Saturday, April 9, 2022

Eknath Gita Chapter 7 Section 15

Bhagavat Gita

7.15

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే {7.19}

వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః

అనేక జన్మ పరంపల జ్ఞానమును సంపాదించిన జ్ఞాని సర్వమును వాసుదేవుడే యని గ్రహించి నన్నే సేవించుచున్నాడు . అట్టి మహాత్ముడు చాలా అరుదుగ నుండును

శ్రీకృష్ణుని మరొక నామము హరి అనగా చోరుడు. అతడు మన గుండెను చౌర్యము చేసి మనల్ని వెదకమని ప్రపంచంలోకి పంపించేడు.

ఇక్కడ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు. మనము ఎన్నో జన్మలెత్తితేగాని ప్రపంచము స్థిరము కాదని దేవుడొక్కడే శాశ్వతమని తెలిసికోలేము. ఈ విధంగా స్వార్థ రహితమైనవారు ఎక్కువ పరిణామం పొందిన వారు. వారు జగత్తు క్రీడాస్థలమని ము౦దే తెలిసికొన్నారు. ఎవరైతే అట్లు తెలిసికోలేదో వారికి అనుభవం ఇంకా రాలేదు. ధనవంతుల ఇంట్లో పుట్టినవానికి ధనం విలువ తెలిసి దానిని తెలివిగా వాడుతాడు. వానికి ధనం యొక్క నిజమైన విలువ తెలుసు. కానీ మనలో కొందరికి నడిమంత్రపు సిరి వచ్చి వస్తువులకై ధనము వెచ్చిస్తాము. అలా వస్తువులు కొని కొంతకాలానికి అవి అన్నీ బొమ్మలవంటివని తెలిసికొ౦టాము. టివి క్రొత్తగా కనిపెట్టినపుడు పేద దేశాల్లో ప్రజలు విరగబడి చూసేవారు. వారికి టివి లో జరిగే సంభాషణ అర్థమవ్వక పోయినా అదే పనిగా చూసేవారు. సంపన్న దేశాల్లో టివి అన్నిచోట్లా ఉంది. అతి ఒక వింత వస్తువు కాదు. దాని వలన మనము పూర్ణమైన ఆనందమును పొందలేము. ఆనందము మనలోన ఉన్నది. ఎన్ని ఎక్కువ కోర్కెలు ఉంటే అంత ఎక్కువ విచారాన్ని పొందుతాము. అశాంతితో కూడిన జీవితం దేవుడిని పొందాలనే కాంక్షకు చిహ్నం. అప్పుడు మనము అంతర్ముఖులమై సంపూర్ణమైన ఆనందము, జ్ఞానము, భద్రత పొందుతాము.

అటువంటి ఆనందాన్ని పొందిన తరువాత విశ్వంలో దేవుడు తప్పిస్తే ఏదీ శాశ్వతము కాదని తెలిసికొ౦టాము. అది మేధకి సంబంధించినది కాదు. ప్రతీదీ భగవంతుని స్వరూపమని అవగాహన పొందుతాము. అదే వాసుదేవ సర్వం అంటే. సెయింట్ అంజిలా ఆఫ్ ఫాలిగ్ నో ఈ విధంగా చెప్పేరు:

నా ఆత్మ కన్నులు తెరిచి, దేవుని యొక్క పూర్ణత్వము చూసేను. తద్వారా సర్వ ప్రపంచం, ఇక్కడ మరియు సముద్రములకు ఆవల, మహా సముద్రపు లోతులలో కూడా చూసేను. వీటిలో దేవుని శక్తి తప్ప మరేదీ లేదని, నాకు వర్ణించడానికి మాటలు లేవని తెలిసికొన్నాను. అలా అబ్బురపడుతూ "ప్రపంచమంతా దేవునితో నిండి ఉన్నది" అని బిగ్గరగా అరిచేను. 66

Eknath Gita Chapter 7 Section 14

Bhagavat Gita

7.14

తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే {7.17}

ప్రియో హి జ్ఞానినో అత్యర్థ మహం స చ మమ ప్రియః

ఈ నలుగురిలో నిత్య యుక్తుడును, ఏకాంత భక్తి కాలవాడును -- అగు జ్ఞాని శ్రేష్టుడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను. అతడు నాకును ప్రియుడై యున్నాడు.

ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ {7.18}

అస్థిత స్సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్

ఈ భక్తులందరు ఉదార చరితులే. జ్ఞాని మాత్రము సాక్షాత్తు నా స్వరూపమే. అతడు నాయందే మనసు నిలిపి నన్నే పరమగతిగ ఆశ్రయించి యున్నాడు

ఇక్కడ ముఖ్యమైనది: నిత్యాయుక్త. అనగా సదా శ్రీకృష్ణునితో ఏకమైనవాడు. అటువంటి వ్యక్తి శ్రీకృష్ణుని హృదయమునందు మిక్కిలి ఆనందమును నింపును.

శ్రీకృష్ణుడు "అటువంటి వ్యక్తిని చూస్తే, నువ్వు నన్నే చూస్తున్నావని" చెప్పెను. జీసస్ తన శిష్యుడు ఫిలిప్ తో అటువంటి భావాన్నే వచించేడు: "నువ్వు నన్ను చూస్తే, నా తండ్రిని చూసినట్టే". ఇది చాలామంది యోగులకు నివాళి: మోసెస్, మైస్టర్ ఎక్ హార్ట్, తెరెసా ఆఫ్ ఆవిలా, సెయింట్ ఫ్రాన్కిస్ ఆఫ్ అస్సీసీ, జాన్ వూల్ మన్, జలాలుదీన్ రూమి, శ్రీ రామకృష్ణ, గాంధీ. ఇట్టివారు మనలాగే జన్మించి, మనకన్నా ఎక్కువ బాధలు అనుభవించి, ధ్యానంతో, నిస్వార్థమైన జీవనంతో, మోక్షం పొందే వరకు జీవుల ఐక్యతను పెంపొందించేరు. మనం ఒక మూలకూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాడు మన మిత్రుడు లేదా బంధువు లా కాక, వాని ద్వారా పరమాత్మ తన కార్యాన్ని ప్రారంభిస్తున్నాడని తలంచవలెను. 66

Eknath Gita Chapter 7 Section 13

Bhagavat Gita

7.13

చతుర్విధా భజ౦తే మా౦ జనా సుకృతినో అర్జున {7.16}

ఆర్తో జిజ్ఞాసు రర్ధార్థీ జ్ఞానీ చ భరతర్షభ

అర్జునా! నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను భజించుచున్నారు. వారు ఆర్తుడు, జిజ్ఞాసువు, ఆర్థార్థి మరియు జ్ఞాని. ఀ

ప్రజలు ఆధ్యాత్మిక జీవనమునకై అనేక కారణాల వలన వస్తారు. ఎక్కువమంది భౌతిక, మానసిక బాధల వలన వస్తారు. ధ్యానం చేసే ముందు నాకు బాధను అనుభవించడం వలన తెలిసికొనే పాఠం గురించ తెలీదు. భగవంతుని దయ బాధను అనుభవిస్తేనే వస్తుంది. మన చెడు నడవడికను మార్చుకొంటేనే భగవంతుడు మనపై కరుణ చూపుతాడు.

అతిగా బాధపెట్టేది సాధనచేసేందుకు మనము కొన్ని త్యజించిడంవలన, మనను మననుండి వేర్పాటు చేసికోవడంవలన. కరుణామయుడైన పరమాత్మ మనకు బాధ ఎందుకు కలిగిస్తాడ౦టే, మనను తనవైపు త్రిప్పుకొనుటకు. బాధ కలిగించేది మనను ఆనందదాయకముగా చేయుటకు. ఎవడైతే అహంకారాన్ని వీడుతాడో వానికి ఇంక బాధ ఉండదు.

రెండవ కోవకు చెందినవారు జిజ్ఞాసులు. వారికి అన్నిటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. వారు ఆనందమునకై అనేక హోటల్ లను, దేశాలను తిరిగి ఉండచ్చు. చివరకు వారు హోటల్ కు వెళ్ళడం వలన దేహంలో కొవ్వు పడుతుందని, దేశ దిమ్మరిగా ఉండడంవలన బంధాలు ఉండవని, జీవితానికి ఒక లక్ష్యం ఉండాలని, తెలిసికొ౦టారు.

