Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 13

Bhagavat Gita

10.13

పురోధసా౦ చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి౦ {10.24}

సేనానీనామహం స్కంద స్సరసామస్మి సాగరః

పార్థా! పురోహితులలో నేను ప్రముఖుడగు బృహస్పతిని. సేనాధిపతులలో కుమారస్వామిని. సరస్సులలో సముద్రుడను

బృహస్పతి దేవతలకు గురువు. మనకు తెలిసో తెలీకో ఇతరులకు గురువులుగా ఉంటాం. ముఖ్యంగా పిల్లల విషయాల్లో. పిల్లలు మనం చెప్పే మాటలకన్నా , మనం ఆచరించే విధానాన్ని అనుసరిస్తారు. మనం ఓర్పు మీద వ్రాసిన ఒక పుస్తకాన్ని మన పిల్లవాడికి ఇవ్వవచ్చు. కానీ మనం ఓర్పువహించనంతకాలం ఆ పిల్లవాడు ఓర్పు గురించి నేర్చుకోడు. సహనం, భద్రత, నిస్స్వార్థం మన పిల్లలకు అబ్బాలంటే మనం వాళ్ళకు వాటిని ఆచరించి చూపించాలి.

శ్రీకృష్ణుడు తాను ఉత్తమమైన గురువేకాక, సర్వోత్తమమైన యోధుడు కూడా అని చెప్పేడు. స్కందుడు మన పురాణాలలో దుష్ట శక్తులను సంహరించిన ఒక గొప్ప యోధుడు. అలాగే మన ఆధ్యాత్మిక సాధనలో మనలోని మిక్కిలి పౌరుషంతో కూడన గుణములను యోధులమై నియంత్రించుకోవచ్చు.

కవి కాళిదాసు స్కందుడు మీద ఒక గొప్ప కావ్యం వ్రాసాడు. ఒకప్పుడు తారకుడనే అసురుడు దేవతలతో యుద్ధాలు చేసి వారిని అష్టకష్టాలు పెట్టేడు. పెద్దలు తారకుడుని చంపే సామర్థ్యం గలవాడు శివుని పుత్రుడై ఉండాలని చెప్పేరు. కావున దేవతలు శివుని వద్దకు వెళ్ళి తమను రక్షింపమని మొర పెట్టుకున్నారు. కాని శివుడు ఆజన్మ బ్రహ్మచారి. అప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి ఆతనిని తన అందముతో కాక, ఆధ్యాత్మికతతో వశం చేసుకొని పెళ్ళాడి, స్కందునికి జన్మ నిస్తుంది. చివరకు స్కందుడు తారకుని, ఆతని అసుర సేనను సంహరించి స్వర్గంలో శాంతి నెలకొల్పుతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే స్కందుడు పార్వతీపరమేశ్వరుల మధ్య గల కామంవలన జన్మించలేదు. అతడు శివుని నిగ్రహమువలన జన్మించి, అందువలన తారకుడిని సంహరించగలిగేడు.

తరువాత శ్రీకృష్ణుడు తనని ఒక పెద్ద సాగరముతో పోల్చుకొంటాడు. పురాణాల్లో అతను సముద్రంమీద శేషశయ్యపై పవళించియున్నాడని చెప్పబడింది. అలాగే మనలోని సముద్రంలో కూడా అతడున్నాడు. సముద్రంలోని ఉప్పనీళ్లు సృష్టి ఆదిలో జీవరాశ్యులకు యోని. అది మన దేహంలోనూ ఉంది. సముద్రాలు భూమి ఉపరితలంపై 70 శాతం కప్పి ఉన్నాయి. అలాగే మన శరీరంలో 70 శాతం జలమే. మనలో ఒక చిన్న సాగరం ఉండి కోట్ల కణాలకు పోషణ ఇస్తోందనడంలో అతిశయోక్తి లేదు.

