Tuesday, March 21, 2023

Shvetashvatara Upanishat





శ్వేతాశ్వతర ఉపనిషత్















మొదటి భాగము



సృష్టికి కారణమేమిటి? అది బ్రహ్మనా?
మనమెక్కడనుంచి వచ్చేము? ఎలా జీవిస్తాము?
శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనల్ని
చుట్టుముట్టే సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు
ఏ శక్తులు కారణము?


కాలము, ప్రకృతి, ఆవశ్యకత, యాధృచ్చికము,
భూతాలు, శక్తి, బుద్ధి మొదటి కారణము కావు.
అవి ఆత్మని సుఖదుఃఖాలనుండి విముక్తము
చేసే కార్యాలు మాత్రమే.

గాఢ ధ్యానంలో జ్ఞానులు ప్రతి జీవి హృదయంలోనూ
వసించే పరమాత్మను దర్శించేరు. హృదయ
లోతుల్లో, త్రిగుణాల--సాత్విక, రాజస, తామస--తెర వెనుక
పరమాత్మ వసిస్తాడు. అతడే ఏక స్వరూపుడు. దేశకాలకారణాలను
పరిపాలించేవాడు అతనే.

ప్రపంచం పరమాత్మ తిప్పే చక్రం. దాని అంచులలో
జీవులు స్థితమై ఉన్నారు. ప్రపంచం ఒక నది వంటిది--పరమాత్మ
నుండి పుట్టి, పరమాత్మలోనే లయమవుతుంది.

సదా తిరిగే చక్రంలో మానవుడు తిరుగుతూ, ఒక జన్మ నుంచి
మరొక జన్మను పొంది, తాను ఒక ప్రత్యేకమైన
జీవినని తలచి, చివరకు పరమాత్మ స్వరూపాన్ని తెలిసికొని,
అఖండమైన అమృతత్వాన్ని పొందుతాడు.

అతడే మారని సనాతన సత్యం; శాస్త్రాలను వల్లించండి;
మన భూమి గూర్చి పాడ౦డి. ఎవరైతే పరమాత్మని
అన్ని జీవులలో చూస్తారో, వారు ఆయనలో ఐక్యమై
జననమరణ చక్రాన్ను౦డి విముక్తి పొందుతారు.

పరమాత్మ మారేవి, మారనివి, వ్యక్తమైనవి, అవ్యక్తమైనవి
తన చేతులలో ధరిస్తాడు. జీవాత్మ ,
పరమాత్మ ఎరుకలేక సుఖాల వెనుక పరిగెత్తి, బంధాలలో
తగులుకొంటుంది. పరమాత్మని దర్శించిన తరువాత
బంధ విముక్తిని పొందుతుంది.

చైతన్యవంతమైన ఆత్మ, అచేతనమైన పదార్థము
సృష్టి ఆది నుంచి ఉండి, మాయ చేత కప్పబడినవై,
మనలోని సంతోషము బాహ్య వస్తువులలో నుంచి
వచ్చేదని తప్పుడు నమ్మకాన్ని కలిగించేయి. ఆ
మూడూ ఒక్కటే అనే జ్ఞానము ఉదయించగానే,
పరమాత్మ తన పూర్ణ స్వరూపాన్ని జూపి,
మనము బ్రహ్మన్ యొక్క పనిముట్టుగా తెలిసికోబడతాము.

ఇంద్రియలోకంలో మార్పు సదా ఉండేది. కానీ
పరమాత్మలో ఎట్టి మార్పూ ఉండదు. అతనిని
ధ్యానించు; అతనిలో తన్మయత్వము పొందు;
వేర్పాటనే స్వప్నము నుండి మేల్కో.

పరమాత్మని తెలుసుకొంటే బంధాలన్నీ తెగిపోతాయి.
దేహంతో తాదాత్మ్యము చెందక జనన మరణాలను
దాటిపో. నీ కోర్కెలన్నీ పరమాత్మ వలన తీరి,
అతను తప్ప వేరేది లేదనే జ్ఞానం ఉదయిస్తుంది.

నీ హృదయంలో అతడు ప్రతిష్ఠితమై ఉన్నాడని తెలుసుకో.
జీవితంలో వేరే దాన్ని గురించి తెలుసుకోనవసరం లేదు.
ధ్యానం చేసి ప్రపంచమంతా పరమాత్మ మయమని
తెలుసుకో.

కట్టెలో అగ్ని ఉన్నా, అది వెలుపలకి వచ్చేది
రాపిడి వలననే. అలాగే పరమాత్మ మన
హృదయంలో నిక్షిప్తమై, మంత్ర జపము వలన
తెలుసుకోబడతాడు.

నీ దేహము పై కట్టె; మంత్రము క్రింద కట్టె; ఈ
రెండు కట్టెల మధ్య రాపిడి ధ్యానం. ఈ విధంగా
పరమాత్మని పట్టుకో.

నువ్వులలో నూనె లాగ, పాలలో మీగడలాగ,
భూగర్భ జలాశయాల్లో నీరు లాగ, కట్టెలో
అగ్ని లాగ, పరమాత్మ మనస్సు లోతులలో
ఉన్నాడు. సత్యము, ధ్యానముల ద్వారా
అతనిని పట్టుకో.

వెన్నలో నెయ్య దాగి ఉన్నట్లు, పరమాత్మ
అందరి హృదయాలలో ఉన్నాడు. అట్టి
పరమాత్మను గాఢమైన ధ్యానంలో తెలుసుకో.
అతడే పరిపూర్ణుడు; జ్ఞానం యొక్క గమ్యం.

ఇది ఆధ్యాత్మిక చింతన పరాకాష్ట
ఇది ఆధ్యాత్మిక చింతన పరాకాష్ట

రెండవ భాగము



దేహాన్ని, మనస్సుని ఉపయోగించుకొని
సర్వ జీవులలో ప్రతిష్ఠితమైన పరమాత్ముని తెలుసుకొందాం.
ఏకాగ్రతతో ఆనందంగా పరమాత్మునితో
ఏకమవుదాం. ధ్యానం అవలంబించి
ఇంద్రియాలను పరమాత్మ సేవకై ఉపయోగిద్దా౦.

అపరిమితము, సర్వత్ర ఉండెడి, సర్వజ్ఞుని
కీర్తి అతి ఉత్కృష్ఠమైనది. ప్రాణ శక్తిని వృధా
చెయ్యని జ్ఞానులకు అతడు తెలుసును.

పరమోత్కృష్ఠమైన ఆనందం యొక్క
పిల్లలారా, వినండి: మీరు పరమాత్మతో
ఐక్యం అవ్వడానికి పుట్టేరు. జ్ఞానుల మార్గాన్ని
అనుసరించి పరమాత్మతో ఐక్యమవ్వండి.

ధ్యానంతో కుండలిని శక్తిని మేల్కొలపండి.
మనస్సును, శ్వాసను నియంత్రించుకోండి.
పరమాత్మ ప్రేమను ఆశ్వాదించండి. మీరు
తప్పక ఐక్య స్థితిని పొందుతారు.

సృష్టికి కారణమైన పరమాత్మ సేవ నిరతము
చెయ్యండి. మీ దుఃఖానికి కారణమైన
వాటిని తొలగిస్తాడు; కర్మ పాశాలనుంచి
విడుదల చేస్తాడు.

