Saturday, April 9, 2022

Eknath Gita Chapter 8 Section 15

Bhagavat Gita

18.15

శుక్ల క్రిష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే {8.26}

ఏకయా యాత్యనావృత్తి మన్యయా ఆవర్తతే పునః

ఈ శుక్లకృష్ణమార్గములు జగత్తు నందు శాశ్వతముగ నున్నవి. ఇందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యమును, రెండవ దానివలన పునర్జన్మమును కలుగుచున్నవి ఀ

మన శాస్త్రములు మనలో 7 చక్రాలు ఉన్నాయని చెప్తాయి. అవి: మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహిత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారము. వెన్నెముక క్రిందన కుండలిని శక్తి వృత్తాకారంలో ఉంటుంది. అది సాధారణంగా క్రింది 3 చక్రాలలో సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కుండలిని 4 వ చక్రము, లేదా దానిని దాటి ఉంటుందో, పై శ్లోకములో చెప్పిన కాంతి కనిపిస్తుంది.

అలాగ కాంతి పుంజము కనబడితే, జీవితం స్వచ్ఛంగా కనబడుతుంది. ధ్యానంవలన మన దైనింద జీవితంలో మార్పు వస్తుంది. మన నడవడిక, వ్యక్తిత్వము ధ్యానము వలన పురోగమిస్తున్నాయా? అన్న ప్రశ్న దీనికి పరీక్ష. మనము ధ్యానంలో ఉన్నప్పుడు గాని, నిద్రి౦చు నప్పుడు గాని, ఆ కాంతి పుంజము కనిపిస్తే మనకు శుభఫలితాలు వస్తాయి. పాత నిరోధాలు, బంధు మిత్రులతో స్పర్థలు తొలగవచ్చు. ఈ మార్పులు వచ్చేయంటే మన అనుభవము సత్యమైనది. అలా కాకపోతే మనమి౦కా సాధన చేయాలి.

సాధారణ వ్యక్తులకు ఆ కాంతి పుంజము యొక్క అనుభవము రాదు. సాధనతో కుండలిని 4 వ చక్రము చేరితే ఆ కాంతి అంత ప్రజ్వలంగా ఉండక పోవచ్చు. యోగులు చెప్పినట్టు దేహం కాంతితో నిండియున్నది. కానీ అది మనం చూడలేము. కాంతి పుంజము కనబడినప్పటినుంచీ మనకు ధ్యానం చేయడానికి ఉత్సాహం పెంపొంది, జీవుల ఐక్యతను గ్రహిస్తాము. మన బంధుమిత్రులు క్షేమంగా ఉంటే సరిపోదు. మనము మన ప్రేమను అందరికీ పంచి పెట్టాలి.

కుండలిని శక్తి 5 వ చక్రము చేరితే, మన జీవితము పైన అవగాహన ఇంకా ఎక్కువ అవుతుంది. మరింత సాధన చేస్తే కుండలిని మన కనుబొమల మధ్యకు వస్తుంది. దీనిని సవికల్ప సమాధి అంటారు. ఎందుకంటే మన ధ్యానం ఒక దేవత మీద ఉంటుంది. ఆ దేవత సమస్త సృష్టిలో ఉన్నదన్న జ్ఞానము కలుగుతుంది. అంటే వేరొక జీవికి అపకారం తలపెట్టం.

కుండలిని 7 వ చక్రము చేరితే కాంతి పుంజము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. దీని నిర్వికల్ప సమాధి అంటారు. ఇది అనన్యమైన మనస్సుతో సాధన చేస్తేనే సాధ్యము. సూర్యుని కళ్ళతో చూస్తే ఎలాగ చూపు పోతుందో, ఈ కాంతి ప్రకాశం సాధారణ మనుష్యులు చూడలేరు.

కుండలిని 7 చక్రాలలో వ్యాప్తమై ఉన్నప్పుడు, మనము దేవయాన మార్గములో, సూర్యుని వైపు ప్రయాణిస్తాము. అది దేవతల లోకానికి తీసికవెళ్తుంది. ఇది మనము ధ్యానం చేసి, ఇతరులతో సంబంధాలూ లేదా కలహాలు పెట్టుకోకుండా ఉంటేనే సాధ్యము. ముండక ఉపనిషత్తు ఈ విధముగా చెప్పెను:

చిత్తశుద్ధి గలవారు, ధ్యానం చేసేవారు

ఇంద్రియములను, కోరికలను నియంత్రించి

సమస్త కాంతికి, జీవులకు కారణమైన

పరమాత్మను పొందెదరు.

రెండవ మార్గము చంద్రుని వైపు ఉంటుంది. చంద్రునికి సహజమైన కాంతి లేదు. అది చీకటితో నిండి ఉన్నది. మనము ఇంద్రియములతో తాదాత్మ్యము చెంది -- పనికిరాని పదార్థాలను తినడం, మద్యానికి అలవాటు పడడం వంటివి -- దేహం చీకటితో నింపుకుంటే ఈ మార్గాన వెళతాం.

