Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 23

Bhagavat Gita

10.23

మృత్యు స్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం {10.34}

కీర్తి శ్శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా

సర్వమును హరించు మృత్యువును నేనే. జనించబోవు వారలకు జన్మమును నేనై యున్నాను. మరియు స్త్రీలలో కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, బుద్ధి, ధైర్యము, ఓర్పును నేనే

శ్రీకృష్ణుడు మృత్యుః సర్వహరః -- అనగా తాను మృత్యువును కూడా--అని చెప్పుచున్నాడు. ప్రతి మంచి గురువు ఇదే చెప్తాడు. అది మన హృదయానికి హత్తుకొంటే మన సారస్వతము ఆధ్యాత్మిక సాధనకై వెచ్చిస్తాము. ఒక్క రోజు కూడా మృత్యువుని జయంచడానికి వృధా చెయ్యము. మృత్యువు మీద జయించడానికి ఒక జీవిత కాలం ఎక్కువేమీ కాదు. అందుకే వొక్క రోజు వృధా చేసినా అది మన గుప్పెట్లో౦చి జారిపోతుంది.

హిందూ, భౌద్ధ సాంప్రదాయములలో మృత్యువుని జయించడానికి ఒక జీవిత కాలం సరిపోదని చెప్తారు. మనం అనేక జన్మలు మృత్యువుని జయించడానికై ఎత్తేము. పునర్జన్మ గురించి నా పిల్ల ఇలా చెప్పింది: "నేను ఎల్లప్పుడూ మరణించి నట్లు ఉండలేను." భగవంతుడు ప్రేమ పూరితుడు. మనను చిరకాలం జన్మ లేకుండా ఉంచడు. ప్రతి మానవ జన్మలోనూ మరణాన్ని జయించే అవకాశం ఉంది, కాని మనం వేరే పనుల్లో మునిగి దానిని విస్మరిస్తాం. ఈ విధంగా మనం శోధన చేస్తూ ఉంటే దేవుడు సహనంతో ఎదురుచూస్తాడు. మన లక్ష్యం మరణాన్ని దాటిపోవాలి అని తెలిసికొనకపోతే మనకి విశ్రాంతి సమయమిచ్చి మళ్ళీ జన్మ ఇస్తాడు.

మనలను ప్రేమించేది మన తండ్రే కాదు. బెంగాల్ లో జగన్మాత అనబడే పరా శక్తిని పూజిస్తారు. ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో భగవంతుడు కూడా మనల్ని అలా ప్రేమిస్తాడు. మనము ఆ పరా శక్తి బిడ్డలం కూడా. శ్రీకృష్ణుని హిరణ్యగర్భుడు అని కూడా అంటారు. అనగా విశ్వ యోని. దానినుంచి సమస్త విశ్వము ఆవిర్భవించింది. ఉపనిషత్తులలో చెప్పిన కొన్ని విషయాలు నేటి ఖగోళ శాస్త్రం కూడా చెప్పుచున్నది. విశ్వం వ్యాపించి వ్యాపించి చివరకు పరా శక్తి దానిని తనలోకి లాక్కుని, మరల సృష్టి చేస్తుంది. క్రిస్టియన్ యోగులు "మనమందరము దేవుని నుంచి వచ్చి, భక్తితో ఉండి, చివరకు ఆ పరాశక్తి దగ్గరకే వెళతాం" అని చెప్తారు.

శ్రీరామకృష్ణ మనమందరమూ స్త్రీలను పరా శక్తి అంశలుగా చూడాలని అనేవారు. దాని అర్థం ఏవే లక్షణాలు ఒక పరిపూర్ణమైన స్త్రీకి ఉంటాయో, అవే లక్షణాలు పరిపక్వమయిన యోగిలో కూడా ఉంటాయి. శ్రీకృష్ణుడు చెప్పే స్త్రీ లక్షణాలు పురుషులకు కూడా వర్తిస్తాయి. దీనికి అర్థనారీశ్వరులు తార్కాణం. సహజంగా స్త్రీ, పురుషుల లక్షణాలు ఉన్నాయి. కానీ అవి ఒకటి నొకటి కలుపుకొని ఉంటాయి. గాంధీ సత్యాగ్రహంలో ఒక యోధుడిలా ఉద్యమించేరు. అలాగే చిన్న పిల్లలను, వ్యాధి గ్రస్తులను సున్నితంగా చూసేవారు. ఆయనలో మంచి పురుష గుణాలు, స్త్రీ గుణాలు మిళితమై ఉన్నాయి. దానిలో వైరుధ్యం, వివక్ష, పోటీ లేదు. స్త్రీలు ఒక్కరే అటువంటి పురుషుని ప్రేమించరు. పురుషులొక్కరే అటువంటి స్త్రీని ప్రేమించరు. ప్రతిఒక్కరూ గాంధీ వంటి వారిని ప్రేమిస్తారు.