జిజ్ఞాసు తను ముందు చూడని వస్తువులను చూడాలని ఆతృత పడుతూ ఉంటాడు. ఒక పెట్టె గుడ్డచే కప్పబడి ఉంటే, ఆ గుడ్డ క్రింద ఏముందో చూడాలనుకొంటాడు. ఇటువంటి కుతూహలం విచారణకు దారి తీసి, చివరకు జ్ఞాన సముపార్జనకు హేతువు అవుతుంది. ఉదాహరణకి "కృష్ణ బిలం తనలోకి లాక్కొన్న పదార్థాలను ఎక్కడకు తీసికెళ్తుంది? అవి మళ్ళీ సృష్టింప పడతాయా?" మొదలైన సామాన్యులకు కలగని ప్రశ్నలు జిజ్ఞాసువుకు కలుగవచ్చు.

కళాకారులలో కూడా జిజ్ఞాసులు ఉంటారు. అట్టివారు నాతో "నాలో ఏదో శక్తి ఉందని తెలుసు. కానీ దానిని వెలుపలకి తీసికొని రాలేక పోతున్నాను. ఎక్కడో అవరోధం కలుగుతోంది" అని చెప్పేవారు. నేను వారిని ధ్యానం చేయమని ప్రోత్సాహించే వాడను. ధ్యానం వలన మనలోని సృజనాత్మక శక్తి విడుదల అవుతుంది.

ఇక జ్ఞానులు నాల్గవ కోవకు చెందిన వారు. వారు జీవిత లక్ష్యాన్ని తెలిసికొనుటకు, దానిని సాధించే మార్గమును అన్వేషించుటకు ధ్యానం చేస్తారు. వారు ధన సముపార్జనమే, ఇంద్రియ లోలత్వమే జీవితాశయం కాదని తెలిసికొ౦టారు. వారు "శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందాలి?" అనే లక్ష్యంపై సాధన చేస్తారు. ధ్యానం హృదయ పూర్వకంగా, క్రమ బద్దంగా చేసేవారు తమకి ధ్యానం మొదట్లో ఎలాంటి లక్ష్యం ఉన్నా, ఆ ప్రశ్నని అడుగుతారు. క్రమంగా భౌతిక లేదా మానసిక సమస్యలున్నవారు తమ అంతర్గత లోతుల్లో ఉన్న శక్తిని వెలికి తీస్తారు. చివరగా వారు శాశ్వతమైన శాంతితో, ఆనందంతో కూడిన జీవితాన్ని పొందాలనే జ్ఞానులుగా అవుతారు. 65

Eknath Gita Chapter 7 Section 12

Bhagavat Gita

7.12

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా {7.14}

మామేవ యే ప్రపద్య౦తే మాయామేతాం తరంతి తే

దైవ సంబంధమై, త్రిగుణాత్మకమైన ఈ నా మాయ దాట శక్యము కానిది. ఎవరు నన్నే శరణు పొందుచున్నారో వారు మాయను దాటుచున్నారు

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః {7.15}

మాయ యా అపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః

ఎవరి జ్ఞానమును మాయ అపహరించినదో అట్టివారు రాక్షస భావములను ఆశ్రయించు చున్నారు. పాపులు, మూఢులు నగు నరాధములు నన్ను పొందలేరు

మాయను వివరించడం చాలా కష్టం. ఎందుకంటే అది సర్వ వ్యాప్తమై మన ఆలోచనలను, అవగాహనను ఆవరించి యున్నది. మన వేర్పాటును కలిపించి తికమక పెట్టే మహా శక్తి. అది ఒక క్లిష్టమైన కల లాంటిది. దానివలన ప్రతీదీ దాని కితరమైనదిగా కనిపిస్తుంది. మనమందరము ఒక్కటే అయినప్పటికీ మనం వేర్పడి ఉన్నామని భ్రమ కలిపిస్తుంది. దానివలన సుఖం, శక్తి, వస్తువులు మనను ఆనందింప చేస్తాయని నమ్ముతా౦. మనం ఎంత సుఖం కలిగించే వస్తువుల వైపు పరిగెడతామో అంత నిరాశ పడతాం. మనం ఎంత ఉత్తేజం పొందాలనుకుంటామో, జీవితం అంత పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది. మనం ఎంత ఇతరులను మభ్య పెడతామో అంత అభద్రతను పొందుతాం. మాయ మన ఆనందాన్ని అపహరించి, దానికై అన్ని చోట్లా వెదక జేస్తుంది.

