Sunday, April 10, 2022

Eknath Gita Chapter 12 Section 8

Bhagavat Gita

12.8

అభ్యాసే అప్యసమర్ధో అసి మత్కర్మపరమోభవ {12.10}

మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్న్యసి

అభ్యాసయోగము నాచరించుట కూడా నీవు అసమర్థుడ వైనచో నా నిమిత్తమైన కర్మయందు నిరతుడవు కమ్ము. నా కొరకు కర్మ లాచరించినను నీవు సిద్ధిని పొందగలవు ఀ

మనము వేరొకరి సంతోషం కోరి వారిని మనస్సులో పెట్టుకొని ఏ పనైనా చెయ్యాలి. ఒక తల్లి, కొడుకుల అనుబంధంలో, లేదా అన్న, చెల్లెలి అనుబంధంలో ఇలా చేయడం తేలిక. కాని ఇతరులను మనకంటే ఎక్కువగా చూసుకోవడం కష్టం. ఎందుకనగా మన౦ మన సంస్కారాలు వలన మలచబడ్డా౦.

సంస్కారమంటే మన వ్యక్తిత్వంలో ఎప్పటికీ మార్పు లేకుండా, యాంత్రికంగా జరిగే స్పందన. అది ఒక ప్రక్రియ: ఒకే ఆలోచన వేల సార్లు కలిగి, ఆ ఆలోచనతో వాక్కు ప్రభావితమై, తద్వారా క్రియను ఆచరించడం. ఒక కోపిష్టికి కోపం రావడం సహజం. వానిని ఏ విధంగా పలకరించినా వానికి కోపం కలుగుతుంది. అది వాని సంస్కారం. వాని ఆలోచనలు కోపంతో కూడినవై, మాటలు నిర్దయతో కూడినవై, నడవడిక దురుసుగా ఉండి, చివరకు కోపిష్టి అయ్యాడు.

వ్యక్తిత్వమనగా సంస్కారాల పోగు. అనగా మనము మన సంస్కారాలతో చేయబడ్డాము. మనమేమి ఆలోచిస్తామో, మాట్లాడుతామో, చేస్తామో మన సంస్కారాలు నిర్ణయిస్తాయని తలచవచ్చు. అంటే మనము స్వతంత్రులము కాము. కానీ వ్యక్తిత్వము మార్పు చెందనిది కాదు ఎందుకంటే అది కూడా ఒక ప్రక్రియే. మనమెల్లప్పుడూ ఒకేలాగ ఉన్నామని అనుకోవచ్చు. నిజానికి మన శరీరంలోని కణాలు మారుతున్నట్టే మన వ్యక్తిత్వం కూడా మారుతోంది.

సంస్కారాల వలన మన స్పందన ఎప్పుడూ ఒకేలాగ ఉంటుంది. కానీ ధ్యానంతో దానిలో మార్పు చేయవచ్చు. అనగా ఎప్పుడూ ఒకే ఆలోచన, మాట, క్రియ తో కూడిన సంస్కారాన్ని దానికి విరుద్ధమైన ఆలోచన, మాట, క్రియలతో మార్చవచ్చు.

ఒక యోగికి ఒకరిపై కోపం కలిగితే, దానిని దయగా మారుస్తాడు. దయ ఒకరిపైనే కాదు, తన యందు కూడా. ఎందుకంటే ఒక కుసంస్కారము కోపంగా వ్యవహరించమంటే, దానిని దయతో సుసంస్కారంగా మార్పుచేసున్నాము.

ఒక కుసంస్కారము తలెత్తితే, మనము స్పందించకుండా ఉండాలి. అది ఏమి చెయ్యాలో నిర్దేశిస్తే, కాదు అని చెప్పాలి. మంత్ర జపం ఇక్కడ పనికి వస్తుంది. లేదా బయట షికారుకు వెళ్ళవచ్చు. లేదా ఒక లక్ష్యంతో, పరోపకారానికైతే మరీ మంచిది, పని చేయవచ్చు. మనమెప్పుడైతే సావధానతను కుసంస్కారమునుండి మంత్రానికి లేదా పరోపకార కర్మవైపు మళ్లించేమో, దాని ప్రభావం తగ్గి, మనకు దానినెదిరించే పట్టుదల కలుగుతుంది.

కుసంస్కారాలు ఇలా ప్రభావితం చేస్తాయి: మొదట మననుండి వచ్చే స్పందన తెలిసీ తెలియకో దుష్ఫలితాలకు దారి తీస్తుంది. రెండవది మన ఏకాగ్రత క్షీణిస్తుంది. దాని వలన పనులలో జాప్యం కలిగి ఇబ్బంది పడవచ్చు. ధ్యానంలో మనస్సు పరిపరి విధాల పోతుంది. చివరకు ధ్యానం చేస్తూ నిద్ర పోవచ్చు.

అలా జరిగితే అప్రమత్తంగా ఉండాలి. కుసంస్కారాలను దూరం చేసికోవాలంటే ధ్యానం, మంత్ర జపం, ఏకాగ్రతతో కర్మలు చేయడం వంటి మంచి అలవాట్లను నేర్చుకోవాలి. అలాగే తీవ్రంగా మనగురించే ఆలోచించడం వలన ఒక కుసంస్కారాన్ని ఆహ్వానిస్తున్నట్టే. 370

Eknath Gita Chapter 12 Section 7

Bhagavat Gita

12.7

అథ చిత్తం సమాధాతు౦ న శక్నోషి మయి స్థిరం {12.9}

అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ

అర్జునా! ఇంకను నీ మనస్సును నా యందు స్థిరముగ నిలుపుటకు అశక్తుడవైనచో అభ్యాసయోగముచే నన్ను పొందుటకు యత్నించుము

అభ్యాసము కూసువిద్య అన్నారు పెద్దలు. ధ్యానం అభ్యాసంవలననే అలవడుతుంది. మొదట్లో మనస్సు పరిపరి విధాలా పోతుంది. అలాగే మనలోని క్రోధం, భయం మొదలైన దుర్గుణాలు మనస్సును తప్పు ద్రోవ పట్టిస్తాయి. వాటికి కారణం మన అహంకారం.

ఇలాటి సమయాలలో మంత్రజపం తప్ప వేరే మార్గం లేదు. మంత్రం ఆలోచనకి, సావధానతకి మధ్యనున్న బంధాన్ని తెంపుతుంది. ఆలోచనలు పలు రకాలుగా ఉండచ్చు. కానీ వాటిని పరిశీలించేది మన సావధానత. మనమెప్పుడైతే ఒక ఆలోచన మీద శ్రద్ధ చూపమో అది మననేమి చేయలేదు.

సావధానత ఒక దీపస్తంభం లాంటిది. సాధారణంగా అది అన్ని వైపులా తిరగగలదు. మన సావధానత తరచు భగ్నమైతే, ఆ దీపస్తంభం ఒక చోట ఆగిపోయింది. ఎన్నో ఏళ్లు గడిస్తే అది ఇక తిరగలేదు. అలాటప్పుడు ధ్యానం ద్వారా ఒక చోట చిక్కుకుపోయిన శ్రద్ధను విడిపించుకోవాలి.

అది ఎలాగంటే, మనకిష్టంలేని పనులు ఆనందంగా స్వీకరించాలి. ఏపని చేసినా శ్రద్ధతో చెయ్యాలి. అవసరమైనప్పుడు ఒక పనిని వదిలి పెట్టి, వేరొక పనికి మారాలి. ఉదాహరణకి ఆఫీస్ పని ఇంట్లో చెయ్యకూడదు. కొన్నిపనులు చేయడానికి పూర్తి శ్రద్ధ అక్కరలేదు. అలాటప్పుడు మంత్రం జపించాలి.

