Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 19

Bhagavat Gita

4.19

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః {4.23}

యజ్ఞా యా చరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే

ఆసక్తి లేనివాడును, ముక్తుడును, మనస్సును జ్ఞానమునందు నిలిపిన వాడును, యజ్ఞార్థమై కర్మము నాచరించువాడు నగు మనుజుని యొక్క కర్మ సంపూర్ణముగ నశించుచున్నది

ఇక్కడ గతసంగ అంటే ఎవడైతే తన అహంకారాన్ని విడనాడేడో. చాలామంది తమ అహంకారంతో కలలు కంటూ, తమయందే నిశ్చితులై, తమ కుటుంబాన్ని, సమాజాన్ని ప్రేమించకుండా ఉంటారు. ధ్యానంలో మన దృష్టిని క్రమంగా ఇతరుల మేలుకై సారిస్తాము. మనగురించి మనమెంత ఎక్కువగా ఆలోచిస్తామో, అంత తక్కువగా ఇతరులను ప్రేమిస్తాము.

మనం ప్రేమను అనుభవించాలంటే ఎక్కడికో వెళ్ళనక్కరలేదు. ఇప్పుడే, మన కుటుంబంలో ప్రేమని చవి చూడవచ్చు. మన కుటుంబాన్ని విస్మరిస్తే ఆధ్యాత్మిక సాధన అనిపించుకోదు. భార్యాభర్తల మధ్య కలహాలు సామాన్యం. ముఖ్యంగా వారు వేర్వేరు సంస్కృతులలో, దేశాల్లో, కుటుంబ వ్యవస్థలలో పెరిగి ఉంటే వారి మధ్య అనేక విబేధాలు రావచ్చు. అలాంటప్పుడు "నేను నీతో మాట్లాడను. చూడనైనా చూడను" అనడం వేర్పాటుకి దారి తీస్తుంది. ఈ ఘర్షణకి కూడా ఆధ్యాత్మిక అంశం ఉంది. గీత ప్రతికూల పరిస్థితులలో ఎలాగ ప్రవర్తించాలన్న దాని గురించి చాలా జ్ఞానం ఇస్తుంది. దాన్ని గ్రహించక పోతే ఘర్షణ వలన కలిగే అవకాశాలను ఉపయోగించుకోలేము. ఉదాహరణకి స్పర్థలను పరిష్కరించడం, మనలో ప్రతిష్ఠితమైన దేవుని దగ్గరగా వెళ్ళడం.

రెండవ విశేషణం: ముక్తస్య. ముక్త అనగా స్వతంత్రుడు. మనము ఒకరిపై ఆగ్రహంతో ఉంటే, అది స్వతంత్రత కాదు. అది బానిసత్వం. మనం ప్రత్యర్థి చేయమన్నవి చేస్తున్నాం.

నా అమ్మమ్మ చెప్పేది, ఒకరితో విబేధాలు కలిగి, వారి నుంచి దూరంగా జరిగి, మైత్రిని కోల్పోతే, వారి సంగీతానికి, మనం నాట్యం చేస్తున్నాము. అంటే ఒక తోలు బొమ్మలాగా వారు చెప్పినట్టు ఉంటాము. అదే వారేమి చేసినా, శాంతంగా ఉండి, వారికి ప్రేమ, గౌరవము ఇస్తే తద్వారా మనం స్వతంత్రత పొందుతాము. నాకు తెలిసి దగ్గర సంబంధాలలో ఆగ్రహం కలిగితే మనం నిజంగా "నన్ను దగ్గరికి చేర్చుకొనే సహాయం చెయ్యి" అని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో, జీవితంలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ఉండి స్వతంత్రతను పొందవచ్చు.

ఇక్కడ స్వతంత్రత అంటే మన ఒక్కరి గురించే కాదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు స్వతంత్రంగా ఉంటే తప్ప మనకి స్వతంత్రత లేదు. గీత చెప్పేది అఖండమైన స్వతంత్రత. నేను స్వతంత్రత పొందితే, నా చుట్టూ ఉన్నవారి స్వతంత్రతకై పాటుపడాలి. కాబట్టి మనము, మన కుటుంబం, సమాజం, దేశం స్వతంత్రంగా ఉండాలి.

స్వతంత్రత గురించి కుటుంబ విషయాల ద్వారా తెలిసికోవచ్చు. కుటుంబం ఒక విశ్వవిద్యాలయం లాంటిది. కొందరు దాని విలువ తెలీక తమ, ఇతరుల స్వతంత్రతకై ప్రయత్నిస్తున్నారని భావిస్తారు. కానీ అది నిజం కాదు. మనం కుటుంబ స్వతంత్రము, ప్రతి కుటుంబ సభ్యుని స్వతంత్రము మీద ఆధార పడి ఉందని తెలిసికోవాలి. ఒక మంచి కొడుకైనా, కూతురైనా పెరిగి పెద్దయి ఒక మంచి భర్త లేదా భార్యగా, తల్లి లేదా తండ్రిగా, ఒక మంచి పౌరునిగా మెలగుతారు.