మన శాస్త్రములలో మాయ యొక్క ఆవరణం, దారి మళ్లించే అంశాలను రాజసిక, తామసిక గుణములుగా చెప్పబడినది. ఈ రెండు గుణాలే మాయ యొక్క మూలం. తామసికుడు ఎప్పుడూ తన వేర్పాటును, దేహమే తానను భ్రమలో ఉంటాడు. రాజసికుడు అశాంతితో స్వార్థానికై అనేక కోర్కెలు కల్పించి, ఎండమావులకై పరిగెత్తిస్తాడు.

మాయ ఇటువంటి అబ్బురపరిచే కోర్కెలతో మన జీవితాన్ని సంపూర్ణముగా చూడనివ్వదు. మన౦ స్వార్థానికై, సుఖానికై ప్రాకులాడి, మనకి ఇతరులికి మధ్య గోడను కట్టి వేర్పాటు కలిగించుకొంటాం. మాయ యొక్క క్రూరత్వము వలన మనం గోడ వెనుక ఒంటరితనముతో, వేర్పాటుతో బ్రతుకుతాం. మనం ఎంత కోర్కెలను తీర్చుకోడానికి ప్రయత్నిస్తామో, గోడ ఎత్తును అంత పెంచుతాం.

నేను ధ్యానం అలవరుచు కున్న ముందు, కొండని లేదా నదిని లేదా ఆకాశాన్ని చూసినప్పుడు వాటి సౌందర్యాన్ని ఆస్వాదించేవాడిని. అలాగే నాలో వ్యక్తిత్వము గూర్చి అవగాహన ఉండి, పరుల యందు సానుభూతితో ఉండేవాడిని. ధ్యానం అలవరుచుకున్నాక అవన్నీ అందంగా ఉ౦డి, అన్నీ ఒకటే అని తెలిసికున్నాను మాయ యొక్క ముసుగు తొలగితే మనం వేర్పాటుతో ఉన్నా, ప్రపంచంలోని భేదాలు -- వేర్వేరు ముఖములు, నడవడి, జాతులు, నమ్మకాలు-- దేవుని లీల అని తెలిసికొ౦టాం.

నేను మొదటిసారి అమెరికాకు వచ్చినపుడు నాకు అమెరికన్ లు, ఇతర దేశస్తులుకు గల భేదాల గూర్చి చెప్పేరు. నేను వారి మధ్య కలిసి యున్న లక్షణాలను గురించి ఆలోచించేవాడను. ఎందుకంటే మన మధ్యనున్న భేదాలు పైపైవి మాత్రమే. అవి మన మధ్యనున్న ఆహారము లేదా దుస్తులు మొదలైన వాటివలన ఉన్న తేడాయే. అమెరికాలో ఎన్నో అంతస్తులున్న, నేనెన్నడూ చూడని, భవనాలను చూసి ఆశ్చర్య పడ్డాను. కాని నేను మిక్కిలి ఓర్పుతో ఉండే యోగి కన్నా అవి ఎక్కువ ఆశ్చర్యము కలిగించేవి అని తలచలేదు. నా తోటి వారు టైమ్స్ స్క్వేర్ లో ఉన్న నియాన్ దీపాలు, ఎత్తైన భవనాలు చూస్తూ ఉంటే నేను అక్కడి మనుష్యులను చూసేను. వారు పైపై ఎంత తేడాలతో ఉన్నా, అంతర్గతంలో వారంతా ఒకటే కదా అనే భావన ఆనందాన్ని కలిగించింది.

