Sunday, April 10, 2022

Eknath Gita Chapter 11 Section 19

Bhagavat Gita

11.19

సఖేతి మత్వా ప్రసభ౦ యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి {11.41}

అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ప్రణయేన వాపి

యచ్చాపహాసార్థ మసత్కృతో అసి విహార శయ్యాసన భోజనేషు {11.42}

ఏకో అథవాప్యచ్యుత తత్సమక్ష౦ తత్ క్షామయే త్వామహ మప్రమేయమ్

కృష్ణా! నీ వైభవమును తెలియక పొరపాటున గాని, అజ్ఞానము వలన గాని, స్నేహము వలన కలిగిన చనువు చేతగాని నిన్ను సామాన్యునిగ భావించి, హే కృష్ణా! ఓ యాదవా! ఏ సఖా! అని నిర్లక్ష్యముగా భాషించి యుంటినేమో! విహార, శయ్య, ఆసన, భోజన, సమయాలలో ఏకాంతముగా యుండునపుడు గాని, అన్యుల యెదుట గాని పరిహాసమునకై అపరాధములు చేసియు౦టినేమో! ఆ నా తప్పులను క్షమించమని అప్రమేయుడవగు నిన్ను వేడుకొనుచున్నాను ఀ

అర్జునుడు శ్రీకృష్ణుని తాను గతంలో ఆయన నిజ స్వరూపము తెలీక చేసిన తప్పులకు క్షమాపణ కోరుతున్నాడు. మనందరిలో దేవుడు నివాసమున్నాడని తలపక మనమూ అర్జునిలా బాధ పడతాము.

దేవుడు పరమ ప్రేమ స్వరూపుడై "మీరు నన్ను క్షమించేనని త్వరగా చెప్పగలరా?" అనే మన విన్నపాన్ని ఎన్నడూ కోరడు. నిజమైన ప్రేమ ఒప్పందాలతో కూడి ఉండదు. కొందరు దేవుని తమను క్షమించమని అడగడానికి సంకోచించరు, కానీ తాము ఇతరులను క్షమించడానికి సంకోచిస్తారు. నాకు ఇదే నిజమైన పరీక్ష: నన్ను బాధ పెట్టిన లేదా అవమాన పరచిన వ్యక్తులను క్షమించి వారి బాగును కోరుకోగలనా? అవునంటే ఆ వ్యక్తి యందు నాకు నిజమైన ప్రేమ ఉంది. నా బంధుమిత్రులు, వాళ్ళ మంచికై ఏదో చేయబోయి, ఒక తప్పు చేస్తే, వాళ్ళు నన్ను ద్వేషించరు. ఎందుకంటే నేను వారికి ఎటువంటి అపకారం చేయలేనివాడను కనుక. ఇటువంటి నమ్మకం ప్రతి బంధం లోనూ, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, ఉండాలి.

మనం ఒకరి తప్పును క్షమించి, వారికి మన సహాయం కావాలని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తే, మనం గతంలో చేసిన తప్పులకు మనమే క్షమించుకున్నట్లు. మనం ఎవరి యందైతే తప్పు చేసేమో, వారు దాన్ని మరచి పోయి ఉండవచ్చు. కానీ మనలో అది చెరగని ముద్ర వేసి ఉండవచ్చు. దాని వలన మనమనేక మనోభావాలతో అతలాకుతలమవ్వచ్చు. క్షమ వలన మన మనస్సు తేలిక పడుతుంది. మనస్సు మీద వొత్తిడి, నాడీ వ్యవస్థలో ఆవేదన తగ్గి, మన యందు తప్పు చేసిన వారలను తేలికగా క్షమిస్తాము.

సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అగాస్సీ మనము క్షమా గుణము పోగొట్టుకుంటే జీవితంలో ఎన్నడూ ఆనందాన్ని పొందలేమని చెప్పెను. ఒక మంచు కురుస్తున్న రోజు ఆయన లియో అనేవానితో నడుస్తున్నారు. అప్పుడు లియో "మనము సంపూర్ణమైన ఆనందం ఎప్పుడు పొందగలము?" అని అడిగేరు.

