Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 24

Bhagavat Gita

4.24

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే {4.32}

కర్మజా వ్విద్ధి తాన్ సర్వా నేవ౦ జ్ఞాత్వా విమోక్ష్యసే

ఈ విధముగ వేదములనుండి అనేక విధములైన యజ్ఞములు ఉద్భవించినవి. ఈ యజ్ఞము లన్నియు కర్మల నుండి ఆవిర్భవించినవియే యని తెలిసికొని వాటినుండి విడిపడుము

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప {4.33}

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే

పరంతపా! ద్రవ్య యజ్ఞముల కంటెను జ్ఞాన యజ్ఞము శ్రేష్ఠమైనది. కర్మము లన్నియు జ్ఞానమునందే పరిసమాప్తమగుచున్నవి

శ్రీకృష్ణుడు మన ధనం, వస్తువులు, సమయం, శక్తి ప్రజా క్షేమం కోరే ఒక మంచి కార్యానికై దానం చెయ్యమని చెప్తున్నాడు. పరులకు ఇవ్వడం వలన మన పరిస్థితి క్షీణించనక్కరలేదు. మన ఆడంబరాలను తగ్గించుకొ౦టే చాలు. మనము జీతానికై పనిచేసినంత సేపూ, ఒక నిస్వార్థ లక్ష్యానికై పనిచేయడం ఉన్నతమైనదని తెలీదు. అలాగని మనకి జీతం ఇచ్చే పనులు మానుకోమని కాదు. అది మన కుటుంబాన్ని పోషించడానికి ఎంతో అవసరం. మన ఖర్చుకు పోనూ మిగిలినది ప్రజా క్షేమం కోరి, సమయం, కౌశల్యం తో పాటు ఇవ్వవచ్చు.

శ్రీకృష్ణుడు జ్ఞానయజ్ఞ౦ చేయమంటాడు. మనం దేవుడికిచ్చే గొప్ప బహుమతి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు పంచడం. మనలో ప్రతిష్ఠితమైన దేవుని ఎరుకను వేరొకరిలో కల్పించడం ఒక యజ్ఞంగా భావించాలి.

అన్ని కర్మలూ చివరికి జీవైక్య సమానతకు దారి తియ్యాలి. మన తప్పులు మనల్ని, తీరని బాధతో, ఆధ్యాత్మిక పథంలో నడవడానికై నిర్భందిస్తాయి. దేవుడు మనల్ని బాధ పెట్టాలని పెట్టడు. ఆయన తన వైపు మనల్ని తిప్పుకోవడం బాధతోనే సాధ్యమని తెలుసు. మనము ఇతరుల అవసరాలను తెలిసికొని వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తే మంచిది. "ఇతరుల అవసరాలేమిటో నా కెలా తెలుస్తుంది? నేను మానసిక తత్త్వవేత్తను కాను" అని మీరు అనవచ్చు. బుద్ధుడు "నీకేది బాధ కలిగిస్తుందో, అదే ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది" అని చెప్పెను. మనం గురువులదగ్గరకు వెళ్ళి సంస్కృతం, వ్యాకరణం ఔపాశన పట్టనక్కరలేదు. ఏది మనకు అవమానం కలిగిస్తుందో అదే మన తండ్రులకు కూడా అవమానం కలిగిస్తుంది; ఏది మనకు నొప్పి కలిగిస్తుందో, అదే మన తల్లులకు నొప్పి కలిగిస్తుంది; ఏది మనకు చికాకు తెప్పిస్తుందో, అదే మన పిల్లలకు కూడా చికాకు కల్పిస్తుంది; ఏది మనకు కోపం తెప్పిస్తుందో, అదే మన మిత్రులకు కూడా కోపం తెప్పిస్తుంది. మనం తెలిసికోవలసింది "పరులు, నేను ఒక్కటే". మనము పరుల అవసరాలను మన అవసరాలను బట్టి అంచనా వేయవచ్చు. అలాగే జీవైక్య సమానతను పాటించడానికి "నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్నా, పేదరికంలో బ్రతికినా, వేరొకరిని కష్ట పెట్టకుండా ఉండే దయ, బుద్ధి, శక్తి, ఇవ్వు" అని దేవుని ప్రార్థించ గలగాలి. ఇదే శ్రీకృష్ణుడు కోరే ఉత్కృష్టమైన యజ్ఞము. 277

Eknath Gita Chapter 4 Section 23

Bhagavat Gita

4.23

అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి {4.30}

సర్వే అప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః

మరికొందరు ఆహార నియమము గలవారై ప్రాణములను ప్రాణవాయువుల యందు హోమము చేయుచున్నారు. వీరందరు యజ్ఞవిదులును, పాపము నశించినవారు అగుచున్నారు.

