Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 18

Bhagavat Gita

10.18

అనంత శ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం {10.29}

పిత్రూణామర్యమా చాస్మి యమ స్స౦యమతా మహమ్

నాగులలో నేను అనంతుడను. జలదేవతలలో నేను వరుణుడను. పితృదేవతలలో ఆర్యముడూ నేనే . దండించువారిలో నేను యముడును

అనంత అనబడే సర్పం మీద శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు. సర్పము కుండలిని శక్తికి ప్రతీక. వాహనానికి ఇంధనం ఎలాగో, కుండలిని మేల్కొలిపి వెన్నెముక ద్వారా సహస్రానికి చేర్చాలంటే లైంగిక కర్మల చేయకూడదు. మనము అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే కుండలినిని ఉపయోగించాలి. ఆధ్యాత్మిక సాధనలో ఆ శక్తికి పరిమితం లేదు. అందుకే దాన్ని అనంత అంటారు.

ఆర్యముడు పితృదేవతలకు ప్రతీక. మనము అనేక తరాల తరబడి మన పితృదేవతల నుండి జన్యురూపేణా ఈ దేహాన్ని పొందేము.

ప్రపంచాన్ని నియంత్రించే శక్తులలో తాను యముడునని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. కఠోపనిషత్తులో నాచికేతుడను బాలుడు, తండ్రి మీద కోపంతో యమలోకానికి వెళ్తాడు. అప్పుడు యమలోకమలో యముడు ఉండడు. ఆ బాలుడు యముని రాకకై ఎదురు చూస్తూ చాలా కాలం గడుపుతాడు. చివరకు యముడు వచ్చి ఆ బాలుని భక్తికి మెచ్చి కొన్ని వరాలు కోరుకోమని అంటాడు. నాచికేతుడు సాధారణంగా అడిగే వస్తువుల కంటే మిన్న అయిన జ్ఞానాన్ని పొంద దలచి యముడ్ని "మరణించినవారు ఎక్కడికి వెళ్తారు?" అని అడుగుతాడు. యముడు ఎన్నో ఆశలు చూపి, చివరకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడు. ఇది కట్టు కథ కావచ్చును. మనం తెలిసికోవలసింది ధ్యానంతో మన దేహానితో తాదాత్మ్యం చెందకూడదు.

ఈ రోజుల్లో పెరుగుతున్న అరాచకాలవలన ఎందరో అకాల మరణం చెందుతున్నారు. ఉదాహరణకి పిస్టల్ నుపయోగించి దొంగతనాలు చేస్తూ, పగ తీర్చికొంటూ చేసే దురాగతాలను మనం పత్రికలలో చదువతున్నాం. దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలంటే మనము భౌతికమైన వస్తువులను, డబ్బును సేకరించడం తగ్గించాలి. ఇది పిస్టల్ కొనడకంకన్నా కష్ట సాధ్యము. మనలను నిరంతరము ఇంకా ఎక్కువ వస్తువులు కొనండి అని సంస్థలు ప్రోత్సాహించడంవలన అక్కరలేని వస్తువులు -- రెండు, మూడు వాహనాలు, ఇళ్ళు మొదలైనవి--కొంటున్నాము.

ఈ నేపథ్యంలో మన సమాజాన్ని మార్చాలంటే మనం బోధించ వలసింది జీవితం డబ్బు గురించి కాదు, బాంధవ్యాల గురించి మనకు ఇవ్వబడినది. అలా మాట్లాడితే సరిపోదు. దానిని ఆచరణలో చూపాలి. చాలా మందికి డబ్బు సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదని చేతన మనస్సు లోతులలో తెలుసు. కాని వారికి ఉంకొక ఎన్నిక చేసికోవడం సాధ్యం కాదు. ఒక ధనవంతుడు, పరోపకారం చేస్తూ, బంధు మిత్రులతో మైత్రి పెంచుకుంటూ, సమస్థితిలో ఉంటే వానికి నిజమైన జీవితమంటే ఏమిటో తెలుస్తుంది.

మనము డబ్బుకై అతిగా పనిచేయక బంధుమిత్రులతో కాలం గడిపి, రెండు మూడు వాహనాలకై ఎగబడక, టివి చూసే సమయంలో సంఘ సేవ చేస్తూ ఉంటే దాని వలన కలిగే ఆనందం వర్ణించలేనిది.