వెన్నెముక తిన్నగా పెట్టి, మనస్సుని,
ఇంద్రియాలను అంతర్గతం చెయ్యండి.
మంత్ర జపం చేస్తూ భవ సాగరాన్ని
దాటి జననమరణాలకు అతీతులవ్వ౦డి.

మీ ఇంద్రియాలకు సేవకులిగా తర్ఫీదు ఇవ్వండి.
మీ కర్మలు నియంత్రించి లక్ష్యం వైపు మళ్లించ౦డి.
గుర్రపు పగ్గాలు పట్టుకొంటున్నట్టు మీ మనస్సుని
నియంత్రించండి.

ధ్యానానికి ఒక ప్రదేశం ఇలా చేసుకోండి:
శుభ్రత, ప్రశాంతత, చల్లదనము గలది;
రాళ్ళు, దుమ్ము లేని చదును నేల గల గుహ;
గాలి, వర్షము లేని స్థలము; కన్నులకు ఇంపుగా
నున్నది.

గాఢ ధ్యానంలో సాధకులు మంచు లేదా
పొగతో గూడిన రూపాలు చూస్తారు. ఈదురు
గాలి లేదా ఉష్ణము అనుభవిస్తారు. తమలో
దివ్యమైన కాంతిని చూస్తారు: మిణుగురు
పురుగులు, మెరుపులు, సూర్యుడు లేదా చంద్రుడు.
ఇవి బ్రహ్మన్ వైపు నడిచేటప్పుడు కలిగే చిహ్నాలు.

ఆరోగ్యం, తేలికైన దేహం, వాంఛలు లేకుండుట,
వర్చస్సు, మృదుమధుర గాత్రం, సువాసన: ఇవన్నీ
ధ్యానంలో పురోగతిని సూచిస్తాయి.

అద్దం మీద దుమ్ము తుడిచి వేస్తే ఎలా
మెరుస్తుందో, పరమాత్మను తెలుసుకున్నవారు
తేజస్సు కలిగి ఉంటారు. వారు జీవిత లక్ష్యాన్ని
సాధించి, దుఃఖాలను అధిగమిస్తారు.
సమాధి స్థితిలో పరమాత్మని తమ హృదయాలలో
చూస్తారు. పరిశుద్ధులై జనన మరణాలనుండి
విముక్తులవుతారు.

అన్ని జీవులలోని ఉన్న పరమాత్మ,
సృష్టి యోనిలో స్థితుడై ఉనాడు. అతడే
పుట్టినది, పుట్టబోయేది. అతని ముఖము
అన్ని చోట్లా ఉంది.

అగ్నిలోనూ, జలంలోనూ, మొక్కలలోనూ,
చెట్లలోనూ యున్న పరమాత్మని పూజిద్దా౦.

మూడవ భాగము



ఎటువంటి లక్షణాలు లేని బ్రహ్మన్ ప్రేమ
పూరితుడై తన వలతో సృష్టి పర్యంతము
కప్పి, దివ్య శక్తితో పరిపాలిస్తాడు.
అతడు సృష్టికి పూర్వము ఉన్నవాడు.
లయము తరువాత ఉండేవాడు. ఉన్నదంతా
అతడే. అతనిని తెలిసినవారు అమృతత్వమును
పొందెదరు.

ఉన్నదంతా పరమాత్మే. వేరొకటి లేదు.
అతడు అందరిలోనుండి పరిపాలిస్తాడు.
సృష్టిని తన నుండి వెలికి తీస్తాడు,
పాలిస్తాడు, కాలాంతమున
తిరిగి వెనక్కు తీసుకొంటాడు.

అతని కళ్ళు, నోరు, చేతులు, కాళ్ళు అన్ని
ప్రదేశాలలోనూ ఉన్నాయి. సృష్టిని
తన నుండి వెలికి దీసి, దాని స్థితికి
కారకుడు.

అతడే ప్రకృతి శక్తులకు యోని.
అతడు అందరినీ పరిపాలించే రాజు.
గొప్ప జ్ఞాని. సృష్టి యోనిలో శాశ్వతముగా
ఉండేవాడు. మన చేతన మనస్సును
పరశుద్ధము చేసేవాడు.

పరమాత్మా, మాకు శాంతి నీ
వలననే; నీ దివ్య స్వరూప దర్శనముతో
మా అపరిశుద్ధమైన ఆలోచనలు, భయములు
తొలగు గాక.

పరమాత్మా, ఎవరి వద్ద నుంచి అయితే మంత్రోపదేశము
అహంకారాన్ని అణచివేయుటకు పొందేమో,
మాకు దర్శనమివ్వు; మమ్మల్ని రక్షించు.

నువ్వు పరమోత్కృష్ఠమైన బ్రహ్మన్. కానీ నీవు
అందరి హృదయాలలోనూ ఉన్నావు.
నువ్వు సర్వ వ్యాపాకుడవు. నిన్ను తెలిసికొని
మేము అమృతత్వము పొందుతాము.

నేను పరమాత్మను అజ్ఞానాన్ని తొలగించే సూర్యుని
లాగ తెలుసుకొన్నాను. అతనిని తెలుసుకొన్నవారు
మృత్యువుని దాటుతారు. అమృతత్వానికి వేరొక
మార్గము లేదు.

అతనికంటే ఉన్నతమైనదేదీ లేదు. అతను తప్ప
వేరొకటి లేదు. అతని అపరిమిత్వము అన్నిటికన్నా
గొప్పది. అలాగే సూక్ష్మము. అతను తన స్వయం
ప్రపత్తితో సృష్టిని ఆవరించి యున్నాడు.

అతడు సృష్టిని ఆవహించి యున్నాడు. అలాగే సృష్టిని
అతిక్రమించి ఉన్నాడు. అతనిని తెలిసినవారు వేర్పాటు
పడరు. దుఃఖము, మరణము వారిని బాధించదు. పుట్టుక
బాధలను అనుభవించుటకే అని భావించరు.

పరమాత్మ సర్వ వ్యాపకుడు, అందరి హృదయాలలోనూ
ఉన్నవాడు, పరమ దయాళుడు, సృష్టి అంతా అతని
ముఖమును ప్రతిబింబిస్తుంది.

పరమాత్మ దయతో మన హృదయాలతో అతనిని
పొందే వ్యవస్థను సృష్టించేడు. అతడు ఎప్పటికీ
వెలిగే జ్యోతి.

అతడు హృదయంలో చిన్న జ్యోతిగా జీవుల
అంతర్గతంలో ఉన్నాడు. నిశ్చలమైన మనస్సుతోనే
అతనిని తెలుసుకోగలం. అతనిని తెలిసినవారు
అమృతత్వాన్ని పొందుతారు.

అతనికి వేల శిరస్సులు, కళ్ళు, కాళ్ళు ఉన్నాయి;
అన్ని దిక్కులనుండి సృష్టిని ఆవహించి యున్నాడు;
ఇట్టి అపరితమైన పరమాత్మ మన హృదయాలలోనూ
ఉన్నాడు. అతడే సృష్టిగా మారేడు. అతడు భూత,
భవిష్యత్ కాలాలకు చెందినవాడు. అయినప్పటికీ
మార్పు లేనివాడు. అమృతత్వాన్నిచ్చేవాడు.

అతని చేతులు, కాళ్ళు అంతటా ఉన్నాయి; అతని
శిరస్సులు, నోళ్ళు అంతటా ఉన్నాయి. అతడు
అన్నిటికీ ద్రష్ట, అన్నీ వింటాడు, సర్వ వ్యాపకుడు.