యజ్ఞ శిష్టా మృత భుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ {4.31}

నాయం లోకో అస్త్యయజ్ఞస్య కుతో అన్యః కురుసత్తమ

అర్జునా! యజ్ఞశేషమైన అమృతమును భుజించెడివారు నిత్యమైన బ్రహ్మమును పొందుదురు. యజ్ఞకర్మ నాచరించని వానికి ఈ లోకమే లేదు. ఇక పరలోక మెక్కడిది? ఀ

దేహ శుద్ధి ఆధ్యాత్మిక జీవనానికి ఎంతో అవసరం. మన స్వస్వరూపం తెలిసికోవాలన్నా, జీవైక్య సమానత్వాన్ని అనుభవించాలన్నా పరసేవ చేయడానికి గల బలం, శక్తి దేహానికి ఉండాలి. అలా కావాలంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఉదాహరణకి రుచి బాగావుంది కదా అని ఏది పడితే అది తినకూడదు. మన దేహాన్ని స్వస్థతతో ఉంచే పౌష్టికాహారాన్ని మాత్రమే తినాలి. కొందరు వంటవాళ్ళు రుచికరమైన క్రొత్తక్రొత్త పిండివంటలు కనుక్కొ౦టారు. వారు భౌతిక పరమైన సమస్యలలో ఇరుక్కొ౦టారు. పోషకాహారాన్ని తిని తక్కినది దేహంలోని జీర్ణ వ్యవస్థకు వదిలేయాలి. ఈ విధంగా మన౦ ఇంద్రియాలను బానిసలగా చేసికొని ప్రాణ శక్తిని వృధాకాకుండా చూసుకోవాలి.

పరులను సేవించడంవలన మనకి ఆనందం, సంతృప్తి కలుగుతాయి. మన స్వార్థపరమైన కోర్కెలను తీర్చుకోవడం కోసమే బ్రతికితే కొన్నాళ్ళకి విసుగు, అభద్రత కలుగుతాయి. ధ్యానం, ఆధ్యాత్మిక సాధన చెయ్యకపోయినా, మనల్ని మరచిపోయినప్పుడు ఆనందం, మనగురించే ఆలోచిస్తూ ఉంటే విచారం కలుగుతుంది. నేను, నాది అనుకునేవానికి యోగం అబ్బదు సరికదా ప్రపంచాన్ని కూడా ఆనందంగా అనుభవించలేడు. నిస్వార్థపరుడు ప్రపంచాన్ని పూర్తిగా అనుభవిస్తాడు. ఎ౦దుకంటే వాడు ఎప్పటికీ స్వతంత్రుడు. 276

Eknath Gita Chapter 4 Section 22

Bhagavat Gita

14.22

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథాపరే {4.29}

ప్రాణాపాన గతీ రుద్ద్వా ప్రాణాయామ పరాయణాః

మరికొందరు ప్రాణాయామము నందు ఆసక్తి గలవారై, ప్రాణాపాన వాయువుల యొక్క గతులను నిరోధించి, అపానము నందు ప్రాణమును, ప్రాణమునందు అపానము లయము చేయుచు ప్రాణయామ యజ్ఞమును చేయుచున్నారు

ఈ శ్లోకంలో ప్రాణ౦ గురించి చెప్పబడినది. ప్రాణమనగా చైతన్యం. మనలో చైతన్యం ఉన్నంతవరకూ మనకి ప్రాణం ఉన్నట్లే. దాన్నే వేరే విధంగా చెప్పాలంటే శ్వాస. శ్వాస 5 విధములు: పాన, అపాన, వ్యాన, ఉదాన, సమాన. పాన అనగా ఉచ్చ్వాస. అపాన అనగా నిశ్వాస. తక్కినవి శరీరంలో జరిగే వాయు చలనం గురించి చెప్పబడినవి. ముఖ్యంగా ఉదాన వాయువు స్థ౦భిస్తే ప్రాణం శరీరాన్ని వీడినట్లు.

