Saturday, April 9, 2022

Eknath Gita Chapter 8 Section 10

Bhagavat Gita

8.10

సహస్ర యుగ పర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః {8.17}

రాత్రిం యుగసహస్రా౦తాం తే అహో రాత్రివిదో జనాః

ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని వేయి యుగముల కాలముగను, అట్లే రాత్రిని వేయి యుగముల కాలముగను తెలియుదురో అట్టివారు రాత్రింబవళ్ళు యొక్క పరిణామమును తెలిసికొని యున్నారు

అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవం త్యహరాగమే {8.18}

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త స౦జ్ఞకే

బ్రహ్మదేవునికి పగలు ప్రారంభమగునపుడు అవ్యక్తము నుండి సర్వ భూతములు ఆవిర్భవించుచున్నవి. మరల రాత్రి ప్రారంభము కాగానే అట్టి అవ్యక్తము నందే విలీనమగుచున్నవి

భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే {8.19}

రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవ త్యహరాగమే

పార్థా! సర్వభూతములు బ్రహ్మకు పగలగునపుడు ఆవిర్భవించుచు, రాత్రియైనపుడు అంతరించుచు జనన మరణములను మరల మరల పొందుచున్నవి ఀ

మన పురాణాల్లో కాలాన్ని 4 యుగాలుగా విభజించేరు. మొదటిదైన సత్య యుగంలో ప్రతి ఒక్కరూ నిస్వార్థపరులై భూమి స్వర్గతుల్యంగా ఉండేది. దీనిని ఒక ఎద్దు నాలుగు కాళ్లతో నిలబడుతున్నట్టు చిత్రీకరిస్తారు. క్రమంగా ఎద్దు మూడు కాళ్ళ మీద నిలబడి, త్రేతాయుగము ఆవిర్భవించింది. ఈ యుగంలో మనుష్యులు లోభం, స్వార్థం, మోహంతో ఉండేవారు. ఎద్దు రెండు కాళ్ళ మీద నిలబడినప్పుడు ద్వాపర యుగం అన్నారు. ఈ యుగంలో నీకు సగం, నాకు సగం అనే భావన కలిగి, ఒకడు తనకై బ్రతుకుతాడో లేక ఇతరుల మేలుకై పాటు పడతాడో చెప్పలేని స్థితి కలిగింది. చివరగా ఎద్దు వంటి కాలి మీద నిలబడినప్పుడు ప్రస్తుతం మనముండే కలియుగం వచ్చింది. కలి అనగా క్రోధం, హింసలతో కూడినది.

ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహా యుగమవుతుంది. వెయ్యి మహాయుగాలు ఒక కల్పం అంటారు. అది బ్రహ్మ దేవునికి ఒక రోజు కాలము. బ్రహ్మ లేచిన వెంటనే నామ రూపాత్మకమైన సృష్టి ప్రారంభమవుతుంది. పదార్థము, శక్తి, దేశకాలాలు ఆవిర్భవిస్తాయి. కొందరు ఋషులు లెక్కలుకట్టి బ్రహ్మదేవుని ఒక రోజు 432 కోట్ల సంవత్సరాలు అని చెప్పేరు.

బ్రహ్మ సృష్టిని సృజించి అలసిపోయి నిద్రపోతాడు. సృష్టి బ్రహ్మదేవుని ఆలోచనలో ఉన్నదికాబట్టి, బ్రహ్మ ఎప్పుడు పడుకుంటాడో, అది అవ్యక్తం లోకి పోయి అంతరిస్తుంది.

ఖగోళ శాస్త్రజ్ఞులు మన సృష్టి బిగ్ బ్యాంగ్ వలన కలిగిందని అంటారు. మరికొందరు సృష్టి సృజింప బడలేదు ఎప్పుడూ నిలకడగానే ఉంది అంటారు.

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మన శాస్త్రాలు చెప్పినదానికి దగ్గరగా ఉంటుంది. అబ్బే జార్జ్స్ హెన్రీ లెమైటెర్ అనబడే బెల్జియన్ ప్రీస్ట్ సృష్టి 1000 కోట్ల సంవత్సరముల క్రింద ఆరంభమైనదని చెప్పేడు. దాని ద్రవ్య రాశి సుమారుగా ఇప్పటి లాగాఉండి, ఒక చిన్న ముద్ద వలె ఉండెను. దానిని ఒక గ్రుడ్డుతో లేదా అణువుతో పోలుస్తారు. అదే బ్రహ్మాండం అని కూడా పిలువబడుతుంది. ఆ దశలో దేశకాల మానాలు లేవు.

లెమైటెర్ విశ్వంలోకి క్రొత్త ద్రవ్యం రాక, తయారవక ఒకనాటికి అంతమౌతుందని తలచేడు. కానీ శాస్త్రజ్ఞులు అంగీకరింపక ఇలా అన్నారు: విశ్వం నలుదిక్కుల వ్యాపించి నప్పుడు, గురుత్వాకర్షణ సిద్ధాంతం వలన, మళ్ళీ వెనక్కి వచ్చి గ్రుడ్డు వలె పరివర్తిస్తుంది. కొంత వ్యవధి తరువాత మళ్ళీ విస్ఫోటించి, సృష్టి మొదలవుతుంది. ఈ విధంగా విశ్వ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. బ్రహ్మ దేవుడు పగలు మేల్కొని, రాత్రి విశ్రమించి యున్న౦త కాలమూ ఈ విశ్వ చక్రం కదులుతూనే ఉంటుంది.

