Saturday, April 9, 2022

Eknath Gita Chapter 9 Section 8

Bhagavat Gita

9.8

మహాత్మానస్తు మాం పార్థ! దైవీం ప్రకృతి మాశ్రితాః {9.13}

భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్

పార్థా! మహాత్ములైనవారు దైవీ ప్రకృతిని ఆశ్రయించినవారై, ఆదియు, అవినాశియునైన నన్ను తెలిసికొని, అనన్య చిత్తముతో భజించుచున్నారు

మన మనస్సు సాధారణంగా పరిపరి విధాలుగా పోతుంది. పండగల వచ్చినపుడు వస్తువులు కొనడానికి బజారుకి వెళ్ళి ఇది కొందామా, అది కొందామా అని తర్జన భర్జన పడుతూ ఉంటాం. అలాగే కొన్నిరోజులు వీణ నేర్చుకొని దానిలో క్రొత్తదనము లేదని వీణ వాయించడం మానేస్తాం. ఈ విధంగా మనస్సు చంచలంగా ఉంటే జీవితంలో ఏమీ సాధించలేము. క్రొత్తవాటికి ఒక పరిమితి ఉంటుంది. మనము నూతన విషయాలకై సదా పరిగెడుతూ ఉంటే, దేనిలోనూ ప్రావీణ్యం రాదు.

అలా కాకూడదు అని అనుకొంటే, ఒకే విషయం మీద ఏకాగ్రత పెట్టాలి. మన విసుగు, మానసిక బాధ మన మనస్సులో కలిగే భావాల వలననే కాని బాహ్య ప్రపంచము వలన కాదు. వీణ నేర్చుకోవడం మొదలుపెట్టి, దాని మీద ఏకాగ్రత లేకపోవడంవలన వదిలేస్తాం. వీణ స్వతహాగా ఉత్తేజ పరిచేది, విసుగు కలిగించేది కాదు. దానిని వాయించడానికి కావలసిన ఏకాగ్రత, ఉత్సాహం ఉండాలి. ఈ విధంగా మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరిస్తే, మనం చేసే ప్రతి కర్మ సంతృప్తి కరంగా ఉండి, మంచి ఫలం ఇస్తుంది.

చిన్నప్పుడు పాఠశాలలో మా ఉపాధ్యాయుడు ఒక భూతద్దాని సూర్యుని వైపు పెట్టి, దాని ముందు కొన్ని కాగితాలను పెట్టి, వాటిని మండేటట్టు చేసేడు. అప్పుడు తెలిసింది సూర్యుని కిరణాలను భూతద్దం కాగితంపై కేంద్రీకరించి౦దని. అలాగే మన మనస్సు, ఆలోచనలు కూడా సూర్య కిరణాలు, భూతద్దం వలె పనిచేస్తాయి.

ధ్యానంవలన మన మనస్సును, ఆలోచనలను నియంత్రింప వచ్చు. సాధారణంగా మనస్సు అనేక విషయాలపై పరుగులెడుతూ వుంటుంది. దాని వలన ఉపయోగం లేదు. మనస్సును ఒకానొక విషయంపై కేంద్రీకరించినప్పుడే శుభ ఫలితాలు వస్తాయి. కానీ మనస్సును కేంద్రీకరించడం ఎలా?

ధ్యానంలో ఆలోచనా పరంపరలను తగ్గించుకోవాలి. ఒకానొక ఆలోచనను పట్టుకొని దాని మీద శ్రద్దతో మనస్సు నిలపాలి. క్రమంగా మన ఆలోచనలు నెమ్మదిగా రావడం మొదలుపెడతాయి. దాని వలన మనలోని వొత్తిడి, ఘర్షణ తగ్గుతుంది. ఇలాగ కొన్నేళ్ళు సాధన చేస్తే మన మనస్సును, బాహ్యంగా లేదా అంతర్గతంలో కానీ ఎటువంటి ఘర్షణలు ఉన్నా శాంతంగా, స్పష్టంగా, ఏకాగ్రతతో ఉంచుకోవచ్చు.

ఆలోచనల పరంపరను నెమ్మది చేయడం ధ్యానంలో చాలా ముఖ్యాంశం. వస్తున్న ప్రతి ఆలోచనను బుద్ధితో పరిశీలించి, అది చెడ్డదయితే విడనాడి, మంచిదయితే దానిమీద దృష్టి కేంద్రీకరించాలి.

మన మనస్సు అన్ని దిక్కులకూ పోతూ వుంటే మన ఆలోచనా శక్తి వృధా అవుతుంది. అదే మనస్సు ను ఒకే విషయము మీద కేంద్రీకరిస్తే మన ఆలోచనా శక్తిని సద్వినియోగం చేస్తాము. ఉదాహరణకి మనం విచారంగా ఉంటే చాలా శక్తి వృధా అవుతుంది. అనేకమంది గూర్చి ఆలోచించి, వారిని ఒకరితో ఒకరిని పోల్చి, మన ప్రణాళికలకు ఎవరు ఆటంకం కలిగిస్తున్నారని విశ్లేషణం చేస్తూ ఉండి, మన మీద మనమే జాలి పెంచుకుంటూ ఉంటే ఆలోచనా శక్తి వృధా అవుతుంది.

