Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 19

Bhagavat Gita

3.19

న బుద్ధి భేదం జనయే దజ్ఞానం కర్మసంగినామ్ {3.26}

జోషయే త్సర్వకర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్

జ్ఞాని యగువాడు అజ్ఞానుల బుద్ధిని కలతపెట్టరాదు. తాను యోగయుక్తుడై సర్వ కర్మముల నాచరించుచు కర్మాసక్తులగు వారను తనను అనుకరించునట్లు ప్రవర్తించవలెను

శ్రీకృష్ణుడు అర్జునునితో "నువ్వు సదా నీ బంధుమిత్రులనే కాక ప్రత్యర్థులను కూడా ప్రభావితం చేస్తున్నావు" అన్నాడు. మనము ప్రత్యర్థులను ద్వేషిస్తే, వారిని మనను ద్వేషించే విధంగా ప్రోత్సాహిస్తున్నాము. అలాగే వారిపై దాడులు జరిపితే, వారిని మనపై దాడి చేయమని సంకేతం. కానీ వారిని క్షమిస్తే, వారూ మనల్ని క్షమించి, మనతో సంధి చేసుకొంటారు.

గాంధీజీ తన ప్రత్యర్థులను తన వైపు త్రిప్పుకోవడంలో సిద్ధహస్తులు. ఆయన ప్రియమైన గీతం "వైష్ణవ జనితో". అంటే ప్రేమతో ద్వేషాన్ని మార్చే దేవునికది చిహ్నం. మనం దేవుని ప్రేమించాలంటే, మనల్ని ద్వేషించేవారిని ప్రేమించాలి. అలా చేస్తే దేవుని కృప వలన ఆయనతో ఐక్యమవుతాం. 179

Eknath Gita Chapter 3 Section 18

Bhagavat Gita

3.18

సక్తాః కర్మ ణ్యవిద్వా౦సో యథా కుర్వన్తి భారత {3.25}

కుర్యా ద్విద్వా౦ స్తథా అసక్త శ్చికీర్షు ర్లోక సంగ్రహమ్

అర్జునా! అజ్ఞానులగు జనులు ఫలాశతో ఏ విధముగ కర్మల నాచరింతురో, అలాగే జ్ఞానులు ఫలాపేక్ష లేక లోక కళ్యాణార్థము కర్మల నాచరింపవలెను

స్వలాభానికై, ఆనందానికై, పేరుప్రతిష్ఠలకై ప్రాకులాడకూడదని చెప్పడం చాలా మంది విషయాలలో వ్యర్థం. ఎందుకంటే మనము వాటిని సాధించాలనే ఉద్దేశంతో పెరిగేం. తిరుగుబాటుదారు లేదా విప్లవకారుడు అనే పదాల్ని ప్రసార మాధ్యమాలలో వింటాం. చాలామంది దానిని తప్పుగా అర్థం చేసుకొంటారు. విప్లవకారుల మవ్వాలంటే ఎంతో సాహసం, ఓర్పు, దేవునిమీద విశ్వాసం ఉండాలి. మన కోర్కెలకు, ఇంద్రియాలకు ఎదురు తిరగడం నిజమైన విప్లవం. మనకు తెలిసిన పెద్ద విప్లవకారుడు, జీసస్ "నీ శత్రువులను ప్రేమించు; నిన్ను తిట్టేవారిని క్షమించు; నిన్ను ద్వేషించే వారికి మంచి చెయ్యి" అని చెప్పేరు. బుద్ధుడు తన నిర్వాణ బోధతో పెద్ద విప్లవం కలిగించేడు. అతడు మన అహంకారాన్ని, దేహాభిమానాన్ని వదులుకోమని బోధించేడు. ఇతరులకు విప్లవంతో ప్రభావితం చెయ్యాలంటే వారిపై ఒత్తిడి పెట్టకూడదు. మన కుటుంబం, సమాజం, దేశం ఆధ్యాత్మిక జ్ఞానంతో ఎలాగ ఐకమత్యంగా ఉంటుందో చేసి చూపించాలి. శ్రీకృష్ణుడు "భారత దేశాన్ని ప్రభావితం చెయ్యాలంటే స్వార్థాన్ని, స్వలాభాన్ని, కుతంత్రాలని పోగొట్టుకో" అని అర్జునునికి బోధిస్తున్నాడు.

