Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 14

Bhagavat Gita

4.14

కర్మణ్యకర్మ యః పశ్య దకర్మణి చ కర్మ యః {4.18}

స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్

ఎవడు కర్మమునందు అకర్మను, అకర్మమునందు కర్మను గాంచునో వాడే మనుజులలో బుద్ధిమంతుడు, యోగి, సర్వ కర్మముల నాచరించినవాడు అగుచున్నాడు.

శరణాగతి పొందితే కర్మలను మనచే దేవుడే చేయిస్తాడు. మనము దేవుని చేతిలో పనిముట్లమనే భావన శరణాగతివలన కలుగుతుంది.

నేను విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా విద్యార్థులు ఉద్యమం చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళను ఈడ్చి తమ వాహనాలు ఎక్కించేవారు. విద్యార్థులు మొదట్లో ప్రతిఘటించి, అటు తర్వాత నిర్లిప్తులయ్యేవారు. అలాగే మనము దేవుని శరణాగతి కోరితే, మన అహంకారం మొదట్లో ప్రతిఘటించి చివరకు లొంగుతుంది.

గాంధీజీ ఆశ్రమానికి నేను వెళ్ళినపుడు, ఆయనను కలవడానికి అనేక వ్యక్తులు రావడం చూసేను. వారిలో బ్రిటిష్ అధికారులు కూడా ఉండేవారు. ఆయన రోజంతా మంతనాలు చేసి, సాయంత్రం బయటకు వచ్చి చిరునవ్వుతో తమ అనుచరులను పలకరించేవారు.

ప్రతిదినము, మనము ఇతరులకు హాని చెయ్యకుండా, ఒత్తిడి లేకుండా మిక్కిలి క్లిష్టమైన కర్మలు చెయ్యవచ్చు. కొందరికి ఒత్తిడి ఉంటేనే కర్మ చెయ్య బుద్ధి పుడుతుంది. మనకు రోజంతా కష్టపడి పనిచేసేవానికి కడుపులో పుండ్లు ఉంటాయేమోనని అనుమానం వస్తుంది. మనము ఒత్తిడి లేకుండా, చేతన మనస్సులో అలజడి లేకుండా కర్మ చెయ్యవచ్చు. గాంధీజీని ఒకరు "మీరు 50 ఏళ్లగా రోజూ 15 గంటలు పనిచేస్తున్నారు. మీరు ఎప్పుడైనా కొన్నాళ్ళు విశ్రాంతి తీసికోవాలనుకు౦టున్నారా?" అని అడిగేరు. దానికి ఆయన సమాధానం: "నేను ఇన్నేళ్ళూ విశ్రాంతి తీసికొనే ఉన్నాను".

ఎవరైతే గాంధీజీ లాగ భగవంతుని చేతిలో పని ముట్టని తలుస్తారో వారిగురించి శ్రీకృష్ణుడు "నీవు కర్మ చేయటం లేదు. నేను నీ ద్వారా కర్మ చేస్తున్నాను" అని చెప్తాడు. కొందరు కుటుంబాన్ని, సమాజాన్ని వదిలి వెళ్ళి పోవాలనుకుంటారు. మనమందరము ఏదో కర్మ చేస్తూ ఉండి, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాం. ఒక తండ్రి తన పిల్లలను పట్టించికోకపోయినా, వారి స్వభావం వాని వలన ప్రభావితమౌతుంది. మనం కర్మ చెయ్యకపోతే ఇతరులకు మన ఉదాసీనత గురించి తెలుసుకొంటారు.

మనం చెడ్డ కర్మను మంచి కర్మతో తుడిచివేయాలని తలుస్తాం. మనకు చెడు కర్మ ఎక్కువగా ఉంటే ధ్యానంలో అచేతన మనస్సు దాటితే మేల్కొనడం కష్టం. అచేతన మనస్సు దాటినా మనము చేతనత్వముతో ఉండగలగాలి. 249

Eknath Gita Chapter 4 Section 13

Bhagavat Gita

4.13

కిం కర్మ కి మకర్మేతి కవయో అప్యత్ర మోహితాః {4.16}

తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్

కర్మ యెట్టిది? అకర్మ యెట్టిది? అను విషయమున పండితులు సైతము భ్రమించియున్నారు. దేనిని తెలిసికొని నీవు అశుభమునుండి విముక్తుడ వయ్యెదవో అట్టి కర్మ రహస్యమును నీకు చెప్పుచున్నాను

కర్మణో హ్యపి బోద్ధవ్య౦ బోద్ధవ్య౦ చ వికర్మణః {4.17}

అకర్మణశ్చ బోద్ధవ్య౦ గహనా కర్మణో గతిః

కర్మ, అకర్మ, వికర్మ -- ఈ మూడును తెలియదగి యున్నవి. కర్మల విషయమును గ్రహించుట దుర్లభము

ఇక్కడ కర్మ అనగా మన౦ చేసే పని మాత్రమే కాదు, ఆలోచన కూడా అని అర్థం చేసికోవాలి. ప్రసార మాధ్యమాలలో చేసే ప్రకటనలు ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. నిద్రలో కూడా అవి గుర్తుకొస్తాయి. అదే పదములతో కూడిన ఆలోచనల శక్తి.

