Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 8

Bhagavat Gita

6.8

యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః {6.10}

ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః

యోగి యగువాడు ఏకాంతమున యుండి, ఇంద్రియ మనస్సులను వశపరచుకొని, ఆశలు లేనివాడై, ఇతరులనుండి దేనిని ఆశించక సదా మనస్సును పరమాత్మయందే ఉంచవలెను

ధ్యానంలో మనం ఏకాగ్రతని పొందవచ్చు. ప్రతి సాధకుడు ఏకాగ్రతను అలవరచుకోవాలి. అది ఎలా సాధ్యమంటే ఒక పని చేస్తున్నప్పుడు, వేరొక పని గురించి ఆలోచింపక, దాని మీద సంపూర్ణమైన శ్రద్ధ చూపాలి. ఏకాగ్రతకి, విశ్వాసమునకు దగ్గిర సంబంధం ఉంది. ధ్యానం ద్వారా ఇతరులయందు ప్రేమ, విశ్వాసములతో, ఎటువంటి అవాంతరాలు వచ్చినా, ఉండగలము.

ఏకాగ్రతని పొందాలంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. చాలాసార్లు మనస్సు యొక్క ఆందోళన కళ్ళలో వ్యక్తమవుతుంది. ఆందోళన పడుతున్నప్పుడు కనుపాపలు ఒక చివర్నించి, ఉంకో చివరకు ఊగిసలాడుతూ ఉంటాయి. మనము వాటికి ఒకే చోట నిలకడగా ఉండేటట్టు తర్ఫీదు ఇవ్వాలి. క్రమంగా మనస్సు నిశ్చలంగా ఉంటే కనుపాపలు కూడా కదలకుండా ఉంటాయి.

మనము ఏకాగ్రత కలిగిఉండాలంటే మనం చేసే పని మీద సంపూర్ణమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఉదాహరణకి ఆహారం తింటున్నప్పుడు, పుస్తకము చదవక, లేదా టివి చూడక, దానిపై పూర్తి ఏకాగ్రత కలిగి ఉండాలి. అలాగే ఇతర ఇంద్రియాలను కూడా స్వాధీనంలో పెట్టుకోవచ్చు. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు పూర్తి శ్రద్ధతో చెవులను రక్కి౦చి వినాలి. వాని మీద ఒక పక్షి వాలినా మనము ఏకాగ్రతను వీడకూడదు.

మనము చాలా వాటితో తాదాత్మ్యం చెంది ఉన్నాము. గలివర్ యొక్క సాహస యాత్రలలో గలివర్ ను ఒకసారి అనేక మరుగుజ్జులు కలసి తాళ్లతో బంధించేరు. అతడు వాటిని తేలికగా విడిపించుకున్నాడు. అదే విధంగా మనమనేక వస్తువులచే, మనుష్యులచే బంధింపబడి ఉన్నాము. ఇంకా స్వార్థం, అహంకారం వలన కూడా. ధ్యానం ద్వారా వాటినుండి విడిబడితే పూర్తి స్వతంత్రతను పొందవచ్చు. 351

Eknath Gita Chapter 6 Section 7

Bhagavat Gita

6.7

సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు {6.9}

సాధుష్యపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే

సుహృత్తులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషులు, బంధువులు, సాధువులు, పాపులు మొదలగు వారియందు సమబుద్ధి గలవాడు శ్రేష్ఠుడు

సమబుద్ధి అనే విశేషణానికి అర్థం అందరియందు సమమైన దృష్టి కలవాడు. దాని వలన తెలిసేది మనమంతా దేవుడి నుంచి ఆవిర్భవించి, దేవుని యందే నివసించి, చివరికి దేవునితోనే ఐక్యమవుతాము. అలాగే అందరితోనూ సామరస్యంగా ఉండడము సమబుద్ధి. సమాధి స్థితిలో మనమందరిలోనూ కొలువై యున్న దేవుని దర్శించి, జీవైక్య సమానతను తెలిసికొ౦టాము.