నేను కేరళలో పుట్టిన కుటుంబంలో మాతృదేవతలను సేవిస్తారు. . తక్కిన భారత దేశంలో పితృదేవతలను సేవిస్తారు. తర తరాలుగా కేరళలో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉన్నాయి. నేను పుట్టిన ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజూ మగ, ఆడ వారలతో కలిసిమెలసి ఉండేవాడిని. మా మాతృమూర్తులు సహనంతో ఆ విలువలు నాకు అందజేసేరు. నా కుటుంబంలోని నా ఈడు ఆడవారు ఇతరులను ముందు పెట్టి ఓర్పుతో వారిని సంతృప్తి పరిచేవారు. అదే సామర్థ్యం బాలులకు ఏ వయస్సులోనైనా, ఎంత ప్రయత్నించినా రాలేదు. నా అమ్మమ్మ ఆ సంప్రదాయానికి చిహ్నం. ఆమె వద్దనుండే నేను శ్రీకృష్ణుడు చెప్పిన లక్షణాలు స్త్రీ పురుషులకు వర్తిస్తాయని తెలిసికొన్నాను.

మొదటి లక్షణం శ్రీ అనగా అందము. అది బాహ్య అందము గూర్చి కాదు. అది నిశ్వార్థులైన వారి కళ్ళల్లో ప్రకటితమయ్యే అంతర్గతంగా ఉండే కాంతి. నా అమ్మమ్మకు అటువంటి కాంతి ఎల్లప్పుడూ ఉండేది. మా కుటుంబంలో పెళ్లి చూపులు అవుతున్నప్పుడు ఆమె స్త్రీలలో శ్రీ ఉందో లేదో చూసేది.

రెండవ లక్షణము ధృతి అనగా విశ్వాసము. ఇది ఈ రోజుల్లో కనుమరుగైంది. ఆడ మగ బాంధవ్యాలలో, అనగా లైంగిక విషయాల్లో, విశ్వాసము ఒక పాత పద్దతి అని, అది అసహజం అని అనుకునే రోజులివి. కానీ విశ్వాసము లేనిదే ప్రేమించడం సాధ్యం కాదు.

నేను అమెరికాకి మొదట వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్వేచ్చ గురించి మాట్లాడేవారు. ఆడా మగా ఎలాగైతే బంధంలోకి ప్రవేశించారో, అలాగే విడిపోవచ్చు అని చెప్పేవారు. ఇది చెడ్డ వారి బారినుండి విముక్తి పొందే మార్గం సులువు చేయడానికని చెప్పేవారు. నేను "అవును, చెడిపోయిన బాంధవ్యం లోంచి విడిపోవచ్చు. దానికి విద్యుక్త౦ (obligation) లేదు. బంధాలు లేవు. కానీ ఇది పదే పదే సార్లు అయితే మనం ప్రేమించగలిగే శక్తి క్షీణిస్తుంది."

ప్రేమకి విశ్వాసం చాలా ముఖ్యం. ఎవరైతే "నువ్వు నాకు నచ్చిన పనులు చేస్తూ వుంటే నీతో కలసి ఉంటాను. లేకపోతే విడిపోతాను" అని చెప్తారో, వారిలో ప్రేమలేక ఉదాసీనత ఉంది. ఒకరిని ప్రేమించడమంటే: వారు మనని బాధ పెట్టినా సాహిస్తాం; వారు మనకి కష్టం కలిగించే పనులు చేసినా తిరిగి వారిపై పగ తీర్చుకోము; వారు మనయందు క్రోధంతో ఉన్నా తప్పించుకు తిరగం. మానవులందరూ తప్పులు చేస్తారు. మనకు ఇతరుల తప్పులు సహించే సహనం లేకపోతే శాశ్వతమైన బాంధవ్యాలు అనుకూలించవు.

నేను స్త్రీ పురుషుల మధ్యన ఉండే బంధాలు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలని చెప్పటంలేదు. ప్రసార మాధ్యమాలు ఎంత చెప్పినా, మనము ఒకరిని ప్రేమించడం సులభం కాదు. దానికై అతి శ్రమ పడాలి. ముఖ్యంగా ఆ బంధం శాశ్వతంగా ఉండాలంటే ఇంకా గట్టి ప్రయత్నం చెయ్యాలి. సహజంగా స్త్రీ పురుషుల మధ్య భేదాలు ఉంటాయి. కవల పిల్లలు ఒకే మూసలో పుట్టినప్పటికీ, వారి మధ్య విభేదాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగే వారిలో విభేదాలు ఉండకూడదు అనడం మిథ్య.

కాబట్టి మనకు క్షమ అవసరం. క్షమ అంటే సహనం, ఓర్పు, తట్టుకునే శక్తి. క్షమ ఎంత అవసరమంటే అది రాజ యోగం గురించి శ్రీకృష్ణుడు చేసిన బోధకు సరిసమానమైనది. అది ప్రతి మనిషికి --వేరే మతస్తులయినా సరే-- వర్తిస్తుంది.