ఆలోచన కూడా ఒకరకమైన కర్మ. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆలోచన కర్మకు ముందు జరిగే అభ్యాసము అని చెప్పేరు.

మనము ఇంట్లో ఖాళీగా కూర్చొని కర్మను చేయకుండా ఉండలేము. మనము కుర్చీలో బంధించుకొని కూర్చున్నా ఆలోచనలతో కర్మను చేస్తున్నట్టే. కర్మ నుంచి పూర్తిగా విడబడాలంటే ఆలోచన ఎక్కడ ఉద్భవిస్తున్నాదో ఆ మూలానికి వెళ్ళాలి. ధర్మపాదలో బుద్ధుడు మనము మన ఆలోచనలతో మలచ బడ్డ వారలమని చెప్పెను. ఆలోచనలు మన అచేతన మనస్సులో ఉద్భవించి, క్రమంగా తదనుగుణంగా పనులు చేయిస్తాయి. కాబట్టి పని ఆలోచనలనుండి ఉద్భవిస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యం పనిని ఆలోచనలతో నియంత్రించడం.

వికర్మ అంటే నిషిద్ధకర్మ. అంటే ఆ కర్మ చెయ్యడంవలన ఇతరులకు హాని కలుగుతుంది. క్రోధము, భయము, దురాశలతో చేసేది వికర్మ. గీత క్రోధంతో చేసిన పని, ఇతరులకు, చివరకు మనకు కూడా కీడు చేస్తుంది అని చెప్తుంది. మనలో చాలామంది క్రోధం కలగగానే, ఆవేశ పూరితంగా కర్మలు చెయ్యడం ఉపక్రమిస్తాం. అదే క్రమంలో తమస్ రజస్ గా మారుతుంది. ఎంత ఉదాసీనంతో ఉన్నవాడైనా క్రోధం కలిగితే ఏదైనా చేసి, ఇతరులకు దుఃఖం కలిగిస్తాడు.

తెలివిగలవాడు క్రోధం, భయం, ద్వేషం మొదలైన గుణాలను దూరం చేసుకొంటాడు. కొందరు హింసాకాండను అణచివేయడానికి, తప్పుగా, ద్వేషం, క్రోధంతో స్పందిస్తారు. హింసని అహింసతోనే ఎదుర్కోగలం. దాన్ని రూపుమాపటానికి మనమెంతో సహనంతో, ఒప్పించే విధంగా, గౌరవంతో, వివేకముతో, ఖచ్చితంగా ఉండాలి. సున్నితత్వం, మైత్రి అందరిలోనూ ఉంటుంది. క్రోధంగా మాట్లాడితే అది ఇతరులను క్రోధంతో స్పందింపజేస్తుంది. దాని వలన మన ప్రత్యర్థులనుంచి వేర్పాటు అధికమౌతుంది. జీసస్ మనల్ని ప్రేరణ చేసేవారిని సహించి, దూషించేవారిని ఆశీర్వదించి, ద్వేషించేవారికి మంచి చెయ్యమని బోధించేరు. నా దృక్పథంలో ప్రేమకు ప్రతిస్పందన చూపని వారు లేరు, ఎందుకంటే అందరినీ ప్రేమించే దేవుడు మనందరిలోనూ ఉన్నాడు.

భయము, దురాశ క్రోధం లాగే దుష్ఫలితాలను ఇస్తాయి. ఈ మూడిటివలన మనం అధోగతి పొందుతాము.

ఇకపోతే అకర్మ -- అనగా కర్మ చెయ్యకపోవుట. మన స్వార్థాన్ని త్యజించి, మనల్ని నడిపేది మనలో ప్రతిష్ఠితమైన దేవుడేనని నమ్మితే అన్ని కర్మలనుండీ విముక్తి పొందుతాము. మనం కర్మ చెయ్యం; మనలోని దేవుడు కర్మ చేయిస్తున్నాడు. గాంధీజీని "మీరు ఒక్క తూటా వాడకుండా, చరిత్రలో అతి శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కోగలిగి దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించేరు?" అని అడిగితే ఆయన తన స్వార్థాన్ని, వేర్పాటుని త్యజించి దేవుని చేతిలో ఒక పని ముట్టుగా మాత్రమే ఉన్నానని చెప్పేరు.

ఇదే అకర్మ అంటే. కానీ మనం పని చెయ్యకుండా ఉండడం అకర్మ కాదు. మనకి పని చేయవలసిన అవసరం ఎంతో ఉంది. మన౦ చేసికోవలసిన ఎన్నిక: స్వార్థంతో మనకి, మన చుట్టూ ఉన్నవారికి అధోగతి కలిగిస్తామా; లేదా దేవుని పని ముట్టు వలెనుండి కుటుంబ, సమాజ, దేశ, ప్రపంచ బాగుకయి ప్రయత్నిస్తామా? 246

Eknath Gita Chapter 4 Section 12

Bhagavat Gita

4.12

న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా {4.14}

ఇతి మాం యో అభిజానాతి కర్మ భిర్న స బధ్యతే

నన్ను కర్మలు అంటవు. నాకు కర్మఫలము నందు ఆశ లేదు. ఈ విధముగ నన్ను తెలిసికొనినవాడు కర్మలచే బంధింపబడడు

ఏవం జ్ఞాత్వా కృతం పూర్వైరపి ముముక్షుభిః {4.15}

కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్

ఈ విధముగ తెలిసికొని పూర్వము ముముక్షువులు కర్మల నాచరించిరి. పూర్వుల వలెనే నీవు కూడ కర్మల నాచరింపుము

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు నిస్వార్థ సేవ లేదా కర్మ యోగ౦ గురించి చెప్తున్నాడు. ఎవరైనా డబ్బు, దస్కం, పేరు, ప్రతిష్ఠ లకై పని చేస్తారో, వారు ఆ కర్మకు బంధీలై ఉంటారు.

