Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 7

Bhagavat Gita

2.7

న హి ప్రపశ్యామి మామప నుద్యా ద్యచ్చోక ముచ్చోషణ మి౦ద్రియాణా౦ {2.8}

అవాప్య భూమా వసపత్న మృద్ధం రాజ్యం శురాణామపి చా ధిపత్యమ్

ఈ భూలోకమున ఎదురులేని సమృద్ధమైన రాజ్యము లభించినను, స్వర్గలోకాధిపత్యము ప్రాప్తి౦చినను, నా ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ దుఃఖమును ఏది పోగొట్టునో నాకు తెలియుట లేదు

సంజయ ఉవాచ:
ఏవ ముక్త్వా హృషీకేశ౦ గుడాకేశః పరంతపః {2.9}

న యోత్స్య ఇది గోవింద ముక్త్వా తూష్ణీ౦ బభూవ హ

పరంతపుడైన అర్జునుడు హృశీకేశుడైన గోవిందునితో ఈ విధముగా పలికి యుద్ధము చేయనని ఊరకుండెను

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత {2.10}

సేనయో రుభయో ర్మధ్యే విషీదంత మిదం వచః

ఓ ధృతరాష్ట్రా! రెండు సేనల నడుమ దుఃఖించుచున్న అర్జునుని జూచి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లనెను

శ్రీ భగవానువాచ:
అశోచ్యా నన్వశోచ స్త్వ౦ ప్రజ్ఞావాదాంశ్చభాషసే {2.11}

గతాసూ నగతాసూ౦శ్చ నానుశోచన్తి పండితాః

దుఃఖి౦ప దగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు. పైగా పండితవచనములను పలుకుచున్నావు. పండితులగువారు గతించిన వారిని గూర్చి గాని, జీవించియున్న వారిని గూర్చి గాని దుఃఖి౦పరు

శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పక చెప్పేది:"నువ్వు జ్ఞానవంతుడిలా మాట్లాడుతున్నావు. కానీ నీ ఆచరణ వ్యతిరేకముగా ఉంది. నీవు ఆనందాన్ని కోరుతూ దుఃఖ కరమైన మార్గంలో వెళ్ళడానికి పూనుకొంటున్నావు. అలాగే సంతృప్తిగా ఉంటానన్నావు. నీవు ఎన్నిక చేసుకొనే మార్గం నిరాశ కలిగించేది అని తెలియక ఉన్నావు." శ్రీకృష్ణుడు అర్జునుని మనస్తత్వము చేయదలుచుకున్న క్రియలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుచున్నాడు.

మనమందరము అడుగవలసిన ప్రశ్న: "మనకు భద్రత, ఆనందం, సంతృప్తి కావాలా, వద్దా?" అలా అడిగి మన లక్ష్యాలను స్థిర పరుచుకోవాలి. మనమందరము శాంతిని కాంక్షిస్తాము. ఏ వ్యక్తీ లేదా దేశం శాంతి వద్దని అనరు. అలాగయితే మనమంతా శాంతికై పాటుపడాలి. అలాకాక యుద్ధం వైపు మొగ్గితే వచ్చేది యుద్ధమే. జర్మనీ అధినేత బిసమార్క్ "నాకు యుద్ధం వద్దు. కానీ విజయం కావాలి" అన్నారు. కొందరు పిల్లలు "నా తలిదండ్రులపై ఎదురు తిరగను. కానీ నా కిష్టమైనట్టు చేస్తాను" అని అంటారు. దానికి శ్రీ రామకృష్ణ పరిష్కారం: "నువ్వు తూర్పు వైపు వెళ్ళాలంటే, ఉత్తరముఖంగా అడుగు పెట్టకు". మనం శాంతి గురించి మాట్లాడితే సరిపోదు. చరిత్ర కారులు నిక్కచ్చిగా చెప్పే గత రెండు వేల స౦వత్సరాల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగేయి. ప్రపంచ దేశాలు ఒక ప్రక్క శాంతి సందేశాలు ఇస్తూ, మరొక ప్రక్క మారణాయుధాలు తయారు చేస్తున్నాయి. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుని నెపంగా పెట్టుకొని "మీకు శాంతి కావాలంటే, శాంతికై ఎందుకు పాటుపడరు?" అని మనల్ని అడుగుతున్నాడు.

