Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 29

Bhagavat Gita

4.29

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్స౦యతే౦ద్రియః {4.39}

జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి

శ్రద్ధగలవాడు, తత్పరుడు, ఇంద్రియములను నియమించిన వాడు ఈ జ్ఞానమును పొందుచున్నాడు. జ్ఞానమును పొందిన వెంటనే శాంతిని పొందుచున్నాడు

ఆజ్ఞ శ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి {4.40}

నాయం లోకో అస్తి న పరో సుఖం సంశయాత్మనః

జ్ఞానశూన్యుడు, శ్రద్ధాహీనుడు, సంశయాత్ముడు తప్పక నశించును. సంశయచిత్తునకు ఇహము లేదు. పరము లేదు. సుఖమూ లేదు.

నాలో ప్రతిష్ఠితమైన దేవుని యందు నమ్మకం లేకపోతే కలిగే సంశయాలు: నా ఆత్మ ఎవరు? నేను శాంతితో ఎలాగ ఉండగలను? ఇతరుల కొరకై ఎలా సేవ చేయగలను? నేను అందరిచే ఎలా కొనియాడబడగలను? ఇక్కడ శ్రద్ధ అంటే మూఢ నమ్మకమనికాదు; స్వీయానుభవంతో కూడిన గాఢమైన నమ్మకము. ఆధ్యాత్మిక పథంలో స్థిర పడినప్పుడ మనలోని అనిర్వచనీయమైన శక్తి, ముఖ్యంగా మిక్కిలి క్లిష్ట పరిస్థితులలో, మన దిశ నిర్దేశిస్తూ, మనల్ని రక్షిస్తూ ఉంటుందని తెలిసికొ౦టాము. అదే పలు మార్లు గ్రహిస్తే మనలోని దేవునిమీద శ్రద్ధ కలుగుతుంది. స్మృతులలో చెప్పిన, యోగులు చెప్పిన మాటలలో శ్రద్ధ ఉండడం మంచిదే కాని, వాటిని స్వీయానుభవం లోకి తెచ్చుకోవాలి. బుద్ధుడు చెప్పినట్లు గురువు దిక్కు చూపిస్తాడు, కానీ ప్రయాణం చేయవలసినది మనమే.

గాంధీజీ ఆఫ్రికా లో ఉన్నప్పుడు, కొంతమంది క్రిస్టియన్ లు ఆయనను తమ మతంలో చేరమని ఒత్తిడి చేసేరు. వారు "నిన్ను జీసస్ అన్ని పాపాలనుంచి విముక్తి చేస్తాడు" అని చెప్పేవారు. అప్పుడు గాంధీజీ "నేను చేసిన పాపాలనుంచి విముక్తి కోరటం లేదు. పాపం చేయించే ఆలోచనల నుండి, లేదా పాపం నుంచి, విముక్తి కోరుతున్నాను" అని చెప్పేవారు.

ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం మనమెవరమో తెలిసికోవడం. ధ్యానంలో ఆఖరి మెట్టు సమాధిలో నాకు తెలిసింది: మీరు, నేను వేర్వేరు కాదు. మనమందరమూ దైవసంబంధమైన ఐక్యతతో కలిసి ఉన్నాము. ఇది తెలిసికొ౦టే, మన౦ ఇతరులను బాధ పెట్టక, వారి పురోగతికై పాటు పడుతూ, అందరితో సామరస్యంగా జీవిస్తాము.

శ్రీకృష్ణుడు ఇచ్చే బోధ: మనలోని దేవుని గూర్చి కొంతైనా అవగాహన లేకపోతే -- అనగా శ్రద్ధ, మనలోని దేవునిపై నమ్మకము, ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉన్నాడనే నమ్మకము, జీవైక్య సమానత మీద నమ్మకము--శాంతితో బ్రతకలేము. హింసాకాండ దీనికి పూర్తిగా వ్యతిరేకము. హింస మనల్ని వేర్పడేటట్టు చేసి, మనల్ను విడదీస్తుంది. ప్రతీ కుటుంబంలోనూ, సమాజంలోనూ కలహాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఒకరు తప్పు చెయ్యవచ్చు. కానీ శ్రద్ధ ఉంటే కుటుంబాన్ని, సమాజాన్ని ఐకమత్యంతో ఒకే త్రాటి మీద నడిపించవచ్చు. 289