మా ఇంటిలో చలికాలంలో వేడికై కర్రలను నిర్ణీత ప్రదేశంలో మండించేవారము. నేను దానికై అనేక కర్రలను వాడవలసి వచ్చేది. అందుకు నేను ఒక పెద్ద కర్రల పోగును పెట్టేవాడిని. నా మిత్రుడు మా ఇంటికి వచ్చినపుడు అది చూసి, అన్ని కర్రల బదులు ఒక దుంగను వాడమని సలహా ఇచ్చేడు. దానిని పాటించి తెలుసుకొన్నదేమిటంటే అనేక కర్రల పోగుక౦టే, కొన్ని దుంగలే మేలు. దుంగలలో అత్యంత ఉష్ణ శక్తి కేంద్రీకరించబడి, వాటిని మండించినపుడు కావలసినంత ఉష్ణమే విడుదలవుతుంది. మన చైతన్యం కూడా ఒక దుంగ లాంటిదే. మన ఆలోచనలను విచ్చలవిడిగా పోనిస్తూ ఉంటే, దాని వలన ఏమీ లాభం లేదు. దాన్ని తెలుసుకోవాలంటే బజారులో ఏమీ కొనకుండా ఒక మారు నడిచిచూడండి. మన ఆలోచనలు, ఇంద్రియాలు అనేక కోర్కెలతో నిండి ఉంటాయి. అదే ఒక విషయం మీద ఏకాగ్రతతో పని చేస్తే మన ఆలోచనా శక్తి వృధా అవ్వదు. 159

Eknath Gita Chapter 9 Section 7

Bhagavat Gita

9.7

అవజావంతి మాం మూఢా మానుషీ౦ తమ మాశ్రితాం {9.11}

పరం భావ మజానంతో మమ భూతమహేస్వరమ్

సర్వ భూత మహేశ్వరుడగు నా వైభవమును తెలియని మూఢులు మానవ దేహమును ఆశ్రయించిన నన్ను అలక్ష్యము చేయుచున్నారు

మోఘాశా మోఘకర్మణో మోఘజ్ఞానా విచేతనః {9.12}

రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీ౦ శ్రితాః

వ్యర్థములైన కోరికలు గలవారు, వ్యర్థమైన కర్మల నాచరించువారు, అజ్ఞానులు, అవివేకులు మోహ సంబంధమైన ఆసురీ ప్రకృతిని పొందుచున్నారు ఀ

ఇక్కడ శ్రీకృష్ణుడు కొందరిని మూఢులని చెప్పుచున్నాడు. అట్టివారు జీవితమును పైపైనే చూసి, సుఖానుభవమునకై వస్తువులను కాంక్షిస్తారు. వారు మేధతో ఆలోచించలేరు. జీవితమంతా ఇంద్రియ సుఖాలకి, వస్తువులను పోగుచేసుకోవటానికి వ్యచ్చి౦చి దేహంతో తాదాత్మ్యం చెంది, జీవితాన్ని వ్యర్థం చేసుకొంటారు. దాని వలన ఎటువంటి సంతృప్తి ఉండదు. భౌతిక ప్రపంచం పరిమితమైనది; సదా మార్పు చెందునది. జీవితాన్ని పైపైనే బ్రతుకుతే ఇతరుల మేలుకై పాటుపడరు. ఇటువంటివారు, వారి ఉద్దేశాలు మంచివైనప్పటికీ, ఇతరులకు హాని కలిగించే కర్మలు చేయవచ్చు.

ఉదాహరణకి కొందరు ఎక్కువ ఉత్పత్తి చేసి, దానిని వినియోగించి తమ గమ్యాన్ని చేరాలని తలుస్తారు. శ్రీకృష్ణుడు దానిని మోఘాశా మోఘకర్మణో అంటాడు. అనగా "వ్యర్థమైన ఆశలు, వ్యర్థమైన కర్మలు". ఎవరైతే లాభానికై ఉత్పత్తి చేస్తూ, ఆనందానికై వస్తువులను వినియోగిస్తూ ఉంటారో వారు చివరకు నిరాశా నిస్పృహలు పొందుతారు. పెద్ద పెద్ద సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక వస్తువులను తయారు చేస్తూ, గ్రహించినదేమిటంటే మన భూమికున్న వనరులు పరిమితమైనవని. యోగులు వనరుల గురించి కాక, వాటిని ఉపయోగించు విధానము వ్యర్థమని చెప్పుచున్నారు.

సామాన్య జీవితము ఆనందదాయకము. సామాన్య జీవితమనగా పూర్వ కాలం లాగా విద్యుత్తు లేక, మోటార్ వాహనాలులేక బ్రతకడం కాదు. సామాన్య జీవితం ఎక్కువ సృజనాత్మకత, ఆచారణాత్మకత కూడి ఉంటుంది. అది వ్యక్తుల లక్షణాలను ముఖ్యముగా చూసి, కుటుంబంతోనూ, మిత్రులతోనూ, సమాజంతోనూ దృఢమైన బంధాలు ఏర్పరిస్తుంది.

నేటికాలంలో నివసిస్తున్న దంపతులకు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. వాళ్ళకు రెండు వాహనాలు, వేర్వేరు పడక గదులు మొదలగునవి ఉండాలి. ఎందుకంటే వారి మధ్య సామరస్యం లేదు. అలాగే వారు తమ జీవితంలో మంచి ఎన్నిక చేసికోలేరు. ఇంటికి ప్రతీ సంవత్సరం క్రొత్త హంగులు చేయాలి; క్రిందటేడు కొన్న వాహనాన్ని అమ్మి క్రొత్త వాహనాన్ని కొనాలి వగైరా. కొన్నేళ్లలో వాళ్ళు తెలిసికొనేది జీవితం క్లిష్టమైనదని; దానివలన సంతృప్తి లేదని.

