Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 3

Bhagavat Gita

6.3

యదా హి నేంద్రియార్థేషు న కర్మ స్యనుషజ్ఞతే {6.4}

సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్త దోచ్యతే

ఇంద్రియ విషయములందును, కర్మల యందును అపేక్ష నుంచక సర్వ సంకల్పములను త్యాగము చేయువాడు యోగారూఢుడని చెప్పబడుచున్నాడు

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చేతన మనస్సు శిఖరాలను అధిరోహించి, జీవైక్య సమానతను, జ్ఞానాన్ని, పట్టుదలని, శక్తిని కలిగి సామరస్యంగా బ్రతికే వాని గురించి చెప్తున్నాడు. భౌద్ధులు అట్టి వానిని నిర్వాణమును పొందినవాడు అని అంటారు. అనగా స్వార్థం, అహంకారం, వేర్పాటులతో కూడిన చెర నుండి విడుదల చేయబడినవాడు.

ఎవరైతే తమలో ప్రతిష్ఠితమైన దేవునియందు స్థిరమైన భక్తితో ఉంటారో, వారు స్వార్థ పూరిత కోరికలవలన --అనగా డబ్బు, పేరుప్రఖ్యాతులు మొదలగునవి-- చలించరు. అట్టివారు పూర్తిగా స్వతంత్రులై, ప్రపంచంతో లావాదేవీలు పెట్టుకోకుండా, సంపూర్ణమైన ఆనందంతో, భద్రతతో ఉంటారు. మనం బంగారం, పుస్తకాలు, కంప్యూటర్లు మీద ఆధారపడి, అవి లేకపోతే విచారానికి గురి అవుతాం. ఆ విధంగా బలహీనులమై అనేక క్లేశాలు అనుభవిస్తాం.

మనకు కావలసిన ఏకైక ఊత మనలోని భగవంతుడు. శ్రీకృష్ణుడు (18:66) అన్ని బాహ్య ఊతలను పట్టి వేళ్ళాడక, వాటిని వదిలి, తననే నమ్మి యుండమని చెప్తాడు. మనం దేవునికి అన్నీ సమర్పిస్తే, మనకు అన్నీ కలుగుతాయి; ఆయనపై పూర్తిగా ఆధార పడితే మనం స్వతంత్రుల మవుతాము. ధ్యానం వలన అవి సాధ్యం. ఇంద్రియాలను నిగ్రహించుకొనే శక్తిని పొంది, బాహ్య ఊతలను వదిలి, దేవుని యందే దృష్టి కేంద్రీకరించి ఉంటాం. 340

Eknath Gita Chapter 6 Section 2

Bhagavat Gita

6.2

యం సన్న్యాస మితి స్రాహు ర్యోగం తం విద్ధి పాండవ {6.2}

స హ్య సన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన

పాండునందానా! దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని గ్రహింపుము. సంకల్పములను త్యజించని వాడెవడూ యోగి కాలేడు

ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే {6.3}

యోగారూఢస్య త స్యై న శమః కారణ ముచ్యతే

యోగమును పొందగోరు మునికి కర్మకారణమని చెప్పబడినది. యోగమును పొందిన వానికి శమము కారణమని చెప్పబడినది.

పై శ్లోకంలో శ్రీకృష్ణుడు తనలో ఐక్యమవ్వడానికి ఎంత ఎత్తు కెదగాలో చెప్తున్నాడు. ఆరురుక్షు అనగా ఎత్తు ఎక్కడానికి ప్రయత్నించేవాడు. యోగారుఢా అనగా ఎత్తు ఎక్కి ఉన్నవాడు. సాధారణంగా ఎత్తు ప్రదేశాల్లో ప్రాణ వాయువు తక్కువ మోతాదులో ఉంటుంది. ఉదాహరణకి హిమాలయాలు చాలా ఎత్తుగా ఉండి, ఎవరెస్ట్ శిఖరం సామాన్యులకి అందుబాటులో ఉండదు. దాన్ని ఎక్కాలంటే ఎంతో పరిశ్రమ చెయ్యాలి. అంటే చిన్న చిన్న కొండలను మొదట ఎక్కి, అటుతరువాత కొంత పెద్ద కొండలను ఎక్కి, క్రమంగా ప్రాణవాయువును ఎలా నియంత్రించాలో తెలిసికోవాలి. అలాగే ఆధ్యాత్మిక సాధన శారీరిక, మానసిక శ్రమతో కూడినది.