Eknath Gita Chapter 4 Section 28

Bhagavat Gita

4.28

యాథైధాంసి సమిద్ధో అగ్ని ర్భస్మసా త్కురుతే అర్జున {4.37}

జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసా త్కురుతే తథా

అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను భస్మము చేయునట్లు, జ్ఞానమనెడి అగ్ని సమస్త కర్మలను భస్మము చేయును

న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే {4.38}

తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి

జ్ఞానముతో సమమైనది, పవిత్రమైనది ఈ లోకమున మరొకటి లేదు. ఈ జ్ఞానమును పొందినవాడు కాలక్రమమున తన ఆత్మనుండే దానిని పొందుచున్నాడు

శ్రీకృష్ణుడు మనము గతంలో ఎంత హీనమైన కర్మలు, ఇతరులను బాధించి, చేసినా, జ్ఞానం వాటిని తుడిచిపెట్టేస్తుందని చెప్తున్నాడు. గతం గురించి విచారించకూడదు. దాని వలన ఒత్తిడి కలిగించుకోకూడదు. మనము మన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరడానికై మన దృష్టిని కేంద్రీకరిస్తే, పాత తప్పులు మన మార్గానికి అడ్డురావు.

జ్ఞానం పొందాలంటే నాకు ధ్యానంతప్ప వేరే ఉత్తమమైన మార్గం తెలీదు. అన్ని మతాలలోనూ ధ్యానం ఒక్కటే దేవుని చేర్చే మార్గం, నిచ్చెన అని అంటారు. ధ్యానం బదులు ఇంద్రియ నిగ్రహం, పరోపకారం అదే దిశలో ఉండవచ్చు. వాటిని పొందుటకై ధ్యానం మొదలపెట్టకపోయినా అవి కలిసి వస్తాయి.

ధ్యానానికి శాఖాహారం ఎంతో అవసరం. మన తోటి జీవులను హింసించి మన పొట్ట నింపుకోవడం తప్పు. ధ్యానం గాఢమవుతున్నప్పుడు మిగతా జీవుల దృక్పథాన్ని అర్థంచేసికొనే జ్ఞానం వస్తుంది. శాస్త్రజ్ఞులు చెట్లు, చేమలు వంటి ప్రకృతి వనరులను సమంగా ఉపయోగించాలని హెచ్చరిస్తునారు. గాంధీజీ పూల మాలలను నిరాకరించేవారు. ఆయన దృష్టిలో పూలు మొక్కల మీద ఉంటేనే వాటి అందం.

ప్రకృతితో, జీవులతో సమంగా ఉండడంతో పాటు మన బంధు మిత్రులయందు కూడా సమంగా ఉండాలి. చెట్లు, జీవులు మాట్లాడవు. వాటి బాధను చెప్పుకోలేవు. అవి మూగ జీవులు. కానీ మనం ఒక వ్యక్తిని పలకరించి "ఇప్పుడు నేను చెప్పేది విను" అంటాం. అతడు స్పందించి "మొదట నేను చెప్పేది విను" అని అనవచ్చు. అలాటప్పుడు మనం సహనం పాటించాలి. మన చుట్టూ ఓర్పు లేని వ్యక్తులు లేకపోతే మనం సహనం ఎలా నేర్చుకుంటాం? మనకైతే "నిశ్శబ్దంగా ఉండు" అని చెప్పడం ఉత్తమమనిపిస్తుంది. కొందరికి లేదు, వద్దు అనే పదాలు నచ్చవు. మన మనస్సును శుద్ధి చేసికొని, సహనం అలవరచుకొని, మనలోని, ఇతరులలోనూ, ప్రతిష్ఠితమైన దేవుని దర్శించవచ్చు. 288

Eknath Gita Chapter 4 Section 27

Bhagavat Gita

4.27

అపి చేదసి పాపేభ్యో స్సర్వేభ్య పాపకృత్తమః {4.36}

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి

నీవు పాపులందరి కంటెను పాపివి యైనను అట్టి పాపము నంతటిని జ్ఞానమనెడి తెప్ప చేత దాటగలవు

ధ్యానం ద్వారా పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం ఒక పడవలాగ అల్లకల్లోలంగా ఉండే సంసార సాగరాన్ని దాటిస్తుంది. శ్రీకృష్ణుడు విచక్షణ, వైరాగ్యం అనే కర్రలతో ఒక తెప్పని చేసి,నీళ్ళను చేతులతో తోస్తూ ఆవలి తీరంలోనున్న ఆనందం, శాంతి, ప్రేమ పొందటానికై పయన మవ్వాలని చెప్తాడు.

