Saturday, April 9, 2022

Eknath Gita Chapter 9 Section 3

Bhagavat Gita

9.3

అశ్రద్దధానాః పురుషా ధర్మ స్యాస్య పరంతప {9.3}

అ ప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసార వర్త్మని

పరంతపా! ఈ ధర్మమునందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేక మరల జనన మరణ రూప సంసారమునందు అల్లాడుచుందురు

శ్రద్ద అనగా హృదయమునందు ఉంచబడినది. మన నమ్మకం శ్రద్ధ మనము కోరుకున్నది ఫలింప జేస్తుందని -- అంటే మనము ఆలోచించినది కాక, మన హృదయంలో నమ్మునది. కాబట్టి ప్రతి ఒక్కనికి ఏదో ఒక దానిమీద నమ్మకం ఉంటుంది. స్కీఇంగ్ చేసేవారు మంచు కొండమీద, క్రిందికి రెండు కాళ్ళ క్రింద పలచటి కర్ర లేదా ఫైబర్ గ్లాస్ ముక్కలు పెట్టుకొని, పయనిస్తారు. వారికి అమితమైన శక్తి, ఉత్సాహం ఉండి సాహసాలు చేస్తారు. కానీ వాళ్ళు నమ్మేది స్కీఇంగ్ వలన వాళ్ళకు మిక్కిలి సంతోషం కలుగుతుందని. మనందరం ఏదో ఒకటి స్కీఇంగ్ లాగే శాశ్వత సుఖం ఇస్తుందని నమ్ముతా౦. కానీ కొందరు తమ నమ్మకాన్ని చెడు కార్యాలకై వినియోగిస్తారు. వారికి త్రాగుడు, మారక ద్రవ్యాల అలవాట్లు, లేదా అపాయకరమైన సాహసాలు చేయాలనే కాంక్ష ఉండి, చివరికి సమసిపోతారు.

గీత అటువంటి సమస్యలకు ఒక ఉత్తేజపరిచే సూచన ఇస్తుంది. మన నమ్మకం జీవితానికి తోడ్పడే దానిపై లేకున్నా, మనకు నమ్మకమంటూ ఒకటుండడమువలన ఆశ మిగిలి ఉంది. మన నమ్మకము చెడు నుంచి మంచికి మారితే మనం స్కీఇంగ్ చేసే వారిలాగ లేదా ప్రపంచాన్ని చుట్టి వచ్చే వారిలాగ, ఆధ్యాత్మిక సాధన ఉత్సాహంగా చెయ్యచ్చు. నేను స్కీఇంగ్ చేసేవారికి చెప్పేది: "మీలాంటి స్కీఇంగ్, కొండమీదనుంచి క్రిందకు వెళ్ళడం, నా నమ్మకానికి తగినది కాదు. మీరు కొండ క్రిందనుంచి మీదకు స్కీఇంగ్ చేసుకొంటూ వెళ్లగలరా?" ధ్యానం ఎదురీత లేదా కొండ ఎక్కడం లాంటిది. ఎవరైతే అట్టి సవాలును స్వీకరిస్తారో వారు తమ శ్రద్ధను ఉపయోగించి క్లిష్టమైన ధ్యానం చేస్తారు. అటువంటి సవాలు స్వీకరిస్తే, మద్యానికి బానిస అయినవాడు మద్యం సేవించని వానికన్న దృఢమైన వ్యక్తిగా మారుతాడు. 145

Eknath Gita Chapter 9 Section 2

Bhagavat Gita

9.2

రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమం {9.2}

ప్రత్యక్షావగమ౦ ధర్మ్య౦ సుసుఖం కర్తు మవ్యయమ్

ఈ జ్ఞానము సమస్త విద్యలలో రాజు వంటిది . అతి రహస్యమైనది. ధర్మ స్వరూపమైనది. సులభ సాధ్యమైనది. నాశ రహితమైనది ఀ

ధ్యానంగురించ కొన్ని వేల పుస్తకాలున్నాయి. వాటన్నిటినీ చదవడానికి ఒక జీవితకాలం సరిపోదు. కాబట్టి ధ్యానం ఏదోవిధంగా మొదలెట్టడం మంచిది.

