Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 30

Bhagavat Gita

3.30

ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టాన ముచ్యతే {3.40}

ఏతై ర్విమోహయ త్యేష మావృత్య దేహినమ్

ఈ కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధియును ఆశ్రయములై యున్నవి. ఇంద్రియముల ద్వారా కామము జ్ఞానము నావరించి మనుజునికి మోహమును కల్గి౦చుచున్నది

శ్రీకృష్ణుడు కామం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులలో నిక్షిప్తమై యున్నదని చెప్పుచున్నాడు. కామామనగా శృంగారంకూడా కలుపుకోవాలి. అలాగే పదవీ వ్యామోహం కూడా. ఇంద్రియాలకు తల ఒగ్గడం వలన సాధారణంగా ఇతరులకు హానికరం కాదు. కానీ పదవీ వ్యామోహం ఇతరులకు అనేక బాధలు కలిగిస్తుంది. అంతర్జాతీయ లేదా జాతీయ రాజకీయాల్లో, మనము పోటీనుండి లేదా కోలాహలం నుంచి రక్షించుకోవాలంటే, మన చుట్టూ ఉన్నవారి అవసరాలను గుర్తు పెట్టుకొని, మన అవసరాలని, పదవీ వ్యామోహాన్నిపరిత్యజించాలి.

బుద్ధి కామం యొక్క మూడవ ఇల్లు. సాధారణంగా బుద్ధిని కామంతో అనుసంధానము చెయ్యం. బుద్ధిని సక్రమంగా వాడాలంటే కొంత వైరాగ్యం అవసరం. తరాల మధ్య సంభాషణ లోపం ఉంది. దానికి కారణం మన స్థిర భావాలు. మనము మన ప్రత్యర్థుల చెప్పినవి శాంతంగా, గౌరవంతో, అహింసతో వినగలిగితే మనము గొప్ప సేవ చేసిన వారలమౌతాము. అలాగే మన వంతు భావాలు వాటిని చర్చించ దగ్గవిగా ప్రకటి౦చాలి. గాంధీజీ తమ ప్రత్యర్థుల భావాలను శాంతముతో, ఏకాగ్రతతో, గౌరవమిచ్చి వినేవారు. ఆయన మన వైపు వాదన సరళమైన, సున్నితమైన, గౌరవమైన భాషతో వినిపించగలమనే సత్యాన్ని ప్రపంచానికి అందించేరు. ఎవరి వాదనయితే బలహీనమైనదో వారు పైశాచిక లేదా అశ్లీల భాషతో మాట్లాడుతారు.

మనము "నాకు తెలిసీ" లేదా "కాబోసు" అనే పదాలను వాడుతాం. వాటి సాధారణ అర్థం మన౦ చెప్పేది ఎప్పటికీ చెరగని సత్యమని. మనం నిజంగా ఆ పదాల వెనుకవున్న భావం తెలిసి ఉంటే "నా అజ్ఞానంతో తెలిసి" అనే పదాలను వాడాలి. అప్పుడు ఇతరులు మనల్ని తప్పుగా అర్థం చేసికోవడానికి వీలు లేదు. నేను ఒకమారు నా ధ్యాన తరగతి విద్యార్థిని వ్రాసినవి చదివేను. ఆమె తన భర్తతో పెద్దగా వాదించింది. పరిస్థితి విషమించినపుడు "మనము మన భావాలు లేదా తత్త్వాలను గూర్చి వాదించటంలేదు. మన అహంకారనికై వాదిస్తున్నాము" అని ఆమె వ్రాసి౦ది. పరిస్థితి ఎంతో విషమించి, సహనం కోల్పోయి ఉన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవలసింది: ఆ కలహం తత్త్వానికి గానీ, సిద్ధాంతంకి గానీ సంబంధించినది కాదని, మన అహంకార౦తో ప్రత్యర్థులను మన ఆధీనంలో పెట్టుకోవడానికేనని. దీన్ని గుర్తుపెట్టుకొంటే మనము మర్యాద, సౌమ్యం పాటించి, మనతో పొంతనలేని ఇతరుల భావాలను ఖండించి లేదా హింసతో మన వ్యతిరేకతను తెలిపే మార్గాన్ని అనుసరించం. 208

Eknath Gita Chapter 3 Section 29

Bhagavat Gita

3.29

ధూమే నావ్రియతే వహ్నిః యథా అదర్శో మలేన {3.38}

యథోల్బే నావృతో గర్భ స్తథా తేనేద మావృతమ్

పొగచేత నిప్పు, మురికి చేత అద్దము, మావి చేత శిశువు కప్పబడినట్లు కామము చేత జ్ఞానము కప్పబడి యున్నది

ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా {3.39}

కామరూపేణ కౌన్తేయ దుష్పూరే ణానలేనచ

కుంతీ కుమారా! అన్నటికీ తీరనిది, అగ్నివలె తృప్తిచెందనిది, జ్ఞానులకు నిత్య శత్రువైనది, కామరూపమైనది యగు కామము చేత జ్ఞానము కప్పబడియున్నది ఀ

అగ్ని చుట్టూ పొగ దట్టంగా ఎలా కమ్మేస్తుందో జ్ఞానం స్వార్థ పూరితమైన కోర్కెలు, వేర్పాటు, అహంకారంతో కప్పబడి ఉంది.

