Showing posts with label Eknath Gita Book 1. Show all posts
Showing posts with label Eknath Gita Book 1. Show all posts

Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 36

Bhagavat Gita

6.36

యోగినా మపి సర్వేషా౦ మద్గతే నాంతరాత్మనా {6.47}

శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్త తమో మతః

ఏ మనుజుడు నా యందు మనస్సు నిలిపి శ్రద్దతో నన్ను సేవించుచున్నాడో అట్టివాడు యోగులందరి కంటెను ఉత్తముడు అని నా అభిప్రాయము

ధ్యాన యోగులలో కూడా ఉత్తముడు ఏకాగ్రతతో దేవుని కొరకై కర్మలను చేసేవాడు. శ్రీకృష్ణునికి "ఇది నేను తింటే నా దేహానికి బలమిచ్చి దేవుని సేవ చెయ్యగలనా? నేను ఈ విధంగా స్పందిస్తే నా మనస్సును ఉత్తేజ పరచి దేవుని సేవ చెయ్యగలనా?" అని ప్రశ్నించుకొనేవారు ప్రియము. శ్రీకృష్ణుని తమ చేతన మనస్సులో సంపూర్ణముగా నింపుకొన్నవారు అత్యంత ప్రియులు.

మనమందరమూ ఉత్సాహంతో, పద్దతి ప్రకారం, సహనంతో ధ్యానం చేసి శ్రీకృష్ణునికి ప్రియుల మవ్వచ్చు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు బోధించినది: ధ్యానం చెయ్యకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం, నిస్వార్థం తొలగించుకోలేక; మన నడవడిక, వ్యక్తిత్వం, చేతన మనస్సు సన్మార్గంలో పెట్టుకోలేం. అదే ధ్యానం ఎన్ని అవాంతరాలు వచ్చినా చేస్తే, శ్రీకృష్ణుని అభయం సదా ఉంటుంది. ఆయన మనకి స్వస్థత, భద్రత, సృజనాత్మక శక్తితో సమస్యలను పరిష్కరించగలిగే శక్తిని ప్రసాదిస్తాడు. ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానం పొంది జీవైక్య సమానత మనందరిలోనూ, అని ప్రదేశాల్లోనూ, సర్వకాల సర్వావస్థల యందు కలుగుతుంది.

Eknath Gita Chapter 6 Section 35

Bhagavat Gita

6.35

తపస్వి భ్యో అధికో యోగీ జ్ఞానిభ్యో అపి మతో అధికః {6.46}

కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మా ద్యోగీ భవార్జున

తపస్సు చేయువారికంటెను, జ్ఞానుల కంటెను, కర్మయోగుల కంటెను, ధ్యాన యోగి శ్రేష్ఠుడు. కాబట్టి అర్జునా! నీవూ ధ్యానయోగివి కమ్ము

శ్రీకృష్ణుడు క్రతువులు, అభిషేకాలు, అర్చనలు చేసేకన్నా ధ్యానము చెయ్యడం మిన్నదైనదని చెప్తున్నాడు. బుద్ధుడు దేహాన్ని పోషించక, ఇంద్రియాలను పూర్తిగా కట్టడి చేసినంత మాత్రాన జ్ఞానము రాదని చెప్పెను. కానీ దేహాన్ని సరిగ్గా పోషిస్తే అది మనం చెప్పిన మాట వింటుంది.

శ్రీకృష్ణుడు జ్ఞానయోగంలో పయనించేవారికన్నా ధ్యానం చేసేవారు మిన్న అని చెప్తున్నాడు. జ్ఞానయోగ౦ మిక్కిలి కష్టసాధ్యం. కానీ ధ్యానం అలవరుచు కొనడం దానికన్నా సులభం. చివరకు వాటి వలన పొందే జ్ఞానం ఒక్కటే.

అలాగే ధ్యానం చేసేవారు, ఒక్క పరోపకారం చేసే వారికన్నా, మిన్న అని చెప్తున్నాడు. ఎందుకంటే ధ్యానం వలన మాత్రమే తొలగే అహంకారం మన అనుబంధాలను, పరసేవను వక్రీకరిస్తుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ధ్యానంతో లక్ష్య సాధన చెయ్యమని ఆశీర్వదిస్తున్నాడు. 391

Eknath Gita Chapter 6 Section 34

Bhagavat Gita

6.34

ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః {6.45}

అనేక జన్మ సంసిద్ధ స్తతో యాతి పరాం గతిమ్

నిత్య ప్రయత్నము చేసెడి యోగి పాప విముక్తుడై, అనేక జన్మల యందు ఆచరించిన అభ్యాసముచే సిద్ధిని పొందినవాడై తదుపరి బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నాడు

నాకు తెలిసి అనేకమంది ఇంద్రియాలను అనుసరించి ఇష్టానుసారం జీవితం గడిపి, వాటివలన శాశ్వతమైన ఆనందం పొందగోరి త్వరలోనే నిరాశ, నిస్పృహ చెందేరు. శ్రీకృష్ణుడు అట్టివారిని, ఎంతో పరిణామం చెంది, వారి నిజమైన శక్తిని తెలిసికోలేక, వారు ఎంత ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నా సామాన్యులమని తలుస్తారు అని అంటాడు. ఎందరో యువకులు తమలోని నిజమైన ఆధ్యాత్మిక శక్తిని తెలిసికోలేక, ఇంద్రియాలోలత్వముతో కాలము గడుపుతున్నారు. అట్టివారిని విమర్శించకుండా, వారిలోని ఆధ్యాత్మికతను మేలుకొలపాలి.