ఇంద్రియాలు లేకుండా దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు.
అతడు అందరికీ రాజు; అంతర్గతంలో పాలిస్తాడు.
రక్షకుడు. మిత్రుడు.

అతడు నవద్వారాలు కలిగిని పురంలో --
అనగా దేహంలో --నివసిస్తాడు. అతడు ప్రపంచంలో
తన అసంఖ్యాక రూపాలతో క్రీడిస్తాడు. అతడే
సృష్టికి యజమాని. జీవులు, జీవములేని పదార్థాలు
అతని రూపాలే.

అతడు కాళ్ళు లేకుండా పరిగెడతాడు; చేతులు
లేకుండా పట్టుకుంటాడు. కళ్ళు లేకుండా
చూస్తాడు. చెవులు లేకుండా వింటాడు. అందరినీ
తెలిసినవాడు. కానీ ఎవ్వరికీ అతను తెలియదు.
అతడే ప్రధముడు, గొప్పవాడు, చక్రవర్తి.

అతి సూక్ష్మమైన, అతి గొప్పవైన జీవరాసుల
హృదయాలలో పరమాత్మ ఉన్నాడు. అతని
కరుణ వలన మనము స్వార్థపూరిత కోర్కెలు,
దుఃఖాలనుండి విడుదల పొంది, అతనితో
ఐక్యమవుతాం.

శ్వేతాశ్వతార మహర్షి ఇలా చెప్పెను:
నాకు పరమాత్మ శాశ్వతుడు, అపరిమితుడు అని తెలుసును.
అందరి దేహాల్లో అతడే ఆత్మ. జ్ఞానులు అతనిని
నిత్యునిగా భావిస్తారు.

నాల్గవ భాగము



ప్రపంచాన్ని సృష్టించి, అనేక రూపాలను దాల్చి,
జీవులను తననుండి జనింపజేసి, వాటిని
తనలోనే లయముచేసే పరమాత్మ మాకు
జ్ఞానమును ప్రసాదించుగాక

అతడే అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు.
అతడే గాలి, సముద్రము, సృష్టి కర్త, ప్రజాపతి.

అతడీ బాలుడు; ఆ బాలిక; ఈ పురుషుడు; ఆ స్త్రీ;
ఆ కర్ర పట్టుకొని నడుస్తున్న వృద్ధుడు. అతని ముఖము
అంతటా ఉన్నది.

అతడే ఆ నీలిరంగు పక్షి; ఎర్రని కళ్ళతో యున్న
ఆకుపచ్చ పక్షి; ఉరుములు మెరుపులు కల్పించు
మేఘము. అతడే ఋతువులు, సముద్రాలు. అతనికి
ఆద్యంతాలు లేవు. సర్వ జగత్తులకు యోని.

అతని దివ్యమైన శక్తి వలన మాయ నుండి నామరూపాత్మకములు
పుట్టినవి. మనలో అవి బాధను, క్లేశాన్ని కలుగ జేస్తాయి.
ఆ మాయా తెరను తీసివేస్తే, బహు రూపాలుగా వ్యక్తమయ్యే
వానిని చూడగలం.

ఒక అందమైన పక్షుల జంట ఒకే చెట్టు మీద
నివసిస్తున్నాయి. ఒకటి బాధ, ఆనందములతో
కూడిన ఫలాలను ఆరగిస్తుంది. రెండవది
ఏమీ తినకుండా కాలం గడుపుతుంది.

మనము పరమాత్మ అంశలమని తెలియక,
సదా మారే ప్రపంచ వ్యాపారములలో తలమునకలై,
మన అసత్తువను ప్రకటిస్తాం. కానీ అందరిచేతా
పూజింప బడిన, ఉత్కృష్ఠుడైన పరమాత్మని తెలిసికొని,
దుఃఖాలను అధిగమిస్తాం.

శాస్త్రములన్నిటికీ ఒకటే యోని అని, వాటిని పాటించి
దేవతలు, లోకాలు ఉన్నవని తెలియనివానికి
వాటివల్ల ఏమి లాభం? పరమాత్మ తమ హృదయంలో
ప్రతిష్ఠుతుడై ఉన్నాడని తెలుసుకొనేవారు అమితమైన
ఆనందము అనుభవిస్తారు.

పరమాత్మ ఒక మాయవిలాగ తననుండే: శాస్త్రాలు,
యజ్ఞయాగాదులు, ఆధ్యాత్మిక కర్మలు, భూతభవిష్యత్
కాలాలు, సృష్టినంతా వెలికి తీసేడు. మాయ వలన
అదృశ్యమై అందరి హృదయాలలోనూ నెలకొనియున్నాడు.

అతడు ఒక మాయావి లాగ సమస్త లోకాలను తననుండే
సృష్టించేడు. అన్ని జీవులు అతని తేజస్సులో
ఓలలాడుతున్నాయని తెలుసుకో.

అతడు పరమోత్కృష్ఠమైన మాయావి లాగ
ఆడ, మగ, పక్షి, జంతువు రూపాలను ధరించి యున్నాడు.
అతడే మనకు దివ్య ఆశీస్సులు ఇచ్చేవాడు.
అతని వలన మన హృదయములు శాంతితో
నిండి ఉంటాయి.

అతడు దేవతలందిరికీ కారకుడు; జగత్తుకు ఏకైక
ఆధారము, బంగారు జీవ బీజానికి కారకుడు. అట్టివాడు
మనకు జ్ఞానము ప్రసాదించు గాక.

అతడు దేవతలకు దేవత. అతని వలన సమస్త
లోకాలూ శ్వాస తీసుకొంటున్నాయి. అంతర్గతం నుండి
అన్ని జీవులను పాలి౦చేవాడు. అతనిని అందరూ
పూజించుగాక.

అతడు అన్నిటినీ ఆవహించి యున్నాడు. ఆయన ముందు
సమస్త సృష్టి సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుకన్నా చిన్నది.
అట్టి శివుడు మన హృదయాలను అపరిమితమైన
శాంతితో నింపుగాక.

అతడు సృష్టికి రక్షకుడు. జీవుల అంతర్గతంలో నుండి
వాటిని రక్షిస్తాడు. అతనికి అన్ని జీవులు సమానము.
అట్టి శివుడు మనను మృత్యువు నుండి దాటించు గాక.

అతడు పరమోత్కృష్టుడు; మనందరి హృదయాలలో,
పాలలో మీగడ వలె యు౦డి సమస్త సృష్టిని
ఆవహించియున్నాడు. అట్టి శివుడు మనలను
బంధవిముక్తులను చేయుగాక.

అతడు విశ్వ కర్మయై జీవుల హృదయాలలో నెలకొన్నాడు.
అతనిని ధ్యానంతో పట్టుకో. అతడు మనకి
అమృతత్వము ప్రసాదించుగాక.

అతడు అన్ని మతాలకూ యోని; వెలిగే లోకాలకు
పాలకుడు; పగలు చీకటి లేని లోకాలకు కూడా;
ఇది ఉంది, ఇది లేదు అని చెప్పనలవికాని
శివుడు. అతనిని మనస్సుతో పట్టుకోవడం
సులభం కాదు. అతడే సకలం. అతని కీర్తి
సమస్త లోకాలలో మార్మ్రోగుతుంది.

అతడు చూపుకు అందడు. అతడే సర్వస్వం. అట్టి
శివుడు గాఢ ధ్యానములో మనకు కనిపించి,
అమృతత్వమును ప్రసాదించుగాక.