అర్జునుడు తనకి అకాల మరణం వద్దని, తన బంధుమిత్రులను చంపనని ముందు చెప్పియున్నాడు. శ్రీకృష్ణుడు దానికి బదులుగా దేహం మాత్రమే మరణిస్తుంది అని చెప్తున్నాడు. మనము ఎప్పటికీ మరణించం, ఎందుకంటే మన ఆత్మ దేహానికే పరిమితం కాదు. మనము శాశ్వతము, అపరిమితము, మార్పులేని వారలము. ఇదే ధ్యానం చివరలో కలిగే భావం: మనము దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కాము. మనం పరమాత్మ అంశలము.

రమణ మహర్షి 1950 లో అవసాన దశలో ఉన్నప్పుడు అనేక భక్తులు "మీరు వెళ్లిపోతున్నారు. మమ్మల్ని వదిలేస్తున్నారు" అని విలపించేరు. ఆయన "నేనెక్కడికి వెళ్ళ గలను? నేను అన్ని చోట్లా ఉన్నాను. మిమ్మల్ని ఎలా వదిలేయగలను?" అని అన్నారు. ఇదే మనకి సమాధిలో కలిగే జీవైక్య భావం. 59

Eknath Gita Chapter 2 Section 6

Bhagavat Gita

2.6

కార్పణ్య దోషోప హత స్వభావః వృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః {2.7}

యచ్చ్రేయ స్స్య న్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం శాధి మాం త్వాం ప్రసన్నమ్

కార్పణ్య దోషముచే కొట్టబడినవాడనై ధర్మనిర్ణయము చేయలేని చిత్తమును బొంది నిన్ను అడుగుచున్నాను. నాకు ఏదిమేలైనదో దానిని నిశ్చయముగ చెప్పుము. నేను నీ శిష్యుడను. నిన్ను శరణు బొందిన నన్ను శాసింపుము

అర్జునుడు కృష్ణునితో "నేను నీ శిష్యుడను. నాకు నీ బోధ అనుగ్రహించు" అని వేడుకొంటున్నాడు. మన సంప్రదాయంలో గురువు ఒకరు అడగనిదే వారిని శిష్యునిగా స్వీకరించరు. గురు అనగా బరువుగా ఉండేది అని అర్థం. అంటే గురువుని ఎవ్వరూ కదపలేరు. అలాగే ప్రపంచంలోని ఏ శక్తీ ఆయన చూపించే ప్రేమను నియంత్రించలేదు. అతనిని తిడితే దీవిస్తాడు, హాని చేస్తే సేవతో బదులిస్తాడు, వాడుకుంటే ఉపకారిగా ఉంటాడు. మనందరిలో అటువంటి గురువు ఉన్నాడు. మన ప్రత్యక్ష గురువు మన అంతర్గత గురువుని గుర్తు చేస్తాడు. ఆయనయందు మనకెంత విశ్వాసముంటే మనమంత ఆత్మ విశ్వాసము కలిగి ఉంటాము. మన స్మృతులలో గురువుని ముందూ వెనకా చూసి ఎన్నుకోమంటారు. ఒకరి అందాన్ని కానీ, వేసుకొన్న దుస్తులనుగాని చూచి ఆకర్షితులమై వారిని గురువుగా స్వీకరించనక్కరలేదు. ఒకమారు మన ఆధ్యాత్మిక దృక్పథంతో ఏకీభవించే గురువు లభిస్తే ఆయన యందు పూర్తి విశ్వాసంతో ఉండాలి.