మన సావధానతను మనకు కావలసినట్టుగా మలచుకొంటే, మనమే పనీ నిర్బంధంతో చేయము. దీని వలన పూర్తి స్వేచ్చ కలుగుతుంది. సమస్య ఎంత తీవ్రమైనదైనా, అనుభవం ఎంత బాధాకరమైనా, వాంఛ ఎంత గాఢమైనా, రమారమి ఒక గంట ధ్యానం చేస్తే మనస్సు మీద ఒత్తిడి తగ్గి తేలిక అవుతుంది. ఇది స్వేచ్ఛకు మొదటి అడుగు. ఇంకా చేతికి సంకెళ్ళు ఉండవచ్చు. కానీ మీ అనుభవంతో కష్టపడి, ఎంతకాలమైనా ధ్యానాభ్యాసన చేసి ఆ సంకెళ్ళను విడిపించుకోవచ్చు. 363

Eknath Gita Chapter 12 Section 6

Bhagavat Gita

12.6

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ {12.8}

నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వ౦ న సంశయః

నీ మనస్సును నా యందు నిలుపుము. నీ బుద్ధిని నాయందు ప్రవేశపెట్టుము. ఆ తరువాత నీవు నా యందే వసి౦తువు. ఇందులో సంశయము లేదు

ఒక క్రీడాకారుడు ఎంతో ఆలోచించకుండా యాంత్రికంగా తన క్రీడను ఆడవచ్చు. ఆధ్యాత్మిక సాధనలో అలాగే మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనలో ఆవేదన అహంకారం వలన కలుగుతుంది. అది నిశ్చలంగా ఉంటే మనచే ఏ పనీ బలవంతంగా చేయబడదు. అలాగే మన అనుబంధాలకు అవరోధాలుండవు.

మన మాటే నెగ్గాలి, అంతా మన ఇష్టమే అనే భావనలు ఉంటే అవి మన అనుబంధాలకు అడ్డు వచ్చి ఇతరులపై ప్రేమ కలుగజేయవు. ఆ భావనలను ఎంత తగ్గించుకుంటే మన నుండి మనము అంత ఎక్కువగా వైరాగ్యము చెందుతాము. అట్టి వైరాగ్యము లేకపోతే ఇతరులయందు అసూయ, క్రోధము మొదలగు అవలక్షణాలు కలుగుతాయి.

మన మనస్సు మనకు కావాలసినట్టు జరిగితే ఉవ్విళ్ళూరుతుంది. అలా కాకపోతే క్రుంగిపోతుంది. మనకు స్వీయ వైరాగ్యం కలిగితే మనస్సులోని చలనం తగ్గుతుంది. అప్పుడు మనము జీవైక్యముతో ఉంటాము. దాని సహజ లక్షణం ఒక వ్యక్తి యందే కాక, అన్ని జీవులమీద ప్రేమ ఉండడం. ప్రేమించడానికి ఏదో గొప్ప వస్తువు అవసరం లేదు. మనమెప్పుడైతే మనమనుకున్నట్టు జరగాలనే పట్టుదలను వీడుతామో, మన వ్యక్తిత్వంలో మిగిలి ఉండేది ప్రేమ.

మన మనస్సు పరమాత్మ మీద కేంద్రీకరించాలంటే మనము అహంకారాన్ని విడనాడాలి. అంటే మీ గురించే ఎక్కువ ఆలోచించ కండి. మీకు గతంలో కలిగిన అవమానాలను గూర్చి గాని, మీయందు దుష్ప్రవర్తనను చూపినవారి గురించి గాని ఆలోచించవద్దు. కొందరికి ఊహాతీత భావనలు కలగవచ్చు. ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడు వారికి ఫోన్ చేసి మాట్లాడుతారనే భ్రాంతి. ఇలా ఉంటే మన మనస్సును అహంకారం మీద కేంద్రీకరించా౦. అదే జరిగితే మంత్రోచ్చరణ తప్ప వేరే మార్గం లేదు.

కొందరి ఆలోచనా సరళిని విశ్లేషిస్తే ముఖ్యంగా తేలేది "నాకిది నచ్చదు" అనే భావన. వారికి ఒకరి ప్రవర్తన నచ్చకపోవచ్చు. అలాగే భార్య వండిన వంట నచ్చక పోవచ్చు. "నువ్వు నాకు నచ్చలేదు" అని చెప్పిన తరువాత, అది తప్పా, ఒప్పా అని ఆలోచించవద్దు. మంత్రోచ్ఛారణ చేయడమే ఉత్తమం.

గోఫర్ అనే ఉడుత భూమి ఉపరితలం క్రింద బొరియలు త్రవ్వుకొని వాటిలో నివసిసస్తుంది. గోఫర్ ల చర్యలు పరిశీలిస్తే ఆకలి వేసినప్పుడు బొరియల వెలుపకు వస్తాయి. తిరిగి లోపలకు పోతాయి. నా ఇంటి వెనకాల ఉండే గోఫర్ లకు నేనంటే భయం లేదు. నేనున్నప్పడు వాటి సహజ చర్యలు చేసికుంటూ పోతాయి. అదే నా పిల్లి వస్తే అవి భయపడి బొరియల లోకి పారి పోతాయి.

మన మంత్రము ఒక పిల్లి లాగ ఉండి, స్వార్థ పూరిత ఆలోచనలనే గోఫర్ లను అణచివేస్తుంది. మంత్రం లేకపోతే దురాలోచనలు గోఫర్ లవలె మన మనస్సుని పూర్తిగా ఆధీనంలో పెట్టుకొంటాయి. క్రమంగా ఒక దురాలోచన కలిగినప్పుడు, మంత్రం వెంటనే మనస్సులో తళుక్కుమంటుంది. ఈ విధంగా స్వార్థ పూరితమైన ఆలోచనలు లేదా దురాలోచనలు నియంత్రింప బడతాయి.

మనస్సు నిశ్చలంగా ఉంటే సరిపోదు. బుద్ధి కూడా దానికనుగుణంగా ఉండాలి. బుద్ధి యొక్క కార్యం: "నేను ఇది చేస్తే దాని పర్యావసానమేమిటి? నేను ఇది చేయకపోతే ఏమవుతుంది?" అనే ప్రశ్నలకి సమాధానాలు వెదకడం. బుద్ధి పనిచేయాలంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే బుద్ధి పనిచేసే బదులు మనస్సు పనిచేసి "నాకిది నచ్చింది" లేదా "నాకది నచ్చలేదు" అని ఇష్టానుసారంగా పని చేస్తుంది. శ్రీకృష్ణుడు "బుద్ధి నాయందు ఉంచు" అని చెప్పడానికి కారణం: జీవితాన్ని అహంకారంతో గడపవద్దు. ఆత్మతో అనుసంధానము చెయ్యి. అనగా నీ మనస్సులో కలిగే ఇష్టాయిష్టాలతో విషయాలను విచారించ వద్దు.

కొందరు "ఆత్మ ఏ దృక్పథంతో ఉంటుంది?" అని అడుగుతారు. అది మనకు కనబడదు. అది ఎక్కడుందో మనకు తెలియదు. ఆత్మ యొక్క దృక్పథం తెలిసికోవాలంటే మనము ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు "దీని వలన ఎవరికి లాభం?" అని ప్రశ్నించుకోవాలి. మన అహంకారం "ఇది పరుల గురించి చేయబడుతున్నది" అని చెప్పి మననని సంతృప్తి పరచవచ్చు. కానీ అక్కడితో ఆగికపోక బుద్ధిని ఉపయోగించి నిర్ధారణ చేసికోవాలి. చివరకు "దీని వలన ఎవ్వరికీ ఎటువంటి లాభమూ లేదు" అని కూడా తీర్మానించవచ్చు.

