Saturday, April 9, 2022

Eknath Gita Chapter 9 Section 23

Bhagavat Gita

9.23

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ {9.30}

సాధురేవ స మంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః

మిక్కిలి దురాచారి యైనను, అనన్య భక్తి కలవాడై నన్ను భజించునేని, స్థిరచిత్తము గలవాడైన అతడు సాధువే యని గ్రహింపుము

క్షిప్ర౦ భవతి ధర్మాత్మా శశ్వచ్చా౦తిం నిగచ్ఛతి {9.31}

కౌన్తేయ! ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి

అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగుచున్నాడు. శాశ్వత శాంతిని పొందుచున్నాడు. అర్జునా! "నా భక్తుడు నశించడు" అని ప్రతిజ్ఞ చేయుము

ఈ శ్లోకాలు తరతరాలుగా అనేక భక్తులకు ఓదార్పుగా ఉన్నవి. మన గతం ఎలా ఉన్నా, ప్రస్తుత పరిస్థితి ఏమైనా, భగవంతుడు మనని విస్మరించడు. మనమంతా దేవునిము౦దు ఆశక్తులం. అలాగే అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసి ఉంటాం.

నేను అనేక తప్పులు చేసిన వారిగురించి తెలిసికొన్నది ఏమిటంటే: వారు పరులకై, కనీసం తమ కొరకై, మంచి జీవనము చెయ్యలేదు. వారు ఒంటరి వారై, బంధుమిత్రులకు దూరమై, మార్పు కోసమై నిరీక్షిస్తున్నారు. వారు గతంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. కానీ వారి హృదయాల్లో దేవుడు కొలువై ఉన్నాడని చెప్తాను. కాబట్టి వారిని తమ గతాన్ని పూర్తిగా మరచి, మంచి కర్మలు చేసి, అందరితోనూ సామరస్యంగా ఉండమని చెప్తాను.

జీసస్ చెప్పినట్లు మనమంతా దేవుని బిడ్డలం. మన నడవడిక ఎంత చెడ్డదైనా, ఒక తల్లి తన బిడ్డలను ఎట్టి పరిస్థితిలోనూ ఎలా విడనాడదో, దేవుడు కూడా మనని అలా ప్రేమిస్తాడు. బైబిల్ లో ఒక కథ ఉంది. ఒక ధనవంతుని కుమారుడు, తన తండ్రిని ఎదిరించ, కొంత ధనము తీసికొని పరదేశాలకు ప్రయాణమౌతాడు. అనేక ప్రదేశాలు తిరిగి, డబ్బును భోగాలకై వెచ్చించి, తిండి లేని స్థితిని పొందుతాడు. చివరికి జ్ఞానోదయము కలిగి, పరదేశంలో ఆకలితో మరణించేకంటే, తన తండ్రికి శుశ్రూష చెయ్యడ౦ మేలని నిర్ణయించుకొని, తన తండ్రి ఇంటికి వెళ్తాడు. తండ్రి వానిని అత్యంత ఆదరంతో ఆహ్వానించి వానిని క్షమిస్తాడు.

ప్రతి సమాజంలో మనకంటే పెద్ద తప్పులు చేసిన వారు, వాటిని సరిదిద్దుకొని మనకంటే ఎక్కువ మన్నన పొందిన వారున్నారు. వారు ఇతరులకు హాని చేసి, క్రోధంతో, హింసతో బ్రతికేరు. కానీ అటువంటి వారే చివరకు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళేరు. ఉదాహరణకు అశోకుడు. సెయింట్ తెరెసా దేవుడు సూర్యుని వలె తన ప్రేమను పంచి పెడుతున్నాడు అనెను. కొందరు తెర దించి చీకటిలో బ్రతుకుతారు. వారు ఎప్పుడైతే తెర ఎత్తుతారో తమ బ్రతుకులను ప్రకాశవంతంగా చేసుకొంటారు.

నా చిన్నప్పుడు అమ్మాయిలు వంట నేర్చుకొంటున్నప్పుడు అన్నాన్ని మాడ్చడం లేదా కొంత కూరని నేల మీద పడేయడం చేసేవారు. వారి తల్లులు లేదా అత్తలు వారిని విమర్శించేవారు. నా అమ్మమ్మ వంట నేర్చుకోవాలంటే చేతులు కాలాలి, కొంచెం పదార్థం నేల మీద చిందాలి అని వాళ్ళకు సద్ది చెప్పేది. కానీ ఆ పిల్లలకు "మీరు అదే పనిగా చేతులు కాల్చుకోవడం లేదా అన్నాన్ని నేల పాలు చేయడం మంచిది కాదు" అని చెప్పేది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా. నా దగ్గరకు చాలా మంది వచ్చి తాము ఎన్నో తప్పులు చేశామని చెప్తారు. మనమంతా గతంలో ఏదో తప్పు చేసినవారలమే అని చెప్పేవాడిని. కానీ వారు అవే తప్పులను మళ్ళీ మళ్ళీ చేసి నన్ను నిరాశ పరిచేవారు.

