Saturday, April 9, 2022

Eknath Gita Chapter 8 Section 5

Bhagavat Gita

8.5

కవిం పురాణ మనుశాసితార మణో రణీయాంస మనుస్మ రేద్యః {8.9}

సర్వస్య ధాతార మచిన్త్యరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్

ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ {8.10}

భృవోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుష ముపైతి దివ్యమ్

సర్వజ్ఞుడు, సనాతనుడు, నియంత, అణువు కంటెను సూక్ష్మమైనవాడు, సమస్తమునకు ధాత, అచింతమైనవాడు, సర్వసన్నిభుడును, తమస్సు కంటెను వేరైన వాడును అగు అట్టి పురుషుని మరణకాలము నందు నిశ్చలమైన మనస్సుతోను, భక్తితోను, యోగబలముతోను కూడినవాడై, భ్రూమధ్యమున ప్రాణమును నిలకడగ నిలిపి, దివ్యమైనవాడు, సర్వోత్తముడు నగు పురుషుని ఎవడు స్మరించునో అట్టివాడు అతనినే పొందుచున్నాడు ఀ

సర్వోన్నతమైన కవి యగు భగవంతుడు ప్రతిచోటా ఉన్నాడు. వాని సృజనాత్మక శక్తి వలన ఆకాశము, సముద్రము, నదులు, పర్వతాలు, అడవులు, సర్వ జీవులు అందముగా సృష్టింప బడినారు. మన నిర్లక్ష్య వైఖరి వలన కలుగుతున్న కాలుష్యం ఉన్నా, అవి అందంగా ఉంటాయి. జర్మన్ యోగి నికోలస్ ఆఫ్ క్యూశా ఒక గింజలో భగవంతుని సృజనాత్మక శక్తిని చూసి ఈ ఒక్క గింజలో వేలకొలది చెట్లు పుట్టే అవకాశం ఉంది అన్నారు.

ఉపనిషత్తులు సృజనాత్మక శక్తి కారణము కాని కారణమని చెప్పెను. భౌతిక శాస్త్రజ్ఞులు సర్వ సృష్టికి ఫోటాన్ మూలము అంటే, దానిని ఎవరు సృష్టించేరని అడుగుతాను. ఇదే విధంగా కృష్ణ బిలాన్ని ఎవరు సృష్టించేరు? కార్య-కారణ సృష్టిలో ఇటువంటి ప్రశ్నలు అనేకముగా ఉంటాయి. కానీ ఇటువంటి అసంఖ్యాకమైన ప్రశ్నలు భగవంతునిలో అంతమవుతాయి. బ్రహ్మన్ తనను తాను సృష్టించుకున్నాడు. అతడే మొదటి కారణము. మనమంతా దాని నుండి ఆవిర్భవించిన కార్యము.

శ్రీకృష్ణుడు అర్జునినికి మరణ సమయంలో చేతనమును అఖండముగా ఎలాగ చేయాలో చెపుతున్నాడు. మనము సిద్ధపడినా లేకున్నా మరణము ఆసన్నమవుతుంది. ఉపనిషత్తులు మన శరీరము ఏకాదశ ద్వారములుతో కూడిన పట్టణమని చెప్పెను. అవి నోరు, ముక్కు , చెవి, కళ్ళు మొదలగునవి. ఎలాగైతే పట్టణాలు కూడా కాలగర్భాన కలసిపోయి శిధిలమవుతాయో, మన దేహమనే పురము నశిస్తుంది. కానీ ఎప్పుడైతే మన చేతనమును భగవంతునితో అనుసంధానము చేస్తామో మరణ సమయంలో దానిలో మార్పు లేక భగవంతునిలో ఐక్యమవుతుంది.

దీనికి మూలము భక్తి. మనము నిర్గుణుడైన బ్రహ్మన్ ను తలచుకొనుట అసాధ్యము. మరణ సమయంలో దానిని ఎలా స్మరించెదము? అందుకే భగవంతుని మానవ రూపంలో భావించి, అతనిని పూజించెదము. ఆ ప్రతీకే సర్వోత్తమమైన కవి కోవిదుడు, మనను రక్షించు వాడు. మనము ఆయన నుండి ఉత్పన్నమై, ఆయనలోనే కలిసిపోతాము. అందుకే మనకు భగవంతుడు --శ్రీకృష్ణుడు, జీసస్ మొదలైన వారు--మానవ రూపంలో దర్శనమిస్తాడు. భగవంతుని అవతారములు మనలాగే నవ్వుట, ఏడ్చుట, బాధలు పడుట కలిగియుండుట వలన వానిని మనకన్నా ఎక్కువగా ప్రేమిస్తాము. మనమెంత అట్టి అవతార పురుషుని ప్రేమిస్తామో, మరణములో కూడా అంత ప్రేమ కలిగి ఉంటాము. ఆయనలో పూర్తిగా నమ్మకముంటే, మన దేహము, మనస్సు ఆశాశ్వతమని తెలిసికొని చెట్టు నుండి పండుటాకు ఎలా రాలిపోతుందో, అలాగ మరణిస్తాము.