అలాగని మన స్వార్థాన్ని పూర్తిగా చంపుకోనక్కరలేదు. తక్కిన వాళ్ళ గురించి తీవ్రంగా ఆలోచి౦చి క్రియలు చేస్తే, వాటిలో మన కోర్కెలు కూడా కలసి వస్తాయి.

రెండవ అంశం, మనము ఆలోచన దీర్ఘంగా చెయ్యాలి. అంటే అహంకారాన్ని వీడి ఆత్మతో అనుసంధానం చేసి, పది మందికీ ఉపయోగపడే కార్యాలు చెయ్యాలి. ఎందుకంటే ఆత్మకి వైరాగ్యం సహజం. ఇది అహంకారానికి పూర్తిగా వ్యతిరేకం.

మనము వస్తువులు చూపే ఆశలు, చివరకు ఇచ్చే సుఖములలోని తారతమ్యం తెలిసికోవాలి. ఉదాహరణకు ఒక రసగుల్లా తింటే పది నిమిషాల పాటు దాని తీపిని ఆస్వాదీస్తాం. కాని అదేపనిగా రసగుల్లాలు తింటూ ఉంటే అనేక రోగాలు వస్తాయి. అది వెంటనే కాకపోవచ్చు. కాని దాని పర్యావసానము జీవితంలో ఎప్పుడోఒకప్పుడు ఉంటుంది.

మూడవ అంశం, శ్రీకృష్ణుడు మత్పరాః -- అంటే నన్నే లక్ష్యంగా పెట్టుకో -- అంటాడు. మనమేదైనా కార్యం చేసేముందు "ఇది నా ధ్యానాన్ని, ఏకాగ్రతను, నిస్వార్థాన్ని మెరుగుపరుస్తుందా?" అని అడగగలగాలి. అవును అంటేనే అది చెయ్యాలి. ఒకదాని వలన ఏకాగ్రత చెడి, ఇతరులనుండి ఎడంగా ఉంచబడి, అతి చలనం కలిగి, పాత జ్ఞాపకాలు, కోరికలతో ఉద్రేకం కలగవచ్చు. అటువంటి దానిని విడనాడాలి. కఠోపనిషత్తు ఇలా చెప్పును: "ఏది ఆనందదాయకమో ఒకటి; ఏది జ్ఞానముతో కూడినదో వేరొకటి. మొదటి దానివలన దుఃఖం కలుగక మానదు. రెండవది, ఆరంభంలో క్లేశాన్ని కలిగించినా, శాశ్వత సుఖం ఇస్తుంది. "

ఇంకా ఒకే అంశం మీద తీవ్ర కృషి చెయ్యనక్కరలేదు. అలా చేస్తే రాగద్వేషాలు కలుగుతాయి. వైరాగ్యం రాదు. దాని వలన సమిష్ఠి నుండి విడబడతాము. ఒక గొప్ప లక్ష్యం ఉంటే తప్ప దీనిని అర్థంచేసికోవడం కష్టం.

కొందరు మరాథాన్ లలో పరిగెడతారు. దానికి చాలా శిక్షణ పొందుతారు. వారికి అదొక వ్యాపకం. అది ఒక వ్యాయామం అనడంలో నిజముంది. కానీ దాన్నే అతిగా చేస్తే ధ్యానం కుంటుబడుతుంది, శారీరక సమస్యలు -- కీళ్ల నొప్పులు మొదలగునవి- రావచ్చు.

మెహర్ బాబా "గట్టి ప్రయత్నం చెయ్యి. విచారించ వద్దు. ఆనందంగా ఉండు" అని చెప్పేరు. విచారం మనము స్వీయ వైరాగ్యం పొందకపోవడం వలన కలిగేది. ఉదాహరణకి "నేనిది చెయ్యగలనా? ఫలానా వాడు నేను అనుకున్నట్టు చెయ్యగలడా?" అనే ప్రశ్నలతో సతమతమవ్వడం. మనమెప్పుడైతే ధ్యానంలో గట్టి ప్రయత్నం చేస్తామో, మనకు విచారించడానికి సమయం దొరకదు. అప్పుడు మన సర్వస్వం పరమాత్మ మీద భారం వేసి ఉంటాం.

ఈ అంశాలన్నీ మన అనుబంధాలకు అన్వయం చేసికోవాలి. సాధారణంగా భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండవు. కానీ కొందరు వివాహ బంధాన్ని ఒక ఒప్పందంగా చేసికొంటారు. "నాకు ఎంత ఇస్తావో, నీకు అంతే ఇస్తాను" అనే బేరాలకు అనుబంధాలలో తావు లేదు.

వేకువలోనే కాకుండా, సర్వ వేళ సర్వావస్థల యందు, మనస్సు నిశ్చలంగా ఉంటే శ్రీకృష్ణుడు "అనుమానం లేకుండా నువ్వు నాలోనే సదా నివసిస్తావు" అని అంటాడు. ఎందుకంటే మన భక్తి ఉండి-పోయేది కాదు. మనమెక్కడికి వెళ్ళినా ధ్యానం చేసుకొంటూ చలిస్తాము. లారెన్స్ అనే యోగి ఇలా వ్రాసేరు:

నాకు వ్యాపారం చేసే సమయానికి, ధ్యానం చేసే సమయానికి తేడా లేదు. వంటగదిలో పలువురు గుమిగూడి శబ్దాలు చేస్తున్నా, నేను క్షోభలేని స్థితిలో దేవుని పాదాలముందు మోకాళ్ళ మీద నుండి ధ్యానం చేస్తున్నట్టు ఉంటాను

ఇంకోవిధంగా చెప్పాలంటే ప్రేమ అనబడే సరస్సు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ప్రేమ మనకి సహజంగా కలుగుతుంది. ద్వేషం రమ్మన్నా రాదు. మనము వేరొకరితో ఎలా స్పందించాలో అని ఆలోచించనక్కరలేదు. మనము ఇతరుల మంచి గురించే సదా మెలగుతాము. అనుబంధాలలో స్పర్థలు, అనుమానాలు, క్రోధం మొదలగు దుర్లక్షణాలు ఉండవు. ఇతరులను ప్రేమించడం, నమ్మడం, క్షమించడం సహజంగా జరుగుతాయి. సెయింట్ బెర్నార్డ్ "ప్రేమకి తనకంటే వేరే కారణం లేదు; దానికి ఫలాపేక్ష కూడా లేదు. అదే దాని ఫలం. నేను ప్రేమించేది ప్రేమ కోసమే. నేను ప్రేమించేది ఇంకా ఎక్కువ ప్రేమించడానికి" అని చెప్పిరి. 357

Eknath Gita Chapter 12 Section 5

Bhagavat Gita

12.5

యే తు సర్వాణి కర్మాణి మయి నన్న్యస్య మత్పరాః {12.6}

అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్ {12.7}

భవామి న చిరాత్పార్థ మయ్యావేశిత చేతసామ్

అర్జునా! సర్వకర్మములను నా యందే సమర్పించి, నేనే పరమగతి యని భావించి, అనన్య యోగముచే నన్నే ధ్యానించుచు సేవించుచుందురో, నా యందు చిత్తముంచిన అట్టివారలను జనన మరణ సంసార సాగరమునుండి అతి శీఘ్రకాలములోనే నే నుద్ధరి౦తును ఀ

మనం ఒకచేత్తో పరమపదాన్ని పట్టుకోదలచుతాము, రెండవ చేతితో మన వస్తువులను పట్టుకుంటాము. పరమపదం కావాలంటే వస్తువులను జార విడవాలి. దానికై శ్రీకృష్ణుడు ఇలా చెప్పుచున్నాడు: మత్పరః -- అనగా నన్నే నీ లక్ష్యంగా పెట్టుకో. ఏదీ మన ఆనందానికి లేదా ఇతరుల సంతోషానికి కాక దేవునికై, మనలోను, ఇతరులలోను ఉన్న పరమాత్మకై చెయ్యాలి.