సృష్టి ఆవిర్భవించలేదు, అది ఎప్పుడూ నిలకడగా ఉందనేవారు, దానికి మొదలు అంతము లేదని చెపుతారు. వారు విశ్వం వ్యాపిస్తూఉంటే క్రొత్త ద్రవ్యము సృజింపబడుతుందని నమ్ముతారు.

సర్ ఫ్రెడ్ హోయిల్ అనబడే శాస్త్రవేత్త నిలకడ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసినవాడు.

ఆయన చెప్పేది ద్రవ్య రాశికి (mass) మొదలు ఉంది గానీ విశ్వానికి ఆద్యంతములు లేవు. అది ద్రవ్యం కన్నా విశాలమైనది. అది ప్రతిచోటా ఉంది. ఇదే శ్రీకృష్ణుడు కూడా చెప్పేడు. విశ్వం అతని కుక్షిలో ఉన్నది. హోయిల్ గురుత్వాకర్షణ శక్తి, అణు శక్తి వలె ద్రవ్య శక్తి ఉండి, దాని నుండి క్రొత్త ద్రవ్యము సృజింపబడుతుందని చెప్పెను. పాత ద్రవ్యము ద్రవ్య శక్తిలోకి వెనక్కి తీసికోబడుతుంది. ఇదే యోగులు విశ్వసించేది కూడా.

ఒక క్రొత్త సిద్ధాంతంలో ద్రవ్యము మారుతూ ఉంటుందని చెప్పబడినది. ద్రవ్య శక్తి వలన ద్రవ్యము ఆవిర్భవిస్తుంది. ఈ ద్రవ్య శక్తి విశ్వ వ్యాప్తమైనది. ఐన్స్టీన్ వంటి శాస్త్రజ్ఞులు దీన్ని ప్రతిపాదించేరు. ఈ మధ్య దానిని హిగ్గిన్స్ బోసాన్ అనే పేరుగల పరమాణువుగా గుర్తించేరు. ఒక పదార్థము యొక్క ద్రవ్యము హిగ్గిన్స్ బోసాన్ చే నిర్ణయింప బడుతుంది. ఎక్కువ హిగ్గిన్స్ బోసాన్ లు ఉన్న క్షేత్రంలో ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పదార్థము ఒకటే అయినా దాని ద్రవ్యము మారుతూ ఉంటుంది. విశ్వం ఎప్పుడూ ఒకే పరిణామంలో ఉంటూ, బిగ్ బ్యాంగ్ వంటి విస్ఫోటములతో కూడి ఉంటుంది. కాబట్టి విశ్వం పుట్టునది కాదు, పోవునది కాదు.

ఇటువంటి సిద్ధాంతాల వలన శాస్త్రజ్ఞులు, ఋషులు మధ్యన ఉన్న అపోహలు తొలగుతాయి. ఈ అపోహ శాస్త్రీయ, ఆధ్యాత్మిక సిద్ధాంతాల వలన కాదు. మనము శాస్త్రజ్ఞులు చెప్పే సిద్ధాంతాలను ఋషులు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలతో అన్వయించుకోవాలి. సమాధి స్థితిలో ఒక ఉత్కృష్టమైన దశను తురీయమందురు. ఆ దశలో జ్ఞేయము-జ్ఞాత- జ్ఞానము అనే త్రిపుటి ఉండదు. పాలపుంతలతో, కృష్ణ బిలాలతో, నక్షత్రాలతో కూడిన విశ్వాన్ని దేవుడు, ఒక క్రీడాకారుడు బంతితో ఆడుతున్నట్టుగా, తన చుట్టూ తిప్పుకొంటున్నాడు అని తెలుస్తుంది. 121

Eknath Gita Chapter 8 Section 9

Bhagavat Gita

8.9

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతం {8.15}

నాప్నువంతి మహాత్మాన స్సంసిద్ధం పరమాం గతాః

ఉత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందిన వారై దుఃఖాలయమును, అనిత్యమునైన జన్మమును తిరిగి పొందరు

ఆ బ్రహ్మభువనా ల్లోకాః పునరావర్తి నో అర్జున {8.16}

మాముపేత్య తు కౌ౦తేయ పునర్జన్మ న విద్యతే

అర్జునా! బ్రహ్మలోక పర్యంతము గల లోకములకు వెళ్ళిన వారందరు తిరిగి పుట్టుచునే యున్నారు. నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మము లేదు

పై శ్లోకంలో శ్రీకృష్ణుడు పునర్జన్మ గురించి చెప్పుచున్నాడు. ధ్యానం అవలంబించి పునర్జన్మను నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు. మనం ఏమీ సాధన చేయకుండా పునర్జన్మ ఉంటుందని నమ్మవచ్చు. అలాగే పునర్జన్మ లేదని నమ్మి, ఈ జన్మలో నిస్వార్థంగా బ్రతకవచ్చు. పరిణామ సిద్ధాంతానికి, పునర్జన్మ సిద్ధాంతానికి మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. మనం తల్లి గర్భంలో ఒక కణంగా ప్రవేశించి, కోట్ల కణాలతో పరిణామం చెంది బయటపడ్డాం. సూఫీ యోగి జలాలుద్దీన్ రూమి ఇలా చెప్పేరు:

నేను అవ్యక్తంలోనుంచి వచ్చేను

జీవితం అనబడే అడవిలో నా గుడారం వేసికొన్నాను

నేను ఒక కణం, తరువాత ఒక కాయ

అటు తరువాత జంతువు అయ్యాను

క్రమంగా ఒక మంచి వాళ్ళ సంపర్కంతో మనిషినయ్యాను

నేను గుడుల చుట్టూ తిరిగేను

చివరకు దేవుని చేరే మార్గంలో పయనించి

ఆయన తలుపు దగ్గర బంటు నయ్యాను

నేను ఆయన వేరువేరుగా లేము

ఎందుకంటే నేను అతని యందు కలిసిపోయేను

టిబెట్ యోగులు మనకి రెండు శరీరాలున్నాయని చెప్తారు: ఒకటి స్థూలం; మరొకటి సూక్ష్మం. సూక్ష్మ శరీరం మన ఆలోచనలతో, భావాలతో ఉంటుంది. అది అభౌతికం. మన స్థూల శరీరానికి ఒడ్డూ, పొడుగూ మొదలగు లక్షణాలు ఉండి భౌతికంగా ఉంటుంది. దానిలో సూక్ష్మ శరీరం సంస్కారాలతో, తమస్, రజస్, సత్త్వ గుణాలతో కూడి ఉంటుంది.