మనము అహంకారానికి బద్ధులమై స్వార్థ పూరిత కర్మలు చేస్తూ ఉంటాము. మనమలా ఉన్నంత కాలము మర మనుష్యులు లాగ కర్మల నాచరిస్తూ ఉంటాము. మనమెంతో కష్టపడి పని చేయవచ్చు. కానీ అది స్వంత లాభానికై అయితే, ఆ కర్మకు మనము బంధీలము.

స్వార్థ పూరిత కర్మలు చేసేవారు చేతన మనస్సులోని శక్తులను పొందలేరు. నా అమ్మమ్మ ఈ విధంగా చెప్పేది: శ్రీకృష్ణుడు మనకు రెండిచ్చి ఏదో ఒకటి ఎన్నుకోమంటున్నాడు. ఒకటి స్వార్థంతో బ్రతకడం. అట్టివారు, కాలగర్భంలో కలిసిపోతారు. రెండవది పరులకై బ్రతకడం. అది ఎంత బాధాకరమైనా ఓర్చి మన దృక్పథాన్ని విశాలం చేసికొని సమస్త జీవుల మేలు కొరకై ప్రయత్నించాలి. ఈ విధంగా మన మెంత పరోపకారము చేస్తే అంత ఎక్కువ శక్తి కలుగుతుంది.

కొంతమంది రోడ్డు ప్రయాణంలో టోల్ కట్టాల్సి వస్తుంది. అందుకై రెండు మార్గాలు ఉంటాయి. ఒకమార్గంలో వెళ్లాలనుకొంటే మన దగ్గర టోల్ కి కావలసిన సొమ్ము ఎక్కువా, తక్కువా లేదు. అంటే మనమెక్కడా ఆగక్కరలేదు. ఇదే అహంకారం లేని వాని రాజ మార్గం. రెండో మార్గంలో మన దగ్గిర చిల్లర లేక, పెద్ద నోట్లు ఉండి, చిల్లరకై మిగతా వాహనాలతో వరసలో వెళ్ళాలి. ఈ మార్గం అహంకార పూరితుడైన వానికి చిహ్నం.

ఆధ్యాత్మిక పథంలో మనకో ఎన్నిక ఉన్నది: మనం జీవి౦చాల్సింది పేద కుటుంబం లోనా లేదా ధనవంతుల కుటుంబం లోనా; మన సంపర్కం పామరులతోనా లేదా పండితులతోనా; మనకి సంపూర్ణ ఆరోగ్యం కావాలా లేదా రోగాలు రొష్టులు తో కాలం గడపాలా; మనకేది ఆనందం ఇస్తుందో దాని వెంట పరిగెడతామా లేదా ఇతరులకు ఆనందం కలిగించే దిశలో వెళ్తామా? మనం అహంకారం కొరకై పనులు చేస్తే దేవునికి మనము నిరుపయోగ౦. అలాకాక దేవుడే మనల్ని కర్మలు చేయడానికి ప్రోద్భలం ఇస్తున్నాడని తలిస్తే, మనము కర్మ సిద్ధాంతానికి అతీతులమై, కర్మ కెన్నడూ బంధీలము కాము.

అటు పిమ్మట శ్రీకృష్ణుడు ముముక్షువుల గురించి చెప్పుచున్నాడు. ముముక్షువనగా జీవైక్య సమానత యందు ఎనలేని అవగాహన కలిగించుకోవాలనే ఇచ్ఛగలవాడు. తలిదండ్రులు పిల్లలు, భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియులు, మిత్రులు, చివరకు శత్రువులు అందరూ ఒకటే అనే భావన కలిగి యుంటే మన ధ్యానం గట్టిపడడానికి సహకరించి, అల్పమైన, స్వార్థంతో కూడిన ఆలోచనలను నియంత్రిస్తుంది. ఎవరికైతే స్వతంత్రత కై, తమలోని దేవుని దర్శి౦చుటకై ఇచ్చగలదో వారు నిస్వార్థంగా పరులకు సేవచేసి, పరుల కోసమై బ్రతుకుతూ, అది పొందగలరు.

గతంలో ఎన్ని తప్పులు చేసినా వాటిని స్వలాభమునకై కాక, స్వంత ఆనందానికై కాక, ఇతరుల కొరకై సేవ చేస్తే తుడిచివేయగలము. శ్రీకృష్ణుడు మనందరిలోనూ ముముక్షువవుటకు కావలసిన బీజము ఉన్నదని అభయమిచ్చుచున్నాడు. ధ్యానం ద్వారా మన పాత అలవాట్లను మార్చుకోవచ్చు. మనము రోజూ తేనీరు తాగే వాళ్ళమయితే, దానిని కాఫీ అలవాటుగా మార్చుకోవచ్చు. కొన్నాళ్ళు కాఫీ తాగి, అటు పిమ్మట హార్లిక్స్ త్రాగవచ్చు. ఈ విధంగా ఒకే అలవాటుకి బానిసగా ఉండనక్కరలేదు.