జీవులను అధ్యయనం చేసే శాస్త్రవేత్త జాక్ కూస్టో నేటి కాలములో సముద్రాలు పెద్ద మురికి గుంటల్లా తయారయ్యాయని చెప్పేరు. ఎందుకంటే పరిశ్రమల వ్యర్థాలను సముద్రాలలో విడుస్తున్నారు. ఎవరైనా సముద్రంలో ఈతకెళ్తే లేనిపోని వ్యాధులు తెచ్చుకుంటారు. ఎలాగైతే సముద్రాలు కాలుష్యంతో నిండి ఉన్నాయో, మనలో కూడా క్రోధం, భయం, దురాశ వంటి కాలుష్యాలు ఉన్నాయి. వాటిని ధ్యానం ద్వారా నిర్మూలించవచ్చు. 230

Eknath Gita Chapter 10 Section 12

Bhagavat Gita

10.12

రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసా౦ {10.23}

వసూనాం పావక శ్చాస్మి మేరు శ్శిఖరిణా మహమ్

నేను రుద్రుల యందు శంకరుడను. యక్షరాక్షసులలో కుబేరుడను. వస్తువుల యందు అగ్నిహోత్రుడను. పర్వతములలో మేరు పర్వతమునై యున్నాను

శ్రీకృష్ణుడుకి శంకర, రుద్ర అను నామములు గలవు. ఇక్కడ అతడు చెప్పక చెప్పినది: దేవుని దయ మనకు దుఃఖ రూపేణా వస్తుందని.

మనము ఎంతోకొంత శ్రమ లేనిదే ఏమీ నేర్చుకోలేం. కావున, మనం ఎప్పటికీ ఒకేలాగ ఉంటామా లేదా శ్రమ చేసి ఎదుగుతామా అని మనని ప్రశ్నించుకోవాలి. దుఃఖాన్ని మిత్రుడుగా ఆహ్వానించనప్పుడే అది శత్రువులా వస్తుంది. మనము దుఃఖము వలన ఆరోగ్యాన్ని, భద్రతని పెంచుకోవచ్చు. లేదా మన జీవన విధానాన్ని మార్చుకోలేక నిరాశ చెందవచ్చు.

నేను కొన్ని రోజుల క్రితం తక్కినవాళ్ళు ఏమి తింటున్నారని తెలిసికోవడానికి నా మిత్రునితో ఒక పెద్ద హోటల్ కి వెళ్ళేను. అక్కడ అక్షరాస్యులై, అత్యంత సంస్కారవంతమైనవారు అనారోగ్యము చేసే పదార్థాలను తింటున్నారు. నేను మన దేహ వ్యవస్థ ఎంత గొప్పదో కదా అనుకొన్నాను. వారి దేహము ఇంకా స్వస్థతో ఉండి, మరిన్ని భౌతిక సమస్యలు లేకుండా ఉందంటే, దానికి కారణము దేవుని దయ. మీరు సంపూర్ణమైన నాడీ వ్యవస్థని చూడాలనుకొంటే, చిన్న పిల్లవానిని చూడండి. కానీ వాడే పెద్దవాడయి లేనిపోని సమస్యలు తెచ్చుకొ౦టాడు. మానసిక ఒత్తిడి, రక్త పోటు, తీవ్రమైన తలనొప్పి, కడుపులో పుళ్ళు మొదలైనవి రాత్రికిరాత్రీ రావు. అవి మనము దీర్ఘ కాలంగా ఆలోచించక చేసే తప్పు ఎన్నికల వలన కలుగుతాయి.

కొందరు మొదటిసారి బాధ అనుభవించగానే, తమ ఆలోచనలను, నడవడికను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ దానితో ఒక సమస్య ఉంది. వారిక చెడ్డ అలవాట్లు ఉంటే, వారు మారడం చాలా కష్టం. నాకు ధూమపానమునకు, మద్యమునకు, మాదక ద్రవ్యాలకి అలవాటు పడినవారు చాలా మంది తెలుసు. వారికి ధ్యానం విశేషంగా చెడ్డ అలవాట్లు వీడడానికి పనికివస్తుంది. అలా మారి తమ చెడు అలవాట్లను సమూలంగా నిర్మూలించిన మిత్రులు నాకున్నారు. ధ్యానం చెడు అలవాట్లను నిర్మూలించడానికి కావలసిన పట్టుదలనిస్తుంది.