సుఖాలకై ప్రాకులాడే వారు వారి సంపద లేదా యవ్వనమును చూచి ఓర్వలేని వారలను ఎదుర్కొంటారు. యుక్త వయస్సులో మనం చేసిన తప్పులను భగవంతుడు దయతో క్షమించడం వలననే ప్రస్తుత స్థితికి వచ్చేము. కానీ మనం సదా యువకులుగా ఉండలేము. క్రమంగా వృద్ధాప్యంలో చైతన్యము తగ్గి, మన౦ జీవితం యొక్క దిశను నిర్దేశింపలేక ఉంటాము. వృద్ధాప్యంలో మనకు చైతన్యం ఉన్నా, మనకున్న చాపల్యం వలన దేహాన్ని అంటిపెట్టుకొని ఉంటాము.

మనమెంత మూర్ఖత్వంతో ఉంటామో మన దేహంలో అంత చీకటి ఉంటుంది. అది తక్కిన వారితో మన బాంధవ్యాలను ప్రభావితం చేసి, వారితో ఎలా కలసిమెలసి ఉండాలో తెలియజేయదు. ధ్యానంలో చివరకు సంపూర్ణమైన కాంతి ఎలా పొందుతామో, స్వార్థ పూరితులమైతే పూర్తి చీకటిని అనుభవిస్తాము.

స్వార్థం ఎక్కువవుతున్న కొద్దీ మన దృఢసంకల్పం ఎక్కువవుతుంది. అట్టి స్థితిలో మన మాటే నెగ్గాలనే భావనలో ఉంటాం. ఇతరులకు వేరే భావనలు ఉండ వచ్చని ఒప్పుకోము. ఇలాంటి వ్యక్తులకు సహనం ఎలాగ సాధ్య మవుతుంది? నడివయస్సు దాటిన తరువాత సహనం, ఒకప్పుడు లేకపోతే, క్రొత్తగా నేర్చుకోవడం కష్టం. కొందరు నాతో "మేము మారలేము" అని చెప్తారు. నా సమాధానం ఎప్పుడైనా మనము మారవచ్చని. కాకపోతే దానికై కష్టపడాలి. మనమెంతో కాలము చీకటిలో బ్రతికినా, కాంతి మార్గంలోకి మారవచ్చు. 132

Eknath Gita Chapter 8 Section 14

Bhagavat Gita

8.14

యత్ర కాలే త్వనావృత్తి మావృత్తి౦ చైవ యోగినః {8.23}

ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ

అర్జునా! ఏ కాలమున గతించిన యోగులు జన్మ రాహిత్యము పొందుదురో, ఏ కాలమందు గతించినవారు పునర్జన్మమును పొందుదురో ఆయా విషయములను చెప్పుచున్నాను

అగ్నిర్జ్యోతి రహ శుక్ల ష్షణ్మాసా ఉత్తరాయణం {8.24}

తత్ర ప్రయాతా గచ్ఛ౦తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః

అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఆరునెలలు గల ఉత్తరాయణము అనెడి మార్గమునందు వెడలిన బ్రహ్మవేత్తలగు వారు బ్రహ్మమునే పొందుచున్నారు

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం {8.25}

తత్ర చాంద్రమాసం జ్యోతి ర్యోగీ ప్రాప్య నివర్తతే

ధూమము, రాత్రి, కృష్ణపక్షము, ఆరునెలలు గల దక్షిణాయనము అనెడి మార్గమునందు వెడలిన యోగి చంద్ర లోకాదులకు వెళ్ళి తిరిగి పునర్జన్మ నెత్తుచున్నారు

ఈ శ్లోకాలు ఆత్మ మరణం తరువాత రెండు మార్గాల ద్వారా వెళుతుందని చెప్తున్నాయి. ఒకటి ఉత్తరాయణ; రెండవది దక్షిణాయన. ఉత్తరాయణంలో సూర్యుడు ఆరు నెలల పాటు ఉత్తరార్ధ గోళంలో సంచరిస్తాడని, దక్షిణాయనములో ఆరు నెలల పాటు దక్షిణార్థ గోళంలో సంచరిస్తాడని చెప్తారు.

మనం అక్షరాస్యులమైనా, కాకపోయినా, ధనవ౦తులమైనా లేదా పేదవారములైనా ఒకానొక ఎన్నిక చేసుకోవాలి. అది మన బాగుకై కర్మ చేయాలా లేదా ఇతరులకై పాటు పడాలా. మనం ఇతరులకొరకై పాటు పడేవారిని ఆదర్శంగా తీసికొ౦టా౦. కానీ మన వరకూ వచ్చేసరికి ఏమి చేయాలో తెలీదు. మనం స్వార్థ పూరితంగా ఉన్నంతసేపూ ఇతరుల సంక్షేమము గురించి ఆలోచింపక తప్పు ఎన్నికలు అప్రయత్నంగా చేస్తాం.

మహాభారత యుద్ధంలో భీష్ముడు శస్త్రములతో ఛేదింపబడి నేల కొరిగేడు. అప్పుడు దక్షిణాయనం. భీష్మునికి స్వచ్ఛ౦ద మరణం ఉన్నది కనుక అతడు శరతల్పముపై పడుక్కొని, ఉత్తరాయణం కొరకై వేచి, అనేక బాధలను అనుభవించేడు. ఎప్పుడైతే సూర్యుడు విషువత్ (equinox) చేరుకొన్నాడో భీష్ముడు ప్రాణం విడిచేడు.