ఇంకా శ్రీకృష్ణుడు సర్వ కర్మాణి అన్నాడు. అంటే మనం చేసే ప్రతి కర్మ దైవార్పణ చెయ్యాలి. ఇందులో వెసులుబాటు లేదు. మనమిది చేతన మనస్సు ఉపరితలంలో కాక, స్వార్థ పూరిత కోర్కెలతో నిండి ఉాన్న లోతుకు వెళ్తేనే సాధ్యం. దీనికి ధ్యానం ఒక్కటే సరిపోదు. ఒకమారు చేతన మనస్సు ఉపరితలం దాటితే ముందుకీ, వెనక్కీ వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక చేత్తో మనది అనుకునే వస్తువు౦ది. దాన్ని మనం వదలక పోతే మనము ముందుకు సాగలేము.

ఆగస్టీన్ అనే వ్యక్తి కన్ఫెషన్స్ లో ఇలా వ్రాసేరు:

నేను ఇతరులవలన కాక, నా అహంకారంచే బంధింపబడ్డాను. నా కోర్కెలు ఒక గొలుసులా ఉండి, అది నా శత్రువు చేతిలో ఉంది. ఒక బలమైన స్వార్థపూరితమైన కోరిక, అలవాటుగా మారుతుంది. దానిని నివారించక పోతే అది నిర్భంధ౦గా మారుతుంది. ఈ విధంగా నేను బానిస నయ్యాను. నాలో ఉదయించిన క్రొత్త పట్టుదల, పాత పట్టును అతిక్రమించ లేక పోతున్నది. ఈ విధంగా క్రొత్తదైన ఆధ్యాత్మికత, భౌతికమైన పాత పట్టుదలల మధ్య పోరుసాగుతోంది. దాని వలన నా ఆత్మ ప్రభావితమౌతోంది.

ఆయన ఇంకా ఇలా వ్రాసేడు:

నేను రెండు వర్గాలలోనూ ఉన్నాను. ఒకటి నేను సమ్మతించినది. మరొకటి నేను ఇష్టపడనిది. ఇప్పుడు నా పరిస్థితి ఇష్టం లేకున్నా కోరికలను తీర్చుకొని, నేను సమ్మతించిన దాని వైపు వెళ్ళలేకున్నాను. అంటే నేనే రెండు వర్గాలలోనూ ఉన్నాను: నేను పూర్తిగా సమ్మతించినది మరియు పూర్తిగా ఇష్టపడలేనిది. ఇలా జీవిత పయనం సాగిస్తున్నాను

ఇది రెండు ఆత్మల మధ్య పోరాటం కాదు. ఒకే ఆత్మ కొంతసేపు మొదటి వర్గంలో ఉంటుంది, మరి కొంతసేపు రెండవ వర్గంలో ఉంటుంది. ఇప్పుడు విజయం కావాలంటే నిస్వార్థంగా కర్మ జేయగలిగే వర్గంలో ఉండాలి. అంటే చీకటినుండి కాంతివైపు ప్రయాణించాలి.

అలా చేయాలంటే చాలా కష్టం. చాలా కాలం మనకి దేన్ని ఎన్నుకోవాలో తెలియదు. మనం దేన్ని పట్టుకోవాలో తెలియదు. అది పండిపోయిన యోగులకూ కష్టసాధ్యమే. అగస్టీన్ చెప్పేది అది మంచి కలలోంచి మెలకువ తెచ్చుకొన్నట్టు; కానీ కళ్ళు విప్పడం ఇష్టంలేదు. మన కలలను పరిశీలిస్తే, అచేతన మనస్సులో స్వేచ్చ లేదని, కలలు మనని నిర్భంధిస్తాయని తెలుసుకొంటాం. అగస్టీన్ వేకువలో కూడా అలాగే ఉంటామని చెప్పేరు.

నాకు నా తుచ్చ కోర్కెలు తీర్చుకోవడం కన్నా దైవార్పణ౦ కావడమే మంచిదని తెలుసు. కానీ నా కోరికలు నన్ను బంధీగా చేసేయి. "లే, బద్దకస్తుడా, మరణం నుంచి లేచి, నేను ఇచ్చే వెలుగుని చూడు" అనే దేవునికి సమాధానం ఇవ్వలేకపోతున్నాను.

కానీ మనం గాఢ నిద్రలో, అచేతన మనస్సుతో తాదాత్మ్యం చెంది ఉన్నప్పుడు మెలకువ తెచ్చుకోవడం ఎలా సాధ్యం? ఇక్కడ జ్ఞానం ఒకటే సరిపోదు. మనకు కావలసినది ఇంద్రియాలను జయించి, మనం గాఢంగా కోరుకొనే దాన్ని పరిత్యజించడం. ఇదే దేవుని అవతారాల్లోని పరమార్థం.

ఒక ఫ్రెంచ్ యోగి బ్లైస్ పాస్కల్ ఇలా వ్రాసెను:

దేవుడా నన్ను అనాధను చేస్తావా ? నువ్వు వచ్చి నా మనస్సుని ఆనందంతో నింపి మాయమయ్యేవు. ఇది క్రూరత్వం కాదా? మనమెప్పటికీ ఇలా వేరేగా ఉంటామా? నాకు నీతో కలసి ఉండడం అంటే ఏమిటో తెలిసింది. అందువలన నీకంటే వేరుగా ఉండడం బాధగా ఉంది. ఈ ఆనందాన్ని ఎలా శాశ్వతంగా ఉంచుకునేది?

అటు తరువాత తన ప్రశ్నలకి తనే సమాధానం ఇచ్చుకొ౦టారు:

మనం దేవుని పొందాలంటే మనవి అనుకొన్న వస్తువులను, బంధాలను ఆనందంగా వదులుకోవాలి. దానిలో కొంత బాధ లేక పోలేదు. కానీ మనం పొందే ప్రేమకై వాటిని పరిత్యజించాలి.

ఒక సూఫీ "హృదయం పోయిన దాని గురించి ఏడుస్తూ ఉంటే, ఆత్మ పొందిన దాని గురించి సంతసిస్తుంది" అని చెప్పెను.

నేను పుట్టుకతోనే శ్రీకృష్ణుని పై ప్రేమతో పుట్టలేదు. అది నా స్వార్థ పూరిత కోరికలను శ్రీకృష్ణుని వైపు ప్రేమగా మళ్లించి అలవరుచుకున్నాను. అగాస్టీన్ "గొప్ప యోగులు చేసినది మనమెందుకు చేయలేము? వారు దేవుని సహాయం లేకుండానే చేయగలిగేరా? దేవుని నమ్మాలి. భయమును వీడాలి. ఆయన మననెన్నటికీ విడిచిపెట్టడు" అని చెప్పేరు.

