Saturday, April 9, 2022

Eknath Gita Chapter 7 Section 10

Bhagavat Gita

7.10

బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం

ధర్మావిరుద్దో భూతేషు కామో అస్మి భరతర్షభ {7.11}

అర్జునా! బలవంతులకు కామానురాగములు లేని బలమును నేనే. ప్రాణులయందు ధర్మమునకు విరోధము కాని కామము నేనే

చిన్నప్పుడు నేను ఎంతో వ్యాయామంచేసి కండలు పెంచిన వారిని, అతి ఎక్కువ దూరం గెంత గలిగినవారిని, గజ ఈతగాళ్ళని చూసేను. నాకు నా అమ్మమ్మద్వారా తెలిసినదేమిటంటే నిజమైన బలము మన కండరాలకే పరిమితము కాదు. సహనం, స్థితి స్థాపికత, ఓపిక తో ఎట్టి సమస్యనైనా ఎదుర్కొనగల శక్తి కూడా బలమే.

అట్టి బలము మనను నియంత్రించుకోగల శక్తి వలననే సాధ్యం. ఒక వ్యక్తి చీటికీ మాటికీ కోపం తెచ్చుకొ౦టే, వానికి క్షణికమైన వాటిమీద మక్కువ ఉంటుంది. కాని మన ఉద్రేకాన్ని అణచుకొంటే, మన౦ అందరి శ్రేయస్సు కై పాటు పడవచ్చు.

నేను ఆంగ్లం నేర్చుకొంటున్నప్పుడు "చైనా అంగటిలో ఎద్దు" అనే పదప్రయోగమును చూసేను. నాకది అర్థంకాలేదు. మేము అరటి ఆకులలో భోజనం చేసేవారము. ఆ తరువాత ఆకులను ఆవులకు మేతగా పెట్టేవారము. నా మామయ్య ఒక ఉన్మత్త ఏనుగును చూసి జంతువులు, మనుష్యులు పారిపోవలసిందే అని చెప్పేవాడు. ఆ ఏనుగుపై ఒక పులి చెట్టు పైనించి దూకి ఎదుర్కోగలదు. కానీ దాని ప్రాణ భయం పోదు. క్రోధం అటువంటిదే. ఇష్టమొచ్చినట్టు అడ్డమొచ్చిన వారలపై కోపము ప్రదర్శించి ఇతరులను బాధ పెట్టడంవలన లాభం లేదు. దాన్ని ఒక ఉన్నతమైన, స్వార్థరహిత లక్ష్యంవైపు త్రిప్పుకోవాలి. అలాగే భావోద్వేగం కూడా. దానికై చాలా సహనముండాలి. మనము ఒక స్వార్థపూరిత కోర్కెను లేదా ఉద్రేకాన్ని స్వాధీనంలో పెట్టుకోగలిగితే శ్రీకృష్ణుడు "నీ సహనం, బలం నేనే" అంటాడు.

ఇంకా శ్రీకృష్ణుడు "నీ కోర్కె నిస్వార్థ మైతే, నేను అందులో ఉన్నాను" అని అంటాడు. అలాగని మన౦ అన్ని స్వార్థమైన కోర్కెలను వదులుకోనక్కరలేదు. ఉదాహరణకి మన ఇంట్లో విందు జరిగితే మనం నోరుకట్టుకొని ఒక మూల కూర్చోనక్కరలేదు.

అలాగని శ్రీకృష్ణుడు మనం మద్యం సేవిస్తూ ఉంటే దాన్ని ప్రోత్సాహిస్తాడు అనుకోవడం అపోహ.

ఈ విషయాల్లో ముఖ్యమైనదేమిటంటే, మనమొక కర్మ ఇతరుల గురించి చేస్తున్నామా లేదా. మనమొక పెళ్లి విందుకు వెళ్ళి అక్కడ అందరూ పప్పు, కూర తింటూవుంటే కేవలం పళ్ల రసం, నీరు త్రాగడంతో సరి పెట్టుకోనక్కరలేదు.

అలాగే తక్కిన చట్టబద్దమైన కర్మలు. నేను పనిలో ఉక్కిరిబిక్కిరిగా నున్నా, నా మిత్రులతో ఈత కొట్టడ౦, టివి లో టెన్నిస్ మ్యాచ్ చూడడం, లేదా కర్ణాటక సంగీత కచేరీకి వెళ్ళడం చేస్తాను. అనగా మనము ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ చిన్న చిన్న కోర్కెలను అణచుకోనక్కరలేదు. కాని మనమందరినీ కలుపుకొని నిస్వార్థంగా బ్రతకాలి. 55

Eknath Gita Chapter 7 Section 9

Bhagavat Gita

7.9

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ {7.10}

బుద్ధి ర్బుద్ధిమతా మస్మి తేజ స్తేజస్వినా మహమ్

పార్థా! సర్వభూతములకు శాశ్వతమైన బీజస్థానమును నేనే. బుద్ధిమంతులయొక్క బుద్ధియు, ధీరపురుషుల యొక్క ధైర్యమును నేనే ఀ

పరమాత్ముడు సృజనాత్మక శక్తికి బీజము. ఎలాగైతే వంకాయ విత్తనాలు వంకాయ చెట్టుగా మొలకెత్తుతాయో, బీరకాయ విత్తనాలు బీరకాయ చెట్టుగా మొలకెత్తుతాయో, పరమాత్మ బీజము పరమాత్మ చెట్టుగా మనలో మొలకెత్తుతుంది.