ఫ్రాన్సిస్ "మన చర్చి లోని సేవకులందరూ శ్రద్ధతో, సంపూర్ణ భక్తితో, ఎన్ని అద్భుతాలు చేసినా మనము సంపూర్ణ సంతోషం పొందలేము" అని చెప్పెను.

"ఏది సంపూర్ణమైన ఆనందము?" అని లియో అడిగెను.

"మనము అన్ని భాషలను నేర్చుకొన్నా పక్షులతోనూ, జంతువులతోనూ మాట్లాడగలిగినా, సృష్టి రహస్యాలన్నీ తెలిసికొన్నా మనకు సంపూర్ణ ఆనందము కలుగదు"

లియో తన ప్రశ్నని మళ్ళీ అడిగేరు.

"మనం భూమిమీద ఉన్న సమస్త వ్యాధులను తీసివేసినా సంపూర్ణ ఆనందము కలుగదు"

లియో "దయచేసి సంపూర్ణ ఆనంద రహస్యం చెప్పండి?" అని అడిగేరు.

"మనం చాలాసేపు మంచులో నడచి ఆకలితో అలసి పోయేం. ఎదురుగా ఉన్న మఠానికి వెళ్ళి, అక్కడ ఉన్న కాపలాదారునితో మన పరస్తితి వివరిస్తే, అతడు మనను తిట్టి, కొట్టి, బయటకు తోసేస్తే, అప్పుడు మనము "జీసస్ నిన్ను క్షమించుగాక" అని అనగలిగితే మనం సంపూర్ణమైన ఆనంద పొందుతాం"

మనకు అలాంటి పరిస్తితి రాక పోవచ్చు. కానీ మన౦ చిన్న చిన్న విషయాలను క్షమించ గలగాలి. ఇతరులు చేసిన తప్పులు మన చేతన మనస్సులో చెరగని ముద్ర వేసి మనకు తెలియకుండానే మన భద్రతను, చేతనత్వాన్ని, బంధాలను ప్రభావితం చేస్తాయి. అలాటప్పుడు మనం అనుభవించిన తప్పులను ఒకటి ఒకటిగా క్షమిస్తే లాభం లేదు. నిజానికి మనం తప్పులనుకొన్నవి కొన్ని తప్పులే కావు. మనం ఇతరులను సరిగ్గా అర్థం చేసికోలేక, అహంకారం దెబ్బ తిని తప్పుగా భావించడం వలన బాధపడ వలసి వస్తున్నాది. మనం గతాన్ని తలచుకోవడమే వ్యర్థం. మంత్ర జపంతో గతం గూర్చి వచ్చే ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఇదే నిజమైన క్షమ. ఎందుకంటే మనము గతంలో చేసిన తప్పులను చేతన మనస్సుకు రానీయం. దానివలన వర్తమాన కాలంలో చేసే క్రియలలో దృష్టి కేంద్రీకరించి, ప్రతి నిమిషం, ప్రతి సంబంధం, తాజాగా తీసికొని ఆనందంతో బ్రతకగలం. 308

Eknath Gita Chapter 11 Section 18

Bhagavat Gita

11.18

నమః పురస్తాదథ పృష్ఠత స్తే నమో అస్తుతే సర్వత ఏవ సర్వ {11.40}

అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతో అసి సర్వః

ఓ సర్వవ్యాపీ ! నీకు ముందు నమస్కరించుచున్నాను. వెనుక వందన మాచరించుచున్నాను. అన్ని వైపుల ప్రణమిల్లు చున్నాను. శక్తి పరాక్రమములు గల నీవు సమస్తమును వ్యాపించి యున్నావు. అందుచేతనే సర్వుడనబడుచున్నావు.

మనం తల ఏ దిక్కులో పెట్టి పడుకోవాలి అన్న ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. దక్షిణా మూర్తిని, అనగా దక్షిణ దిక్కుగా చూస్తున్న దేవుని, నమ్మేవారు ఉత్తర దిక్కులో కాళ్ళు పెట్టరు.