కవులు, గాయినీ గాయకులు, ప్రేమ గురించి ఎంతో చెప్తారు. కాని వారు క్షమ గురించి మాట్లాడరు. కాని ఒకరిని అన్ని పరిస్థితుల లోనూ ప్రేమించాలంటే మనకు ఎంతో సహనం ఉండాలి. మనం పుట్టుకతోనే క్షమ తో ఈ ప్రపంచానికి రాలేదు. దానికై మనము సాధన చెయ్యాలి. ఒకానొక పరిస్థితిలో ఇతరులు మనపై ప్రతికూలంగా ఉంటే, ప్రతీదీ మనకు అణుగుణంగా లేకపోతే మనం వేర్పాటు పడకుండా వారితో కలసిమెలసి ఉండాలి. మొదట్లో అది కష్టమనిపించవచ్చు. కానీ పెదవి కొరుక్కొని, నవ్వు ముఖంతో మన మనస్సులోని భావాలు బయటకు పొక్కకుండా, దయతో మన౦ మెలగాలి.

నా తోటలో అనేక పళ్ల చెట్లు ఉ౦డేవి. వాటిని నేను చాలా కాలం పట్టించుకోలేదు. అందువలన అవి ఒకదాని మీద మరొకటి పెరిగి చిందరవందరగా ఉండేవి. నేను వాటిని సమంగా చేయాలని, వాటి కొమ్మలను,ఆకులను కత్తిరించేను. అవి చూడ్డానికి చచ్చి పోయిన చెట్లుగా కనిపించేయి. కాని వర్షాలు పడిన తరువాత వాటి రూపురేఖలు మారిపోయాయి. క్రొత్త ఆకులు, కొమ్మలు రావడం మొదలయింది.

మనం రెండు మూడు దశాబ్దాలు అహంకారంతో, ఇష్టం వచ్చినట్లు చేస్తే దానిని అరికట్టడం అంత సులభం కాదు. అలాగే మనమేదీ పరిపూర్ణంగా చెయ్యలేము. కొన్నిసార్లు మన౦ సాఫీగా ఉంటాం. కానీ ఎక్కువమార్లు నవ్వడానికి బదులు, చిరునవ్వు నవ్వడం లేదా మంత్రం జపించుకొంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది మన చెడు అలవాట్లనబడే కొమ్మలను, ఆకులను కత్తిరించినట్టే. అలాగ కొంతకాలం సహిస్తే, మార్పు రాక తప్పదు. మన క్రొత్త నడవడిక పూవులవలె పూసి, కాయలవలె కాసి, మనకు సంపూర్ణమైన సంతృప్తిని ఇస్తుంది 258

Eknath Gita Chapter 10 Section 22

Bhagavat Gita

10.22

అక్షరాణా మకారో అస్మి ద్వంద్వస్సామాసికస్య చ {10.33}

అహమేవాక్షయః కాలోధా తా అహం విశ్వతోముఖః

అక్షరములలో నేను అకారమును. సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే. అనంతమైన కాలమును, అనంత ముఖములు గల ధాతను నేనై యున్నాను

సంస్కృతంలో మొదటి అక్షరం అకారం. శ్రీకృష్ణుడు తాను అకారాన్ని అని చెప్పడంలో అర్థం అతడు జీవులకు మూలం. జీసస్ తాను ఆల్ఫా, ఒమేగా అని చెప్పెను. మనము అతని నుండి ఉద్భవిస్తాం, మళ్ళీ అతనిలోనే ఐక్యమవుతాం. మనము ప్రపంచంలో మన తలిదండ్రుల వలన జన్మించి యుండవచ్చు. కానీ మనము నిజముగా భగవంతుని నుండి వచ్చేము.

ద్వంద్వము వ్యాకరణానికి చిహ్నం. సంస్కృత రచయితలు చిన్న, చిన్న పదాలను కలిపి సమాసాలు, అలంకారాలు చేస్తారు. ఇంకో రకమైన ద్వంద్వాలు ఆనందము-దుఃఖము, వేడి-చలి, నష్టం-లాభం మొదలగునవి. ఎప్పుడూ మారే ప్రకృతిలో ద్వంద్వాలు సహజంగా ఉంటాయి. మనము స్వేచ్ఛగా ఉండాలంటే ద్వంద్వమోహమును -- మనము ఎడంగా ఉన్నామనే భ్రమను -- జయించాలి.

శ్రీకృష్ణుడు తాను కాలాన్ని అని ముందు చెప్పియున్నాడు. ఇక్కడ తాను ఆద్యంత రహితమైన కాలాన్ని అని చెప్పుచున్నాడు. ఇది ఆద్యంత రహితమైన ప్రస్తుతము. దానిని గాఢమైన ధ్యానంలో, ప్రపంచం యొక్క ఎరుక లేనప్పుడు, అనుభవిస్తాము. మనము కాలము సాపేక్షితము (relative) అని గ్రహిస్తాము. కాలం యొక్క గమనం మనస్సుతోనే గ్రహిస్తాము. కాలానికి స్వతహాగా మారే గుణము లేదు.