హింసాకాండకు మరొక ముఖ్య కారణం రతి. దానిని ఆసరాగా తీసికొని పత్రికలు, సినిమాలు జనులను ప్రేరేపిస్తున్నారు. మనము మన డబ్బుతో వాటిని ఎన్నిక చేయకపోతే సమాజ పరిస్థితి ఉన్నతమౌతుంది. మన జీవిత౦లో కలకాలం ఉండే గాఢమైన బాంధవ్యాలు విశ్వాసం, ఒకరి మీద మరొకరికి గౌరవం వలన కలుగుతాయి. రతికి అటువంటి అనుబంధాలలో విలువ ఉంది. కాని రతికై ఇద్దరి మధ్య సంబంధం ఉండి, వారు అవిశ్వాసంతో ఉండి, తమ దారి తాము చూసుకొంటే చివరకు దుఃఖం కలుగక మానదు. 244

Eknath Gita Chapter 10 Section 17

Bhagavat Gita

10.17

ఆయుధానా మహం వజ్రం ధేనూనామాస్మి కామధుక్ {10.28}

ప్రజనశ్చాస్మి కందర్ప స్సర్పాణామస్మి వాసుకిః

ఆయుధములలో వజ్రాయుధము, ధేనువులలో కామధేనువు, ప్రాణోత్పత్తికి కారకులలో మన్మథుడు, సర్పములలో వాసుకి నేనే

ఒకమారు అసురులు దేవతలకన్నా మిక్కిలి శక్తిమంతులై, యుద్ధాలలో దేవతాల్ని పరాజయులను చేస్తున్నారు. అప్పుడు దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్ళి తమను కాపాడమని వేడుకొన్నారు. ఇంద్రుడు దానికి బదులుగా తనకు శుద్ధమైన, సంపూర్ణమైన యోగి పుంగవుని ఎముకలతో చేసిన ఆయుధాన్ని ఇస్తే గాని దానవులతో యుద్దం చేయలేనని చెప్తాడు.

దేవతలు పయనమై అనేక యోగులను, ఋషులను, మునులను వేడుకొంటారు. ఎవ్వరూ దానికి ఒప్పుకోరు. చివరకు దదీచి అనే ఋషి తన అస్తికలను ఇవ్వడానికి ఒప్పుకొంటాడు. అతడు ధ్యానం చేస్తూ, భగవంతునిలో లీనమై తన తనువు చాలిస్తాడు. ఆయన అస్తికలతో దేవతలు వజ్రాయుధాన్ని చేసి, ఇంద్రునకు ఇస్తారు.

ఇది ఒక కట్టు కథ కావచ్చు. కానీ దానిలో ఒక ముఖ్యాంశం ఉంది. దదీచి దేవతలకొరకు తన ప్రాణాన్ని సైతం దారబోసేడు. ఇది అత్యంత ఉత్కృష్టమైన త్యాగం. ఎప్పుడైతే మనం ఇతరుల దుఃఖాన్ని నిర్మూలించడానికి సిద్ధపడతామో అది అత్యంత శక్తికి నిదర్శనం. శక్తి అంటే వేరొక దేశాన్ని, జాతిని, తోటివారిని యుద్దాలలో ఓడించడం కాదు. మనమెప్పుడైతే పరోపకారాన్ని దృష్టిలో పెట్టుకొని శక్తిని ప్రదర్శిస్తామో అదే నిజమైన శక్తి.

అలాగే కృష్ణుడు తనను కామధుక్ అనే గోవుతో పోల్చుకొంటాడు. దానినే కామధేనువు అంటారు. అది మన ప్రతి కోర్కెను తీర్చగల సామర్థ్యము కలది.

వాసుకి ఒక సర్పము. దాని నుపయోగించి దేవతలు, అసురులు అమృతం కొరకై పాల సముద్రాన్ని చిలికేరు.

శ్లోకంలో కందర్ప కామానికి ప్రతీక. కందర్ప అనగా మన్మథుడు. అతను తన బాణాలతో ఇతరులలో కామ సంకల్పాన్ని కలిగిస్తాడు.

నేననేది మొదటి మన్మథ బాణం తగలగానే మనస్సును నియంత్రించుకోండి. వీలైతే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చెయ్యండి. జీసస్ "మనం ఆశల వలయంలో చిక్కుకోకుండా, చెడు కర్మల నుండి విముక్తి పొందాలి" అని చెప్పెను. ప్రసార మాధ్యమాలు మనలను మన్మథుని బాణాలకు తలవగ్గేలా ప్రభావితం చేస్తున్నాయి. అందువలన సాధకులుగా మనము మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి. ముఖ్య విషయమేంటంటే మన బంధాలు లైంగిక కర్మల కొరకే కాకుండా, స్వార్థానికే కాకుండా ఒకరి సంక్షేమమునకై ఇంకొకరు ప్రవర్తించేలా ఉండాలి. 241

Eknath Gita Chapter 10 Section 16

Bhagavat Gita

10.16

ఉచ్ఛైఃశ్శ్రవస మశ్వానాం విద్ధి మామమృతోద్భవం {10.27}

ఐరావతం గజేంద్రాణార నరాణాం చ నరాధిపమ్

గుఱ్ఱములలో అమృతముతో పుట్టినట్టి ఉచ్ఛైశ్రవముగాను, ఏనుగులలో ఐరావతము గాను, నరులలో నన్ను రాజుగను తెలిసికొనుము.