ఎలాగైతే అద్దం మీద దుమ్ము పడియున్నదో, ఆత్మ జ్ఞానము కామంతో కప్పబడి యున్నది. దుమ్ము పట్టిన అద్దం నిరుపయోగం. ఇంద్రియ లోలత్వంలో పడి ఏమి తింటున్నామో, చదువుతున్నామో, మాటలాడుతున్నామో, ఆలోచిస్తున్నామో దాని ప్రకారం మన ఆత్మ విదితమౌతుంది. అప్పుడు దేహాన్ని చూస్తాముగానీ అందులో నివసించే దేహిని చూడం. మన నిజ స్వరూపం తెలియాలంటే భౌతిక చైతన్యానికి అతీతంగా వెళ్ళాలి.

కామం గూర్చి శ్రీకృష్ణుడు ఇంకా ఉద్ఘాటిస్తున్నాడు. కామమంటే మన స్వార్థానికై, ఇతరుల హక్కులను, అవసరాలను లెక్క చేయక ఉండడం. "నేను, నాది" అనే భావాలు మనకి కలిగితే, వాటినుంచి విడిబడడం చాలా కష్టం. కొందరు ఎక్కడికి వెళ్ళినా డబ్బు గురించే ఆలోచిస్తారు. ఉదాహరణకు ఒక అందమైన వనం కనిపిస్తే, వారు దాని మీద పద్యం వ్రాయాలని అనుకోరు; దానిపై ఒక పది అంతస్తుల మేడ కట్టి, అద్దెకో, అమ్మకానికో ఇచ్చి డబ్బు సంపాదించాలని అనుకొంటారు.

బుద్ధుడు కామాన్ని తన్హ అంటాడు. అనగా తీరని దాహం. అది ఎప్పటికీ తీరక, ఇతరులనుండి నీరు దొంగలించే పరిస్థితి కల్పిస్తుంది. కొందరు--దేశం, సమాజం, వ్యక్తులు -- ఇతరుల కోర్కెలను, హక్కులను లెక్క చేయక స్వార్థానికై వారితో కలహం పెట్టుకొంటారు.

డబ్బు విషయానికి వస్తే, డబ్బు కొంత లోహము, కొంత కాగితం. వాటిని అదే పనిగా ప్రేమించడం తప్పు. గీత దేన్నైనా విజ్ఞతతో ఉపయోగించాలంటే దానితో తాదాత్మ్యం చెందకూడదు అంటుంది. గాంధీ మహాత్ముని ఆస్తి రెండు ఆకులు మాత్రమే. ఆయన కోట్ల కొలది డబ్బును తన చేతులతో ఇతరులకు దానం చేసి, ఒక్క పైసా కూడా తనకై ఉంచుకోలేదు.

డబ్బుతో పాటు, చాలామంది వస్తువులను పోగుచేసుకొంటారు. ఎందుకంటే వారికి వస్తువులయందు నిర్లిప్తత లేదు. కొందరు వందల చీరలు, వాటికి సరిపడే ఆభరణాలు, చెప్పులు సేకరిస్తారు. అయినా వారు అవి వేసుకుంటే అందంగా ఉండకపోవచ్చు. కానీ కొందరు తక్కువ బట్టలు, ఆభరణాలు, చెప్పులు ఉండి, అమిత సౌందర్య వంతులుగా కనిపిస్తారు.

విశ్వమంతా భగవంతునిదే. దేవుడు మనకు భూమి, వనరులు అద్దెకు ఇచ్చేడు. మనం అద్దె కట్టం సరి గదా, దానిని సరిగ్గా చూసే బాధ్యత కూడా తీసికోం.

దేహంకూడా మనది కాదు. దానిని ఇతరులకు సేవచేయడానికై ఇవ్వ బడినది. కొందరు ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాలు, అతిగా వాడి దేహంలో వ్యాధులు కలిగిస్తారు. అది కూడా తప్పే.

శ్రీకృష్ణుడు అర్జునిని ఇలా హెచ్చరిస్తున్నాడు: స్వార్థానికై, ఇంద్రియ నిగ్రహం లేక, తమ పద్దతులని ఇతరులు పాటించాలనే నిశ్చయంతో కొందరు ఉంటారు. వారి బారిన ఎప్పటికీ పడకూడదు. వారు మనకు ప్రత్యర్థులు. మరియు ఎప్పుడైతే స్వార్థ కర్మ చేస్తామో, అప్పుడు మన ప్రత్యర్థిని బలోపేతం చేసినట్టే. 206

Eknath Gita Chapter 3 Section 28

Bhagavat Gita

3.28

అర్జున ఉవాచ:

అథ కేన ప్రయుక్తో అయం పాపం చరతి పూరుషః {3.36}

అనిచ్ఛన్నపి వార్ష్నేయ బలాదివ నియోజితః కృష్ణా! తనకు ఇష్టము లేకున్నను దేనిచేత ప్రేరేరింపబడి మానవుడు బలవంతముగ పాపము చేయుచున్నాడు ?