మనందరికీ బలహీనతను అధిగమించి మంచి మార్గంలో నడిచే సామర్థ్యం ఉంది. కొందరు అనారోగ్యం కలిగించే ఆహారం కొన్నేళ్లగా తింటూ, ఆ అలవాటును ఒక్క మారు మార్చుకొంటారు. కొందరు క్రోధంతో నిండి ఉండి, ధ్యానం చేసి, తమ క్రోధాన్ని కరుణగా, పగని ప్రేమగా మార్చుకొంటారు. మనము కొన్ని దశాబ్దాలు చెడు నడవడికతో గడిపినా, ధ్యానం వలన కొద్ది కాలంలోనే చెడు నడవడికను మార్చుకోవచ్చు. మనమెంత స్వార్థంతో, ధూమపానం చేస్తూ, మద్యాన్ని సేవిస్తూ బ్రతికినా శ్రీకృష్ణుడు క్షిపరం భవతి ధర్మాత్మా అని చెప్తాడు. అంటే మనం మన ఆత్మను ప్రక్షాళనము చేసి, చెడు అలవాట్లతో క్షీణించిన శరీరాన్ని, మనస్సును ధృడంగా చేసుకోవచ్చు.

మన ఆధ్యాత్మికత బలపడుతున్న కొద్దీ మన గతంలో చేసిన తప్పులు జ్ఞప్తికి వస్తాయి. అలాటప్పుడు అపరాధ భావన లేదా విచారము పొందనక్కరలేదు. మంత్ర జపము మనను కడతేరుస్తుంది. మన తప్పులను విశ్లేషణము చేసి వాటికి అపరాధ రుసుము ఎలా చెల్లించాలని సతమతమవడం అవసరము లేదు. ఒకరు దూరపు మిత్రుని పెంపుడు కుక్కని అవమానించవచ్చు. ఆ విషయం ధ్యానంలో జ్ఞప్తికి వచ్చి, క్షమాపణ చెప్పాలని వారు తమ మిత్రుడుని వెదుక్కొంటూ వెళ్ళనక్కరలేదు. దాని బదులు ఒక కుక్కని పెంచుకోవచ్చు లేదా వీధి కుక్కలకు ఆహారం ఇవ్వచ్చు. అలాగే ఒకరు మిత్రుడ్ని అవమానిస్తే, వానికే క్షమాపణ చెప్పడంతో ఆగి పోనక్కరలేదు. ఇతరులను అవమానించ కుండా, మనలోని దేవుని క్షమాపణ పొంది, ఇతరులు తనను అవమానించినా వారిని తిరిగి అవమానించకుండా బ్రతకవచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ "ఇతరులను మనము క్షమిస్తే, మనము క్షమించబడతాము" అని చెప్పెను.

కానీ అలా చెయ్యడం ఎలా? మనం గత స్మృతులను వెలిక తీసికోవడం వ్యర్థమని తెలిసికొని, మరల గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఎలా నియంత్రించుకోవాలి? ఇక్కడ ధ్యానం చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు.

బుద్ధుడు మనం పాపాలు చేసినందుకు శిక్షింప బడం; పాపాల వలన శిక్షింపబడతాం అన్నాడు. గుండెజబ్బు, రక్తపు పోటు మొదలగు వ్యాధులు మనం తినే ఆహారం వలన, మన చెడు అలవాట్ల వలన, పర్యావరణ కాలుష్యం వలన కలుగుతున్నాయి. వీటన్నిటినీ మనం నివారించుకోవచ్చు.

ధ్యానంలో ప్రవేశించేటప్పుడు, మొదట మన ఆహార౦ విషయంలో శ్రద్ధ అవసరం. రుచులు కాకుండా, శరీరానికి పోషకాహారము అందించాలి. వాహనం మీద ప్రక్క వీధికి వెళ్ళడం కంటే, కాలి నడకన వెళ్ళవచ్చు. మంత్రాన్ని జపిస్తూ వ్యాయామం చేస్తే మానసిక వొత్తిడి తగ్గి, శరీరం స్వస్థతో ఉంటుంది. మనకి సలవులు వస్తే ఇతరులకు ఉపయోగపడని విధంగా సలవులను గడపడం కంటే, పరోపకారానికై సేవ చెయ్యవచ్చు. ఈ విధంగా మనం గత స్మృతులను నియంత్రించి, చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.

