాన్ని పొందవచ్చు. జీవితమనే పజిల్ లోని భాగాలు వాటి స్థానాన్ని పొంది ఉంటాయి. అప్పుడు మనము క్రియ చేస్తే అది పజిల్ లో వేరే భాగము కాదు. మనము ఊహాతీతమైన శక్తితో ప్రపంచాన్ని నడిపే పరమాత్మను దర్శిస్తా౦. దానికి మూలము ఐకమత్యము, సత్యము, ప్రేమ. మన కర్మలన్నీ వాటితోనే నిండి ఉంటాయి. కర్మలను మనమే చేసే మనుకొంటాము. నిజానికి ఆ ఊహాతీత శక్తే మనచేత కర్మలు చేయిస్తోంది. శ్రీకృష్ణుడు చెప్పేది "ఎప్పుడైతే అధర్మము ప్రపంచమంతా ఆవరిస్తుందో, నేను అవతారాన్ని దాల్చుచున్నాను". అది గాంధీ, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ తెరెసా లేదా మీరా కావచ్చు. శ్రీకృష్ణుని ఉద్దేశ్యము చీకటినుండి మనను వెలుగులోకి తీసికువెళ్లడానికి. అహంకారాన్ని వీడితే, మనము కూడా పరమాత్ముని చేతిలో ఒక పనిముట్టుగా ఉండి, శాంతికై ఉపయోగింపబడతాం. 435

Chapter 18 Section 17

Bhagavat Gita

18.17

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధం లభతే నరః {18.45}

స్వ కర్మ నిరత స్సిద్ధం యథా విందతి తచ్చృణు

మనుజుడు తనది యైన కర్మము నందు శ్రద్ధ గలవాడై సిద్ధిని పొందుచున్నాడు. తన సహజ కర్మమునందు నిరతుడైనవాడు సిద్ధిని ఎలా పొందుచున్నాడో దానిని ఆలకింపుము

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం {18.46}

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః

ఎవని వలన ప్రాణులకు ఉత్పత్త్యాదులు కలుగుచున్నవో, ఎవని చేత ఈ సకల ప్రపంచము పరివ్యాప్తమై యున్నదో, వానిని మానవుడు తన స్వకర్మచే అర్చించి సిద్ధిని పొందుచున్నాడు

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ {18.47}

స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్

చక్కగా ఆచరింపబడిన పర ధర్మము కంటెను, గుణము లేనిదైనను స్వధర్మానుష్ఠానము శ్రేయోదాయకము. మనుజుడు స్వభావ సిద్ధమైన కర్మమును చేయుచు పాపము నొందడు

సహజం కర్మ కౌ౦తేయ సదోషమపి న త్యజేత్ {18.48}

సర్వారంభా హి దోషణ ధూమేనాగ్ని రివావృతాః

అర్జునా! పొగచేత నిప్పు కప్పబడినట్లు సర్వ కర్మములు దోషము చేత కప్పబడి యున్నవి. అందుచేత స్వభావ సిద్ధమైన కర్మను వదలరాదు ఀ

బంధాలతోనూ, పనితనం తోనూ మనం ప్రపంచానికి సహాయపడతాం. మనం ధ్యానం చేస్తే సరిపోదు. మన ధ్యాన ఫలాన్ని మన సహఉద్యోగులతో, బంధుమిత్రులతో పంచుకోవాలి. ముఖ్యంగా వారికి ఆదర్శంగా ఉండాలి. మన కర్మను తగ్గించుకోవాలంటే ఇదొక్కటే మార్గము. శ్రీకృష్ణుడు అడిగేది, మనం మన కర్మను తగ్గించుకోవడానికి ప్రయత్నించకపోతే ఇంకెవరు చేస్తారు?

శ్రీకృష్ణుడు మనం ఎలాగ పనిచేస్తామో, దేనికై పనిచేస్తామో రెండూ ముఖ్యమని చెప్పుచున్నాడు. ఒక కాపలాదారుగా పని చేసేవాడు, ప్రతిదినం సాధన చేస్తే, వానికి తెలియకపోయినా పరులకు సహాయపడతాడు. ఇవి ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. నా మిత్రులు కొందరు ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చి తమకు ఎక్కువ సంతోషం కలిగించినవారు ఉపచారికలు, నర్స్ లు అని చెప్పేరు. ఎందుకంటే వారు ఎంతో ఆహ్లాదంగా ఉండేవారు.

ప్రతి ఒక్కరూ తమ సాధనని వృద్ధి చేసికొని, తమ వంతు సహాయమును ప్రపంచానికి చెయ్యవచ్చు. దానికై మనకు తీవ్రమైన ఏకాగ్రత, వైరాగ్యం ఉండాలి. ఆ రెండూ ఉంటే మన బాధ్యతలు నిర్వహించడానికి ఆనందంగా ముందడుగు వేస్తాం. సాధన పెరుగుతున్న కొద్దీ మన పెరుగుతున్న అవసరాలకు, మన శక్తికి అనుగుణంగా క్రొత్త అవకాశాలు వస్తాయి.