ధ్యానం అత్యంత రమ్యంగా ఉంటుందని కొందరంటారు. మీరు ఆకాశంలో తేలుతూ, సుగంధాలు ఆస్వాదిస్తూ ఉంటారని వారంటారు. కానీ అటువంటి అనుభవాలు చాలా మందికి రావు. ధ్యానంకై చాలా కష్టపడాలి. కొన్నాళ్ళు ధ్యానం చేసి, దాన్ని వదిలేసేవారు కూడా ఉన్నారు. అలాకాకుండా ఉండడానికి నేను కొన్ని సూచనలను ఇస్తాను.

మొదటి సూచన, ధ్యానం ఇతరులతో కలిసి చేస్తే ఉత్తమం. భార్యాభర్తలు కలిసిచేస్తే అది పిల్లలు కూడా అలవరచుకొని వృద్ధి లోకి వస్తారు.

రెండవ సూచన ధ్యానంలో స్థిరంగా ఉండండి. ఒక రోజు ధ్యానం మానేస్తే దాన్ని సవరించుకోడానికి వారం రోజులు పడుతుందని చెప్తారు. కాబట్టి ధ్యానాన్ని రోజూ ఒక నిర్ణీత సమయానికి చేయడం మంచిది.

మూడవది ధ్యానం ఒక పద్దతిలో -- అనగా మంత్రాన్ని జపిస్తూ, పరోపకారాన్ని పాటిస్తూ -- చెయ్యాలి.

నాల్గవది మీ అలవాట్లను పరిశీలించండి. ఉదాహరణకి మీరు తినే ఆహారం , వ్యాయామం. ఒక ఒలింపిక్స్ క్రీడాకారునిలా తగినంత మోతాదులో పోషకాహారాన్ని తింటూ, నిద్రపోతూ, వ్యాయామం చేస్తూ ఉండాలి. మన దేహం కర్మలకై ఇవ్వబడినది. కాబట్టి ధ్యానాన్ని వ్యాయామంతో అనుసంధానం చేయాలి. వ్యాయాయమంటే బరువులెత్తడం మాత్రమేకాదు. కాలి నడక కూడా వ్యాయామమే. యుక్త వయస్కులు బరువులెత్తడం వంటి కష్టమైన క్రియలు చేయవచ్చు.

చివరిగా మీరు అందరితో కలసి మెలసి సామరస్యంతో ఉండాలి. మనము ధ్యానంలో అంతర్ముఖులమై ఉంటాము కనుక, దానిని ఇతరులతో కాలం గడపడానికై అనుసంధానము చెయ్యాలి.

ధ్యానం చేస్తున్నంత కాలం ఉత్సాహం కలిగించే గీత వంటి ఆధ్యాత్మిక గ్రంధాలను నెమరువేసుకోండి. అందుకై మీరు తీరిక దొరికినప్పుడు ఆధ్యాత్మిక గ్రంధాలను చదవటం అలవారుచుకోవాలి. ఇది గాలిపటం ఎగరవేసినంత సులభం. మొదట దారాన్ని క్రమంగా వదలి గాలిపటాన్ని ఆకాశంలో ఎగరివేయాలి. గాలిపటం ఏకాగ్రత, దారం సమయం. దారం వదిలేస్తే గాలిపటం ఎగిరిపోతుంది. కాబట్టి ఏకాగ్రతకై సమయం వెచ్చించండి.

మనస్సు ఎప్పటికీ చంచలమే. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ సేల్స్ చెప్పినట్లు "మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు వేరొక చోటికి పోతే దాన్ని దేవుని వైపు మరల్చండి. మీరు ధ్యానం చేసిన సమయంలో మనస్సును తిరిగి దేవుని మీద పెట్టడానికై పూర్తిగా చేసినా ఫలితం ఉంటుంది." కొన్నాళ్ళు ఇలా సాధన చేస్తే మన అచేతన మనస్సును, చేతనంగా ఉన్నప్పుడే, పరిశీలించే సమర్థత వస్తుంది. దానిలో అనేక అపోహలు, భ్రమలు ఉండవచ్చు. కాబట్టి మంత్ర జపం తోనో, గీత వంటి గ్రంథాలను నెమరు వేసికోవడమో చేయండి.

ధ్యానంలో నిద్ర రావచ్చు. కొంతమంది ధ్యానంలో గాఢనిద్ర పోతారు. కొంత మంది వారికి తెలియకుండా నిద్రలోకి జారుకుంటారు. అలా కాకుండా ఉండడానికి నేలపై పద్మాసనం వేసి, వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేయండి. అదీ సాధ్యం కాకపోతే మంత్రాన్ని జపిస్తూ మీ ఇష్ట దైవాన్ని మనోఫలకంలో నిలుపుకోండి.