నేను ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్ని తప్పులు చెయ్యగలమో అన్ని తప్పులు చేసేను. కానీ నా ప్రేమనంతటిని నా అమ్మమ్మకి ఇచ్చి కొంత ఆధ్యాత్మికతను పొందేను. మనమిలాగ గురువుపై ప్రేమ కలిగి ఉంటే అతని చేతనములో ఐక్యమవుతాము. సమయం వచ్చినపుడు గురువు తప్పుకొని, అంతకాలం మన ప్రేమను మన ఆత్మవైపు ప్రసరించేమని గుర్తింపజేస్తాడు. తన స్థితిలో స్థిరమైన గురువుకి ఇతరుల ప్రేమ నిజంగా అక్కరలేదు. శిష్యునికి ఆత్మ జ్ఞానము కలుగజేయడానికే ఆయన వానితో సంబంధం పెట్టుకొన్నాడు.

మనము చేయవలసిన సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన సూచనలు గురువు ద్వారా పొంది, ఆ ప్రయాణాన్ని మనమే చెయ్యాలి. అది మన బదులు గురువు చెయ్యలేడు. గురువు యొక్క ప్రత్యేకత మన జీవిత లక్ష్యమేమిటో తెలిపి, ఆ లక్ష్యం చేరడానికి చేసే ప్రయత్నాన్ని ప్రేరేపిస్తాడు. 55

Eknath Gita Chapter 2 Section 5

Bhagavat Gita

2.5

న చైతద్విద్మః కతరన్నో గరీయో

యద్వాజయేమ యదివానో జయేయుః {2.6}

యానేవ హత్వా న జిజీవిషామ

స్తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః

మనకు యుద్ధము చేయుట శ్రేష్ఠమో, మానుట ఉచితమో ఎరుగకున్నాము. ఈ సమరమున మేము గెలుతుమో, మమ్ములను కౌరవులు గెలుతురో అదియును తెలియదు. ఎవరిని చంపి మేము జీవింప జాలమో అట్టి దుర్యోధనాదులు మా యెదుట యుద్ధమునకై నిలిచి యున్నారు

మనకు ఆధ్యాత్మిక మార్గం కష్టమనిపిస్తే మనలో ఉదయించే ప్రశ్నలే అర్జునుడిక్కడ అడుగుతున్నాడు: "నేను ఇంద్రియాలను జయించినా, నా మనస్సును ఎలా నియంత్రించుకోగలను? ఒకవేళ మనస్సుని నియంత్రించుకొన్నా అహంకారాన్ని ఎలా జయించడం? ఇదంతా ఊహాజనితం. నాకు ఇదంతా మేళవించి ఉన్నాది అంటే నమ్మను. ఇదంతా ఒక తర్కంలాగ ఉంది. నేను ఇంద్రియాలను జయించినా, లేదా నన్ను ఇంద్రియాలు జయించినా తేడా ఏమిటి? నా ఇంద్రియాలతో విడవబడి, నా మనస్సు ఉత్సాహంతో లేకుండా, ఇష్టాయిష్టాలు లేకుండా మానవ చైతన్య పరాకాష్టను చేరి, ప్రపంచాన్ని జయిస్తే వచ్చే లాభమేమిటి?"

అర్జునుడు తనను ఇంకా బాధాకరమైన, ఆందోళనకరమైన స్థితిని పొందమని శ్రీకృష్ణుడు పురమాయిస్తున్నాడని అనుకొనెను. అతను ఆశ్చర్యచకితుడై, పూర్తిగా కుప్ప కూలి, మిత భాషణము చేసిన శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక మార్గ దర్శనం చూపమని వేడుకుంటున్నాడు. 53

Eknath Gita Chapter 2 Section 4

Bhagavat Gita

2.4

అర్జున ఉవాచ:

కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన {2.4}

ఇషుభిః ప్రతియోత్ప్యామి పూజార్హా వరిసూదన

ఓ మధుసూదనా! అరిసూదనా! పూజ్యులైన భీష్మ ద్రోణులపై యుద్ధరంగము నందు శరప్రయోగము చేయుచు నేనెట్లు పోరగలను?