ఇతరులు మనకన్న ఎక్కువ పేరు ప్రతిష్ఠలతో లేదా వేతనంతో పనిచేసినా అసూయ కలుగదు మన౦ ఎక్కడ, ఎటువంటి, పని చేస్తున్నామో వాటి నుండి నేర్చుకోవడానికై కేటాయించబడినది. మన కర్మ -- అనగా మన౦ చేసిన కార్యాలు, కోర్కెలు, ఆలోచనలు--ప్రస్తుత ఉద్యోగాన్ని ఇచ్చి , మన సహఉద్యోగులను నిర్ణయించి, పాత తప్పులను సరిదిద్దుకోవడానికై ప్రోద్భలం ఇస్తుంది. ఆ కర్మని తగ్గించుకొంటూ మనము ఎదుగుతాము. త్వరలో మన దశ మారి క్రొత్త సహఉద్యోగులు, క్రొత్త సవాళ్ళు, ఎక్కువ అవకాశాలు ఉన్న ఉద్యోగం రావచ్చు.

పరిపూర్ణమైన ఉద్యోగం ఎక్కడైనా ఉందా, అని శ్రీకృష్ణుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి కావలసినట్లు పని చేసే, ధ్యానమునకై విరామం తీసికోగలిగే, యజమానికి శాశ్వతమైన వాస్తవాలు బోధించి, వానికి తన సంస్థను ఎలా నడపాలో చెప్పే, ఉద్యోగం ఎక్కడైనా ఉంటుందా? ప్రతి ఉద్యోగం లోనూ కొన్ని పనులు మనకు ఇష్టం లేకపోయినా చెయ్యాలి. ఏ ఉద్యోగమూ సంఘర్షణ పడకుండా ఉండదు; అలాగే మానసిక ఒత్తిడి లేకుండా ఉండదు; మరియు; వేర్వేరు దృక్పథాలతో కూడిన వారు లేకుండా ఉండదు. చేసిందే చేయడం లేదా చాకిరీ చేయక తప్పదు. ఒక ఉద్యోగం సృజనాత్మకమై, క్రొత్త అవకాశాలను ఇస్తే దానిని మీరు ఇష్టపడ్డారా లేదా అని ప్రశ్నించుకోకండి. మీరు చేసే ఉద్యోగం ఇతరులకు సహకరిస్తుందా అని అడగండి. అలా అయితే పూర్తి ఉత్సాహంతో చేయండి. పరోపకార భావనతో చేసే ఉద్యోగము భగవంతునికి సమర్పణ చేసేది. 431

Chapter 18 Section 16

Bhagavat Gita

18.16

న తదస్తి పృథివ్యా౦ వా దివి దేవేషు వా పునః {18.40}

సత్త్వ౦ ప్రకృతిజైర్ముఖం యదేభిస్స్యా త్త్రి భిర్గుణ్ఐః

ప్రకృతి నుండి జనించిన ఈ మూడు గుణముల నుండి విడిపడిన వస్తువు భూలోకము నందు గాని, స్వర్గలోకము నందు గాని, దేవతలయందు గాని గోచరించదు

బ్రాహ్మణ క్షత్రియవిశా౦ శూద్రాణాం చ పరంతప {18.41}

కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవై ర్గణ్ఐః

అర్జునా! బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకును వారివారి స్వభావము వలన కలిగిన గుణములచేత వారివారి కర్మములు ప్రత్యేకించబడినవి

శమో దమ శ్శౌచం క్షాంతి రార్జనమేవ చ {18.42}

జ్ఞానం విజ్ఞానమాస్తిక్య౦ బ్రహ్మకర్మ స్వభావజమ్

మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుభ్రత , ఋజుత్వము, సహనము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము, బ్రాహ్మణులకు నియమిత కర్మమై యున్నది

శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్వ౦ యుద్ధే చాప్యపలాయనం {18.43}

దానమీశ్వరభావశ్చ క్షాత్ర౦ కర్మ స్వభావజమ్

శూరత్వము, తేజస్సు, ధీరత్వము, యుద్ధమున పారిపోకుండా పోరుట, దానము, స్వామి భావము క్షత్రియునకు నియమితమైన కర్మము

కృషి గోరక్ష వాణిజ్యం వశ్యకర్మ స్వభావజ౦ {18.44}

పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్

వ్యవసాయము, పశుపాలన, వర్తకము వైశ్యునకు స్వభావ సిద్దము కాగా, పరిచర్యను చేయుట శూద్రునకు స్వభావ సిద్దమైన కర్మయై యున్నది

ఈ శ్లోకాలు కులవ్యవస్థ గూర్చి చెప్పబడినవి. శతాబ్దాల తరబడి ఈ కుల వ్యవస్థ పాతుకుపోయి ఉన్నది. దానివలన అనేక కోట్ల మంది కుల బహిష్కరణకు గురైనారు. గాంధీ వాళ్ళకు హరిజనులు అని నామకరణం చేసేరు. వారు చాలా హీనమై, మిగతా కులములచే వాడుకోబడిరి.