ఒకరు కొండ శిఖరాన్ని చేరాలని తాళ్లతో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అన్ని కొండలూ తిరుపతి కొండలవలె కాక, కొన్నిటిలో నడవడానికి దారిలేక ఉంటాయి. అలాంటప్పుడు కొందరు సాహసికులు తాళ్ళు, మేకుల సహాయంతో కొండ నెక్కడానికి ప్రయత్నిస్తారు. అటువంటి ప్రయత్నంలో ఒక సహచరుని తాడు తెగి వ్రేళ్ళాడుతూ ఉంటే, వానికి సహాయం చేసి, మీదకు లేపడం, సహజ మానవ లక్షణం. మొదట్లో వానికి సహాయం చెయ్యడానికి సహచరుడు వస్తాడని నమ్మక ముండదు. కానీ అదే జరిగితే, తనను మీదకు తేవడానికి సహాయం చేస్తాడని నమ్మడు. అది కూడా జరిగితే వానికి సహచరుడిపై మిక్కిలి గురి కలిగి, క్రమంగా వాని యందు ప్రేమ భావము పుడుతుంది.

తప్పు మీద తప్పు చేసి, కఠినంగా ఉండే వారితో ప్రేమ తప్ప మరేదీ పనిచేయదు. వారిపై క్రోధాన్ని చూపితే అది హింసకు దారి తీస్తుంది. అలాంటప్పుడు ధ్యానం ఒకటే మార్గం. ఇతరులకు హాని చేయనివారితో ఓర్పుతో ఉండి, వారు చెడు చేసినా, వారికి మంచి సహాయం చెయ్యవచ్చు. అదే ఒకరు మనకి హాని చేస్తారని అనిపిస్తే వారితో సహజీవనం చెయ్యడం బహు కష్టం.

మనం హృదయపూర్వకంగా పరులకు ఉపకారం చెయ్యాలని పూనుకొని, లాభం, పేరుప్రఖ్యాతులు ఆశించక పనిచేస్తే కర్మ యోగమనే నిచ్చెనతో ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవచ్చు. మొదట్లో మన గురించి ఏమిటి అనే ప్రశ్న కలిగి పరోపకారము భార మనిపించవచ్చు. కొన్ని ఏళ్ల తరువాత, ఎప్పుడైతే మనము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందన్న భావన కలుగుతుందో, మన పరిస్థితి మెరుగుపడి, లక్ష్యానికి మార్గం సుగమమౌతుంది.

ఈ విధంగా ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకునేవారి మనస్సు నిశ్చలంగా ఉండి, అహంకారం పూర్తిగా పోయి, వారిలో అపరిమితమైన ప్రేమ వెల్లువై ప్రవహిస్తుంది. ఆ స్థితిలో ఆందోళన, క్రోధము, దురాశ, ద్వేషము, మత్సరము లేక ప్రేమ సాగరంలో ఓలలాడుతాము. ఆ స్థితి చేరాలంటే గట్టి ప్రయత్నం చెయ్యాలి. మన అహంకారం పూర్తిగా సమసిపోయి, మనము ప్రేమ స్వరూపులమవుతే, కర్మ మనము చెయ్యం; దేవుడే కర్మ మనచేత చేయిస్తాడు. 339

Eknath Gita Chapter 6 Section 1

Bhagavat Gita

6.1

శ్రీ భగవానువాచ:

{6.1}
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః

స సన్న్యాసీ చ యోగీ చ స విరగ్నిర్న చా క్రియః

తాను చేయవలసిన కర్మను ఫలాపేక్ష లేకుండా చేయువాడే నిజమైన సన్యాసి. అతడే నిజమైన యోగి. అగ్నిహోత్రాలు విడిచినంత మాత్రాన సన్యాసి కాడు. కర్మలు చేయనంత మాత్రమున యోగికాడు

గీత మనకు మూడు మార్గాలు చూపుతుంది: కర్మ యోగం, జ్ఞాన యోగం మరియు భక్తి యోగం. ఇవి అన్నీ ధ్యానంలో కలిసి వస్తాయి.