మనము కొట్టులో టొమాటో విత్తనాలు కొని, వాటిని పాతి, మరుసటి రోజు ఇంకా మొలకెత్తలేదని కొట్టు వాడిని అడిగితే లాభం లేదు. టొమాటో విత్తనం పాతిన తరువాత ఒక్క రోజులోనే మొలకెత్తదు. అది మొలకెత్తడానికి సారవంతమైన భూమి, నీరు, తగిన వాతావరణం ఉండాలి. అలాగే పరమాత్మ బీజము చెట్టుగా మారాలంటే చాలా రోజులు వేచి చూడాలి.

అదృష్టవశాత్తూ పరమాత్మ బీజము నాశనము లేనిది. అది మనలోనే ఎప్పటికీ ఉన్నది. అది తీవ్రమైన వాతావరణంలో -- అంటే మండేటెండలో, వణికించే చలిలో--రాణించ గలదు. మన౦ గతంలో ఎన్ని తప్పులు చేసినా ఆ బీజం చెక్కుచెదరకుండా మనలో ఉన్నది. కాని అది భయం, క్రోధం, లోభం అనబడే కలుపు మొక్కలతో కప్పబడి ఉన్నది. మనం ధ్యానం చేయడం మొదలుపెడితే ఆ కలుపు మొక్కలు వాడి, నశించి, పరమాత్మ బీజము మొలకెత్తుతుంది.

బుద్ధి అనగా విచక్షణ లేదా మేధ. దాని సహాయంతో మన అంతర్గత తోటను ప్రక్షాళనము చేసికోవచ్చు. బుద్ధి మనకు క్షణికమైన ఆనందము కావాలో, శాశ్వతమైన ఆనందము కావాలో నిర్ణయిస్తుంది. కఠ ఉపనిషత్తులో చెప్పబడిన దేహమనే రథానికి, బుద్ధి సారధి. అది ఆత్మ సహాయము తీసికొ౦టే, మనను సక్రమ మార్గంలో నడుప గలదు.

శ్రీకృష్ణుడు చెప్పేది: ఎటువంటి కష్టముతో కూడిన నిర్ణయము తీసికొన్నా, నేను దాని జ్ఞానముగా ఉన్నాను. దాని నుండి స్వతంత్రము పొందితే మనము క్షణికమైన సుఖములు గురించి ఆలోచించము. కాని అట్టి ఎన్నిక చేసికోవడం సులభం కాదు. దానికి ధైర్యము, ఓర్పు అవసరం. అందుకే హిమాలయాలు ఎక్కాలన్నా, అంతరిక్షంలోకి వ్యోమగామిగా వెళ్లాలన్నా మిక్కిలి ధైర్యం ఉండాలి. శ్రీకృష్ణుడు "నీకు సవాలు తీసికోవడానికి ధైర్యం ఉంటే, నేను నీ ధైర్యాన్ని అవుతాను" అన్నాడు.

పరమాత్మ ఎక్కడో "ఆ మూల సౌధంబులో" లేడు. మనలోనే జ్ఞానంగా, ధైర్యంగా ఉన్నాడు. ఒక వ్యోమగామి దేవుడు విశ్వాన్ని సృజించేడు అనేవారు పిరికివాళ్ళు అని అన్నాడు. మనకు భగవంతుని సృష్టి అవగాహనకు రానంత మాత్రాన అట్టి భావాలు మనస్సులో పెట్టుకోకూడదు. అతడు పరమాత్మ నక్షత్ర వీధిలో ఎక్కడో సభ పెట్టి ఉన్నాడని అనుకుంటున్నాడు కాబోసు. పరమాత్మ అంతటా ఉన్నాడు. ఎక్కడైతే కాంతి, అందము, శ్రేష్ఠత ఉన్నాయో అక్కడ పరమాత్ముని జాడలు ఉన్నాయి. 53

Eknath Gita Chapter 7 Section 8

Bhagavat Gita

7.8

పుణ్యో గంధః పృథివ్యా౦చ తేజశ్చాస్మి విభావసా {7.9}

జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు

భూమి యందలి పవిత్రమైన సువాసనయు, అగ్ని యందలి తేజమును, సర్వ భూతముల యందలి జీవనమును, తపోధనుల యందలి తపస్సును నేనే

వేసవిలో ఋతుపవనాలకై ఎదురు చూస్తాము. అవి లేకున్న లేదా భూమి మీద కాక సముద్రం మీద వర్షం పడినా పంటలు పండవు, మన దాహం తీరదు. తొలకరి వాన పడినప్పుడు భూమి నుండి సువాసన వస్తుంది. శాస్త్రజ్ఞులు అది ఓజోన్ వలననంటారు. శ్రీకృష్ణుడు అట్టి సుగంధము నేనే అంటున్నాడు.