గురూ నహత్వా హి మహానుభావాన్ {2.5}

శ్రేయో భోక్తు౦ భాయీక్ష్య మపీహలోకే

హత్వార్థకామాంస్తు గురూ నిహైవ

భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్

మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమున బిచ్చమెత్తి జీవించుట శుభదాయకము. వారిని వధించినచో రక్తసిక్తమైన అర్థకామ భోగములచే ఇచ్చట అనుభవించవలసి యుండును. ఀ

అర్జునుడు తన నిస్సహాయతని, ఇంద్రియలోలత్వమును ప్రకటించగా శ్రీకృష్ణుడు అర్జునుని మందలిస్తున్న నేపథ్యంలో అర్జునుడు మళ్ళీ ఇలా చెప్పేడు: "ఇంద్రియాలు నా మంచి మిత్రులు. వాటిని సాదరంగా ఆహ్వానించి అవి అడిగినవి ఇవ్వాలి. నీ వ్యతిరేక దృక్పథం నాకు ఆశ్చర్యంగా ఉంది."

మన దైనింద జీవితంలో ఇంద్రియాలతో పోరాడక తప్పదు. మన కళ్ళు ఆందోళన చేస్తే, వాటికి హింసాత్మక దృశ్యాలు చూపించాలనిపిస్తుంది. చెవులకు పైశాచిక సంగీతం వినాలనిపిస్తే, వాటిని నిరుపయోగం చేసే, కరకు సంగీతాన్ని వినిపిస్తాము. ఇక రుచులుకోరే నాలుకకు అనారోగ్యమైన మసాలాతోచేసిన, నూనెలో వేచిన పదార్థాలను అందిస్తాము. మన ఆరోగ్యం ఏమైనా మన నాలుకకు రుచిగా ఉంటే చాలు అనుకుంటాం.

ధ్యానం మొదలు పెట్టేటప్పుడు ఇంద్రియాలను జయించ లేనప్పుడు, ఇటువంటి సందిగ్దత ఏర్పడుతుంది. అలాగే మన స్వచ్ఛంద భావాలను వదలక, ఇతరులను మనకన్నా ముఖ్యమైనవారలని తలచం. పైపెచ్చు దేవునితో ఇతరులు మనకన్నా ముఖ్యలుగా చూపి మన సాధనని దుర్లభం ఎందుకు చేసావని కలహిస్తాం. "నా స్వచ్ఛంద భావాలపై ఎందుకు పోరు చెయ్యాలి? అది నాలో అలజడి రేపి, నా ధ్యానాన్ని భంగం చేస్తోంది" అని విలపిస్తాం.

Eknath Gita Chapter 2 Section 3

Bhagavat Gita

2.3

క్లైబ్య౦ మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే {2.3}

క్షుద్రం హృదయదౌర్భల్య౦ త్యక్త్వోత్తిష్ఠ పరంతప

ఓ పార్థా! క్లీబత్వమును పొందకుము. ఇది నీకు తగదు. తుచ్ఛమగు హృదయ వ్యాకులమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము.

శ్రీకృష్ణుడు అర్జునుని తన మనస్సులో ఏర్పడిన సుడిగుండం నుంచి వెలుపలకి రమ్మని ప్రోద్భలం చేస్తున్నాడు. "నీకిది అనుచితం. నీవు రాజువు. ఈ యుద్ధం నీవు చేయలేవని తలచను" అని శ్రీకృష్ణుడు అంటున్నాడు.

ఇంద్రియాలు మనని నడిపిస్తే వాటిని నియంత్రించలేకపోయేమని చెప్పడం అనుచితం. మనం ఆహారం ఉందికదా అని అదేపనిగా తిననక్కరలేదు. అలాగే ఎంతోమంది ధూమపానం, మద్యం సేవిస్తున్నారని, మనము కూడా వాటిని సేవించనక్కరలేదు. మన పరిస్థితులు ఎంత విషమంగా నున్నా, ఎటువంటి సవాలును ఎదుర్కొన్నా, దేవుని అపరిమితమైన కరుణ, ప్రేమ మనయందు ఉంటాయని నమ్మితే జయం తప్పదు. మన బంధుమిత్రులు మనలను ఉద్రేకింపజేస్తే, వాళ్ళతో కలసి బ్రతకలేమని అనలేము. ఎందుకంటే దేవుడు "నీవు ఎందుకు చేయలేవు? నేను నీలో ఉన్నాను. నా నుండి శక్తిని పొంది ద్వేషాన్ని ప్రేమతో, చెడును మంచితో ఎదుర్కో" అని అంటాడు.