గాంధీ మహాత్ముడు దీనికి తార్కాణము. అతడు కుటీరంలో నివసిస్తూ తన వద్దకు వచ్చిన వీధులు ఊడ్చే మనిషినీ, బ్రిటిష్ సామ్రాజ్య పౌరుడినీ ఒకేలాగ ఆదరించి, గౌరవించేవారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన రాజ భవనంలో నివసించక తన కుటీరంలోనే చివరివరకూ జీవనం సాగించేరు. ఆయన తనకు ఎటువంటి బహుమానాలు అక్కరలేదని, తన అహింసా వాదాన్ని ప్రపంచమంతా ఒప్పుకొని, పాటిస్తే చాలని అనేవారు. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకుంటుంటే ఆయన ధ్యానం చేసేరు.

మనకు మనశ్శాంతి కావాలంటే మన హృదయంలోనూ, ఇంట్లోనూ శాంతియుతంగా ఉండాలి. అది కుటుంబ సభ్యుల మధ్య సంపూర్ణమైన ప్రేమ వలననే సాధ్యం. క్రమంగా ఆ ప్రేమని వ్యాపింపజేస్తే ప్రపంచాన్ని దాని పరిధిలోకి తెస్తాం. 178

Eknath Gita Chapter 3 Section 17

Bhagavat Gita

3.17

న మే పార్థాసి కర్తవ్యం త్రిను లోకేషు కించన {3.22}

నా నవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి

అర్జునా! ముల్లోకముల యందును నేను చేయవలసిన కార్య మేదియును లేదు. నేను పొందనిది, పొందవలసినది ఏదియు లేదు. అయినను నేను కర్మలను చేయుచునే యున్నాను

యది హ్యహం నవర్తేయ౦ జాతు కర్మణ్య తంద్రితః {3.23}

మమ వర్త్మాను వర్తం తే మనుష్యాః పార్థ సర్వశః

పార్థా! నేను అశ్రద్ధతో కర్మల నాచరింపకున్నచో జనులు సర్వవిధముల నా మార్గము ననుసరించియే ప్రవర్తించుచుందురు

ఉత్సీదేయు రిమే లోకా న కుర్యా౦ కర్మ చేదహం {3.24}

సంకరస్య చ కర్తా స్యా ముపహన్యా మిమాన్ ప్రజాః

నేను కర్మ చేయనిచో ఈ లోకము లన్నియు భ్రష్ఠమగును. వర్ణ సంకరమునకు నేను కారణమగుదును. జనులను చెడిపిన వాడనగుదును

పురాణాల్లో ఒక సాలెపురుగు తన చుట్టూ గూడు కట్టుకున్నట్లు, బ్రహ్మన్ విశ్వాన్ని సృష్టించి దాని మధ్య ప్రతిష్ఠిత మైందని చెప్తారు. అక్కడితో దాని పని అయిపోలేదు. అనేక మార్లు అవతారాలు దాల్చి మానవాళి పురోభివృద్ధికై నిరంతరము పాటు పడుతుంది.

కలియుగంలో బ్రహ్మన్ వరసగా అవతారాలను దాల్చింది. మనకే దేవుని మీద ప్రేమ ఉంటే, "మేము ధ్యానం చేస్తూ, నీ యందు భక్తితో ఉండి, అన్నీ మంచి పనులే చేస్తామని" ప్రార్ధించేవాళ్ళం. ఉదాహరణకి ప్రతి ఏటా వచ్చే శివరాత్రి: శివుడు సంవత్సరం పొడుగునా రాత్రింబవళ్ళు మన గురించై పని చేసినందుకు, సంవత్సరంలో ఒక్క రోజు విశ్రాంతి తీసికోమని ప్రార్ధిస్తా౦. మనం దేవుని మీద ప్రేమ పలు విధాలుగా ప్రకటించు కోవచ్చు: అహంకారం త్యజించి, బంధుమిత్రులకు నిస్వార్థ సేవ చేసి, మొదలైనవి.