నా అమ్మమ్మ దక్షిణాయనంలో వ్యాధిగ్రస్తురాలయింది. వైద్యులు ఆమె ఎంతోకాలం బ్రతకదని చెప్పేరు. కానీ ఆమె ప్రాణాన్ని బిగపెట్టుకొని ఉత్తరాయణంలో మరణించింది. దాని వలన మాకు తెలిసినదేమిటంటే ఎవరికైతే దేవుడియందు అమితమైన ప్రేమ ఉంటుందో, ఎవరైతే ఇతరుల సంక్షేమానికై పాటు పడతారో, వారికి అమితమైన పట్టుదల ఉంటుంది.

మనం కూడా దేవుని యందు పరిపూర్ణ భక్తితో, ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. మొదట్లో అది బాధ కలిగించినా, చివర్లో సత్ఫలితాలు ఇస్తుంది.

ఈ శ్లోకాల్లో ఉత్తరాయణ మార్గం వెలుగుతో కూడినదని, దక్షిణాయనం చీకటి మార్గమని చెప్పబడినది. ఎవరైతే తమ ఇంద్రియాలను నిగ్రహించరో వారు చీకటి మార్గంలో పయనిస్తున్నారు. అట్టి వారు తమ చైతన్యమును కోల్పోయి, వ్యాధిగ్రస్తులై ఉంటారు. జీవితం చివరిలో చిన్ననాటి కోర్కెలు ఉండి, వాటిని ఎలా తీర్చుకోవాలో తెలీదు. అలాగే అహంకారంతో కూడి, దానిని ఎవరి మీద ప్రయోగించాలో తెలీదు. జీవితం దుర్భరమై, చావుకై ఎదురుచూస్తూ ఉంటారు. ఇది చీకటి మార్గము. కోట్లమంది ఈ మార్గంలో పయనిస్తున్నారు. ఎందుకంటే వారికి తమ దురలవాట్లను ఎలా వదిలించుకోవాలో తెలియదు. అలాగే అహంకారాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చెయ్యరు. మనము ఈ శ్లోకాల్లో చెప్పిన వెలుగు, చీకటి మార్గాలను గుర్తు పెట్టుకొంటే, ధ్యానం అలవర్చుకోవాలనే గాఢమైన ప్రేరేపణ కలుగుతుంది. 128

Eknath Gita Chapter 8 Section 13

Bhagavat Gita

8.13

పురుష స్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా {8.22}

యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతం

పార్థా ! ఈ చరాచర భూతము లన్నియు ఎవని యందున్నవో, ఈ సమస్త ప్రపంచము ఎవని చేత పరివ్యాప్తమై యున్నదో, అట్టి పరమాత్మ అనన్య భక్తి వలననే లభ్యము కాగలడు ఀ

పరమాత్మ ఆలోచనలకు అందడు. అతన్ని పట్టుకోవాలంటే అది ప్రేమతోనే సాధ్యము. అట్లే ఎంత తర్కం ఉపయోగించినా పరమాత్మని పట్టుకోవడం కష్టం. ఎందుకంటే అతడు అఖండమైనవాడు, ద్వంద్వాలకు అతీతుడు. అతన్ని ప్రేమించే వారు ఇప్పుడే ఇక్కడే మరణాన్ని జయించగలరు. కానీ ఆ ప్రేమ సంపూర్ణంగా ఉండాలి. సెయింట్ జాన్ ఆఫ్ ది క్రాస్ "మనము ఆలోచనలలో బ్రతకం. ప్రేమలో బ్రతుకుతాము" అని చెప్పెను.

పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు కాబట్టి ఆయనను ప్రేమించడమంటే మన బంధు మిత్రులను, ఇతరులను ప్రేమించడం. కానీ ఎలా? సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ సేల్స్ 16 వ శతాబ్దివాడు. ఆయన శిష్యుడు పరిపూర్ణత ఎలా పొందాలి అని గురువుని అడిగేడు. "దేవుని హృదయపూర్వకంగా ప్రేమించు; నీ పొరుగువాడ్ని అంతకన్నా ఎక్కువ ప్రేమించు" అని గురువు చెప్పెను.

శిష్యుడు కొంత నిరాశ చెంది తిరిగి ఇలా ప్రశ్నించేడు: "నేను పరిపూర్ణత అంటే ఏమిటని ఆడగటంలేదు. దానిని ఎలా పొందాలి అని అడుగుతున్నాను?" సెయింట్ ఫ్రాన్సిస్ ఇంతక ముందు ఇచ్చిన సమాధానమే ఇచ్చాడు.

కానీ అ శిష్యుడు పట్టువదలక మరల మరల ప్రశ్నించగా గురువు ఈ విధంగా చెప్పెను: "చాలా మంది ఈ ప్రశ్నను అడిగేరు. దాని రహస్యం దేవునియందు పూర్తి ప్రేమ కలిగి యుండడం. అది ఎలా సాధ్యమంటే ఇతరులను ప్రేమించడం వలన. నువ్వెలా చదవడం చదువు వలన, పరిగెత్తడం పరిగెత్తడం వలన, నేర్చుకొన్నావో అలాగ ఇతరులను ప్రేమిస్తూ ఉంటే, ఆ భగవంతుడిని ప్రేమించగలవు".