పరమాత్మా, నేను మృత్యువుకు భయపడుతాను;
నాకు నీ పాదాలే శరణ్యం. నన్ను రక్షించు.
మా పురుషులను, స్త్రీలను, పశువులను, గుర్రాలను
రక్షించు. మాలో ధైర్యవంతులు నిన్ను ఆశ్రయించి
మృత్యువును అధిగమించుగాక.

ఐదవ భాగము



జీవ ఐక్యతను తెలుసుకొంటే మృత్యువును
అధిగమించవచ్చు. అలా కాకపోతే మృత్యువాత
పడక తప్పదు. రెండూ అపరిమితమైన బ్రహ్మన్
యందు దాగి యున్నవి. అతడు వాటికి అతీతుడు.

అతడు అందరినీ వారి అంతర౦గంలో నుండి
పాలించేవాడు. కాలము మొదలు పెట్టినపుడు
బంగారు జీవ బీజాన్ని నాటుతాడు. దాని ద్వారా
జీవుల ఐక్యతను తెలుపుతాడు.

అతడు పుట్టుక, మరణములతో కూడిన వలను
వేసి తన వైపు లాక్కుంటాడు. అతడు సృష్టి
శక్తులకు కారకుడు.

సూర్యుడు సృష్టిని వెలుగుతో నింపినట్లు,
మన క్రింద, మీద, అన్ని వైపులనుండి పరమాత్మ
మన హృదయాలను కాంతితో నింపుతాడు.

అతని నుండి సృష్టి వచ్చినది; అతడు ప్రతి జీవి
తన స్వభావమును అనుసరించి పరిపూర్ణత పొందుతుందని ఆశించి శిక్షణ
నిస్తాడు. అతడు సర్వ జీవుల పగ్గాలను పట్టుకొన్న
పరమాత్మ.

శాస్త్రాలలో గుహ్యంగా యున్న సర్వోత్కృష్టమైన
సృష్టి కర్త అతడే; అతనిని తెలిసికొని దేవతలు,
జ్ఞానులు అమృతత్వాన్ని పొందేరు.

సుఖదుఃఖాల వలయంలో చిక్కుకొని మనం
బంధాలతో సతమతమవుతున్నాం. మన
కర్మకు మనమే కారణమైనప్పటికీ, పుట్టిన
దగ్గర నుంచి, మరణించే వరకు, క్రొత్త కర్మలు
చేస్తూ ఉంటాము.


పరమాత్మ ఒక బొటన వేలు పరిమాణంలో మన
హృదయంలో నుండి, సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు.
కాని అహంకారం తలెత్తితో అతడు సహించడు.
పరమాత్మ ఒక వెంట్రుక పరిమాణముకన్న చిన్న
దైనప్పటికీ, అతడు అపరిముతుడు.

పరమాత్మ దేహాన్ని ధరించి అనేక రూపాలు
పొందుతాడు: మన అవసరం బట్టి, క్రిందటి జన్మల కర్మలను బట్టి
లావు లేదా సన్నం గా కనపడుతాం. ఈ పరిణామము
వాని శాసనము.

వానిని ప్రేమించి స్వతంత్రుడవు కా. అతడు బహు
రూపములతో వ్యక్తమై, సృష్టిని ఆవరించి,
ఆద్యంతములు లేక ఉన్నాడు. పరిశుద్ధమైన
హృదయము ఉన్నవారు మాత్రమే అతనిని
పొందగలరు.

అట్టి సృష్టికర్త, లయకర్త అయిన, అమితమైన
సౌందర్యము, జ్ఞానము గల పరమ శివుడు
మనలను జన్మ మరణ చక్రం నుండి విడుదల
చేయుగాక.

ఆరవ భాగము



జ్ఞానులు జీవితము స్వయంగా మనము చేసుకొన్న
కర్మ అని అంటారు; కొందరు జీవితము కాలముతో
పరిణమించినది అంటారు. నిజానికి
సృష్టి పరమాత్మ నుండి ఆవిర్భవించినది.

అతడు శుద్ధ చైతన్యము, సర్వా౦తర్యామి,
గొప్ప శక్తులు గలవాడు, సర్వజ్ఞుడు, కాలాన్ని
సృష్టించినవాడు, త్రిగుణాలను జయించినవాడు.
జీవుల పరిణామమునకు కారకుడు.

ఎవరైతే నిస్వార్థముగా, క్రమశిక్షణతో జీవనము
సాగిస్తారో, వారు కాల క్రమమున పరమాత్మ
నియమమైన జీవులన్నీ సమానమని తెలుసుకొంటారు.
వారు పరమాత్మకై సేవచేసి కర్మ లేకుండా
ఉంటారు.

అతడు జీవులన్నిటికీ ప్రధమ యోని; అతని కీర్తి
సృష్టి అంతా వ్యాపించి ఉన్నది; అతడు
దేశకాలాలకు అతీతుడు. కానీ ధ్యానంలో
తెలుసుకొనబడేవాడు.

అతడు వృక్షము వంటి జీవితానికి అతీతుడు.
అతని శక్తి వలన గ్రహాలు తిరుగుతున్నాయి.
అతడే శాసన కర్త, దయామయుడు. కానీ
ధ్యానంలో తెలుసుకొనబడేవాడు.

అతడు కారణము లేని కారణము. అతనిని
మించి --తండ్రి కానీ, యజమాని కానీ --
ద్వితీయము లేదు. గూడులో సాలె పురుగు
వలె, జీవులలో నిఘూడంగా ఉన్న పరమాత్మ
మనకు జ్ఞానము ప్రసాదించు గాక.

అతడు మన అందరి హృదయాలలోనూ ఉన్నాడు.
అతడే సర్వానికి సాక్షి. శుద్ధ చైతన్యము. మన
కర్మలను అంతర్గతం నుండి చూస్తాడు. త్రిగుణాతీతుడు.

పరమాత్మ చేతిలో మనము పనిముట్లము. మనము
అతనిని చేతన మనస్సుతో పట్టుకొని, వర్ణింప
శక్యముకాని ఆనందమును అనుభవించెదము గాక.

మారే వాటిలో మారని వాడు. చైతన్యానికి
చైతన్యము. మన ప్రార్థనలను మన్నించేవాడు.
మనము చేతన మనస్సుతో అతనిని పట్టుకొని,
అతను ఒక్కడే ఇవ్వగలిగిన అమృతత్వమును
పొందెదము గాక.

అతనులేక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు,
మెరుపు, భూమి మీద అగ్ని ప్రకాశవంతములు గావు.
ప్రతీ వస్తువు ఆయన ప్రతిబింబము.
మనము చేతన మనస్సుతో అతనిని పట్టుకొని,
అతను ఒక్కడే ఇవ్వగలిగిన అమృతత్వమును
పొందెదము గాక.

అతడు సృష్టికర్త, స్వయంభు, సర్వజ్ఞుడు, మరణాన్ని
నశింపజేయగలవాడు, అందరి అంతర్గతంలో
ఉన్నవాడు, జననమరణ చక్రాన్ని
నడిపేవాడు. మనము చేతన మనస్సుతో అతనిని పట్టుకొని,
అతను ఒక్కడే ఇవ్వగలిగే అమృతత్వమును
పొందెదము గాక.