కర్మ యోగం చాలామంది అనుసరిస్తారు. మొదట్లో ఎంతో ఉత్సాహంతో, చాకచక్యంతో కర్మలు చేసి, అటు తరువాత వాటి వలన లాభము ఆశిస్తారు. నిజమైన కర్మ యోగం దానికి విరుద్ధం. డబ్బు, దస్కం, పేరు ప్రఖ్యాతులు కర్మ వలన సాధ్యమే కాని, అవి స్వలాభానికై చేస్తే కర్మ యోగం అనిపించుకోదు. అందుకే కర్మ యోగంలో లక్ష్యం చేరడం కష్టం. గాంధీజీ వంటి వారు నిజమైన కర్మ యోగులు. వారు జీవితాంతం ప్రజా సేవ చేసి, తమకు ఏమి మిగిలింది అని విచారించలేదు. మనమంత ఎత్తు ఎదగాలంటే చాలా సాధన అవసరం. ముఖ్యంగా నిస్వార్థ సేవ వలన కొంత వెసులుబాటు ఉంటుంది. దానికి ధ్యానం చెయ్యడం తప్ప, వేరే మార్గం లేదు.

రెండవది జ్ఞాన యోగం. అది మరింత కష్ట సాధ్యం. ఇక్కడ జ్ఞానమంటే కూటి కోసమై కోటి విద్యలు అనబడే శాస్త్రీయ జ్ఞానం కాదు. ఉదాహరణకి ఎవడైతే ద్రష్ట, దృక్కు, దృశ్యాలకు అతీతంగా ఉంటాడో వాడు జ్ఞాన యోగి అనబడతాడు. అంటే వానిలో బుద్ధికి అందిన జ్ఞానము (intellectual knowledge) ఒక్కటే కాక ఊహా జ్ఞానము (intuitive knowledge) సహజంగా ఉంటుంది. రమణ మహర్షి, ఆల్బర్ట్ ఐన్స్టీన్, మొదలగువారికి అట్టి యోగం సహజ సిద్ధంగా వచ్చింది. మనలో చాలామందికి మూడవదైన భక్తి యోగం సులభ సాధ్యము.

ప్రేమ అనే భావన గూర్చి చదవడం, వ్రాయడం సులభమైనా ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉందంటే, వారు తమ సుఖాన్ని తక్కువగా చూసుకొని తన భాగస్వామికి ఎక్కువ ఇవ్వాలి. క్రమంగా ఆ భావన బంధుమిత్రులయందు, కుటుంబము యందు, సమాజము యందు, చివరకు మానవాళి యందు కలిగి ఉండాలి. ఒకరు నాటక ఫక్కీలో ప్రేమ గురించి చెప్పవచ్చు. కానీ వారు అనేక విమర్శలు ఎదుర్కొన వలసి వస్తుంది. అదేపనిగా విమర్శ తరువాత విమర్శ వస్తే ఒక్కొక్కపుడు మానసిక క్లేశ మనుభవించి, మానసికంగా తట్టుకోలేని స్థితి రావచ్చు. అప్పుడు ధ్యానం వలన వానిలో సహనం కలిగి, విమర్శలను ఆనందంగా, అప్రయత్నంగా స్వీకరిస్తాడు.

నాకు భావి తరం కేవలం వస్తు సేకరణే జీవిత లక్ష్యమనుకోదని గట్టి నమ్మకం ఉంది. అంటే వారు తమ కోర్కెలను నియంత్రించుకోగలరు. అదే వైరాగ్యం కూడా. కానీ అంతటితో ఆగి పోక తమ అహంకారాన్ని యందు కూడా వైరాగ్యం పొందాలి. కొందరికి పటిష్టమైన భావాలు ఉంటాయి. వాటిని వారు అమ్మలేరు, ఇతరులు కొనలేరు. కానీ అవి అలాగే చలామణీ అవుతాయి.

మనల్ని ఇతరులు అపహాస్యం చేసినా, లేదా మనపై నింద వేసినా, మన మనస్సు ఆందోళన చెందకుండా వుండాలంటే ధ్యానం ఎంతో అవసరం. ముఖ్యంగా అనుబంధాలలో భావ వ్యక్తీకరణం వలన సహజంగా రాపిడి, ఒత్తిడి, సమస్యలు కలుగుతాయి. ఎవరైతే ఏకాకిగా ఉంటారో, వారికి కుటుంబంవలన కలిగే ఆనందాన్ని పొందక -- అంటే జీవితంలో ఇచ్చిపుచ్చుకోడాలు చేయక -- జీవైక్య సమానత గురించి తెలిసికోలేరు. కుటుంబంతోనైనా లేదా మిత్రులతోనైనా సహజీవనం చేస్తూ, ఇతరులను మనకన్నా ఎక్కువగా చూసుకొంటే, మన ఆనందానికి అవధులు లేక ఉంటుంది. ఈ విధంగా ఏకీకరించే యోగంలో, నిస్వార్థ కర్మ, జ్ఞాన సముపార్జన, ప్రేమ లకు గుర్తింపు వస్తుంది. అవి పొందడానికి ధ్యానం ఎంతో సహకరిస్తుంది. 336