బ్రజిల్ లోని అడవులను నరికేస్తే వాళ్ళకే కాక మనకు కూడా చేటు. ఆ అడవులలోని చెట్లు పర్యావరణం లోని హానికరమైన బొగ్గుపులుసు వాయువుని పీల్చి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకుండా చేస్తాయి.

మనకి జ్ఞానముంటే సరిపోదు, దానిని దైనిందన కార్యాలలో వాడాలి. మనము పర్యావరణ విషయంలో భూమికి రక్షక భటులుగా ఉండాలి. మన ఇంట్లో చెత్త ఉండనీయం. ఇంట్లో ఏదైనా వస్తువు పాడయితే దాన్ని సరి చేస్తాం. కానీ నోరులేని జంతువులు తమ ఇంటిని మన లాగ కాపాడుకోలేవు. మనం వాటికి సహాయపడటానికి వాటికి ఇల్లువంటి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచాలి.

శ్రీకృష్ణుడు చెప్పేది జీవులు పవిత్రమైనవి. అందుకే మనం వాటిని చంపరాదు. ఇది వాని యందలి గౌరవమునకు చిహ్నము. ఇంకా పరమాత్మ వారిలోనూ ఉన్నాడు.

పై శ్లోకాలలో తపస్సు, తేజస్సు గూర్చి కూడా చెప్పబడినది. అవి బహిర్గతములనే కాదు, అంతర్గతములు కూడా.

మనలో కుండలిని శక్తి ఉందని యోగులు నమ్ముతారు. కుండలిని పరిణామానికి సంబంధించిన గొప్ప శక్తి. మనలో అపరిమితమైన కుండలిని శక్తి ఉన్నది. చాలామందికి అది తెలీదు. ధ్యానం వలన పరోకారమునకై, ఉన్నత లక్ష్యానికై, కర్మలు చేస్తే కుండలిని శక్తి క్రమంగా వెలుపలకు వస్తుంది. దాని వలన మనం ఆహ్లాదంగా ఉంటాము. ఓర్పు పెరుగుతుంది. మనను వారాల తరబడి వెంటాడే చేతన మనస్సులోని దురాలోచనలు బాధించవు. మన చుట్టు ప్రక్కల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం కనుగొంటాము. ఒక పాత ఆలోచన మనను తప్పు ద్రోవ పట్టించడానికి వస్తే దానిని నియంత్రించగలము. యోగులు చెప్పేది ధ్యానంతో కుండలిని శక్తి విడుదలై, మన పరిణామాన్ని మనమే నిర్ణయించుకొ౦టాము.

ఒక శక్తివంతమైన కోరికను అణచుకోవడం కష్టమే. ఎలాగంటే మన చెయ్యి విరిగి దానికి కట్టు కడితే, ఆ చేతిని ఉపయోగించడం ఎంతో కష్టతరమైన పని. కట్టు విప్పినా, చెయ్యి నయమైనా, దానిని తిరిగి వాడడానికి శ్రమపడాలి. దానిలో నొప్పి ఉంది. అటువంటిదే తపస్సు. మనము ఆధ్యాత్మిక సాధనకై ఒక స్వార్థపూరిత ఆలోచనకు ఎదురు తిరిగేమంటే పరమాత్మ "నేను నీ ప్రయత్నం; నేను నీ బాధ; నేను నీతోనే ఉంటాను" అని అంటాడు. 51

Eknath Gita Chapter 7 Section 7

Bhagavat Gita

7.7

రసో అహమప్సు కౌన్తేయ ప్రభా అస్మి శశిసూర్యయోః {7.8}

ప్రణవ స్సర్వదేవేషు శబ్దః ఖే పౌరుషం నృషు

కౌన్తేయా! నీటియందలి సారమును నేనే. చంద్ర సూర్యుల యందు ప్రకాశమును నేనే. నేనే వేదముల యందు ఓంకారమును. ఆకాశము నందు శబ్దమును, మనుష్యుల యందు పరాక్రమమును నేనే ఀ

చిన్నప్పుడు ఎండా కాలంలో బయట ఆడితే, అమితంగా దాహం వేసేది. మా ఇంటి దగ్గర పెద్ద కుండల్లో దారిన పోతున్నవారికై నీళ్ళు పెట్టే వారు. నేను దాహంతో ఆ నీరునే తాగేవాడిని. అప్పుడు తెలిసింది నీరు యొక్క మహిమ.

బుద్ధుడు అహంకారం యొక్క తీవ్రమైన కోరికలను తన్హ -- అనగా మిక్కిలి దాహము కలిగించేవి--అనెను. మన కోర్కెల అనేకం. మనము దేహమునకే పరిమితమని తలచి ఆశాశ్వతమైన వస్తువుల యందు అభిమానమును పెంచుకొన్న మన దాహము ఇంకా ఎక్కువ అవుతుంది.