గాంధీ కులవ్యవస్థకు వ్యతిరేకమైనా కులము గురించి సానుకూలంగా ఉండెను. ఆయన కుల వ్యవస్థ కున్న కఠినత్వమును సమూలంగా తీసివేయాలని సంకల్పించేరు. అలాగే కులవ్యవస్థ నుండి బహిష్కృతము చేయుటను సహించలేదు. కాని కులవ్యవస్థలో ఉన్న మంచి లక్షణములను పెంపొందించాలని చెప్పేరు. ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ గౌరవము గురించి పాటు పడే మహాత్మ, పుట్టుకతోనే కులము ఆపాదించిన కులవ్యవస్థను ఎలా సమర్థిస్తారు?

కులవ్యవస్థని సంస్కృతంలో వర్ణ వ్యవస్థ అనేవారు. దాని అవసరం ఎందుకంటే మనము సమంగా బ్రతకడానికి. వర్ణ మనగా మనము పోషించే పాత్ర. వర్ణ వ్యవస్థలో: బ్రాహ్మణులు పురోహితులుగా, జ్ఞాన సముపార్జనమునకై నియమితమైరి; క్షత్రియులు రాజ్య పాలనము, ప్రజా క్షేమము గూర్చి ఉండేవారు; వైశ్యులు వ్యాపరస్థులుగా, రైతులుగా, హస్త కళాకారులుగా ఉండేవారు; శూద్రులు సామాన్య కూలీలగా ఉండేవారు.

వర్ణము పుట్టుకతో వచ్చినది కాదు. ఎలాగంటే ఈ రోజుల్లో ఒక ఆటో రిక్షా నడిపే వాని పుత్రుడు ఒక దుకాణం పెట్టుకొని వస్తువులను అమ్మవచ్చు. ఒక శూద్రుడు ఒకానొకప్పుడు వైశ్యునిగా మారవచ్చు. మహాభారతంలో చూసినట్లు బ్రాహ్మణులు వేదాలను వలనించి, ధ్యానం చేసేవారు. వారు బహుశా అతి ముఖ్యమైన వర్ణము. మిగతా వర్ణాలవారు కూడా వేదాలను చదివి బ్రాహ్మణ వర్ణమును పొందవచ్చు. నేను చారిత్రాత్మక నిజం గురించ చెప్తున్నాను. క్షత్రియుడిగా జన్మించిన బుద్ధునికి తక్కువ కులములకు చెందిన అనేకులు శిష్యులుగా ఉండేవారు. ఒక శతాబ్దం క్రింద శ్రీ రామకృష్ణ బ్రాహ్మణ వంశంలో జన్మించిరి. మహాత్మా వైశ్య కులస్థులు. నా అమ్మమ్మ నామధేయము ఏకనాథ్ క్షత్రియ కులమునకు చెందినది.

వర్ణ వ్యవస్థ ఒక సంప్రదాయమై, కుల వ్యవస్థ గా మారి కొన్ని వేల సంవత్సరాలుగా ఉండేది. దానికి మొదట కారణం సంస్కృతి. కొన్ని వందల తరాలుగా ఒక వర్ణమునకు చెందినవారు తమ అలవాట్లు, విలువలు , ప్రమాణములు పూర్వీకుల నుండి పొంది యున్నారు. భారత దేశంలో అనేక ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలు ఉండి ఒకే కులంలో అనేకా భేదాలు వచ్చేయి. కేరళ బ్రాహ్మణులకు ఉన్న సంప్రదాయం బెంగాలీ బ్రాహ్మణులకు లేదు. నేను కులం పరంగా క్షత్రియుడనైనా శాఖాహారిని. ఎందుకంటే తరతరాలుగా నా వంశస్థులు శాఖాహారులు కాబట్టి. బ్రాహ్మణుల లాగే నా వంశస్థులు ఆధ్యాత్మిక౦గా జీవించేవారు. ఈ కారణాలవలన, నా వంశస్థులలోని వారు -- ఉదాహరణకు నా అమ్మమ్మ --పొరుగున ఉన్న బ్రాహ్మణులను పెళ్ళాడేవారు.

వీటన్నిటినీ చూస్తే ఒక కులం వారు తమ కులస్తులనే ఎందుకు పెళ్ళాడుతారో తెలుస్తుంది. వర్ణ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం ఒకే విలువలు యున్న వారిని ఒకే సమూహంగా చేయడం. నేను చెప్పేది ఈ శ్లోకాల సారాంశం. నేను కులవ్యవస్థకు వ్యతిరేకిని.

వర్ణ వ్యవస్థ కొన్ని సమూహాలను చేసి, వారి వారి అభిరుచుల బట్టి ఆత్మ జ్ఞానం పొందటానికి చేయబడినది. కాని కొంతమందికి వేరే ఆలోచనలు, గమ్యం ఉంటుంది. వారివారి గుణాల బట్టి, వారి సంస్కారముల ననుసరించి, పునర్జన్మ వేరొక వర్ణంలో పొందుతారు.

ఇటువంటి వ్యవస్థ జీవితం యొక్క ముఖ్యోద్దేశం: ధనార్జన లేదా ఇతరుల మీద ఆజమాయిషీకై కాక వైరాగ్యం గురించి. చాలామందికి వేరే అభిరుచులు ఉండి తమ జీవితాన్ని గడుపుతారు. కానీ వారికి వైరాగ్యం గూర్చి అన్నిటికన్నా ఉత్కృష్టమైనదని, బ్రాహ్మణులు అలా ఉండాలని తెలుసు.