క్రొత్త విషయాలను తెలిసికొ౦టూవుంటే ధ్యానంలో వాటిని గుర్తుకు తెచ్చుకొని విశ్లేషణము చేసి మనస్సును ఎప్పుడూ నూతనంగా ఉండేటట్టు చేసికోవచ్చు. అలా కాకపోతే మనస్సు యాంత్రికంగా పాత భావాలే కల్పిస్తుంది. మనం చదివే గ్రంథాలు గీతే కావక్కరలేదు. ఎటువంటి ఆధ్యాత్మిక గ్రంథమైనా ఫరవాలేదు.

భారత దేశంలో ఉసిరికాయను ఇష్టపడని వారు ఉండరు. నేను మొదటిసారి ఉసిరికాయను తిన్నప్పుడు అది చేదుగా ఉండి, ఉమ్మేద్దామని అనుకొన్నాను. నా అమ్మమ్మ దాన్ని నములుతూ ఉండమని చెప్పింది. నేను నములుతూ ఉంటే దాని రుచి తీయగా మారింది. ధ్యానం ఉసిరికాయ వంటిది. మొదట్లో అది ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు. పట్టు వదలక సాధన చేస్తే మీరు ధ్యానంకై వెచ్చించే సమయం అత్యంత విలువైనదని తెలిసికొ౦టారు. 144

Eknath Gita Chapter 9 Section 1

Bhagavat Gita

9.1

శ్రీ భాగవానువాచ :

{9.1}
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యా మ్యనసూయవే

జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్

దేనిని తెలిసికొనిన పిదప అశుభము నుండి విడిపడెదవో అట్టి అనుభవ సహితమైన రహస్య జ్ఞానమును అసూయ లేని నీకు చెప్పుచున్నాను ఀ

ధ్యానం లో పరిపక్వత చెంది మన౦ రాజ యోగం పాటించి జీవితాన్ని ఉద్ధరించుకోగలం. ఈ శ్లోకంలో జ్ఞానము, విజ్ఞానము అనుపదములు శ్రీకృష్ణుడు ప్రయోగించెను. జ్ఞానమనగా, భౌతిక ప్రపంచము గూర్చి కాక, సమస్త జీవులలోనూ భగవంతుడున్నాడని తెలిసికొనుట. విజ్ఞాన మనగా జ్ఞానమును నిత్య జీవితంలో ఉపయోగించుట. శ్రీరామకృష్ణ ఇట్లు వివరించెను: మేధ రెండు కర్రల రాపిడి వలన అగ్ని పుట్టునని చెప్పును; జ్ఞానముతో అగ్నిని కర్రల రాపిడితో సృష్టించడం; విజ్ఞానమనగా ఆ అగ్నితో అన్నము వండి, దానిని తిని, శక్తిని పొందుట.

ఆర్నాల్డ్ టాయిన్ బీ అనే చరిత్రకారుడు మనము సాంకేతిక శాస్త్రముల౦దు ప్రగతి సాధించడానికి కారణము, మనలో ఎక్కువమంది వానిని అధ్యయనము చేయడం వలన అని చెప్పెను. మనము యుద్ధము చేయుటలో మిక్కిలి పురోగమించి మానవాళిని సమూలంగా తుడిచివేయగల అస్త్రాలను సాంకేతిక జ్ఞానము వలన తయారుచేసేము. అలాగే జన్యువులను మార్చగలము, అవయవముల మార్పిడి చేయగలం, రోదసిలో మన ఉనికిని చెప్ప గలిగే యంత్రములను తయారు చేయగలం. ఇవి అన్నీ అనేకమంది కలసి పనిచేయడం వలన సాధ్యము. అయినప్పటికీ మన౦ సామరస్యంతో కలసి ఉండలేకపోతున్నాం. దేశాల మధ్య, మనుష్యుల మధ్య స్పర్థలను నివారించ లేక పోతున్నాం.