మొగల్ సామ్రాజ్యము ఉన్న రోజుల్లో కళాకారులు ఒక కళా ఖండాన్ని తమ కౌశల్యమంతా వినియోగించి ఎంతో కాలం తీసికొని సంపూర్ణమైనదిగా చేసేవారు. ఒక కళాకారుడు సూక్ష్మ ఖండ౦పై మాత్రమే తన దృష్టి కేంద్రీకరిస్తాడు. అలాగా అందరూ కళాకారులూ పనిచేసి ఒక పెద్ద కళా ఖండాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే మనం ఆధ్యాత్మిక పథంలో స్వతంత్రతని పొందడానికి ఒక పెద్ద యజ్ఞంలా చెయ్యనక్కరలేదు. చిన్న చిన్న ప్రయత్నాలు, మిక్కిలి కౌశల్యంతో చేస్తే చాలు.

జ్ఞానావస్థితచేతసః -- అంటే ఎవని మనస్సు శుద్ధమై వాని జ్ఞానము సర్వ జీవ సమానతను గ్రహిస్తుందో. మనము మన అనుబంధాలలో సర్వజీవ సమానతను పాటిస్తే మన మనస్సు శుద్ధమౌతుంది. 268

Eknath Gita Chapter 4 Section 18

Bhagavat Gita

4.18

యదృస్చా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః {4.22}

సమ సిద్ధావ సిద్ధౌచ కృత్యాపి న నియధ్యతే

లభించిన దానితో తృప్తి చెందువాడును, ద్వంద్వములను దాటినవాడును, మాత్సర్యము లేనివాడును, జయాపజయములందు సమబుద్ధి గలవాడును అగు మనుజుడు కర్మలను నాచరించినను బంధింపబడడు

జీవితము ద్వంద్వాలతో కూడినది: వెలుగు-చీకటి, ఆనందం-బాధ, పొగడ్త-తిట్టు, జయం-అపజయం మొదలగునవి. ఇవి అన్నీ కలిసి వస్తాయి. అంటే ఎప్పటికీ పొగడ్తలే వినం. అప్పుడప్పుడు తిట్లు కూడా భరించాలి.

మనని ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆందోళన చెందనక్కరలేదు. ఎందుకంటే మనం స్వతంత్రంగా, విలేఖరులు మొదలగు వారి బెడద లేకుండా, ఎక్కడికైనా వెళ్ళచ్చు. అలాగే మనంఎవరి పొగడ్తలకోసమై ఎదురుచూడనక్కరలేదు. ఇదే నిజమైన యోగుల పద్దతి. ఎందుకంటే పొగడ్తలు, మన్నన, భద్రత మనలోనే ఉన్నాయి.

సర్కస్ లో విన్యాసాలు చేసేవారు, క్రీడలలో ప్రసిద్ధి పొందిన వారు, ఒక్క రోజులో తమ కౌశల్యం పొందలేదు. దాని వెనుక తీవ్రమైన కృషి ఉంది. అలాగే ధ్యానం కూడా. మనలో కొందరు సున్నితమైన స్వభావమున్నవారు పొగడ్త, మన్నన పొందకపోతే చాలా బాధపడతారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవలసింది దేవుడు మనలనెన్నడూ తిరస్కరించడు. అదొక్కటే చాలు మనమన్ని తిరస్కారాలని సహించడానికి.

గీత చెప్పేది ద్వంద్వాలతో ప్రపంచాన్ని చూస్తే సృష్టిలోని ఏకత్వాన్ని చూడలేం. మన బుద్ధి ద్వంద్వాలతోటే పనిచేస్తుంది. దాని పని విభజించడం, వర్గీకరించడం, క్రమంలో పెట్టడం. అది అలా పనిచేయకపోతే మనం మనుష్యులము కామని కొందరంటారు. రమణ మహర్షి తన అనుచరులకు సుఖదుఃఖాలకు అతీతంగా ఉండండి అని చెప్పడంలో అంతరార్ధం వాటిని పట్టించుకోకుండా ఉండమని కాదు; వాటిని దాటి ఊహాతీతమైన ఆనందం పొందమని.

శ్రీకృష్ణుడు విమత్సర -- అనగా పోటీ పడకుండుట -- అనే విశేషణము వాడేడు. కొందరు స్పర్థయా వర్ధతే విద్యా అంటారు. పోటీ లేనిదే ఏమీ సాధించలేమనే భావన చాలా మందిలో ఉంది. మనము పరోపకార౦ చేసి, కుటుంబాన్నీ, సమాజాన్ని, దేశాన్నీ, ప్రపంచాన్నీ ప్రభావితం చేసే దిశలో నడవాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనం నిజంగా దేవునిగురించి తెలిసికోవాలని, ఆయనలో ఐక్యం అవ్వాలని అనుకొంటే, మన స్వార్థం వదిలిపెట్టి, పరుల ఆనందానికై పాటు పడాలి.

విమత్సరము లేనందువలన కొందరు ఇతరులతో పోలిక పెట్టుకొన్ని, వారికన్న ఎక్కువ స్థాయిలో ఉండాలని పోటీ పడతారు. దేవుడు మనందరినీ అద్వితీయంగా ఉండమని సృష్టించేడు. కాబట్టి మన మార్గంలో మనము సుస్థిరంగా ఉండాలి. ఒక పాశ్చాత్య దేశస్తునికి గురువు ఇచ్చిన నామము అతులానంద. దాని అర్థం: మనుష్యులలో పోలికలు చూడక, అబేధంగా ఉండేవాడు. అదే విధంగా కాళిదాస శాకుంతల్యం లో అనసూయ అనే పాత్ర ఉంది. దాని అర్థం: ఎప్పటికీ అసూయ లేనిది. అలా ఉండేవారు చాలా అరుదు. మనందరి విలువ మనలో ప్రతిష్ఠితమైన దేవుని వలన కలిగింది కానీ, పోటీ పరీక్షలలో గెలిచినందు వలన కాదు.