దేహ శుద్ధితో పాటు మానసిక స్థితినికూడా మెరుగు పరచుకోవాలి. కొంతమందికి దేహం బలంగా ఉంటుంది. కాని వారు ఒ౦టరితనం, అశాంతి, అభద్రత అనుభవిస్తారు. ధ్యానం వలన వారు తమ మానసిక స్థితిని మార్చుకోవచ్చు. దీనికి శారీరిక మార్పులకన్నా ఎక్కువకాలం పడుతుంది. శ్రీకృష్ణుడు షష్వచ్చా౦తిం నిగచ్ఛతి అంటాడు -- అనగా తక్కువ కాలంలోనే, హృదయంలో శాంతి నెలకొంటుంది. ఇతరులతో శాంతియుతంగా బ్రతకడం వీలవుతుంది.

శ్రీకృష్ణుడు, కుంతీ తనయునికి, ఇంకా ఇలా బోధ చేసెను "ఇంద్రియాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, ప్రపంచం ఎదురు తిరిగినప్పుడు, నన్నెవరైతే భక్తితో సేవిస్తారో వారికి ఎటువంటి హాని జరగదు". ఈ అభయాన్ని ఎంతో మంది యోగులు పొందేరు. ఇది ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం 196

Eknath Gita Chapter 9 Section 22

Bhagavat Gita

9.22

సమో అహం సర్వభూతేషు స మే ద్వేష్యో అస్తి న ప్రియః {9.29}

యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్

నేను సర్వప్రాణుల యందును సమముగ యున్నాను. నాకు శత్రువులేడు. ఇష్టుడునూ లేడు. ఎవరయితే నన్ను భక్తితో సేవించుచున్నారో వారు నాయందును, నేను వారి యందును ఉందును

శ్రీకృష్ణుడు తనకు ఇష్టమైనవారు ఎవ్వరూ లేరు అని చెప్పుచున్నాడు . ఒకరి జాతి, లింగము, పుట్టిన ప్రదేశం, సమాజంలో పలుకుబడి ఏమైనా తనకు పట్టింపు లేదు అని చెప్పెను.

కానీ శ్రీకృష్ణుడు స చ మె ప్రియాః అనగా "నేను వారితో సంపూర్ణమైన ప్రేమతో యున్నాను" అని చెప్పెను. దాని అర్థము "ఎవరైతే సంపూర్ణ హృదయముతో నన్నుసేవిస్తారో, ప్రతి జీవిలోనూ నన్ను చూస్తారో, నేను వారిని ప్రేమించి, రక్షిస్తాను". ఇంకా "నేను ఆనంతము. నన్ను నక్షత్ర వీధులు పరిమితం చేయలేవు." అనికూడా చెప్పెను.

ఈ శ్లోకం ద్వారా మనకు దేవుని అంశ అయిన మన ఆత్మపై ఆరాధనా భావం కలుగుతుంది. బుద్ధుడు మన దేహము బలహీనమైన కుండ వంటిదనెను. విశ్వమంతా వ్యాపించిన భగవంతుడు ఈ కుండలోనూ ఉన్నాడు. ఒకరిని నమస్తే అని పలకరించడం వారిలోని పరమాత్మను ఉద్దేశించి గానీ వేరే ఏమీ కాదు.

Eknath Gita Chapter 9 Section 21

Bhagavat Gita

9.21

శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః {9.28}

సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి

ఈ విధముగ కర్మలను అర్చించుటచేత పుణ్య పాప ఫలరూపకములైన కర్మ బంధములనుండి విముక్తుడ వయ్యెదవు. ఇట్లు విముక్తుడవై నన్నే పొందగలవు

గతంలో మనమే తప్పుటడుగులు వేసేమో మనను ప్రస్తుతం బాధి౦చవచ్చు. అంటే మనకు తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేసి వాటిని నెమరువేసుకోవడం. ఆధ్యాత్మిక సాధనలో గతాన్ని బాధతో లేదా క్రోధంతో గుర్తుకు తెచ్చుకోకూడదు. గీత ఈ విషయంలో మనని ఓదార్చి, దృఢం చేస్తుంది. ఎందుకంటే తప్పులు చెయ్యడం చాలా సులభం. అందుకే గీత మనని విమర్శించకుండా, నరక౦ గురించి ప్రస్తావించకుండా, మనల్ని ధ్యాన మార్గానికి మళ్లించి తప్పుల్ని ఒప్పులు చేసుకోమంటుంది.