అతడు సృష్టిని రక్షించేవాడు; అతనికే పూర్ణ కీర్తి,
సర్వజ్ఞత్వము, సర్వవ్యాపాకత్వము. అతను లేక
వేరొక పరిపాలన కర్త ఎవ్వరు? మనము చేతన మనస్సుతో అతనిని పట్టుకొని,
అతను ఒక్కడే ఇవ్వగలిగిన అమృతత్వమును పొందెదము గాక.

నాకు జననమరణ చక్రాన్ను౦చి తప్పించ గలిగే శివుడే శరణ్యం.
కాలము మొదట్లో శాస్త్రములిచ్చిన శివుడే నాకు శరణ్యం.
పరిశుద్ధము, సంపూర్ణము ప్రసాదింపగలిగే శివుడే నాకు శరణ్యం.
మరణం నుండి అమృతత్వానికి వంతెన వంటి శివుడే నాకు శరణ్యం.
అతని పాదాలను పట్టుకోవాలనే తృష్ణ కలుగజేసిన శివుడే నాకు శరణ్యం.

మనము ప్రపంచాన్ని ఒక జింక చర్మము లాగ ఎలాగ చుట్టపెట్టగలం?
మన హృదయాలలో వసిస్తున్న పరమాత్మని తెలుసుకొనలేక
మన దైన్యమైన జీవితాలను ఎలా గడపగలం?

శ్వేతాష్వతర మహర్షి ధ్యానంలో పరమాత్మను తెలిసికొని,
అమితమైన ప్రేమతో, ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని తన
భక్తులైన శిష్యులకు ప్రసాదించెను.

సృష్టి ఆదిలో తెలిసికొన్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానము
పరిశుద్ధమైన హృదయముగల వారు లేదా
శిష్యులైనవారు తమ బిడ్డలకు బోధించవచ్చు.
నీకు పరమాత్మ యందు సంపూర్ణమైన ప్రేమ ఉంటే,
గురువుపై పూర్తి ప్రేమ ఉంటే, ఈ బోధతో నీ
హృదయము ప్రకాశిస్తుంది. అది తప్పక ప్రకాశిస్తుంది.

Thursday, March 9, 2023

Chandogya Upanishat





చాందోగ్య ఉపనిషత్















మొదటి భాగము



అవినాశి అయిన ఓంకారాన్ని
స్మరించి ప్రారంభిద్దాం.

భూమి జలమునుండి, మొక్కలు
జలమునుండి, మానవుడు మొక్కల నుండి
ఆవిర్భవించేయి; మానవుడ౦టే వాక్కు; వాక్కు ఓం.
వాఙ్మయములో ఋగ్ వేదము ముఖ్యము;
కానీ సామ ఋగ్ యొక్క సారం మరియు
సామ ఓంకార సారం, ఉద్గీత.

ఇది సారానికి సారం; మిక్కిలి ఉత్కృష్ఠమైనది,
ఎనిమిదవ మెట్టు, అన్నిటికన్నా పవిత్రమైనది;
ఓంకారము పరమాత్మ.

ధ్యానంలో ఋగ్, సామ విశిష్ఠత ఏమిటి?
ఋగ్ వాక్కు; సామ రాగము; అవినాశి అయిన
ఓంకారం ఉద్గీత. వాక్ మరియు శ్వాస, సామ
మరియు ఋగ్ జంటలు; అవి తమ కోర్కెలను
నెరవేర్చుకొనుటకు అవినాశి అయిన ఓంకారంలో
లయమవుతాయి. ఇది తెలిసికొని ఎవరైతే
ఓంకారాన్ని జపం చేస్తారో వారి సమస్త కోరికలు
తీరుతాయి. ఓం అనే పదంతో మనము "నేను
అంగీకరిస్తున్నాను" అని పలికి మన కోరికలను
తీర్చుకొంటాము. ఓంకారాన్ని స్మరించి, బాహ్యంగా
దానిని గౌరవించి మూడు జ్ఞానములకు ఆధారమని
గానము చేస్తాము. పరమాత్మ గురించి తెలిసినవారు,
తెలియనివారు చేసే కర్మలు ఒక్కటే; కానీ ఆ
రెండూ ఒకటే కాదు. జ్ఞానముతో, ఎరుకతో, భక్తితో
చేసే కర్మలు శక్తివంతములు. అందుకే అఖండమైన
ఓంకారము యొక్క విశిష్ఠత చెప్పబడినది.

రెండవ భాగము



సృష్టి బ్రహ్మన్ నుండి ఆవిర్భవించి, బ్రహ్మన్ లో
స్థితమై, బ్రహ్మన్ లో లయ మవుతుంది. సర్వం
బ్రహ్మనే .

ఏ కోరికైతే గాఢమైనదో, దాని ప్రకారం మనిషి కర్మలను
ఆచారిస్తాడు. ఈ జన్మలోని గాఢమైన కోరికలు,
మరుసటి జన్మని మలచుతాయి. కాబట్టి
పరమాత్మ గురించి తెలుసుకోవడం మన గాఢమైన
కోరికగా చేసుకొందాం.

పరమాత్మని శుద్ధమైన హృదయం గలవారే తెలుసుకోగలరు.
ఇటువంటి పరమాత్మ నా హృదయంలో స్థితమై ఉన్నాడు:
అతడే ప్రాణం, ప్రకాశం, సత్యం, ఆకాశం; అన్ని కర్మలకు
ఆధారం; అన్నికోరికలకు, వాసనలకు, రుచులకు మూలం;
మాటలకు అతీతం; మిక్కిలి ఆహ్లాదకర౦.

బియ్యపు గింజ కన్నా, యవ గింజ కన్నా, ఆవ గింజ కన్నా, జొన్న
గింజ కన్నా, జొన్న గింజ పై పొరకన్నా పరమాత్మ సూక్ష్మము.
భూమి కన్నా, ఆకాశం కన్నా, లోకాల కన్నా పెద్దదైన
పరమాత్మ నా హృదయంలో స్థితమై ఉన్నాడు.

పరమాత్మ సర్వ కర్మలకు యోని; అన్ని కోరికలకు,
వాసనలకు, రుచులకు మూలం; సృష్ఠినంతటినీ
ఆవహించి యున్నాడు; మాటలకు అతీతం; మిక్కిలి
ఆహ్లాదకరం. నా అహంకారం అంతమైనప్పుడు అతనిని
పొందుతాను.

శాండిల్య ఈ విధంగా చెప్పెను.
శాండిల్య ఈ విధంగా చెప్పెను.

మూడవ భాగము




సత్యకాముడు "అమ్మా, నాకు ఆధ్యాత్మిక జ్ఞానం
బోధించే గురువు దగ్గరకు వెళ్ళే కాలం ఆసన్నమైనది.
గురువు నా వంశం గురించి అడిగితే,
మన కుటుంబం ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పేది"?
అని అడిగెను.

"నాకు తెలియదు. నేను పనిమనిషిగా ఒక ప్రదేశం
నుండి వేరొక ప్రదేశానికి మారుతున్నప్పుడు నువ్వు
పుట్టేవు. నీ పేరు సత్యకామ, నా పేరు జబల; నీ పేరు
సత్యకామ జబల అని చెప్పలేవా?" అని జబల పలికెను.

సత్యకాముడు హరిద్రుమత గౌతమ ముని వద్దకు వెళ్ళి
"స్వామీ, నన్ను శిష్యునిగా తీసుకోండి" అని అర్థించెను.

ముని: "తేజోవంతుడా, నీ వంశమేమిటి?"