సమః సిద్ధౌ అసిద్ధౌ చ: సిద్ధ అనగా విజయం; అసిద్ధ అనగా అపజయం. శ్రీకృష్ణుడు తనను నిజంగా ప్రేమించినవాడు జయాపజయాలలో సమంగా ఉంటాడని అంటున్నాడు. నాకు తెలిసి అపజయంలో ఉద్రేకము చెందకుండా ఉండవచ్చు. కానీ విజయం కలిగినప్పుడు అందరికీ ఆ వార్త చెప్పాలనే అభిలాష ఉంటుంది. కొందరు నడిమంత్రపు సిరి కలిగినప్పుడు గానీ, పేరు ప్రఖ్యాతలు గడించినప్పుడు గానీ, తమ బాల్య మిత్రులకు స్వస్తి చెప్పి, క్రొత్త ఊరు, క్రొత్త మిత్రులను ఎంచుకొంటారు. అదే ఆధ్యాత్మిక మార్గంలో విజయుడైనవాడు తన బాల్య మిత్రుల వద్దకు వెళ్ళి "మీవలన నేను చాలా తెలిసికొన్నాను. నేను మీకు ఎంతో ఋణపడి ఉన్నాను. ఇప్పుడు మీరంతా నాతో విజయాన్ని పంచుకోండి" అంటాడు. మనమెంత ఎత్తుకు ఎదిగినా మనకన్నా దురదృష్టవంతులను మరచిపోకూడదు. ఇతరులు మనని పొగిడినా, తిట్టినా, నిరసించినా, ద్వేషించినా మన శాంతాన్ని, భద్రతని కోల్పోక, దేవుడు మనలో ప్రతిష్ఠుతుడయి ఉన్నాడని తలంచి ఉపశమనం పొందాలి. 263

Eknath Gita Chapter 4 Section 17

Bhagavat Gita

4.17

నిరాశీ ర్యత విత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః {4.21}

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్భిషమ్

ఆశలేనివాడు, ఇంద్రియమనస్సులను వశపరచుకొనినవాడు, అన్నిటి యందు మమతను విడిచినవాడు, కేవలం దేహము కొరకు కర్మ లాచరించినను పాపము నొందడు. ఀ

శ్రీకృష్ణుడు నిరాశీ -- అనగా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఉండడం -- అనే పదాన్ని వాడేడు. మనము ఆపేక్ష లేనిదే ఒక లక్ష్యాన్ని చేరలేమని భావించవచ్చు. కానీ మనం కోరేది మనల్ని బంధీగా చేస్తుంది. జీవితం స్వతంత్రతతో గడపాలంటే ఆపేక్ష ఉండకూడదు.

భగవంతుని అడుక్కొన్న మాత్రాన ఏమీ ఫలం లేదు. "నాకు ఏమీ వద్దు. నువ్వు నాకు అపజయాన్ని ఇస్తే, నేను భయపడను. లేదా విజయాన్నిస్తే వద్దనను" అని అనుకునేవిధంగా మనముండాలి. మనలో ప్రతిష్ఠితమైన దేవుని గూర్చి తెలిసినవారు ఆ ఎత్తుకి ఎదగగలరు. జయాపజయాలను వీడి స్వతంత్రంగా బ్రతకగలరు.

ఆపేక్ష ఉన్నవారికి నిరాశ తప్పకుండా కలుగుతుంది. మనము ఎల్లప్పుడు ఆందోళన లేకుండా ఉండాలంటే, ఒక పనిని చేసి "ఇది నన్ను మీదకి ఎత్తుతుందా? ఇది నన్ను చరిత్రలో చిరస్మరణీయునిగా చేస్తుందా? దీనివలన డబ్బు, దస్కం వస్తాయా?" అని అడగకూడదు. సదా అంతర్గతంలో ఉన్న దేవుని నమ్మి ఉంటే, మన ఆధ్యాత్మిక సాధనకు కావలసినవి అతడే ఇస్తాడు.

ధ్యానం ద్వారా మన మనస్సుకి, దేహానికి మన మాట వినేటట్లు తర్ఫీదు ఇస్తున్నాము. మొదట్లో ధ్యానం మగతను తెప్పించవచ్చు. అలాటప్పుడు వెన్నుముకను నిటారుగా పెట్టి కూర్చోవాలి.

దేహం స్వాధీనంలో ఉన్నా మనస్సును నిశ్చలం చేసికోవడం చాలా దుర్లభం. బుద్ధుడు క్రమ శిక్షణ లేని మనస్సు కన్న అవిధేయమైనదేదీ లేదు, అని చెప్పెను. మనం ఏమి తలచకూడదనుకున్నామో దానినే మనస్సు తలుస్తుంది. మన౦ ద్వేష పూరిత ఆలోచనలు ఉండకూడదని అనుకొంటాం. కానీ మనస్సు ఆ విధంగానే ఆలోచిస్తుంది.

ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు పరిపరి విధాల పోతుంది. మొదట్లో మనస్సును విషయాలనుంచి వెనక్కి లాగుకోవడమే చేస్తాము. ఒక గంట ధ్యానం చేస్తే అందులో ఎక్కువ భాగం మనస్సును స్వాధీనంలో పెట్టుకోవడానికే సరిపోతుంది. కానీ అలా ఓపిగ్గా సాధన దేవుని పొందాలనే భావంతో చేస్తే దానిలో ఎంతో సంతృప్తి ఉంటుంది.

త్యక్తసర్వపరిగ్రహ -- అంటే శ్రీకృష్ణుడు "నీవు దేనికీ యాజమానివి కావు. నేనే సమస్త సృష్టికి యజమానిని. ఇది నాది అనే భావన లేకుండా చేసుకో. " అని చెప్తున్నాడు. మన౦ వైరాగ్యం లేనిదే వస్తువులని సక్రమంగా వాడలేము. ఒకనికి డబ్బుపై మోహముండచ్చు. కానీ అతనికి డబ్బును ఎలా వాడాలో తెలియదు. కొందరు ధనవంతులు తమ సంపదను ఇతరులకై, తమకై ఎలా వాడుకోవాలో తెలీక ఉంటారు. అలాగని ఉన్నదంతా ఊడ్చుకొని ఇచ్చేయమని అనటంలేదు. శ్రీకృష్ణుడు మనకి డబ్బుతో, వస్తువులతో తాదాత్మ్యం చెందవద్దని బోధిస్తున్నాడు. ఒక ధనవంతుడు రాజ భవనంలో నివసిస్తూ వైరాగ్యం చెంది యుండగా, ఒక బీదవాడు తన గుడిసెతో తాదాత్మ్యం చెంది మిక్కిలి అహంకారిగా ఉండవచ్చు.

ఆధ్యాత్మిక సాధన అంటే మనకు కావలసిన వసతులు, జీవితాని కవసరమైన వస్తువులూ లేకుండా బ్రతకడం కాదు. ఒక పస్తులు౦డే పేదవాడు, సహజంగా దేవుని గూర్చికాక, తిండికై ఆలోచిస్తాడు. కాబట్టి ఆడంబరాలు, వస్తువులను పోగుచేసికోవడం తదితర స్వార్థ పూరిత కర్మలు చేయకుండా ఉండాలి.

ఎవరైతే ఆపేక్ష లేకుండా, ఎటువ౦టి పరిస్థితినైనా ఎదుర్కొనే సాహసం కలిగి, స్వార్థ పూరిత కామం వస్తువుల యందు లేదా మనుష్యులయందు లేకుండా, తమ దేహాన్ని పరోపకారము చేసే దేవుని పనిముట్టుగా భావిస్తారో అట్టి వారు కర్మలు చెయ్యరు. దేవుడే వారిద్వారా కర్మలు చేయిస్తాడు. శ్రీకృష్ణుడు "వారు చెయ్యి ఎత్తితే, వారు చేయటం లేదు. అది నేనే చేయిస్తున్నాను" అంటాడు. అట్టివారు ఏమి చేసినా దానికి ఉత్తర్వులు వారిలో ప్రతిష్ఠితమైన దేవుని వద్ద నుంచి వస్తున్నాయి. పైపైగా జీవించక, అంతర్గతమైన దేవుని ద్వారా కర్మలు చేస్తారు. అందువలన వారిలో ఒత్తిడి, అలసట, భయం లేదు. అతి క్లిష్టపరిస్థితిలోనూ వారి సృజనాత్మక శక్తి పని చేస్తూ ఉంటుంది. 260

Eknath Gita Chapter 4 Section 16

Bhagavat Gita

4.16

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః {4.20}

కర్మ ణ్యభిప్రవృత్తో అపి నైవ కించి త్కరోతి సః

కర్మ ఫలాపేక్షన వదలి, సదా సంతృప్తి నొంది, నిరాశ్రయుడై యుండువాడు కర్మల యందు చరించుచున్నను కొంచెమైనను చేయనివాడై యున్నాడు.

మనమొక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలంటే కర్మఫలము ఆశించకూడదు. ఉదాహరణకు శాంతికై ఒక కార్యానికి పూనుకొంటే కర్మ ఫల౦ మీద వైరాగ్యం ఉండాలి. లేకపోతే నిరాశ, నిస్పృహ కలిగించే పరిస్థితులు ఎదురైతే మనము స్పందించి హింసాకాండ చెయ్యవచ్చు. హింసను హింసతో ఎదుర్కోలేము. ఒక్క అహింసే దానికి సమాధానం. ప్రత్యర్థులను మన వైపు త్రిప్పుకోవాలంటే, మనము ఎట్టి పరిస్థితులలోనూ శాంతితో, సహనంతో ఉండాలి. గాంధీజీ ఓడిపోతామన్న సమయంలో తన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారు. మనము అపజయాలు మనల్ను బలహీనులను చేస్తున్నాయని అనుకొనవచ్చు. కాని కర్మయోగమంటే ఓడే సమయంలో మన చేతన మనస్సులోని శక్తులను వెలుపలకి తియ్యడం.