కొన్ని జాపనీస్ ఇళ్ళు చాలా సామాన్యంగా ఉంటాయి. అవి చాలా అందంగాకూడా ఉంటాయి. మనమెంత వస్తువులను పోగుచేసుకొంటామో, అంత వ్యధ ఉంటుంది. ఎందుకంటే అవి మనకి, మన సంతృప్తికి మధ్య అవరోధంగా ఉంటాయి.

మన ఇష్టాలకై, విధేయతకై, క్రియలకై సమయాన్ని ఎంత ఎక్కువ వెచ్చిస్తే బ్రతకడానికి అంత తక్కువ సమయం ఉంటుంది. సామాన్య జీవన మనగా నిరాశగా బ్రతకడం కాదు; మన సమయాన్ని, ఏకాగ్రతను ముఖ్యమైన పనులు చేయడానికే వ్యచ్చి౦చడం. అలాగే తలిదండ్రులు పిల్లలతో ఎక్కువ కాలం గడిపి వాళ్ళను సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా తీర్చి దిద్దాలి. మిత్రులతో అభిమానంగా, విశ్వాసంతో ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. మనకు బాగా తెలిసిన మిత్రుడు మనకు తీరని నష్టం కలిగిస్తూ ఉంటే వానిని నేర్పుతో హెచ్చరించాలి. అటువంటి బంధాలు చాలా సమయాన్ని తీసికొంటాయి. మనం ఒక వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఒక్క రోజులో పొందలేము. దానికై కృషి చెయ్యాలి. రోజులో 8 గంటలు పనిచేసి, మిగతా సమయం టివి దగ్గర, వంటయింట్లో లేదా షాప్ లలో గడుపుతే మైత్రికి సమయం ఎక్కడ? కానీ మన జీవితాన్ని సామాన్యంగా మార్చుకొంటే, మన౦ బంధు మిత్రులతో ఎక్కువ కాలం గడిపి, నిత్యం ఉత్సాహంగా ఉంటాము. 156

Eknath Gita Chapter 9 Section 6

Bhagavat Gita

9.6

మయా అధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరం {9.10}

హేతునా అనేన కౌన్తేయ జగద్విపరివర్తతే

కౌన్తేయా! నా అధ్యక్షతలోనే చరాచర భూత ప్రపంచము ప్రకృతి సృజించుచున్నది. ఈ కారణము చేతనే జగత్తు ప్రవర్తించుచున్నది ఀ

ఒక పత్రికలో "జీర్ణ కోశము తనను తాను ఎందుకు జీర్ణించకోదు?" అని ప్రశ్న వచ్చింది. మన జీర్ణకోశములోని ఆమ్లములు అన్ని రకాల పదార్థాలను పచనం చేస్తాయి. జీర్ణ కోశము లోపలి ఉపరితలము మ్యూకశ్ అనే పదార్థము యొక్క పొరతో కప్పబడి ఉంటుంది. దానిని ఆమ్లము జీర్ణము చేయలేదు. కానీ ఆ పొరను పెట్టినదెవరు?

శాస్త్రజ్ఞులు మన శరీరములోని విభిన్న అంశాలను కనుగొన్నారు. కానీ ప్రశ్నోపనిషత్తులోని ప్రశ్నలకు వారి శాస్త్రము సమాధానము చెప్పలేదు. ఉదాహరణకి చూసే కన్నువెనుక చూసే దెవరు? శాస్త్రజ్ఞులు అవయవాలను అధ్యయనం చేసి అనేక విషయాలు తెలిసికొన్నారు. కానీ వారు ఒక క్రొత్త జీవిని, దేవుని సృష్టితో సంబంధము లేనిదాన్ని, సృష్టించలేరు.

నేను ఒక పీత సముద్రపుటొడ్డున చూసేను. అది కెరటం మీదకి వస్తే వడివడిగా నడిచి తీరానికి వస్తున్నది. దానికి నడిచే లేదా పరిగెత్తే శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? అదే భగవంతుని సృష్టి రహస్యం.

నక్షత్ర వీధులు, పాల పుంత, మొదలగునవి భగవంతుని శక్తికి నిదర్శనములు. సూర్యునిలో విడుదలయ్యే అణు శక్తి, ఎవరు నియంత్రిస్తున్నారు? మనం ఆహారాన్ని తిని, జీర్ణించుకొని, పొందే శక్తి అటువంటిదే . ఇదంతా దేవుని ఆలోచనా శక్తివలన సాధ్యమవుతున్నాయి. అలాగని నేను న్యూటన్, ఐన్స్టీన్ వంటి వారల సిద్ధాంతాలను కించ పరచటం లేదు. వారి సిద్ధాంతాలు దేవుని సిద్ధాంతం క్రింద ఒదిగి పనిచేస్తాయి.