పాత రోజుల్లో రికార్డులు అరిగిపోతే, పాట మళ్ళీ మళ్ళీ వినిపించేది. మనము పదే పదే పశ్చాత్తాప పడడం కూడా అటువంటిదే. రికార్డును సరి చేయాలంటే దానిమీద నడిచే ముల్లు యొక్క గాడిని మార్చాలి. అంటే మన ఆలోచనా క్రమాన్ని మార్చుకోవాలి.

మనను గతంలో చేసిన తప్పులు కన్నా, వాటిని తవ్వి వెలికి తీయడం ఎక్కువగా బాధిస్తుంది. మనం ధ్యానం ద్వారా దానిని నియంత్రించుకొనవచ్చు. గత విషయాలు ధ్యానంలో ఎరుకకు వస్తే, వాటిని పట్టించు కోకండి. ఇతరులను వాటిని గూర్చి మీతో మాట్లాడనీయకండి. మీ తప్పులను మిత్రుల దగ్గర ఏకరువు పెట్టకండి. అలాంటి సమయాల్లో మంత్ర జపం చేసుకోండి.

మనం చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి భగవంతునికి క్షమాపణ చెప్పుకోవచ్చు. కొంతమంది చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తారు. భగవంతుడు దయామయుడు. నిజంగా పశ్చాత్తాపపడితే తప్పక క్షమిస్తాడు. కొంతమంది తప్పు చేసి, క్షమాపణ అడిగి, మళ్ళీ తప్పు చేసి మళ్ళీ క్షమాపణ అడుగుతూ ఉంటారు. దీని పర్యావసానము వారి నాడీ వ్యవస్థ అస్వస్థత.

నా ఉద్దేశంలో క్షమ అడగడమంటే మన చేతన మనస్సు లోపల ఉన్న తప్పుడు ఆలోచనలను, భావాలను మార్చుకోవడం. మనం గతంలో ఏమి చేసినా, మార్పు చెందడం సాధ్యం. యోగులు చెప్పేది దేవుని సహాయం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని స్వీకరించడం మన చేతిలో ఉంది.

నేటికాలంలో ఎవ్వరూ దైవము ఎక్కడో అంతరిక్షంలో ఉండి శిక్ష విధిస్తాడ౦టే నమ్మరు. కాబట్టి నేను పాపము, దానికై విధించే శిక్ష గురించి మాట్లాడను. నేను నమ్మేది తప్పులు, వాటి పర్యావసానము. ఇక్కడ బుద్ధుని మార్గము ఆదర్శం. క్రోధంతో ఉంటే మనను మనమే శిక్షించుకున్నట్టు. భౌతికంగా కోపం వచ్చినపుడు మన శ్వాస అధికమౌతుంది. కాలక్రమేణా అది ఆస్తమా వంటి వ్యాధులకు దారితీయవచ్చు. అలాగే క్రోధం వలన మన జీర్ణశక్తి క్షీణిస్తుంది. పోషకాహారాన్ని తినకుండా, వ్యాయామం చేయకుండా, ధూమపానం లాంటివి చేస్తూ ఉంటే మనము మనల్నే శిక్షించుకొంటున్నాము. అలాటప్పుడు భగవంతుని దయకై ధ్యానం చేసి మన తప్పులను సరిదిద్దు కోవాలి.

ఉదాహరణకి నాకు తెలిసిన తాగుబోతులు ధ్యానంలో ప్రవేశించి తమ పాడు అలవాటును వదులుకొన్నారు. దేవుని దయను ప్రత్యక్షంగా చూసి నాకే ఆశ్చర్యమేసేది. వారు తమ నడవడికను మార్చుకొని ఇతరులతో సామరస్యంగా ఉంటూ, తమ బలహీనతను అధిగమించేరు. మనకి క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పుడు అవి ఎన్నటికీ పరిష్కరింపబడవని చేతులు ముడుచుకొని జీవించకూడదు. గతంలో ఎటువంటి తప్పులు చేసినప్పటికీ, అవి మన శారీరిక లేదా మానసిక వ్యవస్థను ఎంత బలహీనంగా చేసినా, మన అలవాట్లను చేతన మనస్సు శక్తితో మార్చుకొని గతం నుంచి విడుదల పొందవచ్చు. 190

Eknath Gita Chapter 9 Section 20

Bhagavat Gita

19.20

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ {9.27}

యత్తపస్యసి కౌ౦తేయ తత్కురుష్య మదర్పణమ్

నీవు చేయు కర్మలను, భుజించు ఆహారమును, చేసెడి హోమమును, ఇచ్చెడి దానములను, ఆచరి౦చెడి తపస్సును సర్వమును నాకు సమర్పింపుము