అపజయం నిస్వార్థపరులకు ఒక అవకాశంగా మారుతుంది. గీత చెప్పేది: ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు, ఎన్నో సవాళ్ళు, హెచ్చరికలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనడానికి మన చేతన మనస్సు లోతులకు వెళ్ళాలి. కష్టాలు లేకపోతే జీవితంలేదు. మనకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, మనలో దేవుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడని నమ్మితే, మన ప్రార్ధన ఇలా వుండాలి: "నా జవసత్వాలు ఉడిగిపోతున్నాయి. నన్ను రక్షించు". గాంధీజీకి భయము లేదని చెప్పలేము. కానీ ఆయన భగవంతుని ఎప్పుడు ఏమి అడగాలో తెలిసినవాడు.

నిత్యతృప్త అంటే ఎప్పుడూ సంతృప్తిగా ఉన్నవాడు. ఉదాహరణకు మనము హింసా కాండను నిర్మూలించాలనే దిశలో పనిచేస్తున్నప్పుడు ఒకమారు విజయం రావచ్చు. అప్పుడు ఒళ్ళూ పై తెలీకుండా ఉంటే మరుసటిరోజు అపజయం రావచ్చు. కాబట్టి జయాపజయాలలో స్థితప్రఘ్నులమై ఉండాలి.

మనస్సు చంచలమైతే అభద్రత కలుగుతుంది. దురాశ, క్రోధము, కామము మొదలగునవి మన స్వస్వరూపం నుండి దూరంగా ఉంచుతాయి. ధ్యానంలో మనస్సును నిశ్చలంగా ఉంచుకోడానికి ప్రయత్నిస్తాం. ధ్యానం నుంచి బయటకు వచ్చిన కొంతసేపటికి మనస్సు చంచలమైపోతుంది.

ఎట్టి పరిస్థితిలోనూ మనస్సును గందరగోళం చేసికోకూడదు. ఎందుకంటే మనలోని సృజనాత్మక శక్తి గందరగోళం వలన క్షీణిస్తుంది. దేవునిలో ఐక్యమవ్వాలనుకుంటే, జీవైక్య సమానతను పాటించాలంటే, మనస్సు శాంతితో, అచంచలంగా ఉండాలి. శ్రీకృష్ణుడు (12:17) ఇలా చెప్పేడు: ఎవరైతే ఉద్రిక్తతతో ఉండరో వారు నాకత్యంత ప్రియులు. ప్రసార మధ్యమాలలో మనల్ని ఉద్రేక పరిచే ప్రకటనలు చూస్తాం. దానికి వ్యతిరేకం నిరాశని తలుస్తాం. కాబట్టి ఉద్రిక్తత తన వెంట నిరాశని తెస్తుందని తెలిసికోవాలి. ఎంత పెద్ద మనస్తత్త్వ శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఈ ద్వంద్వాలకు చికిత్స చేయలేరు.

జాన్ కెనెడి, గాంధీ లాంటివారు ఉద్రిక్తత చెందరు. కానీ వారు అన్ని విషయాలలోనూ ఆసక్తులై ఉంటారు. ఇటువంటి వైరాగ్యం, సమత్వం చాలా అవసరం.

మనకు పరిస్థితులు సానుకూలంగా ఉండి తీవ్రమైన ఉద్రిక్తత కలిగితే దీర్ఘ నడక, మంత్ర జపం చెయ్యాలి. లేకపోతే నిరాశను పొందవలసి వస్తుంది.

నిరాశ్రయమ౦టే ఊత లేకపోవడం. దేవుని చేతిలో పని ముట్టు అవ్వాలంటే మనకి దేవుడి మీద అపారమైన నమ్మక ముండి, అన్ని ఊతలను వదిలి వేయాలి. కొందరు డబ్బు, దస్కాలను, మరికొందరు పేరుప్రఖ్యాతులను, లేదా అధికారాన్ని ఊతగా తీసుకొంటారు.

మనము దేవుని ఊతగా పొందాలంటే అన్ని భౌతిక, మానసిక ఊతలను వదిలివేయాలి. మహాభారతంలోని ద్రౌపది చీరను కౌరవులు తీసివేయడానికి ప్రయత్నిస్తారు. ఆమె ఒక చేత్తో చీర పట్టుకున్నంత వరకూ శ్రీకృష్ణుడు ఆమె రక్షణకు రాడు. ఎప్పుడైతే ఆమె రెండు చేతులనూ జోడించి శ్రీ కృష్ణుని ప్రార్థిస్తుందో, తన మాయతో శ్రీకృష్ణుడు చీరను అంతంలేనిదిగా చేసి, కౌరవుల పథకాన్ని భగ్నం చేస్తాడు. కాబట్టి దేవునికి కావలసినది సంపూర్ణ శరణాగతి.