తమిళనాడులో ఆండాళ్ళు అనే యోగిని ఒకరి ఇంటిలో రాత్రి బస చేసేరు. ఆ ఇంటి యజమాని ఉదయాన్నే లేపి ఆండాళ్ళు తన తలని తప్పు దిశలో పెట్టుకుందని చెప్పింది. ఆండాళ్ళు దేవుడు అన్ని దిక్కులా ఉన్నాడని చెప్పి, చివరకు శీర్షాసనమేసి పడుకుందామంటే దేవుడు క్రిందా, మీదా కూడా ఉన్నాడు అని చెప్పేరు.

సమాధిలో, మనస్సు నిశ్చలమై, అహంకారం అణిగి ఉంటాము. అప్పుడు దేవుని అంతటా చూస్తాము. ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడని తలుస్తాము. రామాయణంలో హనుమంతుడు సాటిలేని రామ భక్తుడు. లంకా నగరాన్ని దహించినందుకుగాను, ఆయన రావణుని సేనచే బంధింపబడి, రావణుని ముందు నేలపై కూర్చోపెట్టబడ్డాడు. అప్పుడు హనుమంతుడు తన వాలాన్ని పెంచి దాన్ని ఆశనంగా చేసికొని రావణుని కన్నా ఎత్తులో కూర్చున్నాడు. రావణుడు ఆయనను పరీక్షింప దలచి, ఒక రత్నాల హారాన్ని హనునమంతునికి ఇచ్చేడు. హనుమంతుడు దాన్ని కొరికి అవతలకు విసిరివేసేడు. రావణుడు అది ఎంతో విలువైనదని తెలుసా అని అడిగితే అందులో నా దేవుడు లేడని బదులు ఇచ్చేడు. రావణుడు ఎవరు నీ దేవుడు అని ప్రశ్నించగా హనుమంతుడు తన వక్షాన్ని చీల్చి రాముని చూపేడు.

ఇది ఒక కథ. కాని దాని వలన తెలిసేదేమిటంటే మన చేతన మనస్సు లోపలకి వెళితే దేవుడే మనకు శాశ్వత ఆనందాన్ని, భద్రతను ఇవ్వగలడు. 306

Eknath Gita Chapter 11 Section 17

Bhagavat Gita

11.17

వాయుర్యమో అగ్నిర్వరుణ శ్శశా౦కః

ప్రజాపతిస్త్వ౦ ప్రపితామహశ్చ {11.39}

నమో నమస్తే అస్తు సహస్రకృత్వః

పునశ్చ భూయో అపి నమో నమస్తే

నీవు వాయువవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతివి. అతనికి తండ్రివి. నమోనమః దేవా! పునః నమోనమః

అర్జునుడు శ్రీకృష్ణుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడని గ్రహించి సాష్టాంగ నమస్కారం పెట్టేడు. అతడు కంపిత స్వరంతో "నువ్వే విశ్వమంతా. కానీ నువ్వు దాని బయటనున్నావు. నువ్వు నా తల్లివి, తండ్రివి, తాతవి. నువ్వు అన్ని జీవులలోనూ ప్రకృతి శక్తులలోనూ ఉన్నావు" అని పలికెను. భగవంతుడు మీలోనూ, నాలోనే కాక, గాలిలోనూ, నదీసముద్రాలలోనూ, అన్ని శక్తి రూపాలలోనూ ఉన్నాడు. ఉనికి ఒక అఖండమైనది. దాని శకలాలలో మాత్రమే తారతమ్యం ఉంటుంది అందుకే మనము ప్రకృతిపై దోపిడీ చేస్తే బాధ పడవలసి వస్తుంది.

థామస్ వాఘన్ అనే ఆంగ్ల యోగి ఇట్లు చెప్పెను: "నీ హృదయ౦ ఆకాశంలో ఉంచు. నీ చేతులు భూమి మీద ఉంచు. చిత్తశుద్ధితో మీదకు వెళ్ళు. ఉదార బుద్ధితో క్రిందకు రా. ఇది కాంతి యొక్క ప్రకృతి. దాని బిడ్డల యొక్క మార్గము." యోగులైన యూదులు దేవుని విశ్వసించువారు ఆకాశానికి, భూమికి మధ్యనున్న నిచ్చెన వంటివారు అని చెప్పిరి. దేవుని నమ్మువారు అన్ని జీవులలోనూ దేవుని ఉనికి చూస్తారు.