మనము మన కళ్ళతో కాక మనస్సుతో చూస్తాం (ప్రశ్నోపనిషత్తు). మనస్సు తేడాలను చూస్తుంది. ఎక్కడైతే క్రోధం, ధైర్యం, లోభ౦, వేర్పాటు లేవో మనస్సు స్పందించదు. దేని గురుంచీ ఉద్రేకము చెందకుండా, సంపూర్ణమైన ఆనందం తో ఉంటే మనస్సు ఆస్వాదించలేదు. మాయను దాటాలంటే ఈ మనస్సు లక్షణాన్ని తెలిసికోవాలి. ధ్యానంతో మన మెంత మనస్సును కట్టడి చేస్తే, మనమ౦త పైపై మెఱుగులు చూడక ఉంటాము. మనస్సును నిశ్చలముగ ఉంచితే మాయ యొక్క ప్రభావం తగ్గుతుంది. అందుకే నేను చెప్పేది ఎల్లప్పుడూ మనగురించే ఆలోచించక, ఇతరులకై ఆలోచించండని. అలాగే సహనంతో, చికాకు లేకుండా ఉండండి. ఎందుకంటే అవి మన అహంకారాన్ని ఉత్తేజ పరచి వేర్పాటు కలిగిస్తాయి. మనస్సు యొక్క ఉత్తేజము మాయ. మనము ప్రతీదీ, ప్రతి వ్యక్తినీ, మనస్సుతో చూడ గలిగితే దానిని నిశ్చలముగా, నిర్మలముగా ఉంచాలనే ప్రేరణ కలుగుతుంది. 62

Eknath Gita Chapter 7 Section 11

Bhagavat Gita

7.11

యే చైవ సాత్త్వికా భావా రాజసా స్తామసాశ్చయే {7.12}

మత్త ఏ వేతి తా న్విద్ధి న త్వహం తేషు తే మయి

సాత్త్విక, రాజస, తామస గుణములచే కలుగు భావములు ఏవైనను అవి నా వలననే కలుగుచున్నవి. అవి నాయందున్నవి. కానీ నేను వాని యందు లేదు

త్రిభి ర్గుణమయై ర్భావై స్సర్వమిదం జగత్ {7.13}

మోహితం నాభిజానాతి మామేభ్యః పర మవ్యయమ్

త్రిగుణములచేత సమ్మోహింపబడిన ఈ ప్రపంచము వీటికంటె విలక్షణమై, నాశరహితమైన నన్ను గ్రహించలేకున్నది

సృష్టి అఖండమైన చైతన్యం నుంచి ఉత్పన్నమైనదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన వేకువలోని, స్వప్నావస్తాలోని జ్ఞాపకాలు సుషుప్తిలో ఎలా గుర్తుకురావో, అలాగే పరమాత్మ చేతనములో విశ్వమనే ఆలోచన గుప్తంగా ఉంది. విష్ణు మూర్తి అనంత అనబడే సర్పము మీద, విశ్వ సముద్రము పైన పడుకొనిఉన్నాడు అని పురాణాలు చెప్తాయి. అట్టి స్థితిని స్పందింపజేసేదేమీ లేదు. అక్కడ వెలుగు కూడా లేదు. సర్వం విష్ణు మయం. విష్ణువు కల గంటాడు. అదే మన ప్రపంచం -- అనగా మాయ-- మరియు ఆ కల మూడు గుణాలతో కూడినది: సత్త్వ, రజస్, తమస్. సృష్టి ఆరంభంలో ఆ గుణాలు వివిధ ప్రమాణాలతో కలసి, తద్వారా ప్రకృతిని ఆవిర్భవింపజేసేయి.

మనలో కూడా ఈ త్రిగుణాలూ ఉన్నాయి. సాధారణంగా ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే బద్దకంతో స్తబ్దు గా ఉంటారో, పనులు వాయిదా వేస్తూ ఉంటారో, కార్యాలను మొదలుపెట్టి మధ్యలోనే ఆపేస్తూ ఉంటారో, వారు తామసికులు. వారిని విగ్రహాల వంటి వారని చెప్పవచ్చు. కాని వారిలో శక్తి, క్రియా శీలత గుప్తంగా ఉంటుంది. అట్టి వారు ధ్యానం చేయడం మొదలపెడితే వారి తామసిక గుణాన్ని -- అనగా బద్దకం, ఉదాసీనత మొదలగునవి-- జయించి అధిక వృద్ధి చెందగలరు.