మరణము సంభవించినపుడు సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని విడుస్తుంది. స్థూల శరీరం పంచ భూతాలతో కలిసిపోతుంది. పిదప మన సూక్ష్మ శరీరం బార్డో అనబడే స్థలానికి వెళుతుంది. అక్కడ చాలా కాలం వేచి ఉన్న తరువాత మరొక జన్మ వస్తుంది. మన ఉపనిషత్తులు దీనికి, సుషుప్తికి పోలిక లున్నాయని చెప్తాయి. సుషుప్తిలో మన సమస్యలు గుర్తుకురావు. మన దేహం గానీ మనస్సు గానీ ఎరుకలోకి రావు. కానీ మనం సుషుప్తినుండి మేల్కొన్న తరువాత అన్ని ఆలోచనలు తిరిగి వచ్చి మనం పూర్వంలాగే ఉంటాము. బార్డో కూడా సుషుప్తి లాంటిదే. మరణంలో మన చేతనమనస్సు దేహంతో విడిపడి, మనం కొంత కాలం ప్రశాంతతను పొందుతాము. అటు తరువాత ఇంకొక శరీరంలో ప్రవేశించి మేల్కొ౦టాం.

శ్రీకృష్ణుడు తనతో ఐక్యమయ్యేవరకు జన్మలు పొందుతూనే ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి మన౦ పునర్జన్మ పొందడం లేదా మోక్షం పొందడం మన చేతుల్లోనే ఉంది. మనం సత్కర్మలు చేస్తూ, మన కుటుంబానికీ, సమాజానికీ ఉపయోగకరంగా ఉంటే పునర్జన్మ ప్రస్తుత జన్మ కన్నా ఉత్కృష్టంగా ఉంటుంది. అలా కాక మనం స్వార్థంతో, ఇతరులకు హాని కలిగిస్తే మరు జన్మలో దానికి తగ్గట్టు నీచ స్థితికి వెళ్తాం. కాబట్టి మనం మన స్థితికి బాధ్యులం. మన తలిదండ్రులను, జీవిత భాగస్వామిని, పిల్లలను నిందించడం వ్యర్థం.

వేరే మాటల్లో చెప్పాలంటే మనమే జన్మలోనైనా సమస్యలను పరిష్కరించుకొని, ఉన్నత స్థితికి ఎదగవచ్చు. మనం దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇతరుల సంసారం మన సంసారం కన్నా ఉన్నతంగా ఉందని తలుస్తాం. నా అమ్మమ్మ "ప్రక్కింటి మల్లె పువ్వు మనదానికన్నా ఎక్కువ సువాసన కలది" అని అనేది. మనలో చాలా మందికి మంచి తలిదండ్రులు, మిత్రులు, పిల్లలు ఉంటారు. వారిలో లోపాలు కూడా ఉంటాయి. మన తలిదండ్రులు ఏ లోపాలు లేకుండా ఉంటే వారికీ జన్మ ఉండేది కాదు. కాబట్టి మన ప్రస్తుత జన్మ మన లోపాలను సరిదిద్దుకోవటానికై ఇవ్వబడినది. యోగులు చెప్పేది మనమందరము తప్పులు చేస్తాము; కొ౦త మోతాదులో తప్పులు చేయకపోతే మనం ఉత్తమ మార్గంలోకి వెళ్లలేము. కాబట్టి మన౦ భూత, వర్తమాన కాలాల గురించి చింతించనక్కరలేదు. ధ్యానం ద్వారా మన భవిష్యత్ ను ఉత్తమంగా మలచుకోవచ్చు.

జీవితం ఒక పాఠశాల వంటిది. మనం భగవదైక్య౦ చెందేవరకు లేదా ప్రాణుల ఐక్యతను తెలిసికొనేవరకు ఆ పాఠశాలకు వెళ్తూ ఉండవలసిందే. ఆత్మహత్య అతి నీచమైన క్రియ. భౌద్ధులు, హిందువులు ఆత్మహత్య చేసికొనేవారు మరల, మరల, జన్మించి, కష్టాలను ఎదుర్కొని తమ స్థితిని మెరుగు పరుచుకునేవరకు భగవదైక్యం పొందలేరు అని అంటారు. ఈ జన్మలో కష్టాలు ఎందుకంటే మనం వాటిని ఎదుర్కొని పరిష్కరించే మార్గాన్ని తెలిసికొనడానికి. అలా కాక పోతే మనం కష్టాల వలయంలో కూరుకుపోతాం. మనమే కష్ట స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని స్వార్థం తగ్గించుకొని, ఇతరుల శ్రేయస్సుకై పాటు పడాలని తలుస్తాడు. అతడు మనకు కష్టాలనుంచి గట్టెక్కించే సులభమైన మార్గాన్ని చూపడు. కానీ మన వేర్పాటును అధిగమి౦చి, భగవంతుడు అందరిలోనూ, మన శత్రువులనుకూడా కలుపుకొని, ఉన్నాడని తెలిసికొ౦టే మన జీవిత లక్ష్యాన్ని సాధించి మరు జన్మ పొందవలసిన అవసరం ఉండదు.