శ్రీ భాగవానువాచ:

కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః

మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణమ్ {3.37}

రజోగుణము వలన కలిగిన కామక్రోధములు పాప భూయిష్టమైనవి. తీరని ఆకలి గలవి. ఇవియే ఈ లోకమున ప్రబల శత్రువులు ఀ

అర్జునునికి మనలాగే నిస్వార్థమైన జీవనాన్ని సాగించాలని ఉంది, కానీ అది ఎలాగ సాధ్యమో తెలియదు. ఇక్కడ వార్ష్నేయ అని శ్రీకృష్ణుని సంబోధిస్తున్నాడు. వార్ష్నేయ అంటే వృష్ని కుటుంబంలో జన్మించినవాడని అర్థము. "నేను మంచిగా జీవించాలనుకొంటున్నాను. నేను ప్రతి జీవికీ ఉపయోగ పడే కర్మ చేద్దామనుకుంటున్నాను. కానే ఏదో శక్తి నాకు అవరోధం కలిగిస్తోంది. అది ఏమిటి? నన్ను స్వలాభమునకై, సుఖాలకై ప్రోద్భలం చేసేది ఎవరు" అని అర్జునడు అడుగుతున్నాడు.

శ్రీకృష్ణుడు మనని క్రిందకి లాగేవి కామ, క్రోధాలు అని చెప్తున్నాడు. అవి మన అహంకారాన్ని స్వార్థపూరిత కోర్కెలకై ఇతరులపై ప్రసరింపజేసి, మన కుటుంబానికై, మన బంధుమిత్రులకై, మన దేశానికై కర్మ చేసేట్లు చేస్తాయి. కామము అనేక రీతులుగా ఆవహిస్తుంది: కోరికలు, డబ్బుకై ఆశ, పేరుప్రతిష్ఠలకు ప్రాకులాడుట మొదలైనవి. వాటిని తీర్చుకోవడంలో అవరోధాలు వచ్చినా, ఇతరులు సవాలు చేసినా క్రోధం కలుగుతుంది. మనకెలాగ స్వార్థ పూరిత కోర్కెలున్నాయో ఇతరులకు అదే విధంగా కోర్కెలు ఉంటాయి.

నా చిన్ననాటి గ్రామంలో ఎవరికైనా కోపం వస్తే "హం" అనేవారు. మొదట్లో నాకది అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసింది హం అంటే అహమని. హం అనేవారు తమ అహంకారాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఈ విధంగా వ్యష్ఠి లోనేకాక, దేశాల మధ్య కూడా క్రోధంతో కూడిన సంభాషణ జరుగుతూ ఉంటుంది.

మన భావాలు మంచివైనా, వాటికి అహంకారం అడ్డు వస్తుంది. మన కోర్కెలు తీరకపోతే, మనస్సు అలజడిని పొంది, విచక్షణా జ్ఞానం కోల్పోతుంది. ఉదాహరణకు మన సహధర్మచారిణితో "నేను చెప్పినట్లు నీవెందుకు చెయ్యవు?" అని బంధాన్ని గట్టి పరుచుకోవడానికి అనవచ్చు. ఆమె కూడా అదే భావంతో ఆ ప్రశ్నే అడగవచ్చు. ఈ విధంగా కలహం వస్తే మనస్సు అలజడి చెంది, బంధం గట్టి పడాలనే భావంతో, నిజానికి దాన్ని పాడుచేస్తారు. అలాంటప్పుడు క్రోధము చెందక, మన ప్రత్యర్థిపై ప్రేమ, గౌరవము అలవరుచుకోవాలి.

నేను సముద్రపుటొడ్డున నిలబడి అలలతో ఆడే వాళ్ళను చూస్తాను. వారు ఒక సర్ఫ్ బోర్డ్ తో అలలపై నుంచి వెళ్లడానికై ప్రయత్నిస్తారు. ఒక్కొకప్పుడు ఒక పెద్ద అల వారిని వొడ్డుకు విసిరేస్తుంది. అయినా వారు విసుగు చెందక మళ్ళీ ప్రయత్నిస్తారు.

ఇదే సాధనలో జరిగేది. మన కోర్కెలు, అలల లాగ వచ్చి "నీవు నాతో ఒక ఆట ఆడుతావా?" అని అడుగుతాయి. అప్పుడు మనము నిగ్రహించుకొని అలల మీద తేలియాడునట్లు ఉండాలి. నేను సర్ఫ్ చేసేవాళ్ళు అలలతో ఆటలాడుతారని భావిస్తాను. ఇది మైత్రితో ఆడే ఆట.