కఠ ఉపనిషత్తు లో ఇలా చెప్పబడింది:

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తమంతట తాము ప్రకాశించుటలేదు

అలాగే మెరుపులు, భూమి మీద అగ్ని

పరమాత్మ యొక్క తేజం వాటిచే ప్రతిబింబి౦చబడినది

పరమాత్మ ప్రకాశిస్తే, సృష్టి అంతా ప్రకాశంతో నిండినది

చంద్రుడు ఎలాగైతే సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తాడో, సూర్యుడు పరమాత్మ కాంతిని ప్రతిబింబిస్తాడు. భౌతిక శాస్త్రవేత్తలు సృష్టి లోని ప్రతి పదార్థమునకు మూలము కాంతి అని చెప్తారు. కాంతి నుంచే పదార్థములు ఆవిర్భవించి, తిరిగి కాంతిలోనే కలిసిపోతాయి.

కాంతిలాగే, పరమాత్మ శబ్దాలకు కూడా మూలం. హిందువులు ఓంకార౦ పవిత్రమైనదని భావిస్తారు. అది భౌతికమైనది కాదు. కానీ ఎన్నో ఏళ్లు ధ్యానం చేస్తే బయట శబ్దాలు వినబడక ఓంకారం చేతన మనస్సులో వినబడుతుంది.

హిందువులకు లాగే తక్కిన మతాలకు కూడా మూల మంత్రాలు ఉన్నాయి. క్రిస్టియన్ లకు జీసస్ మూల మంత్రము. యూదులకు బరూఖ్ అత్తాహ్ అదోనై, మరియు షేమా: "ఇశ్రాఎల్ విను; మీ దేవుడు మాదేవుడు ఒక్కటే". ముస్లింలు అల్లాను స్మరిస్తారు. బిస్మిల్లాహ్ "దయామయుడైన, కరుణామయుడైన దేవుని పేరు మీద" అనికూడా స్మరిస్తారు. భౌద్ధులు వాడే మంత్రం: ఓం మణి పద్మే హమ్ అనగా హృదయంలోని పద్మంగా ఉన్న మణుల హారం. హిందువులు సాధారణంగా రామ జపం చేస్తారు. మంత్రాలు వినడానికి సామాన్యంగా ఉన్నా, కొన్నేళ్ళ జపం తరువాత వాటివలన అమితమైన శక్తి కలుగుతుంది. మంత్రం క్రోధాన్ని సానుభూతిగా, అసహనాన్ని ఓర్పుగా, శతృత్వాన్ని ప్రేమగా మార్చ గలదు.

కొన్నేళ్ళు మంత్ర జపం చేస్తే అది మన చేతన మనస్సులో స్థిరస్థాపితం అవుతుంది. దీన్ని అజపజపం -- జపం కాని జపం--అందురు. దాన్ని పాటించే వ్యక్తి ఎక్కడకు వెళ్ళినా భగవంతుడు వెంట ఉంటాడు. శ్రీ రామకృష్ణ ఒక ఫించను మీద బ్రతికే వ్యక్తితో పోలుస్తారు. జీవితాంతం కష్టపడి పనిచేసి, చివరకు పదవీ విరమణ చేసి, ఫించన్ తో ఎలా బ్రతుకుతారో అలాగే మంత్రం జపం చేయడానికి అనేక ప్రయత్నములు చేసి చివరకు అది మన శ్వాస లాగ, గుండె కొట్టుకోవడం లాగా అప్రయత్నంగా జరుగుతుంది. 47

Eknath Gita Chapter 7 Section 6

Bhagavat Gita

7.6

ఏతద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ {7.6}

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయ స్తథా

సకల భూతములును నా ఈ రెండు విధములైన ప్రకృతులు వలననే జనించుచున్నవని గ్రహింపుము. అలాగుననే సమస్తమైన జగత్తు యొక్క పుట్టుకకు, ప్రళయమునకు కారకుడను నేనే

మత్తః పరతరం నాన్య త్కించిదస్తి ధనంజయ {7.7}

మయి సర్వమిదం ప్రోత౦ సూత్రే మణిగణా

ధనంజయా! నా కంటె శ్రేష్ఠమైనది వేరొకటి లేనేలేదు. దారమందు మణులవలె ఈ సమస్త ప్రపంచము నా యందే కూర్చబడి యున్నది

శ్రీకృష్ణుడు విశ్వంలో ప్రతీదీ తననుండి ఉద్భవించి, తిరిగి తనలోనే లయమవుతుందని చెప్తున్నాడు. అతడు ఇక్కడుండి, ప్రపంచం అక్కడున్నట్టు కాదు. రెండూ కలిసే ఉన్నాయి. దేశాకాలాలు, పదార్థ శక్తులు -- అనగా ప్రకృతి -- సదా మార్పు చెందుతూనే ఉంటాయి. వాటి అంతర్లీనంగా మార్పులేని వాస్తవికత ఉంది. ఇవి భగవత్స్వరూపంలో రెండు అంశాలు. స్పినోజా అనబడే 17 వ శతాబ్దపు యోగి పరిమితమైన ప్రపంచం అపరిమితమైన దేవుని వక్షస్థలం మీద ఉన్నదని అన్నారు. వచ్చే అధ్యాయాలలో శ్రీకృష్ణుడు సృష్టి ఎలా చేస్తాడో, పాలిస్తాడో, లయంచేస్తాడో వివరిస్తాడు. ప్రస్తుతం చెప్పేది నక్షత్ర వీధులు (galaxy), సకల జీవరాసులు ఒక మణుల హారంలాగ ఉండి తన మెడలో వేసుకున్నానని.