Eknath Gita Chapter 5 Section 15

Bhagavat Gita

5.15

స్పర్శాన్ కృత్వా బహి ర్బాహ్యా౦ చక్షుశ్చైవా౦తరేభ్రువోః {5.27}

ప్రాణా పానౌ సమౌ కృత్వా నాసాభ్య౦తర చారిణౌ

యతే౦ద్రియ మనోబుద్ధి ర్ముని ర్మోక్ష పరాయణః

విగతేచ్చా భయక్రోధో య స్సదా ముక్త ఏవ సః {5.28}

భోక్తారం యజ్ఞ తపసా౦ సర్వలోక మహేశ్వరం

సుహృద౦ సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్ఛతి

ఏ మనుజుడు బాహ్య విషయములను బాహ్యముననే {5.29}
విడిచిపెట్టి, దృష్టిని భ్రూ మధ్యమున నిలిపి, ముక్కు పుటములలో సంచరించెడి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములను సమగ్రముగ జేసి, ఇంద్రియ మనో బుద్ధులను నిగ్రహించి, ఇచ్చా భయక్రోధములను విడిచి, మోక్షాపేక్ష గలిగి మనన శీలుడై యుండునో అట్టి వాడు సదా ముక్తుడే

నేను యజ్ఞతపస్సులకు భోక్తననియు, సర్వ లోకములకు ప్రభువుననియు, సర్వ ప్రాణులకు హితుడననియు తెలిసి కొనిన పురుషుడు శాంతిని బొందుచున్నాడు

ఈ శ్లోకాలు సమాధి స్థితికి సమన్వయము చేసికోవచ్చు. శ్రీకృష్ణుడు ముక్త అనే పదాన్ని వాడేడు -- అనగా ఒకడు సమాధి స్థితిలో సంపూర్ణ స్వతంత్రాన్ని అనుభవిస్తాడు. ముక్తునికి జీవైక్య సమానత ఆచరణలోకి వచ్చి, సర్వ జీవులతో సామరస్యంగా జీవిస్తాడు. ఆధ్యాత్మిక పథంలో పూర్తి స్వతంత్రను పొందాలంటే మనము ఏ ఒక్కరిపై ఆధార పడక, మన భద్రత, ఆనందం, సంతృప్తి కొరకై ఇతరులను ఆశ్రయించక ఉండాలి. ఇది పేదరకం కోరమనడానికై చెప్పబడలేదు. ఇది స్వార్థ పరమైన బంధాలనుంది విముక్తి పొందమని చెప్పడం మాత్రమే. సమాధిలో ఇంద్రియాల వ్యాపారం లేక, సంపూర్ణ స్వతంత్రం అనుభవిస్తాము.

కళ్ళలో సౌందర్యం అంతర్గత భావాల వలన వస్తుంది. ఒక తల్లి తన బిడ్డను చూసినప్పుడు; భార్యా భర్తలు సామరస్యంతో ఉన్నప్పుడు; వారి కళ్ళు దేదీప్యమానంగా వెలుగుతాయి. అలాగే పాత మిత్రులు కలిసినప్పుడు కూడా. మనందిరికీ సహజంగా సౌ౦దర్యవంతమైన కళ్ళు ఉన్నాయి. కానీ క్రోధము, స్వార్థము, హింస అనే అంతర్గత భావాలవలన కళ్ళు తమ సౌందర్యాన్ని కోల్పోతాయి. ప్రశాంతమైన మనస్సు, ప్రేమతో నిండిన హృదయం, క్షమా గుణం మన కళ్ళకు తేజస్సునిచ్చి మనలోని దేవుని సౌందర్యాన్ని దర్శింపజేస్తాయి.