ఇదేవిధంగా మన సహజ వనరులను కాపాడుకోవచ్చు. మన౦ పీల్చే గాలి, త్రాగే నీరు, నదులు, సముద్రాలు కాలుష్యంతో నిండి ఉన్నాయి. అందువలన మనమనుభవించే బాధ మన భౌతిక దేహ బాధ వంటిదే. మనం నిర్దయతో పర్యావరణాన్ని వాడుకొని మిక్కిలి హాని కలిగించుకొంటున్నాము. సముద్రమంటే రెండు ఖండాల మధ్యనున్న జాగాయే కాదు. 80 శాతం జీవులు సముద్రాల్లో నివసిస్తున్నాయి. వాటిలో గ్రాండ్ కాన్యన్ కన్నా లోతైన ప్రదేశాలు, ఎవరెస్ట్ శిఖరానికన్నా ఎత్తైన పర్వతాలు నీటితో కప్పబడి ఉన్నాయి. మొత్తానికి జీవరాశుల బ్రతికిఉండడానికి సముద్రాలు సహకరిస్తాయి. కానీ సముద్రములలోకి చమురు, పరిశ్రమల వ్యర్థాలు, మురికి కాల్వల నీటిని, వదిలి వాటిలో నివసించే జీవులకు మిక్కిలి హాని కలిగిస్తున్నాం. ఇది ఒక సూచిక: మన జీవన విధానాన్ని విశ్లేషణము చేసి, మన అవసరాలను నియంత్రించి, భౌతిక వనరులను ఎంత తక్కువగా వీలయితే అంత తక్కువగా ఉపయోగించాలి.

ప్రసార మాధ్యాలు ఏమి చెప్పినా, జీవితంలో బాధలు ఉండవన్నట్టు మనము వ్యవహరించకూడదు. ఆఫ్రికాలోనైనా లేదా అమెరికాలోనైనా, గొప్పవాడైనా పేదవాడైనా, అందరూ బాధలు అనుభవిస్తున్నారు. అది జీవితంలో సహజం. మనము ఆధ్యాత్మిక జీవనంలో పరిపక్వత పొందితే, ప్రపంచంలో ఎంతోమంది దుఃఖంలో జీవిస్తున్నారని తెలిసి, మన స్వార్థానికై సుఖాలను లేదా లాభాలను ఆశించం. మనలో చాలామంది చిత్రవిచిత్రమైన మానసిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ధనవంతులులా ఉంటే ప్రతీదీ ఒప్పని తలుస్తాం. మన కళ్ళు తెరిచి చూస్తే, దుఃఖం మన చుట్టూ ఉన్న వేలాది మందిలో ఉందని గుర్తిస్తాం. అది యుద్ధాల వలన లేదా పేదరికం వలననే కాకపోవచ్చు. మనము ఎంత చుట్టూ ఉన్న దుఃఖాన్ని చూడక ఉంటామో, అంత ఎక్కువ బాధలు పడాలి. ఎందుకంటే దుఃఖం మనను సుఖాలను వీడి పరోపకారము చెయ్యడానికి ప్రోద్భలం ఇస్తుంది.

శ్రీకృష్ణుడు తాను పావక -- అనగా శుద్ధి చేసే అగ్ని -- అని చెప్పేడు. నేనొకసారి బంగారం గనులున్న ప్రదేశానికి వెళ్ళేను. అక్కడ బంగారాన్ని భూమినుండి వెలికితీసి, అగ్నితో వేడిచేసి మలినాన్ని తీసివేసి, సుత్తితో దాగిలి మీద కొట్టి తమకు కావలసిన ఆకారంగా మారుస్తారు. ఇలాగే ఆధ్యాత్మిక సాధన కూడా. కొందరు అహంకారాన్ని వీడక ఉంటారు. మరికొందరు దేవుని తమను దాగిలి మీద పెట్టి, సుత్తితో కొట్టి, అహంకారాన్ని సమూలంగా నాశనం చేయమని వేడుకొంటారు. అలా చెప్పగలిగితే, ఒక వ్యక్తి దుఃఖానికి అతీతుడైనట్టు. దేవుడు సుత్తిని ఎత్తవచ్చు, కాని అది అతని మీద పడదు. దానికి బదులుగా సుత్తిని విసిరేసి, అతన్ని దేవుడు హత్తుకొ౦టాడు. 228

Eknath Gita Chapter 10 Section 11

Bhagavat Gita

10.11

వేదానా౦ సామవేదో అస్మి దేవానామస్మి వాసవః {10.22}

ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా

వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, భూతముల యందు చేతనాశక్తి నేనై యున్నాను. ఀ

నాల్గు వేదములు: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. వాటికి మూలము విద్ అనగా తెలిసికొనుట. వేదాలు మనము ముఖ్యంగా తెలిసికొనవలసిన విషయాలు చెప్తాయి.