మరణంలో మన ఆస్తులను, వస్తువులను పట్టుకు పోలేము. కానీ మనస్సులో ఎట్టి భేద భావము ఉండరాదు. ప్రతి అనుబంధము, కోరిక, ద్వేషము లేక, మనస్సును నిశ్చలముగా చేయాలి. మనమెప్పుడైతే దేహముపై అనురాగమును వదిలివేస్తామో మనస్సు దేవునియందే లగ్నమై యుండును.

Eknath Gita Chapter 8 Section 4

Bhagavat Gita

8.4

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా {8.8}

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్

పార్థా! అభ్యాసయోగము నవలంబించి, అన్య విషయముల మీదికి వెళ్ళక యుండు మనస్సు చేత శ్రేష్ఠుడైన పురుషుని స్మరించు మనుజుడు అతనినే పొందుచున్నాడు

ఒక కోతి కల్లుతాగి, తేలుచే కుట్టబడి, దయ్యముచే ఆవహింపబడితే ఎలా ఉంటుందో మనస్సు అలాగ ఉంటుందని మన పూర్వీకులు చెప్పిరి. అనగా మనస్సును నియంత్రించుట అతి కష్టం. కానీ మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే అది చేయుట తప్పనిసరి.

నేను, నా భార్య భారత దేశం వెళ్ళినప్పుడు ఒక కోతి ప్రదర్శన చూసేం. ఒక కోతిని ఆడించేవాడు ఆ కోతిచే ఒక పిల్లవాడు బడికి కాళ్లీడ్చుకొ౦టూ వెళ్ళడం, బడినుంచి ఎగిరి గంతేసి తిరిగి రావడం చేయించేడు. ఆ కోతికి శిక్షణ ఒక రోజులో చేయబడినదికాదు. దాని యజమాని కొన్ని వారాలు కృషి చేసి దానికి నేర్పేడు. అలాగే మన మనస్సును నిశ్చలం చేయడానికి ఒక వారం, ఒక సంవత్సరం కూడా , సరిపోదు. నిజానికి ఒక జీవిత కాలం పట్టినా మన సమయం, ఏకాగ్రత వృధా కానట్టే.

మనము దక్షత అనేక విధములుగా ప్రదర్శిస్తాము. ఒక బాలుడు ఒంటి చక్రము సైకిల్ లో మా ఇంటి దగ్గరకు రోజూ దినపత్రికను తీసికివస్తాడు. కొందరు తమ వస్త్రాల పై (జీన్స్) పువ్వులను కుట్టుకొంటారు. వీటన్నిటికీ చాలా సమయం, ఏకాగ్రత కావాలి. నేను తమ దక్షతను పెంపొందించుకొని -- అది చిత్రలేఖనమైనా, మోటార్ సైకిల్ తో విన్యాసాలాయినా -- దానితోనే సంతృప్తి పడక ధ్యాన మార్గంలోకి వస్తే బాగుంటుందని తలుస్తాను.

ఒకనికి ఏకాగ్రత ఉందని చెప్పడానికి వాడు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వేరే ధ్యాస ఉండకపోవడం నిదర్శనం. ఇది ఒక కళ కాబట్టి మనం ధ్యానానికి, లేదా సంబంధాలు గట్టి పరుచుకోడానికి పనికి వస్తుంది. సామ్యూయల్ టేలర్ కోల్ రిడ్జ్ అనబడే ఆంగ్ల కవి వాగ్ధాటి కలవాడు. అతడు ఒక రోజు తన మిత్రుడు చార్లెస్ లాంబ్ ఎక్కడికో వెళ్తుండగా ఆపి తన కవిత్వాన్ని వినమని కోరేడు. చార్లెస్ లాంబ్ తనకు పని ఉన్నదని చెప్పినా వినక, కోల్ రిడ్జ్ అతని కోటు బొత్తాయిని పట్టుకొని అనర్గళంగా కవిత్వాన్ని చదవడం మొదలు పెట్టేడు. అలాగ కొన్ని గంటలు గడిచేయి. చార్లెస్ లాంబ్ అదే దారిన తిరిగివచ్చి చూస్తే కోల్ రిడ్జ్ తన కోటు బొత్తాయిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నాడు. జరిగిందేమిటంటే చార్లెస్ లాంబ్ కోటు బత్తాయిని కత్తెరతో తెంపేసి తన దారిని వెళ్ళేడు. కోల్ రిడ్జ్ కి తనకున్న ఏకాగ్రతవలన అది గ్రహించలేదు. ఇది అతిశయోక్తి అయినప్పటికీ ఒక మేధావి తనకు కావలసిన ఏకాగ్రతకై కోల్ రిడ్జ్ లాగా మందులు వాడే బదులు ధ్యానం అవలంబిస్తే ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతాడు. 102

Eknath Gita Chapter 8 Section 3

Bhagavat Gita

8.3

తస్మా త్సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధ్య చ {8.7}

మయ్యర్పిత మనోబుద్ధి ర్మామేవైష్య స్వసంశయః

అందుచేత సర్వకాలము లందును నన్నే స్మరించుచు యుద్ధము చేయుము. నా యందు సమర్పించబడిన మనో బుద్ధులు గల వాడవైనచో నిస్సంశయముగ నన్నే పొందగలవు