దీని వలన విచారించనక్కరలేదు. సాంకేతికత వలన ఎట్టి తప్పు లేదు. సమస్య ఏమిటంటే అది ఒక దిశను నిర్దేశించలేదు. భౌతిక సృష్టిని ఎంత అధ్యయనం చేసినా మనము ఆధ్యాత్మికత అలవరచుకోలేం. మనము కనిపెట్టినవాటికి, శోధించినవాటికి, అమలు చేసినవాటికి మనమే ఒక దిశ నిర్దేశించాలి. మనము సాంకేతికతకై వెచ్చించిన సమయంలో అతి తక్కువ భాగము శ్రీకృష్ణుడు చెప్పిన బ్రహ్మ విద్యకు -- అనగా ఆత్మ జ్ఞానమునకై -- కేటాయించిన ప్రపంచంలోని సమస్యలను నిర్మూలించగలము.

నాడులను, మెదడును అధ్యయనము చేసే శాస్త్రజ్ఞులు, మెదడులోని ఎడమ భాగము విశ్లేషణ, వ్యక్తిత్వము, మాట్లాడుట, వ్రాయుట, తర్కము, గణితము మొదలగువాటికి కారణమని చెప్పేరు. వారికి మెదడుకు అవి ఎలా సాధ్యమో తెలియదు. కానీ మెదడులోని కుడి భాగము మిక్కిలి క్లిష్టమైనది. దానివలన సృజనాత్మక శక్తి, అంతర్బుద్ధి (intuition), కళలను మెచ్చుకొనుట సాధ్యము. మనకు నాడుల, మెదడు గురించి పూర్తిగా తెలియకపోయినా, మెదడులో ఏ ఒక్క భాగమూ లేకున్నా మనము సరిగా పనిచేయలేము. మనము మెదడులోని ఎడమ భాగమును వృద్ధి చేసి అన్ని భౌతికమైన కర్మలు చేయగలిగి, కుడి భాగమును విస్మరిస్తున్నాము.

ధ్యానము దీనికి సహకరిస్తుంది. ధ్యానము వలన మెదడు యొక్క కుడి, ఎడమ భాగములు సమతుల్యమవుతాయి. మన చేతనము, శరీరానికి సంబంధించిన కర్మలు అనుసంధానము చేయబడతాయి. దానికై మన శాస్త్రములు కుండలిని శక్తి మూలాధార చక్రమునుండి వెన్నెముక ద్వారా మెదడులో ప్రవేశించే సాధన చేయమని చెప్పుచున్నవి. కొన్ని సంవత్సారల సాధనతో కుండలిని శక్తిని శిరమున వ్యాపింప జేసిన, మన మెదడులోని కణములు ప్రభావితమౌతాయి. దానినే సమాధి అందురు. దానివలన మన వ్యక్తిత్వము పూర్తిగా మారుతుంది. అటు తరువాత మన సృజనాత్మక శక్తి పెరిగి సమస్యలను పరిష్కరించగల మార్గము తెలుస్తుంది. అలాగే వాటిని పరిష్కరిస్తే గాని విశ్రమించని ఓర్పు కలుగుతుంది.

ఉదాహరణకు సమాజంలోని హింసాకాండను తీసికొ౦దాం. ప్రతిఒక్కరికీ హింస రాను రాను పెరుగుతున్నాదని తెలుసు. కానీ చాలామంది దానితోనే జీవనము సాగించాలని, విధి వ్రాత అని అనుకొంటారు. దానిని నేను అంగీకరించను. దోపిడీలను అరికట్టడానికి మనము ఇళ్ళల్లో అలారం లను ఏర్పరచుకొంటున్నాం. అపాయకరమైన రసాయనాలను దొంగలపై ప్రయోగించడానికి కొంటున్నాం, తుపాకులను జేబీలో పెట్టుకొని తిరిగుతున్నాం. కానీ హింసను సమూలంగా తీసి వేయలేక పోతున్నాం. హింసకు మూల కారణము కొందరు సమాజంలో వేర్పాటుతో బ్రతకడం వలన. మనము దానిని పరిష్కరించ లేనంతకాలమూ హింసను అరికట్టలేము.