ఇలా లేకనే కొందరు తక్కిన జీవులను తమ ఆనందానికై హింసిస్తారు. ఇది వేటకు మాత్రమే పరిమితం కాదు; పెంపుడు జంతువులయందు కూడా. కొందరు తమ పెంపుడు కుక్కలను తమతో శలవులలో వేరే చోటికి తీసికెళ్ళి అక్కడే వదిలేస్తారు. మరికొందరు పెంపుడు పిల్లులను ఇంట్లో బంధించి వేరే ఊరికి వెళతారు. అట్టివారిని నిందించకుండా, మనము జంతువులు మన సంరక్షణలో ఎందుకు ఉండాలో బోధించాలి. 303

Eknath Gita Chapter 11 Section 16

Bhagavat Gita

11.16

సంజయ ఉవాచ :

ఏతచ్చృత్వా వచనం కేశవస్య కృతాంజలి ర్వేపమానః కిరీటి {11.35}

నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గద౦ భీతభీతః ప్రణమ్య

అర్జునుడు శ్రీకృష్ణుని వచనముల నాలకించి చేతులు జోడించి వణకుచు శ్రీకృష్ణునికి నమస్కరించి, భయకంపితుడై, వినమ్రుడై గద్గద స్వరముతో ఇలా పలికెను

అర్జున ఉవాచ:

{11.36}
స్థానే హృషీకేశ! తవ ప్రకీర్త్యా జగత్పృహృష్య త్యనురజ్యతే చ

రక్షా౦సి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్య౦తి చ సిద్ధసంఘాః

హృషీకేశా! నీ వైభవమునకు జగత్తు సంతసించుచున్నది. అనురాగము పొందుచున్నది. రాక్షసులు భీతి చెందినవారై పలుదిక్కులకు పరుగులిడుచున్నారు. సిద్ధుల సమూహములన్నియు నీకు నమస్కరించుచున్నవి. ఇవి యన్నియు నీమహిమకు తగినవియే

కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణో అప్యాదికర్త్రే {11.37}

అనంత దేవేశ జగన్నివాస ! త్వమక్షరం సదసత్తత్పరం యత్

అనంతా! దేవదేవా! జగదాశ్రయా! సదసత్తులకు పరమమైన అక్షరపరబ్రహ్మవు నీవే. సృష్టికర్తయైన బ్రహ్మదేవునకు మూలకర్తవు. మహాత్ముడవైన నిన్ను ఎవరు నమస్కరింపకుందురు?

త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం {11.38}

వేత్తా అసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప !

అనంతరూపా! నీవు దేవదేవుడవు. పురాణపురుషుడవు. ప్రపంచమునకు ఆధారమైన వాడవు. సర్వజ్ఞుడవు. తెలియదగినవాడవు. పరంధాముడవు. విశ్వము నీ చేత వ్యాప్తమై యున్నది. ఀ

అర్జునడు ప్రపంచము శ్రీకృష్ణుని నియంత్రణలో తన్మయత్వముతో ఉన్నదని తలచేడు. "నువ్వు సర్వ జీవుల రక్షకుడవు. జీవులన్నీ నీయందే విశ్రమించగలవు. నువ్వు గతంలో, భవిష్యత్తులో; సృష్టి ఆదిలో, అంతములో ఉన్నవాడివి" అని అర్జునుడు శ్రీకృష్ణుని స్తుతించెను. మరణంనుంచి అమృతత్వానికి తీసికెళ్ళే ఆధ్యాత్మిక పథం కత్తి మీద సామువ౦టిది. అట్టి పథంలో నడిచిన వారు -- ఏ మతస్తులైనా, జాతివారైనా -- ఇటువంటి అనుభవాన్ని పొందేరు. శ్రిరామకృష్ణ, శంకర, సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిల, జలుల్-దిన్ రూమి, బాల్ షెం టోవ్ , జేకబ్ బోమి మొదలైనవారు తమ ప్రతి కణ౦తో స్పందించి అట్టి పదాలను ప్రయోగించేరు. ఇటలీ దేశస్తుడు జాకపోన్ ద టోడి ఇలా చెప్పెను:

తలుపులు తెరవబడినవి. దేవునితో ఐక్యమై, అది భగవంతుని అంతర్గత శక్తిని పొందినది; అదీ ఎప్పుడూ అనుభవించని దానిని అనుభవించింది; ఎప్పుడూ చూడనిది చూసింది; ఎప్పుడూ రుచి చూడనిదానిని రుచి చూసింది. తననుంచి స్వేచ్ఛను పొంది, అది పరిపూర్ణత పొందింది.