సత్యకాముడు: "స్వామీ, నాకది తెలియదు. నా అమ్మ యువతిగా
ఉన్నప్పుడు నేను పుట్టేనని అంది. ఆమెకు నా
వంశ చరిత్ర తెలియదు. ఆమె పేరు జబల.
కాబట్టి నన్ను సత్యకామ జబల అని పిలుచుకోమంది".

ముని: "నిజమైన బ్రాహ్మణుడు తప్ప వేరెవరూ అలా చెప్పరు.
ఎ౦డు కట్టెలను తెచ్చుకొస్తే నిన్ను విద్యలోకి
ప్రవేశింప జేస్తాను. నువ్వు సత్య మార్గం నుండి తప్పు ద్రోవ
పట్టలేదు".

ముని నాలుగు వందల బక్కచిక్కిన ఆవులను ఎంచి వాటిని
సత్యకాముని పోషింపమని ఇచ్చెను. "ఈ ఆవులు వెయ్యి
అయ్యేవరకు నేను తిరిగి రాను" అని సత్యకాముడు
నిర్ణయించుకొనెను.

సత్యకాముడు అనేక సంవత్సరములు ఆ గోవుల మందను
కాసేడు. ఒకరోజు ఒక ఎద్దు ఇలా పలికెను:
"సత్యకామా!"

సత్యకాముడు: "ఏమి స్వామీ?"

"మంద వెయ్యి అయినది. మనం గురువు ఆశ్రమంకు
తిరిగి వెళ్దాం. నీకు బ్రహ్మన్ యొక్క నాలుగు పాదాలలో
ఒక దాన్ని గూర్చి చెప్తాను."

సత్యకాముడు: "తప్పకుండా చెప్పు స్వామీ"

"నాలుగు దిక్కులు: తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం.
ప్రకాశమనబడేవి బ్రహ్మన్ యొక్క ఒక పాదం. ఈ
నాలుగింటిని ధ్యానం చేస్తే ప్రకాశంతో కూడినవాడవై
తేజోవంతమైన సృష్టి విన్యాసమును చూడగలవు.
అగ్ని వీటి గురించి ఇంకా చెప్పును".

మరుసటి రోజు సత్యకాముడు ఆవుల మందను
గురువు ఆశ్రమంవైపుకు తోలుకు వెళ్ళేడు. సాయంత్రం
మంట వేసుకొని తూర్పు దిక్కు వైపు కూర్చున్నాడు.
అగ్ని "సత్యకామా" అని పిలిచెను.


సత్యకాముడు: "ఏమి స్వామీ?"

"మిత్రుడా నీకు బ్రహ్మన్ యొక్క రెండవ పాదం గురించి చెప్పగలను."

సత్యకాముడు: "చెప్పండి స్వామీ"

భూమి, ఆకాశం, స్వర్గం, సముద్రం అని నాలుగు ఉన్నవి. ఇవన్నీ
బ్రహ్మన్ యొక్క ఒక పాదం. దీన్ని అనంతమంటారు. ఇది తెలిసికొని
ధ్యానం చెయ్యి. నీ జీవితం భూమి మీద అనంత మయి ఉంటుంది.
ఒక హంస నీకు ఇంకా చెప్తుంది."

మరుసటి రోజు కూడా సత్యకాముడు ఆవుల మందను
గురువు ఆశ్రమంవైపుకు తోలుకు వెళ్ళేడు. సాయంత్రం
మంట వేసుకొని తూర్పు దిక్కు వైపు కూర్చున్నాడు.
ఒక హంస ఎగురుకుంటూ వచ్చి "సత్యకామా" అని పిలిచెను.

సత్యకాముడు: "ఏమి స్వామీ?"

"మిత్రుడా నీకు బ్రహ్మన్ మూడవ పాదం గురించి చెప్పగలను"

సత్యకాముడు: "చెప్పండి స్వామీ"

"అగ్ని, సూర్యుడు, చంద్రుడు, మెరుపు అని నాల్గు ఉన్నవి.
అవి అమితమైన కాంతివంతమైన బ్రహ్మన్ పాదము. ఇది
తెలిసికొని ధ్యానం చేస్తే నీవు మిక్కిలి తేజోవంతుడవై,
కాంతిని గూర్చి పూర్తి జ్ఞానము పొందుతావు. ఒక పాలపిట్ట
నీకు ఇంకా చెప్తుంది".

మరుసటి రోజు సత్యకాముడు ఆవుల మందను
గురువు ఆశ్రమంవైపుకు తోలుకు వెళ్ళేడు. సాయంత్రం
మంట వేసుకొని తూర్పు దిక్కు వైపు కూర్చున్నాడు.
ఒక పాలపిట్ట ఎగురుకుంటూ వచ్చి "సత్యకామా"
అని పిలిచెను.

సత్యకాముడు: "ఏమి స్వామీ?"

"మిత్రుడా, నీకు బ్రహ్మన్ నాల్గవ పాదం గూర్చి చెప్పగలను"

సత్యకాముడు: "చెప్పండి స్వామీ"

"శ్వాస, కన్ను, చెవి, మనస్సు అని నాల్గు ఉన్నవి. ఇవి
బ్రహ్మన్ యొక్క నాల్గవ పాదము. దాని పేరు సంస్థాపనము.
దాని మీద ధ్యానం చేస్తే నీకు ప్రపంచము
కరతలామలకమై, ఆకాశ౦ గూర్చి పూర్ణమైన
జ్ఞానం పొందుతావు. ఈ విధంగా బ్రహ్మన్ యొక్క నాల్గు
పాదాల గూర్చి తెలిసినవారు సంస్థాపకులు అనబడతారు".

సత్యకాముడు గురువు ఆశ్రమానికి తిరిగి వచ్చేడు.
"సత్యకామా, నీవు జ్ఞాని వలె తేజస్సుతో కూడి ఉన్నావు.
నీకు ఎవరు జ్ఞాన బోధ చేసేరో చెప్పు" అని గురువు అడిగెను.

సత్యకాముడు: "ఏ మనిషీ కాడు స్వామీ. మీ వద్ద నుండే
సత్యం తెలుసుకోవాలని కాంక్షిస్తున్నాను. గురువు చెప్పిన
విద్యే పరిపక్వమై జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని విన్నాను"

గురువు సత్యకామునికి అదే జ్ఞానమును బోధించెను.
ఏదీ వదిలి పెట్టలేదు.
ఏదీ వదిలి పెట్టలేదు.

నాల్గవ భాగము



శ్వేతకేతుడు ఉద్దాలకుని కొడుకు.
అతని పన్నెండవ ఏట తండ్రి ఇలా పలికెను:
"నీవు గురువును ఆశ్రయించే సమయము ఆసన్నమైనది.
మన వంశంలో అందరూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
అభ్యసించేరు."

శ్వేతకేతుడు ఒక గురువుని పొంది, పన్నెండేళ్ళు
వేదాలను అభ్యసించేడు. అటు పిమ్మట సమస్త జ్ఞానమున్నదనే
దర్పముతో ఇంటికి తిరిగి వచ్చెను.

"నువ్వు సమస్త విద్యలను నేర్చుకొన్న వానిలా ఉన్నావు.
కానీ నువ్వు గురువుని వినిపించనివి ఎలా వినాలో,
ఆలోచింప శక్యము గాని వానిని గూర్చి ఎలా ఆలోచించాలో,
తెలియనివి ఎలా తెలుసుకోవాలో ఎలా సాధ్యమని
అడిగేవా?"