మనము సహాయము చేసిన వారలయందు, అడ్డంకులు కలిగించిన వారలయందు, మనతో మంచి సంబంధాలు కల వారలయందు, అలాగే ఎటువంటి సంబంధము లేని వారలయందు గౌరవముతో మెలగాలి. మన తలదండ్రులకు, మిత్రులకి, చివరికి శత్రువులకి గౌరవమివ్వ గలగాలి. అది మనకే కాక వారికి కూడా ఉపయోగపడుతుంది. ఒకరు ఎటువంటి గౌరవానికీ అర్హులు కాకపోయినా, మనము గౌరవిస్తే స్పందించి మనయందు గౌరవంతో ఉంటారు. మిక్కిలి అహంకారియందు మన నమ్మికను ఉంచి, ఎదగడానికి ప్రయత్నము చేస్తాడని విశ్వశిస్తే అతడు తప్పక మన అంచనాకు వస్తాడు. ఇతరులు మనయందు ఎటువంటి నడవడికను చూపిస్తారని విచారపడక, వారిపై ఎలా స్పందించాలని సదా ఆలోచించక ఉండాలి. "మీరు ఒక అడుగు ముందెయ్యండి. అది ఎంత పొడవో నిర్ణయించి, నేనూ ఒక అంగుళం అటుఇటూ కాకుండా అడుగేస్తాను" అని అంటే మన క్రియలు ఇతరుల క్రియలపై ఆధారపడి, క్రమంగా మన౦ చిన్నచిన్న అడుగులు వేసి, చివరికి అడుగువేయకుండా ఆగిపోతాం. మన అనుబంధాలలో గౌరవము, ప్రేమ ముఖ్యమైన అంశాలు. ప్రత్యుపకారం ఆశించక, ఇతరులకు సేవ చేస్తే, ఇతరులు గాఢంగా స్పందించి వారిలోని దైవత్వాన్ని మనకి చూపుతారు.

నాగరీకులు నాయందు ప్రేమతో ఉంటే, మీయందు ప్రేమతో ఉంటాను; నన్ను ద్వేషిస్తే, మిమ్మల్ని ద్వేషిస్తాను అనే దృక్పథంతో ఉంటారు. ధ్యానాన్ని చేసి, శ్రీకృష్ణుని లాగ, జీసస్ క్రైస్ట్ లాగ, బుద్ధుని లాగ, మన వ్యక్తిత్వాన్ని మలచుకొని, మనము ఇతరుల స్పందనతో సంబంధం లేకుండా ఆనందంతో బ్రతకవచ్చు. ఇదే నిజమైన స్వతంత్రత. ప్రస్తుతం మన౦ స్వతంత్రత అనుభవించడంలేదు. ఎందుకంటే ఇతరుల స్పందన గురించి విచారిస్తున్నాము. అలాకాకుండా ఉంటే మనమే కాకుండా, ఇతరులు కూడా స్వతంత్రతను అనుభవిస్తారు. మనము కలిసే క్రొత్త వ్యక్తులు మనను చూసి జంకు పడక, మనతో సామరస్యంగా ఉంటారు.

కుటుంబంలో ఒక్క అహంకారి ఉంటే చాలు, వాని యందు అందరూ జంకుతో ఉంటారు. ఇది ఒక అప్రయత్నమైన స్పందన: "నన్ను అతడు ఇబ్బంది పెడతాడు." మనమెప్పుడైతే సానుకూలంగా ఉంటామో, ఇతరులు ఇబ్బంది పడక మనయందు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అనుబంధాలలో ఇబ్బందులు శాశ్వతంగా తొలగించాలంటే ఇతరుల క్షేమాన్ని మన క్షేమంకన్నా మిన్నగా చూడాలి.

ఒక వడ్రంగి బల్ల చేస్తున్నప్పుడు బల్ల కాళ్ళు విడి విడిగా చేస్తాడు. వాటికి అనేకమైన అతుకులు ఉండవచ్చు. కానీ బల్ల పూర్తిగా చేసిన తరువాత ఆ అతుకులు కనిపించవు. అలాగే ఇతరుల లోపాల గురించి తక్కువ ఆలోచించి, వారిని మిత్రులుగా చేసికొని వారి స్పందనకై ఎదురచూడకుండా, మన దృష్టిని మనమెలా నడచుకోవాలో అన్న అంశం మీద కేంద్రీకరి౦చాలి. అలా చేస్తే ఇతరులు మనల్ని చికాకు పెట్టినా, వారిని ఆదరిస్తాం.