ధ్యానం గాఢమైనప్పుడు, కనుపాపలు భృకుటి మీద స్థితమౌతాయి. దీన్నే మనం మూడవ కన్ను అంటాం. అది ఆధ్యాత్మిక ఎరుక కనిపించే స్థానం.

ధ్యానం వలన కలిగే మరొక మార్పు శ్వాస నెమ్మదిగా అవడం. యోగులు శ్వాస ప్రక్రియకు ఆలోచనా సరళితో పొంతము౦దని విశ్వసిస్తారు. ఉదాహరణకి మనకు విపరీతమైన కోపం కలిగితే, మనస్సు గతి తప్పి, మన శ్వాస అధికమౌతుంది. నేను ప్రాణయామాలు, కుంభకం వంటి ప్రక్రియలు పెద్దగా అవసరం లేవని తలుస్తాను. కోపం వస్తే మంత్ర జపం చేస్తూ దీర్ఘమైన కాలి నడక చేయడం ఉత్తమం. 333

Eknath Gita Chapter 5 Section 14

Bhagavat Gita

5.14

కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసా౦ {5.26}

అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్

కామాక్రోధముల నుండి విడిపడిన వారును, మనసు స్వాధీనపడిన వారును, ఆత్మ జ్ఞానులును అగు యతి పురుషులకు బ్రహ్మజ్ఞానము సర్వత్ర కలదు.

ఈ శ్లోకంలో బ్రహ్మనిర్వాణ అనే పదం శ్రీకృష్ణుడు ప్రయోగించేడు. అంటే ఒక ఉత్కృష్టమైన లక్ష్యం. దాన్ని చేరాలంటే రెండు అడ్డంకులు ఉన్నాయి. ఒకటి స్వార్థం. దాని వలన ఒకడు లాభము, పేరుప్రఖ్యాతలు, ప్రతిష్ఠ కొరకై ప్రేరేపింపబడతాడు. బుద్ధుడు దీన్నే తన్హా -- అంటే తనది పొందటానికి ఇతరులతో అవసరమైతే కలహం పెట్టుకొని చేయడం-- అంటాడు. రెండవ ప్రతిబంధకం క్రోధం. ఎక్కడైతే వేర్పాటు, తానొక్కడే తృప్తి పొందాలనే భావన ఉంటుందో అక్కడ క్రోధం ఉన్నట్టే. కామము, క్రోధము కలసి వస్తాయి. మనమంతా స్వార్థ౦తో ఒక పెద్ద వస్తువు పొందాలని ప్రయత్నిస్తే, అది ప్రపంచంలో ఒకే ఒక వస్తువయితే, మన మధ్య స్పర్థలు కలగక మానవు.

అనేక విడిపోవడాలలో -- వ్యష్ఠి అయినా, సమిష్ఠి అయినా-- మన ఇష్టం, ఇతరుల ఇష్టం మధ్య, మన సౌభాగ్యం ఇతరుల సౌభాగ్యం మధ్య కలహం ఉంటుంది. సౌభాగ్యం, శాంతి విడదీయబడలేవు. నేతలు ప్రపంచ శాంతి ఎంతో అవసరమని చెప్తున్నారు. ప్రపంచం ఒక మూలలో యుద్ధం జరుగుతూ ఉంటే, మరో మూలలో శాంతి ఉన్నా లాభం లేదు. అలాగే ఒక దేశంలో సౌభాగ్య ముండి, వేరే దేశం దరిద్రంతో బాధ పడుతూ ఉంటే కూడా లాభం లేదు. ఎలాగంటే మన ఇంట్లో వంట గది నిప్పంటుకుంటే, దానిని ఆర్పకపోతే, అది ఇల్లంతా వ్యాపించి ఇల్లునే తగలబెడుతుంది.

కామాక్రోధాలను నియంత్రించాలంటే, మన ఇంటిలో కలసిమెలసి ఉండాలి. లేకపోతే ఇంట్లో యుద్ధ బీజాలు నాటబడతాయి. ఇంట్లోని వ్యక్తుల మధ్య కలహాలు, వేర్పాటు భావాలు ఉన్నాయంటే, ఆ ఇంట్లో ఒక చిన్న యుద్ధం జరుగుతున్నట్టే. అది ప్రపంచ యుద్ధమంత పెద్దది కాకపోయినా, అది యుద్ధమే.