అట్టి దృశ్యం ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అది విననంతనే దాని కొరకై కోరిక కలుగుతుంది. మనము అటువంటి ఎరుక గల వారిని కలిస్తే, మన కోరిక ఇంకా బలంగా అవుతుంది. మన కాగడా అట్టి వారి ద్వారా వెలిగించుకొంటాము. ఎందుకంటే వారు దేవునిపై ప్రేమతో ప్రజ్వలిస్తున్నారు. 302

Eknath Gita Chapter 11 Section 15

Bhagavat Gita

11.15

తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వాశత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం {11.33}

మాయైవైతే నిహతాః పూర్వ మేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్

అందువలన నీవు లెమ్ము. శత్రువులను జయించి కీర్తిని పొందుము. సంపూర్ణ రాజ్య భోగము ననుభవింపుము. వీరందరును ఇదివరకే నా చేత చంపబడి యున్నారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము

ద్రోణం చ భీష్మం చ జయద్రథ౦ చ కర్ణం తథా అన్యానపి యోధవీరాన్ {11.34}

మయా హతా౦స్త్వ౦ జహి మావ్యథిష్టాః యుధ్యస్వ జేతా అసి రణే సపత్నాన్

ఇదివరకే నా చేత చంపబడియున్న ద్రోణాచార్యుని, భీష్ముని, జయద్రథుని, కర్ణుని అలాగుననే ఇతర యుద్ధ ప్రముఖులను నీవు చంపుము. భయపడకుము. యుద్ధము చేయుము. శత్రువులను జయించగలవు ఀ

కౌరవుల పక్షాన ఉన్న వీరులలో భీష్ముడు, ద్రోణాచార్యుడు ముఖ్యులు. వారు అధర్మంతో, దుష్ట శక్తులతో కలిసి ఉన్నారు. వారు అజేయులని అర్జునుడు నమ్మేడు. శ్రీకృష్ణుడు వారికి అపజయం తప్పదని అర్జునునికి ధైర్యం ఇస్తున్నాడు.

మనం ఏనాటికైనా దుష్ట శక్తులను ఎదిరించి పోరాడాలి. గాంధీ మహాత్ముడు మనకు నేర్పిన పాఠం: దుష్ట శక్తులకు స్వతహాగా ఉనికి లేదు. అవి మనం కుట్ర చేసినప్పుడే వెలుపలకు వస్తాయి. మనం వినాశనానికి దారి తీసే శక్తులను సమర్థించకుండా ఉంటే అవి చంపబడతాయి. సత్యాగ్రహానిది ఇదే సిద్ధాంతం.

గాంధీ చిన్న వయస్సులో సౌత్ ఆఫ్రికా లో అప్పుడే ఉద్యోగాన్ని మొదలుపెట్టిన రోజుల్లో సత్యాగ్రహ సిద్ధాంతాన్ని కనిపెట్టేరు. ఆయన తెల్లవాడు కాదని మార్టిజ్ బర్గ్ అనే ఊరి రైల్వే స్టేషన్ లో దింపబడ్డారు. అది అంతకు ముందు వందలాది మందికి జరిగింది. కానీ అది గాంధీలో ఒక గొప్ప శక్తిని మేల్కొలిపింది; గాంధీకి దుష్ట శక్తులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది. చాలా ఏళ్ల తరువాత ఒకరు ఆయనకు కలిగిన సృజనాత్మక శక్తి ఎక్కడ అధికంగా ఉందని అడిగేరు. అప్పుడు గాంధీ మార్టిజ్ బర్గ్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఉదాంతమని చెప్పెను. అప్పటినుంచి తాను జాతుల మధ్య ఉన్న భేదాన్ని రూపుమాపడానికి నిశ్చయించు కొన్నానని వివరించేరు.