ఇది ఒక మూఢ భక్తి కాదు. శ్రీ రామకృష్ణ, ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి, తెరెసా ఆఫ్ ఆవిలా వంటి గొప్పవారు తమ ఇష్ట దైవం అన్నిటికన్నా సత్యమని నమ్మేరు. భౌతిక ప్రపంచం సదా మార్పు చెందేది. యోగులు చెప్పేది: ఏదైతే మార్పు చెందదో అదే సత్యం. దేహం పడిపోతుంది. సృష్టి అంతమౌతుంది. కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది.

మనము ప్రపంచ సుఖాలలోంచి విముక్తి చెందనంతకాలం బాధలు పడవలసిందే. యవ్వనంలో వెసులుబాటు ఉంటుంది. ఒక సుఖాన్నిచ్చేదానివలన నిజంగా సుఖం వచ్చిందా అని అడిగి తెలిసికొనే వయస్సది. కానీ వృద్ధాప్యంలోకి వెళితే, పూర్తిగా జ్ఞానం లేకపోతే, జీవితం వస్తువులను, బంధాలను విడిచిపెట్టవచ్చా అని అడగదు. మననుంచి వాటిని లాక్కుపోతుంది.

నా అమ్మమ్మ ఇలా చెప్పేది: "నీకు ఆత్మ గౌరవం లేదా? నువ్వు ఆనందంగా ఇవ్వగలదానిని, ఒకరు బలవంతంగా లాక్కుని ఎందుకు తీసికోవాలి? జీవితాన్ని నిన్నొక మూలకి తోసి, నీది అనేదాన్ని లాక్కుపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. నీవు బలంగా ఉన్నప్పుడే వాటిని త్యజించి పూర్తి స్వేచ్ఛను అనుభవించు". సాధన మార్గంలో మన స్వార్థాననికై ఏది ఉంచుకోక క్రమంగా ఇష్టమైనవి వదిలి పెడతాం. అలాగ చేస్తే మనము ఎవరి మీదా ఆధారపడనక్కరలేని స్థితి వస్తుంది. బలవంతంగా ఒకరు లాక్కొంటే బాధ కలుగుతుంది. కానీ మనం ప్రేమించే వారలకై వదిలేస్తే దానిలో బాధ లేదు.

మన మనస్సులో దేవునితో సంపూర్ణమైన ఐక్యం పొందితే, మన మారే ప్రపంచం నుండి, మరణం నుండి, విడుదల చేయబడతాం. అదే శాశ్వతం, కైవల్యం, నిర్వాణం, మోక్షం. 350

Eknath Gita Chapter 12 Section 4

Bhagavat Gita

12.4

క్లేశో అధికతరస్తేషా౦ అవ్యక్తాసక్త చేతసా౦ {12.5}

అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భి రవాస్యతే

అక్షరపరబ్రహ్మ చింతనము బహు కష్టసాధ్యము. దేహాభిమానులచే అవ్యక్తోపాసన అతి కష్టముగ పొందబడుచున్నది ఀ

కొన్ని శతాబ్దాల క్రిందట ఒక యోగి "ఎవరి ఇంద్రియాలైతే స్వాధీనంలో ఉంటాయో వారికి మాత్రమే జ్ఞాన యోగ మార్గం తేలిక" అని చెప్పెను. అంటే ఇంద్రియాలు మన ఆధీనంలో లేకపోతే జ్ఞాన యోగం పనికిరాదు. మనకు ఇంద్రియ నిగ్రహం చాలా కష్టంతో కూడిన పని. కాబట్టి జ్ఞాన యోగం ఆది శంకరులు, మైస్టర్ ఎక్హార్ట్, ఆనందమయిమా వంటి వారికే సాధ్యం. ఇది జ్ఞాన యోగ౦పై విమర్శ కాదు. ఇది మనలో ఇంద్రియ నిగ్రహం లేక పోవడమనే బలహీనత వలన. మనము ఎంత ఇంద్రియాలకు లోబడి ఉంటే అంత ఎడంగా ఉంటాము. అలాగే అనిశ్చిత, నిరాశ, అసూయ మొదలగునవి కలుగుతాయి. ఈ సమస్యలను అధిగమించవచ్చు. కాని అది భౌతికంగా కాదు. ధ్యానంలో చేతన మనస్సును విశ్లేషించ తద్వారా పరిష్కారం పొందవచ్చు.

అబ్రహం మాస్లో "మన దగ్గర సుత్తి తప్ప వేరే పనిముట్టు లేకపోతే, మనకి ప్రతి సమస్య మేకులా కనిపిస్తుంది" అని చెప్పెను. మనమిలాగే సమస్యలను భౌతిక పరంగా పరిష్కరించాలని చూస్తాం. అది మంచిది కాదు. ఎందుకంటే సమస్య ఉన్నది మన చేతన మనస్సులో.

శాస్త్రజ్ఞులు దేహాన్ని ఒక రసాయనిక సముదాయంగా వివరిస్తారు. అనగా కొన్ని రసాయనాలను మందుల ద్వారా శరీరంలోకి పంపితే అవి చేతన మనస్సును కావలసినట్టుగా మార్చుతాయి అని చెప్తారు. ఇది చాలా పెద్ద ప్రక్రియ. అంతరిక్షంలో కోట్ల కొలది నక్షత్రాలు ఎలా ఉన్నాయో, మన శరీరంలో కూడా కొన్ని కోట్ల జీవ కణాలు ఉన్నాయి. మన శరీర కణాలను నియంత్రించేది నాడీ వ్యవస్థ. అందులో శాస్త్రజ్ఞులు కనుక్కొన్న కొన్ని రసాయనాలు: సెరటోనిన్ , డోపమిన్, వగైరా. వారు చెప్పేది మన వ్యక్తిత్వం ఆ రసాయనాల పాళ్ళను మార్చి తగిన రీతి వ్యక్తం చెయ్యవచ్చని. కానీ మన నాడీ వ్యవస్థను నియంత్రించేది మెదడు. తనంతట తాను మెదడు చేతనము కాదు. అది చేతన మనస్సుకు ఆధారం మాత్రమే. కాబట్టి రసాయనాలవలన మనస్సులో మార్పులు వస్తాయి అన్నది పూర్తిగా నిజం కాదు.

అలాగే అతిగా తినేవారి అలవాట్లను మార్చటానికి వైద్యులు అనేక చికిత్సలు చేస్తారు. అవి రసాయనాల ప్రయోగం కావచ్చు లేదా శస్త్ర చికిత్స కావచ్చు. కానీ ధ్యానం అవలంబిస్తే ఈ సమస్యను అతి తేలికగా అధిగమించవచ్చు.

కొందరు వైద్యులు ఎక్కువ అల్లరి చేసే పిల్లలకు మందులు ఇస్తారు. ఇది పూర్తిగా వ్యర్థం. దానివలన వారి అల్లరి తగ్గవచ్చేమో గాని, వారి సృజనాత్మక శక్తి క్షీణిస్తుంది. వారి ప్రాణ శక్తిని ధ్యానం ద్వారా మంచి కార్యాలకు -- అనగా చదువు, క్రీడలు మొదలగునవి--మళ్లించవచ్చు. మందుల వలన తల మందమయ్యి, వారిలోని అసలైన సామర్థ్యం వ్యక్తం కాదు.