యత్ కరోషి: ఏది చేసినా దైవార్పణము చెయ్యాలి. మనకు ఏదైతే ఆనందము కలిగిస్తుందో, దాని బదులు ఇతరులకు సహాయం చెయ్యాలి. అది మొదట్లో కష్టమనిపించినా, మన వంతు చేస్తే, దేవుడి మన సమర్పణను స్వీకరిస్తాడు. దేవుడు ఒక్క పూజగది, లేదా గర్భగుడికి మాత్రమే పరిమితం కాడు. అతడు మనలోనూ ఉన్నాడు. మనం అతనిని ఆనందింప జేసే కర్మ చేస్తే, మనలోని ఆవేదన తగ్గి మన శరీర౦ స్వస్థతతో ఉంటుంది.

యద్ అష్నాసి: ఏది తిన్నా దేవునికి నైవేద్యం చెయ్యాలి. ఈ రోజుల్లో మనం పోషకాహారాన్ని తినక అనేక సమస్యలు తెచ్చుకొంటున్నాము. ఉదాహరణకి కొంతమంది ఉదయాన్నే కాఫీ త్రాగి, బ్రెడ్ తిని, సిగరెట్ వెలిగించుకొంటారు. ఇది ఆరోగ్యానికి హానికరమని వేరే చెప్పననక్కరలేదు. అదే గర్భిణీ స్త్రీలు చేస్తే వారికి పుట్టబోయే బిడ్డలు అనేక సమస్యలకు గురి అవుతారు. సంస్థలు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు. మనం తినవలసినది తాజా కూరగాయలు, పళ్ళు కానీ ఒకరు ఉత్పత్తి చేసినవి కావు. మనం పెరట్లో లేదా గోలాలలో పండించి తింటే ఎంతో ఆరోగ్యకరం. అదే ఆహారం, సంస్థలు చేసే ఉత్పత్తి వలన నిల్వ ఉంచబడి, తాజాగా ఉండదు.

యజ్ జుహోషి: మీరు ఏది త్యాగం చేసినా, దానిని నాకు సమర్పణ చేయండి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. త్యాగం అంటే ఏదో ప్రియమైన వస్తువో లేదా పదార్థమో విడవడం కాదు. దేవుడు కోరేది మన అహంకారాన్ని త్యజించాలని. భార్యాభర్తల మధ్య జరిగే వివాదాలు ఎక్కువగా అహంకారం వలననే. కానీ అహంకారాన్ని త్యజించడం చాలా కష్టం. కానీ దానిపై తిరగబడి క్రమంగా తగ్గించు కోవచ్చు. దానివలన మనోల్లాసము కలిగి లేనిపోని సమస్యలతో బాధింపబడం.

అహంకారాన్ని దేవునికి ఎలా సమర్పించాలి అన్నది ఒక పెద్ద ప్రశ్న. మనం కొండలెక్కాలని నిర్ణయించుకుంటే మౌంట్ ఎవరెస్ట్ ని మొదటిరోజే ఎక్కడానికి ప్రయత్నించం. చిన్న చిన్న కొండలతో ప్రారంభిస్తాము. ఉదాహరణకి ఒక మిత్రునితో భోజనం చేసేటప్పుడు, అతడు పెట్టిన పదార్థాలను, మనకిష్టం లేకపోయినా, తినాలి. అలా చేస్తే మీ మిత్రుడు సంతోషించి మీకు దగ్గరవుతాడు. అలాగే మన భాగస్వామి చేసే వంటలను కూడా, ఆవిడ సంతోషానికై తినాలి. అందువలన మన బంధాలు పెరుగుతాయి.

దదాసి యత్: ఏది దానం చేసినా నాకు సమర్పించమని శ్రీకృష్ణుడు అంటున్నాడు. మన దానం చేసే వాటిలో ఉత్తమమైనవి దయ, ఓర్పు. మనం ఇంకొకరికి డబ్బు దానం చేస్తే, దాని వలన వారికి కలకాలం ఆనందం ఉండదు. ఒక వస్తువుని కొనిస్తే పెంచేది స్థూల జాతీయ ఉత్పత్తి మాత్రమే. మీ సమయాన్ని, సమర్థతని, వనరుల్ని ఇతరులకొరకై దానము చేయండి. ఇదే ఆనందంతో, భద్రతతో జీవించడానికి రహస్యం. ఎప్పుడైతే ఇతరుల మెప్పును ఆశిస్తామో మనం చేసుకొన్నది ఒప్పందం మాత్రమే.