కాంతి చందమామ నుండి భూమికి రావడానికి ఒక సెకండ్ పడుతుంది. అంటే మన ప్రక్క ఇంటినుంచి మనయింటికి వచ్చే సమయం. అదే కాంతి సూర్యుడు నుంచి మన దగ్గరకు రావడానికి 8 నిమిషాలు పడుతుంది. అది ఆ సమయంలో 930 లక్షల మైళ్ళు ప్రయాణం చేస్తుంది. కాంతి కొన్న లక్షల కోట్ల మైళ్ళు ఒక సంవత్సరములో ప్రయాణించ గలదు. అలా ప్రయాణిస్తూ పోతే మనకు దగ్గరగానున్న నక్షత్రాన్ని చేరడానికి 4 ఏళ్లు పడుతుంది. అంటే సూర్యుని ప్రక్క ఇ౦టికి వెళ్లాలంటే అంత కాలం పడుతుంది. పాల పుంత (milky way) కోట్ల నక్షత్రాలతో కూడి ఊహించలేని పరిమాణం గలది. కానీ అటువంటి నక్షత్ర వీధులు మనం ఊహించలేని సంఖ్యలో ఉన్నాయి. ఇవి శ్రీకృష్ణుడు చెప్పే మణులతో పొదగబడిన హారంలో ఒక మణికి సమానం.

ఖగోళ శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి మనం చూడలేని సృష్టి కనబడే సృష్టికి ఆవల నుండి, ఊహించలేనంత పరిమాణం గలది అని చెప్తున్నారు. మన సూర్యునికన్నా కోట్ల రెట్లు ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉన్నాయంటున్నారు. అలాగే అనేకమైన కృష్ణ బిలాలు (black hole) -- వేటి నుంచి కాంతి కూడా విడబడ లేదో -- ఉండి అవి తమలో చుట్టుపక్కల నున్న నక్షత్రాలను కలుపుకుంటున్నాయి. అంటే ఆ బిలాలు నక్షత్రాలను తింటాయి. ఇది ఎలా సాధ్యం అని అడిగితే ఏ శాస్త్రజ్ఞుడూ సమాధానం చెప్పలేడు. శ్రీకృష్ణుడు చెప్పక చెప్పేది: మన మె౦త దూరం వెళ్ళినా, చివరికి కాలం యొక్క సమాప్తం వరకు ప్రయాణించినా మనమాతని సృష్టిని పూర్తిగా చూడలేము.

ఈమధ్య 2011 లో బ్రయన్ స్మిత్ నాయకత్వంలో పనిచేసిన ఖగోళ శాస్త్రజ్ఞులకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేరు. వాళ్ళు జీవితాంతం శ్రమపడి ఖగోళానికి సంబంధించిన అనేక విషయాలను అధ్యయనం చేసేరు. కొన్ని వేల గంటలు చీకటి రాత్రుళ్ళలో దూరదర్శినితో నక్షత్ర వీధులను పరికించేరు. కొన్ని దశాబ్దాలుగా సాగిన వారి పరిశోధన వలన తేలినదేమిటంటే: కొన్ని నక్షత్రాలు, దశాబ్దాల తరబడి, తమ ప్రకాశాన్ని మార్చుకోవు. అంటే ఇవి నడి వయస్కులు లాంటివి. బ్రౌన్ డ్వార్ఫ్(brown dwarf) అనబడే నక్షత్రాలు చరమ దశలో ఉన్నవి. అంటే వాటిలో ఇంధనం అయిపోయి ప్రకాశ౦ క్షీణిస్తుంది. కొన్నాళ్ళకు అవి కృష్ణ బిలాల్లాగ మారవచ్చు. ఏది ఏమైనా కొన్ని నక్షత్రాలను (super novae) ప్రామాణిక క్రొవ్వొత్తులు (standard candles) అంటారు. అంటే వానితో మిగతా నక్షత్రాల ప్రకాశాన్ని పోలిక పెడతారు. ఉదాహరణకు మన అతి దగ్గరలో ఉన్న ఆల్ఫా సెంటారీ అనబడే నక్షత్రాల గుంపు ప్రామాణిక క్రొవ్వొత్తుల కన్నా రెండు రెట్లు ప్రకాశవంతంగా ఉండచ్చు. వారు కొన్ని దశాబ్దాల క్రిందట ఆ ప్రామాణిక క్రొవ్వొత్తుల ప్రకాశాన్ని ఒక ఛాయా చిత్రంగా తీసేరు. అలాగే ప్రతి సంవత్సరం ఛాయా చిత్రాలు తీసేరు. ప్రకాశానికి, దూరానికి మధ్యన గల సంబంధం కనుగొని, ఆ ప్రామాణిక క్రొవ్వొత్తులు మన భూమి నుంచి వేగంగా ఆవలకి వెళుతున్నాయని తీర్మానించేరు. అంటే మనకి, వాటికి మధ్యనున్న దూరం పెరుగుతోంది. కాని వాళ్ళు చూస్తున్న కాంతి కొన్ని వేల ఏళ్ల క్రిందటిది. ఇప్పటికీ అవి మన భూమినుండి ఊహించలేని దూరం ప్రయాణించి, కొన్నేళ్లకు మనకు కనబడకుండా పోతాయి.