బుద్ధుడు తను ఆవలి తీర౦లో నున్న నిర్వాణమునకు చేర్చే పడవ నడిపేవాడినని చెప్పేడు. చాలామంది అది నమ్మరు. వారు ఈ తీరంలోనే ఉండి సదా కలహాలతో, మోసాలతో, వేర్పాటుతో ఉంటారు. కలహాలులేని ఆవలి తీరంకి వెళ్తే సమయాన్ని ఎలా వాడుకోవాలి అన్న సమస్యను కొని తెచ్చుకొ౦టామని భావిస్తారు.

శ్రీకృష్ణుడు తనను కైవర్తకః కేశవః -- అనగా నది దాటించే పడవ వాడు -- అని చెప్పుకున్నాడు. కానీ మనకి ఈ తీరమే ఇష్టం. భద్రత, శాంతి ఇవ్వగలిగే ఆవలి తీరం వైపు ప్రయాణం చెయ్యడానికి ఇష్టపడం. మనం నదీతీరాన ఉన్న ఒక ఊరునుండి, ఇంకో ఊరికి వింతలు విడ్డూరాలూ చూడాలనుకొంటాం. ప్రతి నదీ తీరాన ఉన్న ఊరిలో తిండి, బట్టలు, వింత వస్తువులు ఆశతో కొని పెట్టెలో పెడతాం. కానీ ఆవలి తీరానికి వెళ్లాలంటే పెట్టెను పారేసి వెళ్ళాలి.

దేవుని కృపవలన గాలి మన పడవను నడుపుతూ ఉంటుంది. కానీ మన పెట్టెలు విడిచి పెట్టాలి. ధ్యానం చేస్తున్నా చాలా కాలం పాటు మనం వస్తువులు తెస్తూ వాటిని పోగుచేసుకొంటున్నాం. చాలామంది యోగులు ఈ విధంగానే మొదలుపెట్టి వస్తువులను పడవనుంచి విసిరేసేరు. వైరాగ్యం ఇలాగే మొదలవుతుంది: మనకి అక్కరలేని వస్తువును విడిచి పెట్టడం.

అటుపిమ్మట మనకు అవసరమైన వస్తువులను కూడా పడవనుంచి విసిరేయాలి. కానీ మనకి ఆవలి తీరం కనిపిస్తూ, మనం అక్కడి దృశ్యాలు చూస్తూ ఉన్నప్పడు శ్రీకృష్ణుని వేణునాదం వినిపిస్తే సంకోచించకుండా మన వస్తువులన్నిటినీ విసిరేస్తా౦.

ఆవలి తీరం చేరి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇతరులను పడవలో తీసికురావడం చాలా దుఃఖంతో కూడిన పని. ఆనంద తీరం నుండి మళ్ళీ మన తీరం వస్తే యుద్ధాలు, కరవు, స్వార్థం మొదలైనవాటిని మళ్ళీ అనుభవించాలి.

శ్రీ రామకృష్ణ దీనినే ఒక క్రీడ ఉపమానంతో చెప్తారు. ఆ క్రీడ ఏమైనా కావచ్చు: బంతాట, క్రికెట్ మొదలైనవి. కొందరు పిల్లలు బంతాట చూడడానికి ఒక పెద్ద దడి అడ్డంగా ఉంది. అప్పుడు వాళ్ళు ఒకరి భుజాలమీద ఒకరు ఎక్కి, చివరకు ఒకడు దడి కవతల జరుగుతున్న ఆటను వర్ణిస్తూ ఉండేలా ప్రణాళిక వేసేరు. అలాగే వాళ్ళు భుజాలమీద ఎక్కడం ప్రారంభించేరు. కాని చిట్ట చివరివాడు దడి కావలకి గెంతి పడిపోయేడు. ఈ ఉపమానంలో భూమిమీద స్థిరంగా ఉ౦డి బంతాట చూడాలనే ఔత్సాహికులను తన భుజం మీద ఎక్కించుకునేవాడు జీసస్, శ్రీకృష్ణుడు, బుద్ధుడు వంటి వాడు. గొప్ప యోగులైనవారు: శ్రీ రామకృష్ణ, శ్రీ రమణ మహర్షి, అస్సీస్సి కి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్, మైస్టర్ ఎక్హార్ట్, సెయింట్ జాన్ ఆఫ్ క్రాస్, బంతాటాను మనకి వర్ణించి చెప్పేరు. గీత అడుగుతున్నది: "నీవు అందరూ ఏకమయ్యే ఆటను, దేవుని లీల అనే ఆటను, జీవితమనే పరమాత్ముని ఆటను చూస్తావా?" 286