శ్వాసని చక్కపరచుకోవాలంటే కొంత వ్యాయామం అవసరం. ఉదాహరణకి కొంచెం పరిగెత్తినా, దీర్ఘంగా నడిచినా శ్వాస కుదుటపడుతుంది. శ్వాస సాధారణంగా నిమిషానికి 16 సార్లు జరుగుతుంది. కానీ ధ్యానం సరిగ్గా చేస్తే అది 8 అవ్వచ్చు. దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస పెడితే అది ఎన్నటికీ తగ్గదు. ధ్యానంలో కొంత మందిలో శ్వాస రెండు మూడు నిమిషాలు ఆగవచ్చు. అది జరుగుతున్నప్పుడు వారికి ఎరుక లేకపోవచ్చు. కానీ ధ్యానం తరువాత మనసు కుదుటపడి, నాడీ వ్యవస్థ ఉపశమించి, వారు అమిత శాంతి, ఆనందం పొందుతారు.

కొందరు ఇతరుల తప్పులను క్షమించి, మాటిమాటికీ ఆందోళన పడక, అందరి మంచిని కోరి, అందిరినీ ప్రేమించి ఉంటారు. వారి శ్వాస దీర్ఘంగా ఉంటుంది. చంచలమైన, ఉద్రిక్తమైన, ద్వేషంతో కూడిన మనుష్యులలో శ్వాస వడిగా, అపక్రమంగా ఉంటుంది. ఎవరైనా వారిని రెచ్చగొడితే వారి శ్వాస నియంత్రింపబడక అస్తవ్యస్తంగా ఉంటుంది. దానివలన ఆరోగ్యం చెడి, వారిపై ఒత్తిడి కలుగుతుంది. కొందరిలో ఉబ్బసం వంటి వ్యాధులు వస్తాయి. మన ధ్యానం గాఢమైన కొద్దీ, ఏకాగ్రత అధికమై, శ్వాస నెమ్మదిగా అయ్యి మనలోని భౌతిక సమస్యల గూర్చి జ్ఞానం కలుగుతుంది. శ్వాసను క్రమంలో, దీర్ఘంగా పెట్టుకోవాలంటే నడక వంటి వ్యాయామం చెయ్యడం ఉత్తమం. 274

Eknath Gita Chapter 4 Section 21

Bhagavat Gita

4.21

సర్వాణీ౦ద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే {4.27}

ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే

మరికొందరు ఇంద్రియ వ్యాపారములను, ప్రాణచేష్టలను జ్ఞానదీప్తమైన ఆత్మసంయమ యోగమనెడి అగ్ని యందు హోమము చేయుచున్నారు.

ద్రవ్య యజ్ఞా స్తపోయజ్ఞా యోగయజ్ఞా స్తథా అపరే {4.28}

స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ స్సంశితవ్రతాః

దృఢ దీక్షాపరులై, ప్రయత్న శీలురైన సాధకులు ద్రవ్య యజ్ఞములను, తపో యజ్ఞములను, యోగ యజ్ఞములను, స్వాధ్యాయ యజ్ఞములను, జ్ఞాన యజ్ఞములను ఆచరించుచున్నారు

ఈ శ్లోకంలో యజ్ఞం అంటే దానం చెయ్యడం. ధనవంతులు దేవుని సేవకై తమకున్న ధనంలో కొంత దానం చేస్తారు. డబ్బు దానంతట అది చెడ్డది కాదు. దానిని ప్రేమించడం చెడు స్వభావం.

గాంధీజీ యొక్క ఆస్తి రెండాకులు. కానీ ఆయన మిత్రులలో అనేకమంది ధనవంతులు ఉండేవారు. అందువలన ఆయనను కొందరు విమర్శి౦చేవారు. దానికి బదులుగా ఆయన సంపన్నుల యందు కూడా దేవుడు ప్రతిష్ఠితమై ఉన్నాడని చెప్పేవారు.

గాంధీగారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అనేక వైద్యులు దేశ నలుమూలలనుండి వచ్చి ఆయనను పరీక్షించేవారు. వారిలో కొంత మంది పేరు ప్రఖ్యాతులకై వచ్చేవారు. అలాంటి వారితో గాంధీజీ తనను పరీక్షించడానికి నాకు మీరు డబ్బు కట్టండి అనేవారు. మన దేశంలో అనేక స్త్రీలు బంగారు ఆభరణాలు ధరించి ఆడంబరంగా ఉంటారు. గాంధీజీ వారికి తమ స్వస్వరూపంలో ఆనందంగా ఉండమని సలహా ఇచ్చేవారు. వారు ప్రభావితులై, తమ బంగారాన్ని స్వతంత్ర పోరాటానికై దానం చేసేవారు. ప్రపంచంలో పేదవారు, వికలాంగులు ఉన్నంత కాలం మనం ఆడంబరాలికి పోకూడదు. అలాగని నేను పేదరికంలో ఉండమని చెప్పటంలేదు. నేను కోరేది అవసరమైనవి మాత్రమే దగ్గిర పెట్టుకొని సామాన్య౦గా, సంతుష్టితో జీవితం గడపడం. మన ధనం--ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉన్నా--నిస్వార్థ సేవకై, అందరి క్షేమానికై వినియోగించవచ్చు.

శ్రీకృష్ణుడు ఉంకో విశేషణము వాడుతాడు. తపోయజ్ఞ -- అనగా బాధ పడడం, ఇంద్రియాలను నిగ్రహించడం, ఉష్ణము మొదలైనవి. గాఢ ధ్యానంలో కుండలిని శక్తి విడుదలై దేహాన్ని వేడి చేస్తుంది. అలాంటప్పుడు గట్టిగా వ్యాయామం చెయ్యడం మంచిది. భౌతికంగా నిస్వార్థంతో ఇతరులకై శ్రమ పడినా ఉత్తమం.

ఉంకో విశేషణం యోగయజ్ఞ -- అనగా ధ్యానంతో సాధన. ఉదయం, సాయంత్రం దీర్ఘంగా ధ్యానం చేసేవారు తమ స్వార్థానికి మాత్రమే చేయటం లేదు. చాలామంది ధ్యానం చేసేవారు తమ జ్ఞానానికై, ముక్తికై చేస్తారని తప్పుగా అర్థం చేసికొ౦టారు. ధ్యానం చేసేవారు నిజంగా కోరేది స్వార్థం, వేర్పాటు తమనుండి తొలగాలని. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ, సర్వ జీవుల క్షేమాన్ని కోరుతారు. కుటుంబంలో ఏ ఒక్కరు ధ్యానం మొదలుపెట్టినా అది తక్కిన కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తుంది. మొదట్లో వారికి అపార్థాలు కలిగినా, క్రమంగా ధ్యానంలోని శక్తిని గ్రహిస్తారు.

ఒకరు మనల్ని ధ్యానం దృష్ట్యా హేళన చేస్తే కలవరం చెంది మనల్ని సమర్ధించుకోనక్కరలేదు. దేవుడు మన తరపు న్యాయవాది. చట్టాన్ని వ్రాసినవాడు కూడా అతడే. మన ధ్యానం మొదట్లో కొంత వైరాగ్యంతో ఉంటే మన బంధుమిత్రులు అపార్థం చేసికోవడం సహజం. కానీ మనము నిస్వార్థంతో, అహంకారము లేకుండా, ప్రేమతో ఆదర్శంగా ఉంటే ఇతరులకు అది మేలు చేకూరిస్తుంది.

ఆధ్యాత్మిక జీవితం గడపడానికి యజ్ఞం సహకరిస్తుంది. అంటే మన సమయం, కౌశల్యం, వనరులు, దక్షత, ప్రేమ కలిగి ఉండడం. మనం అవి ఇతరులకు ఎంత ఎక్కువగా ఇచ్చినా, దాని కన్నా ఎక్కువగా ఇవ్వాలి. ఒకరికి ఎక్కువ ఉంటేనే ధనవంతులు కారు. వారు ఎంత ఎక్కువ ఇయ్యగలిగితే అంత సంపన్నులు. శ్రీకృష్ణుడు అర్జునుని ద్వారా మనకి చెప్పే బోధ మనందరిలో ప్రతిష్ఠితమైన దేవుని అనేక రీతులలో సేవించవచ్చని. 273