తలిదండ్రుల, వారి సంతానం, మధ్య ఒప్పందాలు మంచివి కావు. నీవు నాకు ఇది చేస్తే, నేను నీకు అది చేస్తాను అనే మనస్తత్వాన్ని మన పిల్లల భవిష్యత్ కై విడనాడాలి. కొందరు తలిదండ్రులు తమ పిల్లలు ఒక పెద్ద శాస్త్రజ్ఞుడు లేదా ఇంజినీర్ అవ్వాలని ఆశిస్తారు. కాని వారి పిల్లలకు వేరే ఉద్దేశాలు ఉండచ్చు. కాబట్టి తలిదండ్రులు తమ ఆశలకై పిల్లలు మీద ఒత్తిడి పెంచకూడదు.

నా చిన్నప్పుడు పాఠశాలలో గణితం మొదటిసారి నేర్చుకొన్నప్పుడు మంచి మార్కులు రాలేదు. నేను చదివే షేక్స్పియర్, ఇతర ఆంగ్ల సాహిత్యం నాకు ఎక్కువ ఇష్టం. గణితంలో నా బలహీనత చూసి నా బంధువులు, మిత్రులు ఆశ్చర్యపోయేవారు. ఒక్క నా అమ్మమ్మే ఏమీ అనేది కాదు.

నేను ఒకరోజు పట్టుపట్టి, నా బంధువులు, మిత్రుల కొరకై, గణితాన్ని అవుపాశన పట్టేను. క్రమంగా గణితంలో మంచి మార్కులు రావడం మొదలు పెట్టింది. అది చూసి నా బంధుమిత్రులు నన్ను ఇంజినీర్ అవ్వ మనేవారు. నేను వెళ్ళే ఇంజినీరింగ్ కాలేజీ నా బంధువులే నిర్ణయించి అక్కడికి సాగనంపేరు. నా అమ్మమ్మ ఒక్కతే నన్ను నా ధ్యేయాన్ని అనుసరించమని దీవించింది.

యత్ తపసాయి: శ్రీకృష్ణుడు నీవు ఏ కష్టం అనుభవించినా నాకు సమర్పించు అని చెప్పెను. ఇది సాధనకు మూల స్తంభం. ఒకరికి మనయందు క్రోధం ఉన్నప్పుడు, వారిని క్షమించడం అంత సులభం కాదు. వారితో మైత్రి పెంచుకుందామనే మన ప్రయత్నాన్ని వారు నిరాకరించి మనకు క్లేశం కలిగి౦చవచ్చు. కానీ మనం పట్టు విడువకుండా ప్రయత్నం చెయ్యాలి. మనం ఆధ్యాత్మిక జీవనం సాగించాలంటే కష్టాలను భరించడం తప్ప వేరే దారిలేదు.

బుద్ధుడు మన కష్టాలు మన వలననే కలుగుతాయని చెప్పెను. మనం ఇతరులను--అనగా తలిదండ్రులను, బంధు మిత్రులను-- మన కష్టాలకు కారణమని వారిని నిందించవచ్చు. అలకాక నేనే నా కష్టాలకు కారణం; కాబట్టి నేనే ప్రయత్నించి గట్టెక్కాలి అని నిర్ణయం చేసుకొంటే మనము ధృడమైన చిత్తంతో వాటినుండి బయట పడతాము. 187

Eknath Gita Chapter 9 Section 19

Bhagavat Gita

19.19

పత్రం పుష్పం ఫలం తోయం తదహం యే మే భక్ష్యా ప్రయచ్ఛతి {9.26}

తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః

నిష్కాముడైన భక్తుడు భక్తితో సమర్పించునట్టి పత్రమునైనను, పుష్పమునైనను, ఫలము నైనను, జలమునైనను నేను ఆరగింతును

ఆకులు, పువ్వులు, పళ్ళు, నీరు దేవుని పూజించడానికి ఉపయోగిస్తాం. అర్చన చేస్తున్నప్పుడు దేవుని నామాలు చదువుతూ వాటిని దేవునికి సమర్పిస్తా౦. శ్రీరామకృష్ణ ఇలాగే ఆదిశక్తిని పూజించేవారు. ఆయన ఆవిడ నామాలు చదువుతూ కలువ పువ్వులు ఆమె పాదాలమీద వేసేవారు. అలాగ ధ్యానంలో ఉండి, కొంతసేపటికి భక్తి పరవశుడై, ఆ పువ్వులను తన తలమీద వేసుకునేవారు. అటువంటి అనన్య భక్తితో ఆమెతో లీనమయ్యేరు.

