Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 8

Bhagavat Gita

10.8

వక్తుమర్హ స్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః {10.16}

యాభి ర్విభూతిభిర్లోకా నిమా౦ స్త్వ౦ వ్యాప్య తిష్ఠసి

ఏ విభూతుల చేత నీవు ఈ లోకముల నన్నిటిని వ్యాపించి యున్నావో అట్టి దివ్యములగు నీ విభూతులను చెప్పుటకు నీవే తగుదువు

కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ {10.17}

కేషు కేషు చ భావేషు చింత్యో అసి భగవన్ మయా

యోగేశ్వరా! నిన్ను తెలిసికొనుటకు సదా ఏ విధముగ నేను ధ్యానింపవలెను? ఓ భగవంతా! ఏ ఏ భావములచే నిన్ను ధ్యానింపవలెను?

విస్తరేణాత్మనో యోగం విభూతి౦ చ జనార్దన {10.18}

భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతమ్

జనార్దనా! నీ యొక్క యోగ మహిమను, విభూతులను మఱల సవిస్తరముగ చెప్పుము. నీ జ్ఞానామృతమును గ్రోలుచున్న నాకు తనివి తీరకున్నది

అర్జునుడు దేవుని సదా -- అంటే అన్ని క్రియాలలోనూ, అందరిలోనూ--ఎరుగుట ఎట్లు అని అడుగుచున్నాడు. ధ్యానంలో సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన "ఇచ్చుటవలననే తిరిగి పుచ్చుకుంటాం; ఇతరులను క్షమించడంవలన మనం క్షమించ బడతాం" అనే వాక్యాలను స్మరించు కోవచ్చు. క్షమించడం మరియు దానం చెయ్యడం దేవుని లక్షణాలు. కానీ ఇలా రోజూ ఒక గంటో, రెండు గంటలో ధ్యానం చేయడం సరిపోదు. మనము సదా దేవుని స్మరించు కోవాలి. అంటే మన ఆలోచనలలోనూ, క్రియలలోనూ దేవుని స్మరించాలి. అలాగే ఇతరులలోని దైవత్వాన్ని చూడాలి. మనకు అది ఎలాగో తెలియకపోతే, ఇతరులలోని దైవత్వాన్ని తెలిసికోవడానికి ప్రయత్నించాలి. ఆచరణలో మనం దీన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. ఇదే మనము మంత్రజపములో చేసేది.

మనస్సుకి సహజంగా వస్తువులపై ఏకాగ్రతతో ఉండే సామర్థ్యం ఉంది. మంత్ర జపం ద్వారా మన మనస్సు యొక్క ఏకాగ్రత దేవుని మీద ఉంచుతాం. సామర్థ్యం లేదా ఏకాగ్రత ఒక్కటే కానీ దాని లక్ష్యం వేరు. హసిడిక్ యూదులు చెప్పుకొనే కథ ఒకటుంది. ఒక యూదుడు తన గురువును "మనము దేవుని వ్యాపారంలో ఇచ్చి-పుచ్చు కోవడాల్లో కూడా గుర్తుపెట్టుకోవాలా?" అని అడిగేడు. గురువు "అవును. మనం ధ్యానంలో వ్యాపారం గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, భగవంతుని గూర్చి వ్యాపారంలో ఆలోచించవద్దా" అని సమాధానమిచ్చేడు.

మన మనస్సు దేవుని యందు స్థిరమైనప్పుడు, అతని వైభవము అంతటా చూస్తాము. ముఖ్యంగా అందము, శ్రేష్ఠత ఉన్న చోట్లలో. నేను నా అమ్మమ్మ దయవలన జీవితాన్ని ఇలాగే చూస్తాను. నేను పచ్చని గడ్డి మొలవడం, నా పెంపుడు కుక్క మూకా సముద్రపుటొడ్డున పరిగెత్తడం, ఒక తల్లి ఓర్పుతో తన బిడ్డను ఓదార్చడం చూసినప్పుడల్లా దేవుడు గుర్తుకొస్తాడు. మనమిలా చూడడం మొదలు పెడితే మంత్ర౦ యొక్క సహాయం అక్కరలేదు. దేవుడే ప్రపంచంలోని ప్రతీ దాన్నీ తన శక్తితో నడుపుతున్నాడు అన్న విషయం ఎప్పటికీ మరచిపోలేం. 218