మనకి ఏకాగ్రతతో నచ్చిన పని చేస్తున్నప్పుడు కాల గమనం తెలీదు. పతంజలి ఇది బయట ప్రపంచంలో లేనిది, మన ఏకాగ్రత వలన కలిగినదని చెప్పును. అదే నచ్చని పని చేస్తే కాలం దుర్భరంగా నడుస్తున్నాదని తలుస్తాము.

ఐన్స్టీన్ ఒకమారు సభలో ప్రసంగం వింటున్నారు. ఆయనకు ఆ ప్రసంగం నచ్చలేదు. అప్పుడు ఆయన తన ప్రక్కవాని చెవిలో "నేను సాపేక్షితను కనుగొన్నాను. కాని ఈయన అనంత కాలం కనుగొన్నాడు" అని చెప్పేరు.

ధ్యానంతో మనస్సును నిశ్చలం చేసికొంటే మనము ఆద్యంత రహితమైన కాలంలో గడపవచ్చు. అప్పుడు మనము నచ్చిన లేదా నచ్చని క్రియలపై సమతుల్యంగా ఉంటాము. ఇంకా గతం, భవిష్యత్తు మన మనస్సులోనే ఉన్నాయని తెలిసికొంటాం. దానివలన మన గతంలో చేసిన తప్పులు బాధించవు , లేదా భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అనే తపన ఉండదు. మన౦ గతం, భవిష్యత్తు నిజమని ఎందుకు అనుకుంటామంటే గతంలో మనం చేసిన క్రియలు, ఇతరులు మనకు తెచ్చిన కష్టాలు, భవిష్యత్తులో చేయబోయే క్రియలు, ఇతరుల వలన కలగబోయే కష్టాల గూర్చి ఆలోచిస్తూ ఉంటాము కనుక. గతం, భవిష్యత్తు నిజము కావు. కానీ వాటి గూర్చి ఆలోచనలు నిజం.

కొన్ని సంవత్సారల క్రితం నేను ఒక ఇంటిలో అద్దెకున్నాను. ఆ ఇంటి యజమానికి దెయ్యాలు ఉన్నాయని నమ్మకం. వాని ఇంటి దగ్గర ఒక శ్మశానం ఉంది. అతడు అక్కడి దయ్యాలు తనను వెంటాడుతున్నాయని భావించేడు. నేనేమి చెప్పినా అతడు తన నమ్మకాన్ని మార్చుకోలేదు. చివరకు నేను అక్కడికి వెళ్ళి చూస్తానని చెప్పేను. నేను శ్మశానం నుంచి తిరిగి వచ్చినప్పడు అతను నేను దయ్యాలను చూసేనా అని ఆతృతగా అడిగేడు.

"నేను మూడు దయ్యాలను చూసేను" అని చెప్పేను.

"నువ్వేమి చేశావు?"

"నా ఇంటి యజమాని చాలా మంచివాడు. వానిని పట్టి పీడించకండి" అని చెప్పేను.

"దయ్యాలు ఏం చెప్పాయి?"

"అలా చేయలేం. ఎందుకంటే అతను మమ్మల్ని నమ్మిన౦త కాలం, మేమిక్కడే ఉండాలి"

అతడు కొంత సేపు తరువాత బిగ్గరగా నవ్వేడు. అతడు అప్పట్నుంచి దెయ్యాలను నమ్మడం మానేసాడు. మన గతంలో జరిగిన విషయాలు దెయ్యాలవలె మనని పట్టి పీడిస్తాయి. ఎప్పుడైతే మనం వాటి గురించి ఆలోచించడం మానేస్తామో అవి ఇక మనను వెంటాడవు.

ఈ విధంగా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉంటే, మన చేతన మనస్సు ప్రస్తుత కాలం మీద ఏకాగ్రతతో ఉంటుంది. బుద్ధుడు దీనినే క్షణికవాదమనే సిద్ధాంతం ద్వారా వివరించేడు. ఒక క్షణానికి, మరొక క్షణానికి సంబంధం లేదు అని బోధ చేసేడు. ప్రతీ క్షణం ఏకైక మైనది.