ఎవరైతే జయాపజయాల్లో సమంగా ఉంటారో, లక్ష్యానికి బద్ధులై ఉంటారో, ఎంత కష్టమొచ్చినా ఊతలను పట్టుకోరో, వారు పని చేయక పోయినా, దేవుడు వారి ద్వారా పనిచేస్తాడు. మన అహంకారాన్ని, వేర్పాటును వదులుకుంటే దేవుడు మనపై కృప జూపుతాడు. భార్యాభర్తలు ఒకరినొకరు సహాయం చేసికోవడానికి తమ స్వార్థ పూరిత ఆలోచనలను వదులుకొంటారు. ఈ విధంగా భగవంతుని ప్రేమించి, మన మనస్సులో ఆయనకు చెందినవి తప్పితే వేరే ఆలోచనలను ఖాళీ చేసికోవాలి. కొందరు నన్ను "ఒకరికి మీరు చెప్పినట్టు సాధ్యం కాకపోతే ఏమి చెయ్యాలి?"అని అడిగేవారు. అప్పుడు నేను వారి శత్రువుల గూర్చి ఆలోచించడం మానాలి అని చెప్పేవాడిని. ఈ విధంగా ధ్యానం చేస్తే మనము మనస్సులోని స్వార్థం, అహంకారం, వేర్పాటు ఖాళీ చేసికొని, ప్రపంచం యొక్క దుస్థితిని తొలగించవచ్చు. 251

Eknath Gita Chapter 4 Section 15

Bhagavat Gita

4.15

యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః {4.19}

జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తమాహః పండిత౦ బుధాః

ఎవని కర్మలు కామసంకల్పములచే కదలవో, ఎవని కర్మలు జ్ఞానమనెడి అగ్ని చేత దహింపబడినవో అట్టి వానిని పండితుడని బుధజనులు పేర్కొనిరి.

ప్రపంచం అల్లకల్లోలం అవుతూ ఉంటే మనము చేతులు కట్టుకొని చతికల పడకూడదు. మన వంతు మంచి కర్మను చెయ్యాలి. కానీ కొందరు "నేనేమి చేయగలను? నేను బలహీనుడను" అని అంటారు.

మనలో ప్రతిష్ఠితమైన దేవుడు అపరిమితమైన ప్రేమతో, జ్ఞానంతో, పరోపకార బుద్ధితో ఉన్నాడని తలంచితే మనమెన్నటికీ నిరాశ, నిస్పృహ చెంద౦. నిరాశకి కారణం ఒక పని యొక్క ఫలిత౦ గురించి ఆందోళన. మనము ఫలము నాశి౦చి "చూడండి నేనేమి చేసేనో?" అని ప్రపంచానికి తెలియజేయడానికై ప్రయత్నిస్తాము. గాంధీజీ లాగ మనమూ ఒక ఉన్నత లక్ష్యాన్ని -- అది ఎంత పెద్దదైనా, కష్టమైనా--ఎన్నుకొని దానిని సాధించడానికి ఎన్ని అడ్డంకులు, బాధలు ఎదురైనా ప్రయత్నించాలి. ఒక ఉన్నత లక్ష్యాన్ని జీవితకాలంలో చేయలేకపోవచ్చు. కానీ దాన్ని ఇతరులు అంది పుచ్చుకొని చివరకు దాన్ని నెరవేరుస్తారు.

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు బుధాః -- అనగా మేల్కొని ఉన్నవారు--పదాన్ని వాడేడు. బుధులు మన౦ కర్మ చేస్తున్నామంటే అంగీకరించరు. వారు మనము చేసిందే చేసి, ఒక వలయంలో చిక్కుకున్నామని భావిస్తారు. ఎవరైతే అహంకారాన్ని, స్వార్థాన్ని వీడి తమ సమయం, శక్తి, వనరులు దేవునియందు ఉంచి పరోపకార సేవలో నిమగ్నమై ఉంటారో, వారే అందరికంటే జ్ఞానవంతులు.

మనము చరిత్రలో గొప్పగొప్ప వారు సాధించిన కార్యాలు పరిశీలిస్తే, తెలిసేది: వారు పేరు ప్రఖ్యాతులకై కర్మలను చేసేరు. గీత అట్టివారు ప్రపంచానికి చిరస్మరణీయమైన మంచిని చేయలేదని చెప్తుంది. ఇది ముఖ్యంగా అధికారం గురించి చేసే కర్మలకు వర్తిస్తుంది. లార్డ్ ఆక్టన్ "అధికారం అవినీతి చేయిస్తుంది; సంపూర్ణమైన అధికారం, సంపూర్ణమైన అవినీతిని చేయిస్తుంది" అన్నారు కొందరు మొదట్లో అధికారంతో దేశానికి, ప్రపంచానికి మంచి పనులు చెయ్యాలని ఆశిస్తారు. కాలక్రమేణా వారు అధికారమనే మత్తుమందుకు అలవాటుపడి అవినీతిపరులవుతారు. చివరకు అధికారం కొరకై, ఇతరుల మీద తమ భావాలను రుద్దడానికి, అధికారం కావాలనుకొంటారు.

గాంధీజీ లాంటివారు అధికారం కొరకై ప్రాకులాడక, హోదాతో వచ్చే వసతుల గురించి ఆశపడక, తమ గురించి చరిత్ర పుటలలో ఏమి వ్రాస్తారో కాంక్షించక, తమ కర్మను చేసుకుపోతారు. మనకందరికీ రాజకీయనాయకులు ఎన్నికలలో గెలవడానికి ఏమి చేస్తారో బాగా తెలుసు. గాంధీజీ స్పూర్తి గలవారు స్వంత లాభము ఆశించక, ఇతరుల మేలుకై సర్వ శక్తులా ప్రయత్నం చేసి ప్రపంచాన్నే మారుస్తారు. వారు పేరు ప్రఖ్యాతులు ఆశించక ప్రజా సేవకై అంకితమౌతారు.