ఒక క్రొత్త అవతారం దాల్చి మనకు తెలియని సత్యాలు తెలపడానికి, లేదా ఒక క్రొత్త మత స్థాపనకు దేవుడు పూనుకోలేదు. మనకు ఒకప్పుడు తెలిసిన విషయాలే గుర్తుకు తెప్పించడానికి అవతారం దాలుస్తున్నాడు. మనము దేహము, మనస్సు, అహంకారం, బుద్ధి కాము. మన నిజ స్వరూపం ప్రేమ. అది శాశ్వతమైనది, మార్పు లేనిది. ఇతరులను కష్టపెడితే, మనను బాధ పెట్టుకున్నట్టే. అలాగే ఇతరులకు మేలు చేసి ఆనందింపజేస్తే, మన చేతనములో ఆనందంగా మిగిలిపోతుంది. 177

Eknath Gita Chapter 3 Section 16

Bhagavat Gita

13.16

యద్య దాచరతి శ్రేష్ఠ స్సత్త దేవేతరో జనః {3.21}

స యత్ప్రమాణం కురుతే లోక స్త దనువర్తతే

శ్రేష్ఠుడగువాడు దేనిని ఆచరించునో ఇతరులు దానినే అనుసరి౦తురు. దేనిని ప్రమాణముగ స్వీకరించునో ఇతరులును దానినే ప్రమాణముగ స్వీకరి౦తురు

ఆధ్యాత్మికంగా , మానసికంగా, భౌతికంగా మనమెంత మేధావులమైతే, అంత ప్రపంచానికి సేవ చేసే బాధ్యత మనకుంది. ధ్యానం చేస్తూ ఉంటే మనకు లోతైన ఆలోచనలు కలిగి, ఇతరులకు మాటలద్వారా లేదా వ్రాతల ద్వారా బాధ కలిగించకూడదు;అలాగే మిత్రుల, కుటుంబాల, సమాజాల, జాతుల, దేశాల మధ్య వేర్పాటు కలిగించకూడదు అని తెలుస్తుంది.

మనలోని తలిదండ్రులతో, పిల్లలు ఇంకా కలిసి ఉంటే, వాళ్ళని మనం ప్రభావిత పరుస్తాం . వాళ్ళు మన వేషభాషలను అనుకరిస్తారు. అందుకే మన మాటలతో, ఆలోచనలతో, నడవడికతో వారికి మనము ఆదర్శప్రాయంగా ఉండాలి.

ఒకరోజు నా మరదళ్ళు మీరా, గీత ఇంట్లోకి బురద అంటుకున్న చెప్పులు వేసికొని వచ్చేరు. నేను ఎందుకలా చేసేరు అని అడిగితే నేనూ క్రిందటి రోజు అదే చేసేనని చెప్పేరు. మరుసటి రోజు నేను చెప్పులు బయట తీసివేస్తే, వారూ అదే పని చేసేరు. అలాగే నేను నా కలాన్ని ఎప్పుడూ ఒక చోట పెట్టేవాడిని. ఒకరోజు అది పెట్టిన చోట లేదు. నేను చిరునవ్వుతో "మీరు నా కలాన్ని చూసేరా?" అని అడిగేను. అప్పుడు నా మరదళ్ళు నా కలాన్ని తెచ్చి ఇచ్చేరు. ఆ కలం దొరికిందా లేదా అన్నదిక్కడ విషయం కాదు. నేను నా పిల్లలతో సహనంతో ఉన్నానా లేదా అన్నది ముఖ్యం.

పిల్లలు మన సహాన శీలతను నిరంతరం పరీక్షిస్తారు. మనలో చాలామంది చిరాకుతో, కోపంతో ప్రతిస్పందిస్తారు. అలాకాక మంత్ర జపం చేసికొని, ఓర్పుతో వాళ్ళు చెప్పింది వినాలి. సదా దేవుడ్ని --మన శక్తి దాయకుడ్ని -- తలుచుకొంటూ, ఇతరులు మనను ఉదాహరణగా చేసికొనేటట్లు మెలగాలి.