మనలో చాలామంది విభిన్న స్థిర భావనలు ఉన్నవారాలతో జీవిస్తాము. ప్రతి ఒక్కరి భావాలు, దృక్పథం మనకన్నా విభిన్నంగా ఉంటాయి. కానీ మనందరిలో ఒక హారంలో సూత్రం వంటి తత్త్వం కూడా ఉంది. నన్ను "మీరు అమెరికాకి వచ్చి 12 ఏళ్లు అయింది. మీకు అమెరికా నచ్చిందా?" అని అడిగేవారు. నేను ఇచ్చే సమాధానం "నాకు అక్కడ ఎలా వుందో ఇక్కడ కూడా అలాగే ఉంది" ఏ దేశం లేదా ఖండం వారలమైనా --ఆఫ్రికా, అమెరికా, యూరోప్, ఇండియా -- మన అంతర్గతంలో తేడాలు లేవు. మన ప్రత్యేకత మనలోని అంతర్గతమంతా ఒక్కటే. దానిమీద దృష్టి కేంద్రీకరిస్తే జీవైక్య సమానతని గ్రహిస్తాము. 349

Eknath Gita Chapter 6 Section 6

Bhagavat Gita

6.6

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః {6.8}

యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచన

జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తి చెందిన వాడును, నిర్వికారుడును, జితేంద్రియుడును యోగి అనబడును. అతడు మట్టి, రాయి, బంగారము నందు సమభావము కలిగియుండును

బంగారానికి స్వతహాగా విలువలేదు. బంగారు ఖనిజం అతి తక్కువగా ఉండడం వలన దానికి ఎక్కువ విలువ ఆపాదించబడినది. అదే ఇనుము యొక్క ఖనిజం, బంగారు ఖనిజం కన్నా తక్కువగా ఉంటే, బంగారం కన్నా ఇనుమే ఎక్కువ ఖరీదు ఉండి, అతి విలువైన వస్తువుగా చూడబడుతుంది. ఇది మనయొక్క అమాయకతకి తార్కాణం. మనిషి విలువ ఇతరులకు సహాయపడడం వలన పెరుగుతుంది. మన విలవు డబ్బు, బిరుదులు, అధికారం వలన కాక, మనమెంత కుటుంబానికి, సమాజానికి ఆనందం ఇస్తున్నామో దానిచే నిర్ణయి౦పబడుతుంది.

ఇక్కడ శ్రీకృష్ణుడు కూటస్థ అనే విశేషణము వాడేడు. దాని అర్థము శిఖరముపై స్థితమైనదని. వాడుకలో ఎవరైతే జీవితం మెలుకవతో, కౌశల్యంతో గడుపుతారో, హిమాలయాల శిఖరాలను ఎక్కినట్టు, చేతన మనస్సు అగ్రాస్థానం చేరుతారో వారిని గురించి కూటస్థ అనే పదాన్ని వాడవచ్చు. దేవునిపై స్థితుడైనవానిని ప్రపంచంలోని ఏ శక్తీ పెకలించలేదు. గాంధీజీ తన ఆత్మ యందే స్థితుడై, తన చుట్టూ ఎంత హింసా కాండ జరుగుతున్నా, ఎప్పటికీ భయపడక, వెన్ను చూపక స్వాతంత్ర్యం కొరకై పోరాడేరు.