Eknath Gita Chapter 10 Section 7

Bhagavat Gita

10.7

సర్వమేతదృతం మన్యే యన్మా౦ వదసి కేశవ {10.14}

న హి తే భగవన్ వ్యక్తి౦ విదుర్దేవా న దానవాః

కేశవా! నీవు చెప్పిన దంతయు సత్యమనియే అని నేను భావించుచున్నాను. నీ నిజస్వరూపామును దేవదానవులు సైతము తెలియలేరు

స్వయమేవాత్మ నా ఆత్మానాం వేత్థ త్వం పురుషోత్తమ {10.15}

భూతభావన భూతేశ దేవ దేవ జగత్పతే

పురుషోత్తమా! సర్వప్రాణులను సృజించిన దేవా! సర్వభూత నియామకా! దేవదేవా! జగన్నాథా! నిన్ను నీవే ఎరుగుదువు ఀ

అర్జునుడు "నీవు చెప్పే ప్రతి మాట నా గుండెను హత్తుకుంటున్నాది. నిన్ను నేను ఎలా పూర్ణముగా తెలుసుకొందును?" అని శ్రీకృష్ణుని అడుగుచున్నాడు. ఇది మన స్మృతులు, పురాణాలు కూడా అడిగే ప్రశ్న. మనము ఊరూపేరూ లేని దేవుని గూర్చి ఎలా వ్రాయగల౦, ఏమి మాట్లాడగలం, ఏ విధంగా దేవుని గూర్చి పూర్తిగా తెలిసిన అధికారులుగా వ్యవహరించగలం? యోగులు మనము ఆ భగవంతుని పాదకమలములో ఒక అణువు మాత్రమే అని చెప్తారు.

దేవుడు ప్రతి చోటా ఉన్నాడు. అతను లేని చోటు లేదు. మనము ఇంద్రియాలతో అతనిని పట్టుకోలేము. కాని దైవ భక్తులకు అతడు ఇంద్రియాలు గ్రహించిన వాస్తవము కన్నా, వాస్తవమైన వాడు. శ్రీ రామకృష్ణ ప్రసంగం మధ్యలో ఆపి "తల్లి వస్తున్నాది. ఆమె కాలి గజ్జలు వినబడుతున్నాది" అనేవారు. ఇది మనమనుకొన్నట్టు రెండు గాజు గ్లాసులు తగిలితే వచ్చే శబ్దంలాంటిది కాదు. ఆది శక్తి ఆయనకు ఎంత వాస్తవమంటే, అతని చేతన మనస్సు లోతులలో ఆమె శబ్దాన్ని వింటారు.

మైస్టర్ ఎక్ హార్ట్ ఇలా అన్నారు: మనం దేవుని ఒక ఆవుని చూసినట్లు చూడగలమని అనుకుంటాం. కానీ మనం ఏ కన్నుతో చూస్తామో, ఆయన ఆ కన్నుతోనే మనను చూస్తాడు. మనం దేవుని భౌతిక ప్రపంచం చూసినట్లు చూడలేము. అతను పరమాత్మ. మనలోని ఆత్మ ఆ పరమాత్మ అంశ. మనమెప్పుడైతే ఆత్మతో అనుసంధానమౌతామో, అప్పుడు దేవుని తెలిసికొంటాము. 216

Eknath Gita Chapter 10 Section 6

Bhagavat Gita

10.6

అర్జున ఉవాచ : {10.12}

పరం బ్రహ్మ పరం ధామ పరమం భవాన్

పురుషం శాశ్వతం దివ్య మాదిదేవ మజం విభుమ్

ఆహుస్త్వా మృషయ స్సర్వే దేవర్షి ర్నారద స్తథా {10.13}

ఆశీతో దేవలో వ్యాస స్స్వయం చైవ బ్రవీషిమే

నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమ పావనుడవు. శాశ్వతుడవు. దివ్యమైన వాడవు. ఆదిదేవుడవు. అజుడవు. ప్రభువువని ఋషులు, దేవర్షియైన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు తెలిపియే యుండిరి. నీవును అట్లే చెప్పుచుంటివి