నేను ఈ కాలంలో పిల్లలు మాదక ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారని చదివేను. తలిదండ్రులు నిద్ర మాత్రలు, మానసిక స్థితిని మార్చే మందులు వేసుకొంటే, పిల్లలు కూడా వారిని అనుకరిస్తారు. అలాగే తలిదండ్రులు పిల్లలముందు ధూమపానము, మద్యము త్రాగడం చెయ్యకూడదు. మనకున్న పెద్ద మత్తు పదార్థము దేవుడని తెలిసికొంటే పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు. 175

Eknath Gita Chapter 3 Section 15

Bhagavat Gita

3.15

కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః {3.20}

లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి

జనకుడు మొదలగువారు కర్మయోగము నాచరించియే ముక్తిని బొందిరి. లోక కళ్యాణము కైనను నీవు కర్మలను చేయవలెను

జనకుని గూర్చి బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడుతుంది. అతడు సీతాదేవి తండ్రి. అతడు ఒక గొప్ప రాజు. ఎన్నో బరువుబాధ్యతలు ఉన్నప్పటికీ చివరివరకు దైవ భక్తి కూడి ఉన్నాడు. అలాగే మనమే ఉద్యోగం చేసినా దైవ భక్తిని పెంపొందించుకోవచ్చు. కానీ మనము మారణాశ్త్రాలను తయారు చేసే ఉద్యోగం చేస్తూ దేవుని రోజూ స్మరించుకున్నా లాభం లేదు.

ఇక్కడ శ్రీకృష్ణుడు లోకసంగ్రహం అనే పదప్రయోగం చేసేడు. దేవుడు మనని భూమి మీద పుట్టించడానికి కారణం జన్మని సద్వినియోగం చేసుకొంటామని. మనము చిన్న లేదా పెద్ద ఉద్యోగం చేయవచ్చు. ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చేసి, మన బంధు మిత్రులను, ఇంకా చెప్పాలంటే శత్రువులను కూడా, ఆనందంగా ఉంచాలి. అంటే మనకైకాక పరులకై నిస్వార్థతతో పని చెయ్యాలి. ఇది మనకి ప్రతిబంధకమైతే, ఆధ్యాత్మిక సాధన ఎందుకు అంత కష్టమో తెలుస్తుంది. ఇది కష్ట సాధ్యం. దేవుని నామము స్మరిస్తూ మన అహంకారాన్ని తుడిచివేయాలి. అలాగ చేస్తే చేతులకి మిక్కిలి శక్తి వస్తుంది, భద్రత పెరుగుతుంది, ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించగల సృజనాత్మక శక్తి వృద్ధి చెందుతుంది,

మన పిల్లలికి జీవైక్య సమానత గురించి తెలియదని చెప్పకూడదు. ఎందుకంటే దాని గురించి బోధించడం మన బాధ్యత. చట్టం తెలీకపోవడం, చేసిన నేరం ఒప్పుకోవడమే. స్వతంత్ర సమరంలో న్యాయవాది ముద్దాయికి చట్టం గురించి తెలీద౦టే, బ్రిటిష్ న్యాయమూర్తి ఇంకా ఎక్కువ శిక్ష ఇచ్చేవాడు. అలాగే మన పిల్లలు జంతువులపై ఆగడాలు చేస్తే వారు కర్మ సిద్ధాంతానుసారం శిక్ష అనుభవిస్తారు. అందుకై తలిదండ్రులు పిల్లలకు జంతువులను సక్రమంగా చూడాలని చెప్పాలి.

బుద్ధుడు ఈ విధముగా చెప్పెను: "నువ్వు ఆకాశంలో లేదా భూగర్భంలో దాగి ఉండ వచ్చు, కర్మ సిద్ధాంతం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది." విలియం బ్లేక్ ఇలా వ్రాసేరు:

ఒక పంజరంలోని పక్షి, దేవలోకాన్ని కలవర పరుస్తుంది

ఒక కుక్క ఆకలితో తన యజమాని ఇంటి బయట ఉంటే, ఆ దేశం నశిస్తుంది

పిల్లలికి జీవైక్య సమానత గూర్చి చెప్పాలి. నా అమ్మమ్మ "ఈ చిన్న ఉడుతకు కూడా ఒక అమ్మమ్మ ఉంది. దాన్ని హింసించేవంటే అది వెళ్ళి తన ఆమ్మమ్మతో చెప్తుంది" అని నాకు చెప్పేది. పిల్లలకు నోరులేని జీవుల సంరక్షణకై, ఎందుకంటే అవి మనలాంటి జీవులు కనుకనే, పాటు పడాలని చెప్పాలి.