గాంధీని అనేకమార్లు కారాగారాల్లో శిక్షించేరు. కాని అతడు నిరాశ చెందక, సంతోషంగా ఉండి, అధికారుల మన్నన పొందేరు. సౌత్ ఆఫ్రికా కారాగారంలో ఉన్నప్పుడు ఆయన జనరల్ స్మట్స్ అనే అధికారికి స్వయంగా చెప్పులు చేసేరు. చాలా ఏళ్ల తరువాత జనరల్ స్మట్స్ ఆ చెప్పులను తిరిగి ఇచ్చి "నేను ఆ గొప్ప మనీషి చెప్పులలో నుంచునే వాడంతటి వానిని కాను" అని చెప్పేరు. ఇటువంటి సంఘటనలు మనకు చెప్పే పాఠం: ఎవరైతే ఇతరులను తమ పేరుప్రతిష్ఠలకై మోసగించకుండా ఉంటారో వారిపై ప్రజలంతా హర్షాన్ని వ్యక్తం చేస్తారు. మనమట్టి మనీషి ముందు పూర్తిగా ఉపశమించి, ఎటువంటి స్పర్థ లేకుండా, మంచి ఏనాటికైనా చెడ్డపై గెలుపు సాధిస్తుందనే నమ్మకంతో ఉంటాము. 300

Eknath Gita Chapter 11 Section 14

Bhagavat Gita

11.14

శ్రీ భగవానువాచ

{11.32}
కాలో అస్మి లోకక్షయకృత్ ప్రవృద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః

ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే యే అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః

నేను లోక సంహారమునకై విజృంభించిన కాలుడను. ప్రాణులను సంహరించుటకు ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. నీవు యుద్ధమును మానినను శత్రుసైన్యము నందలి వీరులు జీవించి యుండరు. ఀ

ఈ శ్లోకామే రాబర్ట్ అప్పెన్హైమెర్ కు అణ్వాయుధ పరీక్ష చూస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. ఇక్కడ కాల పదానికి కాలము, మరణము అను రెండర్థాలు ఉన్నాయి. కాలము అంటే మరణము; వేర్పాటు. అది మన నీడ కన్నా దగ్గరగా ఎల్లప్పుడూ మనల్ని వెంటాడుతుంది. ఏళ్లు గడుస్తున్నప్పుడు మన బంధుమిత్రులు మరణాల్ని చూసి, మన మరణం కూడా ఒకనాడు ఆసన్నమవుతుందని తెలుస్తుంది. మన సంతోషపు ఘడియలు పంచుకున్నవారలు ఇక లేకపోవచ్చు. గొప్ప గొప్ప వారు ఈ భూమి మీద నడిచి అసువులు బాసేరు. రాజ వంశాలకు, చక్రవర్తులకు నూకలు చెల్లి చరిత్ర పుటల్లో మిగిలిపోయేరు. దేవుని దయవలననే మనమి౦కా బ్రతికి ఉన్నాము. ఎవరికైతే ఈ ఎరుక ఉంటుందో వారు ఆధ్యాత్మిక సాధనకై ఉత్సాహము కలవారై, కాలమరణాలనే రక్కసిని అధిగమించాలనే కోరిక గలవారై ఉంటారు.

నేను ఈ శ్లోకాన్ని నిత్యం తలుచకుంటూ ఉంటాను. దానివలన నా లక్ష్యం స్పష్టంగా కనబడి, పూర్తి ఏకాగ్రత కలిగి, కోరికలను జయించే సామర్థ్యం వస్తుంది. నా సాధనలో నాకు అతి పెద్ద కోరిక కలిగినప్పుడు నా అమ్మమ్మ ఇచ్చిన బోధ గుర్తుకు వస్తుంది. నేను మృత్యు దేవత ప్రక్కనే ఉందని తలచి, నా కోరికను నిరోధిస్తాను. అలాగే క్రోధం, మత్సరం, మదం, నిరాశ కలిగినప్పుడు కూడా మరణాన్ని తలుచుకోవాలి. మనకి కలహించుకోడానికి, కోప్పడడానికి, విడిపోవడానికి సమయంలేదు. మొదలెట్టగానే అంతమొందే స్వార్థ పూరిత క్రియలు చేయడానికి సమయం లేదు. మనం యువకులుగా ఉన్నప్పుడు జీవితం ఇచ్చే వస్తువులను అనుభవించడానికి సమయం ఉంటుంది. కాని అవి క్షణికమైనవి. నీటి మీద వ్రాతల లాగా ఉండేవి.