మన చెడు అలవాట్లను మంచి అలవాట్లతో విడిపించుకోవచ్చని మనందరికి తెలుసు. కానీ యోగులు చెప్పేది మంచి అలవాట్లను కూడా కొన్నాళ్ళకి వదిలి వేయాలని. ఎటువంటి అలవాటైనా మనలని దానికి బానిసగా మారుస్తుంది.

యోగులు ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండగలిగితే, ప్రతి అంశం ఆనందాన్ని కలిగిస్తుందని చెప్తారు. అలాగే మనలో ఉండే రాగద్వేషాలు -- అనగా ఒక వస్తువుపై మమకారము, మరొక దానిపై ద్వేషము--మాటుమాయమౌతాయి. క్రమంగా మన నాడీ వ్యవస్థ ద్వంద్వాలకే పరిమితం కాక ప్రతి విషయంలోనూ మనల్ని ఉత్సాహభరితుల్ని చేస్తుంది. ఈ విధంగా సుఖదుఃఖాలు, ఇష్టాయిష్టాలు మొదలగు ద్వంద్వాలను దాటితే మనకు మోక్షము పొందుటకు కావలసిన శక్తి పుంజుకొ౦టాము. అంటే జీవైక్య సమానతను చేతన మనస్సుతో అనుభవిస్తాము. 240

Eknath Gita Chapter 4 Section 11

Bhagavat Gita

4.11

చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః {4.13}

తస్య కర్తార మపి మాం విద్ధ్య కర్తార మవ్యయమ్

గుణములను బట్టియి, కర్మములను బట్టి నాలుగు వర్ణముల వారిని నేనే సృజించితిని. నేను వాటికి కర్తనయినను నన్ను అవ్యయునిగ, అకర్తునిగ గ్రహింపుము ఀ

త్రిగుణాల -- సత్త్వ, రజస్, తమస్ -- వేర్వేరు పరిమాణాల వలన మనలో తేడాలుంటాయి. ఉదాహరణకు మన బొటన వేలు, చూపుడువేలు వేర్వేరు. అలాగే చిటికిన వేలు. కానీ ఆ వేళ్ళకు ఆధారమైన అరచేయి ఒకటే.

మన తేడాలు పైపైనే. ధ్యానమాచరించి, మన దృష్టిని అంతర్ముఖం చేస్తే మెహర్ బాబా చెప్పినట్లు "నీవు, నేను, మనము కాదు; నీవు, నేను, ఒక్కటే".

అన్నిటికన్నా నీచమైన గుణం తమస్. తామసికుడు "ఎవరికోసం కర్మ చెయ్యాలి? సమాజం నుంచి వేరైపోతే పోలే? నా రాజ భవనం లాంటి ఇంట్లో కాలంగడిపేస్తే, ఇతరులతో పొత్తులు నాకెందుకు?" అని అనుకొంటాడు. కొందరు సమాజం నుండి వేర్పడి, ప్రపంచాన్ని పట్టించుకోక పోతే, ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందుతుందని భావిస్తారు. అది గీత ఒప్పుకోదు. ఒక రాయి లేదా చెట్టు స్పందించక పోతే ఫరవాలేదు. ఎందుకంటే అది వాటి సహజ గుణం. కానీ మనుష్యులమైన మనం మానవాళి ఎదుర్కొనే సవాళ్లను స్వీకరించి, వాటికి తగిన పరిష్కారం వెదకాలి. శ్రీకృష్ణుడు (3:12) ఇలా చెప్పేడు: ఎవడైతే వేర్పాటుతో, ప్రపంచ సమస్యలను పట్టించుకోడో, వాడు స్తేన -- అనగా దొంగ. గీత నిస్వార్థ౦తో మన కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి పరోపకారము చేయమంటుంది.

నేను ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు విద్యార్థులు పెద్ద పరీక్షలు జరిగే ముందు దేవుని ఎక్కువగా పూజి౦చేవారు. వారు గుళ్ళలో దేవునికి -- ముఖ్యంగా విఘ్నాలను తీసివేసే విఘ్నేశ్వరునికి -- కొబ్బరికాయలు కొట్టేవారు. ఎందుకంటే సంవత్సరం పొడుగునా వారు చదువును వాయిదా వేసి జాప్యం చేసేరు. ఇదే తామసికుని లక్షణం.

మనకెప్పుడైతే ఒక పనిని వాయిదా వేద్దామని అనిపిస్తుందో, అది ఇంటి పనైనా లేదా ఆఫీసు పనైనా, అప్పుడు నడుం బిగించి చెయ్యాలి. మనకిష్టం లేని పనిని వెంటనే చెయ్యాలి. మన కిష్టమైన పనులు నెమ్మదిగా చెయ్యవచ్చు.