శాస్త్రజ్ఞులు జంతువులకు ఎటువంటి మనోభావాలు, చేతన మనస్సు ఉండవని తలుస్తారు. నిజానికి అవి ఏమి అనుభవిస్తాయో లేదో చెప్పలేము. వాటి బాధను మనము కోరిన విధంగా కాక, వేరే విధంగా వ్యక్త పరుచుకోవచ్చు. కొన్ని ఆవులు ఎండనక వాననక బయటే ఉంటాయి. ముఖ్యంగా చలి ప్రదేశాలలో మంచు కురిసి వాటికి తీవ్ర ఇబ్బంది కలుగవచ్చు. నా ఉద్దేశంలో చిన్న పిల్లలకు కుక్కలను పెంచే పద్దతి తెలియదు. తలిదండ్రులు వారికి కుక్కల పెంపకానికి సరియైన తర్ఫీదు ఇవ్వాలి.

నా చిన్ననాటి ఇంట్లో ఒక ఆవు ఉండేది. అది పెయ్యగా ఉన్నప్పటినుంచీ మా ఇంట్లోనే పెరిగింది. మంచి పాలు కూడా ఇచ్చేది. కొన్నాళ్ల తరువాత కీళ్లవాతం వచ్చి లేవలేకపోయేది. పొరుగువాళ్ళు దాన్ని కసాయివాడికి అమ్మేయమని చెప్పేవారు. అప్పుడు నా అమ్మ "నాకూ కీళ్ల వాతం ఉంది. నన్నూ కసాయివాడికి అమ్మేస్తారా?" అని అడిగేది.

నేను ఎవరింటికెళ్ళి భోజనం చేసినా, శాఖాహారిని కాబట్టి, కొంచెం ఇబ్బంది పడేవాడిని. కొందరు "నీవు శాఖాహారివి కాబట్టి, చేప నచ్చుతుంది" అనేవారు. నేను "నాకు చేపలంటే ఇష్టం. అందుకే వాటిని తినను" అని చెప్పేవాడిని. గీత చెప్పేది: మీకు దేనిమీదైతే ప్రేమ ఉందో దాన్ని హింసించరు. అంటే మీకు ఒక పెంపుడు కుందేలు ఉంటే, కుందేలు మాంసం ఎన్నటికీ తినలేరు.

నా పొరుగింటి వాడికి పూల చెట్ల౦టే ఎంతో ఇష్టం. బహుశా ఒకానొకప్పుడు చెట్టుగా పుట్టి పరిణామం చెంది ఇప్పుడు మానవుడిగా మారేడేమో. ఇదే పునర్జన్మ సిద్ధాంతం కూడా చెప్తుంది. నేను సముద్రపుటొడ్డున నడుస్తూ ఉంటే నీళ్ళలో తేలియాడిన సంగతులు మనస్సులోకి వచ్చేయి. గత స్మృతులలో నేనెంత ఆనందంగా, చెలాకీగా ఉండేవాడినో గుర్తుకొచ్చింది. అప్పుడు సముద్రంలో ఈదుతున్న చేపలలో నేనొక చేపనైతే ఎంత బాగుండునో అనిపించింది. అక్కడ కొందరు చేపలను గాలంతో పట్టి రోజు గడిపేవారు. ఆ చేపలలోని నొప్పిని నేను అనుభవి౦చేను. ఆధ్యాత్మిక చింతన ఇలాగే కలుగుతుంది. ప్రతి జీవి బాధ మన బాధ అవుతుంది. మనకు జీవైక్య సమానత గురించి తెలియనంత కాలం ఆధ్యాత్మిక సాధన మనమాడే ఒక నాటకం. 173

Eknath Gita Chapter 3 Section 14

Bhagavat Gita

3.14

తస్మా దసక్త స్సతతం కార్యం కర్మ సమాచర {3.19}

అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః

అందువలన, ఫలాశలేనివాడవై నియత కర్మను సదా ఆచరింపుము. ఫలాశలేక కర్మ నాచరించు మనుజుడు మోక్షమును పొందుచున్నాడు

శ్రీకృష్ణుడు అర్జునునికి, అంటే మనకి, అహంకారాన్ని పరిత్యజించి పరోపకారనికై నిస్వార్థ సేవ చెయ్యమని బోధిస్తున్నాడు. అలాగ కర్మ చెయ్యడంలో స్వతంత్రత ఉంటే, మనము దేవుని చేతిలో పనిముట్లమని తెలుసుకొంటాం. ఇది మనను ఉత్సాహ పరచి, దేవునికి ఒక సంపూర్ణమైన పనిముట్టు కావాలనే స్పూర్తినిస్తుంది. మనము పెద్ద బరువు బాధ్యతలు మోస్తున్నామని అనుకుంటాం. మన వెనక దేవుడు మన బరువును మోయడానికి సంసిద్ధుడై ఉన్నాడు.