శ్రద్ధ విధికి ఎలా అనుబంధమో, ధ్యానం శ్రద్ధకి అలా అనుసంధానమై యున్నది. గీత ఒక గ్రామంలో, లేదా నగరంలో చెప్పబడలేదు. అది సంగ్రామ స్థలంలో చెప్పబడినది. అక్కడ ఏనుగుల ఘీంకారము, శంఖారావాలు మ్రోగుతున్నాయి. సైనికులు మారణాయుధాలతో యుద్ధం చేయడానికి పూనుకొని ఉన్నారు. అదే ఈ సమయంలో జరిగి ఉంటే విమానాల, ట్యాంకుల మోతతో నిండి ఉంటుంది. వాటి మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునునికి మరణాన్ని ఎలా దాటాలో చెప్తూ ఉంటాడు. మన దైనింద జీవితం కూడా ఒక పోరే. మనం చేసే భయ౦కరమైన యుద్ధము ప్రతిరోజూ, ఉదయం, పగలు, మనము విజయవంత మైనంతవరకు చేయాల్సిందే.

మన చేతన మనస్సులో యుద్ధభూమిలో లాగే అనేక వలయాలు మొహరింపబడి యున్నవి. వాటి నిజమైన శక్తి మనకు చాలా కాలం వరకు తెలియదు. మొదట కాల్బలం. అనగా మనకున్న భయాలు. మనకు తెలియనివి అనేక భయాలు మన అచేతన మనస్సులో దాగి ఉన్నాయి. మనకు భయాలు లేవనుకున్నా, మన వేర్పాటు చేతన మనస్సు లోపలకి చొచ్చుకొని పోయి ఉంది. దాని తరువాత అశ్విక దళం. అదే మన క్రోధం. అశ్విక దళాన్ని తక్కువ అంచనా వేయలేం. తరతరాలుగా రాజులు తమ అశ్విక దళ సామర్థ్యంతో యుద్ధాలలో గెలిచేరు. అది కాల్బలం కన్నా శక్తివంతమైనది. పురాతన కాలంలో భారత దేశంలో ఏనుగు దళాలతో శత్రువుల -- వారు ఇతర దేశాలనుంచి వచ్చిన వారు అవ్వవచ్చు -- గుండెలలో భయాన్ని కల్పించేవారు. అది మన అహంకారంకి చిహ్నం. అది క్రోధం, భయం కన్నా అనేక రెట్లు అధికం. వీటన్నిటినీ దాటుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి. బుద్ధుడు కూడా దీనంతటి కష్టేతరము లేదని చెప్తాడు. అలాగే వీటిని జయిస్తే దాని వలన కలిగే ఆనందం వర్ణనానీతం.

ఉదయం లేచిన దగ్గరనుంచీ ఈ యుద్ధం మనలో సాగుతూనే ఉంటుంది. గడియారం మ్రోగగానే, వెంటనే లేవాలా లేదా ఇంకొంత సేపు నిద్ర పోవాలా అనే అంతర్యుద్ధం మొదలవుతుంది. మంచం మీదనుంచి గడియారం మ్రోగిన వెంటనే లేవడం ఉత్తమం. అలాగ కొన్నాళ్ళు అలవాటు పడితే మొదటి పోరు గెలిచినట్టే.

కాలకృత్యాలు తీర్చుకొని ధ్యానం అయిష్టంగా చేయాలా వద్దా, లేక ఆ రోజు దినపత్రిక కాఫీతో చదవాలా అనే సంశయం మొదలవుతుంది. అలా౦టప్పుడు ధ్యానాన్ని ఎంచుకొంటే రెండవ పోరులో గెలిచినట్టు.

ధ్యానం ఆరంభించిన తరువాత కళ్ళు మూతలబడి నిద్రపోవాలనే ఆలోచన రావచ్చు. ధ్యానం బాగా సాగితే, దానిని యోగనిద్ర అంటారు. యోగ నిద్రతో పోరు తలపెట్టుకోవడం వృధా. కానీ మనం ముందుకు సాగాలంటే దానితో పోరాడక తప్పదు. ఈ సమస్య ధ్యానం చేసినంత కాలం ఉంటుంది. మొక్కై త్రుంచబడనిది మానై త్రుంచబడునా అనే నానుడి ననుసరించి యోగనిద్రని ఎదుర్కోవడమే ఉత్తమం.

ధ్యానం తరువాత ఏదో తినాలి. ఇక్కడ మనకి చాలా ఎన్నికలు ఉన్నాయి. చద్ది, బ్రెడ్, సీరియల్, మొదలైనవి. వాటిలో ఏది ఆరోగ్యానికి, శరీర పోషణకి అవసరమో వాటినే తినాలి. ఉదాహరణకు ఎక్కువ శాతం కొవ్వు ఉన్న పదార్థాలను ప్రక్కన పెట్టవచ్చు. అలాగే కాఫీ కొంచెమే త్రాగవచ్చు. క్రమంగా కాఫీని త్యజించవచ్చు ఎందుకంటే అది శరీర పోషణకు సహకరించదు. నేను ధ్యానంలో విసుగు చెందకూడదని చెప్పడం ఇందుకే. జీవితంలో విసుగు చెందితే మన పోరు విజయవంతం కాలేదు.