Eknath Gita Chapter 4 Section 20

Bhagavat Gita

4.20

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుత౦ {4.24}

బ్రహ్మైవ తేన గంతవ్య౦ బ్రహ్మకర్మ సమాధినా

హోమసాధనములు, హవిస్సు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది సర్వమూ బ్రహ్మమే అనెడి భావముతో యజ్ఞముల నాచరించువాడు పొందెడి ఫలము కూడా బ్రహ్మమే అగుచున్నది

దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే {4.25}

బ్రహ్మగ్నా వపరే యజ్ఞం యజ్ఞేనై వోపజుహ్వతి

కొందరు యోగులు దేవతార్చన అణు యజ్ఞమును చేయుచున్నారు. మఱికొందరు ఆత్మైక్య భావనచే బ్రహ్మమనెడి అగ్ని యందు హోమము చేయుచున్నారు

శ్రోత్రాదీ నీ౦ద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి {4.26}

శబ్దాదీ న్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి

కొందరు శ్రోత్రము మొదలైన ఇంద్రియములను సంయము మనెడి అగ్నియందును, మఱికొందరు శబ్దాది విషయ రూపమైన హవిస్సును ఇంద్రియము లనెడి అగ్ని యందును హోమము చేయుచున్నారు

ఇక్కడ శ్రీకృష్ణుడు రెండు ఆధ్యాత్మిక మార్గాలను చెప్పుచున్నాడు: ఒకటి సన్యాసులు, యోగులు, ఋషులు మొదలైనవారి మార్గము; రెండవది ప్రపంచ విషయాలలో తాదాత్మ్యం చెందుతున్న మధ్య మార్గము.

మనము యోగులను, మునులను, ఋషులను, సన్యాసులను గౌరవించాలి. ఎందుకంటే వారు ఆధ్యాత్మిక చింతనకై ప్రపంచాన్ని వీడి బ్రతుకుతారు. నాకు తెలిసిన గురువొకరు హిమాలయాల్లో తపస్సు చేసుకొంటూ ఇంద్రియ విషయాలను పట్టించుకోక -- ఉదాహరణకి సినిమా చూడడం వంటి కోరికలు లేకుండా--తన లక్ష్యాన్ని చేరడానికై తీవ్ర తపస్సు చేసేరు. మనం సంసారంలో బ్రతికి, చిన్న చిన్న కోర్కెలు తీర్చుకోవడంలో తప్పులేదు. సంసారంలో ఉండనివారు చాలా అరుదు. కాబట్టి వాళ్ళను అగౌరించ కూడదు.

తక్కినవాళ్ళము సంసారంలో పడి ప్రపంచ విషయాలలో మునిగి తేలుతూ ఆధ్యాత్మిక జీవితంకై కృషి చేస్తాము. మనం సమాజంలో కుటుంబంతో బ్రతుకుతూ, మనలో దేవుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడన్న ఎరుక కలిగి ఉండాలి. మనము ఇంద్రియ వ్యాపారాలను పూర్తిగా కట్టడి చేయక, వాటి ద్వారా ప్రజా సేవ చెయ్యవచ్చు. నేను ఉపవాసం చేసే బదులు, మితంగా తిండి తిని -- నా నాలుక కొరకై కాక, దేహాన్ని పోషించడానికి-- ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. నా దేహము బలంగా లేకపోతే సమాజానికి సేవ చెయ్యలేను. కాబట్టి ఉపవాసం చెయ్యకుండా, ఎంతో కొంత తిండి తినడం ఉత్తమం. ఉపవాసం, తిండి పోతులా తినడం రెండు కొనలు. వాటి మధ్యన మితంగా తినడం ఉంది. అది పాటించడం ఎంతో కష్టం. దీన్నే బుద్ధుడు మధ్య మార్గం అన్నాడు. అది సంసారంలో ఉన్నవారికి వర్తిస్తుంది. అది ఒక కౌశల్యం. ఆ మార్గంలో ఇంద్రియాలను నియంత్రించి, వాటిని పూర్తిగా వద్దనక, ప్రజా సేవకై ఉపయోగిస్తాము. మన భౌతిక దేహాన్ని, మానస్సును, బుద్ధిని, డబ్బు, దస్కం, పేరు ప్రఖ్యాతలు ఆర్జించడానికి కాక జీవితాన్ని సుగమ్యం చేసుకోవడానికి వినియోగిస్తాం. 270