అర్జునుడు సర్వ మతాల సమైక్యతను గురించి చెప్పక చెప్పుచున్నాడు. ఆధ్యాత్మిక గురువులు ఒకే వాస్తవికత గురించి చెప్పి, మనను ఒక ఉన్నత లక్ష్యానికి చేరమని ప్రోత్సహించుచున్నారు. వారందరూ మనలోని దైవత్వమును గురించి చెప్పియు౦డిరి. కాని మనకు అది సమ్మతము కాదు. నాకు బోధపడనిది: కొందరు మానవాళి విధ్వంసమును వివరించు పుస్తకములు చదువుతారు; ఇంకొందరు మానవాళి చేసే చెడ్డ పనుల వార్తలను వార పత్రికల్లో చదవడానికి ఎగబడతారు; మరికొందరు బలహీనతనులను ఆసరాగా చేసికొని ఇతరులకు కష్టం కలిగిస్తారు. కాబట్టి జీసస్ "స్వర్గము మనలోనే ఉంది" అంటే వారికి నమ్మశక్యం కాదు. మనలోని ఆత్మ శుద్ధమై, శాశ్వతమై ఉన్నది. కాబట్టి యోగులు, ఋషులు మన ఆనంద౦, భద్రత మనలోనే ఉందని చెప్తారు. 215

Eknath Gita Chapter 10 Section 5

Bhagavat Gita

10.5

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం {10.10}

దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాంతి తేః

సదా యోగయుక్తులై, నన్ను ప్రీతితో భజించువారికి నన్ను పొందగల బుద్ధి యోగమును అనుగ్రహించుచున్నాను

తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజ౦ తమః {10.11}

నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వతా

నేను వారిని ఉద్ధరించుటకై వారి ఆత్మల యందు కొలువైయున్నాను. స్వప్రకాశమైన జ్ఞానదీపముతో వారి అజ్ఞాన చీకట్లను పోగొట్టుచున్నాను.

ధ్యానము మొదలుపెట్టిన చాలా కాలం మనం ఎత్తుపల్లాలు లేని రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది. దీనివలన అసహనం కలిగి, మనము ముందుకు పోలేకుండా ఉన్నామని తలుస్తాము. కానీ మనం నిస్పృహ చెందకుండా, చిత్త శుద్ధితో, ఏకాగ్రతతో ముందుకు సాగీతే సుదూర రోడ్డు ప్రయాణంలో నగరంలోని దుమ్మును, కాలుష్యమును వీడి చెట్లు, చేమలు గల ప్రదేశం చేరినట్లు, మన ధ్యానము పరిపక్వమవుతుంది. దానికి అనేక సంజ్ఞలు ఉన్నవి. ఆఫీసులో మనతో ఎప్పుడూ కలహం పెట్టుకొనే సహ ఉద్యోగికి, మనపై ప్రేమ కలగవచ్చు. ఒక పుస్తకాల కొట్టుకెళ్ళి అందరూ అడిగే సాంఘిక నవలులు కాక భగవద్గీత మీద క్రొత్త పుస్తకాలు వచ్చేయా అని అడుగుతాం. ఖరీదైన హోటల్ లలో చొప్పదంటు మాంసాహారం తినడంకన్నా, సామాన్యంగా ఉండే శాఖాహార హోటల్ లలో సారవంతమైన భోజనం తినడం మంచిదని గ్రహిస్తాం.

ధ్యానం మొదట్లో మన కుటుంబం చూసీచూడనట్లు ఉంటుంది. మన మిత్రులు మునుపటి లాగ లేమని గ్రహించి ఆట పట్టిస్తారు. మనకు కొంత నిర్లిప్తత లేకపోతే, ఇతరుల మనమీద చేసే విమర్శలు బాధను కలిగిస్తాయి. అలాటప్పుడు ధైర్యంతో ముందుకు సాగాలి.