శ్రీకృష్ణుడు విశ్వతోముఖః అని అంటాడు. అంటే అతని ముఖం అన్నిట్లోనూ ఉంది అని. నికోలాస్ ఆఫ్ క్యూసా "ప్రతి ముఖంలోనూ భగవంతుని ముఖం ఒక తెరవెనకాల ఉంది" అని అన్నారు. దేవుని ముఖము ధ్యానంలో సమాధి స్థితి పొందినప్పుడు మనలో ఆవిర్భవిస్తుంది. 253

Eknath Gita Chapter 10 Section 21

Bhagavat Gita

10.21

సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహ మర్జున {10.32}

ఆధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్

అర్జునా! సకల సృష్టులకును ఆది మధ్యా౦తములు నేనే. విద్యలలో నేను ఆత్మ విద్యను. వాదించు వారిలో నేను వాదమును

పతంజలి మనమెవరో తెలిసికొనడానికి ఆధ్యాత్మిక సాధన చేయవలెనని చెప్పెను. నాకు ఇదే అసలు విద్య --కాలేజీలో పట్టభద్రులు కావడానికి కాదు, జీవితం గురించి అభ్యసించేది --అని అనిపిస్తుంది. ఇది ధ్యానం వలన సాధ్యం. ధ్యానం వలన "నేనెవర్ని?" అన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. మనకు క్రికెట్ గురించి, ఆంగ్ల సాహిత్యం గురించి ఎంతో తెలిసి ఉండవచ్చు. కాని అవి సంతృప్తి, భద్రత, మనశ్శాంతి ఇవ్వవు.

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఊహాతీత జ్ఞానం, లేదా మనలోని స్పష్టమైన జ్ఞానం గూర్చి కాక "నేనే అన్నిటికీ హేతువు" అని చెప్పుచున్నాడు. నేటి విజ్ఞాన శాస్త్రము మన వంట పూర్తిగా పట్టలేదు. ఉదాహరణకి క్రోధానికి, క్రోధమే బదులుగా ఇస్తూ బంధుమిత్రులతో ఎలా బ్రతకగలం? అణ్వాశ్త్రాలతో మారణహోమం చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు శాశ్వతమైన శాంతి ఎలా నెలకొల్పగలం? విభేదాల మధ్య హృదయంలో శాంత౦గా ఉండి, ఇతరులను సహనంతో, క్షమతో ప్రభావితం చేయడానికి అంతర్గతంగా అమితమైన శక్తి ఉండాలి. అది ధ్యానంవలన క్రమంగా పొందవచ్చు. 250

Eknath Gita Chapter 10 Section 20

Bhagavat Gita

10.20

పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతా మహం {10.31}

రుషాణాం మకరశ్చాస్మి స్రోతమస్మి జాహ్నవీ

పవిత్రము చేయు వానిలో నేను వాయువును. ఆయుధ పాణులలో నేను శ్రీ రాముడను. చేపలలో నేను మొసలిని. నదులలో గంగానది నేనై యున్నాను.

వాయువుకు పరిశుద్ధము చేసే గుణముంది. గాలి దుమ్ము, ధూళి, కాలుష్యము, ఒకే చోట పేరుకు పోకుండా చేస్తుంది. కొందరు వాయువును ఒక దేవతగా కొలుస్తారు. వాయువు మంచి చెడు రెండూ చేయగలదు. చినూక్ అనే వేడి వాయువు అమెరికా లోని రాకీ పర్వతాలకు తూర్పున వీస్తుంది. దానిలో విచిత్రమేమిటంటే అది సీతా కాలంలో వస్తుంది. ఒకసారి మార్చ్ నెలలో మొ౦టానా అనే రాష్ట్రంలో 3 నిమిషాల్లో ఉష్ణోగ్రతను 31 డిగ్రీలు పెంచింది. చినూక్ వలన ఎన్నో సాధు జంతువులు చలికి వణికి మరణించకుండా ఉంటాయి. అలాగే హర్ మిటన్ అనే గాలి సహారా ఎడారి నుండి ఆఫ్రికా వైపు వీస్తుంది. దానికి కీళ్ల నొప్పులు మొదలగు సమస్యలను నిర్మూలించే శక్తి ఉందని నమ్ముతారు. ఈ విధంగా సూర్యుని ప్రకాశమువలన భూగోళమంతా వాయు సమూహాలు తిరుగుతూ కాలుష్యాన్ని ఒకేచోట పేరుకుపోకుండా ఉంచుతాయి. ఒక శాస్త్రజ్ఞుడు వీటిలో కోటి అణ్వాస్త్రాల శక్తి ఉన్నదని చెప్పేడు.

ఈ శ్లోకంలో గాలికున్న పారిశుద్ధ్య శక్తి మనలోనూ ఉందని చెప్పక చెప్పబడినది. ఎవరు పరోపకారులై ఉంటారో వారు ఇతరులను తమ పారిశుద్ధ్య శక్తితో ప్రభావితం చేస్తారు. ఎవరైతే క్రోధము, భయము కలిగిస్తారో వారు కాలుష్యము లాంటి వారు. మనలో చాలామంది అహంకారమనే కాలుష్యముతో కూడి ఉన్నాము. ధ్యానం వలన మనల్ని పరిశుద్ధం చేసుకోవచ్చు. అనగా పగని ప్రేమగా, క్రోధాన్ని దయగా, భయాన్ని ధైర్యంగా మార్చుకోగలము. ఎవరైతే ఈ విధంగా అంతరంగంలో ధృఢంగా ఉంటారో, ఎటువంటి ప్రతికూల పరిస్థితులవలన ప్రభావితమవ్వరో వారిలో పారిశుద్ధ్య శక్తి ఉన్నట్టే.