భారతంలో ఒక కథ చెప్తారు. ఒకమారు దుర్యోధనుడు శ్రీకృష్ణుని కలవడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పడుకొని ఉన్నట్టు నటిస్తాడు. దుర్యోధనుడు అతని తలవద్ద వున్న సింహాసనాన్ని అధిష్టిస్తాడు. కొంత సమయం తరువాత అర్జునుడు వచ్చి, దుర్యోధనుని చూచి, శ్రీకృష్ణుని పాదాల చెంత కూర్చు౦టాడు. శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచి మొదట అర్జునుని చూసి, సంగతేమిటని అడుగుతాడు. అర్జునుడు, దుర్యోధనుడు తనకన్నా ముందు వచ్చేడు కనుక, ఆయన్ని ఆడగమని వినయం చూపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుని పలకరించి తనవద్ద రెండే రెండు అవకాశాలు ఉన్నాయని: ఒకటి తన సైన్యం, రెండవది తానే అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు సైన్యాన్ని కోరుతాడు. ఎందుకంటే అతనికి శ్రీకృష్ణుని శక్తి గురించి తెలియదు కనక. అలాగే అహంభావంతో సైన్యం ఉంటే చాలు, పాండవులను మట్టి కరిపించచ్చు అనుకు౦టాడు. అర్జునుడు శ్రీకృష్ణుని శక్తి తెలిసినవాడు కనుక, దుర్యోధనునితో పోటీ పడక, తన వెంట శ్రీకృష్ణుడు ఉంటే చాలని కోరుకొంటాడు. తక్కిన చరిత్ర మనకు తెలిసిందే. దీని అంతరార్థం, ఎవరైతే తమలోని దేవుని గుర్తించి, పూర్తి నమ్మకంతో ఉంటారో, వారి చుట్టూ ఎంత హింసా కాండ జరిగినా చెక్కుచెదరకుండా ఉంటారు. 346

Eknath Gita Chapter 6 Section 5

Bhagavat Gita

6.5

బంధు రాత్మా ఆత్మన స్తస్య యే నాత్మై నాత్మనా జితః {6.6}

అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతా ఆత్మైవ శత్రువత్

ఆత్మనిగ్రహము కలిగియున్న వారికి వారి ఆత్మయే వారికి బంధువు. నిగ్రహము లేనివారికి వారి ఆత్మయే వారికి శత్రువు

జితాత్మనః ప్రశా౦తస్య పరమాత్మా సమాహితః {6.7}

శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావ మానయోః

మనస్సును జయించిన వానికి, ప్రసన్నమైన అంతఃకరణ గల వానికి, శీతోష్ణ సుఖ దుఃఖముల యందును, మానావ మానముల యందును ఆత్మానుభవము చెదరక యుండును

ఎదగాలంటే మనమెట్టి పరిస్థితులలోనైనా ఆనందం-విచారం, సుఖం-దుఃఖం మొదలగు ద్వంద్వాలకు అతీతంగా నుండాలి. అప్పుడు మనమెదుర్కొనే సమస్యలు ఎంత తీవ్రమైనవి అయినా, భద్రత, ఆహ్లాదం, శాశ్వతమైన ఆనంద౦ పొందగలుగుతాం. మెహర్ బాబా "ఆనందం దేవుడిచ్చిన సద్గుణం" అని చెప్పేరు. సాధారణంగా మనం బస్సులోగానీ, రైల్లో గానీ ప్రయాణిస్తూ ఉంటే, ఎంతో మంది అపరిచుతలను చూస్తాం. వారిలో కొందరు నిర్జీవంగా ఉంటారు. అలాగే మన సమాజంలో కూడా ఎంతోమంది జీవిచ్చవాలుగా బ్రతుకుతున్నారు. అందువలన ప్రజలు తమ ఆలోచనలతో సానుకూలంగా స్పందించేవారితో చిన్నచిన్న సత్సంగాలు ఏర్పరుచుకుంటున్నారు. ఉదాహరణకు మా ధ్యాన మందిరం. మేమంతా ఒక పెద్ద కుటుంబం. ఒకరి నొకరు ప్రేమించుకుంటూ, కష్టపడి పనిచేసి, ఆనందంగా ఉంటాం.

ఒక్కొక్కప్పుడు ఒక చిరునవ్వు కూడా రాదు. మనం ఆనందంగా ఉంటే చిరునవ్వు అవసరంలేదు. కానీ పరిస్థితులు విషమించినప్పుడు, ఉత్సాహం తగ్గుతున్నప్పుడు, చుట్టూ ఉన్నవారు చికాకు కల్పిస్తే, అది చిరునవ్వు చిందించడానికి మంచి సమయం. మనకు తెలియకుండానే లోపల ఒక యంత్రం పని చేసి, ఆనంద వర్షాన్ని కురిపిస్తుంది.