అర్జునుని అన్న ధర్మరాజు, అజాతశత్రు -- అనగా శత్రువులు లేనివాడు -- అనబడేవాడు. పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసము చేస్తున్న రోజుల్లో అనేకమంది ఋషులు వాళ్ళని పరామర్శించడానికి వచ్చేవారు. వారిలో ఒక ఋషి "మిమ్మల్ని కౌరవులు దేశంలో౦చి భహిష్కరించి అరణ్యాలకు పంపించినా నువ్వు అజాతశత్రుగా ఎందుకు ఉన్నావు?" అని అడిగేడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం ఇచ్చేడు: "నన్ను అరణ్యాలకు పంపించి, నా బంధు మిత్రులనుండి వేరు చేసింది నిజమే. కానీ నా రాజ్యాన్ని ఆక్రమించిన వాళ్ళు నా శత్రువులు కారు. ఇతరుల మేలుకై నేను వాళ్ళకు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. వాళ్ళు నన్ను శత్రువు అనవచ్చు. కానీ వాళ్ళు నాకెప్పుడూ మిత్రులే". అతడు దేవుని ప్రతి జీవిలో చూసినవాడు కాబట్టి తనను మోసగించి, తన రాజ్యాన్ని అపహరించిన వాళ్ళను కూడా మిత్రులిగా భావించేడు. ఇది మనం ముఖ్యంగా నేర్చు కోవలసిన పాఠం. పురాణాలు ధర్మరాజు మరణించిన తరువాత మరొక జన్మ లేకుండా భగవంతునితో ఐక్య మయ్యేడని చెప్తాయి. 116

Eknath Gita Chapter 8 Section 8

Bhagavat Gita

8.8

అనన్యచేతా స్సతతం యో మాం స్మరతి నిత్యశః {8.14}

తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః

పార్థా! ఎవడు అనన్య చిత్తముతో అనుదినము నన్నే స్మరించుచున్నాడో అట్టి నిత్య యుక్తు డగు యోగికి నేను సులభముగ, సుఖముగ లభింతును

బాల్యంలో మా ఇంటి ముందునుంచి ఆదివాసులు పందేలాడడానికి వెళ్ళేవారు. ఉదయాన్నే బస్సు ఎక్కి వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. సాయంత్రం మాత్రం బస్సులో వాళ్ళు నిశ్శబ్దంగా ఉండేవారు. నా అమ్మ వాళ్ళను చూసి జాలి పడేది.

మనం ఆహ్లాదనికి ప్రయత్నించాలని, లాభాన్ని జేబులో పెట్టుకోవాలని అనుకొంటూ ఉంటాం. కానీ మనమనుకున్నట్టు అవి ప్రతీసారీ జరగవు. భగవంతుడు మన ప్రయోగాలను కొంత వరకు చేయనిస్తాడు. కొంత కాలం తరువాత తన సిద్ధాంతాన్ని అమలు చేయిస్తాడు: అనగా మన ఇంద్రియ సుఖాల ద్వారా లేదా ఆస్తి, డబ్బు ద్వారా మనకు శాశ్వత సుఖము లభించదు. కేవలం ఇంద్రియ సుఖం కొరకే జీవిస్తే దాని వలన కలిగేది నిరాశ. ఆధ్యాత్మిక సాధనలో కొన్నాళ్ళు గడిపితే "అలాంటి జీవితాన్ని ఎవడికి సుఖమనిపిస్తుంది?" అని అడుగుతాము. మనచుట్టూ స్వార్థంతో, డబ్బుకై, ఆస్తులకై, అందరికన్న ముందుండాలనే భావంతో, బంధు మిత్రులతో పోటీ పడుతూ ఉండేవాళ్లు చాలా మంది ఉంటారు. వారికి చివరికి కలిగేది నిరాశే. ఒక యోగికి అది జీవితమే కాదు. శ్రీకృష్ణుడు "ఎవరైతే పగలు అంటారో, అది యోగికి అజ్ఞానంతో కూడిన అంధకారం" అని ముందు చెప్పెను.

ధ్యానంలో పరిపక్వత పొందుతున్న కొద్దీ మనము ఇంద్రియాల ప్రపంచంనుండి విడిబడతాము. ఆ స్థితిలో చేతనము క్షణికమైన సుఖాలను, స్వాధీనంలో ఉన్న వస్తువులను, వేర్పాటును వీడుతుంది. మన చైతన్యము స్వాధీనంలో ఉండి, ఇంద్రియాలు అంతర్గతమౌతాయి. చేతనము మనస్సులోనూ, మనస్సు ఆత్మలోనూ, మరణంలో లాగా లయమవుతాయి. తేడా ఎక్కడంటే మనము ధ్యానంలో చేతనముతో ఉండి ఉద్దేశ్యపూర్వకంగా చేసి మెలకువగా ఉంటూ, పరిపూర్ణమైన శాంతిని అనుభవిస్తాము. మరణంలో మన బంధాలాన్నిటినీ బలవంతంగా లాక్కోబడతాయి. కాని ధ్యానంలో వాటిని మనంతట మనమే వదిలేస్తాము. అటు తరువాత ఇంద్రియాలు మేల్కొ౦టే మనము ఇతరుల సంతోషాన్ని పంచుకొని, వాళ్ళతో సామరస్యంగా ఉంటాము. జీవితంలో మళ్ళీ తప్పు దారి పట్టం. ఎందుకంటే మన ఆత్మను పరమాత్మతో అనుసంధానము చేసేము. సెయింట్ పాల్ ఇట్లు చెప్పెను "నా అహంకారము మరణించినది. కాబటీ నాకు ఉంకో మరణం లేదు. జీసస్ క్రైస్ట్ ఇప్పుడు నాలో ఉన్నాడు."