Eknath Gita Chapter 4 Section 26

Bhagavat Gita

4.26

యజ్ఞత్వా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ {4.35}

యేన భూతా న్యశేషేణ ద్రక్ష్య స్యాత్మ న్యథో మయి

పాండు తనయా! ఈ జ్ఞానమును పొందినచో నీవు మోహమునకు గురికావు. సర్వభూతములను నీ యందును, తరువాత నా యందును దర్శింపగలవు

మనం వేర్పాటు, బహుత్వము అనే నిద్రనుంచి మేల్కొని జీవైక్య సమానతను గ్రహిస్తే మనమెన్నటికీ నిద్ర పోలేము. మనము దేవుని నుంచి ఆవిర్భవిస్తున్నాము, ఆయనలోనే రమిస్తున్నాము, ఆయన యందే లయమవుతున్నాము అనే జ్ఞానాన్ని కలిగి ఉంటే మనమెన్నటికీ వేర్పాటు కలిగించే స్థితికి మార్పు చెందలేము. కొందరు కళాకారులకు, రచయితలకు జీవైక్య సమానత అప్పుడప్పుడు ఒక మెరుపులాగ మెరుస్తుంది. వారా అనుభవాన్ని గుర్తుపెట్టుకున్నప్పటికీ మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. ఇటువంటి అనుభవాలు మనని బలోపేతము చేసి, మెలకువలోనే ప్రపంచం గురించి కలలు కన్నా ఆ అనుభవాలను శాశ్వతంగా పొందలేము. అది సాధన వలననే సాధ్యము. క్రమ శిక్షణతో సాధన చేస్తేనే తప్ప మనము జీవైక్య సమానత స్థితిలో సదా ఉండలేము.

శ్రీకృష్ణుడు మనము మోహముతో -- అనగా భ్రాంతితో-- కూడి ఉన్నామని చెప్పుచున్నాడు. మోహంతో మనం డబ్బు, వస్తువులు మొదలగు క్షణికమైన వాటి గురించి పరిగెడుతున్నాము. కొందరు డబ్బునే కాంక్షిస్తారు. కొందరు ఎక్కడైనా ప్రకృతి -- చెట్లు, చేమలు--అందంగా విరబోసికొని ఉంటే, అక్కడ ఇళ్లుకట్టి, అమ్మి, డబ్బు చేసికో దలుస్తారు. కొందరు కొండ శిఖరాన్న ఒక పెద్ద హోటల్ కట్టి డబ్బు చేసికోవాలని కాంక్షిస్తారు. ప్రసార మాధ్యమాలు మన ఇంద్రియాలను అన్ని వైపులా ప్రసరించేలాగ చేస్తాయి. ఇంద్రియాలను గుఱ్ఱములవలె తర్ఫీదు ఇచ్చి స్వాధీనంలో పెట్టుకోవచ్చు. అలా చేయకపోతే అవి మనల్ని నలుదిక్కులా పరిగెత్తించి, కొండలను, గుట్టలను ఎక్కించి, చివరకు మురికి గుంటలో పడేస్తాయి. మనమెప్పటికీ ఇంద్రియాలు ఆనందము, భద్రత, సంతృప్తి ఇస్తాయంటే నమ్మకూడదు.