ధ్యానం మొదటి మెట్టులో మనమే అన్ని నిర్ణయాలు తీసికోవాలి. పట్టుదలతో కోరికలను నియంత్రించుకోవాలి. రెండవ మెట్టులో, మన చేతన మనస్సు కాక, మనది కాని నిగూఢమైన శక్తి మన పురోభివృద్ధికి కారణమని తెలుసుకొంటాం. అది ఎలాగంటే ఒక పర్వతం ఎక్కి కొన్ని వేల అడుగులు ఎత్తులోంచి మనమెక్కిన దారిని చూసి, దేవుని దయలేకపోతే ఒక్క తప్పటడుగు వేసి అంత క్రిందకి పడుండవచ్చని తెలుసుకోవడం. మన౦ ఇంకా ఎక్కాల్సిన కొండ భయంకరంగా ఉన్నా, మన భక్తివలన దేవుడు ఇంత దూరం భద్రతతో తీసుకువచ్చేడు, కాబట్టి తక్కిన ప్రయాణాన్ని క్షేమంగా జరిగిస్తాడు అని భావిస్తాము.

చివరికి, సాధనలో ఆఖరి మెట్టు మనమెంత ప్రయత్నించినా ఎక్కలేము. ఎంత చిత్త శుద్ధితో సాధన చేసినా ఆ ఆఖరి మెట్టులో దేవునితో ఐక్యం చెందడానికి మనమెంత ప్రయత్నించినా సాధ్యం కాదని యోగులు చెప్తారు. మన సాధనికి సంతృప్తిపడి భగవంతుడే ముందుకు వచ్చి మనను తనలోకి తీసికోవాలి. జీసస్ చెప్పినట్లు భగవంతుడు రాత్రి పూట దొంగలాగ వస్తాడు. చివరికి, మనము ఊహించని రీతిలో, ఐక్యం అయ్యే సమయం వస్తుంది. యోగులు అది ఎలాగ ఉంటుందంటే ఒక గుడిలో సంవత్సరాల తరబడి దీపారాధన లేక, ఒక రోజు దీపం వెలిగిస్తే అలాగ అని చెప్తారు. 214

Eknath Gita Chapter 10 Section 4

Bhagavat Gita

10.4

ఏతాం విభూతి౦ యోగం చ మమ యో వేత్తి తత్త్వతః {10.7}

సో అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః

నా ఈ విభూతి యోగమును ఎవడు వాస్తవముగ తెలిసి కొనుచున్నాడో అతడు నిశ్చలముగ యోగముతో కూడి యుండును. ఈ విషయమున సందేహము లేదు

అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే {10.8}

ఇతి మత్వా భజ౦తే మాం బుధా భావసమన్వితాః

ఈ జగత్తంతయు నా వలననే జనించిన దనియు, నా వలననే ప్రవర్తించు చున్న దనియు గ్రహించిన జ్ఞానులు నన్నే సేవించుచున్నారు

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరం {10.9}

కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ

నా యందే మనస్సును, ప్రాణమును లగ్న మొనర్చి, నన్ను గురించి పరస్పరము ముచ్చటించుకొనుచు, నా కథలను చెప్పుకొను భక్తులు సదా తృప్తిని, ఆనందమును పొందుచున్నారు ఀ

భగవంతుని ప్రాణదా -- అనగా ప్రాణాన్ని ఇచ్చిన దాత -- అంటారు. జగత్తులోని అన్ని శక్తులూ ప్రాణం నుంచి ఉద్భవించినవి. ప్రాణము వలన సూర్యుడు వెలుగుచున్నాడు, మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయి, గాలి వీచుచున్నది. ప్రాణము వలననె కణములు వృద్ధినొందును, కళ్ళు చూడును, మనస్సు ఆలోచించును, హృదయము ప్రేమించును. భౌతిక శాస్త్రజ్ఞులు చెప్పే పదార్థము, శక్తికి మధ్యగల సంబంధం, జీవులకు, ప్రాణమునకు మధ్య కూడా ఉంది. ఇంకా పదార్థము వెనుకనున్న శక్తి, ప్రాణ శక్తి వలననే సాధ్యము.

ప్రశ్నోపనిషత్తులో "ప్రాణము ఆత్మ నుండి ఉద్భవించినది. ఒక వ్యక్తికి నీడ ఎలాగో, ఆత్మ యొక్క నీడ ప్రాణము" అని చెప్పెను. కావున యోగులు అడిగేది, మనకు ఒకటి చెందుతుందని ఎలా అనగలము? మనమనుకొనే వాహనాలు, ఇళ్ళు, బంగార౦, నిజానికి మనవికాక దేవునికి చెందినవి. ఆది శంకరుల వంటి వారు "ఈ ప్రపంచములో నేను ఏది త్యజించగలను? నాదంటూ ప్రపంచంలో ఏదీ లేదు. అంతా భగవంతునిదే" అని చెప్తారు.