శ్రీకృష్ణుడు జలంలో బ్రతికే జీవులలో తనను మొసలితో పోల్చుకున్నాడు. నేను మొసళ్ళను ఒక అక్వేరియంలో చూసేను. వాటి తోలును ఛేదించడం దుస్సాధ్యం. మన జీవితం సాఫీగా సాగాలంటే అటువంటి కవచాన్ని ధరించాలి. మనకు కలిగే ప్రతి సవాలు లోనూ పేరు ప్రతిష్ఠలకై ప్రాకులాడకూడదు. నా మిత్రుడొకడు సినిమాలలో అనేక పాత్రలను పోషించిన నటుడు. అతడు పేరు ప్రతిష్ఠలకై నటుడు కావాలనుకొన్నాడు. దానివలన భద్రత కలుగుతుందని నమ్మి మోసపోయేడు. భద్రత అనే కవచాన్ని మన అంతరంగంలో ధరించాలి. ఎప్పుడైతే పరిస్థితులు అతలాకుతలమవుతాయో అప్పుడు సహనాన్ని, ఓర్పును పాటిస్తే ఆ కావచాన్ని దృఢపరుచుకొని భద్రంగా ఉంటాము.

గంగానది రతి వలన విడుదలయ్యే జీవ శక్తికి ప్రతీక. రతిలో జీవిత రహస్యం దాగి ఉంది. ఒక ఆడ మగ జంట మధ్య ప్రేమ, విశ్వాసం పూర్తిగా ఉంటే, వారి రతి ఒక అందమైన ప్రక్రియ. ధ్యానం వలన మనము దానిని స్వాధీనంలో పెట్టుకొని, కనిపించిన దాని వెంట పడకుండా ఉంటాం. అప్పుడు రతి ఒక సృజనాత్మక శక్తి వలె మారి మనలో ఐకమత్యమును పెంపొందిస్తుంది. 249

Eknath Gita Chapter 10 Section 19

Bhagavat Gita

10.19

ప్రహ్లాద శ్చాస్మి దైత్యానాం కాలః కలయతా మహం {10.30}

మృగాణా౦ చ మృగేంద్రో అహం వైనతేయశ్చ పక్షిణామ్

దైత్యులలో నేను ప్రహ్లాదుడను. గణిత శాస్త్రములో నేను కాలమును. మృగములలో సింహమును నేనే. పక్షులలో గరుత్మంతుడను.

ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టి గొప్ప విష్ణుభక్తుడైనాడు. వాని తండ్రి హిరణ్యకశిపుడు అనే అసురుడు. అతను ప్రహ్లాదుని మనస్సు తనవైపు త్రిప్పుకోడానికి చాలా ప్రయత్నించేడు. కాని అలా వీలు కాలేదు. చివరికి అతను ప్రహ్లాదుని శ్రీ హరిని ఒక స్తంభంలో చూపమని సవాలు చేస్తాడు. శ్రీహరి ఆ స్తంభంలోంచి ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఈ విధంగా ప్రహ్లాదుడు మనకు అనన్య విష్ణుభక్తునిగా చిరస్మరణీయుడు.

శ్రీకృష్ణుడు తాను కాలాన్ని అంటాడు. మనమీ రోజుల్లో ప్రతీదీ సమయంతో కొలుస్తాము. సంస్థలు ఎవరైతే తక్కువ సమయంలో ఒక పని చేస్తారో, అది సంపూర్ణమైనది కానప్పటికీ, వారినే ఆదరిస్తారు. నిత్య జీవితంలో కూడా మనము తొందరగా ఒకరు పని చేస్తే వారికి ఎక్కువ వేతనం ఇస్తాం.

మన మెప్పుడైతే కాలంతో పరిగెడతామో మానసిక ఒత్తిడి ఎక్కువ చేసుకొంటాం. దాని వలన నాడులు అస్తవ్యస్తమై దీర్ఘ కాలంలో మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. ఒక దురుసుగా మాట్లాడే వ్యక్తి నిజానికి నిర్దయుడు కాక, నాడీ వ్యవస్థ వికలమైనవాడు కావచ్చు. అటువంటివారిపై చెల్లుకు చెల్లు అని అవమానించడం సమం కాదు. వారిని ఓర్పుతో, ఆదరణతో మన వైపు తిప్పుకోవాలి.