మనము చేస్తున్న ప్రతీ క్రియ, ఎంత చిన్న దైనప్పటికీ, దేవునికి సమర్పించాలి. మనము మన కుటుంబానికై తోటలో కూరగాయలు పండిస్తే, అది దేవునికి నైవేద్యంగా భావించాలి. ఇతరులకై కొంత ఎక్కువ పనిచేసినా అది దైవార్పణముగా తలచాలి. ప్రతి రోజూ, క్రియ చిన్నదైనా లేదా పెద్దదైనా, దైవార్పణం చెయ్యాలి. అది పరిమాణం లేదా ఖర్చుతో సంబంధించినది కాదు. మన ఆనందం, ఉత్సాహం బట్టి ఉంటుంది. మన౦ పరోపకారముచేస్తూ మనను మరచిపోవాలి. 184

Eknath Gita Chapter 9 Section 18

Bhagavat Gita

9.18

యాంతి దేవ వ్రతా దేవాన్ పిత్రూన్ యాంతి పితృవ్రతాః {9.25}

భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినో అపి మామ్

దేవతలనారాధించువారు దేవతలను, పితృదేవతల నుపాసించు వారు పితృదేవతలను, భూతముల నారాధించువారు భూతములను పొందుచున్నారు. నన్ను సేవించెడివారు నన్నే పొందుచున్నారు ఀ

ఈ శ్లోకం యొక్క అంతరార్థ౦ మనము దేనిపై ధ్యానము చేస్తామో మనమదే అవుతాము. మనం ఒక భౌతికమైన సమస్యపై ధ్యానము చేస్తే, దానిని పరిష్కరించగలము. అలాగే ఒక మానసికమైన సమస్యను కూడా. కానీ మనం చిత్తశుద్ధి కలిగి, ఏకాగ్రతతో ధ్యానం చెయ్యాలి. శ్రీకృష్ణుడు "నీవు నాపై ధ్యానం చేస్తే నీ సమస్యలన్నిటినీ దాటగలవు" అని చెప్తున్నాడు.

రామాయణంలో రావణుడు స్వార్థానికి ప్రతీక. అతడు ఆసురులకు రాజు. అతని తమ్ముడు కుంభకర్ణుడు సోమరిపోతు. అతడు సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతాడు. మనము చతికిలబడి, క్రింద కూర్చుంటే మనని కుంభకర్ణుడితో పోలుస్తారు. మనము స్వార్థపరులమైతే రావణుని తన రాజ్యానికి తీసికెళ్లమని ప్రార్థిస్తాము. మనము బ్రతికుండగానే ఏ రాజ్యానికి వెళ్లాలో నిర్ణయించుకోగలం. అలాగే మంచి మార్గములో జీవించి స్వర్గాన్ని పొందవచ్చు.

పితృదేవతలను పూజించేవారు గతంలో మునిగి ఉంటారు. మన ఇళ్ళలో అనేక తరాల వారి పటాలు వేలాడగట్టి వచ్చిన వాళ్ళ కందరికీ వారిని పరిచయం చేస్తాం. మనం బుద్ధిని ఉపయోగించి గత౦లో ఏది ఉపయోగకరమో దానిని ప్రస్తుతానికి అన్వయించి గ్రహించాలి.

శ్రీకృష్ణుడు చెప్పే భూతాలు మనలో యున్న క్రోధము, లోభము మొదలగునవి. మనమెంత చెడ్డ భావాలను కలిగియుంటే, అంత ఆ భూతాల ప్రపంచంలోకి వెళ్తాము. చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటే భయం వేస్తుంది. జుత్తును మరమ్మత్తు చేసే అనేక సంస్థలు కూడా వెలిసాయి. జుత్తు రాలిపోతూ ఉంటే, మన భద్రత తక్కువవుతుంది. నా జుత్తు కూడా రాలిపోతూ ఉంటే "పోనీ.. అంతా పోనీ" అనుకొన్నాను. కాలం నా జుత్తుని తగ్గించి ఉంటుందికాని, నన్ను కాదు.

చాలామంది భావోద్వేగంతో కూడి భయానకమైన ప్రపంచంలో బ్రతుకుతారు. వారు అనేకమైన మానసిక-శారీరిక సంబంధిత వ్యాధులచే బాధ పడుతూ ఉంటారు. వారు తాము ప్రేమించు కొనదలచిన వారి యందు కూడా పూర్తి నమ్మకం ఉంచుకోరు. అందువలన వారికి అనుబంధాలు ఉండవు. అట్టి వారు ధ్యానం వలన మంచి ఫలితాలను పొందుతారు. ధ్యానంలో దృష్టి మన సమస్యలనుండి మళ్లించి, ఇతరుల సేవకై వినియోగింపబడుతుంది. అలా సాధన చేస్తే మనం చక్కగా జీవించి, అపోహలకు దూరమవుతాము 183

