Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 4

Bhagavat Gita

2.4

అర్జున ఉవాచ:

కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన {2.4}

ఇషుభిః ప్రతియోత్ప్యామి పూజార్హా వరిసూదన

ఓ మధుసూదనా! అరిసూదనా! పూజ్యులైన భీష్మ ద్రోణులపై యుద్ధరంగము నందు శరప్రయోగము చేయుచు నేనెట్లు పోరగలను?

గురూ నహత్వా హి మహానుభావాన్ {2.5}

శ్రేయో భోక్తు౦ భాయీక్ష్య మపీహలోకే

హత్వార్థకామాంస్తు గురూ నిహైవ

భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్

మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమున బిచ్చమెత్తి జీవించుట శుభదాయకము. వారిని వధించినచో రక్తసిక్తమైన అర్థకామ భోగములచే ఇచ్చట అనుభవించవలసి యుండును. ఀ

అర్జునుడు తన నిస్సహాయతని, ఇంద్రియలోలత్వమును ప్రకటించగా శ్రీకృష్ణుడు అర్జునుని మందలిస్తున్న నేపథ్యంలో అర్జునుడు మళ్ళీ ఇలా చెప్పేడు: "ఇంద్రియాలు నా మంచి మిత్రులు. వాటిని సాదరంగా ఆహ్వానించి అవి అడిగినవి ఇవ్వాలి. నీ వ్యతిరేక దృక్పథం నాకు ఆశ్చర్యంగా ఉంది."

మన దైనింద జీవితంలో ఇంద్రియాలతో పోరాడక తప్పదు. మన కళ్ళు ఆందోళన చేస్తే, వాటికి హింసాత్మక దృశ్యాలు చూపించాలనిపిస్తుంది. చెవులకు పైశాచిక సంగీతం వినాలనిపిస్తే, వాటిని నిరుపయోగం చేసే, కరకు సంగీతాన్ని వినిపిస్తాము. ఇక రుచులుకోరే నాలుకకు అనారోగ్యమైన మసాలాతోచేసిన, నూనెలో వేచిన పదార్థాలను అందిస్తాము. మన ఆరోగ్యం ఏమైనా మన నాలుకకు రుచిగా ఉంటే చాలు అనుకుంటాం.

ధ్యానం మొదలు పెట్టేటప్పుడు ఇంద్రియాలను జయించ లేనప్పుడు, ఇటువంటి సందిగ్దత ఏర్పడుతుంది. అలాగే మన స్వచ్ఛంద భావాలను వదలక, ఇతరులను మనకన్నా ముఖ్యమైనవారలని తలచం. పైపెచ్చు దేవునితో ఇతరులు మనకన్నా ముఖ్యలుగా చూపి మన సాధనని దుర్లభం ఎందుకు చేసావని కలహిస్తాం. "నా స్వచ్ఛంద భావాలపై ఎందుకు పోరు చెయ్యాలి? అది నాలో అలజడి రేపి, నా ధ్యానాన్ని భంగం చేస్తోంది" అని విలపిస్తాం.

Eknath Gita Chapter 2 Section 3

Bhagavat Gita

2.3

క్లైబ్య౦ మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే {2.3}

క్షుద్రం హృదయదౌర్భల్య౦ త్యక్త్వోత్తిష్ఠ పరంతప

ఓ పార్థా! క్లీబత్వమును పొందకుము. ఇది నీకు తగదు. తుచ్ఛమగు హృదయ వ్యాకులమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము.

శ్రీకృష్ణుడు అర్జునుని తన మనస్సులో ఏర్పడిన సుడిగుండం నుంచి వెలుపలకి రమ్మని ప్రోద్భలం చేస్తున్నాడు. "నీకిది అనుచితం. నీవు రాజువు. ఈ యుద్ధం నీవు చేయలేవని తలచను" అని శ్రీకృష్ణుడు అంటున్నాడు.