శ్రీకృష్ణుడు స్వార్థంకై, పేరు ప్రతిష్ఠలకై, అధికారానికై ప్రయత్నించనివారి కర్మలు జ్ఞానమనే అగ్నిలో కాల్చబడతాయి అంటాడు. ఇంకా కరుణతో స్వార్థంతో కర్మలు చేసేవారు అజ్ఞానులు-- ఎందుకంటే మనమంతా ఒకటే అని తెలియదు కాబట్టి -- అని శ్రీకృష్ణుడు అంటాడు. 251

Eknath Gita Chapter 4 Section 14

Bhagavat Gita

4.14

కర్మణ్యకర్మ యః పశ్య దకర్మణి చ కర్మ యః {4.18}

స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్

ఎవడు కర్మమునందు అకర్మను, అకర్మమునందు కర్మను గాంచునో వాడే మనుజులలో బుద్ధిమంతుడు, యోగి, సర్వ కర్మముల నాచరించినవాడు అగుచున్నాడు.

శరణాగతి పొందితే కర్మలను మనచే దేవుడే చేయిస్తాడు. మనము దేవుని చేతిలో పనిముట్లమనే భావన శరణాగతివలన కలుగుతుంది.

నేను విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా విద్యార్థులు ఉద్యమం చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళను ఈడ్చి తమ వాహనాలు ఎక్కించేవారు. విద్యార్థులు మొదట్లో ప్రతిఘటించి, అటు తర్వాత నిర్లిప్తులయ్యేవారు. అలాగే మనము దేవుని శరణాగతి కోరితే, మన అహంకారం మొదట్లో ప్రతిఘటించి చివరకు లొంగుతుంది.

గాంధీజీ ఆశ్రమానికి నేను వెళ్ళినపుడు, ఆయనను కలవడానికి అనేక వ్యక్తులు రావడం చూసేను. వారిలో బ్రిటిష్ అధికారులు కూడా ఉండేవారు. ఆయన రోజంతా మంతనాలు చేసి, సాయంత్రం బయటకు వచ్చి చిరునవ్వుతో తమ అనుచరులను పలకరించేవారు.

ప్రతిదినము, మనము ఇతరులకు హాని చెయ్యకుండా, ఒత్తిడి లేకుండా మిక్కిలి క్లిష్టమైన కర్మలు చెయ్యవచ్చు. కొందరికి ఒత్తిడి ఉంటేనే కర్మ చెయ్య బుద్ధి పుడుతుంది. మనకు రోజంతా కష్టపడి పనిచేసేవానికి కడుపులో పుండ్లు ఉంటాయేమోనని అనుమానం వస్తుంది. మనము ఒత్తిడి లేకుండా, చేతన మనస్సులో అలజడి లేకుండా కర్మ చెయ్యవచ్చు. గాంధీజీని ఒకరు "మీరు 50 ఏళ్లగా రోజూ 15 గంటలు పనిచేస్తున్నారు. మీరు ఎప్పుడైనా కొన్నాళ్ళు విశ్రాంతి తీసికోవాలనుకు౦టున్నారా?" అని అడిగేరు. దానికి ఆయన సమాధానం: "నేను ఇన్నేళ్ళూ విశ్రాంతి తీసికొనే ఉన్నాను".

ఎవరైతే గాంధీజీ లాగ భగవంతుని చేతిలో పని ముట్టని తలుస్తారో వారిగురించి శ్రీకృష్ణుడు "నీవు కర్మ చేయటం లేదు. నేను నీ ద్వారా కర్మ చేస్తున్నాను" అని చెప్తాడు. కొందరు కుటుంబాన్ని, సమాజాన్ని వదిలి వెళ్ళి పోవాలనుకుంటారు. మనమందరము ఏదో కర్మ చేస్తూ ఉండి, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాం. ఒక తండ్రి తన పిల్లలను పట్టించికోకపోయినా, వారి స్వభావం వాని వలన ప్రభావితమౌతుంది. మనం కర్మ చెయ్యకపోతే ఇతరులకు మన ఉదాసీనత గురించి తెలుసుకొంటారు.

మనం చెడ్డ కర్మను మంచి కర్మతో తుడిచివేయాలని తలుస్తాం. మనకు చెడు కర్మ ఎక్కువగా ఉంటే ధ్యానంలో అచేతన మనస్సు దాటితే మేల్కొనడం కష్టం. అచేతన మనస్సు దాటినా మనము చేతనత్వముతో ఉండగలగాలి. 249

Eknath Gita Chapter 4 Section 13

Bhagavat Gita

4.13

కిం కర్మ కి మకర్మేతి కవయో అప్యత్ర మోహితాః {4.16}

తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్

కర్మ యెట్టిది? అకర్మ యెట్టిది? అను విషయమున పండితులు సైతము భ్రమించియున్నారు. దేనిని తెలిసికొని నీవు అశుభమునుండి విముక్తుడ వయ్యెదవో అట్టి కర్మ రహస్యమును నీకు చెప్పుచున్నాను

కర్మణో హ్యపి బోద్ధవ్య౦ బోద్ధవ్య౦ చ వికర్మణః {4.17}

అకర్మణశ్చ బోద్ధవ్య౦ గహనా కర్మణో గతిః

కర్మ, అకర్మ, వికర్మ -- ఈ మూడును తెలియదగి యున్నవి. కర్మల విషయమును గ్రహించుట దుర్లభము

ఇక్కడ కర్మ అనగా మన౦ చేసే పని మాత్రమే కాదు, ఆలోచన కూడా అని అర్థం చేసికోవాలి. ప్రసార మాధ్యమాలలో చేసే ప్రకటనలు ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. నిద్రలో కూడా అవి గుర్తుకొస్తాయి. అదే పదములతో కూడిన ఆలోచనల శక్తి.