మనము ఆధ్యాత్మిక పథంలో వృద్ధి చెంది వేర్పాటును, అహంకారాన్ని నియంత్రిస్తే జీవైక్య భావనను పొందుతాము. అప్పుడు అందరిలోనూ ప్రతిష్ఠితమైన దేవుని దర్శిస్తాము. ఒక కుక్కను ప్రేమించాలన్నా ఆధ్యాత్మిక భావము అవసరము. ప్రతి బంధంలోనూ ఇదే ప్రేమించగలిగే రహస్యము. మనము ఒకర్ని ప్రేమిస్తున్నామంటే: మనము వారి ఆనందాన్ని మన ఆనందం కన్న మిన్నగా చూసుకోవాలి. అటువంటి ప్రేమ మనకు జ్ఞానాన్ని, సున్నితత్వాన్ని, నిస్వార్థతను కలుగజేస్తుంది. 283

Eknath Gita Chapter 4 Section 25

Bhagavat Gita

4.25

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవియా {4.34}

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః

సాష్టాంగ ప్రణామ మాచరించుచు, పరిప్రశ్నించుచు, సేవించుచు, బ్రహ్మజ్ఞులైన జ్ఞానుల నుండి జ్ఞానమును తెలిసికొనుము ఀ

సాక్రటీస్ లాంటివారు హేతువాదాన్ని (logic) కాచి వడబోసేరు. కాని వారు "నేనెవరు?" అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయేరు. ఉదాహరణకి: "ప్రతి మానవుడు మరణిస్తాడు. నేను మానవుడిని. కాబట్టి నేనూ మరణిస్తాను" అనే హేతువాదులు లేకపోరు. నిజానికి మనలో ప్రతిష్ఠితమైన దేవుని దర్శిస్తే మనమెన్నటికీ అమరులమే.

జ్ఞానమనగా తెలిసికోవడం. హేతువాదులు దానినే "మనగురించి తెలిసికోవడం" అని చెప్తారు. కానీ వారిని ఎవరైనా "నీవెవరు?" అని ప్రశ్నిస్తే, దానికి బదులుగా వారు అడిగే ప్రశ్న "నాకెలా తెలుసు?" శాస్త్రజ్ఞులు ప్రపంచంలో అన్నింటి గురించి తెలిసికొని, తమను తామే తెలిసికోకపోతే ఏమి లాభం? మనము పుడతాం, పాఠశాలకు వెళ్తాం, పెళ్లి చేసికొ౦టా౦, పిల్లల్ని కంటా౦, వస్తువులు కొంటాం, అమ్ముతా౦, చివరికి మరణిస్తా౦. ఇదేనా జీవితమంటే?

మనగురించి తెలిసికొంటే, జీవిత లక్ష్యాన్ని సాధించినవారమవుతాం. మన గురించి తెలిస్తే జీవులన్నీ ఏకమే అని తెలిసికొని, అందరితో సామరస్యంగా ఉండాలనే కోరిక కలుగుతుంది.

ఆధ్యాత్మిక చింతన పాఠశాలలలో నేర్పరు. ఎందుకంటే అది పట్టుకుంటేనే వచ్చేది. కొందరు పరోపకారానికై తమ శక్తి, ప్రేమ, జ్ఞానం దారపోస్తారు. అటువంటి ఒకానొక వ్యక్తితో సహజీవనం చేస్తే, మనకీ ఆ సద్గుణాలు అబ్బుతాయి.

శ్రీ రమణ మహర్షి అటువంటి వ్యక్తి. ఆయన యోగులకు యోగి. అలాగే గాంధీజీ. ఒక గొప్ప యోగి దగ్గరకు వెళ్ళి, ఆయనను చూసి, ఆయన బోధ విని, మన హృదయ కవాటాలను తెరిస్తే, ఎంత మట్టి బుర్రలైనా బంగారంగా మారుతాయి.