నేను చెప్పే ఊహాతీతమైన జ్ఞాన సముపార్జన (transcendental mode of knowing) కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అది వారి అనుభవానికి అందనిది. అందువలన వారికది కొరకబడదు. అందుకై నా పెంపుడు పిల్లి కథ చెప్తాను. దాని పేరు ఊష్. అది నాతో భారత దేశం నుంచి అమెరికాకి ప్రయాణం చేసింది. దానికి ప్రత్యేకమైన ఆహారము, ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి. దానికి మాటలు వస్తే సర్వోత్తమమైన జ్ఞాన సముపార్జన విధం ఏమని అడిగితే, అది ప్రవృత్తి (instinct) అంటుంది. దాని మరుసటి జన్మలో మానవునిగా పుడితే ఆలోచించడం అంటుంది. కాని అది పిల్లిగా ఉన్నంత కాలము ప్రవృత్తి ఒకటే దానికి ఆధారం. మానవులు ప్రవృత్తి నుంచి ఆలోచనచేసే పద్దతి, పరిణామం వలన, పొందేరు. తద్వారా యోగులు ఉన్నతమైన జ్ఞానంతో ప్రపంచంలోని సర్వ జీవరాశులను చూస్తారు.

పై శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సు గురించి చెప్పేడు. మనస్సు మన ఆరవ ఇంద్రియము. దాని ద్వారా పంచేంద్రియములగూర్చి అవగాహన వస్తుంది. అది ఇంద్రియములకు ఎటువంటి సంకేతము ఇవ్వకపోయినా, తనలో తాను రమిస్తుంది. ఈ నేపథ్యంలో మనస్సు కోరికలతో నిండివుంటుంది. మన ముందు పిజ్జా లేకపోయినా, మనస్సు పిజ్జా రుచిని, వాసనను అనుభవించగలదు. మనం అంతకుముందు తిన్న పిజ్జా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. అది మనలోని పిజ్జా సంస్కారము లేదా పిజ్జా యావగా ఉంటుంది. ఇలాగ ఇంద్రియాలలో మనస్సు ఉత్కృష్టమైనది. మనము పంచేంద్రియాలను జయించాలంటే మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి.

మన మనస్సనే తోటలో అనేకమైన కలుపు మొక్కలు ఉన్నాయి. అవి క్రోధం, భయం, పగ, మత్సరము మొదలగునవి. కలుపు మొక్కలవలన దయ, దాక్షిణ్యము అనే మొక్కలు పెరగవు. అది తోట భూమి సారవంతంగా లేక కాదు. మనము కలుపు మొక్కలను తీసివేయక మంచి గుణాలు పెంపొందవు. కొందరు తమ క్రోధం, ఆవేశం గూర్చి గొప్పగా చెప్పుకొంటారు. మనము మన సమస్యల గూర్చి వ్రాసినా, ఆలోచించినా అవి నిద్రలో అచేతన మనస్సులోకి చేరుకొంటాయి. అప్పుడు వాటిని వేళ్ళతో పెకలించడం సాధ్యం కాదు. కాబట్టి మనము రోజూ ధ్యానం చేసి, మంత్రము జపించి, మనలోని చెడు భావాలను తీసివేసి, మంచి భావాలను అలవరుచుకోవాలి.

మనస్సు ఇంద్రియమనబడడానికి కారణం, అది స్వతహాగా చేతనము లేని పరికరం లాంటిది. దేహం బాహ్యంలో ఎలాగ ఉందో, మనస్సు అంతర్ముఖంగా ఉంది. అది చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది కాని, దానికి స్వతహాగా చైతన్యము లేదు. కాబట్టి శ్రీకృష్ణుడు, తాను మనస్సేకాక, ప్రతి జీవిలోనీ చైతన్యమని చెప్పును. మట్టితో వివిధ రకాలైన కుండలు చేసి చూస్తే వాటిలో ఉండే గాలి అంతా ఒక్కటే. అలాగే మన ఆకారాలు వేరైనా, మనలోని చైతన్యము ఒక్కటే. మన౦దరిలోనూ శుద్ధమైన, తేడా లేని, చైతన్యము ఉంది. అదే ఆత్మ. 225

Eknath Gita Chapter 10 Section 10

Bhagavat Gita

10.10

ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషా౦ రవి రంశుమాన్ {10.21}

మరీచి ర్మరుతామస్మి నక్షత్రాణా మహం శశీ

నేను ఆదిత్యులలో విష్ణువును. జ్యోతులలో కిరణములు గల సూర్యుడను. మరుత్తులలో మరీచిని. తారల యందు చంద్రుడను నేనే.