కొంత మంది తీరంనుంచి ఇంకా దూరం వెళ్ళి సర్ఫ్ చేస్తారు. ఇలాగే మన కోర్కెలు ఇంకొంచెం దూరం మనల్ని లాగి "మేము భయము, క్రోధము, దురాశ. మాతో వస్తావా?" అని అడుగుతాయి. మనలో సాహసవంతులు ఆ సవాలును అంగీకరించి వాటిపై విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు. క్రోధంతో కూడిన వ్యక్తి శక్తి తనని నాశనంచేసే దిశగా వెళ్ళి బానిస అవుతాడు. కాని ఒకడు ఆ శక్తిని అదుపులో పెట్టుకొంటే ఎటువంటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కొని, మానవాళి క్షేమానికై పాటుపడతాడు.

మనకి ధ్యానంలో ఎంత పురోభివృద్ధి కలిగినా, నిత్యం ఎంత మంత్ర జపం చేసినా, ఇంద్రియాలకు అప్పుడప్పుడు లోబడుతాము. జీసస్ కి కూడా ఇటువంటి పరీక్షలు ఎదురయ్యేయి అని బైబిల్ చెప్తుంది. బుద్ధుడు మర అనబడే శక్తితో ఇంద్రియ నిగ్రహానికై పోరాడేడని భౌద్ధులు చెప్తారు. వారు మన కోర్కెలను స్వాధీనంలో పెట్టుకోవడానికి స్పూర్తినిస్తారు. ఇంద్రియాల భేటీలో మనం గెలిస్తే అది ఎంతో తృప్తిని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. క్రమంగా స్వార్థపూరిత కోరికల గుప్పిటలోంచి బయటపడితే, మనస్సులోని అలజడి తగ్గుతుంది. 202

Eknath Gita Chapter 3 Section 27

Bhagavat Gita

3.27

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ {3.35}

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

బాగుగ ఆచరింపబడు పరధర్మము కంటెను గుణము లేనిదైనను స్వధర్మమే మేలైనది. స్వధర్మము నందు మృత్యువైనను మంచిదే. పరధర్మము భయంకరమైనది ఀ

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ధర్మము గూర్చి చెప్తున్నాడు. ధర్మం మనల్ని ఏకత్రాటిపై నడిపించి మనకు ఊత నిస్తుంది. ధర్మం మన జీవితంలోని ముఖ్యాంశం. మన వేర్పాటును తగ్గించి, ఆత్మ జ్ఞానాన్ని పొంది, దేవునితో ఐక్యమవ్వడానికి ధర్మం తోడ్పడుతుంది. బౌద్ధులు దీనినే నిర్వాణ -- అహంకారాన్ని తొలగించుకొని, పరమాత్మతో ఐక్యమవ్వడం -- అంటారు. హెరాత్ కి చెందిన అన్సారీ అనే సూఫీ ఇలా చెప్పేరు: "మన అహంకారాన్ని దూరం చేసికొ౦టే, మనకు ప్రియమైనదాన్ని పొందవచ్చు". శ్రీకృష్ణుడు "మనస్సు నిశ్చలం చేసి, నాయందు లగ్నము చేస్తే, నిశ్సంశయంగా నన్నే పొందుతావు" అని చెప్పెను (12:8). ధర్మము విశ్వవ్యాప్తమైన సిద్ధాంతము. దానిని పాటిస్తే మనము ఇతరులకు సేవ చేసి, దేహాన్ని స్వస్థతతో, మనస్సులో అలజడి లేక, బుద్ధి వికసించి, జ్ఞానం వృద్ధి చెంది ఉంటాము.

స్వధర్మ మనగా మనము పాటించే ధర్మము. ఆధ్యాత్మిక సాధన చేస్తే దానిలో మార్పు కలుగుతుంది. తద్వారా మన బాధ్యతలు, పర సేవ చేయడానికి అవకాశాలు పెరుగుతాయి. నిన్నటి రోజు ఉద్యోగం మంచిదనుకున్నా, నేడు అలా అనుకోకపోవచ్చు. కానీ మన ఉద్యోగం ఇతరులకు ఉపకారం చేసేదైతే అది సాధనలో ఒక అంశమవుతుంది.

స్వధర్మమనగా ఉంకొకరు చేసే పనినే మూఢభక్తితో చెయ్యకపోవడం. ఇంకొకరు చేసేదే పాటించకుండా, మనకు తోచినది, సాధనకి పనికివచ్చే మంచి పని చెయ్యాలి. దానికై ఇతరులను అనుకరించనక్కరలేదు. ఒక చలన చిత్ర నాయకుడు, లేదా క్రీడాకారుడు చేసేడు కదా, మనమూ అలాగే చెయ్యాలని అనుకోవడం సమంజసం కాదు.