యోగానంద పరమహంస మనమందరమూ చిరునవ్వు కోటీశ్వరులము అవ్వాలని చెప్పేరు. మనమందరికీ ఈ రకమైన కోటీశ్వరులమయ్యే శక్తి ఉంది. ఎందుకంటే, మనమెక్కడకి వెళ్ళినా చిరునవ్వుతో ఉంటాం. ఎక్కడైనా ఒక నిర్భాగ్యుడు కనిపిస్తే, వానిని చూసి చిరునవ్వు చిందించాలి. అతడు తిరిగి మనకు చిరునవ్వు చూపిస్తాడు. ఇదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో చిరునవ్వు చిందిస్తూ ఉంటే కొన్నాళ్ళ తరువాత మన మొహాన్ని అద్దంలో చూసుకొ౦టే మనకే ఆశ్చర్యమేస్తుంది. మనము భృకుటి ముడిపెడదామన్నా సాధ్యం కాదు. అలాగే నిరాశ, వేర్పాటు, ఇతరుల యందు విరక్తిగా ఉండడం వంటివి తుడిచిపెట్టుకు పోతాయి.

మంత్ర జపంతో మన చిరునవ్వు ఇంకా సౌందర్యవంత మవుతుంది. క్రమంగా మన కళ్ళుకూడా నవ్వుతాయనిపిస్తుంది. అలా చేస్తే మనకు కోపం రమ్మన్నా రాదు. మనం కళ్ళతో నవ్వే వారాలతో సహవాసం చేస్తే మాటలతో పనిలేదు. ఆ మూగ భాషలోనే ఒకరినొకరు అర్థం చేసుకొంటాం. 345

Eknath Gita Chapter 6 Section 4

Bhagavat Gita

6.4

ఉద్ధదే దాత్మ నా ఆత్మానం నాత్మాన మావసాదయేత్ {6.5}

ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః

తనను తానే ఉద్ధరించు కొనవలెను. తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు. తనకు తానే బంధువు. తనకు తానే శత్రువు

మన ఎదుగదల, ఇతరుల వలన కాక, మన చేతుల్లోనే ఉంది. వేరెవ్వరూ మన సాధన చేయలేరు. మనమే సాధన మార్గంలో నడుం బిగించి ప్రయాణం చెయ్యాలి. గురువులు ఒక దిశ నిర్దేశించగలరు. వారు మనను ఆధ్యాత్మిక మార్గంలో భుజాలమీద మోసుకొని పోలేరు. అలాగే మన ప్రస్తుత పరిస్థితికి, ఇతరులు కాక-- అనగా తలిదండ్రులు, సహధర్మచారిణి, బిడ్డలు, సమాజం--,మనమే పూర్తి భాధ్యత వహించాలి. బురదలో ఇరుక్కుపోయిన సామర్థ్యం ఉంటే, దాని నుంచి స్వశక్తితో వెలుపలకు వచ్చే సామర్థ్యం మనలో నుంది.

మనలో చాలా మంది తప్పక చెయ్యవలసిన పనులు జాప్యం చేస్తాం. వాటికై ఒక పర్వ దినాన్ని ఎన్నుకొ౦టాం, లేదా ముహూర్తాన్ని పెట్టుకొంటాం. కొంతమంది వారి కున్న వసతులు, ఉద్యోగాలు నచ్చక సదా ఉద్యోగాలు, ఇల్లు, ఊళ్ళు మారుతూ ఉంటారు. నేను చెప్పేది వాటిని ఆధ్యాత్మిక సాధనకన్నా ముఖ్యమనే తలంపు మానమని. ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టాలంటే ఇప్పుడే మంచి సమయం. దానికే ముహూర్తం లేదు.