పై శ్లోకంలో జగద్ విపరివర్తతే అనే పద ప్రయోగము కలదు. దాని అర్థము "విశ్వం భ్రమిస్తూ ఉన్నది". సృష్టి ఆది ముందు పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు ఒక స్పందన కలిగింది. దానివలన సృష్టి ఆరంభమయింది. ప్రకృతిలో శక్తులు ఉద్భవించేయి. సమస్త బ్రహ్మాండము సృష్టింపబడినది. దాని పరిణామ శక్తి భగవంతుడి సృజనాత్మక శక్తినుండి వచ్చింది. విశ్వమంతా ఒక గోళ మనుకొంటే, పరమాత్మ దానిని ఒక్కమారు తిప్పడం మొదలుపెట్టేడు.

శ్రీకృష్ణ భగవానుని శక్తి ఎటువంటిది అన్న అంశ౦పై మహాభారతంలో ఒక కథ చెపుతారు. అర్జునుడు, కర్ణుడు మధ్య బాణాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు, అర్జునుడు అలసిపోతున్నాడు. కర్ణుడు ఒక శక్తివంతమైన బాణాన్ని అర్జునునిపై ప్రయోగించేడు. అది గమనించిన శ్రీకృష్ణుడు భూమిని అణచి పెట్టేడు. తద్వారా కర్ణుని బాణము నుండి అర్జునుడు తప్పించుకొన్నాడు. నా అమ్మమ్మకి అది ఒక గొప్ప విషయం కాదు. ఎందుకంటే భగవంతుడు తనను గాఢంగా నమ్మే ఆపదలో ఉన్న భక్తుని రక్షించడానికి ఎల్లప్పుడూ వస్తాడని ఆమె విశ్వసిస్తుంది. అలాగే తన భక్తుని రక్షించేందుకు సృష్టి క్రమాన్ని మార్చాలన్నా మారుస్తాడు. ఎందుకంటే సృష్టి అంతా భగవంతుని శక్తివలననే నడుస్తున్నది.

ఆది శంకరులు తల్లి, ప్రతి ఉదయం స్నానానికై పలు దూరం వెళ్ళి అక్కడినుంచి దేవాలయం చేరి పూజ చేసేది. ఒక రోజు ఆమె క్రిందపడి, ఇతరుల సహాయంతో ఇల్లు చేరుకొంది. అది తెలిసిన శంకరులు చాలా విచారపడ్డారు. దేవుని "నా అమ్మ ప్రతిరోజూ నిన్ను పూజిస్తున్నదే, మరి నువ్వు ఎందుకు కాపాడవు?"అని ప్రశ్నించేరు. దానికి బదులుగా దేవుడు ఆ నది గతి మార్చి శంకరులు ఇంటి ముందు ప్రవహించేటట్టు చేసేడు. ఆ నది గురించి శాస్త్రజ్ఞులు అనేక పర్యాయాలు అధ్యయనం చేసేరు. దాని గతి ఎప్పుడూ మారుతూ ఉంటుందని గ్రహించేరు. ఈ కథ అతిశయోక్తి కావచ్చు. కానీ దేవునికి ఇటువంటి శక్తి లేదని చెప్పలేము.

శ్రీరామకృష్ణ తన ఇష్ట దేవత చీమ యొక్క అడుగును కూడా వినగలదు అని అన్నారు. జీసస్ "నా తండ్రి ఆజ్ఞ లేనిదే ఒక పక్షి ఎగరలేదు" అన్నారు. పరమాత్మ ప్రతీదీ చూస్తాడు, వింటాడు ఎందుకంటే పరమాత్మ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. మనము భౌతిక లేదా రసాయనిక లేదా జీవ శాస్త్రాలతో విశ్వం యొక్క నలుమూలలా శోధించవచ్చు. కానీ ధ్యానంవలననే ఆ పరమాత్ముని పట్టుకొనుట సాధ్యము. 154

Eknath Gita Chapter 9 Section 5

Bhagavat Gita

9.5

సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాంతి మామికాం {9.7}

కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విశృజామ్యహమ్

అర్జునా! ప్రళయ కాలమున సమస్త ప్రాణులు నా ప్రకృతిని చేరుచున్నవి. తిరిగి సృష్ట్యారంభమున నేను వానిని సృజించుచున్నాను

ప్రకృతిం స్వామనష్టభ్య విశృజామి పునః పునః {9.8}

భూత గ్రామమిమ౦ కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్

స్వీయమైన ప్రకృతిని అనుసరించి అస్వతంత్రమైన సర్వభూతములను ప్రకృతి వశమున మరల మరల పుట్టించుచున్నాను

న చ మాం తాని కర్మాణి నిబధ్న౦తి ధనంజయ {9.9}

ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మసు

ధనంజయా! కర్మల యందు సంగము లేక తటస్థుని వలె నున్న నన్ను ఆ కర్మలు బంధింపవు ఀ

మన శాస్త్రాలు ప్రపంచము అనేక మార్లు సృష్టి , స్థితి, లయము చెందుతూ ఉంటుందని చెప్పును. లయమునకు సృష్టికి మధ్య దేశకాలాలు ఉండవు. ఎప్పుడైతే ఆ స్థితిలో చిన్న మార్పు వస్తుందో సృష్టి ఆరంభం కారణ-కార్య ప్రక్రియ ద్వారా జరుగుతుంది.

ప్రతిమారు సృష్టి ఆవిర్భవించినపుడు పరిణామ సిద్ధాంతము ననుసరించి జీవులు ఐకమత్యమే లక్ష్యంగా జనన-మరణాలు పొందుతూ ఉంటాయి. మనలోని జంతు లక్షణాలు సమసిపోయేవారకూ పుట్టుక-చావు కలుగుతూనే ఉంటుంది.