Eknath Gita Chapter 4 Section 19

Bhagavat Gita

4.19

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః {4.23}

యజ్ఞా యా చరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే

ఆసక్తి లేనివాడును, ముక్తుడును, మనస్సును జ్ఞానమునందు నిలిపిన వాడును, యజ్ఞార్థమై కర్మము నాచరించువాడు నగు మనుజుని యొక్క కర్మ సంపూర్ణముగ నశించుచున్నది

ఇక్కడ గతసంగ అంటే ఎవడైతే తన అహంకారాన్ని విడనాడేడో. చాలామంది తమ అహంకారంతో కలలు కంటూ, తమయందే నిశ్చితులై, తమ కుటుంబాన్ని, సమాజాన్ని ప్రేమించకుండా ఉంటారు. ధ్యానంలో మన దృష్టిని క్రమంగా ఇతరుల మేలుకై సారిస్తాము. మనగురించి మనమెంత ఎక్కువగా ఆలోచిస్తామో, అంత తక్కువగా ఇతరులను ప్రేమిస్తాము.

మనం ప్రేమను అనుభవించాలంటే ఎక్కడికో వెళ్ళనక్కరలేదు. ఇప్పుడే, మన కుటుంబంలో ప్రేమని చవి చూడవచ్చు. మన కుటుంబాన్ని విస్మరిస్తే ఆధ్యాత్మిక సాధన అనిపించుకోదు. భార్యాభర్తల మధ్య కలహాలు సామాన్యం. ముఖ్యంగా వారు వేర్వేరు సంస్కృతులలో, దేశాల్లో, కుటుంబ వ్యవస్థలలో పెరిగి ఉంటే వారి మధ్య అనేక విబేధాలు రావచ్చు. అలాంటప్పుడు "నేను నీతో మాట్లాడను. చూడనైనా చూడను" అనడం వేర్పాటుకి దారి తీస్తుంది. ఈ ఘర్షణకి కూడా ఆధ్యాత్మిక అంశం ఉంది. గీత ప్రతికూల పరిస్థితులలో ఎలాగ ప్రవర్తించాలన్న దాని గురించి చాలా జ్ఞానం ఇస్తుంది. దాన్ని గ్రహించక పోతే ఘర్షణ వలన కలిగే అవకాశాలను ఉపయోగించుకోలేము. ఉదాహరణకి స్పర్థలను పరిష్కరించడం, మనలో ప్రతిష్ఠితమైన దేవుని దగ్గరగా వెళ్ళడం.

రెండవ విశేషణం: ముక్తస్య. ముక్త అనగా స్వతంత్రుడు. మనము ఒకరిపై ఆగ్రహంతో ఉంటే, అది స్వతంత్రత కాదు. అది బానిసత్వం. మనం ప్రత్యర్థి చేయమన్నవి చేస్తున్నాం.

నా అమ్మమ్మ చెప్పేది, ఒకరితో విబేధాలు కలిగి, వారి నుంచి దూరంగా జరిగి, మైత్రిని కోల్పోతే, వారి సంగీతానికి, మనం నాట్యం చేస్తున్నాము. అంటే ఒక తోలు బొమ్మలాగా వారు చెప్పినట్టు ఉంటాము. అదే వారేమి చేసినా, శాంతంగా ఉండి, వారికి ప్రేమ, గౌరవము ఇస్తే తద్వారా మనం స్వతంత్రత పొందుతాము. నాకు తెలిసి దగ్గర సంబంధాలలో ఆగ్రహం కలిగితే మనం నిజంగా "నన్ను దగ్గరికి చేర్చుకొనే సహాయం చెయ్యి" అని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో, జీవితంలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ఉండి స్వతంత్రతను పొందవచ్చు.

ఇక్కడ స్వతంత్రత అంటే మన ఒక్కరి గురించే కాదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు స్వతంత్రంగా ఉంటే తప్ప మనకి స్వతంత్రత లేదు. గీత చెప్పేది అఖండమైన స్వతంత్రత. నేను స్వతంత్రత పొందితే, నా చుట్టూ ఉన్నవారి స్వతంత్రతకై పాటుపడాలి. కాబట్టి మనము, మన కుటుంబం, సమాజం, దేశం స్వతంత్రంగా ఉండాలి.