రాజసికులు ఒక మెట్టు మీద ఉన్నారు. వాళ్ళు గొప్ప వాటిని సాధించాలనే నిశ్చయంతో ఉంటారు. వాళ్ళు తామసికులకన్నా ఎక్కువ పరిణామం చెందినా, వారి భావోద్వేగం తుఫానులాగ ఉంటుంది. సినిమా నాయకులు, దేశాధినేతలు, క్రీడలలో అగ్ర పూజ పొందేవారు ఆ కోవకు చెందినవారు. వాళ్ళు పోటీ పడి ఎవ్వడూ, ఎన్నడూ సాధించనిది సాధిస్తారు. వాళ్ళలో అధిక శక్తి, ఉన్నా దానికి ఒక దిశ లేదు. వాళ్ళు ఆహ్లాదకరమైన విషయాల్లో మునిగి, అనర్థాన్ని తెచ్చుకుంటారు.

ప్రస్తుత ప్రపంచం రాజసికులతో నిండి ఉంది. రాజసికులు వ్యక్తులను (వ్యష్టి), దేశాలను (సమిష్ఠి) తమ మాయ మాటలతో మభ్య పెడతారు. పర్యావరణ కాలుష్యం రాజసికులు మితిమీరిన లాభాలకై పరిశ్రమలు నడుపడం వలన కలుగుతున్నాది. మనం తినే పదార్థాలలో హాని కలిగించే చెక్కెర, కొవ్వు మొదలైనవి ఎక్కువ పాళ్లలో అమ్మి, లాభాలు చేసికొనేవారుకూడా రాజసికులే.

రాజసికులు ఎప్పుడూ అశాంతితో ఉంటారు. ఎవరైతే అలాగ ఉండి, ప్రతి ఏడాదీ ప్రపంచాన్ని చుట్టి, తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటారో, అట్టి వారు ధ్యానం అలవరచుకొంటే వృద్ధిలోకి వస్తారు. యోగానంద పరమహంస అనే ఆధ్యాత్మిక గురువు --సెల్ఫ్ రియాలైజేషన్ ఫెల్లోషిప్ అనే కార్యక్రమాన్ని లాస్ ఏంజలీస్ లో ప్రారంభించేరు-- ఒక గొప్ప పెట్రోలియం ఆయిల్ కనిపెట్టే సంస్థ యజమాని జేమ్స్ లిన్ ను ధ్యానంలోకి ప్రోత్సహించేరు. లిన్ తనకున్న రాజసిక గుణాన్ని ధ్యానంలో ఉపయోగించి ఉత్తమ స్థితిని పొందెను.

ధ్యానం ద్వారా మనకున్న రాజసిక గుణాన్ని -- సాధారణంగా స్వార్థకర్మలు చేయించేది--సాత్త్వికముగా మార్చుకొని పరోపకారం చేయాలి. క్రోధం బదులు క్షమ, చికాకుకు బదులు ఓర్పు, లోభి కాకుండా పరులకు మేలు చేయడం మొదలైనవి సాత్త్విక గుణాలు. సాత్త్వికులు పైకి నిర్మలంగా కనబడినా, మనము వారికి శక్తి లేదని తప్పు అంచనా వేయరాదు. వారు తమ శక్తిని అశాంతితో అనేక విషయాలపై వెచ్చించ కుండా, ఒక మంచి కార్యానికై దార పోస్తారు. విచక్షణా జ్ఞానంతో, సమంగా ఉండే మనస్సుతో, స్థిరమైన కర్మ లతో వారు ప్రపంచానికి ఎనలేని సేవ చేస్తారు. 59

Eknath Gita Chapter 7 Section 10

Bhagavat Gita

7.10

బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం

ధర్మావిరుద్దో భూతేషు కామో అస్మి భరతర్షభ {7.11}

అర్జునా! బలవంతులకు కామానురాగములు లేని బలమును నేనే. ప్రాణులయందు ధర్మమునకు విరోధము కాని కామము నేనే

చిన్నప్పుడు నేను ఎంతో వ్యాయామంచేసి కండలు పెంచిన వారిని, అతి ఎక్కువ దూరం గెంత గలిగినవారిని, గజ ఈతగాళ్ళని చూసేను. నాకు నా అమ్మమ్మద్వారా తెలిసినదేమిటంటే నిజమైన బలము మన కండరాలకే పరిమితము కాదు. సహనం, స్థితి స్థాపికత, ఓపిక తో ఎట్టి సమస్యనైనా ఎదుర్కొనగల శక్తి కూడా బలమే.