పూర్వ జన్మ ఆధ్యాత్మిక వారసత్వం పొందడానికి, కుటుంబ౦ ఎంతో ముఖ్యం. మొదట్లోనే ప్రపంచం గురించి ఆలోచింపక కుటుంబం మీద దృష్టి కేంద్రీకరించాలి. కుటుంబాన్ని ప్రేమించి, క్రమంగా ఆ ప్రేమని సర్వత్రా వ్యాపింప చెయ్యాలి. నేటి ప్రపంచం హింసా కాండతో అతలాకుతలమవుతున్నది. సాధన మొదట్లో మన అహంకారాన్ని వ్యతిరేకించే, ఇంద్రియాలకు వద్దని చెప్పే, ఇతరుల క్షేమం మనకన్న ముఖ్యమనే జ్ఞానము పొందటం కష్టసాధ్యమే. అయినప్పటికీ తుపానులతో కూడియున్న సంసార సాగరాన్ని ఈదుతూ దాని ప్రశాంతతకై పాటుపడాలి. శ్రీకృష్ణుడు అట్టి సాగరంలో దూకితే తాను ఈత నేర్పుతానని అభయ మిస్తున్నాడు.

నేను నేటికాలంలో జీవించడం ఈత కొట్టడంతో పోలుస్తాను. మనల్ని ద్వేషించేవారిని ద్వేషించి, క్రోధంతో ఉండేవారితో స్పర్థ పెట్టుకొని ఉంటే మనకు ఈత రానట్లే. ఈత కొట్టడానికి ప్రయత్నించి, ఊపిరాడకపోతే, శ్రీరమణ మహర్షి, శ్రీ రామకృష్ణ, సెయింట్ ఫ్రాన్సిస్ వంటి మహనీయులు మనకి చేయూత నిస్తారు. అందుకే భయమును వీడి, మనల్ని ఒక జ్ఞాని రక్షిస్తాడానే ధైర్యంతో సంసార సాగరంలో ఈదాలి. 390

Eknath Gita Chapter 6 Section 33

Bhagavat Gita

6.33

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వ దైహికమ్ {6.43}

యతతే చ తతో భూయ స్స౦సిద్ధౌ కురునందన

కురునందనా! అలా జన్మించి, పూర్వ జన్మపు బుద్ధితో సంబంధమును పొందుచున్నాడు. మరల పూర్ణ యోగసిద్ధికి ప్రయత్నము చేయుచున్నాడు.

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశో అపి సః {6.44}

జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే

అతడు ప్రయత్నము చేయక పోయినను పూర్వ జన్మ యందలి అభ్యాస ప్రభావము చేత యోగమునకు ఆకర్షింపబడుచున్నాడ. యోగమును తెలియగోరువాడు శబ్దబ్రహ్మమును అతిక్రమించుచున్నాడు

మనకి దేవునిక మధ్య ఆకర్షణ ఉంది. మనము చిన్న ఆయస్కాంతాల లాగ జీవనము సాగించి, కొన్నాళ్ళ ఆధ్యాత్మిక సాధన వలన, దేవునివైపు పూర్తిగా ఆకర్షింప బడతాము.

గీత చెప్పేది ఆధ్యాత్మిక చింతన ఎక్కడి నుంచో ఊడిపడి రాలేదు. అది మనలో బీజ రూపంలో ఎప్పటికీ ఉంది. దానిని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాము. కొన్నేళ్ళు ధ్యానం చేస్తే, మన గతజన్మ స్మృతులు వెలికి వచ్చి, మన విలువలు నిస్వార్థమైన జీవితం గడపడానికి, ఆధ్యాత్మికత గాఢమవ్వడానికి ఉపయోగపడతాయి. అది జరిగితే మనము క్రొత్తగా ఆధ్యాత్మికత అలవరచుకోవటంలేదు. లోన ఉన్నదే వ్యక్తమవుతున్నాది. అందుకే మనలో కొందరు ధ్యానంలో శరవేగిరంగా దూసుకు పోతారు. వారిని చూసి మనము నిరుత్సాహ పడనక్కరలేదు. మనమెంత చెయ్యగలిగితే అంత సాధనను చెయ్యాలి.

కొందరు యువకులు భయాందోళనాలతో కూడి అశాంతితో బ్రతుకుతారు. అది ధ్యానానికి సూచన. గత స్మృతులు వెలికికి వస్తే, గతంలో పొందిన జ్ఞానాన్ని తిరిగి పొంది, వారిలో ఆధ్యాత్మిక సాధన చెయ్యాలనే ఇచ్ఛ ప్రబలుతుంది. మొదటి రెండు మూడేళ్ళు సాధన కష్టమనిపించినా, అటు తరువాత మన పూర్వ జ్ఞానము పొంది, మన సంశయాలన్నీ తొలగిపోతాయి. అది ఎలాగంటే ఒక వైణికుడు కొన్నేళ్ళు సాధన చెయ్యక, తిరిగి వీణ వాయించడం మొదలు పెడితే, కొంత తక్కువ సాధనతో తన పూర్వ ప్రావీణ్యాన్ని తిరిగి పొందుతాడు. 388

Eknath Gita Chapter 6 Section 32

Bhagavat Gita

6.32

అథవా యోగినా మేవ కులే భవతి ధీమతాం

ఏ తద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ {6.42}

లేనిచో, జ్ఞానవంతులైన యోగుల కులమునందు పుట్టుచున్నాడు. ఈ లోకమున ఇట్టి జన్మము కలుగుట దుర్లభముకదా

ఆధ్యాత్మిక సాధన ఎన్నటికీ వృధా కాదు. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం, ఈ జన్మలో సాధన పరిపక్వత కాకపోయిననా, వచ్చే జన్మలో ధ్యాన మొనర్చు దంపతులకు బిడ్డలుగా పుడతాం. మనకింత కన్నా గొప్ప అవకాశం లేదు.