పూర్వ కాలంలో క్షత్రియుడుకి యుద్ధ భూమిలో పాటించవలసిన అనేక నియమాలు ఉండేవి. ఉదాహరణకి ఆయుధం లేని శత్రువుతో యుద్ధం చేయరాదు, యుద్ధం నుంచి పలాయనం చేయరాదు, స్త్రీలతో పోరాడరాదు. కానీ ఒక బ్రాహ్మణునికి నిషేధించిన కర్మ ఒక క్షత్రియుడు చేయవచ్చు.

నా అమ్మమ్మ దృష్టిలో అమితమైన ప్రమాణం ప్రతి సాధకునికీ ఉండాలి. కొన్నాళ్ళు మాతో ధ్యానం చేసినవారు మన నడవడికను గూర్చి అంచనాలు వేస్తారు. మనం కోపంతో మాట్లాడితే వాళ్ళు ఆశ్చర్యపడతారు.

బ్రాహ్మణుడనగా బ్రహ్మన్ గూర్చి తెలిసికోవాలనుకునేవాడు. బుద్ధుడు ఈ విధంగా వివరించేడు:

నేను ఎవరినైతే బ్రాహ్మణుడంటానో వానికి, కోపం రాదు, వానికి హాని కలిగినా ఇతరులకు హాని చేయడు. అలాగే సుఖాలను కోరడు, ఇతరులను నిర్దయమైన కర్మలతో, వాక్కుతో, ఆలోచనలతో బాధించడు

ఎవరైతే అటువంటి కట్టడులను అనుసరించి బ్రతుకుతారో, ఏ కులంలో పుట్టినా, వారిని బ్రాహ్మణులనవచ్చు. ఒకడు స్వార్థముతో కూడినా, మిక్కిలి భయం లేదా కోపంతో ఉన్నా, తామసిక దశ నుండి రాజసమునకు, రాజసము నుండి సాత్త్వికమునకు ఎదగవచ్చు. ఆ వ్యక్తి చివరికి ఆత్మ జ్ఞానమును పొందవచ్చు.

ఇది ధ్యానానికున్న శక్తి. మనం సూర్యుని శక్తి గురించి ఆలోచిస్తే తల మునకలవుతుంది. కొన్ని కోట్ల టన్నుల ఇంధనం సూర్యుని ఉపరితలం మీద ఉండి, తద్వారా చేయబడిన కాంతి, ఉష్ణము మనకి అందుతోంది. ఇలాగ సూర్యుడు వద్ద కొన్ని కోట్ల సంవత్సరాలకు సరిపోయే ఇంధనం ఉంది. ధ్యానం కూడా అటువంటిదే. గీత చెప్పేది: మన క్రోధం, భయ౦, దురాశలను ప్రేమగా మార్చుకొని బ్రతకాలని. అలా చేస్తే ఆ శక్తి మనం మరణించిన తరువాత కూడా పని చేస్తూ ఉంటుంది. మనకది అవగాహనకు రాకపోవచ్చు. మనకి దుశ్శక్తి ఎలాగ ప్రభావితం చేస్తుందో తెలుసు. అలాగే మనకి గాంధీ మహాత్ముని గురించి తెలుసు. ఆయన అట్టి శక్తిని ప్రేమగా మార్చి చరిత్రను మార్చెను. సూర్య మండలంలోని హైడ్రోజన్ ఇంధనం హీలియం గా మార్పు చెందుతున్నట్లు, మన అహంకారాన్ని ప్రేమగా మార్చవచ్చు. ధ్యానం వలన ఒక క్రోధి ప్రియమైన వానిగా మారవచ్చు; ఒక పిరికివాడు అమిత ధైర్యాన్ని పొందవచ్చు; ఒక బలహీనుడు శక్తివంతునిగా మారవచ్చు. 429

Chapter 18 Section 15

Bhagavat Gita

18.15

సుఖం త్విదానీ౦ త్రివిధం శృణు మే భరతర్షభ {18.36}

అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి

అర్జునా! దేని అభ్యాసము చేత మనుజుడు దుఃఖ నాశమును, సుఖానుభవమును, పొందుచున్నాడో అట్టి సుఖమిపుడు నా చేత మూడు విధములుగ తెలుపబడుచున్నది. ఆలకింపుము

యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం {18.37}

తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్

తన యొక్క బుద్ధి ప్రసన్నత వలన కలిగిన ఏ సుఖము ఆదియందు విషము వలెను, అనంతరము అమృతము గను యుండునో అట్టి సుఖము సాత్త్విక సుఖ మనుబడును

విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం {18.38}

పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్

విషయేంద్రియ సంయోగము వలన కలిగెడి ఏ సుఖము ఆరంభము నందు అమృత తుల్యము గను, అనంతరము విషతుల్యముగను ఉండునో అట్టి సుఖము రాజస సుఖ మనబడును.