ఆధ్యాత్మిక జ్ఞానం గురువు వద్దనుండి పొందాలంటే ఆ గురువుని మనసా, వాచా, కర్మా నమ్మి, మన పూర్తి ఏకాగ్రత ఆయనయందు ఉంచాలి. ప్రస్తుతానికి ఆయనే మన ఆత్మ. రమణ మహర్షి బాహ్యంగా ఒక గోచీ కట్టుకొని, నిరాడంబరముగా ఉండేవారు. అది కొందరు చూసి ఆయన్ని తప్పుగా అర్థం చేసికొనేవారు. వారు తమ హృదయ కవాటాలు తెరవక, తమ చేతన మనస్సును బందీఖానాలో పెట్టినవారు. ఎవరైతే అలా కారో వారు రమణ మహర్షిని చూసి "ఆయనే నేను" అనే భావన కలిగి ఉండేవారు. ఆయన గురించి కవికోవిదులు అనేక గీతాలు వ్రాసి, పాడి వినిపించేరు. ఆయన తన గురించి "రమణ మహర్షి ఇక్కడ లేడు. ఇది అంతా ఖాళీ" అంటారు. కానీ ఆయనను పూర్తిగా పరికిస్తే విశ్వాన్ని వ్యాపించిన సృష్టికర్తను చూడవచ్చు.

ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానము పుస్తకాలు చదవడం వలన రాదు. ఒక గురువును నమ్మి, వారిని అనుకరించి, అనుసరించి, వారు దేవునిలో ఎలా ఐక్యమయ్యేరో గమనించి, మన ఆత్మ దర్శనమునకై సాధన చెయ్యాలి. 281

Eknath Gita Chapter 4 Section 24

Bhagavat Gita

4.24

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే {4.32}

కర్మజా వ్విద్ధి తాన్ సర్వా నేవ౦ జ్ఞాత్వా విమోక్ష్యసే

ఈ విధముగ వేదములనుండి అనేక విధములైన యజ్ఞములు ఉద్భవించినవి. ఈ యజ్ఞము లన్నియు కర్మల నుండి ఆవిర్భవించినవియే యని తెలిసికొని వాటినుండి విడిపడుము

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప {4.33}

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే

పరంతపా! ద్రవ్య యజ్ఞముల కంటెను జ్ఞాన యజ్ఞము శ్రేష్ఠమైనది. కర్మము లన్నియు జ్ఞానమునందే పరిసమాప్తమగుచున్నవి

శ్రీకృష్ణుడు మన ధనం, వస్తువులు, సమయం, శక్తి ప్రజా క్షేమం కోరే ఒక మంచి కార్యానికై దానం చెయ్యమని చెప్తున్నాడు. పరులకు ఇవ్వడం వలన మన పరిస్థితి క్షీణించనక్కరలేదు. మన ఆడంబరాలను తగ్గించుకొ౦టే చాలు. మనము జీతానికై పనిచేసినంత సేపూ, ఒక నిస్వార్థ లక్ష్యానికై పనిచేయడం ఉన్నతమైనదని తెలీదు. అలాగని మనకి జీతం ఇచ్చే పనులు మానుకోమని కాదు. అది మన కుటుంబాన్ని పోషించడానికి ఎంతో అవసరం. మన ఖర్చుకు పోనూ మిగిలినది ప్రజా క్షేమం కోరి, సమయం, కౌశల్యం తో పాటు ఇవ్వవచ్చు.

శ్రీకృష్ణుడు జ్ఞానయజ్ఞ౦ చేయమంటాడు. మనం దేవుడికిచ్చే గొప్ప బహుమతి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు పంచడం. మనలో ప్రతిష్ఠితమైన దేవుని ఎరుకను వేరొకరిలో కల్పించడం ఒక యజ్ఞంగా భావించాలి.