ప్రతీ సాంప్రదాయంలో అటువంటి వ్యక్తులు ఉన్నారు: బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, శ్రీకృష్ణుడు, పరా శక్తి, మొదలగువారు. మనం ప్రజ్వలమైన సౌందర్యాన్ని చూడాలంటే ఎవరైతే తమ నిత్య జీవితాన్ని భగవంతునితో అనుసంధానము చేసి గడుపుతారో వాళ్ళను చూడాలి. ఒకరోజు నేను ధ్యానం చేస్తున్న బుద్ధుని విగ్రహాన్ని చూసి ఇలా అనుకొన్నాను: "నేను అతనిలా ఉండటానికి ఏమైనా చేస్తాను. ఇతరులు నా గురించి ఏమనుకున్నా ఫరవాలేదు. నేను బుద్ధుడి లాగే ఉండాలి". 111

Eknath Gita Chapter 8 Section 7

Bhagavat Gita

8.7

సర్వద్వారాణి సంయమ్య మనో హృది విరుధ్య చ {8.12}

మూర్ద్న్యాధాయాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మరన్ {8.13}

యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్

ఎవడు సకల ఇంద్రియ వ్యాపారములను నియమించి, మనస్సును హృదయము నందు నిలిపి, ప్రాణమును సహస్రారమునందు జేర్చి యోగయుక్తుడగుచు, బ్రహ్మవాచకమగు ఓంకారము నుచ్ఛరించుచు, నన్నే స్మరించుచు దేహమును విడిచి పోవుచున్నాడో వాడు సర్వోత్కృష్టమైన మోక్షమును పొందుచున్నాడు

ప్రతి ఒక్కరికీ మరణం గురించి తెలుసు. కానీ అందరికీ దాని మీద అవగాహన ఉండదు. చివరకు తీవ్ర అస్వస్థలో ఉన్నవారు కూడా. మన౦ మరణిస్తామని నిజంగా తెలిసుంటే దాని గురించ ఏదో ఒకటి చేస్తాము. అందుకే గీత ఉన్నది.

కొందరు రచయితలు ఇంద్రియాలను సంతృప్తి పరిచి దేహాన్ని వదలమని చెప్తారు. అనగా ఇంద్రియాలు అనుభవం లో ఉండగా దేహాన్ని వదలమని. గీత వేరొక విధం చెపుతుంది. మంచి విందుభోజనం చేసి, ఇంద్రియాలను ఆనందింపజేసి, మరణించడం పెద్ద విషయమేమీ కాదు. మన లక్ష్యం మరణానికి ముందు, మరణానికి తరువాత చేతనము అఖండితమై ఉండాలి. అందుకే మనం దశాబ్దాల తరబడి సాధన చేసేది.

ఉపనిషత్తులు ఈ విధంగా మరణాన్ని వివరించేయి: మొదట ఇంద్రియ శక్తి మనస్సులో లయమవుతుంది; తరువాత మనస్సు, ప్రాణ శక్తితో పాటు హృదయంలో లయమవుతుంది. అవి అన్నీ లోతైన చేతనములోకి ప్రవేశిస్తాయి. చివరికి ఆత్మ, మనస్సు యొక్క సంస్కారాలతో, గుండె నాడులలోంచి నిష్క్రమిస్తుంది. కొందరు యోగులలో ఆత్మ తల మీద ఉన్న సహస్రార చక్రం ద్వారా నిష్క్రమిస్తుంది.

మరణ సమయంలో ఇంద్రియాలు పనిచేయవు. మనకు ఆత్మ యొక్క ఎరుక ఉండాలంటే, మన ఏకాగ్రతను ఏదీ పాడు చేయకూడదు. వినడం, చూడడం చేయకుండా, అట్టి కోర్కెలు లేకుండా ఉండాలి. ప్రతీదీ ఆత్మ మీద ఏకాగ్రతతో ఉండాలి. మనలో చాలా మంది మరణము ఆసన్నమైనప్పుడు ఇంద్రియ లోలత్వం కోరి, మనస్సులో తీవ్ర అసంతృప్తికి గురి అవతారు. అప్పుడు మరణముపై తీవ్ర వేదన చెందుతారు. వారి అనుబంధాలు, అహంకారం మనస్సులో పాతుకు పోయి, వారిని విడనాడవు. అప్పుడు యమ ధర్మ రాజు వారిని బలవంతంగా ఈడ్చుకు పోవాలి. అది ఒక కదులుతున్న వాహనం యొక్క అద్దం లోంచి దూసుకు వెళ్లినంత కష్టం. ఇదే మరణం గూర్చి భయంకరమైన వేదన.

నేను మందులతో మరణాన్ని వేదనలేక పొందవద్దని చెప్పను. కానీ అవి కొంత వరకే పనికి వస్తాయి. మన వేదనను పూర్తిగా తొలగించలేవు. మనస్సును నిశ్చలంగా ఉంచాలంటే దానికి తర్ఫీదు మొదట్నించీ ఇవ్వాలి. అంటే దేవుని యందు ప్రేమ, సర్వ జీవులలో దేవుని గాంచుట మొదలగునవి. అనుబంధాలు, అహంకారం, స్పర్థ, క్రోధం, భయం లేకుండా ఉండాలి. దేహం బాధని అనుభవించినా, చేతన మనస్సులో ఏ బాధా లేక భగవన్నామస్మరణం చేస్తూ ఉండాలి.