యదగ్రే చానుబంధే చ సుఖం మోహన మాత్మనః {18.39}

నిద్రాలస్య ప్రమాదోత్థ౦ తత్తామస ముదాహృతమ్

ఆద్య౦తముల యందు మనుజునకు మోహమును కలుగ జేయునదియు, నిద్ర, అలసత్వము, ప్రమాదము వలన కలుగునదియైన సుఖము తామస సుఖ మనబడును ఀ

ఈ శ్లోకములు ఆనందం గూర్చి చెప్పుచున్నాయి. మనందరము ఏదో ఒకనాడు మరణించు వారలమే. నా గురువు ఒక రోజు మరణిస్తానని తెలిసి ఆమెకు నాయందు ఉన్న ప్రేమవలన జీర్ణించుకోలేక పోయింది. ఆమె మరణానికి ఆవలకు తీసికు వెళ్లాలని, తనకు కలిగిన ఆత్మ జ్ఞానము నాకు చెప్పింది. బుద్ధుడు తన భార్య, కుమారుడు ఎప్పుడూ యౌవ్వనుముతో ఉండరని తలచి, అమరత్వం గూర్చి తెలుసుకోవడానికి తన రాజ్యాధికారాన్ని విడనాడెను. అతని ప్రేమ ఎంత పటిష్టమైనదంటే ఆ జ్ఞానము తన మనస్సులో కలిగినవెంటనే అందరికీ చెప్పాలనే కోరిక కలిగింది. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని, లేదా మిత్రుడిని ప్రేమించడం సహజం. నేను చెప్పే ప్రేమ దీన్ని దాటి ఉన్నది. అది వాని జీవితమంతా బాధలు పడుతున్న, స్వార్థంతో బ్రతుకుతున్న, చావు గురించి భయపడుతున్న వారలను రక్షించడానకి కలిగిన ప్రేమ.

మన అమరత్వం గురించి తెలిసికొనవలెనన్న ముందు మన భౌతిక శరీరం యొక్క అనిత్యత్వం గూర్చి అవగాహన ఉండవలెను. ప్రతి రోజూ మనము చావుకు దగ్గరగా వెళుతున్నాము. ఒకడు వృద్ధుడైనా, యువకుడైనా సరే చావును తప్పించుకోలేడు. నా బాల్యంలో నా అమ్మమ్మ కాలం వేగంగా పరిగెడుతున్నాదని చెప్పేది. నేను ధ్యానాన్ని అలవరుచుకోవడం కన్నా ముందు, విశ్వవిద్యాలయంలోనికి కొత్తగా వచ్చిన తెలివి తేటలతో విరజిల్లే, అందమైన విద్యార్థులను చూసి వారు ఎంతో కాలం అలాగే ఉండరని తలచేవాడిని.

ఇవి విషాదంతో కూడిన ఆలోచన కాదు. వాళ్ళు ఎంతో సున్నితమైన హృదయంతో ఉండి, నా మాట పట్టించుకోక పోయినా, నన్ను కించ పరచినా నేను వారిని ప్రేమించకుండా ఉండడానికి, జీవితం చాలా చిన్నది అని అనుకునేవాడిని.

స్వార్థపరులు తమ అనిత్యత్వాన్ని మరచిపోయేరు. అలాగే నిర్దయులైన వారు కూడా. మన జీవితం స్థిరత్వము లేక ఎంతో వేగంగా పోతో౦ది. అందువలన మనం నిర్దయతో, స్పర్థలతో ఉండడం సరికాదు. సాధ్యమైనంత వరకు ఇతరుల సంక్షేమానికై పాటుపడాలి. ధ్యానంలో ఈ విషయాలు తెలియబడి మన చేతన మనస్సు లోతులకు వెళ్తాము.

మనం ఇంద్రియాలకు లోబడి, అవి చెప్పినట్లు నడిస్తే, అది ఎంతోకాలం ఉండేది కాదని తెలిసికోవాలి. ఇతరులను ప్రేమించుట లేదా ద్వేషించుట, వారితో స్పర్థలు కలిగించుకొనుట, వారియందు అసూయ కలిగి ఉండుట, ఎంతో కాలం సాగవు. ప్రతి వృద్ధునికి ఈ విషయము తెలుసును. కానీ అతడు వాటికి ఎంతో అలవాటు పడి తన నడవడిక మార్చు కొనడు. మనకు బాల్యము, ఓజస్సు, సంకల్పం ఉన్నప్పుడే అనిత్యత్వం గురించి ప్రతి రోజూ తలచుకొని జీవిస్తే ఇంద్రియాలు మనకు లోబడి, ధ్యానానికి ఎట్టి అవరోధాలూ కలుగవు.

రాబర్ట్ ఫ్రాస్ట్ వ్రాసిన స్టాపింగ్ బై వుడ్స్ పద్యం గుర్తుకు వచ్చింది:

అడవి అందంగా, చీకటిగా, అతి లోతుగా ఉన్నది

కాని నా వాగ్దానాలను నిలబెట్టుకోవాలి

నిద్ర పోయే ముందు చాలా దూరం వెళ్ళాలి

ఈ పద్యాన్ని జవహర్ లాల్ నెహ్రూ తన బల్ల మీద ఎప్పుడూ పెట్టుకొనేవారు.