మన పూర్వీకులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు గూర్చి మాట్లాడుకునేవారు. నేటి శాస్త్రజ్ఞులు వాటిని దుర్భిణిలో చూసి లెక్కపెట్టలేనన్ని నక్షత్రాలు, వాని చుట్టూ తిరుగుతున్న సౌర కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు.

నా ఉద్దేశ్యంలో వాటినన్నిటినీ నడిపేది దేవుని శక్తి. అందుకే దేవుని విష్ణు -- అనగా అన్నిచోట్లా ఉన్న వాడు-- అని పిలుస్తారు. భగవంతుడు ఇదంతా ప్రేమపూర్వకంగా చేస్తాడు. మన కుటుంబాలలో అనుబంధాలు ఎలా ఉంటాయో, జగత్తు కూడా ఒక కుటుంబమై అన్యోన్యంగా ఉంటుంది. మనకి అతి దూరమైన గ్రహాలను -- ప్లూటో లేదా నెప్ట్యూన్ -- తీసివేస్తే భూమిమీద మన జీవితం మారవచ్చు. విశ్వంలో ఏదీ శకలంలా వేర్పాటుతో ఎన్నటికీ ఉండదు. ప్రతీదీ తక్కినవాటితో స్పందిస్తూ ఉంటుంది.

ఉదాహరణకి సూర్యుడు 60 వేల కోట్ల సంవత్సరాల నుంచి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశమునకు కారణం గూర్చి శాస్త్రజ్ఞులకు తెలిసిందల్లా సూర్యుని ఉపరితలంలో హైడ్రోజన్ హీలియం గా మారుతూఉంటుందని. ఇంకా సూర్యుని మధ్యలో 130 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. శాస్త్రజ్ఞులు చెప్పలేనిది దాని కారణం. కారణం తెలియాలంటే ఆధ్యాత్మిక జ్ఞానసముపార్జనమొక్కటే దారి.

ఇంకా తెలియని విషయమేమిటంటే కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సూర్యుని కాంతి, మనదగ్గరకు వచ్చేసరికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉంటుంది. అంటే మనం నివసించడానికి యోగ్యంగా ఉంటుంది. గీత చెప్పేది సూర్యుని లో శక్తి, పీడనము, ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉండే విధంగా భగవంతుడు సిద్ధాంత పూర్వంగా నిర్దేశించాడు. ఇదేవిధంగా భగవంతుడు మన సౌర కుటుంబాన్ని ఒక సిద్ధాంతం ద్వారా నడుపుతున్నాడు. 223

Eknath Gita Chapter 10 Section 9

Bhagavat Gita

10.9

శ్రీ భగవానువాచ:

హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః {10.19}

ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే

కురుశ్రేష్ఠా! దివ్యములగు నా విభూతులను ప్రాధాన్యత ననుసరించి నీకు చెప్పెదను. నా విభూతులకు అంతము లేదు

అహమాత్మా గూడాకేశ సర్వభూతాశయస్థితః {10.20}

అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ

గూడాకేశా! సర్వభూతముల హృదయముల యందున్న ఆత్మను నేనే. సర్వభూతముల యొక్క ఉత్పత్తి స్థితి లయాదులకు కారకుడను నేనే ఀ

మనం గతంలో ఎన్ని తప్పులు చేసినా, మన ఆత్మ శుద్ధమై, ప్రేమపూరితమై, జ్ఞానవంతమై యుండును. యోగులు ఆత్మని సూర్యునితో పోల్చెదరు. ఎన్ని మబ్బులు కమ్మినా, మనం కళ్ళు మూసుకొన్నా సూర్యుని ప్రకాశమునకు అంతరాయము ఉండదు. అలాగే మనమెన్ని తప్పులు చేసినా అంతర్యామిలో ఆత్మ సూర్యునివలె వెలుగుచుండును. మనము క్రోధము, అసహనం, విరోధం లేకుండా చేసుకొంటే మనలోని ఆత్మ నిరాటంకంగా ప్రకాశిస్తుంది.