ప్రేమ తెచ్చుకోవడానికి సాధన అవసరం. మన స్వంత విషయాన్ని త్యజించి, ఇతరులకై మన సమయం వెచ్చిస్తే, మనం ప్రేమించడానికి సామర్థ్యం వస్తుంది. సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా "ప్రేమ ప్రేమను వెలికి తీస్తుంది" అని చెప్పెను. మన౦ ఇతరులను మన కన్నా ముందు పెట్టుకొంటే, మన ప్రేమ వారియందే కాక, భగవంతుని దృష్టిలో అందరూ సమాన మైనప్పటికీ, భగవంతుని యందు కూడా పెరుగుతుంది. 125

Eknath Gita Chapter 8 Section 12

Bhagavat Gita

8.12

అవ్యక్తో అక్షర ఇత్యుక్త స్తమాహుః పరమాం గతిం {8.21}

యం ప్రావ్య న వివర్తంతే తద్ధామ పరమం మమ

ఏది అక్షరము, అవ్యక్తము అని చెప్పబడినదో అదియే సర్వోత్కృష్టమైన స్థితిగా చెప్పుదురు. దేనిని పొందిన పిదప తిరిగి జన్మ నెత్తరో అదియే నా స్థానము

మనము ఏ ఖండ౦లో పుట్టినా ఎన్నటికీ బాటసారులమే. జ్ఞానులకు ఒక్కొక్కప్పుడు తమ శాశ్వతమైన ఇంటికి మరలి పోవాలనే ఆలోచన కలుగుతుంది. దాన్నే శ్రీకృష్ణుడు మమ ధమ అంటున్నాడు. అది మిక్కిలి ఆహ్లాదకరమై, మనకు శాశ్వతమైన భద్రత నిచ్చేది. కొంతమంది ఎల్లప్పుడూ ప్రయాణం చేయాలని తలుస్తారు. వారి ముఖ్యోద్దేశం తమ నిజమైన ఇంటిని చేరడం. ప్రయాణం నుంచి తిరిగి వచ్చినపుడు వారు అలసి పోయి, నిరాశతో కూడి ఉంటారు. వారికి కావలసిన శాశ్వత స్థానము ఎల్లప్పుడూ మార్పుచెందే, పరిమితమైన ప్రపంచం ఇవ్వదని తెలిసికొ౦టారు.

ధ్యానంలో మనం అంతర్ముఖులమయి దేశకాలాలకు అతీతమై మన నిజమైన ఇంటిని చేరడానికి ప్రయత్నిస్తాము. ఇది ప్రకాశం వైపు చేసే పయనం. మన అహంకారాన్ని, స్వార్థాన్ని, వేర్పాటుని విడనాడితే మనం స్వర్గంలో ఉంటాము.

మన సహజ లక్షణాన్ని శ్రీకృష్ణుడు అక్షర అంటాడు. అంటే ఎన్నటికీ క్షయము కానిది. మన ఆత్మకి నాశనము లేదు. మరణంలో పోయేది శరీరమే గాని ఆత్మ కాదు. నా అమ్మ ప్రతి రోజూ విభూతి తలమీద పెట్టుకొనేది. అది మనము ఆశాశ్వతమై, ఎప్పుడో ఒకప్పుడు బూడిద అవ్వవలసినదే అనడానికి నిదర్శనం. ప్రతి యోగి ధ్యానాన్ని అలవరుచుకోడానికి జాప్యం చేయకండి అని చెప్తాడు. తద్వారా మనకు మరణం సంభవించినపుడు శరీరాన్ని అధిగమిస్తాం.

నేనొక కథ చదివేను. ఒకడు ఆధ్యాత్మిక సాధన చేయడం జాప్యం చేసేడు. ఎందుకంటే జీవితంలో వానికి లేనిదంటూ ఏమీ లేదు. ధ్యానం వచ్చే వారం లేదా నెల లేదా సంవత్సరంలో మొదలుపెడతానని అనుకునేవాడు. కానీ ఒకనాడు వానికి తను మరణించినట్టుగా కల వచ్చింది. వానికి జాప్యం చేయడం సరికాదు అని తెలిసి౦ది. వెంటనే ధ్యానం మొదలుపెట్టాలని లేవడానికి ప్రయత్నించేడు. కానీ వాని దేహం స్వాధీనంలో లేదు. ఎందుకంటే వాని కల నిజమయింది.

మనము మన అలవాట్లను మార్చు కోవడానికి, ఎన్నో మంచి కారణాలు ఉన్నా, జాప్యం చేయకూడదు. మనకు భౌతికమైన, మానసికమైన సమస్యలు ఉన్నా కూడా ధ్యానం ద్వారా వాటి మూల కారణాలు తెలిసికోవచ్చు. మనలో ఎన్ని లోపాలున్నా, మనం ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు మనని తన దగ్గరకు తీసికొంటాడు. అందుకే హిందువులు భగవంతుని మిత్ర అంటారు. అనగా భగవంతుడు మనకు నిజమైన మిత్రుడు. 124

Eknath Gita Chapter 8 Section 11

Bhagavat Gita

8.11

పర స్తస్మాత్తు భావో అన్యో అవ్యక్తో అవ్యక్తా త్సనాతనః {8.20}

యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి

ఏ పరబ్రహ్మము అవ్యక్తము కంటెను వేరైనదియు, శ్రేష్ఠమైనదియు, తెలియరానిదియు, శాశ్వతమైనదియు, నగునో అట్టిది సర్వ ప్రాణులు నశించినను నశింప నేరదు