కోరికలనే అడవి చీకటిగా, సర్వ వ్యాపితమై, తీరని కోరికలతో నిండి ఉన్నది. మనం దాని లోకి ప్రవేశించి, తిరిగిరావడానికి చాలా సమయం తీసికోవడం సహజం. కాని మనం చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి, ఇంటిని చేరడానికి చాలా దూరం వెళ్ళాలి. 424

Chapter 18 Section 14

18.14

ధృత్యా యయా ధారయతే మనః ప్రాణే౦ద్రియక్రియాః {18.33}

యోగేనా వ్యభిచారిణ్యా ధృతి స్సా పార్థ సాత్త్వికీ

పార్థా! ఏ ధైర్యముచేత మనస్సు, ప్రాణము, ఇంద్రియ చేష్టలను మనుజుడు చెదరకుండా నిలుపు చున్నాడో అట్టి దానిని సాత్త్విక ధృతి అందురు

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున {18.34}

ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ రాజసీ

ఫలము నాశి౦చువాడు దేనిచేత ధర్మార్థకామములను ఆసక్తితో ఆశ్రయించుచున్నాడో, పార్థా! అది రాజస ధృతి యగును

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ {18.35}

న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్థ తామసీ

పార్థా! ఏ ధైర్యము చేత దుర్బుద్ధి గలవాడు స్వప్నమును, భయమును, శోకమును, విషాదమును, మదమును విడువకున్నాడో అట్టి ధృతి తామసిక ధృతి యగుచున్నది ఀ

వ్యక్తులను మేధస్సు లేదా తెలివితేటలతో కాక పట్టుదల గలవారుగా చూడవచ్చు. ప్రతిచోటా ఐ క్యు అనగా ఇంటెలిజన్స్ కోష౦ట్ నే చూస్తారు. అది ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. కాని పట్టుదల మేధ అంతటి ఉన్నత లక్షణము.

పట్టుదల తక్కువగా ఉంటే దానివలన మనం తీసికొనే నిర్ణయాలు కూడా అస్పష్టంగా ఉంటాయి.

సంస్కృతంలో పట్టుదలను ధృతి అంటారు. ధ్రి అనగా ఆధారము. దాని లోంచే ధర్మము కూడా వచ్చినది. ధృతి మనకు ఆదరవుగా ఉండి సామరస్యం, చైతన్యం, బలం ఇస్తుంది. గాంధీ "బలం శారీరిక పుష్టితో కాక అసాధ్యమైన పట్టుదలవలన వస్తుంది" అన్నారు. క్లిష్టమైన పరిస్థితులలో, సంపద హరించిపోయి, మిత్రులు వీడిపోయి ఉంటే పట్టుదలతో నిలదొక్కుకోవచ్చు. ఈ విషయం గాంధీ జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆయన అతి చెడ్డ ప్రతిపక్షాన్ని, దూషణని, నమ్మక ద్రోహాన్ని , తన జీవిత చరమదశ వరకు చూసేరు. అలాగే తెరెసా ఆఫ్ ఆవిలా, సెయింట్ ఫ్రాన్సిస్ మొదలగువారు.

గీత చెప్పేది: మనకు భద్రత, మన కాళ్ళ మీద నిలబడే శక్తి కావాలంటే మన పట్టుదలను వృద్ధి చేసికోవాలి. అలాగే ఇతరులను ప్రేమించి వారిచే ప్రేమించ బడడం, అవసరమైనప్పుడు మిత్రులు సహాయం చేయాలంటే పట్టుదల చాలా అవసరం. పట్టుదలను పెంపొందించు కోవాలంటే ప్రయత్నం, మెళుకువ అవసరం.

సాత్త్వికమైన ధృతి ప్రాణ శక్తిని శరీర అవయవాలకు, ఇంద్రియాలకు, మనస్సుకు సమంగా పంచుతుంది. ప్రాణ శక్తి కోరికలవలన వృధా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే బలమైన పట్టుదల, తెలివి ఉండాలి. మనస్సులో స్వార్థ పూరితమైన ఆలోచనలను కట్టిపెట్టి మంచి ఆలోచనలను పాటించాలి. ఒక స్వార్థ పూరితమైన ఆలోచనను నియంత్రించిన దాని వలన ప్రాణ శక్తితో ఎన్నో లాభములను పొందవచ్చును. ఇది ఎలాగంటే బ్యాంక్ లు ఇచ్చే చక్రవడ్డీ వంటిది. మన ప్రాణ శక్తిని కోరికలకై వ్యర్థం చేయకుండా ఉంటే, చైతన్యం చక్రవడ్డీలాగ పెరుగుతుంది.

ఇది అతిశయోక్తి కాదు. గాంధీ 60 ఏళ్ల వయస్సులో ఆయన దైనందిన కార్యక్రమము చూస్తే ఒక సామాన్యుని కన్న కోటి రెట్లు ప్రాణ శక్తి ఉన్నదనిపిస్తుంది. ఉదయం మూడు గంటల నుండి అర్థరాత్రి వరకు వివిధ నాయకులతో మంతనాలు చేసి, పాత్రికేయులతో మాట్లాడేవారు. భారత దేశ భవిష్యత్ ఆయన పలికే మాటల మీద ఆధారపడి ఉంది. ఆయన దాని గురించి వ్రాస్తూ తాను ఆ సమయంలో వృద్ధి చెందేనని చెప్పేరు. ఆయన దృష్టిలో సవాలు లేని జీవితం వ్యర్థమని. స్వార్థంతో కాక మన జీవితాన్ని మలచుకుంటే మనకున్న శక్తి బహిర్గితమవుతుంది. 421