కర్మ సిద్ధాంతం ప్రకారం మన బంధుమిత్రులను, ముఖ్యంగా తలిదండ్రులను, జాగురూకతతో ఎంచుకుంటాము. టిబెట్ భౌద్ధులు మరణము తరువాత మనము బార్డో అనబడే త్రిశంకు స్వర్గంలో ఉంటామని అంటారు. అప్పుడు మనకు పునర్జన్మ నిశ్చయింపబడుతుంది. తలిదండ్రులు, వారి సంతానము ఒకరినొకరు పోలి ఉంటారు. అందుకే మన తలిదండ్రులను విమర్శించడం తప్పు. ధ్యానమాచరించే తలిదండ్రులకు పుట్టడం మన అదృష్టం. అలాగే మన కుటుంబం సాధనను మెచ్చుకుంటే అది మన అదృష్టం. మన తలిదండ్రులు ధ్యానం చెయ్యకపోయినా, వారు మన సాధనను, పరోపకార భావనలను ప్రోత్సాహిస్తే అది ఎంతో అదృష్టం. అందుకే మన ప్రార్ధనను మన తలిదండ్రుల, కుటుంబ సభ్యుల క్షేమమునకై చేసి ఉపసంహరించడం శ్రేష్ఠము. 386

Eknath Gita Chapter 6 Section 31

Bhagavat Gita

6.31

ప్రాప్య పుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీ స్సమాః {6.41}

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే

యోగభ్రష్టుడు పుణ్యాత్ములు వసించెడి లోకములను పొంది, అచ్చట అనేక సంవత్సరము లుండి తరువాత సదాచార సంపన్నులైన శ్రీమంతులలో జన్మించుచున్నాడు

ఇక్కడ శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక సాధన ఎన్నటికీ వ్యర్థం కాదని అభయమిస్తున్నాడు. ఒకనికి ఒక జన్మలో సాధన వలన కలిగే పుణ్యము పరిపక్వమవ్వకపోతే అతడు మరల మనిషిగా పుట్టినపుడు ఆధ్యాత్మిక దిశలో పయనించడానికి పూర్వ జన్మ పుణ్యాన్ని దేవుడు అందిస్తాడు.

నేను నా అమ్మమ్మకు పుణ్యవశాత్తూ మనవడిగా పుట్టేను. శ్రీకృష్ణుడు ఒక జన్మలో పుణ్యం చేసికొని, మళ్ళీ మనిషిగా ఒక సద్గుణవంతమైన జంటకు బిడ్డగా పుట్టి, వారి సహనంతో, ఓర్పుతో ఆధ్యాత్మిక సాధన చేస్తామని ఢంకా కొట్టి చెప్తున్నాడు.

Eknath Gita Chapter 6 Section 30

Bhagavat Gita

6.30

శ్రీ భగవానువాచ:

{6.40}
పార్థ నై వేహ నా ముత్ర వినాశస్తస్య విద్యతే

న హి కల్యాణ కృ త్కశ్చి ద్దుర్గతిం తాత గచ్ఛతి

పార్థా! యోగభ్రష్టునకు ఈ లోకమున గాని, పరలోకమున గాని వినాశము కలుగనేరదు. పుణ్యాత్ముడైన వాడెవడు దుర్గతి పాలుకాడు కదా!

శ్రీకృష్ణుడు ఇలా బోధించెను: "ఎంత తక్కువ సమయమైనా నాయందు చేసిన ధ్యానము ఎన్నటికీ వ్యర్థం కాదు. ఆధ్యాత్మిక పథంలో ఎటువంటి చిన్న అడుగైనా ఎన్నటికీ నిరుపయోగము కాదు". మన మతంలో ఎవ్వరూ దిక్కులేకుండా ఉండరు. మనమంతా దేవుని బిడ్డలము. మనము దేవునికి దూరంగా, నిర్జన ప్రదేశంలో బ్రతకవచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు దేవునితో ఐక్యమవుతాం.

మన మతంలో మనమెవ్వరమూ ఎన్నటికీ దేవుని బిడ్డలము కాకుండా ఉండం. మనకు నిరాశ, నిస్పృహలు కలిగినప్పుడు, లేదా మన బాహ్య కర్మలు ఎలాగ ఉన్నా, మన పరిపూర్ణులం, శుద్ధమైన వారలం, దేవుని అంశలం.

అందరూ యోగులవ్వగలరు. మనకు జ్ఞాని లక్షణాలు మొదట్లో లేకపోయినా, మనము వంగి వాటిని అలవరచుకొంటాము. కానీ మనను కించపరిచితే మన దృక్పథం అలాగే ఉంటుంది. నేను చెప్పేది: మీరు పిల్లలు దైవస్వరూపులని చెప్పండి. పెద్దలు కూడా కొన్నాళ్ళకు దైవస్వరూపులుగా మారవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంది. మనము ఓర్పుతో, సహనంతో ఉంటే ఇతరులు మన అంచనాకి ఎదుగుతారు. 385

Eknath Gita Chapter 6 Section 29

Bhagavat Gita

6.29

కచ్చిన్నో భయవిభ్రష్ట శ్చిన్నాభ్రమివ నశ్యతి {6.38}

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః

మహాబాహో! ఈ యోగము లభించక జ్ఞాన మార్గము నుండి తప్పి పోయినవాడు రెండు విధముల చెడినవాడై చెదిరిన మేఘము వలె నశింపకుండునా?