నేను ఇవ్వగలిగిన సలహా: మీకు ఒక పని చేయడానికి బద్దకంగా ఉంటే, దీర్ఘంగా మంత్రం జపిస్తూ నడవండి. అది మన దృక్పథాన్ని ఒక గంటలో మార్చేస్తుంది. ఒక గుర్రం లాగ మనం పని వైపు దూసుకు వెళ్ళాలి. ఈ విధంగా రక్త ప్రసరణ జరిగితే, ఊపిరి తిత్తులు ఎక్కువగా పని చేస్తే, మంత్రం చేతన మనస్సులో ప్రతిధ్వనిస్తుంటే, మనలో ఎనలేని మార్పు వస్తుంది. దానివలన మనలో ఒకపని ఎన్నటికీ చేయలేమనే భావన లేకుండా పోతుంది. ఒక గొప్ప కార్యక్రమానికి ముందు -- ఉదాహరణకు ఉపన్యాసం ఇవ్వాలంటే-- మంత్రం జపిస్తూ దీర్ఘమైన నడకకు వెళ్ళండి.

మన శరీరము ఒక యంత్రము లాంటిది. కానీ నేటికాలంలో దాని సహజ గుణాన్ని మర్చిపోయేం. మనము ఉదయం లేచి౦దగ్గరనుంచీ ఇంట్లో, ఆఫీసులో, వాహనంలో కూర్చొని మన గుండెకు తగినంత పని ఇవ్వము. గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే: మితంగా తిని, పోషకాహారాన్నే తిని, ఆకలి వేసినప్పుడే తిని, వీలయినప్పుడల్లా మంత్రాన్ని జపిస్తూ వ్యాయామం చెయ్యాలి.

తమస్ ని రజస్ గా మార్చుకోవాలంటే చురుగ్గా ఉండాలి. అలాగే రజస్ ని సత్త్వ గుణంగా మార్చుకోవాలంటే నిస్వార్థంగా ఇతరులకు మేలు చెయ్యాలి. మన అశాంతిని, శక్తిని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు కేంద్రీకరించాలి. అశాంతిగా ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ, చేతన మనస్సు లోతులకు వెళ్ళాలి.

నిర్మలంగా, ప్రశాంతంగా, వైరాగ్యంగా ఉండడం వలన సత్త్వ గుణము అబ్బుతుంది. నేటికాలంలో ఇది చలా అవసరం. సత్త్వ గుణమున్నవారు ఎక్కువ పనిచేసినా, అది వారికొరకై కాక, పరుల సేవనార్థము. కానీ సాత్త్వికుడు కర్మఫలాన్ని ఆశిస్తాడు. కాబట్టి సత్త్వ దగ్గరే ఆగిపోకూడదు. మన జీవిత లక్ష్యం, అన్ని మతగ్రంథాలూ చెప్పేవి, మన౦దరిలోన ప్రతిష్ఠితమైన దేవుడు ఒక్కడే అని తెలుసుకోవడం. క్రైస్ట్, బుద్ధుడు, గాంధీజీ త్రిగుణాతీతులు. మహాత్మా గాంధీ దేశాకాలమానాలకి అతీతమై మనల్ని ప్రభావితం చేసేరు.

గీత చెప్పేది: అందరికన్నా నీచమైన వారు దేన్నీ పట్టించుకోరు. వారికన్నా ఉన్నతమైన వారు తమ స్వార్థానికై పనిచేస్తారు. మరింత ఉన్నతమైనవారు నిస్వార్థంగా పరులను సేవిస్తారు. అందరికన్నా ఉత్తమమైన వారు జీవైక్య సమానతను తెలిసికొన్నవారు. ఆధ్యాత్మిక పరిణామమే మన వర్ణ వ్యవస్థకు మూలం. సనాతన౦గా ఒక వర్ణంలో పుట్టినవాడు కర్మల వలన వేరొక వర్ణమును పొందవచ్చును. కానీ నేటి కాలంలో వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థగా మార్చేరు. అంటే పుట్టుకతోనే కులాన్ని అపాదించి మరణించేవారకూ అదే కులమని శాసించేరు. అందువలన దేశం అనేక విధాలుగా వెనుకబడింది. గాంధీజీ కుల వ్యవస్థను అహింసతో ఎదుర్కొన్నారు. కాబట్టి అది కొంచెం క్షీణించింది.

నేను అమెరికాలో పలుచోట్ల కుల వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొన్నాను. నేను చూసిన ప్రతి దేశంలోనూ కుల వ్యవస్థ ఉంది. కాకపోతే వారు దేశం, మతం, ఆస్తి, జాతి, రంగు, చదువు మొదలైన అంశాలను తెలిసికొని దాని ప్రకారం విచక్షణ చేసి, వారిని వాడుకొంటారు. మన దేశంలో, ఐరోపాలో, ఆఫ్రికాలో, అమెరికాలో వేర్వేరు కులవ్యవస్థలు ఉన్నాయి. ఎక్కడైతే ప్రజలు దేవుడు మనందరిలోనూ ఉన్నాడని తలంపక ఇతరులను ప్రేమతో, గౌరవంతో చూడక ఉంటారో, అక్కడ కుల వ్యవస్థ పాతుకు పోయి ఉంటుంది. 239