Chapter 18 Section 13

Bhagavad Gita

18.13

బుద్ధేర్భేదం దృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు {18.29}

ప్రోచ్యమాన మసేషేణ పృథక్త్వేన ధనంజయ

ధనంజయా! గుణముల ననుసరించి బుద్ధి యొక్కయు, ధైర్యము యొక్కయు భేదము మూడువిధములుగ చెప్పబడినది. సంపూర్ణముగ, వేర్వేరుగ చెప్పబడు ఈ విషయమును ఆలకింపుము

ప్రవృత్తి౦ చ నివృత్తి౦ చ కార్యా కార్యే భయాభయే {18.30}

బంధం మోక్షం చ యావేత్తి బుధ్ధి స్సా పార్థః సాత్త్వికీ

అర్జునా! ప్రవృత్తి నివృత్తి విషయములను, కార్యాకార్యములను, భయాభయములను ఏదయితే తెలిసికొనుచున్నదో ఆ బుద్ధి సాత్త్వికమైనది

యయా ధర్మమధర్మం చ కార్యం చా కార్యమేవ చ {18.31}

అయథావ త్ప్రజానాతి బుద్ధిస్సా పార్థః రాజసీ

అర్జునా! ధర్మాధర్మములను, కార్యాకార్యములను ఉన్న దున్నట్లుగాక భిన్నముగ గ్రహించెడి బుద్ధి రాజస బుద్ధి యనబడును

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా ఆవృతా {18.32}

సర్వార్థాన్ విపరీతా౦శ్చ బుద్ధి స్సా పార్థ తామసీ

పార్థా! ఏ బుద్ధి అజ్ఞానముచేత కప్పబడి అధర్మమును ధర్మముగను, సమస్త విషయములను విపరీతముగను గ్రహించుచున్నదో అది తామసిక బధ్ధి యనబడును ఀ

ఈ పై శ్లోకాలు బుద్ధి గూర్చి చెపుతున్నాయి. బుద్ధి అనగా తెలివి తేటలనే గాదు. వివక్షతో గూడిన తెలివి తేటలు. ఒక వస్తువుని చూడడమే కాదు, దాని అంతర్భాగములను కూడా చూచుట. మనము వ్యక్తులను భౌతికమైనవిగా కాక, వారి ఆత్మను చూడవలెను. ప్రపంచాన్ని చూడడమే గాక, దాని లోపల యున్న ఐక్యమత్యాన్ని కూడా చూడాలి. అలాకాక పోతే ఏదీ అర్థము కాదు. మనకు మంచి చెడు ఎన్నికల మధ్య తేడా తెలియదు.

తామసికుని బుద్ధి చీకటితో నిండి ఉంటుంది. వాడు తప్పుని ఒప్పని, ఒప్పుని తప్పని వాదిస్తాడు. అది నీతికి సంబంధించిన విషయాలకే పరిమితం కాదు. తామసికుడు ఇతరుల యందు దయ చూపడు. వాని బుద్ధి తప్పుని ఒప్పని చెప్తున్నాసరే. సమిష్ఠిలో తామసమును చూడవలెనన దిన పత్రికల వార్తలను చదివితే చాలు.

రాజసికుని బుద్ధి కొన్ని సార్లు తేటగా ఉంటుంది. కానీ స్వార్థమునకు సంబంధించిన విషయాలలో గజిబిజిగా ఉంటుంది. నేను కలిసిన కొందరు వ్యక్తులు తమ ఉద్యోగాలలో మిక్కిలి ఘనత సాధించినవారు. కానీ వారు భావోద్వేగంతో ఉంటే మూర్ఖుల్లా లేదా పిల్లల్లా వ్యవహిరిస్తారు. అట్టి వాళ్ళు రాజసికులు. నేను తలచేది సైన్స్ తదితర విభాగాలు సాత్త్వికంగా, నిస్వార్థంగా ఉండాలని.

తామసికులు, రాజసికులు సైన్స్ లో చేతులుకలిపితే కలిగేది విపత్తు. తామసికునికి ఏది ఒప్పో ఏది తప్పో తెలియదు. రాజసికుడు ఏది ఏమైనా పట్టించుకోడు. జన్యు శాస్త్రజ్ఞ్నులు సూక్ష్మక్రిములలో జన్యువులను మార్చి, మనకు కావలిసిన రసాయనాలను చేసుకోవచ్చు అని ప్రకటించేరు. దీనిలో సత్యం ఉన్నది కాని వారి మానసిక స్థితి అలా కాదు. జీవితం నుండి ఏది బలవంతంగా లాగుకొన్నా దానికి పర్యావసానము ఉంటుంది. అది తామసిక పద్దతి.

