Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 14

Bhagavat Gita

3.14

తస్మా దసక్త స్సతతం కార్యం కర్మ సమాచర {3.19}

అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః

అందువలన, ఫలాశలేనివాడవై నియత కర్మను సదా ఆచరింపుము. ఫలాశలేక కర్మ నాచరించు మనుజుడు మోక్షమును పొందుచున్నాడు

శ్రీకృష్ణుడు అర్జునునికి, అంటే మనకి, అహంకారాన్ని పరిత్యజించి పరోపకారనికై నిస్వార్థ సేవ చెయ్యమని బోధిస్తున్నాడు. అలాగ కర్మ చెయ్యడంలో స్వతంత్రత ఉంటే, మనము దేవుని చేతిలో పనిముట్లమని తెలుసుకొంటాం. ఇది మనను ఉత్సాహ పరచి, దేవునికి ఒక సంపూర్ణమైన పనిముట్టు కావాలనే స్పూర్తినిస్తుంది. మనము పెద్ద బరువు బాధ్యతలు మోస్తున్నామని అనుకుంటాం. మన వెనక దేవుడు మన బరువును మోయడానికి సంసిద్ధుడై ఉన్నాడు.

నా చిన్నప్పటి ఊరులో రోడ్డు ప్రక్కన చిన్న గోడలు౦డేవి. పూర్వం రోజుల్లో బరువు నెత్తి మీద పెట్టుకొని మోసి, కొంత విశ్రాంతికై, బరువును గోడమీద పెట్టేవారు. మనం స్వార్థంగా ఉంటే దేవుడు ఒక పెద్ద గోడవలె ఉంటాడు. అంటే మనము బరువుని ఆయన మీద పెట్టలేము. మనము సాధారణంగా ఉంటే గోడ మన ఎత్తు ఉండి, బరువు ఆయన మీద పెట్టవచ్చు. అదే నిస్వార్థ పరులకు గోడ అవసరం లేదు ఎందుకంటే వారు మోసేది బరువు కాదు. ధ్యానం ద్వారా మన బరువుని దేవునిపై వేయగలం. తద్వారా మనము ఎటువంటి సవాలునైనా సులువుగా, సమభావముతో ఎదుర్కోగలము. 169

Eknath Gita Chapter 3 Section 13

Bhagavat Gita

3.13

యస్త్వాత్మరతి రేవ స్యా దాత్మ తృప్తశ్చ మానవః {3.17}

ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే

ఆత్మయందే రమించుచు, ఆత్మయందే తృప్తిచెందుచు, ఆత్మయందే ఆనందించు వానికి చేయదగిన కార్య మేదియును లేదు

నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన {3.18}

న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః

ఈ లోకమున కర్మ లాచరించుట వలన వానికి ప్రయోజనము లేదు. ఆచరింపనిచో దోషము ప్రాప్తించదు. సర్వ ప్రాణులయందును అతనికి ప్రయోజన రూపమైన దేదియును లేదు

మనం లాభం లేదా పేరుప్రతిష్ఠలకై బ్రతికినంత కాలము స్వతంత్రత అనుభవించలేము. గాంధీ మహాత్ముడు విసుగు విరామం లేకుండా రోజూ 15 గంటలు పనిచేసేవారు. సత్యాగ్రహ దశలో ఆయనను నమ్మి ఎందరో ఆయన అనుచరులయ్యారు. వారి బాగోగులు చూడడం ఆయన బాధ్యత. ఆయన స్వంతంత్రంగా పనిచేయడానికి కారణం నిస్వార్థ సేవ. గీత చెప్పేది, స్వార్థంతో చేసే ప్రతి పనీ, ఎంత చిన్నదైనా, కళ౦కమైనది. గాంధీ అడుగుజాడల్లో నడవాలంటే ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి మనకు గౌరవం, ప్రతిష్ఠ కలుగుతుందనే ఆశపడక పని చెయ్యాలి.