అంటే మనలోని ప్రతిఒక్కరూ, ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టినా, చేతనము యొక్క ఉత్కృష్ట స్థితిని చేరే వరకూ ప్రయత్నించాలి. మనం ఉపేక్షిస్తే మనము చేసే తప్పులు నేర్పే పాఠాల వలన మనలో మార్పులు వస్తాయి. ఎలాగైతే జంతువులు తమ పరిసరాలను బట్టి పరిణామము చెందుతూ ఉంటాయో, మనం కూడా మన క్రియల యొక్క పర్యవసానము వలన పరిణామం పొందుతూ ఉంటాము. ఇదే కర్మ సిద్ధాంతం. మనం ఇతరులను బాధిస్తే, మనము ఎప్పుడో ఒకప్పుడు బాధను అనుభవిస్తాం.

కర్మలు మూడు విధములుగా ఉంటాయి. మొదటిది తక్షణమే జరిగేది. ఉదాహరణకి రాముడు కృష్ణుని కొడితే, కృష్ణుడు రాముని తిరిగి కొట్టేడు. ఇందిలో ఎటువంటి మాయా మర్మం లేదు. రెండవది, మనం గతంలో చేసిన కర్మ ఫలం. సూఫీ యోగి అన్సారీ హెరాట్ "అందరూ రేపు ఏం జరుగుతుందో అని భయపడతారు. నేను భయపడేది నిన్న ఏమి జరిగిందో" అని చెప్పెను. బుద్ధుడు ఇటువంటి కర్మ విల్లు నుండి గతంలో విడువబడిన బాణం వలె నుండి, దాని ఫలితమును అనుభవించి, మరల బాణాన్ని ప్రయోగించకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పెను.

మూడవది ప్రస్తుతము లేదా వర్తమాన కాలంలో చేసే కర్మ. ఈ కర్మను మనం నియంత్రించ వచ్చు. మనము గతంలో ప్రయోగించిన బాణాలను ఉపసంహరించుకో లేక పోయినా, ప్రస్తుతము క్రొత్త బాణాలను ప్రయోగించకుండా ఉండవచ్చు. మనము క్రోధము, పగ తీర్చుకోవాలనే భావనతో ఉంటే, అనగా బాణము విల్లులో సంధింపబడి ఉన్నా, మనము ఆ బాణాన్ని ప్రయోగించనక్కరలేదు. ఇదియే ధ్యానం చేసే మహోపకారము.

మనము కోట్లాది సంవత్సరాలు పరిణామము చెంది భగవంతుని సాన్నిధ్యము పొందేకన్నా, మన పరిణామము స్వాధీనంలో పెట్టుకుంటే ఉత్తమము. దీనికి ధ్యానం చాలా సహకరిస్తుంది. శ్రీరామకృష్ణ, సెయింట్ కాథరీన్ ఆఫ్ సిఎనా వంటి వారు మానవాళి ప్రస్తుతం ఉన్న స్థితి కన్నా అనేక మెట్లు మీద ఉన్నారు. యోగ గురువు పతంజలి అది అందరికీ సాధ్యమని చెప్పెను. మనకందరికి మొదట్లో శక్తి సమానంగా ఉంటుంది. కొంతమంది తమ శక్తిని పూర్తిగా లక్ష్యాన్ని చేరేందుకు వినియోగించకుండా, సామాన్య కోర్కెలకై వ్యచ్చిస్తారు. మహాత్మా గాంధీ, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ అలాకాక తమ లక్ష్యానికై శక్తిని పూర్తిగా ధారపోసేరు. వారు ఆ శక్తితో ఆధ్యాత్మిక జీవనం అవలంబించి, చేసిన తప్పులను మరల చేయలేదు. మనమందరము ఇటువంటి ఎన్నిక చేసుకోవచ్చు. ఎంత కష్ట పడితే, ఆధ్యాత్మికంగా అంత ఎత్తుకు ఎదుగుతాం.

మార్కా౦డేయుడు శివ భక్తుడు. అతని 16 వ యేట శివుని వలన మరణమును జయించెను. అతడు ఒకమారు శ్రీకృష్ణుని మాయ అంటే ఏమిటని అడిగెను. శ్రీకృష్ణుడు అంతర్ధాన మైన తడవు సప్త సముద్రాలూ మార్కా౦డేయుని ఆవహించేయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీటిలో కనుమరుగయ్యాయి. మార్కా౦డేయుడు నీటిపై కోట్ల సంవత్సరాలు తేలియాడేడు. ఆ సమయంలో జీవంలేని పదార్థము నుండి పరిణామం చెంది మనిషి రూపు దాలుస్తాడు.

మనిషి జన్మలో స్వార్థ పూరితంగా బ్రతుకుతాడు. అనేక జన్మలెత్తి నిస్స్వార్థుడై దేవునియందు అనన్య భక్తిని పొందుతాడు. ఒకమారు నీటి మధ్యలో ఒక మర్రి ఆకుపై మేఘ వర్ణములో నున్న పసి కందును చూస్తాడు. మార్కా౦డేయుడు ఆ పసివాడిని కృష్ణుడని గుర్తు పడతాడు.