తరువాత ఉద్యోగం. కొందరు అతి తక్కువ శ్రమ పడి, ఎక్కువ లాభం కలిగితే బాగుండునని అనుకొంటారు. అది తమకు, తక్కిన వాళ్ళకి తీరని నష్టం. కావున మేనువంచి పని చేయడం ఉత్తమం. విరామ సమయంలో అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, మంత్ర జపం చేసుకోవడానికి అనువైన కాలం. ఇంటికి తిరిగి వాహనం మీద వెళ్తున్నప్పుడు, ఈ పోరు సాగుతూనే ఉండి, మనకు ప్రమాదం, లేదా ఇతరులకు హాని కలగడం జరగచ్చు.

రోజులో ఇంతవరకూ జరిగిన పోరు తరువాత, ఇంటికి వచ్చి సుఖంగా విశ్రమించవచ్చని అనుకోవచ్చు. ధ్యానం మరుసటి రోజు చేయవచ్చని తలంచవచ్చు. ఇందిలో తెలిసికోవలసినది ఏమిటంటే మన ప్రత్యర్థి ఒక పద్ధతిలో మనతో పోరు చేయడు. మన ఇంట్లో, పిల్లలతో, భాగస్వామితో అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు. మొదట్లో అది కష్టమనిపించినా క్రమంగా అందులో సాఫల్యం పొందుతాము.

అలాగే మన చుట్టుప్రక్కల ఉంటున్న వాళ్ళకై కొంత సమయం కేటాయించాలి. వాళ్ళు మనని ఎంతో శాంత హృదయము గలవాడని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనలోని అంతర్యుద్ధం గురించి వాళ్ళకి తెలియదు కనుక.

మీరు ఈ విధంగా రోజు గడుపుతే చివరకు విజయం వరిస్తుంది. ఎటువంటి తల్ప౦ మీద పడుకొన్నా రాని విశ్రాంతి, దైనింద కార్యములను జయించినందువలన వస్తుంది. ఇదే ఆధ్యాత్మిక జీవిత౦ కోరే కుటుంబీకుల సాధన. ఆ తరువాత మంత్ర జపం చేసికొ౦టే దేవుని చేతుల్లో విశ్రాంతి తీసికొన్న అనుభవం వస్తుంది. మంత్ర మహిమ వలన, ఆ రోజు జరిగిన యుద్ధంలో కలిగిన గాయాలు మాని, మరుసటి రోజు చేయవలసిన యుద్ధానికై దేహము, మనస్సు సిద్ధ పడతాయి. మనకు దేవుని గురించయి ఈ యుద్ధాన్ని సాగిస్తే, దేవుడు మనకు కావలసిన ఆరోగ్యం, బలం, ఓర్పు ప్రసాదిస్తాడు. ఇలాగ జీవిత కాలం భగవదార్పణకై కొనసాగిస్తే, చివరకు దేవుడుతోనే ఐక్యమవుతాము. 99

Eknath Gita Chapter 8 Section 2

Bhagavat Gita

8.2

అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వాకళేబరం {8.5}

యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః

ఎవడు మరణకాలము నందు నన్నే స్మరించుచు దేహమును త్యజించుచున్నాడో అతడు నిస్స౦శయముగ నన్నే పొందు చున్నాడు

యం యం వా అపి స్మరన్ భావం త్యజ త్యంతేకళేబరం {8.6}

తం తమేవైతి కౌ౦తేయ సదా తద్భావ భావితః

కౌ౦తేయా! ఎవడు దేహమును వదలునపుడు ఏ యే భావములను స్మరించుచు మరణించునో వాడు తద్భావ జనిత సంస్కారముచే తద్రూపామునే పొందుచున్నాడు

ఈ శ్లోకములు గొప్ప ఆధ్యాత్మిక సిద్ధాంతమును ప్రతిపాదిస్తున్నవి. మనం దేనినైతే ఎక్కువ మననం చేస్తామో, దేనికైతే ఎక్కువ శ్రమ పడతామో, దేనినైతే ఎక్కువ కోరుకొ౦టామో, మరణ సమయమున అది చేతన మనస్సును నిండి ఉంటుంది.

పునర్జన్మ అంశముపై చాలా మందికి కుతూహలము ఉంది. వారు క్రిందటి జన్మలలో తాము ఎవ్వరమని అడుగుతారు. నేను అనేది: "వారు ఈ జన్మలో ఎవ్వరని తెలిసికున్నారా?" కాని మన శాస్త్రంలో పునర్జన్మ,గాఢమైన కోర్కెల వలన కలుగుతుందని చెప్పబడినది.