ఇలాగ శ్రీకృష్ణుడు అర్జునుని "మేల్కొని నీ దేహాన్నిపెంచు. నీ తల తారల యందు౦డాలి. సమస్త విశ్వం నీ కిరీటంగా ధరించు" అని ప్రోత్సాహిస్తున్నాడు. అలాగే "అర్జునా, నీలో ఎంతో రాజసం ఉంది. నేను నీలో ఉపస్థితుడినై ఉన్నాను. నీవు చెయ్యవలసిందల్లా నా శక్తిని ఆసరాగా తీసుకొని, శత్రువులను సమూలంగా నాశనం చెయ్యడం" అని బోధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అర్జునుని పరంతప -- అంటే శత్రువును మట్టి కరిపించే వాడు-- అంటున్నాడు. 51

Eknath Gita Chapter 2 Section 2

Bhagavat Gita

2.2

కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితం {2.2}

అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున

అర్జునా! ఆర్యులకు తగనిదియు, స్వర్గమునకు వ్యతిరేక మైనదియు, అపకీర్తి నొసగు నదియునగు ఈ అజ్ఞానము ఈ విషమ సమయమున నీకెట్లు ప్రాప్తి౦చినది?

శ్రీకృష్ణుడు మమకారంతో, స్వీయ జాలితో కుప్పకూలిన అర్జునుని చూచి, "నీకు ఈ నిరాశ, విచారం ఎక్కడినుంచి వచ్చేయి అర్జునా? వీటిని తొలగించుకో. నీ హృదయంలో ఉండే నేను వాటితో కలసి ఉండలేను" అని చెప్పెను.

శ్రీకృష్ణుడు ఇక్కడ అనార్య అనే పదాన్ని ప్రయోగించేడు. దాని అర్థం తగనిది లేదా అయోగ్యమైనది. ఇక్కడ అర్జునుని నడవడిక అయోగ్యమైనది. మనము జంతువులనుండి పరిణామం చెంది మానవులమైనాము. మనను జంతువులనుండి వేరు చేసే గుణ౦: మన స్వార్థంతో కూడిన కోర్కెలను విడచి, పరోపకారము చేసి ఇతరులకు ఆనందం కలిగించడం.

నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా ఆధ్యాత్మిక గురువు ఇంట్లో మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాను. నా గురువుకి ఒక గోశాల ఉంది. అక్కడున్న ఆవులు ఆవిడకు కావలసిన పాలు, వెన్న, పెరుగు ఇస్తాయి. ఆమె రోజూ ఆ గోశాలను శుభ్రం చేసి ఆవులకు గడ్డి, కుడితి ఇస్తూ ఉంటుంది. నా మిత్రులలో ఒకడు అది చూసి హేళన చేసేడు. వాడి మాటలు విన్న నా గురువు వాడి దగ్గరకు వచ్చి "నువ్వా గోశాల లోపలికి వెళ్ళు. నీ చోటు అక్కడే. నేను రోజూ నీకు గడ్డి, కుడితి ఇస్తాను" అని అన్నది. ఈ విధంగా కఠినంగా మాట్లాడితేనే గానీ ప్రేమించిన వారు దారికి రారు.

మనము సూటూ, బూటూ వేసుకొని తిరిగినంత మాత్రాన మనుష్యుల మవ్వలేదు. నిజమైన మానవత్వం మన స్వార్థాన్ని విస్మరి౦చి, మనను ద్వేషించినవారిని క్షమి౦చడం వంటి సద్గుణాలు కలిగి ఉండడం.