"ఆ జ్ఞానమేమిటి తండ్రీ?"

"మట్టి గురించి తెలిస్తే, దానితో చేయబడే అన్ని వస్తువుల
గురించి తెలుస్తుంది. వాటి మధ్య భేదము నామరూపాత్మకములు
మాత్రమే. వాటిలో ఉన్నది మట్టే. బంగారం గురించి తెలుసుకొంటే
బంగారముతో చేయబడిన ఆభరణాలన్నిటి గురించి తెలుస్తుంది.
వాటి మధ్య ఉన్న భేదము నామరూపాత్మకములు మాత్రమే.
వాటిలో ఉన్నది బంగారమే. ఇనుము గురించి తెలుసుకొంటే
ఇనుముతో చేయబడిన పనిముట్లన్నిటి గురించి తెలుస్తుంది.
వాటి మధ్య ఉన్న బేధము నామరూపాత్మకమలు మాత్రమే.
వాటిలో ఉన్నది ఇనుమే. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా
జీవులన్నీ ఏకమై ఉన్నవని తెలుసుకొంటాము".

"నా గురువులకు ఈ జ్ఞానము లేక పోయి ఉండవచ్చు. అలా కాకపోతే
వారు నాకు ఈ జ్ఞానము ఎందుకు బోధించి ఉండరు? నాకు
ఈ జ్ఞానాన్ని బోధించండి, తండ్రీ"

"తప్పకుండా"

"సృష్టి ఆదిలో అద్వితీయమైనది ఒకటుండెను.
తన నుండి సృష్టిని చేసి, దానిలోకి ప్రవేసించెను.
పరమాత్మ నుండి రాని జీవుడుకాని, వస్తువుకాని లేదు.
ప్రతి ఒక్క జీవి ఆత్మ అతడే. అతడే సత్యము; అతడే
పరమోన్నతమైన పరమాత్మ. నీవు అదే అయి ఉన్నావు,
శ్వేతకేతూ"

"తండ్రీ, పరమాత్మ గురించి ఇంకా చెప్పండి"

"తప్పకుండా చెప్తాను"

"నిద్రతో మొదలు పెడదాం. అందులో ఏమవుతుంది?
సుషుప్తిలో మనము తెలియకుండానే పరమాత్మతో
లీన మవుతాం. ఒకడు నిద్రపోతున్నాడని అంటాం.
నిజానికి అతడు పరమాత్మయందు ఉన్నాడు. ఒక
త్రాటితో కట్టబడిన పక్షి ఎగిరి ఎగిరి అలసిపోయి
ఎలా విశ్రాంతి తీసుకొనుటకు ప్రదేశమును కోరుతుందో,
అలాగే మనస్సు అనేక ఆలోచనలతో అటూ ఇటూ
తిరిగి పరమాత్మలో విశ్రాంతి పొందుతుంది. అన్ని
జీవులకు పరమాత్మ యోని. అతడే వాటి గమ్యం.
అతడే వాటి శక్తి".

"మరణించిన తరువాత, వాక్కు మనస్సులో
లయమవుతుంది; మనస్సు ప్రాణంలో లయమవుతుంది;
ప్రాణం అగ్నిలో, అగ్ని శుద్ధ చైతన్యంలో లయమవుతాయి.
ఏదీ పరమాత్మ నుండి రాకుండా లేవు. ప్రతి ఒక్కదానికీ
అతడే ఆత్మ. అతడే సత్యం. అతడే ఆత్మ పరాకాష్ఠ.
నీవు అదే అయిఉన్నావు శ్వేతకేతూ"

"పరమాత్మ గూర్చి ఇంకా చెప్పండి తండ్రీ"

"తప్పకుండా చెప్తాను"

"తూర్పువైపు, పడమరవైపు ప్రవహించే
నదులన్నీ సముద్రంలో -- వాటికి అంతకు ముందు
ప్రత్యేక నామములున్నప్పటికీ--ఎలా ఏకమౌతాయో,
జీవులు వేర్పాటును కోల్పోయి చివరకు శుద్ధ చైతన్యంలో
ఐక్యమవుతాయి. ఏదీ పరమాత్మ నుండి రాకుండా లేవు. ప్రతి ఒక్కదానికీ
అతడే ఆత్మ. అతడే సత్యం. అతడే ఆత్మ పరాకాష్ఠ.
నీవు అదే అయిఉన్నావు శ్వేతకేతూ"

"పరమాత్మ గూర్చి ఇంకా చెప్పండి తండ్రీ"

"తప్పకుండా చెప్తాను"

"ఒక చెట్టు వేరు మీద గంటు పెట్టు. చెట్టు బ్రతికే ఉంటుంది. అలాగే
దాని కాండం మీద గంటు పెట్టు. దాని నుండి రసం వస్తుంది గానీ,
అది బ్రతికే ఉంటుంది. దాని కొమ్మ మీద గంటు పెట్టు. దాని నుండి
ద్రవం వస్తుంది గానీ, చెట్టు బ్రతికే ఉంటుంది. పరమాత్మ
చైతన్యము ఆ చెట్టుని నిలబెట్టి, దానికి ఆనందాన్ని కలిగించే
ఆహారాన్ని అందిస్తుంది. పరమాత్మ ఒక కొమ్మను వదిలిపెడితే,
ఆ కొమ్మ నశిస్తుంది. రెండవ దాని నుండి నిష్క్రమిస్తే అదీ నశిస్తుంది.
మూడవదాన్ని వదిలిపెడితే అదీ నశిస్తుంది. కానీ చెట్టు మొత్తాన్నీ
వదిలిపెడితే ఆ చెట్టంతా నశిస్తుంది. అలాగే మరణం ఆసన్నమైనప్పుడు
ఆత్మ శరీరాన్ని వదిలి పెడుతుంది. దేహం నశిస్తుంది,
కాని ఆత్మ ఎన్నటికీ నశించదు. "

"ఏదీ పరమాత్మ నుండి రాకుండా లేవు. ప్రతి ఒక్కదానికీ
అతడే ఆత్మ. అతడే సత్యం. అతడే ఆత్మ పరాకాష్ఠ.
నీవు అదే అయిఉన్నావు శ్వేతకేతూ"

"పరమాత్మ గూర్చి ఇంకా చెప్పండి తండ్రీ"

"తప్పకుండా చెప్తాను"

"న్యగ్రోధ చెట్టు దగ్గరనుంచి ఒక పండు పట్టుకొని రా"

"ఇదిగో తండ్రీ"

"దానిని పగలగొట్టు. ఏమి కనపడుతోంది?"

"చిన్న చిన్న బీజాలు కనపడుతున్నాయి"

"ఒక బీజాన్ని పగలగొట్టు. ఏమి కనపడుతున్నాది?"

"ఏమీ కనబడుటలేదు."

"నీవు చూడలేని ఆ బీజం నుండి గొప్పదైన
న్యగ్రోధ వృక్షం పుట్టుకు వస్తుంది.

"ఏదీ పరమాత్మ నుండి రాకుండా లేవు. ప్రతి ఒక్కదానికీ
అతడే ఆత్మ. అతడే సత్యం. అతడే ఆత్మ పరాకాష్ఠ.
నీవు అదే అయిఉన్నావు శ్వేతకేతూ"

"పరమాత్మ గూర్చి ఇంకా చెప్పండి తండ్రీ"

"తప్పకుండా చెప్తాను"

"ఈ ఉప్పును నీటిలో వేసి దాన్ని రేపు ఉదయం పట్టుకొని రా"

బాలుడు తండ్రి చెప్పినట్లు చేసేడు.