ఉపనిషత్తులు మన నిద్రావస్థ మూడు దశలలో జరుగుతుందని చెప్పినవి. ఆ మూడింటికి అధిష్ఠాన దేవతలు వైశ్వానరుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. ఆ మూడు దశలు వేకువలో౦చి కలలు కనే అవస్థ లేదా స్వప్నావస్థ, దానినుండి సుషుప్తి అవస్థ. శాస్త్రజ్ఞులు స్వప్నావస్థలో మనస్సు వేకువలోని వివిధ విషయాలను మనకు పునరావృతం చేస్తుంది అని చెప్తారు. కాని సుషుప్తిలో మనస్సు, శరీరం అచేతనమై, మనకు ఎటువంటి జ్ఞానము కలుగదు. నిద్ర లేచిన తరువాత మనకు మంచి నిద్ర పట్టినదని జ్ఞానము తప్ప ఇంకేమీ తెలియదు. ముఖ్యంగా మనమందరికీ సుషుప్తి సమానంగా ఉంటుంది. తక్కిన దశలు వేర్వేరుగా ఉంటాయి. అన్నమయ్య పాడిన సంకీర్తనము "నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే; అండనే బంటు నిద్ర అదియూ నొకటే" దానికి నిదర్శనము. ఉపనిషత్తులు "సుషుప్తిలో మన వ్యక్తిత్వము ఎక్కడ ఉన్నది?" అని ప్రశ్నించినవి. సుషుప్తిలో మనకు కోర్కెలు, భయాలు మొదలైనవాటి గురించి ఎరుకలేదు. అవి అచేతన మనస్సులో దాగి యున్నవి. నిద్ర లేచిన వెంటనే అవి తిరిగి మన చేతన మనస్సులోకి వస్తాయి.

ఉపనిషత్తులు సుషుప్తి యొక్క అనుభవము, మన జనన మరణాలకు నిదర్శనమని చెప్తాయి. మనము మరణించిన తరువాత సుషుప్తిలో లాగ చేతనమును, దేహమును వీడి, మన కోర్కెలు, భయాలు స్వప్నావస్థలో ఉన్నట్టు స్వప్న శరీరంలో ఉంటాయి. ఆ తరువాత ఆత్మ మరొక దేహమును పొంది క్రొత్త జీవితమునకు శ్రీకారం చుడుతుంది.

ఇది అవగాహనకు రావడం కష్టము. కానీ అందరూ ఒప్పుకునేది: మనము దేనినైతే గాఢంగా కోరుకొ౦టామో, దేనికైతే మన మనస్సు ఏకాగ్రతతో ఉంటుందో, అది మరణ సమయంలో కూడా చేతన మనస్సు నిండి ఉంటుంది. కావున మనము ప్రతిరోజూ చేసే కార్యములు మన విధిని నిర్ణయిస్తాయి. మనమొకరోజు నిద్రనుండి లేచి ఇతరులతో వేర్పాటు కోరుకోము. అలాగే కలసిమెలసి ఉండడం ఒకే రోజులో రాదు. దానికై మనము మనసా వాచా కర్మా ఇతరుల క్షేమమునకై సాధన చెయ్యాలి. నేనొక హోటల్ లో "మీరు మీ తినే విధంగా ఉంటారు" అని వ్రాయబడిన సూచనను చూసేను. అదే నిజమైతే మనము మూడు పూటలా మంచి ఆహారం తిని ఆరోగ్యంతో, భద్రతతో ఉండవచ్చు. నిజానికి మనం తినేది మన దేహాన్ని మలుస్తుంది. ధమ్మపాదలో బుద్ధుడు ఇలా చెప్పెను: "మనమే ఆలోచనలు చేస్తామో, ఆ విధంగా ఉంటాము".

మహాత్మ ఆఫ్రికా కి వెళ్ళినపుడు అక్కడ శాఖాహార హోటళ్ళు లేక, తన వంట తనే చేసికొన్నారు. మంగలి కొట్టులో తెల్లవారు తప్ప తక్కిన వారలను నిషేధించడము వలన తన క్షవరం తానే చేసికొన్నారు. ఆయన నేనేమీ చేయలేను అని ఎన్నడూ అనుకోలేదు. ఆయన ప్రతీ చిన్న విషయము దగ్గర నుంచి అతి పెద్ద సమస్యలైన దేశ స్వతంత్రము వరకూ, ఒకే రకమైన పరిశీలన చేసేరు.