యోగులు చెప్పే పరిష్కారము: ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న వారితో ధృడమైన బంధాలు ఏర్పరచుకోవలెను. జీవితంలో డబ్బు, పేరు, ప్రతిష్ఠ కన్నా మన బాంధవ్యాలు ముఖ్యమైనవి. మన పొరుగింటివారితో సామరస్యంతో ఉండాలి. సదా టివితో కాలం గడపకుండా ఉండాలి. ఇంటిని జీవితానికి కేంద్రంగా మలచుకోవాలి. మిత్రులతో కలసి వ్యాయామం చేయాలి. పిల్లలతో ఆడుకోవాలి. ఇది ఎంత ఆహ్లాదమంటే, కొన్నాళ్ళ తరువాత వేర్పాటుతో జీవించిన కాలాన్ని ఒక పీడకలగా చూస్తాము. 139

Eknath Gita Chapter 8 Section 17

Bhagavat Gita

8.17

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ

దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం {8.28}

అత్యేతి తత్సర్వమిదం విదిత్వా

యోగీ పరం స్థానముపైతి చాద్యమ్

ఈ విషయమును తెలిసిన యోగి వేదముల వలనను, యజ్ఞముల వలనను, తపస్సుల వలనను, దానముల వలనను, కలుగు ఫలమును దాటి పోవుచున్నాడు. మరియు ఆద్యమైనట్టియు, ఉత్కృష్టమైనట్టియు పదమును పొందుచున్నాడు ఀ

ఆధ్యాత్మిక జీవనానికి ధ్యానం పునాది వంటిది. ధ్యానం వలననే యోగులు చెప్పిన బోధలు మన అవగాహనకు వచ్చి, వాటిని కార్యాచరణలో పెడతాం. ధ్యానం వలననే క్రోధము నశించి మన౦ అన్ని వేళలా సహనం పాటిస్తాము. ధ్యానం మొదట్లో ఎంతో ఉత్తేజకరమైనది కాదు. అది చాలా కష్టంతో కూడినది. కానీ నా మిత్రులు ఉదయాన్నే పక్క మీదనుండి లేచి, అది చలి కాలమైనా, ఎండయినా వానయినా, ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా, ధ్యానం ఎంతో శ్రద్ధతో, ఉత్సాహంతో చేస్తారు. ఎందుకంటే వారి స్వీయనుభవంతో ధ్యానం తమ జీవన శైలిని ప్రభావితం చేస్తుందని గ్రహించేరు.

Eknath Gita Chapter 8 Section 16

Bhagavat Gita

8.16

వైతే సృతీ పార్థ జానాన్ యోగీ ముహ్యతి కశ్చన {8.27}

తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున

ఈ రెండు మార్గములను తెలిసిన యోగి ఎవడును మోహము నొందడు. కావున సర్వకాలముల యందును నీవు యోగివి కమ్ము

మన౦ వేరుగా నుండి, చీకటి మార్గంలో పయని౦చడం ఒక లీల. ఈ ప్రపంచమంతా లీల. భగవంతుడు అనేక రూపులు దాల్చి అనేక పాత్రలను పోషిస్తున్నాడు.

మనం ఒక వేషం వేసుకున్నామని మరచిపోయేం. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నటిస్తూ మనమెవరమో మరచిపోయేం. క్రమంగా మనం నటిస్తున్న పాత్రలో లీనమైపోయేం. ఈ భ్రమ మాయ వలన కలిగెను. మన అహంకారాన్ని వీడితే మనమంతా ప్రపంచమనే వేదిక మీద నటిస్తూ, అనేక పాత్రలు పోషిస్తూ ఉన్నామనే జ్ఞానం కలుగుతుంది.

భార్యా భర్తల మధ్య చికాకులు రావచ్చు. భోజనం మధ్యలో ఒక అమాయక ప్రశ్న కలగవచ్చు. మనకది నచ్చక భాగస్వామితో వాదిస్తాము. మనం భాగస్వామి ఏమందో, ఏ భావనతో అ౦దో, అర్థంచేసికోక, మన దృష్టి కోణంలో ఏమని అ౦దో అని ఆలోచిస్తాము. అందుకే బుద్ధుడు చెప్పెను: అవతలి మనిషి సమస్య కాదు. చిక్క౦తా మన మనస్సులోనే ఉంది. మన మనస్సు నిర్మలంగా ఉంటే మన పాత్రలు సక్రమంగా పోషించగలము.