ప్రపంచమే తన క్రీడా స్థలమైన శ్రీకృష్ణుని తన చేతులతో ఎత్తే భాగ్యం కలిగింది కదా అని పరవశిస్తాడు. కానీ ఇన్నేళ్ళూ బ్రహ్మ కి ఒక పగలు, శ్రీకృష్ణునికి నిశ్వాస. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఉచ్ఛ్వాస చేస్తాడో మార్కా౦డేయుడు శ్రీకృష్ణుని శరీరంలోకి లాగబడతాడు. శరీరం లోపల అనేక నక్షత్ర వీధులు, సమస్త సృష్టి నిశ్చలంగా ఉండడం చూస్తాడు.

అలాగ మార్కా౦డేయుడు కొన్ని కోట్ల సంవత్సరాలు శ్రీకృష్ణునిలో ఉంటాడు. అటు తరువాత శ్రీకృష్ణుడు నిశ్వాసలో మార్కా౦డేయుడు బయట పడి, మొదట చూసిన పసికందును తనకు మాయ అనుభవం ఇచ్చినందుకు కౌగలించుకొంటాడు. ఆ పసికందు తక్షణమే అంతర్ధానమై, మార్కా౦డేయుడు తన పూర్వ స్థితిలో ఆశ్రమం లో ధ్యానం చేసికొ౦టూ ఉంటాడు. ఇది అంతా అతడు సమాధిలో అనభవించినది. దీనివలన తెలిసినదేమిటంటే సృష్టి, జీవుల పరిణామం, అంతా భగవంతుని లీల. 151

Eknath Gita Chapter 9 Section 4

Bhagavat Gita

9.4

మయా తతమిదం సర్వం జగ దవ్యక్తమూర్తినా {9.4}

మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః

ఈ సమస్తమైన విశ్వము అవ్యక్త రూపుడైనను నా చేత పరివ్యాప్తమై యున్నది. సమస్త ప్రాణికోట్లు నా యందు యున్నవి. నేను వానియందు లేను

న చ మత్ స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం {9.5}

భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః

మరియు భూతములు నా యందు లేవు. ఈశ్వర సంబంధమగు నా ఈ యోగమహిమను గా౦చుము. నా స్వరూపము భూతములను భరించునదియు, రక్షించు నదియు అయినను భూతములయందు ఉండునది కాదు

యథా ఆకాశస్థితో నిత్యం వాయు స్సర్వత్రగో మహాన్ {9.6}

తథా సర్వాణి భూతాని మత్ స్థానీ త్యుపధారయ

సర్వ సంచారియు, గొప్పదియు నైన వాయువు ఏ విధముగ ఆకాశమునందు నిత్యమై యున్నదో, అలాగుననే సకల భూతములు నా యందున్నవని గ్రహించుము

ఇక్కడ ఒక సందిగ్దము కలుగజేసే అంశము చెప్పబడినది: పరమాత్మ అన్ని జీవులలో, కణాలలో ఉన్నాడు, కాని వాటివలన పరిమితుడు కాలేదు. సమాధిలో మనము పరమాత్మలో ఐక్యము అయినప్పుడు, నక్షర వీధులకు, సమస్త సృష్టికి పరిమితము కాని పరమాత్మ మన హృదయంలో పరిమితుడై ఎలా ఉన్నాడు?

ఇది మాయ యొక్క ప్రభావము. నా చెయ్యి ఘన పదార్థముగా, చామన ఛాయగా ఎలా కనబడుతున్నది? భౌతిక శాస్త్రవేత్తలు చెయ్యి ఘన పదార్థమూ కాదు, ఒకానొక రంగున్నదీ కాదు అని చెప్తారు. ఇంకా అనేక కణముల సముదాయము, శక్తి తో కూడినది అని చెప్తారు. నేను దానిని ఒక స్థిరమైన రూపాముతో, రంగుతో చూడడానికి కారణము నా పరిమితమైన అవగాహన వలన. అంటే దాని ఆకారము, లక్షణములు చుట్టూ ఉన్న ప్రపంచంలో లేవు. నా ఆలోచనలో, దృక్పథంలో ఉన్నాయి. సమాధిని సాధించిన యోగులు ప్రపంచము నామరూపాత్మకమని చెప్పుదురు. ఆది శంకరులు "నామరూపాలు బంగారు గొలుసులు, గాజులు లాంటివి; పరమాత్మ బంగారము లాంటి వాడు" అని చెప్పును.

ఆల్డస్ హక్లీ ఇట్లు చెప్పెను: ప్రపంచము ఒక భ్రాంతి. దానిని మనము ఏకాగ్రతతో విశ్లేషించాలి. దానంతట అది నిజము. దానిని మన మనస్సుతో పట్టుకోగలం. మనం దానిలో మేల్కొనగలగాలి. మనము సదా మన చేతనమును పెంపొందించుకొనుటకు ప్రయత్నము చెయ్యాలి. మనము మనకివ్వబడిన ప్రపంచానికి ఆవల బ్రతకడానికి ప్రయత్నించ కూడదు. కానీ ప్రపంచమును మనకు అనుగుణముగా మార్చుకోవాలి. మనము ప్రపంచంలో ఉండి, దానికే పరిమితమవ్వకూడదు. మనము కాలంలో బ్రతుకుచు, దానిచే కబళింపబడక ఉండాలి".