ఒక భౌద్ధ గురువు "రేపటికి ఏ పనిని వాయిదా వెయ్యకు. నీవు రేపు బ్రతికి ఉంటావని నీకెలా తెలుసు?" అని అన్నాడు. బుద్ధుడు "జీవితము ఒక కల, మాయ, బుడగ, నీడ, వర్షపు చినుకు, లేదా మెరుపు వంటిది" అని చెప్పెను. మన౦ గుర్తు౦చుకోవలసినది జీవితం క్షణికము. కాబట్టి మనం సంసారమనే సముద్రాన్ని దాటడానికి ఉపేక్ష చెయ్యకూడదు. 298

Eknath Gita Chapter 11 Section 13

Bhagavat Gita

11.13

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో

నమో అస్తు తే దేవవర! ప్రసీద {11.31}

విజ్ఞాతు మిచ్చామి భవంత మాద్య౦

న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్

దేవదేవా! నీకు నమస్కారము. ఉగ్రరూపుడగు నీవెవడవు? ఆదిపురుషుడవగు నిన్ను తెలియగోరుచున్నాను. నీ ప్రవర్తనము నాకు బోధపడుట లేదు

అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపం భయంకరంగా ఉందని తలచెను. అతని సంశయము దేవుడు సదా కరుణా మూర్తియని తలచడం వలెన కలిగినది. ఇది జీవిత సత్యం. మనము పుట్టిన దగ్గర నుంచి మరణంవైపే ప్రయాణిస్తున్నాము. ఒక చిన్న సూక్ష్మ క్రిమి నుంచి అతి పెద్దదైన నక్షత్రం వరకూ మరణము సహజము. మన శరీరంలో వేలకొద్దీ కణాలు ప్రతి ఘడియ మరణిస్తున్నాయి. బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ "జీవితం యొక్క ప్రతి దశలోనూ మరణిస్తున్నాము" అని చెప్పును. మనము మరణాన్ని తప్పించు కోవాలంటే దేహంతో తాదాత్మ్యము చెందే అవిద్యను తొలగించుకోవాలి.

శ్రీరామకృష్ణ జీవితం ఒక ఆసుపత్రి లాంటిది అంటారు. దేవుడు మనం పాటించే వేర్పాటును తొలగించుకొనడానికి, మనని సంపూర్ణులగా చేయడానికి భూమి మీదకు పంపేడు. మనకి హింస, క్రోధం ఎదురైతే, స్థిరంగా, క్షేమంగా ఉండి మన స్థితిని ఉన్నతం చేసికోవాలి. కానీ కొంతమంది తిరగబడతారు. వారు ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది. మనం ఈ విధంగా అనుభవించిన తరువాత, తిరుగుబాటు దుఃఖానికి దారి తీస్తుందని తెలిసికొ౦టాము.

బుద్ధుడు 4 సూత్రాలు చెప్పేడు.

  • మొదటిది: మనమందరమూ వ్యాధిగ్రస్తులం.
  • రెండవది: వ్యాధికి కారణం మన కోరికలు, బంధాలు. అది ప్రపంచంలోని అందరికీ వర్తిస్తుంది
  • మూడవది: మనం కోరికలు, బంధాల నుండి విముక్తులము కావాలి
  • నాల్గవది: దానికి చికిత్స ఈ 8 మార్గాలు (ఆర్య అష్టాంగ మార్గ)
    1. సుజ్ఞానము
    2. ఉన్నతమైన లక్ష్యం
    3. మంచి వాక్కు
    4. మంచి నడవడిక
    5. మంచి క్రియ
    6. తగినంత ప్రయత్నం
    7. ఏకాగ్రత
    8. ధ్యానం
మనమ౦దరమూ వీటిని ఇళ్లలోనే పాటించవచ్చు. ధ్యానం చేస్తూ, కోర్కెలను జయించి , మన చుట్టూ ఉన్నవారి మేలుకై పాటుపడుతూ ఉండడమే సరైన చికిత్స. 295

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...