మైస్టెర్ ఎక్ హార్ట్ ఇలా వ్రాసెను: "ఎవడైతే మనస్సు నిండా దేవుని నింపుకొని, దేవుని అన్ని కర్మలలోనూ తలచుకొంటాడో, దేవుని తనతో ఎక్కడికి వెళ్ళినా తీసికెళతాడో, వాని క్రియలన్నీ దేవుడే చేస్తాడు." మహాత్మా లాంటి వారు ఇతరులలోని దేవుడిని చూసి, వారికై పాటు పడి, దేవుని ప్రతి కార్యక్రమంలోనూ చూస్తారు. మహాత్ముడు హత్య చేయబడినప్పుడు "హే రామ్" అని శ్వాస విడిచేరు. అనగా ఆయన చేతనములో ఇతరులయందు ఎట్టి ద్వేషము లేదు. శ్రీకృష్ణుడు "మరణము ఆసన్నమైనప్పుడు నా యందు ప్రేమతో నీ హృదయము నిండి ఉంటే, నీ చేతన మనస్సు నాపై ప్రేమతో కూడియు౦టే, నువ్వు నిస్స౦శయంగా నా దగ్గరకే వస్తావు" అని చెప్పెను. ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యక్తులు చేతన మనస్సులో భగవంతుని ప్రేమతో నింపుకొని, మరణావస్థలో కూడా దేవుని స్మరించుకొన్నారు. మన దేహాలు బాధను అనుభవించవచ్చు. కాని వాటి లోపల ఏ బాధా అంటని, భావోద్వేగము లేని ఎరుక ఉన్నది. 95

Eknath Gita Chapter 8 Section 1

Bhagavat Gita

8.1

అర్జున ఉవాచ :

కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మ౦ కిం కర్మ పురుషోత్తమ {8.1}

అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే

పురుషోత్తమా! బ్రహ్మ మనగా నేమి? అధ్యాత్మ మనగా నేమి? కర్మమనగా ఎట్టిది? అధి భూతమని చెప్పబడునది ఏది? అధి దైవమని దేనిని పిలుతురు ?

అధియజ్ఞః కథం కో అత్ర దేహో అస్మిన్ మధుసూదన! {8.2}

ప్రయాణకాలే చ కథం జ్ఞేయో అసి నియతాత్మభిః

మధుసూదనా ! అధియజ్ఞ్నుడనగా నెవరు? ఈ దేహము నందు అతనిని ఎట్లు గ్రహింపవలెను ? మనోనిగ్రహము గల యోగులు మరణకాలమున నిన్నెట్లు తెలిసి కొందురు? నా కీ విషయములను తెలుపుము.

శ్రీ భగవానువాచ:

అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మ ముచ్యతే {8.3}

భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః

నాశరహితమైన సర్వోత్కృష్టమైనదియే బ్రహ్మము. స్వభావము అధ్యాత్మ మనబడును. సకల ప్రాణులకు ఉత్పత్తి కారణమైన విసర్గము కర్మమనబడును

అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం {8.4}

అధియజ్ఞో అహమేవాత్ర దేహే దేహభృతాం వర

అర్జునా! ఈ దేహమునందు నశించు స్వభావము గలది అధిభూతము. పురుషుడు అధిదైవతము. అధియజ్ఞుడను నేనే. ఀ

అర్జునడు తనకు శ్రీకృష్ణుడు ఇంతకు ముందు చెప్పిన విషయముల పై కలిగిన సందేహాలను శ్రీకృష్ణుడు ద్వారా తీర్చికొనుచున్నాడు. ముఖ్యంగా "జీవుని మార్పులన్ని౦టిలోకీ అతి పెద్దదైన మరణం సంభవించినపుడు, చేతన మనస్సులో నిన్ను ఎలా గుర్తించ గలను? నీతో మమేకమై మరణాన్ని ఎలా దాటుతాను?"

చాందోగ్య ఉపనిషత్తులో శ్వేతకేతుడనే బాలుడు, గురువు దగ్గర విద్యనభ్యసించి ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని బ్రహ్మన్ గూర్చి అడుగుతాడు. దానికి బదులుగా వాని తండ్రి తత్ త్వం అసి అనే మహావాక్యాన్ని బోధిస్తాడు. దాని పదార్థము (meaning) బ్రహ్మన్, మన ఆత్మ రెండూ ఒకటే.

ఇది అర్థం చేసికోవడం కొంచెం కష్టమైనప్పటికీ, ఉపనిషత్తులు అనేక శ్లోకాలతో దానిని వివరిస్తాయి. ఒక సాలెపురుగు ఎలా అయితే తన గూడును తనచుట్టూ అల్లుకుంటుందో, అన్ని మార్పులకు, పరిమితులకు అతీతుడైన బ్రహ్మన్ తననే సృష్టిగా మార్చుకొన్నాడు. దీనిని సృష్టి కార్యమనేకాక పరివర్తనము అని కూడా అనవచ్చు. అది మాయచే జరగబడి దేవుని అంశను సృష్టిలోని ప్రతి పదార్థములోనూ నిక్షిప్తము చేయబడినది. శ్రీ రామకృష్ణ బ్రహ్మన్ మరియు మాయ విడదీయ బడనివి అని చెప్పెను. ఎట్ల౦టే మనం అగ్నిని, అది మండించగల శక్తిని విడదీయలేము. మండించలేని అగ్నిని ఊహించలేము. శ్రీకృష్ణుడు చెప్పేది: సృష్టి దేవుని కన్న అన్యమైనది కాదు. ప్రతి పదార్థము దేవునిచే ప్రభావితమై, దేవుడు అంతటా ఉన్నాడు.