నా చిన్నప్పటి ఊరులో రోడ్డు ప్రక్కన చిన్న గోడలు౦డేవి. పూర్వం రోజుల్లో బరువు నెత్తి మీద పెట్టుకొని మోసి, కొంత విశ్రాంతికై, బరువును గోడమీద పెట్టేవారు. మనం స్వార్థంగా ఉంటే దేవుడు ఒక పెద్ద గోడవలె ఉంటాడు. అంటే మనము బరువుని ఆయన మీద పెట్టలేము. మనము సాధారణంగా ఉంటే గోడ మన ఎత్తు ఉండి, బరువు ఆయన మీద పెట్టవచ్చు. అదే నిస్వార్థ పరులకు గోడ అవసరం లేదు ఎందుకంటే వారు మోసేది బరువు కాదు. ధ్యానం ద్వారా మన బరువుని దేవునిపై వేయగలం. తద్వారా మనము ఎటువంటి సవాలునైనా సులువుగా, సమభావముతో ఎదుర్కోగలము. 169

Eknath Gita Chapter 3 Section 13

Bhagavat Gita

3.13

యస్త్వాత్మరతి రేవ స్యా దాత్మ తృప్తశ్చ మానవః {3.17}

ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే

ఆత్మయందే రమించుచు, ఆత్మయందే తృప్తిచెందుచు, ఆత్మయందే ఆనందించు వానికి చేయదగిన కార్య మేదియును లేదు

నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన {3.18}

న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః

ఈ లోకమున కర్మ లాచరించుట వలన వానికి ప్రయోజనము లేదు. ఆచరింపనిచో దోషము ప్రాప్తించదు. సర్వ ప్రాణులయందును అతనికి ప్రయోజన రూపమైన దేదియును లేదు

మనం లాభం లేదా పేరుప్రతిష్ఠలకై బ్రతికినంత కాలము స్వతంత్రత అనుభవించలేము. గాంధీ మహాత్ముడు విసుగు విరామం లేకుండా రోజూ 15 గంటలు పనిచేసేవారు. సత్యాగ్రహ దశలో ఆయనను నమ్మి ఎందరో ఆయన అనుచరులయ్యారు. వారి బాగోగులు చూడడం ఆయన బాధ్యత. ఆయన స్వంతంత్రంగా పనిచేయడానికి కారణం నిస్వార్థ సేవ. గీత చెప్పేది, స్వార్థంతో చేసే ప్రతి పనీ, ఎంత చిన్నదైనా, కళ౦కమైనది. గాంధీ అడుగుజాడల్లో నడవాలంటే ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి మనకు గౌరవం, ప్రతిష్ఠ కలుగుతుందనే ఆశపడక పని చెయ్యాలి.

మనకు బాహ్య వస్తువుపై కోర్కె ఉన్నంత కాలం మన చేతన మనస్సులో అగాథమున్నది. ఒకడు తనవద్ద కోట్ల సొమ్ము ఉంటే ఆనందపడగలనని అనుకుంటే, వాడు దివాలా తియ్యడానికై ఉన్నాడు. అలాగే ప్రధాన మంత్రి అవ్వాలనుకునేవాడు తన మనస్సులోని ఆగాథాన్ని వ్యక్త పరుస్తున్నాడు. మనము ఒకరు లేదా ఒకటి ఉంటే ఆనందంగా ఉంటామని అనుకుంటే, మనము ఇతరులను మభ్య పెట్టడం లేదా అచేతనంగా మన ప్రియమైన బంధుమిత్రులను మోసం చెయ్యడమే. శ్రీకృష్ణుడు చెప్పింది: మీరు స్వతంత్రంగా కర్మ చెయ్యాలనుకుంటే, అహంకారం, వేర్పాటు తొలగించుకోవడానికి తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన చెయ్యండి. 168

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...