మన మిత్రుడు దగ్గరకు వెళ్ళి "నీ వీణని నేను త్యజిస్తున్నాను" అంటే వాడు "ఏమిటి నువ్వు చెప్పేది? ఆ వీణ నీదికాదు. అది నాది" అని చెప్పును. మనది కాని వస్తువును త్యజించడంలో కష్టం ఎక్కడుంది? ఆధ్యాత్మిక సాధనలో మనదంటూ ఏమీ లేదని, అంతా పరమాత్మ స్వంతమని తెలుసుకొంటాము.

ఇలా మన౦ హృదయపూర్వకంగా నమ్మితే మానసిక ఒత్తిడి తగ్గి దేహానికి మేలు కలుగుతుంది. మనది కాని వస్తువును కాంక్షిస్తే, దాని వలన వొత్తిడి కలిగి, మన ప్రాణ శక్తిని వెచ్చించ వలసి వస్తుంది. అది ఎలాగంటే మన కారు ఇంజిన్ ను ఆపకుండా రాత్రంతా వదిలేస్తే, మరునాడు దానిలో ఇంధనం లేక నడపలేము. ఇక్కడ ప్రాణము ఇంధనము వంటిది. అది లేకపోతే ఏదీ నడువదు.

గాఢమైన ధ్యానంలో, ప్రాణాన్ని స్వాధీనంలో పెట్టుకోగలం. అంటే మన కోరికలను నియంత్రించుకుంటాం. అప్పుడు మన ప్రాణ శక్తిని వృధా కాకుండా చేయగలం. దాని వలన మన నాడి వ్యవస్థ పై ఒత్తిడి తగ్గి మనస్సు తేలిక అవుతుంది. చివరగా లైంగిక కర్మలను స్వాధీనంలో పెట్టుకొంటే ప్రాణ శక్తి అధికమౌతుంది. ఈ విధంగా యోగులు ప్రాణ శక్తిని స్వాధీనంలో పెట్టుకొంటారు.

ప్రాణ శక్తి మనందరిలో ఉన్న భగవంతుని వైపు ప్రసరిస్తుంది. దీనివలన కలిగే భద్రత చెప్పనలవిగాదు. స్వానుభవంతో మనలో ఉన్న భగవంతుని శక్తి అపరిమితమని మనకు తెలుసు. కాబట్టి మనము ప్రేమించడానికి లేదా సేవ చేయడానికి పరిమితులు లేవు. దానిని పూర్ణత అందురు. అంటే దానిలో ఎట్టి లోటూ లేదు. అది సంపూర్ణమైనది. ఇలాగ మనది కాని వస్తువుని త్యజిస్తే మనము పూర్ణులమవుతాము. తద్వారా మన గాఢమైన కోరికలు తీరుతాయి. 210

Eknath Gita Chapter 10 Section 3

Bhagavat Gita

10.3

మహర్షయ స్సప్తపూర్వే చత్వారో మనవ స్తథా {10.6}

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః

లోకము నందలి ఈ జనులు ఎవరియొక్క సంతతియై యున్నారో అట్టి పూర్వీకులైన ఏడుగురు మహర్షులును, సనకాది దేవర్షులును, స్వయంభువాది మనువులును నా భావము గలవారై నా మానస పుత్రులై జన్మించిరి.

శ్రీకృష్ణుడు చెప్పిన సప్త ఋషులు: భృగు, మరీచి, అత్రి, పులః, పులస్త్య, క్రతు, అంగిరస. వీరు 7 రకాల చేతనములకు, భౌతిక ఎరుక నుంచి సర్వ జీవ సమైక్యత వరకు, చిహ్నములు. ఇంకా వీరు పరిణామ శక్తికి సంజ్ఞలు. అలాగే 4 మనువులు: స్వరోషిష, స్వయంభు, రైవత, ఉత్తమ. వీరు సృష్టి ఆరంభమున ఉండి దానిని కావింతురు. భగవంతుడు సృష్టి సిద్ధాంతాలన్నిటికీ మూల కారణము. కానీ అతడు ఋషులు మొదలైనవారికి తన బాధ్యతను అప్పచెప్పును.