కల్పాంతరమున విశ్వం అంతరిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు "నేను నిత్యము ఉండేవాడిని" అని చెప్తున్నాడు. అంటే మనమూ అమరులమే. మన సూర్య నక్షత్రము అంతరించినప్పుడు, మన పాల పుంత కృష్ణ బిలంలో అంతర్ధాన మైనప్పుడు "నేను ఉంటాను. అట్లే నీవు కూడా ఉంటావు" అని శ్రీకృష్ణుడు అభయం ఇస్తున్నాడు. కఠ ఉపనిషత్తులో ఈ అంశ౦ ఇలా వివరింపబడినది:

పరమాత్మ నామరూపాలకు అతీతం

ఇంద్రియాలు గ్రహింపజాలవు, ఎప్పటికీ తరగనిది

ఆద్యంతాలు లేనిది

దేశకాల మానాలకు, కార్య-కారణమునకు అతీతము

మార్పు చెందనిది

ఇట్లు పరమాత్మను ఎవరు భావిస్తారో

వారు మరణ౦నుండి విడుదలవుతారు

భగవంతుడు ఇచ్చే మోక్షము అన్ని సంపదలకన్నా, పేరుప్రతిష్ఠల కన్నా, ఎటువంటి సుఖాలకన్నా ఉత్కృష్టమైనది, వెలకట్టలేనిది.

మనకు జ్ఞానం కలగాలంటే ధరను అడగ కూడదు. దేవుడు మననుండి దేన్ని వేరుచేసినా తిరగబడక, విశ్వాసం వీడక ఉండాలి. జ్ఞానము ఎవరైతే ఎక్కువ త్యాగం చేస్తారో, దేవునితో మంతనాలాడకుండా ఉంటారో వారికే ఇది సాధ్యం. మనం ఎప్పుడైతే నోరును కట్టుకోలేక కనబడినిది తింటామో, ధ్యానానకి ప్రొద్దునే లేవలేమో అప్పుడు మనము బేరసారము చేస్తున్నామని అర్థం. మనం అహంకారంతో, దేవునితో బేరం పెట్టుకున్నామో, మన మెప్పటికీ గెలవలేం. 122

Eknath Gita Chapter 8 Section 10

Bhagavat Gita

8.10

సహస్ర యుగ పర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః {8.17}

రాత్రిం యుగసహస్రా౦తాం తే అహో రాత్రివిదో జనాః

ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని వేయి యుగముల కాలముగను, అట్లే రాత్రిని వేయి యుగముల కాలముగను తెలియుదురో అట్టివారు రాత్రింబవళ్ళు యొక్క పరిణామమును తెలిసికొని యున్నారు

అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవం త్యహరాగమే {8.18}

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త స౦జ్ఞకే

బ్రహ్మదేవునికి పగలు ప్రారంభమగునపుడు అవ్యక్తము నుండి సర్వ భూతములు ఆవిర్భవించుచున్నవి. మరల రాత్రి ప్రారంభము కాగానే అట్టి అవ్యక్తము నందే విలీనమగుచున్నవి

భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే {8.19}

రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవ త్యహరాగమే

పార్థా! సర్వభూతములు బ్రహ్మకు పగలగునపుడు ఆవిర్భవించుచు, రాత్రియైనపుడు అంతరించుచు జనన మరణములను మరల మరల పొందుచున్నవి ఀ

మన పురాణాల్లో కాలాన్ని 4 యుగాలుగా విభజించేరు. మొదటిదైన సత్య యుగంలో ప్రతి ఒక్కరూ నిస్వార్థపరులై భూమి స్వర్గతుల్యంగా ఉండేది. దీనిని ఒక ఎద్దు నాలుగు కాళ్లతో నిలబడుతున్నట్టు చిత్రీకరిస్తారు. క్రమంగా ఎద్దు మూడు కాళ్ళ మీద నిలబడి, త్రేతాయుగము ఆవిర్భవించింది. ఈ యుగంలో మనుష్యులు లోభం, స్వార్థం, మోహంతో ఉండేవారు. ఎద్దు రెండు కాళ్ళ మీద నిలబడినప్పుడు ద్వాపర యుగం అన్నారు. ఈ యుగంలో నీకు సగం, నాకు సగం అనే భావన కలిగి, ఒకడు తనకై బ్రతుకుతాడో లేక ఇతరుల మేలుకై పాటు పడతాడో చెప్పలేని స్థితి కలిగింది. చివరగా ఎద్దు వంటి కాలి మీద నిలబడినప్పుడు ప్రస్తుతం మనముండే కలియుగం వచ్చింది. కలి అనగా క్రోధం, హింసలతో కూడినది.

ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహా యుగమవుతుంది. వెయ్యి మహాయుగాలు ఒక కల్పం అంటారు. అది బ్రహ్మ దేవునికి ఒక రోజు కాలము. బ్రహ్మ లేచిన వెంటనే నామ రూపాత్మకమైన సృష్టి ప్రారంభమవుతుంది. పదార్థము, శక్తి, దేశకాలాలు ఆవిర్భవిస్తాయి. కొందరు ఋషులు లెక్కలుకట్టి బ్రహ్మదేవుని ఒక రోజు 432 కోట్ల సంవత్సరాలు అని చెప్పేరు.