స్వతంత్రత గురించి కుటుంబ విషయాల ద్వారా తెలిసికోవచ్చు. కుటుంబం ఒక విశ్వవిద్యాలయం లాంటిది. కొందరు దాని విలువ తెలీక తమ, ఇతరుల స్వతంత్రతకై ప్రయత్నిస్తున్నారని భావిస్తారు. కానీ అది నిజం కాదు. మనం కుటుంబ స్వతంత్రము, ప్రతి కుటుంబ సభ్యుని స్వతంత్రము మీద ఆధార పడి ఉందని తెలిసికోవాలి. ఒక మంచి కొడుకైనా, కూతురైనా పెరిగి పెద్దయి ఒక మంచి భర్త లేదా భార్యగా, తల్లి లేదా తండ్రిగా, ఒక మంచి పౌరునిగా మెలగుతారు.

మొగల్ సామ్రాజ్యము ఉన్న రోజుల్లో కళాకారులు ఒక కళా ఖండాన్ని తమ కౌశల్యమంతా వినియోగించి ఎంతో కాలం తీసికొని సంపూర్ణమైనదిగా చేసేవారు. ఒక కళాకారుడు సూక్ష్మ ఖండ౦పై మాత్రమే తన దృష్టి కేంద్రీకరిస్తాడు. అలాగా అందరూ కళాకారులూ పనిచేసి ఒక పెద్ద కళా ఖండాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే మనం ఆధ్యాత్మిక పథంలో స్వతంత్రతని పొందడానికి ఒక పెద్ద యజ్ఞంలా చెయ్యనక్కరలేదు. చిన్న చిన్న ప్రయత్నాలు, మిక్కిలి కౌశల్యంతో చేస్తే చాలు.

జ్ఞానావస్థితచేతసః -- అంటే ఎవని మనస్సు శుద్ధమై వాని జ్ఞానము సర్వ జీవ సమానతను గ్రహిస్తుందో. మనము మన అనుబంధాలలో సర్వజీవ సమానతను పాటిస్తే మన మనస్సు శుద్ధమౌతుంది. 268

Eknath Gita Chapter 4 Section 18

Bhagavat Gita

4.18

యదృస్చా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః {4.22}

సమ సిద్ధావ సిద్ధౌచ కృత్యాపి న నియధ్యతే

లభించిన దానితో తృప్తి చెందువాడును, ద్వంద్వములను దాటినవాడును, మాత్సర్యము లేనివాడును, జయాపజయములందు సమబుద్ధి గలవాడును అగు మనుజుడు కర్మలను నాచరించినను బంధింపబడడు

జీవితము ద్వంద్వాలతో కూడినది: వెలుగు-చీకటి, ఆనందం-బాధ, పొగడ్త-తిట్టు, జయం-అపజయం మొదలగునవి. ఇవి అన్నీ కలిసి వస్తాయి. అంటే ఎప్పటికీ పొగడ్తలే వినం. అప్పుడప్పుడు తిట్లు కూడా భరించాలి.

మనని ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆందోళన చెందనక్కరలేదు. ఎందుకంటే మనం స్వతంత్రంగా, విలేఖరులు మొదలగు వారి బెడద లేకుండా, ఎక్కడికైనా వెళ్ళచ్చు. అలాగే మనంఎవరి పొగడ్తలకోసమై ఎదురుచూడనక్కరలేదు. ఇదే నిజమైన యోగుల పద్దతి. ఎందుకంటే పొగడ్తలు, మన్నన, భద్రత మనలోనే ఉన్నాయి.

సర్కస్ లో విన్యాసాలు చేసేవారు, క్రీడలలో ప్రసిద్ధి పొందిన వారు, ఒక్క రోజులో తమ కౌశల్యం పొందలేదు. దాని వెనుక తీవ్రమైన కృషి ఉంది. అలాగే ధ్యానం కూడా. మనలో కొందరు సున్నితమైన స్వభావమున్నవారు పొగడ్త, మన్నన పొందకపోతే చాలా బాధపడతారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవలసింది దేవుడు మనలనెన్నడూ తిరస్కరించడు. అదొక్కటే చాలు మనమన్ని తిరస్కారాలని సహించడానికి.