ఒక బాలుడుగా ఉన్న రాజకుమారుని కొందరు దొంగలు ఎత్తుకుపోయి వానిని తమలాగా మార్చుకొ౦టారు. ఆ రాజకుమారుడు తాను ఎవరో గుర్తులేక మిగతావారిలాగ ఒక దొంగగా మారి దొంగతనాలు చేస్తాడు. కాలక్రమేణా అతను పెద్దవాడై ఆ దొంగల ముఠాకి నాయకుడవుతాడు. ఒక వృద్ధుడు ఆ దారిన పోతూ దొంగగా మారిన రాజకుమారుడిని పోల్చుకొని అతను ఆ దేశపు రాజకుమారుడని చెప్తాడు. కాని అతను నమ్మడు. ఆ వృద్ధుడు రాజ వంశీయులకు దగ్గర వాడు. అతను ఆ దొంగగా మారిన రాజకుమారునికి చిన్నప్పటి విషయాలు జ్ఞప్తికి తెస్తాడు. చివరికి తాను స్వతహాగా దొంగను కానని, నిజంగా రాజకుమారుడనని తెలిసికొంటాడు. ఆ వృద్ధుని సహాయంతో అతను ఆ దేశపు రాజైన తన తండ్రిని చేరుకుంటాడు. 221

Eknath Gita Chapter 10 Section 8

Bhagavat Gita

10.8

వక్తుమర్హ స్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః {10.16}

యాభి ర్విభూతిభిర్లోకా నిమా౦ స్త్వ౦ వ్యాప్య తిష్ఠసి

ఏ విభూతుల చేత నీవు ఈ లోకముల నన్నిటిని వ్యాపించి యున్నావో అట్టి దివ్యములగు నీ విభూతులను చెప్పుటకు నీవే తగుదువు

కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ {10.17}

కేషు కేషు చ భావేషు చింత్యో అసి భగవన్ మయా

యోగేశ్వరా! నిన్ను తెలిసికొనుటకు సదా ఏ విధముగ నేను ధ్యానింపవలెను? ఓ భగవంతా! ఏ ఏ భావములచే నిన్ను ధ్యానింపవలెను?

విస్తరేణాత్మనో యోగం విభూతి౦ చ జనార్దన {10.18}

భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతమ్

జనార్దనా! నీ యొక్క యోగ మహిమను, విభూతులను మఱల సవిస్తరముగ చెప్పుము. నీ జ్ఞానామృతమును గ్రోలుచున్న నాకు తనివి తీరకున్నది

అర్జునుడు దేవుని సదా -- అంటే అన్ని క్రియాలలోనూ, అందరిలోనూ--ఎరుగుట ఎట్లు అని అడుగుచున్నాడు. ధ్యానంలో సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన "ఇచ్చుటవలననే తిరిగి పుచ్చుకుంటాం; ఇతరులను క్షమించడంవలన మనం క్షమించ బడతాం" అనే వాక్యాలను స్మరించు కోవచ్చు. క్షమించడం మరియు దానం చెయ్యడం దేవుని లక్షణాలు. కానీ ఇలా రోజూ ఒక గంటో, రెండు గంటలో ధ్యానం చేయడం సరిపోదు. మనము సదా దేవుని స్మరించు కోవాలి. అంటే మన ఆలోచనలలోనూ, క్రియలలోనూ దేవుని స్మరించాలి. అలాగే ఇతరులలోని దైవత్వాన్ని చూడాలి. మనకు అది ఎలాగో తెలియకపోతే, ఇతరులలోని దైవత్వాన్ని తెలిసికోవడానికి ప్రయత్నించాలి. ఆచరణలో మనం దీన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. ఇదే మనము మంత్రజపములో చేసేది.

మనస్సుకి సహజంగా వస్తువులపై ఏకాగ్రతతో ఉండే సామర్థ్యం ఉంది. మంత్ర జపం ద్వారా మన మనస్సు యొక్క ఏకాగ్రత దేవుని మీద ఉంచుతాం. సామర్థ్యం లేదా ఏకాగ్రత ఒక్కటే కానీ దాని లక్ష్యం వేరు. హసిడిక్ యూదులు చెప్పుకొనే కథ ఒకటుంది. ఒక యూదుడు తన గురువును "మనము దేవుని వ్యాపారంలో ఇచ్చి-పుచ్చు కోవడాల్లో కూడా గుర్తుపెట్టుకోవాలా?" అని అడిగేడు. గురువు "అవును. మనం ధ్యానంలో వ్యాపారం గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, భగవంతుని గూర్చి వ్యాపారంలో ఆలోచించవద్దా" అని సమాధానమిచ్చేడు.