మనమెన్ని తప్పులు చేసినా, ఎన్ని బాధలు పడుతున్నా, అన్ని ఊతలు వదిలేసి, మనలోని దేవునికి దాసోహమవ్వాలి. ఈ విధంగా దేవుడ్ని నమ్మితే, మన ఆత్మను కూడా నమ్మినట్లే. చిట్టచివరకి మనకు మిగిలేది ఒకే ఒక మిత్రుడు: మన ఆత్మ -- అనగా మనలో ప్రతిష్ఠితమైన దేవుడు. మన అంతరాత్మ చెప్పేది: "నీ హృదయం నుండి, జీవితం నుండి స్వార్థాన్ని త్యజిస్తే, నీ తప్పులన్ని౦టినీ క్షమిస్తాను. నువ్వు ఇప్పడినుంచి కుటుంబ, సమాజ సేవకై బ్రతక గలిగితే, గతంలో ఎన్ని అవకతవకలు చేసినా నీకు ఊతనిస్తాను. నాపై ధ్యానం చేసి, నన్ను అన్ని జీవులలో చూసుకొంటే నిన్ను నీ స్వస్వరూపానికి, సహజ సౌందర్యానికి తీసికువస్తాను" 341

Eknath Gita Chapter 6 Section 3

Bhagavat Gita

6.3

యదా హి నేంద్రియార్థేషు న కర్మ స్యనుషజ్ఞతే {6.4}

సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్త దోచ్యతే

ఇంద్రియ విషయములందును, కర్మల యందును అపేక్ష నుంచక సర్వ సంకల్పములను త్యాగము చేయువాడు యోగారూఢుడని చెప్పబడుచున్నాడు

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చేతన మనస్సు శిఖరాలను అధిరోహించి, జీవైక్య సమానతను, జ్ఞానాన్ని, పట్టుదలని, శక్తిని కలిగి సామరస్యంగా బ్రతికే వాని గురించి చెప్తున్నాడు. భౌద్ధులు అట్టి వానిని నిర్వాణమును పొందినవాడు అని అంటారు. అనగా స్వార్థం, అహంకారం, వేర్పాటులతో కూడిన చెర నుండి విడుదల చేయబడినవాడు.

ఎవరైతే తమలో ప్రతిష్ఠితమైన దేవునియందు స్థిరమైన భక్తితో ఉంటారో, వారు స్వార్థ పూరిత కోరికలవలన --అనగా డబ్బు, పేరుప్రఖ్యాతులు మొదలగునవి-- చలించరు. అట్టివారు పూర్తిగా స్వతంత్రులై, ప్రపంచంతో లావాదేవీలు పెట్టుకోకుండా, సంపూర్ణమైన ఆనందంతో, భద్రతతో ఉంటారు. మనం బంగారం, పుస్తకాలు, కంప్యూటర్లు మీద ఆధారపడి, అవి లేకపోతే విచారానికి గురి అవుతాం. ఆ విధంగా బలహీనులమై అనేక క్లేశాలు అనుభవిస్తాం.

మనకు కావలసిన ఏకైక ఊత మనలోని భగవంతుడు. శ్రీకృష్ణుడు (18:66) అన్ని బాహ్య ఊతలను పట్టి వేళ్ళాడక, వాటిని వదిలి, తననే నమ్మి యుండమని చెప్తాడు. మనం దేవునికి అన్నీ సమర్పిస్తే, మనకు అన్నీ కలుగుతాయి; ఆయనపై పూర్తిగా ఆధార పడితే మనం స్వతంత్రుల మవుతాము. ధ్యానం వలన అవి సాధ్యం. ఇంద్రియాలను నిగ్రహించుకొనే శక్తిని పొంది, బాహ్య ఊతలను వదిలి, దేవుని యందే దృష్టి కేంద్రీకరించి ఉంటాం. 340

Eknath Gita Chapter 6 Section 2

Bhagavat Gita

6.2

యం సన్న్యాస మితి స్రాహు ర్యోగం తం విద్ధి పాండవ {6.2}

స హ్య సన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన

పాండునందానా! దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని గ్రహింపుము. సంకల్పములను త్యజించని వాడెవడూ యోగి కాలేడు

ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే {6.3}

యోగారూఢస్య త స్యై న శమః కారణ ముచ్యతే

యోగమును పొందగోరు మునికి కర్మకారణమని చెప్పబడినది. యోగమును పొందిన వానికి శమము కారణమని చెప్పబడినది.