బ్రహ్మ సృష్టిని సృజించి అలసిపోయి నిద్రపోతాడు. సృష్టి బ్రహ్మదేవుని ఆలోచనలో ఉన్నదికాబట్టి, బ్రహ్మ ఎప్పుడు పడుకుంటాడో, అది అవ్యక్తం లోకి పోయి అంతరిస్తుంది.

ఖగోళ శాస్త్రజ్ఞులు మన సృష్టి బిగ్ బ్యాంగ్ వలన కలిగిందని అంటారు. మరికొందరు సృష్టి సృజింప బడలేదు ఎప్పుడూ నిలకడగానే ఉంది అంటారు.

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మన శాస్త్రాలు చెప్పినదానికి దగ్గరగా ఉంటుంది. అబ్బే జార్జ్స్ హెన్రీ లెమైటెర్ అనబడే బెల్జియన్ ప్రీస్ట్ సృష్టి 1000 కోట్ల సంవత్సరముల క్రింద ఆరంభమైనదని చెప్పేడు. దాని ద్రవ్య రాశి సుమారుగా ఇప్పటి లాగాఉండి, ఒక చిన్న ముద్ద వలె ఉండెను. దానిని ఒక గ్రుడ్డుతో లేదా అణువుతో పోలుస్తారు. అదే బ్రహ్మాండం అని కూడా పిలువబడుతుంది. ఆ దశలో దేశకాల మానాలు లేవు.

లెమైటెర్ విశ్వంలోకి క్రొత్త ద్రవ్యం రాక, తయారవక ఒకనాటికి అంతమౌతుందని తలచేడు. కానీ శాస్త్రజ్ఞులు అంగీకరింపక ఇలా అన్నారు: విశ్వం నలుదిక్కుల వ్యాపించి నప్పుడు, గురుత్వాకర్షణ సిద్ధాంతం వలన, మళ్ళీ వెనక్కి వచ్చి గ్రుడ్డు వలె పరివర్తిస్తుంది. కొంత వ్యవధి తరువాత మళ్ళీ విస్ఫోటించి, సృష్టి మొదలవుతుంది. ఈ విధంగా విశ్వ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. బ్రహ్మ దేవుడు పగలు మేల్కొని, రాత్రి విశ్రమించి యున్న౦త కాలమూ ఈ విశ్వ చక్రం కదులుతూనే ఉంటుంది.

సృష్టి ఆవిర్భవించలేదు, అది ఎప్పుడూ నిలకడగా ఉందనేవారు, దానికి మొదలు అంతము లేదని చెపుతారు. వారు విశ్వం వ్యాపిస్తూఉంటే క్రొత్త ద్రవ్యము సృజింపబడుతుందని నమ్ముతారు.

సర్ ఫ్రెడ్ హోయిల్ అనబడే శాస్త్రవేత్త నిలకడ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసినవాడు.

ఆయన చెప్పేది ద్రవ్య రాశికి (mass) మొదలు ఉంది గానీ విశ్వానికి ఆద్యంతములు లేవు. అది ద్రవ్యం కన్నా విశాలమైనది. అది ప్రతిచోటా ఉంది. ఇదే శ్రీకృష్ణుడు కూడా చెప్పేడు. విశ్వం అతని కుక్షిలో ఉన్నది. హోయిల్ గురుత్వాకర్షణ శక్తి, అణు శక్తి వలె ద్రవ్య శక్తి ఉండి, దాని నుండి క్రొత్త ద్రవ్యము సృజింపబడుతుందని చెప్పెను. పాత ద్రవ్యము ద్రవ్య శక్తిలోకి వెనక్కి తీసికోబడుతుంది. ఇదే యోగులు విశ్వసించేది కూడా.

ఒక క్రొత్త సిద్ధాంతంలో ద్రవ్యము మారుతూ ఉంటుందని చెప్పబడినది. ద్రవ్య శక్తి వలన ద్రవ్యము ఆవిర్భవిస్తుంది. ఈ ద్రవ్య శక్తి విశ్వ వ్యాప్తమైనది. ఐన్స్టీన్ వంటి శాస్త్రజ్ఞులు దీన్ని ప్రతిపాదించేరు. ఈ మధ్య దానిని హిగ్గిన్స్ బోసాన్ అనే పేరుగల పరమాణువుగా గుర్తించేరు. ఒక పదార్థము యొక్క ద్రవ్యము హిగ్గిన్స్ బోసాన్ చే నిర్ణయింప బడుతుంది. ఎక్కువ హిగ్గిన్స్ బోసాన్ లు ఉన్న క్షేత్రంలో ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పదార్థము ఒకటే అయినా దాని ద్రవ్యము మారుతూ ఉంటుంది. విశ్వం ఎప్పుడూ ఒకే పరిణామంలో ఉంటూ, బిగ్ బ్యాంగ్ వంటి విస్ఫోటములతో కూడి ఉంటుంది. కాబట్టి విశ్వం పుట్టునది కాదు, పోవునది కాదు.