యుద్ధ ప్రతిపాదిక మనస్సులో కలుగుతుంది. అది క్రమంగా మన హృదయాలలోనూ, ఇళ్లలోనూ, సమాజంలోనూ, చివరకు ప్రపంచమంతా వ్యాపిస్తుంది. గీత చేసే బోధ: యుద్ధం స్వార్థం-నిస్వార్థం, శుద్ధం-అశుద్ధం, ఆసురిక-దైవీక స్వభావాల మధ్య జరిగే పోరాటం. గీత చెప్పే యుద్ధం మన మనస్సులో, హృదయంలో జరిగే గందరగోళం. యుద్ధం రెండు వర్గాల మధ్య పోరాటం కాబట్టి మనకి ఆసురిక వర్గమైనా లేదా దైవిక వర్గమైనా ఎన్నిక చేసికోవచ్చు. అది దేశాకాలమానాలతో సంబంధం లేనిది. 331

Eknath Gita Chapter 5 Section 13

Bhagavat Gita

5.13

శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ {5.23}

కామక్రోధోద్భవం వేగం స యుక్త స్స సుఖీ నరః

ఎవడు దేహమును చాలించుటకు పూర్వమే కామక్రోధముల వలన కలిగిన సంక్షోభమును అరికట్ట గలుగు చున్నాడో వాడే యోగి; వాడే సుఖవంతుడు

యోన్త స్సుఖో అంతరారామ స్తథా౦తర్జ్యోతి రేవ యః {5.24}

స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో అధి గచ్ఛతి

ఎవడు ఆత్మయందే ఆనందించుచు, ఆత్మయందే రమించుచు, ఆత్మయందే ప్రకాశము గలవాడై యుండునో అట్టి యోగి బ్రహ్మభూతుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నాడు

లభంతే బ్రహ్మ నిర్వాణ మృషయః క్షీణకల్మషాః {5.25}

చ్చిన్నద్వైధా యతాత్మాన స్సర్వభూతహితే రతాః

కల్మష రహితులు సంశయ రహితులు, జితేంద్రియులు, సర్వభూతహితులు నగు ఋషులు బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నారు

ఈ శ్లోకంలో నిర్వాణ మనే విశేషణం వాడబడింది. దాని అర్థం సృష్టి ఒక గమ్యం వైపు పయనిస్తో౦ది. యోగులు సర్వజీవ సమానత్వాన్ని పూర్తిగా నమ్ముతారు. అదే మానవుల మటుకు సృష్టి యొక్క లక్ష్యం.

మన దుఃఖానికి కారణం పరిణామం ద్వారా ఆ గమ్యాన్ని చేరడానికి వేర్పాటు అడ్డుగా ఉన్నది. మనము కుటుంబ క్షేమం గురించి ఆలోచించకుండా ఉంటే అది మనకి, మరియు కుటుంబానికి నష్టం. భార్య, భర్త ఒకరితో ఒకరు పోటీ పడుతూ, వేర్పాటుగా ఉంటే, అది, వారికి, వారి పిల్లలకి, చివరికి సమాజానికి హానికరం. ఎవరైతే ఇతరుల అవసరాలు తమ అవసరాలకన్నా ముఖ్యమని తలుస్తారో, వారు భద్రతతో కూడి ఉండి ప్రతి ఒక్కరిచే ప్రేమించబడి, గౌరవించబడి ఉంటారు. ఒకడు ఇతరుల ఆనందంలో ఓలలాడితే, వానికి సంతృప్తిగా ఉంటుంది. కాని వేర్పాటుతో, స్వార్థంతో ఉంటే వానికి అభద్రత కలుగుతుంది. ఎందుకంటే మనలోని గాఢమైన కోరిక జీవైక్య సమానత భావమును కలిగించుకోవడం.

జీవైక్య సమానత యోగుల వరికే పరిమితం కాదు. శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించి ప్రపంచంలోని అన్ని జీవుల సంక్షేమం, ప్రపంచ శాంతికి ఎంతో అవసరమని గ్రహించేరు. ఒక్క మానవుల, జంతువుల మధ్య జీవైక్య సమానత ఉంటే సరిపోలేదు పర్యావరణం--అనగా చెట్లు, పంట భూమి, పీల్చే గాలి -- యందు కూడా దాన్ని పాటించాలి. మన అవసరాలు, పర్యావరణాన్ని కాలుష్యంతో నింపుతే మనకి మనుగడ సాగదు. కాబట్టి నిర్వాణము మన దేశానికే పరిమితం కాదు.