ధ్యానం కాల క్రమ౦లో నెమ్మదిగా చేస్తే, మనం అమితమైన మంచిని, ఆనందాన్ని పొందుతాము. అలాగని మనం గడియారాలను బయట పడేయనక్కరలేదు. ఉదాహరణకి మనం ఒక నిర్ణీత సమయానికి ఒక వ్యక్తిని కలుస్తామన్నా మనుకోండి. మనం ఒక అరగంట ముందే వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వీధులలో రద్దీ, వాహనాన్ని పార్క్ చేయడానికి పట్టే సమయం, మొదలగు అవాంతరాలు మనని ఆలస్యం చేయవచ్చు. ఈ విధంగా మన౦ కాలాన్ని జయించి జీవితాన్ని సుగమ్యం చేసికోవచ్చు 246

Eknath Gita Chapter 10 Section 18

Bhagavat Gita

10.18

అనంత శ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం {10.29}

పిత్రూణామర్యమా చాస్మి యమ స్స౦యమతా మహమ్

నాగులలో నేను అనంతుడను. జలదేవతలలో నేను వరుణుడను. పితృదేవతలలో ఆర్యముడూ నేనే . దండించువారిలో నేను యముడును

అనంత అనబడే సర్పం మీద శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు. సర్పము కుండలిని శక్తికి ప్రతీక. వాహనానికి ఇంధనం ఎలాగో, కుండలిని మేల్కొలిపి వెన్నెముక ద్వారా సహస్రానికి చేర్చాలంటే లైంగిక కర్మల చేయకూడదు. మనము అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే కుండలినిని ఉపయోగించాలి. ఆధ్యాత్మిక సాధనలో ఆ శక్తికి పరిమితం లేదు. అందుకే దాన్ని అనంత అంటారు.

ఆర్యముడు పితృదేవతలకు ప్రతీక. మనము అనేక తరాల తరబడి మన పితృదేవతల నుండి జన్యురూపేణా ఈ దేహాన్ని పొందేము.

ప్రపంచాన్ని నియంత్రించే శక్తులలో తాను యముడునని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. కఠోపనిషత్తులో నాచికేతుడను బాలుడు, తండ్రి మీద కోపంతో యమలోకానికి వెళ్తాడు. అప్పుడు యమలోకమలో యముడు ఉండడు. ఆ బాలుడు యముని రాకకై ఎదురు చూస్తూ చాలా కాలం గడుపుతాడు. చివరకు యముడు వచ్చి ఆ బాలుని భక్తికి మెచ్చి కొన్ని వరాలు కోరుకోమని అంటాడు. నాచికేతుడు సాధారణంగా అడిగే వస్తువుల కంటే మిన్న అయిన జ్ఞానాన్ని పొంద దలచి యముడ్ని "మరణించినవారు ఎక్కడికి వెళ్తారు?" అని అడుగుతాడు. యముడు ఎన్నో ఆశలు చూపి, చివరకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడు. ఇది కట్టు కథ కావచ్చును. మనం తెలిసికోవలసింది ధ్యానంతో మన దేహానితో తాదాత్మ్యం చెందకూడదు.

ఈ రోజుల్లో పెరుగుతున్న అరాచకాలవలన ఎందరో అకాల మరణం చెందుతున్నారు. ఉదాహరణకి పిస్టల్ నుపయోగించి దొంగతనాలు చేస్తూ, పగ తీర్చికొంటూ చేసే దురాగతాలను మనం పత్రికలలో చదువతున్నాం. దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలంటే మనము భౌతికమైన వస్తువులను, డబ్బును సేకరించడం తగ్గించాలి. ఇది పిస్టల్ కొనడకంకన్నా కష్ట సాధ్యము. మనలను నిరంతరము ఇంకా ఎక్కువ వస్తువులు కొనండి అని సంస్థలు ప్రోత్సాహించడంవలన అక్కరలేని వస్తువులు -- రెండు, మూడు వాహనాలు, ఇళ్ళు మొదలైనవి--కొంటున్నాము.

ఈ నేపథ్యంలో మన సమాజాన్ని మార్చాలంటే మనం బోధించ వలసింది జీవితం డబ్బు గురించి కాదు, బాంధవ్యాల గురించి మనకు ఇవ్వబడినది. అలా మాట్లాడితే సరిపోదు. దానిని ఆచరణలో చూపాలి. చాలా మందికి డబ్బు సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదని చేతన మనస్సు లోతులలో తెలుసు. కాని వారికి ఉంకొక ఎన్నిక చేసికోవడం సాధ్యం కాదు. ఒక ధనవంతుడు, పరోపకారం చేస్తూ, బంధు మిత్రులతో మైత్రి పెంచుకుంటూ, సమస్థితిలో ఉంటే వానికి నిజమైన జీవితమంటే ఏమిటో తెలుస్తుంది.

మనము డబ్బుకై అతిగా పనిచేయక బంధుమిత్రులతో కాలం గడిపి, రెండు మూడు వాహనాలకై ఎగబడక, టివి చూసే సమయంలో సంఘ సేవ చేస్తూ ఉంటే దాని వలన కలిగే ఆనందం వర్ణించలేనిది.