నేను సరదాకి నా మిత్రుడు జిమ్ ని నువ్వు నీ దేహముకాదు, జిమ్ అనబడే వ్యక్తి లేడు, అది రోడ్డు మీద నడుస్తున్న ఒక శక్తి కూటమి అని అనేవాడిని. నిజానికి నాకు ప్రత్యక్ష ప్రమాణం జిమ్ యొక్క ఆత్మ, దానిని మాయ చేత ఆవహింపబడిన దేహము. మనము మాయలో బ్రతుకుతున్నంత సేపూ నామ రూపాములు నిజమని నమ్మాలి. కానీ మన మెన్నటికీ మారువరానిది: అన్ని రూపాలలో యున్నది ఒకే పరమాత్మ 147

Eknath Gita Chapter 9 Section 3

Bhagavat Gita

9.3

అశ్రద్దధానాః పురుషా ధర్మ స్యాస్య పరంతప {9.3}

అ ప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసార వర్త్మని

పరంతపా! ఈ ధర్మమునందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేక మరల జనన మరణ రూప సంసారమునందు అల్లాడుచుందురు

శ్రద్ద అనగా హృదయమునందు ఉంచబడినది. మన నమ్మకం శ్రద్ధ మనము కోరుకున్నది ఫలింప జేస్తుందని -- అంటే మనము ఆలోచించినది కాక, మన హృదయంలో నమ్మునది. కాబట్టి ప్రతి ఒక్కనికి ఏదో ఒక దానిమీద నమ్మకం ఉంటుంది. స్కీఇంగ్ చేసేవారు మంచు కొండమీద, క్రిందికి రెండు కాళ్ళ క్రింద పలచటి కర్ర లేదా ఫైబర్ గ్లాస్ ముక్కలు పెట్టుకొని, పయనిస్తారు. వారికి అమితమైన శక్తి, ఉత్సాహం ఉండి సాహసాలు చేస్తారు. కానీ వాళ్ళు నమ్మేది స్కీఇంగ్ వలన వాళ్ళకు మిక్కిలి సంతోషం కలుగుతుందని. మనందరం ఏదో ఒకటి స్కీఇంగ్ లాగే శాశ్వత సుఖం ఇస్తుందని నమ్ముతా౦. కానీ కొందరు తమ నమ్మకాన్ని చెడు కార్యాలకై వినియోగిస్తారు. వారికి త్రాగుడు, మారక ద్రవ్యాల అలవాట్లు, లేదా అపాయకరమైన సాహసాలు చేయాలనే కాంక్ష ఉండి, చివరికి సమసిపోతారు.

గీత అటువంటి సమస్యలకు ఒక ఉత్తేజపరిచే సూచన ఇస్తుంది. మన నమ్మకం జీవితానికి తోడ్పడే దానిపై లేకున్నా, మనకు నమ్మకమంటూ ఒకటుండడమువలన ఆశ మిగిలి ఉంది. మన నమ్మకము చెడు నుంచి మంచికి మారితే మనం స్కీఇంగ్ చేసే వారిలాగ లేదా ప్రపంచాన్ని చుట్టి వచ్చే వారిలాగ, ఆధ్యాత్మిక సాధన ఉత్సాహంగా చెయ్యచ్చు. నేను స్కీఇంగ్ చేసేవారికి చెప్పేది: "మీలాంటి స్కీఇంగ్, కొండమీదనుంచి క్రిందకు వెళ్ళడం, నా నమ్మకానికి తగినది కాదు. మీరు కొండ క్రిందనుంచి మీదకు స్కీఇంగ్ చేసుకొంటూ వెళ్లగలరా?" ధ్యానం ఎదురీత లేదా కొండ ఎక్కడం లాంటిది. ఎవరైతే అట్టి సవాలును స్వీకరిస్తారో వారు తమ శ్రద్ధను ఉపయోగించి క్లిష్టమైన ధ్యానం చేస్తారు. అటువంటి సవాలు స్వీకరిస్తే, మద్యానికి బానిస అయినవాడు మద్యం సేవించని వానికన్న దృఢమైన వ్యక్తిగా మారుతాడు. 145

Eknath Gita Chapter 9 Section 2

Bhagavat Gita

9.2

రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమం {9.2}

ప్రత్యక్షావగమ౦ ధర్మ్య౦ సుసుఖం కర్తు మవ్యయమ్

ఈ జ్ఞానము సమస్త విద్యలలో రాజు వంటిది . అతి రహస్యమైనది. ధర్మ స్వరూపమైనది. సులభ సాధ్యమైనది. నాశ రహితమైనది ఀ

ధ్యానంగురించ కొన్ని వేల పుస్తకాలున్నాయి. వాటన్నిటినీ చదవడానికి ఒక జీవితకాలం సరిపోదు. కాబట్టి ధ్యానం ఏదోవిధంగా మొదలెట్టడం మంచిది.

ధ్యానం అత్యంత రమ్యంగా ఉంటుందని కొందరంటారు. మీరు ఆకాశంలో తేలుతూ, సుగంధాలు ఆస్వాదిస్తూ ఉంటారని వారంటారు. కానీ అటువంటి అనుభవాలు చాలా మందికి రావు. ధ్యానంకై చాలా కష్టపడాలి. కొన్నాళ్ళు ధ్యానం చేసి, దాన్ని వదిలేసేవారు కూడా ఉన్నారు. అలాకాకుండా ఉండడానికి నేను కొన్ని సూచనలను ఇస్తాను.