మన మతంలో పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, గురుత్వాకర్షణ సిద్ధాంతము వలె నుండి, మన బాధ్యతలు మనమే నిర్వహించి, మనల్ను మనమే ఉద్ధరించుకోవాలని చెప్పబడినది. కొందరు కర్మ సిద్ధాంతాన్ని తప్పుగా విధి వ్రాతతో పోలుస్తారు. కర్మ సిద్ధాంతం ఒక పరిస్థితి తలిదండ్రుల, బంధుమిత్రుల వలన కాక, మన పూర్వ కర్మల వలననే కలిగిందని చెప్తుంది. విధి బంధమైతే, కర్మ సిద్ధాంతం స్వతంత్రం. ఎందుకంటే మన కర్మ మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కనుక. మనము గట్టి ప్రయత్నం చేసి, దృష్టిని కేంద్రీకరిస్తే నిర్వాణమనే ఉత్కృష్టమైన స్థితిని పొందుతాము.

జీవైక్య సమానత గూర్చి తెలియనంత కాలము వేర్పాటుతో, బాధలతో కూడిన పునర్జన్మ ఎత్తుతూనే ఉండాలి. భౌద్ధులు (Tibetan Book Of Dead) మరణం తరువాత కర్మ శేషం ఉన్నవారు బార్డో అనే త్రిశంకు స్వర్గం వంటి ప్రదేశంలో ఉంటారని తలుస్తారు. అక్కడ పునర్జన్మ ఎక్కడ ఉంటుందో నిర్ణయిస్తారు. ఉదాహరణకి ఒకడు జీవితమంతా జులాయిగా బ్రతికి ఉంటే, వాడు పుట్టి, జులాయిగా తిరిగే పిల్లలను కంటాడు. తద్వారా తన పాపానికి పర్యావసానము అనుభవిస్తాడు. ఈ విధంగా మన సంస్కారాలు మన జన్మని నిర్ణయిస్తాయి. ఒక రైల్వే స్టేషన్ లో వచ్చి పోయే బండ్లను గూర్చి స్పీకర్ లో ప్రకటిస్తారు. మన బండి గురించి ప్రకటిస్తే మనం దానినెక్కి ప్రయాణం చేస్తాము. అలాగే బార్డో కూడా. మన పూర్వ సంస్కారాలు మన జన్మని నిర్ణయిస్తాయని భౌద్ధులు నమ్ముతారు.

నేను చిన్నవారికి తమ తలిదండ్రుల బలహీనతలను అర్థం చేసికొని బ్రతకమని సలహా ఇస్తాను. ఎందుకంటే ఆ బలహీనతలు వారికి జన్యువుల ద్వారా సంక్రమిస్తాయి కనుక. మనలోని బలహీనత ఉంకొకరిలో చూస్తే మనకు చికాకు కల్పించవచ్చు. కాబట్టి మన తలిదండ్రుల, వృద్ధుల, ఇతరుల బలహీనతల వలన చికాకు పడకూడదు. ఎందుకంటే అవి మనలోనూ ఉన్నాయి కనుక. అలాగ ప్రవర్తించగలిగితే మనలోని చెడు సంస్కారాలెన్ని ఉన్నా, వాటిని అధిగమించ ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లగలం.

ధ్యానం ద్వారా ప్రకృతి వలన కలిగే పరిణామం గురించి నిరీక్షింపక, ఇప్పుడే, ఇక్కడే పొందవచ్చు. పర్యావరణం కొన్ని వేల సంవత్సరాలు తరువాత మనకు నేర్పే పాఠం గురించి వేంచేయక ఇప్పుడే "నా భవిష్యత్ ను ఈ జన్మలోనే నిర్ణయిస్తాను. రాత్రింబవళ్ళు నాలోని స్వార్థం విడనాడడానికి శ్రమించి, జీవైక్య సమానత దిశపై జీవితం కొనసాగిస్తాను" అని చెప్పగలగాలి. ఈ విధంగా జీవితాన్ని పాటించేవాళ్ళు బహు అరుదు. పతంజలి ఉత్సాహంగా, కష్ట పడి శ్రమించే వ్యక్తి అట్టి ఉత్కృష్టమైన భావన కలిగి ఉంటాడు అని చెప్పెను. ధ్యానంలో పరిపక్వత పొందాలంటే జ్యోతిష్యం వంటి మూఢ నమ్మకాలు లేకుండా, నడుం బిగించి, పరిశ్రమ చెయ్యాలి. ఏ దేశాకాలమానాలలోనైనా గాఢమైన ధ్యానం ద్వారా జీవైక్య సమానతా జ్ఞానాన్ని పొంది, మానవాళి పరిణామంలో పొందగలిగే ఉత్కృష్టమైన గమ్యాన్ని చేరగల౦. ఏ పరిస్థితిలోనైనా, ఎటువంటి సంస్కారములు ఉన్నా, జ్యోతిష్యం ఏమి చెప్పినా, ఉత్కృష్టమైన లక్ష్యం దిశగా జీవించవచ్చు. ఎందుకంటే మన ఆత్మ, అనగా మన వ్యక్తిత్వము, అఖండమై, అపరిమితమై, మార్పు చెందనిదై యున్నది. 329