పై శ్లోకంలో శ్రీకృష్ణుడు తనలో ఐక్యమవ్వడానికి ఎంత ఎత్తు కెదగాలో చెప్తున్నాడు. ఆరురుక్షు అనగా ఎత్తు ఎక్కడానికి ప్రయత్నించేవాడు. యోగారుఢా అనగా ఎత్తు ఎక్కి ఉన్నవాడు. సాధారణంగా ఎత్తు ప్రదేశాల్లో ప్రాణ వాయువు తక్కువ మోతాదులో ఉంటుంది. ఉదాహరణకి హిమాలయాలు చాలా ఎత్తుగా ఉండి, ఎవరెస్ట్ శిఖరం సామాన్యులకి అందుబాటులో ఉండదు. దాన్ని ఎక్కాలంటే ఎంతో పరిశ్రమ చెయ్యాలి. అంటే చిన్న చిన్న కొండలను మొదట ఎక్కి, అటుతరువాత కొంత పెద్ద కొండలను ఎక్కి, క్రమంగా ప్రాణవాయువును ఎలా నియంత్రించాలో తెలిసికోవాలి. అలాగే ఆధ్యాత్మిక సాధన శారీరిక, మానసిక శ్రమతో కూడినది.

ఒకరు కొండ శిఖరాన్ని చేరాలని తాళ్లతో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అన్ని కొండలూ తిరుపతి కొండలవలె కాక, కొన్నిటిలో నడవడానికి దారిలేక ఉంటాయి. అలాంటప్పుడు కొందరు సాహసికులు తాళ్ళు, మేకుల సహాయంతో కొండ నెక్కడానికి ప్రయత్నిస్తారు. అటువంటి ప్రయత్నంలో ఒక సహచరుని తాడు తెగి వ్రేళ్ళాడుతూ ఉంటే, వానికి సహాయం చేసి, మీదకు లేపడం, సహజ మానవ లక్షణం. మొదట్లో వానికి సహాయం చెయ్యడానికి సహచరుడు వస్తాడని నమ్మక ముండదు. కానీ అదే జరిగితే, తనను మీదకు తేవడానికి సహాయం చేస్తాడని నమ్మడు. అది కూడా జరిగితే వానికి సహచరుడిపై మిక్కిలి గురి కలిగి, క్రమంగా వాని యందు ప్రేమ భావము పుడుతుంది.

తప్పు మీద తప్పు చేసి, కఠినంగా ఉండే వారితో ప్రేమ తప్ప మరేదీ పనిచేయదు. వారిపై క్రోధాన్ని చూపితే అది హింసకు దారి తీస్తుంది. అలాంటప్పుడు ధ్యానం ఒకటే మార్గం. ఇతరులకు హాని చేయనివారితో ఓర్పుతో ఉండి, వారు చెడు చేసినా, వారికి మంచి సహాయం చెయ్యవచ్చు. అదే ఒకరు మనకి హాని చేస్తారని అనిపిస్తే వారితో సహజీవనం చెయ్యడం బహు కష్టం.

మనం హృదయపూర్వకంగా పరులకు ఉపకారం చెయ్యాలని పూనుకొని, లాభం, పేరుప్రఖ్యాతులు ఆశించక పనిచేస్తే కర్మ యోగమనే నిచ్చెనతో ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవచ్చు. మొదట్లో మన గురించి ఏమిటి అనే ప్రశ్న కలిగి పరోపకారము భార మనిపించవచ్చు. కొన్ని ఏళ్ల తరువాత, ఎప్పుడైతే మనము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందన్న భావన కలుగుతుందో, మన పరిస్థితి మెరుగుపడి, లక్ష్యానికి మార్గం సుగమమౌతుంది.

ఈ విధంగా ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకునేవారి మనస్సు నిశ్చలంగా ఉండి, అహంకారం పూర్తిగా పోయి, వారిలో అపరిమితమైన ప్రేమ వెల్లువై ప్రవహిస్తుంది. ఆ స్థితిలో ఆందోళన, క్రోధము, దురాశ, ద్వేషము, మత్సరము లేక ప్రేమ సాగరంలో ఓలలాడుతాము. ఆ స్థితి చేరాలంటే గట్టి ప్రయత్నం చెయ్యాలి. మన అహంకారం పూర్తిగా సమసిపోయి, మనము ప్రేమ స్వరూపులమవుతే, కర్మ మనము చెయ్యం; దేవుడే కర్మ మనచేత చేయిస్తాడు. 339

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...