వ్యక్తిత్వాన్ని రసాయనాల ద్వారా మార్పు చేసే చికిత్సలు ఒకరి పురోగమనానికి అడ్డుగా ఉంటాయి. అవి భౌతికమైన సమస్యలనే పరిష్కరించగలవు. ముఖ్యంగా మనకు పట్టుదల ఉంటే ఏమైనా సాధించ వచ్చు. రసాయనాలు మన పట్టుదలను సడలించి మన పెరుగుదలను తగ్గించి, ఇతరులపై ప్రేమను అరికట్టి, మనకెటువంటి ఎన్నిక లేకుండా చేస్తాయి. అదే ధ్యానంలో చేతన మనస్సును విశ్లేషిస్తే మన పట్టుదల పెరిగి, మన పురోభివృద్ధికి అనుగుణంగా ఎన్నిక చేసికోవచ్చు 344

Eknath Gita Chapter 12 Section 3

Bhagavat Gita

12.3

యే త్వక్షర మనిర్దేశ్య౦ అవ్యక్తం పర్యుపాసతే {12.3}

సర్వత్రగ మచింత్యంచ కూటస్థ మచలం ధృవమ్

సంనియమ్యే౦ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః {12.4}

తే ప్రాప్నునంతి మామేవ సర్వభూతహితే రతాః

ఎవరయితే ఇంద్రియములను నిగ్రహించి, అంతటను సమబుద్ధి కలిగి, సర్వ ప్రాణులకు మేలు చేయుటయందు పరమాసక్తి గలవారై అక్షరము, అనిర్దేశ్యము, అవ్యక్తమును, సర్వత్రగము, చింతించుటకు వీలు కానిదియు, కూటస్థము, అచలము, ధృవము నైన బ్రహ్మమును ఉపాసించుచున్నారో వారే నన్ను పొందుచున్నారు. ఀ

నిర్గుణ దైవాన్ని ఊహించలేం. కానీ దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తులలో అట్టి దైవాన్ని బ్రహ్మన్ అని అంటారు. ఈ రోజుల్లో గుణములతో కూడిన దైవాన్ని పూజించడం మూఢ నమ్మకం లేదా మేధ యొక్క బలహీనత అని తలిచేవారు చాలా మంది ఉన్నారు. జ్ఞాన యోగం మేధకి సంబంధించినది కాదు. మేధ ద్వంద్వాలని -- ఉదాహరణకు తెలిసికొనేవాడు, తెలిసికోబడేది -- విశ్లేషిస్తుంది. నిర్గుణ దైవాన్ని తెలిసికోవాలంటే ద్వంద్వాలను అధిగమించాలి. అంటే తెలిసికొనేవాడు, తెలిసికొనబడేది ఏకమై ఒకే అఖండమైన బ్రహ్మన్ ఉన్నాడనే జ్ఞానము కలుగుతుంది. దీనినే నిర్వికల్ప సమాధి అని అంటారు. శ్రీ రామకృష్ణ ఉప్పుతో చేయబడిన బొమ్మ దృష్టాంతం ఇచ్చేవారు. ఒక ఉప్పుతో చేయబడ్డ బొమ్మ సముద్రంలో ప్రవేశించిన వెంటనే కరిగిపోతుంది. మరి సముద్రం యొక్క విస్తీర్ణం చెప్పేది ఎవ్వరు?

యోగులు నిర్వికల్ప సమాధిలో అన్ని భేదాలను అధిగమించి బ్రహ్మన్ లో రమిస్తారు. కానీ దాన్ని వివరించేది ఎలాగ అన్న ప్రశ్న మిగిలిపోతుంది. 13 వ శతాబ్ది మైస్టర్ ఎక్ హార్ట్, 8 వ శతాబ్ది ఆది శంకరులు ఈ విషయాన్ని విశ్లేషించారు. 5 వ శతాబ్ధి డై ఓనిసియస్ ది అరియో పెగైట్ ఇలా వ్రాసెను:

తెలిసికొనేవాడు, తెలిసికొనబడేది మధ్య గల భేదాన్ని దాటితే సాధకుడు పేరులేని, రూపంలేని వాస్తవ౦తో ఏకమై పదార్థాల కంటే విలక్షణమైన స్థితి పొందుతాడు. తన మేధను, మనస్సును నిశ్చలం చేసి తెలుసుకోవడానికి అతీతమైన స్థితిలో ఉంటాడు

జ్ఞాన యోగం, కర్మ యోగం, భక్తి, రాజ యోగం మొదలైన మార్గాలు నిజానికి వేర్వేరు కావు. అవి అన్నీ ఒకే ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చే మార్గాలు.

దాన్ని అర్థం చేసికోవడానికి జ్ఞాన మార్గా౦లో వెళ్ళిన వ్యక్తుల జీవిత చరిత్రలను పరిశోధించాలి. ఆది శంకరుడు నిర్గుణ బ్రహ్మన్ ని ఏకం అద్వితీయం -- అనగా రెండవది లేదు--అని తన స్వీయానుభవంతో వర్ణించేరు. ఆయన అద్వైతాన్ని స్థాపించినా శివుడు, పార్వతి మొదలైన సగుణ దేవతలయందు భక్తితో అనేక స్తోత్రాలు వ్రాసేరు. ఉదాహరణకు:

నీవు జగన్మాతవు

నా యందు నీకున్న ప్రేమ గురించి అనుమాన మెందుకు?

ఒకని లెక్కలేనన్ని తప్పులు చేసినా

వాని తల్లి వానిని ఎప్పటికీ విడిచి పెట్టదు

శంకరులు 32 వ ఏట కైవల్యం పొందేరు. అంతకు ముందు ఆయన భారత దేశంలోని శకలాలుగా ఉన్న మతాలను ఏకం చెయ్యడానికై, అనేక మఠాలు స్థాపించుటకై, ఉపనిషత్తులకు భాష్యం వ్రాయడానికై తన సమయాన్ని అర్పించేరు.

శంకరులు అద్వైత ప్రతిపాదనలో నిర్గుణ బ్రహ్మ ఉపాసన గురించి అనేక విధాలుగా వివరించేరు. అది వర్ణింప శక్యము కానిది ఎందుకంటే అది అంతటా ఉంది. దానికి ద్వితీయం లేదు. దానిని భాషతో, ఆలోచనలతో పట్టుకోలేము. అది అక్షరం--అనగా ఎప్పటికీ తరిగి పోయేదికాదు, ఆద్య౦తాలు లేనిది, ఎప్పటికీ నాశము కానిది. అది అనిర్దేశ్య౦ -- దాన్ని చూపలేము; దాన్ని నిర్వచించ లేము; అది బయట, లోపల ఉండేది. అవ్యక్తం -- అనగా వ్యక్తము కానిది, చూడబడనిది ఎందుకంటే చూసేవారు వేరుగా లేరు కనుక. సర్వత్రగం -- అది అన్ని చోట్లా ఉండి, ప్రతిదానికి ఉనికి నిచ్చేది. అచలం-- అనగా మార్పు లేనిది.

ఉపనిషత్తులు "తత్ త్వం అసి" అనగా నీవు దానిగా ఉన్నావు అంటాయి. ఇది మన సహజ స్థితి. ఆత్మ రూపేణ మనమెప్పుడూ పుట్టలేదు, ఎప్పటికీ చనిపోము. నేతి, నేతి ప్రక్రియతో నేను దేహాన్ని కాదు, మనస్సును కాదు అని చెప్పుకుంటూ పోవచ్చు. కానీ దానివలన మన చేతన మనస్సు ఎంతవరకు ప్రభావితమౌతుందో చెప్పలేము. మనకి కోపం, అనుమానం, సందిగ్దం మొదలైన మానవ లక్షణాలు ఎప్పటికీ ఉండేవే. కాబట్టి ఇవి జ్ఞాన సముపార్జనకి ఉపయోగపడవు. కొందరిలో అవి అహంకారాన్ని పెంచి తమపై అనురాగాన్ని పెంచుతాయి.