ఆలోచన కూడా ఒకరకమైన కర్మ. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆలోచన కర్మకు ముందు జరిగే అభ్యాసము అని చెప్పేరు.

మనము ఇంట్లో ఖాళీగా కూర్చొని కర్మను చేయకుండా ఉండలేము. మనము కుర్చీలో బంధించుకొని కూర్చున్నా ఆలోచనలతో కర్మను చేస్తున్నట్టే. కర్మ నుంచి పూర్తిగా విడబడాలంటే ఆలోచన ఎక్కడ ఉద్భవిస్తున్నాదో ఆ మూలానికి వెళ్ళాలి. ధర్మపాదలో బుద్ధుడు మనము మన ఆలోచనలతో మలచ బడ్డ వారలమని చెప్పెను. ఆలోచనలు మన అచేతన మనస్సులో ఉద్భవించి, క్రమంగా తదనుగుణంగా పనులు చేయిస్తాయి. కాబట్టి పని ఆలోచనలనుండి ఉద్భవిస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యం పనిని ఆలోచనలతో నియంత్రించడం.

వికర్మ అంటే నిషిద్ధకర్మ. అంటే ఆ కర్మ చెయ్యడంవలన ఇతరులకు హాని కలుగుతుంది. క్రోధము, భయము, దురాశలతో చేసేది వికర్మ. గీత క్రోధంతో చేసిన పని, ఇతరులకు, చివరకు మనకు కూడా కీడు చేస్తుంది అని చెప్తుంది. మనలో చాలామంది క్రోధం కలగగానే, ఆవేశ పూరితంగా కర్మలు చెయ్యడం ఉపక్రమిస్తాం. అదే క్రమంలో తమస్ రజస్ గా మారుతుంది. ఎంత ఉదాసీనంతో ఉన్నవాడైనా క్రోధం కలిగితే ఏదైనా చేసి, ఇతరులకు దుఃఖం కలిగిస్తాడు.

తెలివిగలవాడు క్రోధం, భయం, ద్వేషం మొదలైన గుణాలను దూరం చేసుకొంటాడు. కొందరు హింసాకాండను అణచివేయడానికి, తప్పుగా, ద్వేషం, క్రోధంతో స్పందిస్తారు. హింసని అహింసతోనే ఎదుర్కోగలం. దాన్ని రూపుమాపటానికి మనమెంతో సహనంతో, ఒప్పించే విధంగా, గౌరవంతో, వివేకముతో, ఖచ్చితంగా ఉండాలి. సున్నితత్వం, మైత్రి అందరిలోనూ ఉంటుంది. క్రోధంగా మాట్లాడితే అది ఇతరులను క్రోధంతో స్పందింపజేస్తుంది. దాని వలన మన ప్రత్యర్థులనుంచి వేర్పాటు అధికమౌతుంది. జీసస్ మనల్ని ప్రేరణ చేసేవారిని సహించి, దూషించేవారిని ఆశీర్వదించి, ద్వేషించేవారికి మంచి చెయ్యమని బోధించేరు. నా దృక్పథంలో ప్రేమకు ప్రతిస్పందన చూపని వారు లేరు, ఎందుకంటే అందరినీ ప్రేమించే దేవుడు మనందరిలోనూ ఉన్నాడు.

భయము, దురాశ క్రోధం లాగే దుష్ఫలితాలను ఇస్తాయి. ఈ మూడిటివలన మనం అధోగతి పొందుతాము.

ఇకపోతే అకర్మ -- అనగా కర్మ చెయ్యకపోవుట. మన స్వార్థాన్ని త్యజించి, మనల్ని నడిపేది మనలో ప్రతిష్ఠితమైన దేవుడేనని నమ్మితే అన్ని కర్మలనుండీ విముక్తి పొందుతాము. మనం కర్మ చెయ్యం; మనలోని దేవుడు కర్మ చేయిస్తున్నాడు. గాంధీజీని "మీరు ఒక్క తూటా వాడకుండా, చరిత్రలో అతి శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కోగలిగి దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించేరు?" అని అడిగితే ఆయన తన స్వార్థాన్ని, వేర్పాటుని త్యజించి దేవుని చేతిలో ఒక పని ముట్టుగా మాత్రమే ఉన్నానని చెప్పేరు.

ఇదే అకర్మ అంటే. కానీ మనం పని చెయ్యకుండా ఉండడం అకర్మ కాదు. మనకి పని చేయవలసిన అవసరం ఎంతో ఉంది. మన౦ చేసికోవలసిన ఎన్నిక: స్వార్థంతో మనకి, మన చుట్టూ ఉన్నవారికి అధోగతి కలిగిస్తామా; లేదా దేవుని పని ముట్టు వలెనుండి కుటుంబ, సమాజ, దేశ, ప్రపంచ బాగుకయి ప్రయత్నిస్తామా? 246

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...