స్మిత్ బృందం పరిశోధనలో మరొక ముఖ్యాంశం ఉంది. అది ఏమిటంటే విశ్వం ఒక క్రమంలో ఎటో పోతున్నాది. ఉదాహరణకు ఒక బుంగని ఒక పెట్టెలో పెట్టి దానిలోకి గాలి ఊదితే అది క్రమంగా ఆ పెట్టి పరిమాణం పొంది ఆగిపోతుంది. అంటే ఇంకా ఎంత గాలి ఊదినా అది పెట్టె పరిమితులను దాటదు. అదే బుంగను పెట్టె బయట పెట్టి ఊదితే పెట్టె కన్న ఎక్కువ పరిమాణం పొంద గలదు. ఇక్కడ మనకు కనబడే సృష్టిని బుంగ అనుకొ౦దాము. మనకు ఉదయించవలసిన ప్రశ్నలు: మనకు కనబడే సృష్టి ఆవల కనబడని పెట్టె లాంటి సృష్టి ఉందా? ఇంకా పొడిగిస్తే ఆ పెట్టె చుట్టూ -- కొండపల్లి బొమ్మలో బొమ్మలాగ -- ఉంకో పెట్టె ఉందా? మరియితే భగవంతుడు ఎక్కడున్నాడు? అతని రూపము ఆ పెట్టె లాంటిదా? అతనెందుకు ప్రామాణిక క్రొవ్వొత్తులను మన నుండి దూరంగా ప్రయాణింపచేసి వేరు చేస్తున్నాడు? మానవుడు శక్తిని పరీక్షిస్తున్నాడా? లేదా మానవుడు దానవుడై దేవుని సృష్టిని పరిహసిస్తున్నాడా? 45

Eknath Gita Chapter 7 Section 5

Bhagavat Gita

7.5

అపరేయ మిత స్త్వన్యా౦ ప్రకృతిం విద్ధి మే పరాం {7.5}

జీవ భూతా౦ మహాబాహో య యేద౦ ధార్యతే జగత్

అర్జునా! ఇది అపరా ప్రకృతి. దీనికంటె ఉత్తమమైన నా పరా ప్రకృతి కలదు. ఇది ప్రాణులకు జీవరూపమైనది. దీని చేతనే జగత్తు ధరింపబడి యున్నది

ఆది శంకరులు మనము ఆశాశ్వతమైన, మార్పు చెందుతున్న వస్తువులపై మనను గుర్తించుకుంటామని చెప్పిరి. దానిని అధ్యారోపమని అంటారు. అనగా మన పరిమితమైన, ఆశాశ్వతమైన అహంకారమే ఆత్మ లాగ ఎల్లప్పుడూ ఉండేదని తలుస్తాము. "నేను క్రికెట్ ఆడుతాను", లేదా "నేను 6 అడుగుల ఎత్తు" అని అన్నప్పుడు మనము ప్రకృతిని --దేహం మరియు మనస్సు -- చూస్తూ పురుషుడిన చూస్తున్నామనుకొంటాం. ఇటువంటి తికమక ఉన్నంత కాలం జీవితాన్ని నిజంగా దర్శించలేము. ప్రతీదీ మన అహంకారం తో దర్శిస్తాము.

ఈ తికమక మనకే పరిమితం కాదు. అది ఇతరుల మీద కూడా వర్తింపజేస్తాం. మనకు అవసరాలు, అంచనాలు ఉండి వాటిని ఇతరులపై అధ్యారోపము చేస్తాము. ఇది ఎలాగంటే మన అవసరాల, అంచనాల బట్టి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు గల అచ్చులు (mold) చేసి, వాటిని మోసుకు తిరుగుతున్నాం. వాటిని మన తలిదండ్రుల, బంధువుల, మిత్రుల మీద పెడుతున్నాం. మనం పెట్టిన అచ్చుల వలె వాళ్ళ నడవడిక మార్చుకోవాలని చెప్తున్నా౦. హిందువుల పెళ్ళిళ్ళలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారి పూల మాలలను మార్చుకొంటారు. కానీ విదేశాల్లో పూల మాలలకు బదులు అచ్చులతో అధ్యారోపము చేస్తారు. పెళ్లికుమారుడు తనకు కావలసిన అచ్చును పెళ్లికుమారి తల మీద కప్పుతాడు. అలాగే పెళ్లికుమారి తనకు కావలసిన అచ్చును పెళ్లి కుమారుని తలమీద పెడుతుంది. మన దగ్గర అటువంటి అచ్చులు ఎన్నో ఉండి, మనకు పరిచయమైన ప్రతి వ్యక్తి మీద మనకు కావలసిన అచ్చును తల మీద పెడతాం. మన మిత్రుడు తనకు కావలసిన విధంగా చేస్తే, మనము ఆగ్రహము చెందుతాం. ఎందుకంటే అతడు మనం పెట్టిన అచ్చును పాటించటంలేదు. ఆ తరువాత మన మైత్రి చెడిపోయిందని విచారిస్తాం. శంకరులు చెప్పేది అది మన మిత్రుని తప్పు కాదు. అతనిపై మనము చేసిన అధ్యారోపము.