అన్ని కర్మలూ చివరికి జీవైక్య సమానతకు దారి తియ్యాలి. మన తప్పులు మనల్ని, తీరని బాధతో, ఆధ్యాత్మిక పథంలో నడవడానికై నిర్భందిస్తాయి. దేవుడు మనల్ని బాధ పెట్టాలని పెట్టడు. ఆయన తన వైపు మనల్ని తిప్పుకోవడం బాధతోనే సాధ్యమని తెలుసు. మనము ఇతరుల అవసరాలను తెలిసికొని వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తే మంచిది. "ఇతరుల అవసరాలేమిటో నా కెలా తెలుస్తుంది? నేను మానసిక తత్త్వవేత్తను కాను" అని మీరు అనవచ్చు. బుద్ధుడు "నీకేది బాధ కలిగిస్తుందో, అదే ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది" అని చెప్పెను. మనం గురువులదగ్గరకు వెళ్ళి సంస్కృతం, వ్యాకరణం ఔపాశన పట్టనక్కరలేదు. ఏది మనకు అవమానం కలిగిస్తుందో అదే మన తండ్రులకు కూడా అవమానం కలిగిస్తుంది; ఏది మనకు నొప్పి కలిగిస్తుందో, అదే మన తల్లులకు నొప్పి కలిగిస్తుంది; ఏది మనకు చికాకు తెప్పిస్తుందో, అదే మన పిల్లలకు కూడా చికాకు కల్పిస్తుంది; ఏది మనకు కోపం తెప్పిస్తుందో, అదే మన మిత్రులకు కూడా కోపం తెప్పిస్తుంది. మనం తెలిసికోవలసింది "పరులు, నేను ఒక్కటే". మనము పరుల అవసరాలను మన అవసరాలను బట్టి అంచనా వేయవచ్చు. అలాగే జీవైక్య సమానతను పాటించడానికి "నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్నా, పేదరికంలో బ్రతికినా, వేరొకరిని కష్ట పెట్టకుండా ఉండే దయ, బుద్ధి, శక్తి, ఇవ్వు" అని దేవుని ప్రార్థించ గలగాలి. ఇదే శ్రీకృష్ణుడు కోరే ఉత్కృష్టమైన యజ్ఞము. 277

Eknath Gita Chapter 4 Section 23

Bhagavat Gita

4.23

అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి {4.30}

సర్వే అప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః

మరికొందరు ఆహార నియమము గలవారై ప్రాణములను ప్రాణవాయువుల యందు హోమము చేయుచున్నారు. వీరందరు యజ్ఞవిదులును, పాపము నశించినవారు అగుచున్నారు.

యజ్ఞ శిష్టా మృత భుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ {4.31}

నాయం లోకో అస్త్యయజ్ఞస్య కుతో అన్యః కురుసత్తమ

అర్జునా! యజ్ఞశేషమైన అమృతమును భుజించెడివారు నిత్యమైన బ్రహ్మమును పొందుదురు. యజ్ఞకర్మ నాచరించని వానికి ఈ లోకమే లేదు. ఇక పరలోక మెక్కడిది? ఀ

దేహ శుద్ధి ఆధ్యాత్మిక జీవనానికి ఎంతో అవసరం. మన స్వస్వరూపం తెలిసికోవాలన్నా, జీవైక్య సమానత్వాన్ని అనుభవించాలన్నా పరసేవ చేయడానికి గల బలం, శక్తి దేహానికి ఉండాలి. అలా కావాలంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఉదాహరణకి రుచి బాగావుంది కదా అని ఏది పడితే అది తినకూడదు. మన దేహాన్ని స్వస్థతతో ఉంచే పౌష్టికాహారాన్ని మాత్రమే తినాలి. కొందరు వంటవాళ్ళు రుచికరమైన క్రొత్తక్రొత్త పిండివంటలు కనుక్కొ౦టారు. వారు భౌతిక పరమైన సమస్యలలో ఇరుక్కొ౦టారు. పోషకాహారాన్ని తిని తక్కినది దేహంలోని జీర్ణ వ్యవస్థకు వదిలేయాలి. ఈ విధంగా మన౦ ఇంద్రియాలను బానిసలగా చేసికొని ప్రాణ శక్తిని వృధాకాకుండా చూసుకోవాలి.

పరులను సేవించడంవలన మనకి ఆనందం, సంతృప్తి కలుగుతాయి. మన స్వార్థపరమైన కోర్కెలను తీర్చుకోవడం కోసమే బ్రతికితే కొన్నాళ్ళకి విసుగు, అభద్రత కలుగుతాయి. ధ్యానం, ఆధ్యాత్మిక సాధన చెయ్యకపోయినా, మనల్ని మరచిపోయినప్పుడు ఆనందం, మనగురించే ఆలోచిస్తూ ఉంటే విచారం కలుగుతుంది. నేను, నాది అనుకునేవానికి యోగం అబ్బదు సరికదా ప్రపంచాన్ని కూడా ఆనందంగా అనుభవించలేడు. నిస్వార్థపరుడు ప్రపంచాన్ని పూర్తిగా అనుభవిస్తాడు. ఎ౦దుకంటే వాడు ఎప్పటికీ స్వతంత్రుడు. 276

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...