అలాగే జ్ఞాన యోగానికి సంబంధించిన విషయాలు శ్రీకృష్ణుడు చెప్పిన పై శ్లోకాల్లో ఉన్నాయి. సమ్నియమి ఇన్ద్రియగ్రామం -- అనగా దేహం మన స్వాధీనంలో ఉండడం. ఇంద్రియాలను నియంత్రించడం. సర్వత్ర సమబుద్ధయ --అనగా ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండుట; ఇంద్రియాలతోనూ, వస్తువులతోనూ తాదాత్మ్యం లేకుండుట; శత్రువులు, మిత్రులు లేకుండుట. సర్వభూతహితే రతాః -- అనగా ఇతరులను సేవించి ఆనందం పొందుట; స్వార్థమే ఎప్పుడూ చూసికోకుండుట. నా ఉద్దేశంలో "జ్ఞాన యోగం ఆచరణలో పెట్టగలిగితే, దానితో అవసరం లేదు; అవసరమైతే దానిని ఆచరణలో పెట్టలేము".

ఈ నేపథ్యంలో శ్రీ రామకృష్ణ బృందావనంలోని గోపికల కథ చెప్తారు. మనము శ్రీకృష్ణునిపై భక్తి ఉంటే ఆ గోపికల లాంటివారలమే. ఒక రోజు ఒక జ్ఞాన యోగి బృందావనానికి వచ్చేడు. అక్కడ గోపీకలందరూ ఒక అవతారపురుషుడ్ని ఆరాధిస్తున్నారని చూసి, వాళ్ళకు బ్రహ్మన్ గురించి వివరించేడు. వాళ్ళు చివరకు "మాకు ఇదేమీ అర్థం కాలేదు. మాకు తెలిసిందల్లా చూసి, ఆనందించి, ప్రేమించ గలిగిన శ్రీకృష్ణుడు" అని చెప్పేరు.

శ్రీకృష్ణుడు చెప్పేది మన మేధమీద మనకి ఎంతో నమ్మకమున్నా అది నిర్గుణ బ్రహ్మన్ ని చూడలేదు. మనమున్న స్థితిలో దేహ రహితమైన చేతనాన్ని ఎలా పట్టుకోగలం? ఆత్మ శాశ్వతమైనది, మార్పులేనిది కావచ్చు. కాని దానికి ఒక ఉపాధి అవసరం. ఇదే అవతారాల యొక్క రహస్యం. దేవుడు మానవ రూపాల్లో అవతారాలు ఎత్తి మన ఊహకు అందేలా చేసికోబడి, మనను ఐకమత్యంతో నడిపించగలిగే శక్తి. సెయింట్ బెర్నార్డ్ "కనిపించని దైవము భౌతికమైన మానవ రూపాముతో అవతారమెత్తడానికి కారణం పరస్పర ప్రేమతో బ్రతుకుతున్న మనల్ని తన వైపు త్రిప్పుకొని, క్రమంగా ఆధ్యాత్మికమైన ప్రేమను పెంపొందించడానికి". 340

Eknath Gita Chapter 12 Section 2

Bhagavat Gita

12.2

శ్రీ భగవానువాచ:

{12.2}
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే

శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః

నాయందే మనస్సు నిలిపి, నిత్యయుక్తులై, ఉత్తమమైన శ్రద్ధతో కూడి నన్నే ఉపాసించుచున్నారో వారు యోగి శ్రేష్ఠులని నా అభిప్రాయము

ఒక గ్రామస్తుడు ధ్యానం నేర్చుకోవడానికి ఒక గురువు దగ్గరకు వెళ్ళేడు. గురువు అతన్ని ఓంకారం జపించమని చెప్పేడు. ఆ గ్రామస్తుడు కొన్నాళ్ల తరువాత గురువు దగ్గరకు వచ్చి, తనకు ఓంకారం పనిచెయ్యటం లేదని చెప్పేడు. అప్పుడు గురువు నీకిష్టమైనది ఏమిటి అని అడిగేడు. ఆవు అని గ్రామస్తుడు చెప్పేడు. అయితే ఆవు మీద ధ్యానం చెయ్యమని గురువు చెప్పేడు. కొన్ని రోజులు తరువాత గురువు గ్రామస్తుడు ఎలా ఉన్నాడో చూద్దామని వాని ఇంటికి వెళ్ళేడు. ఇంటివాళ్ళు అతను మూడు రోజులపాటు ధ్యానంలో ఉన్నాడని చెప్పేరు. అది విని గురువు ఆశ్చర్యం చె౦ది, గది తలపును కొట్టి బయటకు రమ్మన్నాడు.

"నేను ధ్యానం చేస్తున్నాను" అని గ్రామస్తుడు చెప్పేడు.

"వెంటనే వెలుపలకు రా. నీతో మాట్లాడాలి" అని గురువు అన్నాడు.

"నేను బయటకు వద్దామంటే నా కొమ్ములు అడ్డుతున్నాయి" అని గ్రామస్తుడు బదులు చెప్పేడు.

ధ్యానంలో మనం దేని మీద ఏకాగ్రత చూపిస్తామో అదే అవుతాం. మన కోర్కెలు, నిర్ణయాలు, విధి మన చేతిలోనే ఉంటాయి. మనము దేనినైతే ప్రేమిస్తామో అదే అవుతాం.

ఈ నేపథ్యంలో మనమంతా చాలా కాలంనుంచి ధ్యానం చేస్తున్నాము. కానీ సమస్య ఏమిటంటే మనం దేనిమీదైతే ధ్యానం చేస్తున్నామన్నది నియంత్రించలేము. దానికి విరుద్ధ ఉదాహరణ: ఒకడు డబ్బుకై ఏదైనా చేస్తాడు. అలా ఎన్నో వ్యాపారాలు డబ్బుకై చేసి అది తప్ప వేరే ధ్యాస లేకున్నాడు. వాడు సిగరెట్ లేదా మారణాయుధాలు చేసే సంస్థలతో వ్యాపారం చేయడానికి వెనుకాడడు. వాడికి డబ్బు తప్ప వేరే మార్గం తెలీదు. ఇదే మన ఆలోచనలో ఉన్న శక్తి.

మనము స్వప్రయోజనానికి ఎలాగైతే ఏకాగ్రతతో ఉంటామో, మనం ప్రేమతో మానవాళికి ఉపయోగపడే ఒక ఆదర్శాన్ని ఎన్నుకొని దానిపై ధ్యానం చేయవచ్చును.

సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి ఒక ధనవంతుని కుటుంబంలో పుట్టేడు. అతను పెరుగుతున్నప్పుడు సాహిత్యం, సంగీతం మొదలైన కళళయందు పూర్తిగా మునిగి తేలేడు. కానీ ఒకమారు జీసస్ క్రైస్ట్ గురించి చదివిన తరువాత అతడు పూర్తిగా మారిపోయి, జీసస్ లాగే తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొన్నాడు. జి కె చెస్టర్ టన్ "మీకు జీసస్ కి చేరువ కాలేరని తలుస్తే, ఆయన ఇచ్చిన బోధలు నమ్మ శక్యం కాకపోతే, ఆయన సంపూర్ణమైన శిష్యుడు ఫ్రాన్సిస్ ని చూడండి" అని చెప్పెను.