ఇంద్రియాలు మనని నడిపిస్తే వాటిని నియంత్రించలేకపోయేమని చెప్పడం అనుచితం. మనం ఆహారం ఉందికదా అని అదేపనిగా తిననక్కరలేదు. అలాగే ఎంతోమంది ధూమపానం, మద్యం సేవిస్తున్నారని, మనము కూడా వాటిని సేవించనక్కరలేదు. మన పరిస్థితులు ఎంత విషమంగా నున్నా, ఎటువంటి సవాలును ఎదుర్కొన్నా, దేవుని అపరిమితమైన కరుణ, ప్రేమ మనయందు ఉంటాయని నమ్మితే జయం తప్పదు. మన బంధుమిత్రులు మనలను ఉద్రేకింపజేస్తే, వాళ్ళతో కలసి బ్రతకలేమని అనలేము. ఎందుకంటే దేవుడు "నీవు ఎందుకు చేయలేవు? నేను నీలో ఉన్నాను. నా నుండి శక్తిని పొంది ద్వేషాన్ని ప్రేమతో, చెడును మంచితో ఎదుర్కో" అని అంటాడు.

ఇలాగ శ్రీకృష్ణుడు అర్జునుని "మేల్కొని నీ దేహాన్నిపెంచు. నీ తల తారల యందు౦డాలి. సమస్త విశ్వం నీ కిరీటంగా ధరించు" అని ప్రోత్సాహిస్తున్నాడు. అలాగే "అర్జునా, నీలో ఎంతో రాజసం ఉంది. నేను నీలో ఉపస్థితుడినై ఉన్నాను. నీవు చెయ్యవలసిందల్లా నా శక్తిని ఆసరాగా తీసుకొని, శత్రువులను సమూలంగా నాశనం చెయ్యడం" అని బోధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అర్జునుని పరంతప -- అంటే శత్రువును మట్టి కరిపించే వాడు-- అంటున్నాడు. 51

Eknath Gita Chapter 2 Section 2

Bhagavat Gita

2.2

కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితం {2.2}

అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున

అర్జునా! ఆర్యులకు తగనిదియు, స్వర్గమునకు వ్యతిరేక మైనదియు, అపకీర్తి నొసగు నదియునగు ఈ అజ్ఞానము ఈ విషమ సమయమున నీకెట్లు ప్రాప్తి౦చినది?

శ్రీకృష్ణుడు మమకారంతో, స్వీయ జాలితో కుప్పకూలిన అర్జునుని చూచి, "నీకు ఈ నిరాశ, విచారం ఎక్కడినుంచి వచ్చేయి అర్జునా? వీటిని తొలగించుకో. నీ హృదయంలో ఉండే నేను వాటితో కలసి ఉండలేను" అని చెప్పెను.

శ్రీకృష్ణుడు ఇక్కడ అనార్య అనే పదాన్ని ప్రయోగించేడు. దాని అర్థం తగనిది లేదా అయోగ్యమైనది. ఇక్కడ అర్జునుని నడవడిక అయోగ్యమైనది. మనము జంతువులనుండి పరిణామం చెంది మానవులమైనాము. మనను జంతువులనుండి వేరు చేసే గుణ౦: మన స్వార్థంతో కూడిన కోర్కెలను విడచి, పరోపకారము చేసి ఇతరులకు ఆనందం కలిగించడం.

నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా ఆధ్యాత్మిక గురువు ఇంట్లో మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాను. నా గురువుకి ఒక గోశాల ఉంది. అక్కడున్న ఆవులు ఆవిడకు కావలసిన పాలు, వెన్న, పెరుగు ఇస్తాయి. ఆమె రోజూ ఆ గోశాలను శుభ్రం చేసి ఆవులకు గడ్డి, కుడితి ఇస్తూ ఉంటుంది. నా మిత్రులలో ఒకడు అది చూసి హేళన చేసేడు. వాడి మాటలు విన్న నా గురువు వాడి దగ్గరకు వచ్చి "నువ్వా గోశాల లోపలికి వెళ్ళు. నీ చోటు అక్కడే. నేను రోజూ నీకు గడ్డి, కుడితి ఇస్తాను" అని అన్నది. ఈ విధంగా కఠినంగా మాట్లాడితేనే గానీ ప్రేమించిన వారు దారికి రారు.

మనము సూటూ, బూటూ వేసుకొని తిరిగినంత మాత్రాన మనుష్యుల మవ్వలేదు. నిజమైన మానవత్వం మన స్వార్థాన్ని విస్మరి౦చి, మనను ద్వేషించినవారిని క్షమి౦చడం వంటి సద్గుణాలు కలిగి ఉండడం.