గీత చెప్పేది ద్వంద్వాలతో ప్రపంచాన్ని చూస్తే సృష్టిలోని ఏకత్వాన్ని చూడలేం. మన బుద్ధి ద్వంద్వాలతోటే పనిచేస్తుంది. దాని పని విభజించడం, వర్గీకరించడం, క్రమంలో పెట్టడం. అది అలా పనిచేయకపోతే మనం మనుష్యులము కామని కొందరంటారు. రమణ మహర్షి తన అనుచరులకు సుఖదుఃఖాలకు అతీతంగా ఉండండి అని చెప్పడంలో అంతరార్ధం వాటిని పట్టించుకోకుండా ఉండమని కాదు; వాటిని దాటి ఊహాతీతమైన ఆనందం పొందమని.

శ్రీకృష్ణుడు విమత్సర -- అనగా పోటీ పడకుండుట -- అనే విశేషణము వాడేడు. కొందరు స్పర్థయా వర్ధతే విద్యా అంటారు. పోటీ లేనిదే ఏమీ సాధించలేమనే భావన చాలా మందిలో ఉంది. మనము పరోపకార౦ చేసి, కుటుంబాన్నీ, సమాజాన్ని, దేశాన్నీ, ప్రపంచాన్నీ ప్రభావితం చేసే దిశలో నడవాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనం నిజంగా దేవునిగురించి తెలిసికోవాలని, ఆయనలో ఐక్యం అవ్వాలని అనుకొంటే, మన స్వార్థం వదిలిపెట్టి, పరుల ఆనందానికై పాటు పడాలి.

విమత్సరము లేనందువలన కొందరు ఇతరులతో పోలిక పెట్టుకొన్ని, వారికన్న ఎక్కువ స్థాయిలో ఉండాలని పోటీ పడతారు. దేవుడు మనందరినీ అద్వితీయంగా ఉండమని సృష్టించేడు. కాబట్టి మన మార్గంలో మనము సుస్థిరంగా ఉండాలి. ఒక పాశ్చాత్య దేశస్తునికి గురువు ఇచ్చిన నామము అతులానంద. దాని అర్థం: మనుష్యులలో పోలికలు చూడక, అబేధంగా ఉండేవాడు. అదే విధంగా కాళిదాస శాకుంతల్యం లో అనసూయ అనే పాత్ర ఉంది. దాని అర్థం: ఎప్పటికీ అసూయ లేనిది. అలా ఉండేవారు చాలా అరుదు. మనందరి విలువ మనలో ప్రతిష్ఠితమైన దేవుని వలన కలిగింది కానీ, పోటీ పరీక్షలలో గెలిచినందు వలన కాదు.

సమః సిద్ధౌ అసిద్ధౌ చ: సిద్ధ అనగా విజయం; అసిద్ధ అనగా అపజయం. శ్రీకృష్ణుడు తనను నిజంగా ప్రేమించినవాడు జయాపజయాలలో సమంగా ఉంటాడని అంటున్నాడు. నాకు తెలిసి అపజయంలో ఉద్రేకము చెందకుండా ఉండవచ్చు. కానీ విజయం కలిగినప్పుడు అందరికీ ఆ వార్త చెప్పాలనే అభిలాష ఉంటుంది. కొందరు నడిమంత్రపు సిరి కలిగినప్పుడు గానీ, పేరు ప్రఖ్యాతలు గడించినప్పుడు గానీ, తమ బాల్య మిత్రులకు స్వస్తి చెప్పి, క్రొత్త ఊరు, క్రొత్త మిత్రులను ఎంచుకొంటారు. అదే ఆధ్యాత్మిక మార్గంలో విజయుడైనవాడు తన బాల్య మిత్రుల వద్దకు వెళ్ళి "మీవలన నేను చాలా తెలిసికొన్నాను. నేను మీకు ఎంతో ఋణపడి ఉన్నాను. ఇప్పుడు మీరంతా నాతో విజయాన్ని పంచుకోండి" అంటాడు. మనమెంత ఎత్తుకు ఎదిగినా మనకన్నా దురదృష్టవంతులను మరచిపోకూడదు. ఇతరులు మనని పొగిడినా, తిట్టినా, నిరసించినా, ద్వేషించినా మన శాంతాన్ని, భద్రతని కోల్పోక, దేవుడు మనలో ప్రతిష్ఠుతుడయి ఉన్నాడని తలంచి ఉపశమనం పొందాలి. 263

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...