ఇక్కడ శ్రీకృష్ణుడు అస్వర్గ్య అనే పదాన్ని వాడుతాడు. అంటే "అహంకారాన్ని వీడక, స్వచ్ఛంద భావాలను విస్మరించక, ఎడబాటు కోరుతూ నీలోని స్వర్గం యొక్క తలుపులను బంధించేవు" అని అన్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తామసంతో, భయంతో, విచారంతో ఉన్న అర్జునునుని మేల్కొల్పేడు. 51

Eknath Gita Chapter 2 Section 1

Bhagavat Gita

2.1

తం తథా కృపయా విష్ట మశ్రుపూర్ణాకులేక్షణమ్ {2.1}

విషీదంత మిదం వాక్య మువాచ మధుసూదనః

ఈ ప్రకారము కరుణచే ఆవేశింపబడి, కన్నీరు కార్చుచు వ్యాకులమైన దృష్టిని కలిగియున్న అర్జునునితో మధుసూదనుడు డిట్లు పలుకసాగెను

అర్జునుడు మమకారముతో ఇతరులు తనకు చేయబోయే హాని గురించి తలచుచున్నాడే గాని, వేరే కారణం వలన కాదు. శ్రీకృష్ణుడు అటువంటి స్థితిలోనున్న అర్జునునిపై మిక్కిలి కఠినముగా స్పందించబోతాడు. ఒక మంచి ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణునివలె మమకారముతో ఉన్న శిష్యుని మందలిస్తాడు. అలాగే సమయం వచ్చినపుడు తన శిష్యుని సున్నితంగా, దయతో, మంచి మాటలతో బుజ్జగిస్తాడు.

నా ఆధ్యాత్మిక గురువైన అమ్మను నేను ఇతరులు నన్నెందుకు బాధ పెడుతున్నారని ఏడుస్తూ అడిగేను. ఆమె సాధారణంగా సౌమ్యంగా ఉంటుంది. అవసరమైతే కఠినంగా ఉండగలదు. ఈ మారు ఆమె సౌమ్యంగా స్పందించి నేను నాపై ఉన్న జాలితో ఏడుస్తున్నాను గాని వేరే కారణం వలన కాదని మందలించింది. మనం ఇతరుల గూర్చి బాధపడితే అది దుఃఖం. అది మన మానసిక స్థితిని వృద్ధిచేస్తుంది. కానీ మన మీద మనం జాలి పడితే దౌర్భల్య౦ కలుగజేస్తుంది.

ఒక ఎనుము బురద గుంట కనిపిస్తే అందులో పొరలి ఒళ్ళంతా బురదతో రాసుకుంటుంది. అలాగే అర్జునుని మమకారం కూడా పిరికితనము అతనికి ఆపాదించింది. దాన్ని శ్రీకృష్ణుడు ఖండించ బోతాడు. మనము తలిదండ్రులు మనను కఠిన౦గా మందలించనపుడు వాడిన మాటలు, సహధర్మచారిణి కోపంతో పలికిన పలుకులు, కొన్నేళ్ళ తరువాత గుర్తుకుతెచ్చుకొని బాధ పడుతూ ఉంటాము. ఇది తగని పని.

అర్జునుడు ఒక చిన్న పిల్లవాడి వలె తనపైనున్న జాలితో కన్నీరు కారుస్తూ ఏదీ స్పష్టంగా చూడలేక పోతున్నాడు. మనము మనపై జాలితో ఉన్నప్పుడు మన బంధుమిత్రులను క్రూరులుగాను, మనల్ని బాధ పెట్టే వారలగాను-- వారు నిజంగా అలాంటి వారు కాకపోయినా-- తలుస్తాము. ఎందుకంటే స్వీయ జాలి మన మనస్సులో వికల్పం కలిగించి ఏదీ స్పష్టంగా కనపడకుండా చేస్తుంది.

పరిస్థితి విషమించక ముందే విచారంతో ఉన్న అర్జునుని ఇప్పుడు శ్రీకృష్ణుడు మందలించ వలసిందే. ఈ విధంగా శ్రీకృష్ణుడు వానిపై ఉన్న ప్రేమను ప్రకటించగలడు. 49

Wendy Doniger Rig Veda Boy and Chariot

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...