మనలో చాలామందికి నిజమైన ప్రేమ మీద పూర్తి అవగాహన లేదు. ప్రసార మాధ్యమాలు ఇద్దరు కౌగలించుకుంటే అదే ప్రేమ అని అనుకునేలాగా మనల్ని మార్చేయి. అదే ఒకనిపై మరొకడు క్రోధం ప్రదర్శిస్తే, వాడు ఓర్పుతో సహిస్తే, వాడు ప్రేమతో ఉన్నాడు అంటే అందరూ మనల్ని పరిహాసం చేస్తారు. యోగులకు ప్రేమ భౌతికమైన ఆకర్షణకే పరిమితం కాదని తెలుసు.

సెయింట్ పాల్ ప్రేమ గురించి ఇలా చెప్పేరు:

ప్రేమ బాధను అనుభవిస్తుంది; ప్రేమకి దేనిపై అసూయ ఉండదు; ప్రేమ తప్పు నడవడికతో ఉండదు; దానికి స్వార్థం లేదు, అసహనం లేదు; చెడును కోరదు; తారతమ్యాలు చూడదు; కానీ సత్యాన్ని కోరుతుంది; ప్రతీదీ నమ్ముతుంది; దేన్నీ కప్పి పుచ్చదు; ఆశతో ఉంటుంది; ప్రతీదీ సహిస్తుంది; ఎప్పటికీ అపజయం పొందదు

గీత శ్రీకృష్ణుని ప్రేమించమని చెప్తుందని అనుకోవచ్చు. నిజానికి గీత ప్రతి ఒక్కరినీ ప్రేమించమని చెప్తున్నాది. ఎందుకంటే ఒకరిని ప్రేమించడానికి మన చేతన మనస్సులను ఐక్యం చేసికోవాలి.

ఆది శంకరుడు దేవునికి, సృష్టికి మధ్య భేదం లేదని తన అద్వైత సిద్ధాంతం గురించి బోధ చేసెను. సెయింట్ పాల్ "నేనుకాదు; క్రైస్ట్ నాలో నివసిస్తున్నాడు" అని చెప్పెను. అంటే ప్రేమించేవాడు, ప్రేమించబడేవాడు ఏకమై ఉన్నారు. కొందరు దంపతులు వేర్వేరుగా ఉంటారు. "ఇది నాది; అది నీది; నీ పరిధిలో నీవు ఉండాలి; నా పరిధిలో నేనుంటాను" అని తమ ధర్మాన్ని ప్రకటించుకొంటారు. వారి మధ్యలో ప్రేమలేదు. వారి మధ్యలో ఉన్నది ఒక ఒప్పందం. ప్రేమకి ఎటువంటి విభేదాలు ఉండకూడదు.

నేనిలా ప్రసంగిస్తే కొందరు "మేము ఒక్క రోజు కూడా అలాగ ఉండలేదు. ఇక జీవితాంతం అంటే వీలవ్వదు. బహుశా మీ ఉద్దేశంలో నేను నిజంగా ప్రేమించలేను" అని అనేవారు. మనమందరమూ ప్రేమించడం నేర్చుకోవచ్చు. మొదట్లో అవకతవకలతో ఉంటుంది. మనలో స్థిరాభిప్రాయాలు, అపోహలు ఉంటాయి. అలాగని "మనము వేరుగా ఉండి ప్రేమించుకుందాము" అనడం నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కలగాలంటే చాలా శ్రమ, ఏళ్లు పట్టవచ్చు. మనం సంపూర్ణమైన ప్రేమకై వేచి ఉండనక్కరలేదు. కొంత ప్రయత్నంతో అందరూ లబ్ది పొందవచ్చు.

ఇదే గీత చెప్పే ప్రేమ. దీన్ని మన బంధాలన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఒక దంపతులు ఏకమవ్వటానికై ముందే నిర్ణయించుకు౦టారు. దాన్ని పెంపొందించుకోవాలి.

ముస్లిం యువతులు బురఖా వేసుకొని మనలో వారి ముఖం చూడాలనే ఆశక్తిని కలిగిస్తారు. అదే విధంగా మనకి దైవానికి మధ్య ఒక తెర ఉంది. దాన్ని తొలగించుకోవడానికి ధ్యానంతో ప్రయత్నిస్తాము. కొన్నేళ్ళ తరువాత ఆ తెర తొలగింపబడి దైవ సాక్షాత్కారాన్ని పొందవచ్చు.

చాలామంది ప్రేమ అంటే ఇద్దరి మధ్యలో ఉ౦డేదని తలుస్తారు. అది భౌతిక పరంగా నిజం కావచ్చు. కాని మన ప్రేమకి పరిమితి లేదు. మనం ఒకరినే ప్రేమించడంతో సంతృప్తి పొందలేము. మనకు కావలసినది సంపూర్ణమైన ప్రేమ. మనమే ప్రేమకి ప్రతిరూపం అవ్వాలి. డోస్టోవ్స్కీ ది బ్రదర్స్ కారమజోవ్ అనే పుస్తకంలో ఇలా వ్రాసేరు:

దేవునిచే సృజింపబడిన సృష్టినంతా ప్రేమించు. ప్రతీ ఇసుక రేణువును ప్రేమించు. ప్రతి ఆకును, కాంతి పు౦జాన్ని ప్రేమించు. జంతువులను, పక్షులను ప్రేమించు. చెట్లను ప్రేమించు. ప్రతీ శకలాన్నీ ప్రేమించు; శకలాన్ని ప్రేమిస్తే సర్వం దేవునిమీద ఆధారపడి ఉన్నదనే రహస్యం తెలుసుకొంటావు. ఈ విధ౦గా ఆ రహస్యం యొక్క అవగాహన దినదినాభివృద్ధి చెందితే దేన్నీ విడిచిపెట్టక సమస్త ప్రపంచాన్ని ప్రేమిస్తావు.

ఇదే నిజమైన ఐకమత్యం అంటే. ఈ రోజుల్లో మన సమాజంలో గందరగోళం పేరుకుపోయింది. అది మన ఇళ్ళలోకీ, హృదయాలలోకీ చొచ్చుకు పోయింది. కాబట్టి మనము సంపూర్ణమైన ప్రేమను అలవరుచుకోవాలి. ఒక హసిడిక్ యోగి ఇలా అన్నారు: సమాజం దేవుని బండి. పరస్పర ప్రేమ తక్కువగా ఉంటే ఆ బండి గాడి తప్పుతుంది. అలాటప్పుడు ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. ఎప్పుడైతే పరస్పర ప్రేమ తక్కువగా ఉంటుందో ప్రేమకై ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి.

ఒక వ్యక్తి రబ్బీ ఇస్రేల్ బాల్ షెం వద్దకు వచ్చి "నా కొడుకు దేవుడికి దూరమవుతున్నాడు. నేనేమి చెయ్యాలి?" అని అడిగేడు. దానికి రబ్బీ ఇచ్చిన సమాధానం: "వానిని ఇంకా ఎక్కువ ప్రేమించు". ఇదే నా అమ్మమ్మ చెప్పేది. ఐకమత్యానికి దీనికన్నా ఉపయుక్తమైన, కళాత్మకమైన, సంతృప్తికరమైన మార్గం లేదు. దీనివలన మన జీవితమనే పూవులు వికసిస్తాయి; కాయలు కాస్తాయి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ప్రతీదీ సరిగా ఉంటుంది. ప్రేమ అంటే జ్ఞానం, క్రియ; దానివలన దేవుని చేరడానికి ఉన్న మార్గాలన్నీ ఏకమై ఉంటాయి. 336

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...