ఇక్కడ శ్రీకృష్ణుడు అస్వర్గ్య అనే పదాన్ని వాడుతాడు. అంటే "అహంకారాన్ని వీడక, స్వచ్ఛంద భావాలను విస్మరించక, ఎడబాటు కోరుతూ నీలోని స్వర్గం యొక్క తలుపులను బంధించేవు" అని అన్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తామసంతో, భయంతో, విచారంతో ఉన్న అర్జునునుని మేల్కొల్పేడు. 51

Eknath Gita Chapter 2 Section 1

Bhagavat Gita

2.1

తం తథా కృపయా విష్ట మశ్రుపూర్ణాకులేక్షణమ్ {2.1}

విషీదంత మిదం వాక్య మువాచ మధుసూదనః

ఈ ప్రకారము కరుణచే ఆవేశింపబడి, కన్నీరు కార్చుచు వ్యాకులమైన దృష్టిని కలిగియున్న అర్జునునితో మధుసూదనుడు డిట్లు పలుకసాగెను

అర్జునుడు మమకారముతో ఇతరులు తనకు చేయబోయే హాని గురించి తలచుచున్నాడే గాని, వేరే కారణం వలన కాదు. శ్రీకృష్ణుడు అటువంటి స్థితిలోనున్న అర్జునునిపై మిక్కిలి కఠినముగా స్పందించబోతాడు. ఒక మంచి ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణునివలె మమకారముతో ఉన్న శిష్యుని మందలిస్తాడు. అలాగే సమయం వచ్చినపుడు తన శిష్యుని సున్నితంగా, దయతో, మంచి మాటలతో బుజ్జగిస్తాడు.

నా ఆధ్యాత్మిక గురువైన అమ్మను నేను ఇతరులు నన్నెందుకు బాధ పెడుతున్నారని ఏడుస్తూ అడిగేను. ఆమె సాధారణంగా సౌమ్యంగా ఉంటుంది. అవసరమైతే కఠినంగా ఉండగలదు. ఈ మారు ఆమె సౌమ్యంగా స్పందించి నేను నాపై ఉన్న జాలితో ఏడుస్తున్నాను గాని వేరే కారణం వలన కాదని మందలించింది. మనం ఇతరుల గూర్చి బాధపడితే అది దుఃఖం. అది మన మానసిక స్థితిని వృద్ధిచేస్తుంది. కానీ మన మీద మనం జాలి పడితే దౌర్భల్య౦ కలుగజేస్తుంది.

ఒక ఎనుము బురద గుంట కనిపిస్తే అందులో పొరలి ఒళ్ళంతా బురదతో రాసుకుంటుంది. అలాగే అర్జునుని మమకారం కూడా పిరికితనము అతనికి ఆపాదించింది. దాన్ని శ్రీకృష్ణుడు ఖండించ బోతాడు. మనము తలిదండ్రులు మనను కఠిన౦గా మందలించనపుడు వాడిన మాటలు, సహధర్మచారిణి కోపంతో పలికిన పలుకులు, కొన్నేళ్ళ తరువాత గుర్తుకుతెచ్చుకొని బాధ పడుతూ ఉంటాము. ఇది తగని పని.

అర్జునుడు ఒక చిన్న పిల్లవాడి వలె తనపైనున్న జాలితో కన్నీరు కారుస్తూ ఏదీ స్పష్టంగా చూడలేక పోతున్నాడు. మనము మనపై జాలితో ఉన్నప్పుడు మన బంధుమిత్రులను క్రూరులుగాను, మనల్ని బాధ పెట్టే వారలగాను-- వారు నిజంగా అలాంటి వారు కాకపోయినా-- తలుస్తాము. ఎందుకంటే స్వీయ జాలి మన మనస్సులో వికల్పం కలిగించి ఏదీ స్పష్టంగా కనపడకుండా చేస్తుంది.

పరిస్థితి విషమించక ముందే విచారంతో ఉన్న అర్జునుని ఇప్పుడు శ్రీకృష్ణుడు మందలించ వలసిందే. ఈ విధంగా శ్రీకృష్ణుడు వానిపై ఉన్న ప్రేమను ప్రకటించగలడు. 49

Eknath Gita Chapter 3 Section 19

Bhagavat Gita

3.19

న బుద్ధి భేదం జనయే దజ్ఞానం కర్మసంగినామ్ {3.26}

జోషయే త్సర్వకర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్

జ్ఞాని యగువాడు అజ్ఞానుల బుద్ధిని కలతపెట్టరాదు. తాను యోగయుక్తుడై సర్వ కర్మముల నాచరించుచు కర్మాసక్తులగు వారను తనను అనుకరించునట్లు ప్రవర్తించవలెను