ఎప్పుడైతే చైతన్యం మనస్సులోకి, మనస్సు హృదయం లోకి ప్రవేశించాయో మనం మనస్సును దాటి పోయేం. అంటే జ్ఞాపక శక్తి ఉండదు. ఇది చలా ముఖ్యాంశం. ఆ సమయంలో మన౦ గ్రంధాల్లో చదువుకున్న ఆధ్యాత్మిక విషయాలు గుర్తుకు రావు. అపజపమైన మంత్రమును -- అనగా మంత్రము అచేతనముగా జపించ బడుతుంది -- మన ప్రేరణ లేకుండా, జ్ఞాపక శక్తి అవసరం లేకుండా మననం చేయాలి. మనం మంత్రం జపించాలని జ్ఞాపకం పెట్టుకోనక్కరలేదు. దానంతట అదే సాగిపోతుంది.

ముండకోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడినది:

పవిత్రమైన శాస్త్రాలు అనబడే ధనుస్సును చేత బూను

దాని మీద భక్తి అనే బాణమును సంధించు

ధ్యానం అనే విల్లు తీగను ముందుకు లాగు

ప్రేమ పూరితుడైన దేవుని లక్ష్యంగా పెట్టుకో

ధనుస్సు మంత్రము, సాధకుడు బాణం,

దేవుడు లక్ష్యం; ధ్యానం అనే విల్లు తీగను

వెనక్కి లాగి, దేవుడనే లక్ష్యాన్ని గురిపెట్టి

కొట్టి, వానితో ఐక్యమవ్వు

గొప్ప యోగులకు మంత్రము సర్వకాల సర్వావస్థల యందు అచేతనంగా జపించ బడుతుంది. కాబట్టి వారికి మరణం అంటే భయం లేదు. మరణం ఆసన్నమైనప్పుడు, వారి చేతనము అఖండమై యుండును.

పై శ్లోకాల్లో చెప్పబడిన మంత్రము ఓంకారము. అది బాహ్య శబ్దం కాక, అంతర్గతంగా ఉండేది. గాఢ ధ్యానంలో దానిని వినవచ్చు. మన శాస్త్రాలలో దానిని కొట్టబడని ధ్వని అందురు. జెన్ యోగులు ఒక చేతితో చప్పట్లు అందురు. మన శాస్త్రాలలో ఓంకారము విశ్వవ్యాప్తమైన స్పందన అని చెప్తారు. యోగులకు ఓంకారము చేతన మనస్సులో వచ్చి పోతూ ఉంటుంది. కానీ మరణ సమయంలో చేతనము దేవునిపై ప్రేమతో నిండి ఉండి, వారిలో ఓంకారము హృదయంలో స్పందిస్తూ, వారికి తక్కిన శబ్దాలు వినబడవు. 109

Eknath Gita Chapter 8 Section 6

Bhagavat Gita

8.6

యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః {8.11}

యదిచ్ఛ౦తో బ్రహ్మచర్యం చర౦తి తత్తేపదం సంగ్రహేణ ప్రవక్ష్యే

వేదవేత్తలు దేనిని అక్షరమని చెప్పుచున్నారో, రాగరహితులగు యతులు దేనిని చేరుచున్నారో, దేని నభిలషించి జనులు బ్రహ్మచర్యము ననుష్ఠి౦చుచున్నారో అట్టి స్థానమును నీకు సంగ్రహముగ వివరించుచున్నాను

నేను చిన్నప్పుడు పెరిగిన గ్రామంలో చావు పుట్టుకలు కళ్ళారా చూసేవాడిని. ఎందుకంటే అక్కడ నివసించే వారు చాలా తక్కువ. కాబట్టి ఒకరి ఇంటిలోని వార్త గ్రామమంతా పాకుతుంది. అందువలన నాకు చిన్నప్పుడే జీవితం ఆశాశ్వతమని తెలిసింది. నా అమ్మమ్మ ఆ గ్రామంలో పెద్ద దిక్కు. ఎవరైనా మరణ శయ్యపై ఉంటే ఆమెను ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులు పిలిచేవారు.

అమ్మమ్మ నన్ను కూడా తనతో తీసికివెళ్ళేది. నా కుటుంబ సభ్యులు అందుకు విరుద్ధంగా ఉన్నా, అమ్మమ్మకు చెప్పడానికి భయపడి ఊరుకొనేవారు. ఆమె స్థిర చిత్తంతో ఆధ్యాత్మికతను అలవరుచుకొంది. నేను ఆమెతో చూసిన మరణాల వలన ప్రభావితుడనై మరణాన్ని దాటి వెళ్ళే మార్గాన్ని అన్వేషించాలి అని నిశ్చయించుకున్నాను.

నేను ఒకమారు నా అమ్మమ్మని జీవితంలో ఎందుకు బాధపడుతాం అని అడిగేను. ఆమె మితభాషి. సత్కర్మలు పాటించి, వానిని ఆచరణలో చూపిస్తుంది. ఆమె నన్ను ఒక కుర్చీలో కూర్చొని దాన్ని చేతులతో గట్టిగా పట్టుకోమంది. ఆమె నన్ను కుర్చీ లోంచి లాగే ప్రయత్నం చేసింది. నేను బలంగా కుర్చీని పట్టుకొన్నాను. ఆమె చివరకు నన్ను కుర్చీనుండి విడిపింప జేసింది. అటు తరువాత నన్ను కుర్చీని పట్టుకోకుండా కూర్చో మంది. ఈ మారు ఆమె లాగిన వెంటనే నేను కుర్చీ బయటకు వచ్చేను.