శ్రీకృష్ణుడు "నిన్ను నీ స్వస్వరూపంతో చూసుకో" అంటాడు. కాబట్టి మనము సహజంగా, స్వస్వరూపంలో ఉండడం ఉత్తమం. ధ్యానం పరిపక్వమయితే, అంతకు ముందు మనమెంత నటులమో అర్థమవుతుంది. ఉదయం లేచి మన నటన మొదలుపెట్టి, పనికి వెళ్ళి అక్కడ నటిస్తాము. ఎందుకంటే ప్రపంచం అనే రంగస్థలంలో ప్రేక్షకులు మనను ఆదరిస్తారో లేదో అన్న భయం మనని ఆవహిస్తుంది.

స్వస్వరూపంతో చూడడానికి క్రమశిక్షణ పాటించాలి. కొందరు తప్పుగా ఇలా తలుస్తారు: "నేను యధేచ్చగా ఉంటాను. రేపు ఉదయం నిద్ర లేచి నా స్వస్వరూపంతో ఉంటాను". ఎందుకంటే మన పాత నడవడికని మార్చుకొని, ఇష్టాయిష్టాలను అధిగమిస్తే గాని యధేచ్చగా ఉండలేము. మనము ఈ విధంగా మెలగగలిగితే, అందరితోనూ సామరస్యంగా ఉండగలము. 198

Eknath Gita Chapter 3 Section 26

Bhagavat Gita

3.26

ఇంద్రియ స్యే౦ద్రియ స్వార్థే రాగద్వేష వ్యవస్థితా {3.34}

తయో ర్నవశ మాగఛ్ఛే త్తౌహ్యస్య పరిపంథినౌ

ఇంద్రియములకు, ఇంద్రియ విషయములకు మధ్య రాగ ద్వేషములు చోటు చేసుకొని యున్నవి. వాటికి ఎవరును వశపడకూడదు. రాగద్వేషములు మనుజునికి ప్రబల శత్రువులు

శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఇంద్రియ, ఇంద్రియార్థ అనే పదములు వాడేడు. ఇంద్రియ అనగా ఇంద్రియాలు-- కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక. ఇంద్రియార్థ అనగా బాహ్య ప్రపంచంలో దేనిపై ఇంద్రియాలు పనిచేస్తున్నాయో. ఈ రెంటికీ మధ్య రాగద్వేషములు ఉంటాయి. అనగా ఆకర్షణ, వికర్షణ. మనకు నచ్చేవి, నచ్చనివి మనలను ప్రభావితం చేస్తాయి. మనకొకరు నచ్చక పోతే వారితో ఎడంగా ఉంటాము. మనము ఒకర్ని ప్రేమిస్తే వారి క్షేమానికై తాపత్రయ పడతాం. కానీ ఒకరిని ద్వేషిస్తే వారిని గూర్చి ఏమి ఆలోచించినా, వారికి ఏ విధంగా నష్టం కలిగించాలని తలుస్తాం.

నా మాతృ భాషలో ఒక పాట ఉంది: "నన్ను ప్రేమించు లేదా ద్వేషించు, నాకు ఖాతరు లేదు. కానీ ఎన్నటికీ నాపై వైరాగ్యం చూపకు. అలా చేస్తే నిన్ను ఎన్నటికీ పొందలేను". ఒక ప్రేయసి ప్రియుడితో "నీపై ప్రేమ లేదు" అని చెప్తే ప్రియుడు ఆమెతో "నిన్ను ఎన్నటికీ చూడాలని లేదు" అనకుండా "నిన్ను ఎన్నటికీ వదలను" అని అనుకోవాలి. అంటే ప్రేమని ఎన్నటికీ విరమించ కూడదు.

సాయిబాబా "నువ్వు ఇష్టం ఉన్న పనులు చెయ్యకపోతే, నీకు తోచిన మంచి పనులు చెయ్యి" అని చెప్పేరు. మనకు చదువులో, స్నేహంలో, తిండి యందు, రాగద్వేషాలు ఉన్నంత కాలము మన నాడీ వ్యవస్థ ఇష్టమున్న పనులవైపు మొగ్గి, ఇష్టంలేని పనులకు దూరంగా ఉంటుంది.

ఒక భౌతిక శాస్త్రజ్ఞుడు ధ్యానం మన నాడీ వ్యవస్థను సరి చేస్తుందన్నాడు. అది ఎంతసేపూ ఇష్టం ఉన్న పనులు చేస్తే, దానిలో ఏదో లోపముందని అర్థము. అది రెండు పనులూ చెయ్యాలి. ధ్యానం ద్వారా మనకెంత ఇబ్బంది కలిగినా, ఒత్తిడి ఏర్పడినా, ఇతరులకై పాటుపడతాం.