సృష్టి ఆదిలో చైతన్యవంతమైన సాగరముండేది. నిస్వార్థపరులు, ఉత్తములైన దేవతలు, స్వార్థపరులు, హింసా కాండ సాగించే అసురులు, వాసుకి అనబడే సర్పాన్ని కవ్వం గా చేసి ఆ సముద్రాన్ని చిలికేరు. వారి ధ్యేయం అమృతాన్ని ఉత్పన్నంచేసి చిరకాలం జీవించడం. ఆ చిలకడంవలన అనేక వస్తువులు, జీవులు ఉద్భవించేయి.

మన మనసుకు అన్వయించుకొంటే, చిలకడం అంటే చేతన మనస్సును మదనం చెయ్యడం. దానివలన ఉత్పన్నమయ్యేది ధ్యాన౦ వలన కలిగే శక్తి. భగవంతుడు ఆ శక్తులను విడుదల చేసేది ఎందుకంటే: మనం అతని చేతులలో పనిముట్ల వలె ఉండి, ప్రజాక్షేమం, ప్రపంచ శాంతికై పాటుపడతామని. ఎవరైతే పరుల సంక్షేమానికై పనిచేస్తారో వారు ప్రజా నాయకులు. వారిని ఈ శ్లోకంలో రాజులుగా చెప్పబడినది. వారి నాయకత్వం స్వార్థంతో కాక, ప్రేమతో , అంకిత భావంతో కూడి ఉన్నది. మనం రాజులు లాగ పరోపకారానికై కృషి చేస్తే రెండు దైవ గుణాలు వెలుపలకి వస్తాయి. ఒకటి ఐరావతము: శక్తివంతమైన ఇంద్రుని ఏనుగు. రెండు ఉచ్ఛైశ్శ్రవసము అనబడే అత్యంత పటిమ గల అశ్వం.

దేవతలు, అసురులు అలా చిలుకుతూ ఉంటే విషం కూడా ఉత్పన్నమైంది. అది మన స్వార్థానికి, ఎడబాటుకి చిహ్నం. దేవతలకి, ఆసురులకి ఆ విషాన్ని ఏమి చేయాలో తెలియ లేదు. అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని మ్రింగేడు. ఆయన పత్ని పార్వతి హాలాహలం కడుపులోకి ప్రవేశించకుండా గొంతును పట్టుకొంది. అందుకే శివుని నీల కంఠుడు అని కూడా అంటారు. అదే నిజమైన నాయకత్వమంటే: ఎంత బాధ కలిగినా ఇతరుల మనస్సు కష్టపెట్టకుండా చెడుని భరించడం. మన కుటుంబం, దేశం, ప్రపంచం దుఃఖించకూడా ఉండడానికి త్యాగం చేస్తే మనలనూ నీల కంఠుడు అనవచ్చు.

సముద్రాన్ని చిలకగా, చిలకగా, చివరికి అమృతం వచ్చింది. అది అందరికి తెలిసినట్టే మరణాన్ని జయించగలిగే సామర్థ్యం ఉన్నది. దేవతలు, అసురులు దానికై అష్టకష్టాలూ పడ్డారు. ధ్యానం ద్వారా మనము కూడా అమృతత్వాన్ని పొందవచ్చు. ధ్యానంలో మన చేతన మనస్సులోని విషపూరితమైన, చెడు ఆలోచనలను మంచి భావాలుగా మార్చుకొంటాము. మనమెప్పుడైతే భయము, క్రోధము, లోభము పోగొట్టుకొంటామో, అప్పుడు అమృతత్వము మనలో ఉద్భవిస్తుంది. మనం భౌతికమైన ఎరుకనుండి విడివడి ఒక శాశ్వతమైన శక్తిగా మారి, అందరి సంక్షేమానికి పాటుపడతా౦. 238

Eknath Gita Chapter 10 Section 15

Bhagavat Gita

10.15

అశ్వత్థ స్సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః {10.26}

గంధర్వాణా౦ చిత్రరథ స్సిద్ధానాం కపిలో మునిః

వృక్షములలో నేను రావి చెట్టును. దేవర్షులలో నారదుడను. సిద్ధులలో కపిలముని

అశ్వత్థ వృక్షము యొక్క వేళ్ళు మీదనుండి -- అనగా దేవునిలో చొచ్చుకొని పోయి-- కొమ్మలు క్రిందనుంటాయి. మనమంతా దాని ఫలములము. మనము ఇతరుల కొరకై జీవించటానికై ఉన్నాము.