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తు మర్హ స్యశేషతః {6.39}

త్వదస్య స్స౦శయ స్యాస్య ఛేత్తా న హ్యుపద్యతే

కృష్ణా! నా సంశయమును నివారించుటకు నిన్ను మించిన వారెవ్వరూ లేరు

పెద్ద సుడిగాలి మేఘాలను చెల్లాచెదురూ చేస్తుంది. అర్జునుడు తనను అటువంటి మేఘాలతో పోల్చుకొన ఇలా అడిగెను: "ఒక పెద్ద అవాంతరము వచ్చి, నా ఆధ్యాత్మిక చింతనను నా చేతన మనస్సును, నా పట్టుదలను, ఖండ ఖండాలుగా చేసి, నలు దిక్కులా చెల్లా చెదురు చేస్తే ఏమవుతుంది? నేను ఇంద్రియ సుఖము, ఆధ్యాత్మిక ఆనందము పొందక రెంటికీ చెడ్డ రేవటిలా ఉంటానా?" ఇది మనందరిలో కలిగే సంశయము. ముఖ్యంగా ఇంద్రియలోలత్వము, అహంకారము గల వ్యక్తులలో ఇది ప్రకటిత మవుతుంది. అర్జునుడు తన అనుమాలాను ఈ విధంగా వ్యక్త పరచి, శ్రీకృష్ణుని వాటిని పఠాపంచలు చెయ్యమని అడుగుతున్నాడు. సమాధి స్థితిలో దేవుడు మన చేతన మనస్సును ఆవరించి, అటువంటి అనుమాలన్నీ పోయి, మనలో నిశ్చయము కలిగి అందరికీ ప్రకటిత మవుతుంది. 383

Eknath Gita Chapter 6 Section 28

Bhagavat Gita

6.28

అర్జున ఉవాచ:

{6.37}
అయతి శ్శ్రద్ధయోపేతే యోగా చ్చలితమానసః

అప్రాప్య యోగ సంసిద్ధం కాం గతిం కృష్ణ గచ్ఛతి

కృష్ణా! శ్రద్ధగలవాడయ్యును, ప్రయత్నము సరిగ చేయనందున యోగము నుండి చలించిన మనస్సు గలవాడైన మనుజుడు యోగసిద్ధిని పొందనపుడు వాని గతి ఏమి?

అర్జునుడు మనందరి అనుమాలను ప్రతిబింబిస్తున్నాడు. "కొన్నాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసి, అటు పిమ్మట గాడి తప్పితే, చేసిన సాధన అంతా వ్యర్థమా?" అని అర్జునుడు అడుగుతున్నాడు.

కొన్నాళ్ళు ధ్యానం చేసి, దానివలన పొందగలిగే ఫలాలు చవి చూస్తాము. ఇంద్రియాలను నియంత్రించి, ఆనందాన్ని పొందుతాము; అహంకారాన్ని జయించి బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటాము. ఇలాగ చవి చూసి, ధ్యానాన్ని విరమిస్తే, దానికి సరితూగే దేమీలేదని తెలుసుకొంటాము. మనము భోగాలు, సుఖాలకు అలవాటుపడినా మన అంతరాత్మ "నీవు ఆధ్యాత్మిక పథాన్ని విడనాడేవు" అని చెప్తుంది.

నేటి కాలంలో చాలా మంది మాదక ద్రవ్యాలతో ధ్యానం చేస్తున్నారు. సాధువులు గంజా మొదలగు ద్రవ్యాలను వాడుతారనే అభియోగం, దుష్ప్రచారం ఉన్నాయి. అది పెద్ద అబద్దం. మెహర్ బాబా మాదక ద్రవ్యాలు ఆధ్యాత్మికతను పెంపొందించలేవు; పైపెచ్చు అవి మనకున్న ఆధ్యాత్మికతను చంపుతాయి అని చెప్పిరి. అట్టి రసాయన పదార్థాలతో అడ్డ దారి త్రొక్కితే, కొన్నాళ్ళకు మనకు ధ్యానం చేసే శక్తి పోతుంది. ధ్యానం అంతర్గత ప్రయాణం. దానికై బలమైన దేహం, మంచి నాడీ వ్యవస్థ, ప్రశాంతంగా ఉండే మనస్సు, పదునైన బుద్ధి అవసరం. అవి రసాయనాల వలెనే కాక, అతిగా ఇంద్రియలోలత్వం, అహంకారం వలన క్షీణిస్తాయి. 383

Eknath Gita Chapter 6 Section 27

Bhagavat Gita

6.27

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః {6.36}

పశ్యాత్మనా తు యతతా శక్యో అవాప్తు ముపాయతః

మనో నిగ్రహము లేనివాడు యోగసిద్ధిని బొందుట దుర్లభము. మనో నిగ్రహము కలిగి ప్రయత్నించువాడు ఉపాయము వలన పొందగలుగుట సాధ్యమని నా అభిప్రాయము

మనము ధ్యానంలో స్థితులై, శ్రీకృష్ణుని బోధను తూచ తప్పకుండా పాటిస్తే, అతనితో ఐక్య౦ నిస్సందేహంగా పొందుతాము. కానీ బద్దకంతో ఆరంభశూరులవలె ఆర్భాటంతో మొదలుపెట్టి, చివరకు పిల్లిలా తయారవుతే అట్టి ఐక్యం పొందలేము.

ఎవరైతే ఆధ్యాత్మిక సాధన పట్టుదలతో చేసి, ఎన్నటికీ దానిని విడువక చేస్తారో వారు విజయవంతులు అవుతారు. వారికి పరిగెత్తడం వీలుకాకపోతే, చిన్న చిన్న అడుగులు వేస్తారు; అదీ వీలుకాకపోతే, డేక్కుంటూ తమ లక్ష్యం వైపు ప్రయాణిస్తారు. వారికి ఎన్ని అవరోధాలు వచ్చినా దాటుకొని, కనబడిన ఊతను తీసికొని ముందుకు సాగుతారు. మొదట్లో ఈ ప్రయత్నం చాలా కష్టం. ఎందుకంటే మనము ముందు అహంకారాన్ని జయించాలి. కానీ మన లక్ష్యం పై స్థిర చిత్తులమైతే కత్తి పోట్లు చిన్న సూది పోట్లుగా మారి; సూది పోట్లు పింఛ౦తో రాసినట్లు మారుతాయి. లక్ష్యం చేరడానికి సంపూర్ణమైన అర్పణ ఉ౦టే, మనము మిక్కిలి ఆనందం పొంది లక్ష్యాన్ని సాధిస్తాము. 381