ఈ విధంగా ధ్యానంతో నాడీ వ్యవస్థను పునరుద్ధరిస్తే, పరుల సేవలో మిక్కిలి ఆనందం పొంది, ఇష్టం లేని పనులు చెయ్యడానికి కూడా సిద్ధపడతాం. మనకు ఒకరిపై అయిష్టత ఉంటే, అది మన పక్షపాతము వలన అని తెలుసుకొంటాం. అయిష్టత ఉంటే ఇతరులు చేసిన తప్పులు భూతద్దంతో చూసినట్లు పెద్దవి చేసి చూస్తాం. ఉదాహరణకు ఒకరు పరోపకారానికై డబ్బులు సంపాదించాలని కోరుకొంటే, అది తెలియక మనము వారిని అయిష్టతతో చూడొచ్చు. అందుకే సమదృష్టి --అనగా అందరినీ సరి సమానంగా చూసే లక్షణము -- కలిగి ఉండాలి. తద్వారా కోట్లాది జీవుల సమానతను తెలిసికొ౦టా౦. ఇదే దేవుని లక్షణము.

శ్రీకృష్ణుడు అర్జునునికి--అంటే మనకి --చేసే ఉపదేశం రాగద్వేషాలకు అతీతంగా ఉండి మనస్సును వికలం చేసికోవద్దని. ప్రతిరోజూ మనకు ఇష్టం లేని పనులు కొన్ని చెయ్యాలి. వాటికై దృష్టిని కేంద్రీకరించి, వాటివలన ఆనందం పొందాలి.

మనకిష్టం లేని పనులు మనము ప్రేమించే వారి కొరకై చేస్తే ఎంతో ఆనందం పొందుతాము. ఉదాహరణకు వంట చెయ్యడం ఇష్టం లేకపోయినా, సహధర్మచారిణికి వంట గదిలో సాయం చెయ్యవచ్చు.

కొంతమంది ఇష్టం లేని పనులు చేయడంవలన విసుగు కలుగుతున్నాదని అంటారు. దానిని సరిచేసుకోవాలంటే మన ఏకాగ్రతను పెంచుకోవాలి. ఇది ముఖ్యంగా విద్యార్థులకు వర్తిస్తుంది. కొంత మందికి లెక్కలంటే ఇష్టం ఉండదు. కానీ అవి రానిదే చదువులో ముందుకు వెళ్లలేరు. కాబట్టి వారు దృష్టిని లెక్కలమీద కేంద్రీకరించాలి.

నేను ఇవాళ ఒక మిత్రుడు వ్రాసిన వైజ్ఞానిక వ్యాసాన్ని చదివేను. మొదట్లో ఏమీ అర్థం కాకపోయినా, పరిశ్రమ చేసేను. మధ్యలో దానిని అవగాహన చేసికొని వ్యాసాన్ని పూర్తిగా చదివి దానితో ఏకీభవించేను. ఇలాగ మనకు పరిచేయంలేని అంశాలను కూడా మనం పరిశ్రమతో అర్థం చేసికోవచ్చు.

మన నాడీ వ్యవస్థను చెర పట్టిన ఇష్టాయిష్టాలను అధిగమిస్తే మనం పూర్తిగా స్వతంత్రుల మయ్యి, అభద్రతను తగ్గించుకొంటాము. ఉదయం నిద్రలేచి పరోపకారానికై ఉత్సాహంతో ఉంటాము. రాత్రి పడుకునేటప్పుడు, ప్రపంచ౦లోని సమస్యలన్నిటినీ పరిష్కరించ లేక పోయినా, ప్రపంచానికి ఎంతో కొంత మేలుచేసేమని తలచి మనశ్శాంతిని పొందుతాము. 196

Eknath Gita Chapter 3 Section 25

Bhagavat Gita

3.25

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్జ్ఞా నవానపి {3.33}

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి

జ్ఞానవంతుడు కూడా ప్రకృతి ననుసరించియే ప్రవర్తించు చున్నాడు. ప్రాణులు తమ ప్రకృతి నాశ్రయించియే చరించుచున్నవి. కావున నిగ్రహమేమి చేయగలదు?

జీవైక్య సమానతను పాటించినా, మనమంతా సంస్కారాల వలన వేర్వేరు వ్యక్తిత్వము గలవారలము. ఉపనిషత్తులలో ఒక కథ చెప్తారు. సృష్టికి ముందు బ్రహ్మన్ ఒక్కటే ఉంది. అది అద్వైత మైనది. కానీ అది రెండవ్వాలనుకొంది. అలాగా తనను విభజించుకొని సమస్త సృష్టిని, దానిలో నివసించే జీవులను సృష్టించింది. కాబట్టి మనమందరమూ ఒకే మూసలోనుంచి వచ్చే౦.