అట్టి బలము మనను నియంత్రించుకోగల శక్తి వలననే సాధ్యం. ఒక వ్యక్తి చీటికీ మాటికీ కోపం తెచ్చుకొ౦టే, వానికి క్షణికమైన వాటిమీద మక్కువ ఉంటుంది. కాని మన ఉద్రేకాన్ని అణచుకొంటే, మన౦ అందరి శ్రేయస్సు కై పాటు పడవచ్చు.

నేను ఆంగ్లం నేర్చుకొంటున్నప్పుడు "చైనా అంగటిలో ఎద్దు" అనే పదప్రయోగమును చూసేను. నాకది అర్థంకాలేదు. మేము అరటి ఆకులలో భోజనం చేసేవారము. ఆ తరువాత ఆకులను ఆవులకు మేతగా పెట్టేవారము. నా మామయ్య ఒక ఉన్మత్త ఏనుగును చూసి జంతువులు, మనుష్యులు పారిపోవలసిందే అని చెప్పేవాడు. ఆ ఏనుగుపై ఒక పులి చెట్టు పైనించి దూకి ఎదుర్కోగలదు. కానీ దాని ప్రాణ భయం పోదు. క్రోధం అటువంటిదే. ఇష్టమొచ్చినట్టు అడ్డమొచ్చిన వారలపై కోపము ప్రదర్శించి ఇతరులను బాధ పెట్టడంవలన లాభం లేదు. దాన్ని ఒక ఉన్నతమైన, స్వార్థరహిత లక్ష్యంవైపు త్రిప్పుకోవాలి. అలాగే భావోద్వేగం కూడా. దానికై చాలా సహనముండాలి. మనము ఒక స్వార్థపూరిత కోర్కెను లేదా ఉద్రేకాన్ని స్వాధీనంలో పెట్టుకోగలిగితే శ్రీకృష్ణుడు "నీ సహనం, బలం నేనే" అంటాడు.

ఇంకా శ్రీకృష్ణుడు "నీ కోర్కె నిస్వార్థ మైతే, నేను అందులో ఉన్నాను" అని అంటాడు. అలాగని మన౦ అన్ని స్వార్థమైన కోర్కెలను వదులుకోనక్కరలేదు. ఉదాహరణకి మన ఇంట్లో విందు జరిగితే మనం నోరుకట్టుకొని ఒక మూల కూర్చోనక్కరలేదు.

అలాగని శ్రీకృష్ణుడు మనం మద్యం సేవిస్తూ ఉంటే దాన్ని ప్రోత్సాహిస్తాడు అనుకోవడం అపోహ.

ఈ విషయాల్లో ముఖ్యమైనదేమిటంటే, మనమొక కర్మ ఇతరుల గురించి చేస్తున్నామా లేదా. మనమొక పెళ్లి విందుకు వెళ్ళి అక్కడ అందరూ పప్పు, కూర తింటూవుంటే కేవలం పళ్ల రసం, నీరు త్రాగడంతో సరి పెట్టుకోనక్కరలేదు.

అలాగే తక్కిన చట్టబద్దమైన కర్మలు. నేను పనిలో ఉక్కిరిబిక్కిరిగా నున్నా, నా మిత్రులతో ఈత కొట్టడ౦, టివి లో టెన్నిస్ మ్యాచ్ చూడడం, లేదా కర్ణాటక సంగీత కచేరీకి వెళ్ళడం చేస్తాను. అనగా మనము ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ చిన్న చిన్న కోర్కెలను అణచుకోనక్కరలేదు. కాని మనమందరినీ కలుపుకొని నిస్వార్థంగా బ్రతకాలి. 55

Eknath Gita Chapter 7 Section 9

Bhagavat Gita

7.9

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ {7.10}

బుద్ధి ర్బుద్ధిమతా మస్మి తేజ స్తేజస్వినా మహమ్

పార్థా! సర్వభూతములకు శాశ్వతమైన బీజస్థానమును నేనే. బుద్ధిమంతులయొక్క బుద్ధియు, ధీరపురుషుల యొక్క ధైర్యమును నేనే ఀ

పరమాత్ముడు సృజనాత్మక శక్తికి బీజము. ఎలాగైతే వంకాయ విత్తనాలు వంకాయ చెట్టుగా మొలకెత్తుతాయో, బీరకాయ విత్తనాలు బీరకాయ చెట్టుగా మొలకెత్తుతాయో, పరమాత్మ బీజము పరమాత్మ చెట్టుగా మనలో మొలకెత్తుతుంది.