ఒకమారు నేను లీలను అర్థంచేసికొన్నాక, నా తరగతి గదికి ఒక రంగస్థలము మీదకి వెళ్ళినట్టు వెళ్ళేవాడను. నేను తగిన దుస్తులు ధరించి, ఒక మేధావిలా తయారయ్యి, "నువ్వు ఆంగ్ల ప్రొఫెసర్ ఏకనాథ్ ఈశ్వరన్" అని అనుకుని, పాఠం మొదలుపెట్టేవాడిని. అలాగే పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు దానికి అలాంటి వేషం వేసేవాడిని. కానీ ఇంటికెళ్ళేటప్పుడు అన్ని పనికి సంబంధించిన వేషాలూ తీసి సర్కస్ లో పాత్ర ధారిలా ఇంటి వేషంలోకి మారిపోతాను. ఇలా చేయడం బాగా వంట పడితే, దాని వలన చాలా సంతృప్తి కలిగి, జీవితం ఒక కళ అనే అవగాహన కలుగుతుంది. 134

Eknath Gita Chapter 8 Section 15

Bhagavat Gita

18.15

శుక్ల క్రిష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే {8.26}

ఏకయా యాత్యనావృత్తి మన్యయా ఆవర్తతే పునః

ఈ శుక్లకృష్ణమార్గములు జగత్తు నందు శాశ్వతముగ నున్నవి. ఇందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యమును, రెండవ దానివలన పునర్జన్మమును కలుగుచున్నవి ఀ

మన శాస్త్రములు మనలో 7 చక్రాలు ఉన్నాయని చెప్తాయి. అవి: మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహిత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారము. వెన్నెముక క్రిందన కుండలిని శక్తి వృత్తాకారంలో ఉంటుంది. అది సాధారణంగా క్రింది 3 చక్రాలలో సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కుండలిని 4 వ చక్రము, లేదా దానిని దాటి ఉంటుందో, పై శ్లోకములో చెప్పిన కాంతి కనిపిస్తుంది.

అలాగ కాంతి పుంజము కనబడితే, జీవితం స్వచ్ఛంగా కనబడుతుంది. ధ్యానంవలన మన దైనింద జీవితంలో మార్పు వస్తుంది. మన నడవడిక, వ్యక్తిత్వము ధ్యానము వలన పురోగమిస్తున్నాయా? అన్న ప్రశ్న దీనికి పరీక్ష. మనము ధ్యానంలో ఉన్నప్పుడు గాని, నిద్రి౦చు నప్పుడు గాని, ఆ కాంతి పుంజము కనిపిస్తే మనకు శుభఫలితాలు వస్తాయి. పాత నిరోధాలు, బంధు మిత్రులతో స్పర్థలు తొలగవచ్చు. ఈ మార్పులు వచ్చేయంటే మన అనుభవము సత్యమైనది. అలా కాకపోతే మనమి౦కా సాధన చేయాలి.

సాధారణ వ్యక్తులకు ఆ కాంతి పుంజము యొక్క అనుభవము రాదు. సాధనతో కుండలిని 4 వ చక్రము చేరితే ఆ కాంతి అంత ప్రజ్వలంగా ఉండక పోవచ్చు. యోగులు చెప్పినట్టు దేహం కాంతితో నిండియున్నది. కానీ అది మనం చూడలేము. కాంతి పుంజము కనబడినప్పటినుంచీ మనకు ధ్యానం చేయడానికి ఉత్సాహం పెంపొంది, జీవుల ఐక్యతను గ్రహిస్తాము. మన బంధుమిత్రులు క్షేమంగా ఉంటే సరిపోదు. మనము మన ప్రేమను అందరికీ పంచి పెట్టాలి.

కుండలిని శక్తి 5 వ చక్రము చేరితే, మన జీవితము పైన అవగాహన ఇంకా ఎక్కువ అవుతుంది. మరింత సాధన చేస్తే కుండలిని మన కనుబొమల మధ్యకు వస్తుంది. దీనిని సవికల్ప సమాధి అంటారు. ఎందుకంటే మన ధ్యానం ఒక దేవత మీద ఉంటుంది. ఆ దేవత సమస్త సృష్టిలో ఉన్నదన్న జ్ఞానము కలుగుతుంది. అంటే వేరొక జీవికి అపకారం తలపెట్టం.

కుండలిని 7 వ చక్రము చేరితే కాంతి పుంజము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. దీని నిర్వికల్ప సమాధి అంటారు. ఇది అనన్యమైన మనస్సుతో సాధన చేస్తేనే సాధ్యము. సూర్యుని కళ్ళతో చూస్తే ఎలాగ చూపు పోతుందో, ఈ కాంతి ప్రకాశం సాధారణ మనుష్యులు చూడలేరు.