Eknath Gita Chapter 6 Section 26

Bhagavat Gita

6.26

శ్రీ భాగవానువాచ:

{6.35}
అస౦శయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్

అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే

మహాబాహో! మనస్సు చంచలము, నిగ్రహించుటకు శక్యము కానిది అనుటలో సంశయము లేదు. కానీ, కౌ౦తేయా! అభ్యాస వైరాగ్యముల చేత మనస్సు నిగ్రహింపబడుచున్నది

శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహో -- అనగా చేతులు అంతరిక్షంలోకి చొచ్చుకొని ఉన్నవాడు--అ౦టాడు. మనము మహాబాహువులు అవ్వవచ్చు. కానీ స్వార్థంతో, కోర్కెలతో, ఇతరుల అవసరాలను తెలిసికోక జీవించడం వలన అలా కాలేకున్నాము. మనమందరిని చేతులతో ఆలింగనము చేసి, వారిని శాంత పరిచి, బలపరిస్తే మన చేతులు కూడా అంతరిక్షం దాటి ఉన్నట్లే.

చేతులను అంతరిక్షంలోకి సాగించడానికి గట్టి ప్రయత్నం చేస్తేగాని సాధ్యము కాదు. దానికై ఇతరులు మనను ఎంత బాధించినా, ఓర్పుతో భరించాలి. మొదట మన కుటుంబంతో సామరస్యంగా ఉండాలి. క్రమంగా బంధుమిత్రులతో, సహ ఉద్యోగులతో, తక్కిన వాళ్ళతో సామరస్యంతో మెలగాలి.

నా అమ్మమ్మ నాకు ఈత కొట్టడం నేర్పింది. ఎలాగంటే, తనతో పాటు నీటిలోనికి ప్రవేశించి, తనను అభినయించమని శిక్షణ ఇచ్చింది. నేను మొదటిసారి నీళ్ళు మ్రి౦గి, రెండవ సారి ఆమెకు సరిగా ఈత కోట్టేను. నేడు ఈత కొట్టడ౦ నేర్పే ఉపాధ్యాయులు ఉన్నారు. వారు మొదట ఒక చిన్న కుండీలో ఉంచి నిటారుగా ఉండి చేతులు, కాళ్ళు ఆడించడం నేర్పుతారు. క్రమంగా ఒక కొలనులోకి తీసికెళ్ళి అక్కడ ఈత కొట్టడం అనేక ప్రక్రియలతో నేర్పుతారు. ఇది ఒక క్రమంతో, చిన్న చిన్న అడుగులతో కూడిన పద్దతి. అలాగే మనము ఆధ్యాత్మికతను చిన్న చిన్న మోతాదులలో అలవరచుకోవాలి. తద్వారా మన చేతులను మహాబాహువుగా చేసికొని, ఇళ్ళలో, సమాజంలో సమంగా బ్రతకగలం.

శ్రీకృష్ణుడు మనస్సును నిగ్రహించుకోవడానికి రెండు పద్దతులు బోధిస్తున్నాడు: ఒకటి అభ్యాస౦; నిద్రను౦చి లేచి ధ్యానం చెయ్యాలి; మనమలాగ రోజూ చేస్తే ధ్యానంలో పరిపక్వత పొందుతాము; రెండవది వైరాగ్యం; క్రోధం, అసూయ మనకున్న బలహీనతలు; వాటికి దాసోహమనేకంటే, మనం ఇతరుల సానుకూలతకై కోరక ఉండాలి. ఇతరులు మనము కోరినట్లు స్పందించకపోతే, దానివలన కలిగే నిరాశ, క్రోధాన్ని నియంత్రించాలి. ఈ విధంగా ధ్యానం చేసి, అహంకారాన్ని దూరం చేసికొంటే మనము శ్రీకృష్ణునే పొందగలము. 381

Eknath Gita Chapter 6 Section 25

Bhagavat Gita

6.25

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవ ద్ధృఢమ్ {6.34}

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్

కృష్ణా! మనస్సు చంచలమైనది; క్షోభపెట్టునది; బలమైనది; ధృడమైనది. అట్టి మనస్సును నిగ్రహించుట గాలిని బంధించుట వలె దుస్సాధ్యమని నాకు తోచుచున్నది

ఇక్కడ అర్జునడు జీవిత సత్యాలు: నీవు మనస్సును స్వాధీనంలో పెట్టుకోమని చెప్పడం, గాలిని, తుపానుని నియంత్రించమని చెప్పినట్లుగా ఉంది" అ౦టాడు. నిజానికి నేను ఆలోచిస్తున్నాను అనే మాటకు అర్థం: మన౦ ప్రతీదీ ఆలోచించట్లేదు; ఆలోచనలు మనను నడుపుతున్నాయి. మనము ధ్యానం చేద్దామని కూర్చుంటే, మనస్సు తిండిమీదకి, సినిమా మీదకి పోతుంది. మనస్సు దాని కిష్టమొచ్చినట్లు ఆలోచిస్తుంది. ధ్యానం ద్వారా స్వీయ ఆలోచన మన చేతిలో లేదని తెలిసికొని, అహంకారాన్ని పారద్రోలడానికి ప్రయత్నించవచ్చు. పతంజలి ధ్యానాన్ని రాజ యోగము అంటారు: ఎలాగైతే అహంకారాన్ని జయించి, దేవుని దేహాన్ని, మనస్సును నియంత్రించే రాజుగా పట్టాభిషేకం చేసినట్లు. 378

Eknath Gita Chapter 6 Section 24

Bhagavat Gita

6.24

అర్జున ఉవాచ:

{6.33}
యో అయం యోగస్త్వయా ప్రోక్త స్సామ్యేన మధుసూదన

ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితి౦ స్థిరామ్

మధుసూదనా! సమత్వభావనతో కూడిన ఏ యోగమును నీవు ఉపదేసించితివో ఆ యోగము యొక్క స్థిరమైన స్థితిని మనస్సు యొక్క చంచల స్వభావము చేత నేను గ్రహింప లేకున్నాను

మధు ఒక అసురుడు--అనగా అహంకారమనబడేది. అది అన్నిటినీ ధ్వంసం చేసేది. శ్రీకృష్ణుని మధుసూదన --అనగా అహంకారాన్ని సంహరించేవాడు-- అంటారు. అర్జునుడు తనకు చంచలమైన మనస్సును నియంత్రించుకొనే శక్తి లేదని వినమ్రతతో చెప్తాడు.