"మేము పరిణామాన్ని వేగవంతం చేసేము. ఒక సూక్ష్మ క్రిమిని అధ్యయనం చేసి, దాని జన్యువులను మార్చి మనకు కావలసిన లక్షణాలను ఎన్నుకోవచ్చు" అని చెప్పేరు. ఇటువంటి సాంకేతికత ఎంతో శక్తివంతమై నియంత్రింపక బడక అనేక అనార్థాలను కలిగిస్తుంది. అణుశక్తి వ్యర్థాలను మనమెలాగ వదిలించుకోవాలో తెలీదు. వాటిని నదులలో పడేయలేము. ప్రాణుల గూర్చి అధ్యయనం చేసే ఇంజనీర్ లు సూక్ష్మక్రిములతో పనిచేయడానికి మొగ్గు చూపుతారు. ఆ క్రిములు అనేక వ్యాధులను తెచ్చేవి. ఇ కొలై అనబడే సూక్ష్మ క్రిమి మన ప్రేగులలో ఉంటుంది. అవిగాని జన్యుమార్పు చెంది మనం త్రాగే నీళ్ళలో, తినే ఆహారంలో ఉంటే ఎటువంటి అనార్థాలు కలుగుతాయో ఎవరూ చెప్పలేరు. క్రొత్త అంటువ్యాధులు రావచ్చు. సంస్థల తక్కువ కాలంలో వచ్చే లాభం కోసం, దీర్ఘ కాలంలో కలిగే సమస్యలను కప్పిపుచ్చుతాయి.

కొందరు మంచి శాస్త్రజ్ఞులు దీర్ఘంగా ఆలోచిస్తారు. ప్రొఫెసర్ లైబ్ కావలీరి (కార్నెల్ మెడికల్ స్కూల్) క్రిస్టియన్ సైన్స్ మానిటర్ లో వ్రాస్తూ మన ప్రస్తుత సమస్యలు శాస్త్రవేత్తలకు సంపూర్ణ అవగాహన లేకపోవడం వలననే అని చెప్పేరు. ఆ శాస్త్రవేత్తలే ఇప్పుడు జన్యువులను మార్పిడి చేద్దామంటున్నారు. వారి అవగాహన పూర్తిగా లేకపోవడం వలననే కదా ఇన్ని విపత్తులు కలుగతున్నాయి. జన్యువులని మార్చినంత మాత్రాన మనకున్న సమస్యలను పరిష్కరించలేము.

జన్యు శాస్త్రము యొక్క లోభత్వము విద్యాలయాలకు కూడా ప్రాకింది. రెండవ ప్రపంచ యుద్ధం లగాయతు విద్యాలయాలు ఆయుధాలు, ఆహారం, మందులు గూర్చి పరిశోధనలు చేసేయి. ఒక సైన్స్ విద్యార్థి తన చదువు భౌతికమైన ప్రపంచం గురించి కాక ఆయుధాలు మొదలగు అంశాలను పరిశోధన చేస్తున్నాడు. దానివలన కొందరు ప్రొఫెసర్ లు తమ పరిశోధనతో సంస్థలను స్థాపించి లాభం పొందాలని ఆశిస్తారు. ఇది మరింత లాభం పొందాలనే విద్యాలయాలకు సమ్మతము. నేను అట్టివారలను శాస్త్రజ్ఞులు అనను. వారు తీరికలో విద్యను బోధించే వ్యాపారస్తులు. నాకు ఒక ఉపాధ్యాయునికి బోధించడం ఇష్టం లేకపోతే ఫరవాలేదు. కానీ బోధన, తీవ్ర స్థాయిలో స్వార్థం కలిసి ఉండలేవు. అలాగే వాళ్ళకి తక్కువ వేతనం ఇయ్యమనట్లేదు. నేను చెప్పేది అమితమైన లాభం కోసం చేసే పనులు. వాళ్ళు నైతిక విలువను పాటించి తక్కినవాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు లాభాలకై పనిచేసే సంస్థలలో పనిచేయడం మంచిది కాదు.

పరిశోధనలకు ప్రభుత్వం, సంస్థలు ఎక్కువ మొత్తంలో ధనాన్ని వెచ్చిస్తాయి. అట్టి పరిశోధనల ఉద్దేశం: ఆయుధాల తయారీ లేదా సాధారణమైన వినియోగదారులకు వస్తువులు తయారు చేయడం. క్రొత్తగా వచ్చే విద్యార్థులు వేరే ఎన్నిక లేక అవే చేస్తారు. నేను చెప్పేది స్థూలంగా డబ్బు మరియు మేధ ఆ పరిశోధనలకై వినియోగిస్తున్నారు. టోయిన్ బీ చెప్పినట్లు: మానవాళి సాంకేతిక పరిజ్ఞానం ఇంత ఎక్కువగా వృద్ధి చెందటానికి కారణం, అనేకమైన వ్యక్తులు తమ శక్తిని దానికై దారపోసేరు. ఇప్పుడు శాంతికై, మానవాళి స్వస్థత కై ముందుకు రావాలి. మనము వీటిలో విఫలమైతే భవిష్యత్ లో ఏ చరిత్రకారుడు మన కంప్యూటరు జ్ఞానం గురించి పొగుడుతూ వ్రాయడు. 419

Viveka Sloka 41 Tel Eng

Telugu English All బ్రహ్మానందరసానుభూతికలితైః పూతైః సుశీతైర్యుతై- (పాఠభేదః - సుశీతైః సితైః) ర్యుష్మద్వాక్కలశోజ్ఝితైః శ్రుత...