కుండలిని 7 చక్రాలలో వ్యాప్తమై ఉన్నప్పుడు, మనము దేవయాన మార్గములో, సూర్యుని వైపు ప్రయాణిస్తాము. అది దేవతల లోకానికి తీసికవెళ్తుంది. ఇది మనము ధ్యానం చేసి, ఇతరులతో సంబంధాలూ లేదా కలహాలు పెట్టుకోకుండా ఉంటేనే సాధ్యము. ముండక ఉపనిషత్తు ఈ విధముగా చెప్పెను:

చిత్తశుద్ధి గలవారు, ధ్యానం చేసేవారు

ఇంద్రియములను, కోరికలను నియంత్రించి

సమస్త కాంతికి, జీవులకు కారణమైన

పరమాత్మను పొందెదరు.

రెండవ మార్గము చంద్రుని వైపు ఉంటుంది. చంద్రునికి సహజమైన కాంతి లేదు. అది చీకటితో నిండి ఉన్నది. మనము ఇంద్రియములతో తాదాత్మ్యము చెంది -- పనికిరాని పదార్థాలను తినడం, మద్యానికి అలవాటు పడడం వంటివి -- దేహం చీకటితో నింపుకుంటే ఈ మార్గాన వెళతాం.

సుఖాలకై ప్రాకులాడే వారు వారి సంపద లేదా యవ్వనమును చూచి ఓర్వలేని వారలను ఎదుర్కొంటారు. యుక్త వయస్సులో మనం చేసిన తప్పులను భగవంతుడు దయతో క్షమించడం వలననే ప్రస్తుత స్థితికి వచ్చేము. కానీ మనం సదా యువకులుగా ఉండలేము. క్రమంగా వృద్ధాప్యంలో చైతన్యము తగ్గి, మన౦ జీవితం యొక్క దిశను నిర్దేశింపలేక ఉంటాము. వృద్ధాప్యంలో మనకు చైతన్యం ఉన్నా, మనకున్న చాపల్యం వలన దేహాన్ని అంటిపెట్టుకొని ఉంటాము.

మనమెంత మూర్ఖత్వంతో ఉంటామో మన దేహంలో అంత చీకటి ఉంటుంది. అది తక్కిన వారితో మన బాంధవ్యాలను ప్రభావితం చేసి, వారితో ఎలా కలసిమెలసి ఉండాలో తెలియజేయదు. ధ్యానంలో చివరకు సంపూర్ణమైన కాంతి ఎలా పొందుతామో, స్వార్థ పూరితులమైతే పూర్తి చీకటిని అనుభవిస్తాము.

స్వార్థం ఎక్కువవుతున్న కొద్దీ మన దృఢసంకల్పం ఎక్కువవుతుంది. అట్టి స్థితిలో మన మాటే నెగ్గాలనే భావనలో ఉంటాం. ఇతరులకు వేరే భావనలు ఉండ వచ్చని ఒప్పుకోము. ఇలాంటి వ్యక్తులకు సహనం ఎలాగ సాధ్య మవుతుంది? నడివయస్సు దాటిన తరువాత సహనం, ఒకప్పుడు లేకపోతే, క్రొత్తగా నేర్చుకోవడం కష్టం. కొందరు నాతో "మేము మారలేము" అని చెప్తారు. నా సమాధానం ఎప్పుడైనా మనము మారవచ్చని. కాకపోతే దానికై కష్టపడాలి. మనమెంతో కాలము చీకటిలో బ్రతికినా, కాంతి మార్గంలోకి మారవచ్చు. 132

Eknath Gita Chapter 8 Section 14

Bhagavat Gita

8.14

యత్ర కాలే త్వనావృత్తి మావృత్తి౦ చైవ యోగినః {8.23}

ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ

అర్జునా! ఏ కాలమున గతించిన యోగులు జన్మ రాహిత్యము పొందుదురో, ఏ కాలమందు గతించినవారు పునర్జన్మమును పొందుదురో ఆయా విషయములను చెప్పుచున్నాను

అగ్నిర్జ్యోతి రహ శుక్ల ష్షణ్మాసా ఉత్తరాయణం {8.24}

తత్ర ప్రయాతా గచ్ఛ౦తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః

అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఆరునెలలు గల ఉత్తరాయణము అనెడి మార్గమునందు వెడలిన బ్రహ్మవేత్తలగు వారు బ్రహ్మమునే పొందుచున్నారు

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం {8.25}

తత్ర చాంద్రమాసం జ్యోతి ర్యోగీ ప్రాప్య నివర్తతే

ధూమము, రాత్రి, కృష్ణపక్షము, ఆరునెలలు గల దక్షిణాయనము అనెడి మార్గమునందు వెడలిన యోగి చంద్ర లోకాదులకు వెళ్ళి తిరిగి పునర్జన్మ నెత్తుచున్నారు