ఇటువంటి సిద్ధాంతాల వలన శాస్త్రజ్ఞులు, ఋషులు మధ్యన ఉన్న అపోహలు తొలగుతాయి. ఈ అపోహ శాస్త్రీయ, ఆధ్యాత్మిక సిద్ధాంతాల వలన కాదు. మనము శాస్త్రజ్ఞులు చెప్పే సిద్ధాంతాలను ఋషులు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలతో అన్వయించుకోవాలి. సమాధి స్థితిలో ఒక ఉత్కృష్టమైన దశను తురీయమందురు. ఆ దశలో జ్ఞేయము-జ్ఞాత- జ్ఞానము అనే త్రిపుటి ఉండదు. పాలపుంతలతో, కృష్ణ బిలాలతో, నక్షత్రాలతో కూడిన విశ్వాన్ని దేవుడు, ఒక క్రీడాకారుడు బంతితో ఆడుతున్నట్టుగా, తన చుట్టూ తిప్పుకొంటున్నాడు అని తెలుస్తుంది. 121

Eknath Gita Chapter 8 Section 9

Bhagavat Gita

8.9

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతం {8.15}

నాప్నువంతి మహాత్మాన స్సంసిద్ధం పరమాం గతాః

ఉత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందిన వారై దుఃఖాలయమును, అనిత్యమునైన జన్మమును తిరిగి పొందరు

ఆ బ్రహ్మభువనా ల్లోకాః పునరావర్తి నో అర్జున {8.16}

మాముపేత్య తు కౌ౦తేయ పునర్జన్మ న విద్యతే

అర్జునా! బ్రహ్మలోక పర్యంతము గల లోకములకు వెళ్ళిన వారందరు తిరిగి పుట్టుచునే యున్నారు. నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మము లేదు

పై శ్లోకంలో శ్రీకృష్ణుడు పునర్జన్మ గురించి చెప్పుచున్నాడు. ధ్యానం అవలంబించి పునర్జన్మను నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు. మనం ఏమీ సాధన చేయకుండా పునర్జన్మ ఉంటుందని నమ్మవచ్చు. అలాగే పునర్జన్మ లేదని నమ్మి, ఈ జన్మలో నిస్వార్థంగా బ్రతకవచ్చు. పరిణామ సిద్ధాంతానికి, పునర్జన్మ సిద్ధాంతానికి మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. మనం తల్లి గర్భంలో ఒక కణంగా ప్రవేశించి, కోట్ల కణాలతో పరిణామం చెంది బయటపడ్డాం. సూఫీ యోగి జలాలుద్దీన్ రూమి ఇలా చెప్పేరు:

నేను అవ్యక్తంలోనుంచి వచ్చేను

జీవితం అనబడే అడవిలో నా గుడారం వేసికొన్నాను

నేను ఒక కణం, తరువాత ఒక కాయ

అటు తరువాత జంతువు అయ్యాను

క్రమంగా ఒక మంచి వాళ్ళ సంపర్కంతో మనిషినయ్యాను

నేను గుడుల చుట్టూ తిరిగేను

చివరకు దేవుని చేరే మార్గంలో పయనించి

ఆయన తలుపు దగ్గర బంటు నయ్యాను

నేను ఆయన వేరువేరుగా లేము

ఎందుకంటే నేను అతని యందు కలిసిపోయేను

టిబెట్ యోగులు మనకి రెండు శరీరాలున్నాయని చెప్తారు: ఒకటి స్థూలం; మరొకటి సూక్ష్మం. సూక్ష్మ శరీరం మన ఆలోచనలతో, భావాలతో ఉంటుంది. అది అభౌతికం. మన స్థూల శరీరానికి ఒడ్డూ, పొడుగూ మొదలగు లక్షణాలు ఉండి భౌతికంగా ఉంటుంది. దానిలో సూక్ష్మ శరీరం సంస్కారాలతో, తమస్, రజస్, సత్త్వ గుణాలతో కూడి ఉంటుంది.

మరణము సంభవించినపుడు సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని విడుస్తుంది. స్థూల శరీరం పంచ భూతాలతో కలిసిపోతుంది. పిదప మన సూక్ష్మ శరీరం బార్డో అనబడే స్థలానికి వెళుతుంది. అక్కడ చాలా కాలం వేచి ఉన్న తరువాత మరొక జన్మ వస్తుంది. మన ఉపనిషత్తులు దీనికి, సుషుప్తికి పోలిక లున్నాయని చెప్తాయి. సుషుప్తిలో మన సమస్యలు గుర్తుకురావు. మన దేహం గానీ మనస్సు గానీ ఎరుకలోకి రావు. కానీ మనం సుషుప్తినుండి మేల్కొన్న తరువాత అన్ని ఆలోచనలు తిరిగి వచ్చి మనం పూర్వంలాగే ఉంటాము. బార్డో కూడా సుషుప్తి లాంటిదే. మరణంలో మన చేతనమనస్సు దేహంతో విడిపడి, మనం కొంత కాలం ప్రశాంతతను పొందుతాము. అటు తరువాత ఇంకొక శరీరంలో ప్రవేశించి మేల్కొ౦టాం.