గీత భౌతిక ప్రపంచము, ఆలోచనలు, భావములు గల అంతఃప్రపంచమునకు మధ్య తేడా ఉందని చెప్పదు. బయట ప్రపంచంలో ఉన్న ప్రకృతే, మన అంతఃప్రపంచంలోనూ ఉంది. మనకు ఇతరులకు బాధ కలిగిస్తే, మనలోనూ బాధ కలిగించే బీజాలు నాటబడతాయని తెలుసు. మన ప్రపంచం డ్రైవరు లేని బస్సు లాంటిది. అందరూ తమ సీట్లు వెతుక్కుంటూ, బస్సు గురించి ఆలోచించట్లేదు.

మనము అహింసను నివారించుటకు ప్రయత్నించవలెను. దానికి ముందు మనలోని క్రోధమును నియంత్రించవలెను. బయట జరుగుతున్న మారణ హోమానికి కారణం సామాజిక పరిస్థితులవలన కాక, మనలోని క్రోధము వలన. క్రోధం అతి పెద్ద మహమ్మారి. మనమెప్పుడైనా హింస చేసినా లేదా పరుషంగా మాట్లాడినా, మన వ్యాధిని ఇతరులకు వ్యాపింపజేస్తున్నాము.

ఉదాహరణకు రాముడు, సీత భార్యా భర్తలు అనుకొందాం. రాముడు ఉదయం లేచి సీత చేసిన కాఫీ బాగాలేదని విసుక్కు౦టాడు. సీతకి తిరిగి సమాధానము ఇవ్వాలని ఉంటుంది కాని ఊరకుంటుంది. రాముడు ఆఫీసుకు వెళ్ళి రోజంతా సీతకి ఏమి చెప్పాలని ఆలోచిస్తాడు. సీతకూడా అలాగే ఆలోచిస్తూ, షాప్ కి వెళ్ళి షాప్ యజమానిపై తన కోపం ప్రదర్శిస్తుంది. ఆ యజమాని తన క్రింద పనిచేసే వారిమీద ఆ కోపం చూపిస్తాడు.

ఇవన్నీ చిన్న విషయాలు. కాని రోజు రోజుకీ అవి పేరుకు పోతాయి. దాన్నే యోగులు సంస్కారమంటారు. అంటే మన చుట్టూ ఉన్న వానియందు మన౦ చూపించే స్పందన. ఇలాంటి కుసంస్కారము లోతుగా పాతుకొని ఉంటే, మనము చీటికీ మాటికీ క్రోధము ప్రదర్శిస్తాము. ఇది చూడాలంటే దిన పత్రికను చదవండి. అందుకే మనము క్రోధానికి బదులుగా ఓర్పు, సద్భావన చూపి, ఎల్లప్పటికీ అది చేజారకుండా చూసుకోవాలి.

ఇది మన మాటలలోనే కాదు. ముఖము యందు కూడా. ముఖము మనస్సుయొక్క అద్దం అన్నారు. నేను ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు ఒక విద్యార్థిని ఉద్దేశించి "నీ ముఖం ఏడుపుగా ఉంది" అన్నాను. "అది నా సహజమైన ముఖం" అని వాడు బదులిచ్చేడు. "కానీ దానిని చూసే వాళ్ళం మేము" అన్నాను. ఇతరుల కొరకై మన ముఖ కవళిక మార్చుకోవాలి. ఇలాటి చిన్న చిన్న విషయాలు, చిలికి చిలికి గాలి వాన అయినట్టు, ప్రపంచాన్ని మారుస్తాయి. 208

Eknath Gita Chapter 10 Section 2

Bhagavat Gita

10.2

బుద్ధిర్జ్ఞా మసమ్మోహః క్షమా సత్యం దమ శ్శమః {10.4}

సుఖం దుఃఖం భవో అభావో భయం చా భయ మేవ చ

అహింసా సమతా తుష్టి స్తపో దానం యశో అయశః {10.5}

భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః

బుద్ధి, జ్ఞానము, మోహము లేకుండుట, సహనము, సత్యము, దమము, సుఖము, దుఃఖము, భయము, అభయము, అహింస, సమత్వము, సంతృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు అనేక గుణములు ప్రాణులకు నావలననే కలుగుచున్నవి

మనము ప్రపంచాన్ని ద్వంద్వాలతో చూస్తాము: మంచి - చెడు, తప్పు - ఒప్పు, ఆహ్లాదం - విషాదం. భగవంతుడు చంచల మనస్సు కలవాడు కాడు. అలాగే ప్రేమించకుండా ఉండేవాడు కాదు. ఇవన్నీ మనము ఏర్పరచుకొన్న విభేదాలు.