Eknath Gita Chapter 4 Section 10

Bhagavat Gita

4.10

కాంక్షంతః కర్మాణాం సిద్ధిం యజ౦త ఇహ దేవతాః {4.12}

క్షిప్ర౦ హి మానుషే లోకే సిద్ధి ర్భవతి కర్మజా

ఈ లోకమున కర్మఫల సిద్ధిని ఆశించువారు దేవతల నారాధించుచున్నారు. మానవ లోకమున కర్మఫలము శీఘ్రముగ కలుగుచున్నది

శ్రీకృష్ణుడు ఒక రహస్యాన్ని చెప్తున్నాడు: ప్రతి కోరిక ఒక ప్రార్థన. ఒకరు డబ్బుకై తపన పడతారు. వారు, నాస్తికులైనా, నిజంగా "దయచేసి, డబ్బు ఇవ్వు" అని తమలోన ప్రతిష్ఠితమైన దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. మనం రోజూ రెండు గంటలు ధ్యానం చేసి డబ్బడిగితే, వ్యాపారాలు చేసేవారు రోజంతా అలా ప్రార్థిస్తున్నారు.

సిగరెట్లు తాగే వాళ్ళు ఒక విధంగా చూస్తే దేవుడికి అగరబత్తులతో పూజ చేసే వారలుగా అనిపిస్తారు. కానీ వాళ్ళకు ఊపిరితిత్తులలో వ్యాధి ఏదో ఒకనాడు రావచ్చు.

కొంతమంది పరుల మెప్పుకై పనులు చేస్తారు. ఒక పిల్లవాడు "చేత వెన్నముద్ద, చెంగల్వ పూదండు, బంగారు మొలతాడు, పట్టు గట్టి, సందె తాయతలు, సిరి మువ్వ గజ్జలు, చిన్ని కృష్ణా నిన్ను చేరి గొలుతు" పద్యాన్ని కంఠతా పెట్టి పెద్దవాళ్ళ ముందు పాడి వినిపించి మెప్పుకై ప్రయత్నిస్తాడు. ఇదే పెద్దవాళ్ళు కూడా చేస్తారు. కానీ వారికి పేరుప్రతిష్ఠలు కావాలి.

పేరుప్రఖ్యాతులు సులభంగా వస్తాయి. కొందరు తమ ముఖచిత్రాన్ని ప్రతి పత్రిక మీదా ముద్రించాలని కోరుకొంటారు. ఆ కోరిక తీరుతే, క్రమంగా మనలాగే అజ్ఞాతంగా ఉండడమే మేలని వారికి తెలుస్తుంది.

మన కోర్కెలను ఏకం చేస్తే డబ్బు, పేరు పొందవచ్చు. వాటితో పాటు మనకు పరిమితమైనదేదీ సంతృప్తి నివ్వదని తెలుస్తుంది.

ఉపనిషత్తులలో ఇలా చెప్పబడినది:

నువ్వు నీలోని గాఢమైన కోర్కెతో చేయబడ్డావు

కోర్కె ఎలాంటిదో నీ మనస్సు దాని కనుగుణంగా ఉంటుంది

నీ మనస్సు ఎలా వుంటుందో, కర్మ కూడా అలాగే ఉంటుంది

నీ కర్మను బట్టి, నీ ప్రారబ్దం ఉంటుంది

మనమందరము గొప్ప కోర్కె కలిగి ఉండవచ్చు. కానీ అది లాభము, పేరు ప్రఖ్యాతలు మొదలగు వాటి కొరకై చిన్న చిన్న ఖండాలుగా చేయబడింది. ధ్యానం ద్వారా పనికిరాని కోర్కెలకై వృధా అవుతున్న శక్తిని ఒక చోట కేంద్రీకరించవచ్చు. మనకు హోటళ్లలో, బ్యాంక్ ల్లో, బట్టలలో ఉన్న కోర్కెలను ఒక చోట పోగుచేస్తే అది అతి పెద్దదై, ఎటువంటి పరిమితమైన వస్తువూ తీర్చలేనిదిగా అవుతుంది. అల్పులు డబ్బూ, దస్కం, పేరు లకై పాటు పడతారు. కానీ ధ్యానం చేస్తే మన౦ కోరుకొనే శక్తి అధికమౌతుంది. ఒక ఒంటె ఆకలిని ఆవగింజతో తీర్చలేమన్నట్టు మనమే పరమిత వస్తువుని కాంక్షించం.

సెయింట్ అగస్టీన్ "దేవుడా, నీలో ఐక్యమవ్వడానికి పుట్టిన నేను, శాంతి వేరే ఎక్కడో ఉందని ఎలా తలచేది?" అని అన్నారు. నేటి కాలానికి అన్వయించుకొంటే "మనము దేవుని నుండి ఆనందము పొందడానికి నిశ్చయించు కొన్నాక, తుచ్ఛమైన డబ్బు, తిండి, బట్టలు మనకు ఎందుకు?"

దేవుడు చెప్పేది "నీ ప్రేమను డబ్బుకై వృధా చెయ్యవద్దు. ఆ ప్రేమ నాకు చెందినది. నీ ప్రేమను క్షణికమైన సుఖాలకు, ఆనందానికి వెచ్చించ వద్దు. నేను నీకు ప్రేమ స్వభావము ఇచ్చినది, నన్ను అన్ని చోట్లా, అన్ని వస్తువులలోనూ చూస్తావని."