శ్రీకృష్ణుడు తనతో ఐక్యమయ్యేవరకు జన్మలు పొందుతూనే ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి మన౦ పునర్జన్మ పొందడం లేదా మోక్షం పొందడం మన చేతుల్లోనే ఉంది. మనం సత్కర్మలు చేస్తూ, మన కుటుంబానికీ, సమాజానికీ ఉపయోగకరంగా ఉంటే పునర్జన్మ ప్రస్తుత జన్మ కన్నా ఉత్కృష్టంగా ఉంటుంది. అలా కాక మనం స్వార్థంతో, ఇతరులకు హాని కలిగిస్తే మరు జన్మలో దానికి తగ్గట్టు నీచ స్థితికి వెళ్తాం. కాబట్టి మనం మన స్థితికి బాధ్యులం. మన తలిదండ్రులను, జీవిత భాగస్వామిని, పిల్లలను నిందించడం వ్యర్థం.

వేరే మాటల్లో చెప్పాలంటే మనమే జన్మలోనైనా సమస్యలను పరిష్కరించుకొని, ఉన్నత స్థితికి ఎదగవచ్చు. మనం దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇతరుల సంసారం మన సంసారం కన్నా ఉన్నతంగా ఉందని తలుస్తాం. నా అమ్మమ్మ "ప్రక్కింటి మల్లె పువ్వు మనదానికన్నా ఎక్కువ సువాసన కలది" అని అనేది. మనలో చాలా మందికి మంచి తలిదండ్రులు, మిత్రులు, పిల్లలు ఉంటారు. వారిలో లోపాలు కూడా ఉంటాయి. మన తలిదండ్రులు ఏ లోపాలు లేకుండా ఉంటే వారికీ జన్మ ఉండేది కాదు. కాబట్టి మన ప్రస్తుత జన్మ మన లోపాలను సరిదిద్దుకోవటానికై ఇవ్వబడినది. యోగులు చెప్పేది మనమందరము తప్పులు చేస్తాము; కొ౦త మోతాదులో తప్పులు చేయకపోతే మనం ఉత్తమ మార్గంలోకి వెళ్లలేము. కాబట్టి మన౦ భూత, వర్తమాన కాలాల గురించి చింతించనక్కరలేదు. ధ్యానం ద్వారా మన భవిష్యత్ ను ఉత్తమంగా మలచుకోవచ్చు.

జీవితం ఒక పాఠశాల వంటిది. మనం భగవదైక్య౦ చెందేవరకు లేదా ప్రాణుల ఐక్యతను తెలిసికొనేవరకు ఆ పాఠశాలకు వెళ్తూ ఉండవలసిందే. ఆత్మహత్య అతి నీచమైన క్రియ. భౌద్ధులు, హిందువులు ఆత్మహత్య చేసికొనేవారు మరల, మరల, జన్మించి, కష్టాలను ఎదుర్కొని తమ స్థితిని మెరుగు పరుచుకునేవరకు భగవదైక్యం పొందలేరు అని అంటారు. ఈ జన్మలో కష్టాలు ఎందుకంటే మనం వాటిని ఎదుర్కొని పరిష్కరించే మార్గాన్ని తెలిసికొనడానికి. అలా కాక పోతే మనం కష్టాల వలయంలో కూరుకుపోతాం. మనమే కష్ట స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని స్వార్థం తగ్గించుకొని, ఇతరుల శ్రేయస్సుకై పాటు పడాలని తలుస్తాడు. అతడు మనకు కష్టాలనుంచి గట్టెక్కించే సులభమైన మార్గాన్ని చూపడు. కానీ మన వేర్పాటును అధిగమి౦చి, భగవంతుడు అందరిలోనూ, మన శత్రువులనుకూడా కలుపుకొని, ఉన్నాడని తెలిసికొ౦టే మన జీవిత లక్ష్యాన్ని సాధించి మరు జన్మ పొందవలసిన అవసరం ఉండదు.

అర్జునుని అన్న ధర్మరాజు, అజాతశత్రు -- అనగా శత్రువులు లేనివాడు -- అనబడేవాడు. పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసము చేస్తున్న రోజుల్లో అనేకమంది ఋషులు వాళ్ళని పరామర్శించడానికి వచ్చేవారు. వారిలో ఒక ఋషి "మిమ్మల్ని కౌరవులు దేశంలో౦చి భహిష్కరించి అరణ్యాలకు పంపించినా నువ్వు అజాతశత్రుగా ఎందుకు ఉన్నావు?" అని అడిగేడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం ఇచ్చేడు: "నన్ను అరణ్యాలకు పంపించి, నా బంధు మిత్రులనుండి వేరు చేసింది నిజమే. కానీ నా రాజ్యాన్ని ఆక్రమించిన వాళ్ళు నా శత్రువులు కారు. ఇతరుల మేలుకై నేను వాళ్ళకు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. వాళ్ళు నన్ను శత్రువు అనవచ్చు. కానీ వాళ్ళు నాకెప్పుడూ మిత్రులే". అతడు దేవుని ప్రతి జీవిలో చూసినవాడు కాబట్టి తనను మోసగించి, తన రాజ్యాన్ని అపహరించిన వాళ్ళను కూడా మిత్రులిగా భావించేడు. ఇది మనం ముఖ్యంగా నేర్చు కోవలసిన పాఠం. పురాణాలు ధర్మరాజు మరణించిన తరువాత మరొక జన్మ లేకుండా భగవంతునితో ఐక్య మయ్యేడని చెప్తాయి. 116

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...