మన మనస్సు దేవుని యందు స్థిరమైనప్పుడు, అతని వైభవము అంతటా చూస్తాము. ముఖ్యంగా అందము, శ్రేష్ఠత ఉన్న చోట్లలో. నేను నా అమ్మమ్మ దయవలన జీవితాన్ని ఇలాగే చూస్తాను. నేను పచ్చని గడ్డి మొలవడం, నా పెంపుడు కుక్క మూకా సముద్రపుటొడ్డున పరిగెత్తడం, ఒక తల్లి ఓర్పుతో తన బిడ్డను ఓదార్చడం చూసినప్పుడల్లా దేవుడు గుర్తుకొస్తాడు. మనమిలా చూడడం మొదలు పెడితే మంత్ర౦ యొక్క సహాయం అక్కరలేదు. దేవుడే ప్రపంచంలోని ప్రతీ దాన్నీ తన శక్తితో నడుపుతున్నాడు అన్న విషయం ఎప్పటికీ మరచిపోలేం. 218

Eknath Gita Chapter 10 Section 7

Bhagavat Gita

10.7

సర్వమేతదృతం మన్యే యన్మా౦ వదసి కేశవ {10.14}

న హి తే భగవన్ వ్యక్తి౦ విదుర్దేవా న దానవాః

కేశవా! నీవు చెప్పిన దంతయు సత్యమనియే అని నేను భావించుచున్నాను. నీ నిజస్వరూపామును దేవదానవులు సైతము తెలియలేరు

స్వయమేవాత్మ నా ఆత్మానాం వేత్థ త్వం పురుషోత్తమ {10.15}

భూతభావన భూతేశ దేవ దేవ జగత్పతే

పురుషోత్తమా! సర్వప్రాణులను సృజించిన దేవా! సర్వభూత నియామకా! దేవదేవా! జగన్నాథా! నిన్ను నీవే ఎరుగుదువు ఀ

అర్జునుడు "నీవు చెప్పే ప్రతి మాట నా గుండెను హత్తుకుంటున్నాది. నిన్ను నేను ఎలా పూర్ణముగా తెలుసుకొందును?" అని శ్రీకృష్ణుని అడుగుచున్నాడు. ఇది మన స్మృతులు, పురాణాలు కూడా అడిగే ప్రశ్న. మనము ఊరూపేరూ లేని దేవుని గూర్చి ఎలా వ్రాయగల౦, ఏమి మాట్లాడగలం, ఏ విధంగా దేవుని గూర్చి పూర్తిగా తెలిసిన అధికారులుగా వ్యవహరించగలం? యోగులు మనము ఆ భగవంతుని పాదకమలములో ఒక అణువు మాత్రమే అని చెప్తారు.

దేవుడు ప్రతి చోటా ఉన్నాడు. అతను లేని చోటు లేదు. మనము ఇంద్రియాలతో అతనిని పట్టుకోలేము. కాని దైవ భక్తులకు అతడు ఇంద్రియాలు గ్రహించిన వాస్తవము కన్నా, వాస్తవమైన వాడు. శ్రీ రామకృష్ణ ప్రసంగం మధ్యలో ఆపి "తల్లి వస్తున్నాది. ఆమె కాలి గజ్జలు వినబడుతున్నాది" అనేవారు. ఇది మనమనుకొన్నట్టు రెండు గాజు గ్లాసులు తగిలితే వచ్చే శబ్దంలాంటిది కాదు. ఆది శక్తి ఆయనకు ఎంత వాస్తవమంటే, అతని చేతన మనస్సు లోతులలో ఆమె శబ్దాన్ని వింటారు.

మైస్టర్ ఎక్ హార్ట్ ఇలా అన్నారు: మనం దేవుని ఒక ఆవుని చూసినట్లు చూడగలమని అనుకుంటాం. కానీ మనం ఏ కన్నుతో చూస్తామో, ఆయన ఆ కన్నుతోనే మనను చూస్తాడు. మనం దేవుని భౌతిక ప్రపంచం చూసినట్లు చూడలేము. అతను పరమాత్మ. మనలోని ఆత్మ ఆ పరమాత్మ అంశ. మనమెప్పుడైతే ఆత్మతో అనుసంధానమౌతామో, అప్పుడు దేవుని తెలిసికొంటాము. 216

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...