ఈ శ్లోకాలు ఆత్మ మరణం తరువాత రెండు మార్గాల ద్వారా వెళుతుందని చెప్తున్నాయి. ఒకటి ఉత్తరాయణ; రెండవది దక్షిణాయన. ఉత్తరాయణంలో సూర్యుడు ఆరు నెలల పాటు ఉత్తరార్ధ గోళంలో సంచరిస్తాడని, దక్షిణాయనములో ఆరు నెలల పాటు దక్షిణార్థ గోళంలో సంచరిస్తాడని చెప్తారు.

మనం అక్షరాస్యులమైనా, కాకపోయినా, ధనవ౦తులమైనా లేదా పేదవారములైనా ఒకానొక ఎన్నిక చేసుకోవాలి. అది మన బాగుకై కర్మ చేయాలా లేదా ఇతరులకై పాటు పడాలా. మనం ఇతరులకొరకై పాటు పడేవారిని ఆదర్శంగా తీసికొ౦టా౦. కానీ మన వరకూ వచ్చేసరికి ఏమి చేయాలో తెలీదు. మనం స్వార్థ పూరితంగా ఉన్నంతసేపూ ఇతరుల సంక్షేమము గురించి ఆలోచింపక తప్పు ఎన్నికలు అప్రయత్నంగా చేస్తాం.

మహాభారత యుద్ధంలో భీష్ముడు శస్త్రములతో ఛేదింపబడి నేల కొరిగేడు. అప్పుడు దక్షిణాయనం. భీష్మునికి స్వచ్ఛ౦ద మరణం ఉన్నది కనుక అతడు శరతల్పముపై పడుక్కొని, ఉత్తరాయణం కొరకై వేచి, అనేక బాధలను అనుభవించేడు. ఎప్పుడైతే సూర్యుడు విషువత్ (equinox) చేరుకొన్నాడో భీష్ముడు ప్రాణం విడిచేడు.

నా అమ్మమ్మ దక్షిణాయనంలో వ్యాధిగ్రస్తురాలయింది. వైద్యులు ఆమె ఎంతోకాలం బ్రతకదని చెప్పేరు. కానీ ఆమె ప్రాణాన్ని బిగపెట్టుకొని ఉత్తరాయణంలో మరణించింది. దాని వలన మాకు తెలిసినదేమిటంటే ఎవరికైతే దేవుడియందు అమితమైన ప్రేమ ఉంటుందో, ఎవరైతే ఇతరుల సంక్షేమానికై పాటు పడతారో, వారికి అమితమైన పట్టుదల ఉంటుంది.

మనం కూడా దేవుని యందు పరిపూర్ణ భక్తితో, ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. మొదట్లో అది బాధ కలిగించినా, చివర్లో సత్ఫలితాలు ఇస్తుంది.

ఈ శ్లోకాల్లో ఉత్తరాయణ మార్గం వెలుగుతో కూడినదని, దక్షిణాయనం చీకటి మార్గమని చెప్పబడినది. ఎవరైతే తమ ఇంద్రియాలను నిగ్రహించరో వారు చీకటి మార్గంలో పయనిస్తున్నారు. అట్టి వారు తమ చైతన్యమును కోల్పోయి, వ్యాధిగ్రస్తులై ఉంటారు. జీవితం చివరిలో చిన్ననాటి కోర్కెలు ఉండి, వాటిని ఎలా తీర్చుకోవాలో తెలీదు. అలాగే అహంకారంతో కూడి, దానిని ఎవరి మీద ప్రయోగించాలో తెలీదు. జీవితం దుర్భరమై, చావుకై ఎదురుచూస్తూ ఉంటారు. ఇది చీకటి మార్గము. కోట్లమంది ఈ మార్గంలో పయనిస్తున్నారు. ఎందుకంటే వారికి తమ దురలవాట్లను ఎలా వదిలించుకోవాలో తెలియదు. అలాగే అహంకారాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చెయ్యరు. మనము ఈ శ్లోకాల్లో చెప్పిన వెలుగు, చీకటి మార్గాలను గుర్తు పెట్టుకొంటే, ధ్యానం అలవర్చుకోవాలనే గాఢమైన ప్రేరేపణ కలుగుతుంది. 128

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...