Eknath Gita Chapter 5 Section 12

Bhagavat Gita

5.12

యే హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే {5.22}

ఆద్యంతవంతః కౌ౦తేయ న తేషు రమతే బుధః

కౌ౦తేయ! ఇంద్రియ విషయ భోగములు దుఃఖ హేతువులు. ఆద్యంతములు కలవి. వాటి యందు జ్ఞాని రమించడు

యోగులు ఒకటి పుట్టి, మరణిస్తే, దాని నుండి ఆనందం ఆశించరు. మనకు ఆద్యంతాలు లేని శాశ్వత సుఖం అవసరం. క్షణికమైన వస్తువుల వలన శాశ్వత సుఖము, భద్రత కలుగవు.

పైపైన ఉన్న చేతన మనస్సుతో జీవిస్తూ ఉంటే ఒక క్షణికమైన సుఖం మనను సంతృప్తి పరచదు. కానీ చేతన మనస్సు లోతులకు వెళ్ళగలిగితే మనము పొందే ఆనందానికి అవధులు లేవు.

ఆనందం క్షణికమైనదని తెలిసికోవడానాకి ఒక ఉదాహరణ: సముద్రం అలజడితో ఉన్నప్పుడు, దాని అలల్లోని ఒక పెద్ద బంతివలె నున్న నురుగను చేతితో పట్టి, కొంత సేపయ్యేక అది పూర్తిగా మాటుమయ్యే అనుభవం అందరికీ కలుగుతుంది. క్షణికమైన సుఖం కూడా అలాగే కొంత కాలం తరువాత చెయి జారిపోతుంది.

యుక్త వయస్సులో క్షణికమైన ఆనందాల వెనుక పడవచ్చు. నడి వయస్సు దాటిన వారికి గీత చేసే హెచ్చరిక: క్షణికమైన ఆనందాల వెనుక పడవద్దు. అవి నీటిలోని బుడగల వలె వస్తూ పోతాయి. ఈ విషయం మనం జీవితంలో ఎంత తొందరగా తెలిసికొ౦టే, అంత తక్కువ బాధను అనుభవిస్తాము. గీత చేసే బోధ కొన్ని శతాబ్దాల క్రింద ఉన్న వారలకే పరిమితం కాదు. ఏ దేశకాలాల్లోనైనా, మనలో ప్రతిష్ఠితమైన దేవుని కనుగోవడమనే లక్ష్యం వర్తిస్తుంది.

కొందరు దేహ సంబంధిత సమస్యలు -- అనగా నొప్పి, వాచుట మొదలగునవి-- లేకపోయినా నిద్ర మాత్రలను వైద్యులను వ్రాసి ఇమ్మ౦టారు. దానికి కారణము మానసిక సమస్యలు. నిద్ర మాత్రలు వారీ నాడీ వ్యవస్థపై పని చేసి, వారిని వేకువలో శాంతపరచడానికి లేదా రాత్రి బాగా నిద్ర పట్టడానికి సహకరిస్తాయి. వాటి పర్యావసానాలు అనేకం. వారు జీవిత సమస్యలను ఎదుర్కో లేక క్షణికమైన పరిష్కారం పొందటానికై నిద్ర మాత్రలను కోరుతున్నారు. అలాగే పెద్ద తరం నిద్ర మాత్రలకు అలవాటు పడితే, చిన్న తరం వారినే అనుసరిస్తుంది. 325

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...