ధ్యానంచేసి మనము అహంకారాన్ని నిర్మూలించేమని తలుస్తాము. కాని దాని బీజము మనస్సులో ఉండి, మరుసటిరోజు మళ్ళీ మొలకెత్తుతుంది. మనస్సును స్వాధీనం పెట్టుకోవడం హాస్యాస్పదంగా మారినా, మనము నిరుత్సాహ పడక, దానిని మలచుకొని, మన నడవడికను, విధిని మార్చుకోవచ్చు. దానికై బుద్ధి పూర్వకంగా మన క్రియలు, మాటలు, ఆలోచనలు ప్రతిరోజూ చెయ్యాలి.

శ్రీకృష్ణుడు రెండవ అధ్యాయంలో (సాంఖ్య యోగము) చెప్పినట్లుగా మనము జ్ఞానులై, నిస్వార్థ కాములై చేసే ధ్యానము పరిపక్వమవుతుంది. ఈ విధంగా భయం, ఆందోళన, విచారము లతో కూడిన ఆలోచనలను ధైర్యం, ప్రేమ, జ్ఞానముగా మార్చుకొంటాము. 378

Eknath Gita Chapter 6 Section 23

Bhagavat Gita

6.23

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున {6.32}

సుఖం వా యదివా దుఃఖం స యోగీ పరమో మతః

అర్జునా! తన యందును సర్వ భూతముల యందును కలుగు సుఖదుఃఖములను ఒకే రీతిగ సమ దృష్టితో గాంచువాడు పరమశ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయము.

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మన నడవడిక ఎలా ఉండాలో బోధిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే మనకేది బాధ కలిగిస్తుందో, ఇతరులకు కూడా అదే బాధ కలిగిస్తుంది.

మనమొక మిత్రుడు రాకకై ఎదురుచూస్తూ ఉండి, అతడు నియమిత సమయానికి రాకపోతే మనకు చికాకు వేస్తుంది. కానీ మనం ఉంకొకర్ని కలవడానికి ఒక గంట ఆలస్యంగా వెళితే, మనకున్న అనేక సద్గుణాలవలన క్షమింప బడతామని తలుస్తాము. ఇతరులు మన౦ చేసే తప్పులను చూసీ చూడనట్టు ఉండాలని కోరుతాం. కానీ వారి తప్పులను, బలహీనతలను ఎత్తి పొడుస్తాం.

ఆధ్యాత్మికత కలవాడు ఇతరుల తప్పులను మరచిపోయేటట్టు చేస్తాడు. అతడు తుచ్ఛమైన భావనలను వీడి, ఇతరుల అవసరాలకు అనుగుణంగా మెలగుతాడు. మనము సున్నితమైన మనస్తత్వము గలవారమని మరచి, ఇతరుల గురించి పాటుపడితే దేవుడు హర్షిస్తాడు. బుద్ధుడు ఇతరులను అర్థం చేసుకోవాలంటే: మనకు ఏది అవమానకరమో, ఇతరులకూ అది అవమానకరం అని చెప్పెను. కాబట్టి ఇతరులను దెప్పి పోడిచే మాటలు మాట్లాడకూడదు.

దుష్ట ఆలోచనలు, ద్వేష పూరితమైన ఆలోచనలు, ఇతరులను కత్తి పోటుకన్నా ఎక్కువగా బాధ పెట్టగలవు. మన మనస్సులో ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయని గ్రహించక పోవచ్చు. ద్వేష పూరిత ఆలోచనలు -- "నిన్ను నేను అసహ్యించు కొంటున్నాను; పడి చావు" మొదలగునవి-- కత్తి పోట్లవలె ఇతరులను బాధించి, మన చేతన మనస్సును కూడా ప్రభావితం చేస్తాయి. ఆలోచనలు ఉపశమనం కూడా కలిగిస్తాయి. ఒక కోపిష్టి దుర్భాషలాడితే, మనము మైత్రితో ఉండి, వాని తప్పులను క్షమిస్తే వానిలో మార్పు తెప్పించవచ్చు. ప్రతి ఒక్కరూ సహనానికి, క్షమా గుణానికి స్పందిస్తారు. అది క్షమ ఇచ్చేవారిని, క్షమించబడే వారిని, వారితో బంధాలు ఉన్నవారిని, కరుణిస్తుంది. 377

Eknath Gita Chapter 6 Section 22

Bhagavat Gita

6.22

సర్వ భూతస్థితం యో మాం భజత్యే కత్వమాస్థితః {6.31}

సర్వథా వర్తమానో అపి స యోగీ మయి వర్తతే

ఎవడు ఏకరూపమై సకల ప్రాణుల యందున్న నన్ను భజించుచున్నాడో అట్టి యోగి సర్వ విధముల ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచున్నాడు

ఆధ్యాత్మిక సంబంధమైన గుడులు సందర్శించుట, యజ్ఞ యాగాదులు చేయుట, ధ్యానమునకు సాటిరావు. అవి చేసినా, ధ్యానం చేయుట ఉత్తమం. ఎందుకంటే ధ్యానం వలననే క్రోధాన్ని దయగా; ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోగలిగే శక్తి వస్తుంది.