మనకు బాహ్య వస్తువుపై కోర్కె ఉన్నంత కాలం మన చేతన మనస్సులో అగాథమున్నది. ఒకడు తనవద్ద కోట్ల సొమ్ము ఉంటే ఆనందపడగలనని అనుకుంటే, వాడు దివాలా తియ్యడానికై ఉన్నాడు. అలాగే ప్రధాన మంత్రి అవ్వాలనుకునేవాడు తన మనస్సులోని ఆగాథాన్ని వ్యక్త పరుస్తున్నాడు. మనము ఒకరు లేదా ఒకటి ఉంటే ఆనందంగా ఉంటామని అనుకుంటే, మనము ఇతరులను మభ్య పెట్టడం లేదా అచేతనంగా మన ప్రియమైన బంధుమిత్రులను మోసం చెయ్యడమే. శ్రీకృష్ణుడు చెప్పింది: మీరు స్వతంత్రంగా కర్మ చెయ్యాలనుకుంటే, అహంకారం, వేర్పాటు తొలగించుకోవడానికి తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన చెయ్యండి. 168

Eknath Gita Chapter 3 Section 12

Bhagavat Gita

3.12

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహ యః {3.16}

అఘాయ రి౦ద్రియారామో మోఘం పార్థ స జీవతి

పార్థా! ఈ విధముగా నియమింపబడిన జగచ్చక్రమును అనుసరించని వాడు ఇంద్రియలోలుడై పాపజీవనమును గడుపుచున్నాడు.

భగవంతుడు మన దేహంలోని ప్రతి అణువులో నిస్వార్థత నిక్షిప్త పరచేడు. దాన్నే బుద్ధుడు ధర్మ అంటాడు. మానవుని యొక్క ధర్మము: క్రోధాన్ని దయగా, ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోవడం. యోగులు చెప్పేది: ఎవరైతే తమ సౌఖ్యం కొరకే జీవితం గడుపుతారో వారు మరణిస్తారు; కానీ ఎవరైతే ఇతరుల కొరకై జీవిస్తారో వారు ఆనందంతో, సంపూర్ణంగా ఉంటారు. "కన్నుకి కన్ను, పన్నుకి పన్ను" అనే హింసావాదం చెప్పడానికి సులభమే. కానీ మనస్సు క్రోధంతో నిండి ఉంటే దాని నిశ్చలం చేసికోవడానికి అమితమైన ధైర్యం, సహనం కావాలి.

మనమెంత అహంకారాన్ని నియాంత్రిస్తామో అంత ఎక్కువగా ఆత్మ జ్ఞానాన్ని, ప్రేమని పొందుతాము. మనము స్వార్థానికై -- కోర్కెలు, అమిత లాభం, పేరుప్రతిష్ఠ -- ఒక ముసుగు వేసికొన్నాము. దాన్ని తీసేయాలంటే మనస్సును నిర్మలం చేసికొని దేవుని ఆరాధించాలి. మంత్ర జపాన్ని తరచు చేస్తూ ఉంటే మనలో క్రోధము లేదా భయము కలిగితే, మంత్రాన్ని జపిస్తూ, వేర్పాటు లేకుండా ఇతరులతో దగ్గరవడానికి ప్రయత్నిస్తే మన ముసుగు క్రమంగా తీయబడుతుంది. తద్వారా ఎనలేని ఆనందం అనుభవిస్తాము.

శ్రీకృష్ణుడు తన మురళిని వాయిస్తూ ఉంటే రాధ అసూయతో "నువ్వు గంటల తరబడి వాయించే మురళి నీ పెదవులను తాకి ఉండడానికి చేసిన పుణ్యమేమిటి?" అని అడిగింది. శ్రీకృష్ణుడు మురళిని రాధకు చూపి "చూడు దీనిలో అంతా ఖాళీ. కాబట్టి నా వాయిద్యం చాలా సులువవుతుంది" అని అన్నాడు. మనం కూడా స్వార్థ పూరిత కర్మలు, వేర్పాటు త్యజిస్తే మనలో ఖాళీ ఏర్పడి, దాన్ని దేవుని ప్రేమతో, ఆనందంగా నింపవచ్చు. 167

Eknath Gita Chapter 3 Section 11

Bhagavat Gita

3.11

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మో అక్షర సముద్భవమ్ {3.15}

తస్మా త్సర్వ గతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్

వేదము నుండి కర్మ జనించినది. వేదము పరమాత్మ నుండి ఆవిర్భవించినది. కనుక సర్వగతమైన బ్రహ్మము ఎల్లప్పుడు యజ్ఞమునందు ప్రతిష్ఠితమై యున్నాడని గ్రహింపుము