అశ్వత్థ వృక్షము ఎంతో సున్నితమైనది. ఏ ఒక్క ఆకైనా రాలిపోతే మొత్తం వృక్షం దుఃఖిస్తున్నట్టుగా ఉంటుంది. మనం వివిధ వ్యక్తులుగా, సమాజాలుగా, జాతులుగా, దేశ ప్రజలుగా, మనమంతా ఒకటే అనే ఎరుక లేక, చలామణి అవుతున్నాము.

కృష్ణుడు తాను గంధర్వులలో చిత్రరథుడని చెప్పుచున్నాడు. గంధర్వులు దేవదూతల వంటివారు. వారిలో నారదుడు గూర్చి చాలామందికి తెలుసు. అతడు నిరంతర కృష్ణ భక్తుడు. ఎక్కడికి వెళ్ళినా విష్ణు నామము జపిస్తూ ఉంటాడు. ఒకమారు అతను శ్రీకృష్ణుని "ఎందుకు నీవు సంసారులను అంత ఎక్కువగా ప్రేమిస్తావు?" అని అడిగెను. శ్రీకృష్ణుడు దానికి బదులుగా ఒక వెలుగుతున్న దీపం ఇచ్చి, దీపం ఆరిపోకుండా ప్రక్కనున్న దేవాలయం చుట్టూ మూడు ప్రదిక్షణలు చెయ్యమని చెప్పెను. నారదుడు దీపాన్ని పట్టుకొని బయలదేరాడు. మొదట మరుతుడనబడే దేవుని గుడి చుట్టూ తిరగడానికి పూనుకొన్నాడు. మరుతుడు గాలికి అధిష్ఠాన దేవత. అతడు నారదుని పరిస్థితి తెలిసికొని, పెద్ద తుఫానును సృష్టి౦చేడు. నారదుడు తన శక్తినంతా ఉపయోగించి దీపాన్ని ఆరిపోకుండా మూడు ప్రదిక్షణాలు చేసి శ్రీకృష్ణుడు వద్దకు వచ్చేడు.

శ్రీకృష్ణుడు నారదుని "నారదా, నీవు నా భక్తులందరిలో ప్రముఖుడవు. నీవు ప్రదిక్షణాలు చేస్తున్నప్పుడు నన్ను ఎన్నిమార్లు తలచుకొన్నావు?" అని అడిగేడు.

నారదుడు నీళ్ళు నములుతూ "భగవాన్, తుఫానులో చిక్కుకొని, దీపం ఆరిపోకుండా చూడడం కోసం నా ఏకాగ్రత నీ మీద లేకపోయింది" అని అన్నాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు "సంసారులు తాము పడుతున్న అష్టకష్టాలను -- నీలా దీపాన్ని తుఫానులో కాపాడుతున్నట్టు -- మరచి, నన్ను తలచుకొంటే నాకు ప్రీతి కాక మరేమిటి?" అని అడిగేడు.

తరువాత కృష్ణుడు మునులలో తాను కపిలుడు అని చెప్పెను. కపిలుడు సాంఖ్య సిద్ధాంతాన్ని సాంఖ్య సూత్రములనెడి పుస్తకంలో వ్రాసేడు. ప్రపంచం ప్రకృతి, పురుషుడు, దేవుడు అనే త్రిపుటి అని చెప్పేడు. అతని శిష్యుడు పతంజలి యోగసూత్రాలను ప్రచురించేడు. గీతతో పాటు, కఠోపనిషత్తు, బుద్ధుని బోధనలు సాంఖ్య సూత్రాలతో ప్రభావితమైనవి.