హింసాకాండకు మరొక ముఖ్య కారణం రతి. దానిని ఆసరాగా తీసికొని పత్రికలు, సినిమాలు జనులను ప్రేరేపిస్తున్నారు. మనము మన డబ్బుతో వాటిని ఎన్నిక చేయకపోతే సమాజ పరిస్థితి ఉన్నతమౌతుంది. మన జీవిత౦లో కలకాలం ఉండే గాఢమైన బాంధవ్యాలు విశ్వాసం, ఒకరి మీద మరొకరికి గౌరవం వలన కలుగుతాయి. రతికి అటువంటి అనుబంధాలలో విలువ ఉంది. కాని రతికై ఇద్దరి మధ్య సంబంధం ఉండి, వారు అవిశ్వాసంతో ఉండి, తమ దారి తాము చూసుకొంటే చివరకు దుఃఖం కలుగక మానదు. 244

Eknath Gita Chapter 10 Section 17

Bhagavat Gita

10.17

ఆయుధానా మహం వజ్రం ధేనూనామాస్మి కామధుక్ {10.28}

ప్రజనశ్చాస్మి కందర్ప స్సర్పాణామస్మి వాసుకిః

ఆయుధములలో వజ్రాయుధము, ధేనువులలో కామధేనువు, ప్రాణోత్పత్తికి కారకులలో మన్మథుడు, సర్పములలో వాసుకి నేనే

ఒకమారు అసురులు దేవతలకన్నా మిక్కిలి శక్తిమంతులై, యుద్ధాలలో దేవతాల్ని పరాజయులను చేస్తున్నారు. అప్పుడు దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్ళి తమను కాపాడమని వేడుకొన్నారు. ఇంద్రుడు దానికి బదులుగా తనకు శుద్ధమైన, సంపూర్ణమైన యోగి పుంగవుని ఎముకలతో చేసిన ఆయుధాన్ని ఇస్తే గాని దానవులతో యుద్దం చేయలేనని చెప్తాడు.

దేవతలు పయనమై అనేక యోగులను, ఋషులను, మునులను వేడుకొంటారు. ఎవ్వరూ దానికి ఒప్పుకోరు. చివరకు దదీచి అనే ఋషి తన అస్తికలను ఇవ్వడానికి ఒప్పుకొంటాడు. అతడు ధ్యానం చేస్తూ, భగవంతునిలో లీనమై తన తనువు చాలిస్తాడు. ఆయన అస్తికలతో దేవతలు వజ్రాయుధాన్ని చేసి, ఇంద్రునకు ఇస్తారు.

ఇది ఒక కట్టు కథ కావచ్చు. కానీ దానిలో ఒక ముఖ్యాంశం ఉంది. దదీచి దేవతలకొరకు తన ప్రాణాన్ని సైతం దారబోసేడు. ఇది అత్యంత ఉత్కృష్టమైన త్యాగం. ఎప్పుడైతే మనం ఇతరుల దుఃఖాన్ని నిర్మూలించడానికి సిద్ధపడతామో అది అత్యంత శక్తికి నిదర్శనం. శక్తి అంటే వేరొక దేశాన్ని, జాతిని, తోటివారిని యుద్దాలలో ఓడించడం కాదు. మనమెప్పుడైతే పరోపకారాన్ని దృష్టిలో పెట్టుకొని శక్తిని ప్రదర్శిస్తామో అదే నిజమైన శక్తి.

అలాగే కృష్ణుడు తనను కామధుక్ అనే గోవుతో పోల్చుకొంటాడు. దానినే కామధేనువు అంటారు. అది మన ప్రతి కోర్కెను తీర్చగల సామర్థ్యము కలది.

వాసుకి ఒక సర్పము. దాని నుపయోగించి దేవతలు, అసురులు అమృతం కొరకై పాల సముద్రాన్ని చిలికేరు.

శ్లోకంలో కందర్ప కామానికి ప్రతీక. కందర్ప అనగా మన్మథుడు. అతను తన బాణాలతో ఇతరులలో కామ సంకల్పాన్ని కలిగిస్తాడు.

నేననేది మొదటి మన్మథ బాణం తగలగానే మనస్సును నియంత్రించుకోండి. వీలైతే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చెయ్యండి. జీసస్ "మనం ఆశల వలయంలో చిక్కుకోకుండా, చెడు కర్మల నుండి విముక్తి పొందాలి" అని చెప్పెను. ప్రసార మాధ్యమాలు మనలను మన్మథుని బాణాలకు తలవగ్గేలా ప్రభావితం చేస్తున్నాయి. అందువలన సాధకులుగా మనము మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి. ముఖ్య విషయమేంటంటే మన బంధాలు లైంగిక కర్మల కొరకే కాకుండా, స్వార్థానికే కాకుండా ఒకరి సంక్షేమమునకై ఇంకొకరు ప్రవర్తించేలా ఉండాలి. 241

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...