ఒక ఇల్లును కూల్చడానికి అనేకమైన పద్దతులు ఉపయోగిస్తారు. వాటిలో ఒక పెద్ద ఇనుప బంతితో ఇల్లు కూల్చడం సర్వ సాధారణం. అలాగే మనం పెద్ద ఇనుప బంతితో మన పాత నడవడికను ధ్యానంలో కూల్చాలి. ఇది విచారముతో కూడినది. కానీ పునరుద్ధరణ చెయ్యడంలో మిక్కిలి ఆనందం వస్తుంది. దానికై మిక్కిలి దూరం ప్రయాణించి వనరులు తెచ్చుకోనక్కరలేదు. దేవుడే మనకు అవి ప్రసాదిస్తాడు. మన అహంకారాన్ని, స్వార్థాన్ని కూలిస్తే, దేవుడు ప్రతిఫలంగా ప్రేమ, జ్ఞానం, సహనం, ఓర్పు ప్రసాదిస్తాడు. వాటితో మనం క్రొత్త నడవడిక అనే ఇల్లును కట్టుకోవచ్చు.

మనము స్వార్థం, భయం, క్రోధం తోకూడి గట్టి పునాది లేని ఇంటిలో నివశిస్తే అది ఎప్పుడో ఒకప్పుడు మనమీద కూలుతుంది. అది జరిగేముందు, మనమే ఆ ఇంటిని కూల్చి, దేవుడు ప్రసాదించే సద్గుణాలతో మంచి పునాది మీద ఇల్లు కడితే, మనకు భయం, ఆందోళన కలుగదు. అటువంటి ఇంట్లో చుట్టుప్రక్కల వారికి కూడా నీడ నివ్వచ్చు. శ్రీకృష్ణుడు చెప్పేది: బాహ్య వస్తువులు --అనగా డబ్బు, దస్కం, అధికారం లేదా పేరు ప్రఖ్యాతులు--మీద ఆధారపడవద్దు. అవి శాశ్వతమైన సుఖాన్ని, భద్రతను కలిగించలేవు. అవి తాత్కాలికంగా సంతృప్తి నిచ్చి, క్రమంగా క్షీణింపచేస్తాయి. 375

Eknath Gita Chapter 6 Section 21

Bhagavat Gita

6.21

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి {6.30}

తస్యాహం న ప్రణశ్యామి స చ మే ప్రణశ్యతి

ఎవడు నన్ను సర్వభూతముల యందును, సర్వభూతములను నా యందును గాంచుచున్నాడో అట్టి వానికి నేను ప్రత్యక్షమే, నాకు వాడు ప్రత్యక్షమే

శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఎవరైతే దేవుని అన్ని జీవులలోనూ దర్శిస్తారో; ఇతరులు తమకేమి చేసినా, వారిని గౌరవంతో చూస్తారో, వారికి ఎన్ని అవాంతరాలు వచ్చినా దేవుని రక్షణను పొందుతారు. దేవుని అన్ని జీవులలోనూ చూస్తే, మనం సమతా దృష్టి కలిగి ఉంటాము.

మనకు సమస్యలు ఎదురైనప్పుడు మంత్ర జపం ఉత్తమం. నిద్రకు ఉపక్రమించే ముందు మంత్ర జపం చేస్తూ పడుకోవాలి. దానివలన మరుసటి రోజు ఆహ్లాదంగా ఉండి ప్రతి సమస్యను పరిష్కరించ గలిగే శక్తిని పొందుతాము. నాకు వందలాది మందిని ధ్యాన మార్గంలో నడిపించే బాధ్యత ఉంది. అది కొన్నేళ్ళగా చేస్తూ, ప్రతి రాత్రీ నిద్ర పోయేముందు, నా బాధ్యతలను దేవునికి అప్పజెప్తాను. మంత్ర జపం నిద్రలో కూడా వినబడుతూ ఉండి, దేవుని దర్శిస్తూ ఉంటాను. మరుసటి రోజు దేహం, మనస్సు ఉత్తేజితమై ఉత్సాహంతో కర్మలు చేస్తాను. ఎందుకంటే నా బరువును దేవుని పాదాలముందు వేసేను కాబట్టి. 374

Eknath Gita Chapter 6 Section 20

Bhagavat Gita

6.20

సర్వభూతస్థ మాత్మానాం సర్వభూతాని చాత్మని {6.29}

ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః

ఆత్మయోగి అంతటను సమదృష్టి కలిగి తనను సర్వ భూతముల యందును, సర్వ భూతములను తనయందును దర్శించుచున్నాడు

భారతంలో ఒక కథ చెప్తారు. ధర్మపుత్ర అనే పాండవ వృద్ధుడు తన శునకంతో స్వర్గ లోక ద్వారం వద్ద ఉంటాడు. ద్వారపాలకుడు శునకం స్వర్గ లోకంలోకి రావడానికి వీలు లేదని చెప్తాడు. ధర్మపుత్రుని ఒంటరిగా స్వర్గలోకంలోకి రావాలో లేదా శునకంతో వెనక్కి పోవాలో నిర్ణయించుకోమంటాడు. ధర్మపుత్రుడు శునకంతో తిరిగి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంటాడు. అప్పుడు ఆ శునకం శ్రీకృష్ణునిగా దర్శనమిస్తుంది.

జ్ఞాని దేవుని అన్ని జీవులలోనూ చూస్తాడు. వాటిని తన ఆనందానికి లేదా లాభానికి ఉపయోగించడు. కాబట్టి మాంసాహారం జీవైక్య సమానతకు వ్యతిరేకం. 373

Eknath Gita Chapter 6 Section 19

Bhagavat Gita

6.19

యంజ న్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః {6.28}

సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖ మశ్నుతే

ఈ ప్రకారము మనస్సును సదా ఆత్మయందే నిలుపుచు, కల్మష రహితుడైన యోగి బ్రహ్మ సాక్షాత్కార రూపమగు పరమ సుఖమును సులభముగ పొందుచున్నాడు

ఆత్మ శుద్ధమైనది. అనగా మన సహజ స్థితిలో అరిషడ్వర్గాలు, అహంకారం లేవు. కానీ ఈ రోజుల్లో వాటినే మన సహజ స్థితి అని నమ్ముతున్నాం. మన అభిలాషలచే, కోర్కెలచే బందీలుగా ఉన్నాము. ధ్యానం ద్వారా వాటిని అధిగమించవచ్చు.