జీవులలో అట్టి పరమాత్మని అధ్యాత్మ లేదా ఆత్మ అందురు. అధిభూతమనగా పంచ భూతాలతో చేయబడిన దేహము. ఆత్మ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహమును ధరించి యున్నది. ఉదాహరణకి మన చిన్నప్పటి దేహము నడి వయస్సులోది కాదు; నడి వయస్సులోని దేహము వృద్ధాప్యములో లేదు. దేహము సదా మారుతూ ఉంటుంది. కాని మార్పుచెందే దేహమును ధరించు దేహి మార్పు చెందుట లేదు.

దీని వలన తెలిసేదేమిటంటే మనకు దేహము భగవంతుడు ఇచ్చి దానిని తిరిగి తీసికొంటాడు. ఈ మధ్యలో దాన్ని బాగా చూసుకొనే బాధ్యత మనకుంది. అంటే దానిని మంచి ఆహారంతో పోషించడం, దానికి తగిన వ్యాయామం ఇవ్వడం, సరిపడిన విశ్రాంతి ఇవ్వడం, మొదలైన కర్మలు.

అధిదైవ అనగా మనలో నిక్షిప్తమై, మనని నియంత్రించునది. అది మన శరీరమునకే పరిమితము కాదు. సృష్టి లోని ప్రతి ఒక్కటీ దేవునిచే నియంత్రింప బడుచున్నది. సూర్యునిలోని ఉష్ణము, కాంతికి అతడే కారణము. అట్లే పువ్వులు పూసిన చెట్లు, గురుత్వాకర్షణ శక్తి, మన జీవ కణాల్లో జరిగే మార్పులు, గుండె కొట్టుకోవడం ఇవన్నీ ఆ పరమాత్మ వలన -- వాటిలోన ఉండి -- జరుపబడుచున్నవి.

అధియజ్ఞ మనగా ఆ పరమాత్మ. అతనికి మన జీవితంలో చేసిన త్యాగము చెందుతుంది. మనమెప్పుడైనా ఇతరుల గురించి త్యాగం చేస్తే -- మనం చూడాలనుకొన్న సినిమా, మనం సలవులకు వెళ్ళాలనుకొన్న ప్రదేశానికి , మనమీద వెచ్చించాలనుకొన్న ధనం -- అది నిజానికి మన ఆత్మ పొందుచున్నది. అలా అని ఇతరులకు ఆ త్యాగం వలన లాభం లేదని కాదు. కాని అది మనకు ఎక్కువ లాభం చేకూర్చి, మన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది.

ఆధ్యాత్మిక పురోగతికి అహంకారాన్ని వీడడం ఎంతో అవసరం. అట్టి త్యాగం మన బదులు వేరొకరు చేయలేరు. అంటే మనమే చెయ్యాలి. గురువులు మన ఆధ్యాత్మిక ప్రయాణ మార్గములో సూచికలు వంటివారు. కానీ ఆ ప్రయాణం చేసేవారలము మనమే. మన సాధన ఉంకొకరు చెయ్యరు. ధ్యానం మనంతట మనమే ఉత్సాహంతో చెయ్యాలి. అలాగే ఇతరులతో వేర్పాటు తగ్గించుకోవాలి.

మన అహంకారాన్ని ఒక రోజులో తీసేయలేము. దాన్ని ఒక పెట్టె లో పెట్టి బంధించ లేము. ఎందుకంటే అది పట్టే పెట్టె చేయలేము కనుక. అందుకే సాధనలో క్రమంగా దాన్ని తగ్గించుకుంటూ రావాలి. ఒకానొక రోజు దేహము, మనస్సుతో కలిగిన తాదాత్మ్యము విడిబడుతుంది. సూఫీ ఆల్-ఘజాలీ మరణిస్తూ ఈ విధంగా చెప్పెను:

నా మిత్రులు నా మృత దేహమును చూసి ఏడిస్తే

"వానిని ఈ దేహంగా తప్పుగా అర్థం చేసికొన్నారా?" అని అడగండి

వాళ్ళకి చెప్పండి దేవుడి మీద సాక్షిగా

ఈ మృతదేహము నేను కాదని.

అది భూమి మీద నే బ్రతికినంత కాలం వేసికొన్న వస్త్రము మాత్రమే 92

Eknath Gita Chapter 7 Section 25

Bhagavat Gita

7.25

సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః {7.30}

ప్రయాణకాలే అపి చ మాం విదు ర్యుక్తచేతసః

అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము నేనే అని ఎవరు గ్రహించుచున్నారో వారు మరణకాలము నందు కూడా మనస్సును నా యందుంచి నన్నెరుగుదురు ఀ

ఎవరైతే ఆధ్యాత్మిక జీవనం అవలంబించి, ధ్యానము చేయుదురో వారికి జగతియొక్క ఏకత్వము విదితమగును. చివరగా దేవుని అన్నిటియందు చూచెదరు: ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, జంతువులు, పక్షులు, మనుష్యులు వగైరా. దేవుని ఇట్లు చూడువానికి గాలి చెట్లను కదిలించు శబ్దము దేవుని గుసగుసలుగా తలచును; సముద్ర కెరటాలు చేయు శబ్దము మంత్ర జపముగా వినును. ప్రతీదీ శ్రీ కృష్ణుని మయ౦.