శ్రీకృష్ణుడు అర్జునునితో "నువ్వు సదా నీ బంధుమిత్రులనే కాక ప్రత్యర్థులను కూడా ప్రభావితం చేస్తున్నావు" అన్నాడు. మనము ప్రత్యర్థులను ద్వేషిస్తే, వారిని మనను ద్వేషించే విధంగా ప్రోత్సాహిస్తున్నాము. అలాగే వారిపై దాడులు జరిపితే, వారిని మనపై దాడి చేయమని సంకేతం. కానీ వారిని క్షమిస్తే, వారూ మనల్ని క్షమించి, మనతో సంధి చేసుకొంటారు.

గాంధీజీ తన ప్రత్యర్థులను తన వైపు త్రిప్పుకోవడంలో సిద్ధహస్తులు. ఆయన ప్రియమైన గీతం "వైష్ణవ జనితో". అంటే ప్రేమతో ద్వేషాన్ని మార్చే దేవునికది చిహ్నం. మనం దేవుని ప్రేమించాలంటే, మనల్ని ద్వేషించేవారిని ప్రేమించాలి. అలా చేస్తే దేవుని కృప వలన ఆయనతో ఐక్యమవుతాం. 179

Eknath Gita Chapter 3 Section 18

Bhagavat Gita

3.18

సక్తాః కర్మ ణ్యవిద్వా౦సో యథా కుర్వన్తి భారత {3.25}

కుర్యా ద్విద్వా౦ స్తథా అసక్త శ్చికీర్షు ర్లోక సంగ్రహమ్

అర్జునా! అజ్ఞానులగు జనులు ఫలాశతో ఏ విధముగ కర్మల నాచరింతురో, అలాగే జ్ఞానులు ఫలాపేక్ష లేక లోక కళ్యాణార్థము కర్మల నాచరింపవలెను

స్వలాభానికై, ఆనందానికై, పేరుప్రతిష్ఠలకై ప్రాకులాడకూడదని చెప్పడం చాలా మంది విషయాలలో వ్యర్థం. ఎందుకంటే మనము వాటిని సాధించాలనే ఉద్దేశంతో పెరిగేం. తిరుగుబాటుదారు లేదా విప్లవకారుడు అనే పదాల్ని ప్రసార మాధ్యమాలలో వింటాం. చాలామంది దానిని తప్పుగా అర్థం చేసుకొంటారు. విప్లవకారుల మవ్వాలంటే ఎంతో సాహసం, ఓర్పు, దేవునిమీద విశ్వాసం ఉండాలి. మన కోర్కెలకు, ఇంద్రియాలకు ఎదురు తిరగడం నిజమైన విప్లవం. మనకు తెలిసిన పెద్ద విప్లవకారుడు, జీసస్ "నీ శత్రువులను ప్రేమించు; నిన్ను తిట్టేవారిని క్షమించు; నిన్ను ద్వేషించే వారికి మంచి చెయ్యి" అని చెప్పేరు. బుద్ధుడు తన నిర్వాణ బోధతో పెద్ద విప్లవం కలిగించేడు. అతడు మన అహంకారాన్ని, దేహాభిమానాన్ని వదులుకోమని బోధించేడు. ఇతరులకు విప్లవంతో ప్రభావితం చెయ్యాలంటే వారిపై ఒత్తిడి పెట్టకూడదు. మన కుటుంబం, సమాజం, దేశం ఆధ్యాత్మిక జ్ఞానంతో ఎలాగ ఐకమత్యంగా ఉంటుందో చేసి చూపించాలి. శ్రీకృష్ణుడు "భారత దేశాన్ని ప్రభావితం చెయ్యాలంటే స్వార్థాన్ని, స్వలాభాన్ని, కుతంత్రాలని పోగొట్టుకో" అని అర్జునునికి బోధిస్తున్నాడు.

గాంధీ మహాత్ముడు దీనికి తార్కాణము. అతడు కుటీరంలో నివసిస్తూ తన వద్దకు వచ్చిన వీధులు ఊడ్చే మనిషినీ, బ్రిటిష్ సామ్రాజ్య పౌరుడినీ ఒకేలాగ ఆదరించి, గౌరవించేవారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన రాజ భవనంలో నివసించక తన కుటీరంలోనే చివరివరకూ జీవనం సాగించేరు. ఆయన తనకు ఎటువంటి బహుమానాలు అక్కరలేదని, తన అహింసా వాదాన్ని ప్రపంచమంతా ఒప్పుకొని, పాటిస్తే చాలని అనేవారు. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకుంటుంటే ఆయన ధ్యానం చేసేరు.