ఉంకో విధంగా చెప్పాలంటే భగవంతుడు మనకి కొంత ఇంధనము ఇచ్చేడు. ఉదాహరణకి మనం న్యూయార్క్ వెళ్ళదలచాం. దానికి సరిపోయే ఇంధనం మన దగ్గర ఉంది. కానీ వెళ్ళడానికి ముందు, బజారులో వస్తువులు కొనడానికి పలుమార్లు ఆ ఇంధనం నుంచి తీసి ఖర్చు చేసేం. దేవుడు సాధారణంగా కొంత ఎక్కువ ఇంధనం ఇలాంటి వ్యాపకాలను దృష్టిలో పెట్టుకొని ఇస్తాడు. కాని మనమా వ్యాపకాలను మితిమీరి చేస్తే మనమెన్నటికీ న్యూయార్క్ వెళ్లలేము. మన ఆధ్యాత్మికతను కూడా వాయిదా వేస్తే ఇదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. 235

Eknath Gita Chapter 4 Section 9

Bhagavat Gita

4.9

యే యథా మాం ప్రపద్యన్తే తాం స్త థైవ భజామ్యహం {4.11}

మమ వర్త్మాను వర్త౦తే మనుష్యాః పార్థ సర్వశః

అర్జునా! ఎవరు నన్ను ఏ విధముగా సేవింతురో వారిని ఆ విధముగనే నే ననుగ్రహింతును. మనుజులు సర్వ విధముల నా మార్గమునే అనుసరించు చున్నారు

కబీర్ దాస్ గురించి తెలియనివారు ఉండరు. భారత దేశంలో అన్ని మతాల సామరస్యం ప్రవచించిన వారిలో అతడు ప్రధముడు. ఆయన ఒక పద్యంలో ఇలా వ్రాసేరు:

మిత్రుడా, నా గురించి ఎక్కడ వెదకుతున్నావు?

చూడు, నీలోనే ఉన్నాను

గుడిలో కాదు, మాస్క్ లో కాదు

కాబా లోకాదు, కైలాసములో కూడా కాదు

ఇక్కడే నీలోనే ఉన్నాను

మతాలు కాలక్రమేణా స్థాపకుల బోధనను విడిచి దాని స్థానంలో అంత ముఖ్యము కాని ఆచారాలు, సిద్ధాంతాలు, సంప్రదాయాలు స్థాపించేయి. ఈ విధమైన పైపైగా ఉన్న విషయాలతో ఉంటే మతాలు అఖండమైన దేవుని గురించేనన్న అవగాహన తగ్గుతుంది.

కాబట్టి మన మతమేదైనా సరే --క్రిస్టియన్, యూదుడు, భౌద్ధుడు, ముస్లిం-- ఎవరైనాసరే మనం చేరవలసిన గమ్యం ఒక్కటే. ఇక్కడ ముఖ్యాంశం ఏమిటంటే మత గ్రంధాలలో దేవుడు ప్రవచించిన బోధను హృదయ పూర్వకంగా, మనసారా, సంపూర్ణ౦గా తెలిసికొని ఆచరిస్తే ఆ దేవునితో ఐక్యమవుతాం. ఈ శ్లోకంలో సర్వ మత సమానత్వాన్ని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడు. మన సంస్కృతిని, దేశాన్ని, మతాన్ని, సమాజాన్ని విడిచి లక్ష్యాన్ని చేరడానికి ఎక్కడికో వెళ్ళనక్కరలేదు.

భగవంతుడు కోరే మార్పు మన అహంకారాన్ని, వేర్పాటుని వీడడం. మనము స్వర్గాని కెళితే అక్కడి ద్వార పాలకులు మన మతాన్ని అడగరు. ఏ మతంలో పుట్టేమో, ఏ చర్చికి వెళ్ళేమో, మన పురోహితుడెవరో దేవునికి అనవసరం. ఆయన అడిగేది: అన్ని జీవులలోనున్న నన్ను ప్రేమించేవా? నన్ను అందరికన్నా ముఖ్యునిగా చూసేవా? మనం ఇవ్వవలసిన సమాధానం: మన శక్త్యానుసారం, అహంకారాన్ని వీడి, స్వల్పమైన వ్యక్తిత్వాన్ని మరచి, కుటుంబం, సమాజ౦, ప్రపంచం యొక్క ఆనందానికై ప్రయత్నించే౦. 231

Eknath Gita Chapter 4 Section 8

Bhagavat Gita

4.8

వీత రాగ భయక్రోధాః మన్మయా మా ముపాశ్రితాః {4.10}

బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః

అనురాగము, భయము, క్రోధము తొలగినవారును, నా యందే మనసు గలవారును, నన్నే ఆశ్రయించిన వారును అగు అనేకులు జ్ఞానమనెడి తపస్సుచే పావనులై నా స్వరూపమునే బొందిరి

వీతరాగభయక్రోధ -- అనగా బంధాలతో, భయంతో, క్రోధంతో ఉండవద్దని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా "వాటిని వదిలేయి. అవి నిన్ను జనన-మరణ చక్రంలో ఉంచి విచారము, దుఃఖము కలిగిస్తాయి" అని చెప్పెను. ప్రతిరోజూ మన౦ వ్యక్తులతోనూ, వస్తువులతోనూ, బంధాలను తగ్గించుకోవాలి. భయం, క్రోధం మొదలైన వాటికి లొంగకూడదు. దీనికై ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. గాఢమైన ధ్యానంలో దేహాభిమానమును వదిలి, బంధ విముక్తులమై, డబ్బు, దస్కం, మొదలైన వ్యాపారాలు లేకుండా చేసుకొంటాం.