మనము కొట్టులో టొమాటో విత్తనాలు కొని, వాటిని పాతి, మరుసటి రోజు ఇంకా మొలకెత్తలేదని కొట్టు వాడిని అడిగితే లాభం లేదు. టొమాటో విత్తనం పాతిన తరువాత ఒక్క రోజులోనే మొలకెత్తదు. అది మొలకెత్తడానికి సారవంతమైన భూమి, నీరు, తగిన వాతావరణం ఉండాలి. అలాగే పరమాత్మ బీజము చెట్టుగా మారాలంటే చాలా రోజులు వేచి చూడాలి.

అదృష్టవశాత్తూ పరమాత్మ బీజము నాశనము లేనిది. అది మనలోనే ఎప్పటికీ ఉన్నది. అది తీవ్రమైన వాతావరణంలో -- అంటే మండేటెండలో, వణికించే చలిలో--రాణించ గలదు. మన౦ గతంలో ఎన్ని తప్పులు చేసినా ఆ బీజం చెక్కుచెదరకుండా మనలో ఉన్నది. కాని అది భయం, క్రోధం, లోభం అనబడే కలుపు మొక్కలతో కప్పబడి ఉన్నది. మనం ధ్యానం చేయడం మొదలుపెడితే ఆ కలుపు మొక్కలు వాడి, నశించి, పరమాత్మ బీజము మొలకెత్తుతుంది.

బుద్ధి అనగా విచక్షణ లేదా మేధ. దాని సహాయంతో మన అంతర్గత తోటను ప్రక్షాళనము చేసికోవచ్చు. బుద్ధి మనకు క్షణికమైన ఆనందము కావాలో, శాశ్వతమైన ఆనందము కావాలో నిర్ణయిస్తుంది. కఠ ఉపనిషత్తులో చెప్పబడిన దేహమనే రథానికి, బుద్ధి సారధి. అది ఆత్మ సహాయము తీసికొ౦టే, మనను సక్రమ మార్గంలో నడుప గలదు.

శ్రీకృష్ణుడు చెప్పేది: ఎటువంటి కష్టముతో కూడిన నిర్ణయము తీసికొన్నా, నేను దాని జ్ఞానముగా ఉన్నాను. దాని నుండి స్వతంత్రము పొందితే మనము క్షణికమైన సుఖములు గురించి ఆలోచించము. కాని అట్టి ఎన్నిక చేసికోవడం సులభం కాదు. దానికి ధైర్యము, ఓర్పు అవసరం. అందుకే హిమాలయాలు ఎక్కాలన్నా, అంతరిక్షంలోకి వ్యోమగామిగా వెళ్లాలన్నా మిక్కిలి ధైర్యం ఉండాలి. శ్రీకృష్ణుడు "నీకు సవాలు తీసికోవడానికి ధైర్యం ఉంటే, నేను నీ ధైర్యాన్ని అవుతాను" అన్నాడు.

పరమాత్మ ఎక్కడో "ఆ మూల సౌధంబులో" లేడు. మనలోనే జ్ఞానంగా, ధైర్యంగా ఉన్నాడు. ఒక వ్యోమగామి దేవుడు విశ్వాన్ని సృజించేడు అనేవారు పిరికివాళ్ళు అని అన్నాడు. మనకు భగవంతుని సృష్టి అవగాహనకు రానంత మాత్రాన అట్టి భావాలు మనస్సులో పెట్టుకోకూడదు. అతడు పరమాత్మ నక్షత్ర వీధిలో ఎక్కడో సభ పెట్టి ఉన్నాడని అనుకుంటున్నాడు కాబోసు. పరమాత్మ అంతటా ఉన్నాడు. ఎక్కడైతే కాంతి, అందము, శ్రేష్ఠత ఉన్నాయో అక్కడ పరమాత్ముని జాడలు ఉన్నాయి. 53

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...