ఈ శ్లోకంలో కపిలుని మునిగా శ్రీకృష్ణుడు వర్ణించేడు. ముని అనగా మౌన వ్రతాన్ని పాటించేవాడు. ఏ యోగులైతే మౌనము వహించి తమ అహంకారాన్ని జయించేరో వారు మునులు అనబడతారు. అలాగే చాలా ఏళ్ల ధ్యాన సాధనతో అహంకారాన్ని పోగొట్టుకొ౦టే మనము ఆ స్థితికి ఎదగవచ్చు. అప్పుడు మనము నిశ్చలంగా ఉండే సముద్రపుటడుగున ఉన్నట్టు చైతన్య సాగరంలో మునుగియుంటాము. ఆ నిశ్చలత్వము, అహంకారం యొక్క చంచలత్వము లేక, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. అట్టి స్థితిలో మనస్సు క్రోధము, లోభము, భయము లేక నిశ్చలముగానుండును. 237

Eknath Gita Chapter 10 Section 14

Bhagavat Gita

10.14

మహర్షీణాం భృగురుహ౦ గిరామస్మ్యేక మక్షర౦ {10.25}

యజ్ఞానాం జపయజ్ఞో అస్స స్థావరాణాం హిమాలయః

మహర్షులలో నేను భృగు మహర్షిని. శబ్దములలో నేను ఓంకారమును. యజ్ఞములలో జప యజ్ఞమును నేనే. స్థావరములలో హిమాలయ పర్వతమును నేనై యున్నాను

పూర్వం బృఘు మహర్షి ఉండే ఆశ్రమంలో మునులు తమ ఇష్ట దైవాలను -- రాముడు, కృష్ణుడు, శివుడు, పరా శక్తి--ధ్యానించేవారు. ఒకనాడు నారద మహర్షి ఆ ఆశ్రమానికి వెళ్ళి, అంతా చూసి, వారు ధ్యానించే దేవతలలో ఎవరు గొప్ప అని అడిగి వెళ్ళిపోయేడు.

ప్రశాంతంగా ఉండే ఆశ్రమంలో నారదుని ప్రశ్నతో కలకలం రేగింది. నారదుడు కొంత కాలం తరువాత ఆ ఆశ్రమానికి వచ్చి ఎవరు గొప్పో నిర్ణయించుకున్నారా అని అడిగేడు. అప్పుడు విష్ణు భక్తుడైన బృఘు మహర్షి తాను శ్రీ మహావిష్ణువు వద్దకి వెళ్ళి తన మాట నిరూపించుకుంటానని బయల్దేరాడు. అతను వైకుంఠం చేరి చూస్తే శ్రీ మహావిష్ణువు శేష తల్పంపై పడుకొని ఉన్నాడు. అప్పుడు బృఘుమహర్షి ఆతని రొమ్ముపై కాలితో తన్నాడు. శ్రీమహావిష్ణువు లేచి, బృఘుని క్షమించి ఆతని పాదము యొక్క చిహ్నము -- శ్రీ వత్స-- తాను ఎప్పుడూ ధరిస్తానని మాట ఇచ్చేడు. అందుకే శ్రీకృష్ణుని క్షమాసాగారుడంటారు.

పదములలో తాను ఓంకారమని శ్రీకృష్ణుడు చెప్పేడు. మనము ఓంకార జపం భగవంతుని నామమని గుర్తించలేము. సాధనతో ఆ మంత్రజపం ఒక భౌతికమైన క్రియ కాదని, అది భగవంతునితో అనుసంధానమైనదని తెలుసుకొంటాం.

మనలో చాలా మందికి ధ్యానం ద్వారా ఎంత ఎత్తుకు ఎదగగలమో తెలీదు. శాక్రమెంటో నగరంలో "నాకు నా కొండలతో సరిసమానమైనవారిని ఇవ్వండి" అని గోడమీద వ్రాసి ఉండడం చూసేను. మన దేశంలో హిమాలయాలకు సరిసమానమైన ఆధ్యాత్మిక యోగులు ఉన్నారు. అది మనకు గర్వకారణము. ఆధ్యాత్మిక జ్ఞానంలో హిమాలయాలను మించినదేమీ లేదు.

ఇక్కడ శ్రీకృష్ణుడు మనలో కూడా హిమాలయాలు ఉన్నాయని చెప్తున్నాడు. అంటే హిమాలయాల వంటి చేతన మనస్సు. ధ్యానం మొదట్లో మనం హిమాలయాల క్రింద చరియల్లో ఉంటాము. క్రమంగా కొండను ఎక్కుతాము. చివరికి ఒక చిన్న కొండ శిఖరాన్ని చేరుతాము. కాని అక్కడ విశ్రాంతి ఎక్కువసేపు తీసికోలేం. ఎందుకంటే మన ప్రక్కనున్న కొండ "నన్ను కూడా అధిగమించు" అని పిలుస్తుంది. ఇదే ధ్యానంలో ఉన్న పెద్ద సవాలు. మన౦ వంటినొప్పులతో, ఆక్సిజన్ తక్కువ ఉండడంవలన, విశ్రాంతి కోరుతాం. కాని అక్కడున్న వాటన్నిటికన్నా ఎత్తైన శిఖరం ఎక్కాలనేది మన ధ్యేయం. ఈ విధంగా ఒక కొండ తరువాత మరొకటి ఎక్కుతూ పోతాం. ముందు రాబోయే కొండలు ఎక్కడం పాత వాటికన్నా కష్టం.