మనం బ్రాహ్మణులనిపించుకోవడానికి జంధ్యం వేసికోనక్కరలేదు లేదా బాహ్య శుద్ధి మాత్రమే చేసికోనక్కరలేదు. ఎవరైతే తమలోని బ్రహ్మన్ ని తెలిసికోవాలని ప్రయత్నిస్తాడో అతడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణులను ద్విజ అనికూడా అంటారు. ద్విజుడు అంటే రెండుమార్లు పుట్టినవాడు. సంప్రదాయం ప్రకారం మొదటి పుట్టుక తల్లి గర్భం నుంచి ఆవిర్భవిస్తుంది. ఇది భౌతికమైనది. రెండవ పుట్టుక అహంకారం తుడిచి వేసినప్పుడు కలుగుతుంది. మనమనుకోవచ్చు స్వార్థం, వేర్పాటు, కోర్కెలు పోగొట్టుకుంటే దహన సంస్కారాలు అవసరమా అని. అట్టివాని దహనం భాజాభజంత్రీలతో, హరేరామ నినాదాలతో, పూల వానతో చెయ్యాలి. ఎందుకంటే తన అహంకారాన్ని చంపుకొని అతడు తక్కిన వారందరికీ ఎనలేని సేవ చేసేడు. వాని జీవితం ఎలా ఉన్నా, మనకది ఆదర్శప్రాయమై, స్పూర్తినిస్తుంది. అదే మన జన్మ యొక్క పరాకాష్ఠ. మైస్టర్ ఎక్హార్ట్ రెండవ పుట్టుకను "గొప్ప అతలాకుతలం" అంటారు; ఎందుకంటే ప్రతి అవరోధాన్నీ దాటగలిగే ఓర్పు, ఆత్మార్పణ అవసరం.

అహంకారాన్ని చంపుకోవాలనే కోర్కె, దానికి కావలసిన దక్షత భగవంతుని ప్రసాదం. మనలో చాలామంది సామాన్యమైన బడుగు జీవితం గడుపుతారు. అట్టివారలని భగవంతుడు కరుణిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. నేను అనేకమార్లు ఉదయాన్నే నిద్ర లేచి "నాకంటే తక్కువ ఎవడైనా నిన్ను పొందడానికి అర్హుడా?" అని అనేవాడిని. చివరకు అణకువతో, భగవంతుని కరుణకు పాత్రుడనై, జీవితంలో ఎంతో ఆనందం పొందేను. 166

Eknath Gita Chapter 3 Section 10

Bhagavat Gita

3.10

అన్నా ద్భవన్తి భూతాని పర్జన్యా దన్న సంభవః {3.14}

యజ్ఞా ద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః

అన్నము వలన ప్రాణులు పుట్టుచున్నవి. మేఘము వలన అన్నము కలుగుచున్నది. యజ్ఞము వలన మేఘము ఏర్పడుచున్నది. అట్టి యజ్ఞము కర్మవలననే సంభవమగుచున్నది

శ్రీకృష్ణుడు మనల్ని పౌష్ఠిక ఆహారము మితంగా, తగిన సమయములో, బంధుమిత్రులతో కలిసి తినాలని చెప్పేడు.

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ప్రకృతిలో ఉన్న సున్నితమైన అంశాలను గూర్చి చెప్తున్నాడు. నేటి శాస్త్రజ్ఞులు మన కర్మలు ప్రకృతి లోని సమత్వాన్ని పాడు చేస్తున్నాయని చెప్తున్నారు. కొన్ని దేశాల్లో అడవుల్లోని చెట్లు నరికి, చెట్లు లేనందున వర్షాలు పడక వాపోతున్నారు. గాంధీ మహాత్ముడు ఎంత పొదుపు పాటించేవారంటే, ఎన్నో ఉత్తరాలు, దిన పత్రికలలోని ఖాళీ జాగాపై వ్రాసేవారు. ఎందుకంటే పత్రికలు కాగితంపై సిరాతో ముద్రి౦పబడిన అక్షరాల సముదాయం. కాగితం చెట్లను నరికి వాటి కలపచే చేయబడినది. కాబట్టి మనం వాడే ప్రతీ పుస్తకం, వ్రాసే ప్రతి తెల్ల కాగితం, చివరకు చెట్ల వలనే ఆవిర్భవించేయి. అనవసరమైన పుస్తకాలు కొని చదవకుండా అనేక చెట్లను రక్షించవచ్చు.

పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి మన అలవాట్లను, నడవడికను మార్చుకోవాలి. అంటే క్రొత్త పద్దతులు నేర్చుకొని పాతవి వదిలేయాలి. దీనికి ధ్యానం చాలా సహకరిస్తుంది. ముఖ్యంగా మనలోని స్వార్థాన్ని, క్రోధాన్ని, నిస్వార్థంగా, దయగా మార్చుకోవాలి. నా అమ్మమ్మ ఏనుగులు తమ పరిమాణాన్ని తెలిసికోలేవు అంటుంది. ఎందుకంటే వాటి కళ్ళు, దేహంతో పోలిస్తే, అతి చిన్నవి. అలాగే మనమూ మనమనుకున్న పరిమాణం కన్న ఎక్కువ. ఎందుకంటే మనలో దేవుడు ప్రతిష్ఠుతుడై ఉన్నాడు. మనము మనల్ని అర్థం చేసికొంటే "ఎంత పెద్ద, ఎంత విచిత్రం, ఎంత పరాక్రమం?" అని అనుకొంటాం. మనలోని దైవత్వాన్ని తెలిసికొంటే, ఎటువంటి సమస్యనైనా -- కాలుష్యం, హింస, యుద్ధం-- పరిష్కరించగలం. మన మార్పు ఇతరులను కూడా ప్రభావితం చేసి, వాళ్ళను స్పందింప జేస్తుంది. ఈ విధంగా ఎటువంటి సవాలు వచ్చినా, ఎటువంటి ప్రమాదాలు మనల్ని మింగేస్తున్నా, మనమెప్పటికీ భయపడ నక్కరలేదు, ఎందుకంటే సమస్త శక్తికి, జ్ఞానానికి, సౌందర్యానికి కారకుడైన భగవంతుడు మనలో ఉన్నాడు. 165

Eknath Gita Chapter 3 Section 9

Bhagavat Gita

3.9

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్య౦తే యజ్ఞభావితాః {3.12}

తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః

యజ్ఞములచే తృప్తిచెందిన దేవతలు మీకు ఇష్టములైన భోగములను అనుగ్రహింతురు. వారిచ్చిన భోగములను వారికి సమర్పించక భుజించవాడు చోరుడగును

యజ్ఞ శిష్టాశిన స్స౦తో ముచ్యన్తే సర్వ కిల్బిషైః {3.13}

తే త్వఘం భుంజతే పాపా యే పచ౦ త్యాత్మకారణాత్

యజ్ఞ శేషమును భుజించు సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తి నొందుచున్నారు. ఎవరు తమ కొరకే వండు కొనుచున్నారో వారు పాపమునే భుజించుచున్నారు

శ్రీకృష్ణుడు ఎవరైతే, పరోపకారము చెయ్యకుండా, తమ ఆనందానికై, లాభానికై, లేదా పేరుప్రతిష్ఠలకై ప్రాకులాడుతారో వారిని స్తేన -- అనగా దొంగలు-- అంటున్నాడు. మనం చేసే కర్మలకు అతి గొప్ప కారణ౦: పరులకు చేసే సేవ. అందుకే దేవుడు మనకు జీవితం, సమయం, శక్తినిచ్చేడు.

నాలుక రుచికై తినడం, హోటల్ లలో తరచూ భోజనం చెయ్యడం, కనీవినీ ఎరుగని పదార్థాలు తినడం ఉత్తమం కాదు. సాత్త్వికమైన పోషకాహారము వండి, ప్రేమతో ఇవ్వబడినదైతే మన దేహాన్ని, మనస్సుని బలంగా చేస్తుంది. ఇది సాధనకు చాలా అవసరం.

పోషకాహారాన్ని తినడం తప్పు కాదు. కానీ దాన్ని అదే పనిగా తినక్కరలేదు. ధ్యానంలో మన మనస్సు చిరు తిండ్ల మీదకు పోతే అది విచారకరం. అలాగే తిండిగూర్చి సదా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదు. చైనా దేశస్థుడు హుయా౦గ్ పో ఇలా అన్నారు: "భోజనం రెండు రకాలు: ఇంద్రియాలను మెప్పించేది లేదా జ్ఞానాన్ని పెంపొందించేది. దేహానికి ఆకలి కలిగితే, ఆశతో కాక, మితంగా తింటే అది జ్ఞానాన్ని పెంచేది. కానీ అదే పనిగా ఆహారాన్ని తింటూ ఉండడం మంచిది కాదు. కేవలం నాలుక కోరేదాన్ని తినడం ఇంద్రియాలను మెప్పించే తిండి".