మనమంతా విశ్వ యోని లోంచి ఆవిర్భవించేము కాబట్టి ఒకరి మీద ఒకరు ప్రేమతో, గౌరవంతో బ్రతకాలి. మొదట్లో దీన్ని కుటుంబంలో అలవరుచుకొని క్రమంగా ప్రపంచమంతా వ్యాపింపజెయ్యాలి. దిన పత్రికలు చదివితే ప్రపంచంలో హింసాకాండ, కలహాలు, మనమంతా ఒకటే అనే భావన లేకుండా చెలరేగుతున్నాయని మనకు తెలుస్తుంది. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది ఒకే బ్రహ్మన్. కానీ మనం స్వార్థ పూరితులమై, మన లాభం, మన కీర్తులకై ప్రాకులాడితే జీవైక్య సమానత గురించి తెలిసికోలేం. స్వార్థపరుడు ఎక్కడైతే వేర్వేరుగా చూస్తాడో, నిస్వార్థపరుడు అక్కడ తనతో పొత్తుగా నున్న లక్షణాలను చూస్తాడు.

బ్రహ్మన్ వ్యష్టిలో ఆత్మ అని చెప్పబడుతుంది. దాన్నే పురుషుడు అని కూడా అంటారు. పురుషుడు మనలని ఏకంగా చూస్తే, ప్రకృతి మనలని వివిధ రూపాలగా చూస్తుంది. మన భౌతిక, మానసిక పరిణామం ప్రకృతి వలన కలిగినది. మానవులలో కూడా వేర్వేరుగా పరిణామం చెందిన వారున్నారు. ఉదాహరణకు, డబ్బే ప్రపంచం అనుకునేవారు, ఈ మధ్యనే జంతువుల నుంచి పరిణామం చెందినవారు.

ఇంద్రియాల గూర్చి తెలిసినవారు వాటితో తాదాత్మ్యం చెందరు. మనం క్షణికమైన సుఖాలను ఆశించేవారిని విమర్శించనక్కరలేదు. వాళ్ళకే కొన్నాళ్ల తరువాత వాటి మీద వ్యామోహం తగ్గుతుంది. మనందరికీ ఒక ఉన్నతమైన లక్ష్యం చేరుకోవాలనే ఆకాంక్ష ఉ౦టుంది. మానవుడు చంద్రుని మీద కాలు వేసి, ఇప్పుడు గ్రహాల మీద అడుగెయ్యాలని తలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మనము దేశ కాల పరిమితిలోనే మనుగడ చెయ్యాలి. మనకి అపరిమితమైన ఆనందం, ప్రేమ, జ్ఞానం, పరుల సేవ కావాలి. ఆ లక్ష్యం చేరేవరకూ మనకు మనశ్శాంతి లేదు. ధ్యానం మొదలుపెట్టిన రోజు నుండీ, మన ఇంద్రియాలను నిగ్రహించి, ఇతరులను మనకన్నా ముఖ్యులుగా తలంచి, మనమా లక్ష్యం వైపు ప్రయాణం సాగిస్తాము.

ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి మనకు ఎంతో ఓర్పు, సహనం కావాలి. అది ఇతరుల యందు మాత్రమే కాదు, మన యందు కూడా. ఇతరులకు ఉపకారం చేసేటప్పుడు, మన గత చరిత్ర గుర్తుకు రావచ్చు. అది మనల్ని కృ౦గదీయవచ్చు. మనము ఎన్ని రోజులు, ఎంత శక్తి పనికి మాలిన పనులకై వృధా చేసేమో గుర్తుకు రావచ్చు. శ్రీకృష్ణుడు చెప్పేది మంచి లక్షణాలతో పాటు బలహీనతలను కూడా కలుపుకొని మనల్ని మనం చూసుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో మనలను పరీక్షించే ఘటనలు ఎన్నో ఉంటాయి. అవి మనలను శక్తిమంతులుగా చెయ్యడానికే. అందుకై మనకు ఎనలేని ఓర్పు, సహనం అవసరం. ఈ శ్లోకం చెప్పినట్లు మనందరికీ వేర్వేరు సంస్కారాలు, లక్షణాలు ఉన్నాయి.

మన సాధన మొదలుపెట్టే కేంద్రం ప్రకృతి మీద ఆధారపడి ఉంది. అలాగే మన వేగం మన చేత నిర్ణయింపబడినది. కొంత మంది ధ్యానం ముందు తమస్ తో బద్దకంగా ఉంటే, ధ్యానం అలవరుచుకున్న తరువాత రజస్ తో చాలా గట్టి ప్రయత్నం చేస్తారు. వారికి అమితమైన ఉత్సాహం ఉండి సాధన ఆలావోకగా చేస్తారు. మరికొందరు డబ్బుకై ప్రాకులాడుతారు. అటువంటివారు వారి రజస్ ని ధ్యానం వైపు త్రిప్పుతే చాలా పురోభివృద్ధి సాధిస్తారు. ఇంకొంతమంది ఎలాగైతే ఒక తేనెటీగ పువ్వు నుంచి పువ్వుకి మారుతుందో, చంచలంగా ఉండి "ధ్యానం ఎందుకు? మంత్ర జపం అవసరమా?" అని ప్రశ్నిస్తారు. అటువంటివారు సమాధి ఎన్నటికీ పొందలేరు. ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికై ఉత్సాహం ఉండడం ఎంతో మంచిది. ఎందుకంటే అది మనస్సును ఏకం చేసి, దృష్టిని కేంద్రీకరించడానికి పనికి వస్తుంది.