దీనివలన తెలిసిందేమిటంటే మనము మరణాన్ని కోరికలవలన ఎంత దూరం పెట్టాలనుకొంటే, మనమంత పోరాటం సాగించాలి. మనము దేహాభిమానంతో ఉంటే మరణంతో గట్టి పోరే చేయాలి. దురదృష్టవశాత్తూ మరణం ప్రతిసారీ జయిస్తుంది. ఈ దేహం మనది కాదు అనుకొంటే మరణం ఆసన్నమైనప్పుడు సుఖంగా దేహాన్ని వదిలేస్తాం. అందుకే యోగులు "ముందే దేహాభిమానం వదిలేస్తే మరణ సమయంలో తక్కువ శ్రమతో స్వతంత్రం పొందుతాం" అంటారు. మన స్వార్థ పూరిత బంధాలను వదిలేసి, యమ ధర్మరాజుకు మన దేహాన్ని తిరిగి ఇచ్చేస్తే, మనకు చెందవలసినవి చెంది, దేవునిపై అపారమైన ప్రేమ కలుగుతుంది. యముడు మన సమయం ఆసన్నమైనదని కటువుగా చెప్తే "అలాగే, నేను నీతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను" అని చెప్పగలగాలి. అటు తరువాత మనం కోటులా ధరించిన దేహాన్ని గోడ కొయ్య మీద పెట్టి, యముని వెంట వెళ్తాం.

Eknath Gita Chapter 8 Section 5

Bhagavat Gita

8.5

కవిం పురాణ మనుశాసితార మణో రణీయాంస మనుస్మ రేద్యః {8.9}

సర్వస్య ధాతార మచిన్త్యరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్

ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ {8.10}

భృవోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుష ముపైతి దివ్యమ్

సర్వజ్ఞుడు, సనాతనుడు, నియంత, అణువు కంటెను సూక్ష్మమైనవాడు, సమస్తమునకు ధాత, అచింతమైనవాడు, సర్వసన్నిభుడును, తమస్సు కంటెను వేరైన వాడును అగు అట్టి పురుషుని మరణకాలము నందు నిశ్చలమైన మనస్సుతోను, భక్తితోను, యోగబలముతోను కూడినవాడై, భ్రూమధ్యమున ప్రాణమును నిలకడగ నిలిపి, దివ్యమైనవాడు, సర్వోత్తముడు నగు పురుషుని ఎవడు స్మరించునో అట్టివాడు అతనినే పొందుచున్నాడు ఀ

సర్వోన్నతమైన కవి యగు భగవంతుడు ప్రతిచోటా ఉన్నాడు. వాని సృజనాత్మక శక్తి వలన ఆకాశము, సముద్రము, నదులు, పర్వతాలు, అడవులు, సర్వ జీవులు అందముగా సృష్టింప బడినారు. మన నిర్లక్ష్య వైఖరి వలన కలుగుతున్న కాలుష్యం ఉన్నా, అవి అందంగా ఉంటాయి. జర్మన్ యోగి నికోలస్ ఆఫ్ క్యూశా ఒక గింజలో భగవంతుని సృజనాత్మక శక్తిని చూసి ఈ ఒక్క గింజలో వేలకొలది చెట్లు పుట్టే అవకాశం ఉంది అన్నారు.

ఉపనిషత్తులు సృజనాత్మక శక్తి కారణము కాని కారణమని చెప్పెను. భౌతిక శాస్త్రజ్ఞులు సర్వ సృష్టికి ఫోటాన్ మూలము అంటే, దానిని ఎవరు సృష్టించేరని అడుగుతాను. ఇదే విధంగా కృష్ణ బిలాన్ని ఎవరు సృష్టించేరు? కార్య-కారణ సృష్టిలో ఇటువంటి ప్రశ్నలు అనేకముగా ఉంటాయి. కానీ ఇటువంటి అసంఖ్యాకమైన ప్రశ్నలు భగవంతునిలో అంతమవుతాయి. బ్రహ్మన్ తనను తాను సృష్టించుకున్నాడు. అతడే మొదటి కారణము. మనమంతా దాని నుండి ఆవిర్భవించిన కార్యము.

శ్రీకృష్ణుడు అర్జునినికి మరణ సమయంలో చేతనమును అఖండముగా ఎలాగ చేయాలో చెపుతున్నాడు. మనము సిద్ధపడినా లేకున్నా మరణము ఆసన్నమవుతుంది. ఉపనిషత్తులు మన శరీరము ఏకాదశ ద్వారములుతో కూడిన పట్టణమని చెప్పెను. అవి నోరు, ముక్కు , చెవి, కళ్ళు మొదలగునవి. ఎలాగైతే పట్టణాలు కూడా కాలగర్భాన కలసిపోయి శిధిలమవుతాయో, మన దేహమనే పురము నశిస్తుంది. కానీ ఎప్పుడైతే మన చేతనమును భగవంతునితో అనుసంధానము చేస్తామో మరణ సమయంలో దానిలో మార్పు లేక భగవంతునిలో ఐక్యమవుతుంది.