మొదటి సూచన, ధ్యానం ఇతరులతో కలిసి చేస్తే ఉత్తమం. భార్యాభర్తలు కలిసిచేస్తే అది పిల్లలు కూడా అలవరచుకొని వృద్ధి లోకి వస్తారు.

రెండవ సూచన ధ్యానంలో స్థిరంగా ఉండండి. ఒక రోజు ధ్యానం మానేస్తే దాన్ని సవరించుకోడానికి వారం రోజులు పడుతుందని చెప్తారు. కాబట్టి ధ్యానాన్ని రోజూ ఒక నిర్ణీత సమయానికి చేయడం మంచిది.

మూడవది ధ్యానం ఒక పద్దతిలో -- అనగా మంత్రాన్ని జపిస్తూ, పరోపకారాన్ని పాటిస్తూ -- చెయ్యాలి.

నాల్గవది మీ అలవాట్లను పరిశీలించండి. ఉదాహరణకి మీరు తినే ఆహారం , వ్యాయామం. ఒక ఒలింపిక్స్ క్రీడాకారునిలా తగినంత మోతాదులో పోషకాహారాన్ని తింటూ, నిద్రపోతూ, వ్యాయామం చేస్తూ ఉండాలి. మన దేహం కర్మలకై ఇవ్వబడినది. కాబట్టి ధ్యానాన్ని వ్యాయామంతో అనుసంధానం చేయాలి. వ్యాయాయమంటే బరువులెత్తడం మాత్రమేకాదు. కాలి నడక కూడా వ్యాయామమే. యుక్త వయస్కులు బరువులెత్తడం వంటి కష్టమైన క్రియలు చేయవచ్చు.

చివరిగా మీరు అందరితో కలసి మెలసి సామరస్యంతో ఉండాలి. మనము ధ్యానంలో అంతర్ముఖులమై ఉంటాము కనుక, దానిని ఇతరులతో కాలం గడపడానికై అనుసంధానము చెయ్యాలి.

ధ్యానం చేస్తున్నంత కాలం ఉత్సాహం కలిగించే గీత వంటి ఆధ్యాత్మిక గ్రంధాలను నెమరువేసుకోండి. అందుకై మీరు తీరిక దొరికినప్పుడు ఆధ్యాత్మిక గ్రంధాలను చదవటం అలవారుచుకోవాలి. ఇది గాలిపటం ఎగరవేసినంత సులభం. మొదట దారాన్ని క్రమంగా వదలి గాలిపటాన్ని ఆకాశంలో ఎగరివేయాలి. గాలిపటం ఏకాగ్రత, దారం సమయం. దారం వదిలేస్తే గాలిపటం ఎగిరిపోతుంది. కాబట్టి ఏకాగ్రతకై సమయం వెచ్చించండి.

మనస్సు ఎప్పటికీ చంచలమే. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ సేల్స్ చెప్పినట్లు "మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు వేరొక చోటికి పోతే దాన్ని దేవుని వైపు మరల్చండి. మీరు ధ్యానం చేసిన సమయంలో మనస్సును తిరిగి దేవుని మీద పెట్టడానికై పూర్తిగా చేసినా ఫలితం ఉంటుంది." కొన్నాళ్ళు ఇలా సాధన చేస్తే మన అచేతన మనస్సును, చేతనంగా ఉన్నప్పుడే, పరిశీలించే సమర్థత వస్తుంది. దానిలో అనేక అపోహలు, భ్రమలు ఉండవచ్చు. కాబట్టి మంత్ర జపం తోనో, గీత వంటి గ్రంథాలను నెమరు వేసికోవడమో చేయండి.

ధ్యానంలో నిద్ర రావచ్చు. కొంతమంది ధ్యానంలో గాఢనిద్ర పోతారు. కొంత మంది వారికి తెలియకుండా నిద్రలోకి జారుకుంటారు. అలా కాకుండా ఉండడానికి నేలపై పద్మాసనం వేసి, వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేయండి. అదీ సాధ్యం కాకపోతే మంత్రాన్ని జపిస్తూ మీ ఇష్ట దైవాన్ని మనోఫలకంలో నిలుపుకోండి.

క్రొత్త విషయాలను తెలిసికొ౦టూవుంటే ధ్యానంలో వాటిని గుర్తుకు తెచ్చుకొని విశ్లేషణము చేసి మనస్సును ఎప్పుడూ నూతనంగా ఉండేటట్టు చేసికోవచ్చు. అలా కాకపోతే మనస్సు యాంత్రికంగా పాత భావాలే కల్పిస్తుంది. మనం చదివే గ్రంథాలు గీతే కావక్కరలేదు. ఎటువంటి ఆధ్యాత్మిక గ్రంథమైనా ఫరవాలేదు.

భారత దేశంలో ఉసిరికాయను ఇష్టపడని వారు ఉండరు. నేను మొదటిసారి ఉసిరికాయను తిన్నప్పుడు అది చేదుగా ఉండి, ఉమ్మేద్దామని అనుకొన్నాను. నా అమ్మమ్మ దాన్ని నములుతూ ఉండమని చెప్పింది. నేను నములుతూ ఉంటే దాని రుచి తీయగా మారింది. ధ్యానం ఉసిరికాయ వంటిది. మొదట్లో అది ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు. పట్టు వదలక సాధన చేస్తే మీరు ధ్యానంకై వెచ్చించే సమయం అత్యంత విలువైనదని తెలిసికొ౦టారు. 144

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...