Eknath Gita Chapter 9 Section 17

Bhagavat Gita

19.17

యే అప్యన్యదేవతా భక్తా యజా౦తేశ్రద్ధయా అవ్వితాః {9.23}

తే అపి మామేవ కౌ౦తేయ యజ౦ త్యవిధిపూర్వకమ్

అర్జునా! ఎవరయితే అన్యదేవతారాధకులై శ్రద్ధతో వారిని ఉపాసించుచున్నారో వారునూ దారి తప్పి నన్నే ఉపాసించుచున్నారు

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ {9.24}

న తు మామభిజానంతి తత్త్వేనాత శ్చ్యవంతి తే

సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువును నేనే. అట్టి నన్ను వారు వాస్తవముగ గ్రహించుటలేదు. అందుచేత వారు పతనమగుచున్నారు

మేము భారత దేశంలోని బ్ల్యూ మౌంటైన్ దగ్గర నివసిస్తున్నప్పుడు, నేను ఒక అమెరికన్ ని కలిసేను. అతడు క్రిస్టియన్ కుటుంబంలో పెరిగి, ఉన్నత విద్యను అభ్యసించినవాడు. అతనికి ఆధ్యాత్మికత కలిగి, తన జీవిత లక్ష్యం ఏమిటా అని వేదుక్కోవడానికి ఒక బెంగాలీ గురువు వద్ద 12 ఏళ్లు శిక్షణ పొందేడు. అతను అత్యంత ఆశ్చర్యంతో ఇలా చెప్పెను: "నేను బోస్టన్ నుంచి బెంగాల్ కి పయనమై వచ్చి, కాళీ మాతను, పరమ శివుడిని ధ్యానించేను. నా హిందూ గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఉపాసన చేసేను. కానీ నా చేతన మనసు లోతులలో కనిపించేది కృష్ణుడు కాదు శివుడు కాదు. జీసస్ క్రైస్ట్!"

మన విషయాల్లో కూడా ఒక అవతారాన్ని ఇంకొక అవతారంతో పోల్చనక్కరలేదు. ఆ ఎన్నిక భగవంతునికే వదిలివేయడం మంచిది. ఒకరు జీసస్ మీద, మరొకరు శ్రీకృష్ణుని మీద, వేరొకరు బుద్ధుని మీద ధ్యానం చేయవచ్చు. వారిలో ఎటువంటి తేడా లేదు. మనం ప్రతి దినము చిత్త శుద్ధితో, ఏకాగ్రతతో, అహంకారాన్ని వదిలి ధ్యానం చేస్తే చివరకు ఆ భగవంతునిలో లీనమవుతాము. మనము జీసస్ ని లేదా బుద్ధుని పిలిస్తే, శ్రీకృష్ణుని కూడా పిలిచినట్లే. అలాగే మనము శ్రీకృష్ణుని పిలిస్తే, జీసస్ ని లేదా అల్లాని పిలిచినట్లే. నా విద్యార్థి ఒకని పేరు శివరామకృష్ణ. నేను వానికి చెప్పేవాడిని: "స్వర్గం ఎక్కడున్నా, నీవు దానిని చేరుకొంటావు. ఏ ఒక్క నామమైనా నిన్ను తరింపజేస్తుంది"

ధ్యానం అభ్యసించే మొదట్లో మనము ఏ దేవతనూ ధ్యానించకపోయినా, అది పరిపక్వమవుతున్న కొద్దీ ఒక ఇష్ట దేవతను ఆలంబనముగా చేసికొని దానిపై మనస్సు నిలపుతాము. మనకు ఏ అవతారాన్ని ఎంచుకోవలో తెలియకపోవచ్చు. ఒక ప్రక్క అహింసా పరుడైన జీసస్, ఇంకొక ప్రక్క సర్వ జీవులయందు కరుణామూర్తి బుద్ధుడు ఉండవచ్చు. అలాటప్పుడు ఎన్నికను దేవునికి వదిలి వేయడం ఉత్తమం. ఒక్కొక్కప్పుడు కలలో మీకు ఒక దేవత కనిపించవచ్చు లేదా దైవ నామము వినిపించవచ్చు. జీసస్ ఒక మేక పిల్లను ఎత్తుకొని ఉన్నట్లు కల రావచ్చు. లేదా ఓం మని పద్మే హం అనే బుద్ధుని మంత్రము కలలో వినపడవచ్చు. అప్పుడు మీ హృదయపు లోతులలో స్పందించి మీ సంశయాలన్నీ తీరిపోతాయి. 180

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...