ఎడ్గర్ అల్లాన్ పో వ్రాసిన ఒక కథలో, ఒకడు మరొకని ఉత్తరం బహిర్గితం చేస్తానని ఏడిపిస్తూ ఉంటాడు. ఉత్తరం వ్రాసిన వాడు చివరకు పోలీసులను పిలుస్తాడు. వాళ్ళు ఏడిపిస్తున్నవాడి ఇంటికి వచ్చి ఆ ఉత్తరాన్ని ఇల్లంతా వెతుకుతారు. కానీ ఎక్కడా కనబడదు. చివరకు వాడు కూర్చునే బల్లమీద అందరికీ కనబడుతూ ఆ ఉత్తరం ఉంటుంది.

అలాగే దేవుడు విశ్వమంతటా మనకు నిత్యం కనబడుతూ ఉన్నాడు. కానీ మన మనస్సు ద్వంద్వాలతో కూడి ఉండటంవలన దేవుడు కనిపించటం లేదు.

ధ్యానం పరిపక్వమౌతున్న కొద్దీ మనకు తెలిసేదేమిటంటే మనస్సులో ఇష్టాయిష్టాలు ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి. ఆ ప్రక్రియ అచేతన మనస్సులో జరగడంవలన మనకది సాధారణంగా కనబడదు. ఒకరిని పరికిస్తున్నప్పుడు మనస్సును విశ్లేషణం చెయ్యండి: "నాకు వాని నడక నచ్చలేదు. అది ఎంతో డాంబికంగా ఉంది. వాని గొంతుకు నచ్చలేదు. అది నాకు గగుర్పాటు కలిగిస్తుంది" అనే భావాలు కలుగుతాయి.

ఈ విధంగా మనస్సు పనిచేస్తుంటే ద్వంద్వాలకు అలవాటు పడ్డామని తెలుస్తుంది. దానివలన మన విశ్వాసం, సహనం, భద్రత మొదలగునవి చంచలంగా మారుతాయి. ఈ శ్లోకంలోని చెప్పిన లక్షణాలు మన జ్ఞానోదయానికి సహకరిస్తాయి. అసమ్మోహ అనగా ఎటువంటి భ్రాంతి లేకుండుట. అనగా ప్రపంచమంతా ఏకమైనదనే ఎరుక. దాని వలన ప్రపంచం ఇచ్చే డబ్బు, ఆనందం, పరువు, ప్రతిష్ఠ వలన సమ్మోహనము చెందము.

అహంకారము గలవారు సమ్మోహితులై మిత్రులతో వైరము కలిగించుకొనుట, ప్రమాదకరమైన క్రియలు చేయుట, మొదట ఆనందము కలిగించినా చివరకు నిరాశ కలిగించే మార్గాల మీద ప్రయాణ౦ చేస్తారు. ధ్యానం వలన మనకు కనువిప్పు కలిగి, ప్రపంచం మారలేదు, మనమే మారేమని తెలుసుకొంటారు.

క్షమ వలన మన అహంకారాన్ని జయించవచ్చు. క్షమ అనగా ఒకరిని క్షమించడం, ఓర్పు, సహనం, ఇతరులను అర్థం చేసికోవడం. మనని ఇతరులు పట్టించుకోవటంలేదు, మనకి వారు అన్యాయం చేస్తున్నారు అనే ఆలోచనలు బాధ పెడుతున్నప్పుడు ఓర్పు అవసరం. దాని వలన మన మనస్సు అనుమానాలతో, క్రోధంతో ఉండదు. మనం ఒకర్ని పలకరించి, వారి నుండి ఎటువంటి స్పందన రాకపోతే వారిమీద కోపం కలుగవచ్చు. తరువాత వాళ్ళు సమస్యలతో సతమతమవుతున్నారిని తెలిసికొని మన కోపం తగ్గి వారిని క్షమిస్తాము.