వైరాగ్యం వలన విచారం కలుగవచ్చు. తలిదండ్రులు మనకు "కాదు, వద్దు" అని చెప్పకపోతే పెద్ద అయ్యేక ఎవరినీ ఖాతరు చేయం. పిల్లలయందు గల ప్రేమ వలన "కాదు, వద్దు" అని చెప్పగలగాలి.

ప్రతి అనుబంధంలోనూ వైరాగ్యం దుఃఖం కలిగిస్తుంది. ఎందుకంటే మన అహంకారానికి, పాతుకుపోయిన మనోభావాలికి, సంతోషానికి ఎదురు తిరగాలి. మన దగ్గిర సంబంధాలలో అప్పుడప్పుడు వారు మనం చెప్పినట్లు చెయ్యాలని అనుకొంటాం. దీనివలన బంధాలు, ముఖ్యంగా తలిదండ్రులు పిల్లలు మధ్య, చెడతాయి.

తలిదండ్రులు తమ పిల్లలు వేరే తరంలో, కాలంలో పెరుగుతున్నారు కాబట్టి వారి యందు కొంత వైరాగ్యం పెంచుకోవాలి. వారు మమకారం తగ్గించుకొని పిల్లలు పూర్ణమైన వ్యక్తులవ్వాలంటే "నువ్వు స్వార్థంతో పని చేయనంత కాలము మేము నిన్ను ఆదరణతో చూస్తాము" అని చెప్పాలి. ఈ విధంగా పిల్లల్ని మనకన్నా ముఖ్యులని తలిస్తే వారు ఆనందంగా స్పందిస్తారు.

మనలోని స్వార్థ౦, కోర్కెలు , పేరుప్రతిష్ఠలకై ప్రయత్నించే స్వభావము, స్వలాభము తీసేస్తే దేవుడు ఖాళీని జ్ఞానం, ప్రేమ, సద్గుణాలతో నింపుతాడు. ఇదే మన్మయ కి అర్థం.

ఒకమారు రాధకి అసూయ కలిగి శ్రీకృష్ణుని "నీ పెదాలెప్పుడూ ఆ వేణువు మీదే ఉంటాయి. నా పెదాల మీద ఎందుకుండవు?"అని ప్రశ్నించింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన వెదురుతో చేసిన మురళిని అటూ ఇటూ ఊపి "చూడు ఇదంతా ఖాళీ. కాబట్టే దీన్ని నా నాదంతో నింపగలుగుతున్నాను" అని సమాధానమిచ్చేడు.

మాం ఉపశ్రితాః -- అనగా నామీదే పూర్తిగా భారం వెయ్యి అని అర్థము. ఆధ్యాత్మిక మార్గంలో మనం చూపవలసినది సంపూర్ణ శరణాగతి. దేవుడు చక్కని రథ సారథి. అలా నమ్మక మనము రథాన్ని మనిష్టమొచ్చినట్లు నడుపుతాం. మనలోని దేవుడు "నన్ను ఎందుకు సారథ్యం చెయ్యనివ్వవు? నువ్వు బుద్ధిగా కూర్చో. నాకు రథమెలాగ నడపాలో చెప్పొద్దు. నన్ను పూర్తిగా నమ్ము" అంటాడు.

అలాగని మనం ముందు జాగ్రత్త లేకుండా ఉండకూడదు. ఉదాహరణకి కారు నడుపుతూ, దేవుడే నడుపుతున్నాడని తలచి ఎర్ర లైట్ దాట కూడదు. మనము శ్రీకృష్ణుని రద్దీగా ఉన్నప్పుడు ఎలాగ నడిపేది అని అడిగితే: రద్దీగా ఉన్న సమయంలో కారు వాడద్దు. అలా వాడవలసి వస్తే ఇతరు వాహనదారులతో కలహాలు పెట్టుకోవద్దు. ఈ విధంగా మనమన్ని ముందు జాగ్రత్తలు తీసికొని "దేవుడా నేను చెయ్యగలిగినంత చేసేను. తక్కిన భారం నీదే" అని ప్రార్థించాలి.

మద్భావం ఆగతాః -- అనగా అతను నన్ను ఆవహిస్తాడు. మనము వస్తువులమీద ప్రేమ వదులుకుంటే, స్వార్థంతో కూడిన బంధాలను త్రె౦పుకుంటే, భయము, క్రోధము నిర్మూలిస్తే దేవుడు: "నిన్ను సర్వ జీవులయందు ప్రేమతో నింపుతాను; ఆ ప్రేమలో ఎటువంటి స్వార్థపూరితమైన సంతోషం, ప్రతిష్ఠ ఉండదు. ఆ ప్రేమను నిస్వార్థ సేవకై ఉపయోగించగలిగే శక్తిని విడుదల చేస్తాను" అంటాడు 230

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...