నాకు అశాంతితో ఉన్న వ్యక్తిని ఇవ్వండి, నేను వానిని తన అశాంతిని చేతనంలోని హిమాలయాల్ని ఎక్కడానికి ఉపయోగించేలా చేస్తాను. సంవత్సరాల తరబడి ఎక్కి మౌంట్ కృష్ణా లేదా మౌంట్ క్రైస్ట్ లేదా మౌంట్ బుద్ధ చేరి వాటన్నిటినీ ఒక జన్మలో ఎక్కలేమని తెలుసుకొంటాం. ఒక వేళ ఎక్కినా, అపరిమితమైన మౌంట్ బ్రహ్మన్ క్రిందనే ఉండి దిక్కులు చూస్తాం. 233

Eknath Gita Chapter 10 Section 13

Bhagavat Gita

10.13

పురోధసా౦ చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి౦ {10.24}

సేనానీనామహం స్కంద స్సరసామస్మి సాగరః

పార్థా! పురోహితులలో నేను ప్రముఖుడగు బృహస్పతిని. సేనాధిపతులలో కుమారస్వామిని. సరస్సులలో సముద్రుడను

బృహస్పతి దేవతలకు గురువు. మనకు తెలిసో తెలీకో ఇతరులకు గురువులుగా ఉంటాం. ముఖ్యంగా పిల్లల విషయాల్లో. పిల్లలు మనం చెప్పే మాటలకన్నా , మనం ఆచరించే విధానాన్ని అనుసరిస్తారు. మనం ఓర్పు మీద వ్రాసిన ఒక పుస్తకాన్ని మన పిల్లవాడికి ఇవ్వవచ్చు. కానీ మనం ఓర్పువహించనంతకాలం ఆ పిల్లవాడు ఓర్పు గురించి నేర్చుకోడు. సహనం, భద్రత, నిస్స్వార్థం మన పిల్లలకు అబ్బాలంటే మనం వాళ్ళకు వాటిని ఆచరించి చూపించాలి.

శ్రీకృష్ణుడు తాను ఉత్తమమైన గురువేకాక, సర్వోత్తమమైన యోధుడు కూడా అని చెప్పేడు. స్కందుడు మన పురాణాలలో దుష్ట శక్తులను సంహరించిన ఒక గొప్ప యోధుడు. అలాగే మన ఆధ్యాత్మిక సాధనలో మనలోని మిక్కిలి పౌరుషంతో కూడన గుణములను యోధులమై నియంత్రించుకోవచ్చు.

కవి కాళిదాసు స్కందుడు మీద ఒక గొప్ప కావ్యం వ్రాసాడు. ఒకప్పుడు తారకుడనే అసురుడు దేవతలతో యుద్ధాలు చేసి వారిని అష్టకష్టాలు పెట్టేడు. పెద్దలు తారకుడుని చంపే సామర్థ్యం గలవాడు శివుని పుత్రుడై ఉండాలని చెప్పేరు. కావున దేవతలు శివుని వద్దకు వెళ్ళి తమను రక్షింపమని మొర పెట్టుకున్నారు. కాని శివుడు ఆజన్మ బ్రహ్మచారి. అప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి ఆతనిని తన అందముతో కాక, ఆధ్యాత్మికతతో వశం చేసుకొని పెళ్ళాడి, స్కందునికి జన్మ నిస్తుంది. చివరకు స్కందుడు తారకుని, ఆతని అసుర సేనను సంహరించి స్వర్గంలో శాంతి నెలకొల్పుతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే స్కందుడు పార్వతీపరమేశ్వరుల మధ్య గల కామంవలన జన్మించలేదు. అతడు శివుని నిగ్రహమువలన జన్మించి, అందువలన తారకుడిని సంహరించగలిగేడు.