మనం పరిణామంలో ఎంత వెనకబడి ఉన్నా భగవంతునిపై దృష్టి సారించవచ్చు. యోగుల్లో అనేక మంది పాపాలు చేసి, భగవంతుని దయవలన సంపూర్ణమైన వ్యక్తులుగా మారేరు. తొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు: "ఒకడు స్వార్థ పూరితుడు, పాపపు జీవనం సాగించినవాడు, ఇతరులకు తీవ్ర దుఃఖం కలిగించినవాడు, అయి ఉండి నన్ను శరణు కోరినచో వానిని సంపూర్ణునిగా చేయుదును. ఎవ్వడైనా, వాని గత చరిత్ర ఎలా ఉన్నా, నన్ను హృదయ పూర్వకంగా సేవిస్తే, వానిని స్వతంత్రుని చేసి నాలో ఐక్యం చేసుకొంటాను" (9:31-2 )

మన గత చరిత్ర ఎలా ఉన్నా, ప్రస్తుతం మన కెన్ని బలహీనతలు ఉన్నా, ఆధ్యాత్మిక సాధన చేయవచ్చు. అది మనం నిర్ణయించుకున్న వేగంతో సాగవచ్చు. మనము ఒకరితో పోలిక పెట్టుకోనక్కరలేదు. ఎవరి స్తోమతను బట్టి వారు సాధన చెయ్యాలి. 193

Eknath Gita Chapter 3 Section 24

Bhagavat Gita

3.24

యే త్వత దభ్యసూయంతో నానుతిష్ఠ౦తి మే మతం {3.32}

సర్వ జ్ఞాన విమూఢాం స్తాన్ విద్ధి నష్టా నచేతనః

అసూయపరులై నా ఉపదేశమును అనుసరించని వారు మూర్ఖులు, జ్ఞాన హీనులు, భ్రష్ఠులని గ్రహింపుము ఀ

శ్రీకృష్ణుడు మనకో హెచ్చరిక చేస్తున్నాడు: ఆధ్యాత్మిక సిద్ధాంతాలను పాటించకుండా, తన స్వార్థానికే ఎవడైతే బ్రతుకుతాడో, వాని సామర్థ్యం క్షీణిస్తుంది. అట్టివారి మనస్సు సంకుచితమై, ప్రతి చిన్న దానికీ విసుక్కొ౦టారు. అలాంటి వారికి దూరంగా ఉండాలని ఇతరులు తలుస్తారు. ఇతరులను సేవించాలా లేదా స్వార్థానికై బ్రతకాలా అని ఒక ఎన్నిక చేసుకోక తప్పదు. అహంకారాన్ని వదులుకోక ఇతరులను సేవించ దలిస్తే దానివలన మనకు లాభం లేదు, ఇతరులకూ లాభం అంతకన్నా లేదు.

అజ్ఞానము, నాస్తిక భావం ఉన్నా ఆధ్యాత్మిక సిద్ధాంతాలు వర్తిస్తాయి. కొందరు ఇలా అంటారు: "నాకు ఈ సిద్ధాంతాల గురించి ఏమీ తెలియదు. నాకు తెలిసిందల్లా నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే చాలు. అలాగే నా గురించి నేను చాటితే నా వ్యక్తిత్వాన్ని పెంచుకోగలనని అనుకున్నాను. కాబట్టి నాకు తెలియని సిద్ధాంతాలు నాపై వర్తింప జేయకూడదు". శ్రీకృష్ణుడు వారికి చెప్పేది: లోక జ్ఞానం అందరికీ ఎంతో కొంత ఉండాలి. ఆ జ్ఞానంతో ఎవరు క్షేమంగా ఉన్నారో, మనశ్శాంతితో ఉన్నారో, ఇతరులకు మేలు చేస్తున్నారో వారి గురించి తెలిసికోవాలి.

నిస్వార్థంగా బ్రతకడమంటే అనుభవంతో, ఇంగిత జ్ఞానంతో బ్రతకడం. గాంధీజీకి మక్కువైన ఒక గుజరాతీ గీతం: "దేవా నాకు విశ్వాసాన్నివ్వు, భక్తినివ్వు, కానీ ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వకుండా ఉండద్దు". ఆధ్యాత్మిక మార్గంలో చరించేవార్లలో ఇంగిత జ్ఞానం ఎంత తక్కువ వుంటే అంత ఎక్కువ పురోగతి పొందేమనే తప్పుడు భావన ఉంది. ఆధ్యాత్మికత అలవరచు కొన్నవాడు మిక్కిలి అనుభవజ్ఞుడు. ఆధ్యాత్మికత లేనివాడు, ఎంత డబ్బు సంపాదించినా, యాంత్రికంగా జీవితం గడిపి అభద్రతతో సతమతమౌతాడు. 188

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...