మనకు తీవ్రమైన సమస్యలు కలిగించిన వారితో సామరస్యంగా ఉండడం క్షమకి తార్కాణం. అలాగ ఏదో బలి పశువులా కాక, ఆనందంతో ఉండాలి. అలాగని మనము వారికి విధేయులమై ఉ౦డాలని భావించనక్కరలేదు. వారితో సహనం పాటించి బాంధవ్యం పెంచుకోవాలి.

మనము ప్రేమించే వారలతో విభేదం కలిగినప్పుడు వారికి మన విభేదాన్ని కరుణతో చెప్పాలి. ఇది ముఖ్యంగా పిల్లలకు వర్తిస్తుంది. శ్రీరామకృష్ణ మనకు విభేదం కలిగినప్పుడు పాము వలె బుస కొట్టాలి గానీ కరవ కూడదు అన్నారు.

సమ్మోహనాన్ని నియంత్రించుకోవాలంటే మనగురి౦చే ఎప్పుడూ ఆలోచించకూడదు. మనల్ని ఆనందింపజేసేవి, మనకు దుఃఖము కలిగించేవి, మనకు కావలిసినవి, మనకి అక్కరలేనివి అనే ద్వంద్వాల గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉంటే, ఇతరులతో, చివరికి మనతో కూడా, వేర్పాటు చెందుతాము. కాబట్టి శ్రీకృష్ణుడు మనకు జీవితం ఇచ్చిన దానితో సంతృప్తి పడమని చెప్పేడు. భిక్షగాడివలె జీవితాన్ని "నాకు ఆనందాన్ని ఇవ్వు; బాధ కలిగించవద్దు" అని అడుక్కునే కన్నా, మనం దానం చేయగలిగినది ఏమిటి అని అడగాలి. ఇతరులకు మన సమయ౦, వస్తువులు, సమర్థత, వస్త్రములు, ఆహారము, ఏమైనా సంతోషంతో ఇవ్వాలి. మనమిచ్చేది విలువైనది కాకపోవచ్చు. కానీ మనము సంపూర్ణ హృదయంతో, ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా ఇవ్వాలి. మనకు ఎక్కువగా డబ్బు ఉన్నంత మాత్రాన సంపన్నులము కాదు; మనమెంత ఇతరులకు ఇస్తే --డబ్బు మాత్రమే కాక--మనమంత ధనవంతులమైనట్టు.

దీనికొక కథ చెప్తారు. ఒక వ్యక్తి ఎప్పుడూ తప్పు చేయక, అన్ని నియమాలను పాటించి, ఇతరులకు మంచి బోధ చేసి, వారితో ఎప్పుడూ సామరస్యంగా ఉండి, కొన్నాళ్ళకు ప్రాణం విడిచేడు. చిత్రగుప్తుడు వాని గురించి తన చిట్టాలో వెదకుతే ఎటువంటి తప్పులు, ఒప్పులు కనిపించలేదు. చిత్రగుప్తుడు ఆశ్చర్యపడి వానిని బ్రహ్మ దగ్గరకు తీసికెళ్ళేడు. "నువ్వే వీనిని సృష్టించేవు. వీనిని స్వర్గానికి పంపించాలో, వద్దో చెప్పు" అని చిత్రగుప్తుడు బ్రహ్మను అడిగేడు. బ్రహ్మ కూడా వానికి ఎటువంటి తప్పు, ఒప్పు లేదని తీర్మానించేడు. "వీనిని శ్రీకృష్ణుని వద్దకు తీసికివెళ్ళు" అని బ్రహ్మ దేవుడు సలహా ఇచ్చేడు. శ్రీ కృష్ణుడు వాని చిట్టా అంతా చూసి ఆ వ్యక్తి ఒకమారు బిచ్చగాడికి 5 పైసలు దానం చేసేడని కనుగొన్నాడు. "చిత్రగుప్తా, వీనికి 5 పైసలు ఇచ్చి మళ్ళీ ప్రయత్నం చెయ్యమని చెప్పి, వెనక్కి పంపించు" అని శ్రీకృష్ణుడు తీర్మానించేడు. 206

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...