మన బంధాలు సక్రమంగా ఉండాలంటే అధ్యారోపము మాని, మన అచ్చులను కట్టిపెట్టాలి. దానికి ఒకటే మార్గము: మనమీద వేసికొన్న అచ్చును తీసెయ్యాలి. అది ఇతరుల అచ్చులను తీసివేసినంత సులభం కాదు. ఎందుకంటే మన అచ్చులు మనకి బాగా అబ్బేయనే నమ్మకం. మనం మన స్వస్వరూపాన్ని చూసుకొని, ప్రపంచానికి ఎడంగా కాకుండా, విశ్వంలో మనమొక భాగమని తెలిసికొ౦టే, మనం వేసికొన్న అచ్చుకు బీటలు కలుగుతాయి. దీనికి అనేక సంవత్సరాలు పట్టవచ్చు. దీనిని మన దైనిందన జీవితంలో పాటిస్తే, మన అచ్చు ముక్కలై క్రింద పడుతుంది. అప్పుడు మన, మిగతా వాళ్ళ అసలు స్వరూపం చూస్తాం. అదే పరిశుద్ధమైన, సంపూర్ణమైన, శాశ్వతమైన ఆత్మ లేదా పురుషుడు. 42

Eknath Gita Chapter 7 Section 4

Bhagavat Gita

7.4

భూమి రాపో అనలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ {7.4}

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా

భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి ఎనిమిది విధములుగ నున్నది

నా చిన్నప్పటి గ్రామంలో ఒక మసాలా కొట్టు ఉండేది. ఆ కొట్టువాడిని సాంబార్ మసాలా అడిగితే ధనియాలు, ఇంగువ, కారం మొదలైనవాటిని ఒక ఆకులో వేసి, వాటిని కలిపి, పొట్లం కట్టి ఇచ్చేవాడు.

దేవుడు ఇదేపని ప్రకృతిలో చేస్తాడు. సృష్టి లోని మూల పదార్థాలు --అనగా పంచ భూతాలు: ఆకాశం, భూమి, నిప్పు, నీరు, గాలి--ప్రకృతిలోనివి.

శ్రీకృష్ణుడు ప్రకృతి, పురుషుల మధ్య గల భేదాన్ని వివరిస్తున్నాడు. పురుషుడు అన్ని కాలాల్లో ఉండే ఆత్మ. దానిలో మార్పుగాని, పరిమితిగాని లేదు. ప్రకృతికి జననమరణాలు ఉంటాయి. మన దేహం ప్రకృతి లోని పంచభూతాలతో చేయబడినది. మరణించిన తరువాత ఖననం చేసినప్పుడు దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది. మనం ఆవివేకం వలన దేహం చిరకాల ముండేదని తలుస్తాం. మన శరీరంలో ప్రతి అణువు ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. మనస్సు కూడా ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. మనం ఆలోచనలని విశ్లేషణము చేస్తే -- అది ధ్యానంవలన సాధ్యం--మన అంతర్గత౦ కూడా ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి పదార్థము, శక్తి యేకాక భావాలు, ఆలోచనలు, అహంకారం కలిగి ఉంటుంది. ఇవన్నీ దేహం పుట్టినప్పుడు కలసి వస్తాయి. దేహం పడిపోయిన తరువాత అవి వాటి దారిన పోతాయి.

కఠ ఉపనిషత్తు ప్రకృతిని ఈ విధంగా వర్ణించింది:

ఆత్మ రథంలో ప్రయాణించేవాడు

దేహం రథం

రధికుడు బుద్ధి

ఇంద్రియాలు గుఱ్ఱాలు

స్వార్థ పూరిత ఆలోచనలు వెళ్ళే బాట

ఆత్మ తికమక పడినప్పుడు, దేహేంద్రియ మనస్సులతో సుఖదుఃఖాదులు అనుభవించును,

మనమొక కారు అద్దెకు తీసికొని ఒక గమ్యం చేరాలనుకోండి. ప్రయాణ మధ్యలో వింతలు విడ్డూరాలు చూస్తూ ఉంటే ఆ కారులోని ఇంధనం అయిపోయి, గమ్యం చేరకుండా, తిరిగి కారుని అప్పజెప్పేయాలిసి వస్తుంది. అలాగే మన ప్రాణ శక్తిని లక్ష్యం పై కాక వృధాగా వెచ్చిస్తే లక్ష్యం సాధించకుండా దేహం పడిపోతుంది.