దీనికి మూలము భక్తి. మనము నిర్గుణుడైన బ్రహ్మన్ ను తలచుకొనుట అసాధ్యము. మరణ సమయంలో దానిని ఎలా స్మరించెదము? అందుకే భగవంతుని మానవ రూపంలో భావించి, అతనిని పూజించెదము. ఆ ప్రతీకే సర్వోత్తమమైన కవి కోవిదుడు, మనను రక్షించు వాడు. మనము ఆయన నుండి ఉత్పన్నమై, ఆయనలోనే కలిసిపోతాము. అందుకే మనకు భగవంతుడు --శ్రీకృష్ణుడు, జీసస్ మొదలైన వారు--మానవ రూపంలో దర్శనమిస్తాడు. భగవంతుని అవతారములు మనలాగే నవ్వుట, ఏడ్చుట, బాధలు పడుట కలిగియుండుట వలన వానిని మనకన్నా ఎక్కువగా ప్రేమిస్తాము. మనమెంత అట్టి అవతార పురుషుని ప్రేమిస్తామో, మరణములో కూడా అంత ప్రేమ కలిగి ఉంటాము. ఆయనలో పూర్తిగా నమ్మకముంటే, మన దేహము, మనస్సు ఆశాశ్వతమని తెలిసికొని చెట్టు నుండి పండుటాకు ఎలా రాలిపోతుందో, అలాగ మరణిస్తాము.

మరణంలో మన ఆస్తులను, వస్తువులను పట్టుకు పోలేము. కానీ మనస్సులో ఎట్టి భేద భావము ఉండరాదు. ప్రతి అనుబంధము, కోరిక, ద్వేషము లేక, మనస్సును నిశ్చలముగా చేయాలి. మనమెప్పుడైతే దేహముపై అనురాగమును వదిలివేస్తామో మనస్సు దేవునియందే లగ్నమై యుండును.

Eknath Gita Chapter 8 Section 4

Bhagavat Gita

8.4

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా {8.8}

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్

పార్థా! అభ్యాసయోగము నవలంబించి, అన్య విషయముల మీదికి వెళ్ళక యుండు మనస్సు చేత శ్రేష్ఠుడైన పురుషుని స్మరించు మనుజుడు అతనినే పొందుచున్నాడు

ఒక కోతి కల్లుతాగి, తేలుచే కుట్టబడి, దయ్యముచే ఆవహింపబడితే ఎలా ఉంటుందో మనస్సు అలాగ ఉంటుందని మన పూర్వీకులు చెప్పిరి. అనగా మనస్సును నియంత్రించుట అతి కష్టం. కానీ మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే అది చేయుట తప్పనిసరి.

నేను, నా భార్య భారత దేశం వెళ్ళినప్పుడు ఒక కోతి ప్రదర్శన చూసేం. ఒక కోతిని ఆడించేవాడు ఆ కోతిచే ఒక పిల్లవాడు బడికి కాళ్లీడ్చుకొ౦టూ వెళ్ళడం, బడినుంచి ఎగిరి గంతేసి తిరిగి రావడం చేయించేడు. ఆ కోతికి శిక్షణ ఒక రోజులో చేయబడినదికాదు. దాని యజమాని కొన్ని వారాలు కృషి చేసి దానికి నేర్పేడు. అలాగే మన మనస్సును నిశ్చలం చేయడానికి ఒక వారం, ఒక సంవత్సరం కూడా , సరిపోదు. నిజానికి ఒక జీవిత కాలం పట్టినా మన సమయం, ఏకాగ్రత వృధా కానట్టే.

మనము దక్షత అనేక విధములుగా ప్రదర్శిస్తాము. ఒక బాలుడు ఒంటి చక్రము సైకిల్ లో మా ఇంటి దగ్గరకు రోజూ దినపత్రికను తీసికివస్తాడు. కొందరు తమ వస్త్రాల పై (జీన్స్) పువ్వులను కుట్టుకొంటారు. వీటన్నిటికీ చాలా సమయం, ఏకాగ్రత కావాలి. నేను తమ దక్షతను పెంపొందించుకొని -- అది చిత్రలేఖనమైనా, మోటార్ సైకిల్ తో విన్యాసాలాయినా -- దానితోనే సంతృప్తి పడక ధ్యాన మార్గంలోకి వస్తే బాగుంటుందని తలుస్తాను.

ఒకనికి ఏకాగ్రత ఉందని చెప్పడానికి వాడు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వేరే ధ్యాస ఉండకపోవడం నిదర్శనం. ఇది ఒక కళ కాబట్టి మనం ధ్యానానికి, లేదా సంబంధాలు గట్టి పరుచుకోడానికి పనికి వస్తుంది. సామ్యూయల్ టేలర్ కోల్ రిడ్జ్ అనబడే ఆంగ్ల కవి వాగ్ధాటి కలవాడు. అతడు ఒక రోజు తన మిత్రుడు చార్లెస్ లాంబ్ ఎక్కడికో వెళ్తుండగా ఆపి తన కవిత్వాన్ని వినమని కోరేడు. చార్లెస్ లాంబ్ తనకు పని ఉన్నదని చెప్పినా వినక, కోల్ రిడ్జ్ అతని కోటు బొత్తాయిని పట్టుకొని అనర్గళంగా కవిత్వాన్ని చదవడం మొదలు పెట్టేడు. అలాగ కొన్ని గంటలు గడిచేయి. చార్లెస్ లాంబ్ అదే దారిన తిరిగివచ్చి చూస్తే కోల్ రిడ్జ్ తన కోటు బొత్తాయిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నాడు. జరిగిందేమిటంటే చార్లెస్ లాంబ్ కోటు బత్తాయిని కత్తెరతో తెంపేసి తన దారిని వెళ్ళేడు. కోల్ రిడ్జ్ కి తనకున్న ఏకాగ్రతవలన అది గ్రహించలేదు. ఇది అతిశయోక్తి అయినప్పటికీ ఒక మేధావి తనకు కావలసిన ఏకాగ్రతకై కోల్ రిడ్జ్ లాగా మందులు వాడే బదులు ధ్యానం అవలంబిస్తే ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతాడు. 102

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...