ఈ విధముగా చేతన మనస్సులో భగవంతుని ధ్యానించు వానికి మరణముయందుకూడా చేతనమును విడువడు. నా అమ్మమ్మ రోజూ ఉదయాన్నే శివుని గుడికి వెళ్ళి, ఒక పుష్పాన్ని తెచ్చి నా చెవి వెనక పెట్టి "నువ్వు మార్కా౦డేయుడవంటి భక్తుడివి అవ్వు" అని దీవించేది.

మార్కా౦డేయుని తలిదండ్రులు శివభక్తుడిని తమకు బిడ్డగా ఇవ్వవలసిందిగా ఘోర తపస్సు చేసేరు. దానికి ప్రతిఫలంగా మార్కా౦డేయుడు వాళ్ళకి బిడ్డగా కలిగేడు. కాని అతడు పదహారవ ఏట మరణిస్తాడు. వారు కోరినట్టే మార్కా౦డేయుడు గొప్ప శివ భక్తుడయ్యాడు.

వాని 16 వ జన్మ దినము నాడు తలిదండ్రులు యముడు వచ్చి అతనిని తీసికివెళ్తాడని చెప్పేరు. మార్కా౦డేయుడు శివునిని ధ్యానిస్తూ ఉండగా యమధర్మరాజు రానే వచ్చేడు. అంతలోనే శివుడు ప్రత్యక్షమై "నా పాదాల మీద పడి రక్షణ కోరేవారు నీ వసులు కాలేరు" అని చెప్పి మార్కా౦డేయుడిని తలపై తన అభయహస్తం ఉంచి "మార్కా౦డేయుడు నా శక్తి వలన జరామరణ వర్జితుడైనాడు" అని దీవించెను. 87

Eknath Gita Chapter 7 Section 24

Bhagavat Gita

7.24

జరామరణ మోక్షాయ మా మాశ్రిత్య యతంతి యే {7.29}

తే బ్రహ్మ తత్విదుః కృత్స్న మధ్యాత్మ౦ కర్మచాఖిలమ్

ఎవరు నన్ను ఆశ్రయించి జనన మరణములను పోగొట్టు కొనుటకు యత్నించుచున్నారో వారు పరబ్రహ్మ స్వరూపమును, తమ ఆత్మను , సకల కర్మమును తెలిసికొనుచున్నారు

నేను ఒకరోజు బడినుంచి ఇంటికి వచ్చినప్పుడు నా అమ్మమ్మ ఎందుకు విచారంగా ఉన్నావని అడిగింది. "నేను ఒక దుర్వార్త విన్నాను. మా భూగోళ శాస్త్రం తరగతిలో సూర్యునితో పోలిస్తే మనము అల్పాతి అల్పం అని ఉపాధ్యాయుడు చెప్పేడు" అని అన్నాను. దానికి అమ్మమ్మ నవ్వి "సూర్యుడు ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోతాడు. కానీ నువ్వు నేను ఎన్నటికీ ఉండేవారమే" అని అంది.

మనము పుట్టలేదు, మరణించబోము. మన ఆత్మ శ్రీకృష్ణుడు చెప్పినట్లు, ఒక పాత శరీరాన్ని వదిలి క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి సూర్యుడు మనతో పోలిక పెడితే ఒక యుక్త వయస్కుడు. ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుడు 500 కోట్ల సంవత్సారల క్రింద పుట్టేడని. భవిష్యత్తులో కొన్ని వందల కోట్ల సంవత్సరాల తరువాత సూర్యుని లోని హీలియమ్ అనబడే ఇంధనం అయిపోయి సూర్యుడు ఆరిపోతాడు. ఈ సృష్టిలో పుట్టినది గిట్టుతుంది. మరణించినది మరల పుడుతుంది. కానీ ఆత్మ ఎన్నటికీ ఉంటుంది. అది అన్నిటినీ చూసే సాక్షి.

ధ్యాన అభ్యాసము చివరి స్థితిని సమాధి అంటారు. అ స్థితిలో మనము చేతన మనస్సుకు అతీతమై, మన శరీరము అందరి మేలుకై ఇవ్వబడిన పని ముట్టని తెలిసికొ౦టాము. నెహ్రూ మహాత్మా గాంధీ గురించి ఇలా అన్నారు: "ఆయన ఎక్కడ కూర్చొంటే అక్కడ గుడి వెలుస్తున్నట్టే. ఆయన ఎక్కడ అడుగుపెడితే అది పుణ్యక్షేత్రం అయినట్టే". మనము కూడా ఇతరుల సంక్షేమానికై పాటుబడి మనవంతు కర్మ చెయ్య వచ్చు. బుద్ధుడు దీనినే బహుజనహితాయ, బహుజనసుఖాయ --అనగా అనేక మంది సంక్షేమానికై, అనేకమంది సుఖానికై -- అని చెప్పెను. 86

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...