తరువాత శ్రీకృష్ణుడు తనని ఒక పెద్ద సాగరముతో పోల్చుకొంటాడు. పురాణాల్లో అతను సముద్రంమీద శేషశయ్యపై పవళించియున్నాడని చెప్పబడింది. అలాగే మనలోని సముద్రంలో కూడా అతడున్నాడు. సముద్రంలోని ఉప్పనీళ్లు సృష్టి ఆదిలో జీవరాశ్యులకు యోని. అది మన దేహంలోనూ ఉంది. సముద్రాలు భూమి ఉపరితలంపై 70 శాతం కప్పి ఉన్నాయి. అలాగే మన శరీరంలో 70 శాతం జలమే. మనలో ఒక చిన్న సాగరం ఉండి కోట్ల కణాలకు పోషణ ఇస్తోందనడంలో అతిశయోక్తి లేదు.

జీవులను అధ్యయనం చేసే శాస్త్రవేత్త జాక్ కూస్టో నేటి కాలములో సముద్రాలు పెద్ద మురికి గుంటల్లా తయారయ్యాయని చెప్పేరు. ఎందుకంటే పరిశ్రమల వ్యర్థాలను సముద్రాలలో విడుస్తున్నారు. ఎవరైనా సముద్రంలో ఈతకెళ్తే లేనిపోని వ్యాధులు తెచ్చుకుంటారు. ఎలాగైతే సముద్రాలు కాలుష్యంతో నిండి ఉన్నాయో, మనలో కూడా క్రోధం, భయం, దురాశ వంటి కాలుష్యాలు ఉన్నాయి. వాటిని ధ్యానం ద్వారా నిర్మూలించవచ్చు. 230

Eknath Gita Chapter 10 Section 12

Bhagavat Gita

10.12

రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసా౦ {10.23}

వసూనాం పావక శ్చాస్మి మేరు శ్శిఖరిణా మహమ్

నేను రుద్రుల యందు శంకరుడను. యక్షరాక్షసులలో కుబేరుడను. వస్తువుల యందు అగ్నిహోత్రుడను. పర్వతములలో మేరు పర్వతమునై యున్నాను

శ్రీకృష్ణుడుకి శంకర, రుద్ర అను నామములు గలవు. ఇక్కడ అతడు చెప్పక చెప్పినది: దేవుని దయ మనకు దుఃఖ రూపేణా వస్తుందని.

మనము ఎంతోకొంత శ్రమ లేనిదే ఏమీ నేర్చుకోలేం. కావున, మనం ఎప్పటికీ ఒకేలాగ ఉంటామా లేదా శ్రమ చేసి ఎదుగుతామా అని మనని ప్రశ్నించుకోవాలి. దుఃఖాన్ని మిత్రుడుగా ఆహ్వానించనప్పుడే అది శత్రువులా వస్తుంది. మనము దుఃఖము వలన ఆరోగ్యాన్ని, భద్రతని పెంచుకోవచ్చు. లేదా మన జీవన విధానాన్ని మార్చుకోలేక నిరాశ చెందవచ్చు.

నేను కొన్ని రోజుల క్రితం తక్కినవాళ్ళు ఏమి తింటున్నారని తెలిసికోవడానికి నా మిత్రునితో ఒక పెద్ద హోటల్ కి వెళ్ళేను. అక్కడ అక్షరాస్యులై, అత్యంత సంస్కారవంతమైనవారు అనారోగ్యము చేసే పదార్థాలను తింటున్నారు. నేను మన దేహ వ్యవస్థ ఎంత గొప్పదో కదా అనుకొన్నాను. వారి దేహము ఇంకా స్వస్థతో ఉండి, మరిన్ని భౌతిక సమస్యలు లేకుండా ఉందంటే, దానికి కారణము దేవుని దయ. మీరు సంపూర్ణమైన నాడీ వ్యవస్థని చూడాలనుకొంటే, చిన్న పిల్లవానిని చూడండి. కానీ వాడే పెద్దవాడయి లేనిపోని సమస్యలు తెచ్చుకొ౦టాడు. మానసిక ఒత్తిడి, రక్త పోటు, తీవ్రమైన తలనొప్పి, కడుపులో పుళ్ళు మొదలైనవి రాత్రికిరాత్రీ రావు. అవి మనము దీర్ఘ కాలంగా ఆలోచించక చేసే తప్పు ఎన్నికల వలన కలుగుతాయి.

కొందరు మొదటిసారి బాధ అనుభవించగానే, తమ ఆలోచనలను, నడవడికను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ దానితో ఒక సమస్య ఉంది. వారిక చెడ్డ అలవాట్లు ఉంటే, వారు మారడం చాలా కష్టం. నాకు ధూమపానమునకు, మద్యమునకు, మాదక ద్రవ్యాలకి అలవాటు పడినవారు చాలా మంది తెలుసు. వారికి ధ్యానం విశేషంగా చెడ్డ అలవాట్లు వీడడానికి పనికివస్తుంది. అలా మారి తమ చెడు అలవాట్లను సమూలంగా నిర్మూలించిన మిత్రులు నాకున్నారు. ధ్యానం చెడు అలవాట్లను నిర్మూలించడానికి కావలసిన పట్టుదలనిస్తుంది.