మనము ఆహారం ద్వారా పొందే శక్తిని ఎలాగ ఉపయోగిస్తున్నామో కూడా ముఖ్యం. జీసస్ ఫారిసీస్ కు ఇలాగ బోధించేరు: "నోటిలో పెట్టుకునేది మనల్ని అపవిత్రులను చెయ్యదు; నోటి నుంచి బయటకు వచ్చేది మనకు ముప్పు తెస్తుంది." ఎంతో ఖరీదు పెట్టి రసాయనాలతో పండించని ఆహారం తింటూ కూడా, మన౦ హింస చేస్తూ; ద్వేషం, అసూయ వంటి గుణాలతో ఉంటే ఏమి లాభం? అదే మన శక్తితో దీనుల కన్నీళ్ళు తుడిచివేసి, పరోపకారం చేస్తే మన కళ్ళు వికసించి, మన జీవితం కష్టాలతో నిండి ఉన్న ప్రపంచానికి మార్గదర్శక మవుతుంది 164

Eknath Gita Chapter 3 Section 8

Bhagavat Gita

3.8

దేవాన్ భావయతా అనేన తే దేవా భావయంతు వః {3.11}

పరస్పరం భావయంత శ్శ్రేయః పర మవాప్స్యథ

ఈ యజ్ఞములతో మీరు దేవతలను పూజించండి. పూజింపబడిన దేవతలు మిమ్ములను సంతృప్తి పరచెదరు. ఈ విధముగ పరస్పరము వృద్ధి చేసికొనుచు మీరు ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుదురు

శ్రీకృష్ణుడు దేవ అనే పదాన్ని మన ముందు పెట్టేడు. దేవ అనగా దైవీ స్వభావం గలవాడు, లేదా మిక్కిలి కాంతితో కూడి ఉన్నవాడు. కళాకారులు ఒక ఋషి చిత్రం గీసినప్పుడు, తల చుట్టూ కాంతి వలయం గీస్తారు. అలాగే ఒక స్వార్థపరుడి చిత్రం గీస్తే నల్లని మబ్బు వాని తలచుట్టూ గీస్తారు. ఎలాగైతే ఋషి కాంతిని పెంపొందిస్తాడో, స్వార్థపరుడు చీకటిని కలిగిస్తాడు.

సంస్కృత గ్రంథాల్లో ఒక పురుషుడు స్త్రీని దేవి అని సంబోధిస్తాడు. దేవి అనగా పరా శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. మనమెప్పుడైతే ఒక స్త్రీని దేవి అని సంబోధిస్తామో ఆమె కరుణతో, సహనంతో, ఓర్పుతో మన యందు ఉంటుందని భావించవచ్చు.

మనయొక్క దైవత్వాన్ని ప్రతిరోజూ నడవడికతో ప్రదర్శిస్తే మనమందరమూ దేవ లేదా దేవి లమవుతాము. నేను పెరిగిన గ్రామంలో ఆడవారు ఉదయాన్నే లేచి తమ భర్తలకోసం, పిల్లలకోసం వంట వండేవారు. నాకు తెలిసి ఈ రోజుల్లో భార్య పడుకుంటే, భర్త ఆమెకై వంట చేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో భర్త భార్యను ప్రేమతో నిద్ర లేపి ఆమె చేతివంట తినాలని చెప్పాలి. నా ఊరిలో చిన్న బాలికలు తమ నాన్నలకు, తమ్ముళ్లకు, మామలకు, తాతలకు సేవ చేసేవారు. వాళ్ళు మగవాళ్లకు సేవ చేస్తూ తమని తాము మర్చిపోయేవారు. ప్రేమని పొంది, దాన్ని నిలబెట్టుకోవడం ఒక కళ అని చెప్పవచ్చు. కాబట్టి దానికై శ్రమించి, అందరి యందు ప్రేమతో ఉండి, అందరికీ సహాయం చేసి, దేవ లేదా దేవి అనిపించుకోవాలి. 162

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...