శ్రీకృష్ణుడు మనల్ని సుఖం, లాభం, అధికారం, ప్రతిష్ఠల నుంచి విడివడి, వాటి వలన కలిగే అపజయాల్ని, బలహీనతలను, అభద్రతను అధిగమించి తనను పొందమని బోధ చేస్తున్నాడు. మన జన్మ సార్థకం చేసికోవాలంటే స్వార్థాన్ని వీడి, దేవునియందు ప్రేమతోనుండి, మన వనరులు, శక్తి సామర్థ్యాలు పరోపకారానకై ఉపయోగించాలి. అలాచేస్తే మన౦ కర్మలు చేయక, దేవుడే మన చేత కర్మలు చేయిస్తాడు.

అహంకారం, స్వార్థం, పగ, ద్వేషాలను వీడి దేవునికి దాసోహమైతే, మనము అందరి క్షేమమునకై పని చెయ్యవచ్చు. 372

Eknath Gita Chapter 6 Section 18

Bhagavat Gita

6.18

ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమం {6.27}

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్

ప్రశాంత చిత్తుడును, రజోగుణము నశించిన వాడును, బ్రహ్మభూతుడును, పాపరహితుడును అగు ఈ యోగి ఉత్తమ సుఖమును పొందుచున్నాడు

ఎవరైతే దేవుడ్ని అన్ని జీవులయందు దర్శిస్తారో వారిలో స్థిరమైన శక్తి ఉంటుంది. ప్రపంచంలోని ఎటువంటి ప్రమాదాలు వానిని ఆందోళన పరచలేవు. వారిలో భద్రత కలిగి, మనస్సు నిశ్చలంగా ఉండి, ఆలోచనలు నియంత్రింపబడి ఉంటాయి.

ఆందోళనతో కూడిన మనస్సును శాంత పరచాలంటే మంత్రాన్ని కొన్ని వందల సార్లు ఒక పుస్తకంలో వ్రాయాలి. అలాగే ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తే మనస్సు ఆందోళన పడదు. చిన్నవారు శ్రమటోడ్చి పనిచేసి, మంత్రాన్ని జపిస్తే వారి మనస్సు శాంతింపబడుతుంది.

స్వార్థపూరితమైన కోర్కెలను పారద్రోలితే మనస్సులో మిగిలేది పరిపూర్ణమైన ఆనందం. ఆనందం కోర్కెలచే చెర పట్టబడి యున్నది.

ఆధ్యాత్మిక ఆనందం ఒక పిల్లవాని వలె, మన చుట్టూ చేతులు వేయడానికి, మనమెంత దూరం వెళ్ళినా, ముందుకు వస్తుంది. మన స్వార్థ పూరిత ఆలోచనలు తమకి ముప్పు తప్పదని తెలిసి ఆ పిల్లవానిని దగ్గిరకు రానీకుండా చేస్తాయి. మనము అజ్ఞానా౦ధకారంలో ఉన్నంత కాలము, స్వార్థ పూరిత కోర్కెలు మన మిత్రులని భావిస్తాము. మనకు దుఃఖం కలిగించే పనులు వాటివలననే మనచే చేయింపబడతాయి. ద్వేషము, పగ మనల్ని అతలాకుతలం చేసినా, వాటిచే ప్రభావితమౌతాము. ధ్యానం ద్వారా స్వార్థాన్ని నియంత్రించి ఆనందాన్ని మనలోకి ఆహ్వానిస్తాము. 370

Eknath Gita Chapter 6 Section 17

Bhagavat Gita

6.17

యతో యతో నిశ్చరతి మన శ్చంచల మస్థిరమ్ {6.26}

తత స్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్

చంచలమైనదియు, నిలకడలేనిదియు నగు మనస్సు ఎచ్ఛటెచ్చట సంచరించునో అచ్చటచ్చట నుండి దానిని మరల్చి ఆత్మయందే నిలుపవలెను

మనస్సు ఒకదాని తరువాత ఇంకొక కోరికను సదా కోరుతూనే ఉంటుంది. దాని వలన పూర్తి ఆనందము పొందలేకున్నాము. అంతర్గత ఆనందాన్ని పొందాలంటే మనస్సును నిశ్చలము చేసికొని స్వార్థపూరిత కోర్కెలు విడనాడాలి. ధ్యానంలో మనస్సు బాహ్యంగా ప్రసరిస్తే దానిని లోపలకు తెచ్చుకోవాలి. క్రమంగా మనస్సు ధ్యానంలో నిలకడగా ఉంటుంది. గాఢమైన ధ్యానంలో మనస్సు మంత్రం మీద కేంద్రీకరించి ఉంటుంది. అప్పుడు మంత్రం మనం వలనించేది కాక, మన చేతన మనస్సులో లీనమైపోతుంది. మనస్సును "ఇతరులను క్షమిస్తే నీవు క్షమింప బడతావు" అనే సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన మాటలమీద కేంద్రీకరించి ధ్యానం చేస్తే, మన తలిదండ్రులతో, లేదా పిల్లలతో, లేదా మిత్రులతో, విభేదాలు ఉంటే, వాటిని పరిష్కరించే శక్తి వస్తుంది. మనతో విభేదములు వున్నవారల యందు ప్రేమతో, గౌరవముతో మెలిగితే శత్రువులు కూడా మిత్రులవుతారు. 368

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...