ఇదేవిధంగా మన సహజ వనరులను కాపాడుకోవచ్చు. మన౦ పీల్చే గాలి, త్రాగే నీరు, నదులు, సముద్రాలు కాలుష్యంతో నిండి ఉన్నాయి. అందువలన మనమనుభవించే బాధ మన భౌతిక దేహ బాధ వంటిదే. మనం నిర్దయతో పర్యావరణాన్ని వాడుకొని మిక్కిలి హాని కలిగించుకొంటున్నాము. సముద్రమంటే రెండు ఖండాల మధ్యనున్న జాగాయే కాదు. 80 శాతం జీవులు సముద్రాల్లో నివసిస్తున్నాయి. వాటిలో గ్రాండ్ కాన్యన్ కన్నా లోతైన ప్రదేశాలు, ఎవరెస్ట్ శిఖరానికన్నా ఎత్తైన పర్వతాలు నీటితో కప్పబడి ఉన్నాయి. మొత్తానికి జీవరాశుల బ్రతికిఉండడానికి సముద్రాలు సహకరిస్తాయి. కానీ సముద్రములలోకి చమురు, పరిశ్రమల వ్యర్థాలు, మురికి కాల్వల నీటిని, వదిలి వాటిలో నివసించే జీవులకు మిక్కిలి హాని కలిగిస్తున్నాం. ఇది ఒక సూచిక: మన జీవన విధానాన్ని విశ్లేషణము చేసి, మన అవసరాలను నియంత్రించి, భౌతిక వనరులను ఎంత తక్కువగా వీలయితే అంత తక్కువగా ఉపయోగించాలి.

ప్రసార మాధ్యాలు ఏమి చెప్పినా, జీవితంలో బాధలు ఉండవన్నట్టు మనము వ్యవహరించకూడదు. ఆఫ్రికాలోనైనా లేదా అమెరికాలోనైనా, గొప్పవాడైనా పేదవాడైనా, అందరూ బాధలు అనుభవిస్తున్నారు. అది జీవితంలో సహజం. మనము ఆధ్యాత్మిక జీవనంలో పరిపక్వత పొందితే, ప్రపంచంలో ఎంతోమంది దుఃఖంలో జీవిస్తున్నారని తెలిసి, మన స్వార్థానికై సుఖాలను లేదా లాభాలను ఆశించం. మనలో చాలామంది చిత్రవిచిత్రమైన మానసిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ధనవంతులులా ఉంటే ప్రతీదీ ఒప్పని తలుస్తాం. మన కళ్ళు తెరిచి చూస్తే, దుఃఖం మన చుట్టూ ఉన్న వేలాది మందిలో ఉందని గుర్తిస్తాం. అది యుద్ధాల వలన లేదా పేదరికం వలననే కాకపోవచ్చు. మనము ఎంత చుట్టూ ఉన్న దుఃఖాన్ని చూడక ఉంటామో, అంత ఎక్కువ బాధలు పడాలి. ఎందుకంటే దుఃఖం మనను సుఖాలను వీడి పరోపకారము చెయ్యడానికి ప్రోద్భలం ఇస్తుంది.

శ్రీకృష్ణుడు తాను పావక -- అనగా శుద్ధి చేసే అగ్ని -- అని చెప్పేడు. నేనొకసారి బంగారం గనులున్న ప్రదేశానికి వెళ్ళేను. అక్కడ బంగారాన్ని భూమినుండి వెలికితీసి, అగ్నితో వేడిచేసి మలినాన్ని తీసివేసి, సుత్తితో దాగిలి మీద కొట్టి తమకు కావలసిన ఆకారంగా మారుస్తారు. ఇలాగే ఆధ్యాత్మిక సాధన కూడా. కొందరు అహంకారాన్ని వీడక ఉంటారు. మరికొందరు దేవుని తమను దాగిలి మీద పెట్టి, సుత్తితో కొట్టి, అహంకారాన్ని సమూలంగా నాశనం చేయమని వేడుకొంటారు. అలా చెప్పగలిగితే, ఒక వ్యక్తి దుఃఖానికి అతీతుడైనట్టు. దేవుడు సుత్తిని ఎత్తవచ్చు, కాని అది అతని మీద పడదు. దానికి బదులుగా సుత్తిని విసిరేసి, అతన్ని దేవుడు హత్తుకొ౦టాడు. 228

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...