ధ్యానం మొదలు పెట్టినప్పటి నుంచీ మన దేహాభిమానం త్యజించాలి. మొదట్లో అది చాలా కష్టమనిపిస్తుంది. అది ఎలాగంటే మన నాలుకకు రుచులు అలవాటు పడితే దానికి సాధారణ పదార్థాలు రుచించవు. ఒక కుక్కకు తర్ఫీదు ఇవ్వకపోతే దాని ఇష్టం వచ్చినట్లు ఉంటుంది.

ఆధ్యాత్మిక జీవనంలో తాజాగా చేయబడిన పౌష్ఠికాహారాన్ని తినాలి. రోజూ వ్యాయామం చెయ్యాలి. తగినంత నిద్ర పోవాలి. అలాగే చెడలవాట్లను విడనాడాలి. నాతో కలసి ధ్యానం చేస్తున్న అనేక మంది ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాల అలవాట్లనుంచి విముక్తి పొందేరు. వాళ్ళు మొదట నన్ను కలసినప్పుడు వారిని విమర్శించను. ఎందుకంటే వాళ్ళు ధ్యానం మొదలపెట్టిన కొన్నాళ్ళకి వాటిని వదిలేస్తారు.

ఇంద్రియాలకు తర్ఫీదివ్వడం భౌతిక ప్రక్రియ కాదు. అది మానసిక పరమైనది. నన్ను కలిసిన కొందరు భౌతిక శాస్త్రజ్ఞులు మేము అంతర్గత ప్రపంచాన్ని నమ్మం; మేము దాన్ని మా పరికారాలతో చూడలేము అని చెప్పేరు. నేను చెప్పే అంతర్గత, బాహ్య ప్రప౦చాలు, ఒకే వస్త్రంతో చేయబడినట్లు. ఆరోగ్యం భౌతిక సిద్ధాంతాలతోనే కాక, ఆధ్యాత్మిక, మానసిక స్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. రోగం సూక్ష్మక్రిముల వలననేకాక, మానసిక వొత్తిడి, చెడు అలవాట్ల వలన రావచ్చు. మనమందరితోనూ పోటీ పడితే కడుపులో పుండు (ulcer) రావచ్చు. మన క్రోధాన్ని అధిగమించకపోతే ఆస్త్మా వంటి శ్వాస సంబంధిత రోగాలు కలుగవచ్చు.

పదార్థము ఎలా ప్రకృతిలో ఒక భాగమో మనస్సు కూడా ప్రకృతిని ఆలంబము చేసికొని ఉన్నది. ఆలోచనలను మనము చూడలేము, పట్టుకోలేము. అవి పదార్థము వంటివి కావు అని మనకు తెలుసు. కానీ దాని మీద ఆధారపడిన వాక్కు ఇతరులను బాధించవచ్చు. ఒక విమర్శ వలన ఇతరులకు నిద్ర పట్టకపోవచ్చు. ఇవి అంతా ఆలోచనల శక్తి వలన కలిగినవి.

మేధ కూడా ప్రకృతి. ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానము మార్పు చెందుతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు పాఠశాల నుంచి తిన్నగా నా అమ్మమ్మ, అమ్మ దగ్గరకు వెళ్ళి ఆ రోజు నేర్చుకున్న విషయాలు చెప్పేవాడిని. ఒక రోజు నేను వాళ్ళకి "భూమి గుండ్రంగా ఉంది" అని చెప్పేను. వాళ్ళు విరగబడి నవ్వేరు. ఇప్పటికీ నా అమ్మ "నా కొడుకు ప్రొఫెసర్, గొప్ప వ్యక్తి, కానీ భూమి గుండ్రంగా ఉందని నమ్ముతాడు" అని ఇతరులకు చెప్తుంది. వచ్చే దశాబ్దాలలో కొందరు శాస్త్రజ్ఞులు భూమి ఆకారం పూర్తిగా గుండ్రంకాదు, దాని ఆకారం మారుతూ ఉంటుందని చెప్పవచ్చు.

చివరగా అహంకారం కూడా ప్రకృతి యనబడును. ఎందుకంటే అది ఆలోచనలు, భావాల వలె శాశ్వతము కాదు. మన ఆలోచనలు, భావాలూ మారుతూఉంటే మన వ్యక్తిత్వము కూడా మారుతూ ఉంటుంది. మనం ఎల్లప్పుడూ ఒకేలా ఉన్నామని తలచవచ్చు. కానీ చాలామంది ఇతరులతో సంభాషించే టప్పుడు వేరేగా ఉంటారు. కానీ మనలో మారనిది ఒకటి ఉందని చాలా మందికి చూచాయిగా తెలుసు. గీత చెప్తుంది: "నువ్వు ఎప్పుడూ ఒకేలాగ ఉన్నావు. నీ మారుతున్న ఆలోచనలు, కోర్కెలు నీవు కాదు. అవి ఒక ముసుగు. నీవు ముసుగే నువ్వనుకొన్నావు. దాని క్రింద నీ ఆత్మ ఉంది. అది ఎప్పటికీ మారనిది".

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...