మనకు మనశ్శాంతి కావాలంటే మన హృదయంలోనూ, ఇంట్లోనూ శాంతియుతంగా ఉండాలి. అది కుటుంబ సభ్యుల మధ్య సంపూర్ణమైన ప్రేమ వలననే సాధ్యం. క్రమంగా ఆ ప్రేమని వ్యాపింపజేస్తే ప్రపంచాన్ని దాని పరిధిలోకి తెస్తాం. 178

Eknath Gita Chapter 3 Section 17

Bhagavat Gita

3.17

న మే పార్థాసి కర్తవ్యం త్రిను లోకేషు కించన {3.22}

నా నవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి

అర్జునా! ముల్లోకముల యందును నేను చేయవలసిన కార్య మేదియును లేదు. నేను పొందనిది, పొందవలసినది ఏదియు లేదు. అయినను నేను కర్మలను చేయుచునే యున్నాను

యది హ్యహం నవర్తేయ౦ జాతు కర్మణ్య తంద్రితః {3.23}

మమ వర్త్మాను వర్తం తే మనుష్యాః పార్థ సర్వశః

పార్థా! నేను అశ్రద్ధతో కర్మల నాచరింపకున్నచో జనులు సర్వవిధముల నా మార్గము ననుసరించియే ప్రవర్తించుచుందురు

ఉత్సీదేయు రిమే లోకా న కుర్యా౦ కర్మ చేదహం {3.24}

సంకరస్య చ కర్తా స్యా ముపహన్యా మిమాన్ ప్రజాః

నేను కర్మ చేయనిచో ఈ లోకము లన్నియు భ్రష్ఠమగును. వర్ణ సంకరమునకు నేను కారణమగుదును. జనులను చెడిపిన వాడనగుదును

పురాణాల్లో ఒక సాలెపురుగు తన చుట్టూ గూడు కట్టుకున్నట్లు, బ్రహ్మన్ విశ్వాన్ని సృష్టించి దాని మధ్య ప్రతిష్ఠిత మైందని చెప్తారు. అక్కడితో దాని పని అయిపోలేదు. అనేక మార్లు అవతారాలు దాల్చి మానవాళి పురోభివృద్ధికై నిరంతరము పాటు పడుతుంది.

కలియుగంలో బ్రహ్మన్ వరసగా అవతారాలను దాల్చింది. మనకే దేవుని మీద ప్రేమ ఉంటే, "మేము ధ్యానం చేస్తూ, నీ యందు భక్తితో ఉండి, అన్నీ మంచి పనులే చేస్తామని" ప్రార్ధించేవాళ్ళం. ఉదాహరణకి ప్రతి ఏటా వచ్చే శివరాత్రి: శివుడు సంవత్సరం పొడుగునా రాత్రింబవళ్ళు మన గురించై పని చేసినందుకు, సంవత్సరంలో ఒక్క రోజు విశ్రాంతి తీసికోమని ప్రార్ధిస్తా౦. మనం దేవుని మీద ప్రేమ పలు విధాలుగా ప్రకటించు కోవచ్చు: అహంకారం త్యజించి, బంధుమిత్రులకు నిస్వార్థ సేవ చేసి, మొదలైనవి.

ఒక క్రొత్త అవతారం దాల్చి మనకు తెలియని సత్యాలు తెలపడానికి, లేదా ఒక క్రొత్త మత స్థాపనకు దేవుడు పూనుకోలేదు. మనకు ఒకప్పుడు తెలిసిన విషయాలే గుర్తుకు తెప్పించడానికి అవతారం దాలుస్తున్నాడు. మనము దేహము, మనస్సు, అహంకారం, బుద్ధి కాము. మన నిజ స్వరూపం ప్రేమ. అది శాశ్వతమైనది, మార్పు లేనిది. ఇతరులను కష్టపెడితే, మనను బాధ పెట్టుకున్నట్టే. అలాగే ఇతరులకు మేలు చేసి ఆనందింపజేస్తే, మన చేతనములో ఆనందంగా మిగిలిపోతుంది. 177

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...