"ఆ ఉప్పెక్కడ ఉంది?"

"నాకు కనిపించటం లేదు"

"ఆ నీటిని త్రాగు. దాని రుచి ఎలా ఉంది?"

"ఉప్పగా ఉంది, తండ్రీ"

"ఇక్కడా, అక్కడా?"

"అంతటా ఉప్పగా ఉంది"

"మనం చూడలేక పోయినా అది అంతటా ఉంది.
అలాగే పరమాత్మ మనం చూడలేకపోయినా
అంతటా, అన్ని వస్తువులలోనూ ఉన్నాడు.
ఏదీ పరమాత్మ నుండి రాకుండా లేవు. ప్రతి ఒక్కదానికీ
అతడే ఆత్మ. అతడే సత్యం. అతడే ఆత్మ పరాకాష్ఠ.
నీవు అదే అయిఉన్నావు శ్వేతకేతూ"

"పరమాత్మ గూర్చి ఇంకా చెప్పండి తండ్రీ"

"తప్పకుండా చెప్తాను"

"ఒక గాంధార దేశ వ్యాపారస్తుడు కొందరిచే
కళ్ళకు గంతలు కట్టబడి అరణ్యములో
ఒంటరిగా వదలి పెట్టబడెను. నలు దిక్కులా
తిరుగుతూ "నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి
పెట్టేసేరు. నాకు ఏమీ కనబడుట లేదు"
అని అరిచెను. ఒక బాటసారి ఆ వ్యాపారస్తుని
గ౦తలు విప్పి 'గాంధార దేశం అల్లదిగో
అటువైపు ఉంది. ఈ మార్గం గుండా వెళ్ళు'
అని చెప్పెను. ఆ వ్యాపారస్తుడు ఆ మార్గంలో
నడచి, అడుగడుగునా బాటసారులనడిగి
చివరికి తన ఇల్లు చేరుకున్నాడు. అలాగే,
ఒక సాధకుడు జ్ఞాని అయిన గురువుని వెదుక్కొని, పొంది పరమాత్మ
గురించి ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతాడు.
ఏదీపరమాత్మ నుండి రాకుండా లేవు. ప్రతి ఒక్కదానికీ
అతడే ఆత్మ. అతడే సత్యం. అతడే ఆత్మ పరాకాష్ఠ.
నీవు అదే అయిఉన్నావు శ్వేతకేతూ"

"పరమాత్మ గూర్చి ఇంకా చెప్పండి తండ్రీ"

"తప్పకుండా చెప్తాను"

"ఒక వ్యక్తి మరణిస్తున్నప్పుడు, వాని కుటుంబ
సభ్యులు వాని చుట్టూ చేరి 'నేను నీకేవరో
తెలుసునా?' అని అడుగుతారు. అతని
వాక్కు మనస్సులో; మనస్సు ప్రాణంలో;
ప్రాణం అగ్నిలో; అగ్ని చైతన్యంలో కలవనంత
సేపూ అతనికి అందరూ తెలుసు. కానీ
వాక్కు మనస్సులో; మనస్సు ప్రాణంలో;
ప్రాణం అగ్నిలో; అగ్ని చైతన్యంలో కలిస్తే
అతనిచే తెలుసుకోబడేది ఏదీ లేదు.
ఏదీ పరమాత్మ నుండి రాకుండా లేవు. ప్రతి ఒక్కదానికీ
అతడే ఆత్మ. అతడే సత్యం. అతడే ఆత్మ పరాకాష్ఠ.
నీవు అదే అయిఉన్నావు శ్వేతకేతూ"

ఈ విధంగా శ్వేతకేతుడు తండ్రి బోధను అర్థం
చేసికొనెను.

ఐదవ భాగము



ఒకమారు నారద మహర్షి సనత్కుమారుని వద్దకు
వచ్చి "స్వామీ నాకు బోధ చెయ్యండి" అని కోరెను.

"నీకు తెలిసినదేమిటో ముందు నాకు చెప్పు. దానికి
అతీతమైన జ్ఞానం బోధిస్తాను" అని సనత్కుమారుడు
బదులిచ్చెను.

"నాకు నాలుగు వేదాలు -- ఋగ్, యజుర్, సామ,
అథర్వ -- మరియు ఐదవ వేదమని చెప్పబడే
పురాణాలు తెలుసు. ఇంకా వ్యాకరణం, యజ్ఞ
నియమాలు, గణితం, ఖగోళ శాస్త్రం, తర్కం,
ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రం,
లలిత కళలు, నాద స్వరం వీటన్నిటి గూర్చి
నాకు తెలుసు. కానీ నాకు ఆత్మ గురించి
తెలియదు. నేను మీ వంటి జ్ఞానుల వద్ద నుండి
ఆత్మ గురించి తెలుసుకొంటే మనోవ్యధ
పోతుందని తెలిసికొన్నాను. నేను మనోవ్యధతో
బాధ పడుతున్నాను. నాకు బోధ చెయ్యండి".

"నీకు తెలిసినదంతా పదాలు, పరిమితమైన
వాటి పేర్లు మాత్రమే. అపరిమితమైనది
అమితమైన ఆనందానికి ఆధారం. ఎందుకంటే
దానిలో మార్పు లేదు. కాబట్టి అపరిమితమైన
దానిని గురించి తెలుసుకో"

"మీ వద్ద నుండి అపరిమితమైన దానిని తెలియగోరుచున్నాను"

"అపరిమితమనగా: అఖండమైన జీవ చైతన్యము; దాని కన్నా
వేరే చూడబడనది, వినబడనిది, తెలిసికొనబడనిది
లేనిది. వేర్పాటును చూసినా, విన్నా, తెలిసికొన్నా అట్టి
జ్ఞానము పరిమితము. అపరిమితం మృత్యువును అధిగమిస్తుంది;
పరిమితము మృత్యువునుండి తప్పించుకోలేదు"

"అపరిమితమైన దానికి ఏది ఆధారం, స్వామీ"

"దాని కీర్తి వలన .. అలా కాదు. అది కూడా కాదు. ప్రజలు
ఆవులు, గుర్రాలు, ఏనుగులు, బంగారం, కుటుంబం,
సేవకులు, భూములు, భవనాలు ఉంటే అపార కీర్తి
గలవారమని తలుస్తారు. కానీ నేనది కీర్తి అనను. ఎందుకంటే
ఒక దాని మీద మరొకటి ఆధార పడి ఉన్నది. స్వయం శక్తితో,
ఆధారం అక్కరలేనిది అపరిమితం".

"అపరిమితమైనది క్రింద, మీద, ముందు, వెనుక, కుడి ప్రక్క,
ఎడ౦ ప్రక్క ఉండేది. నేనే ఇదంతా. పరమాత్మ
క్రింద, మీద, ముందు, వెనుక, కుడి ప్రక్క,
ఎడ౦ ప్రక్క ఉన్నాడు. ఇదంతా నేనే. ఎవరైతే పరమాత్మని
ధ్యానం చేస్తారో, పరమాత్మ అంతటా ఉన్నాడని తెలుసుకొంటారో,
వారు పరమాత్మలో రమిస్తారు. వారి స్వతంత్రతతో బ్రతికి,
ప్రతి ప్రదేశాన్నీ నివాసయోగ్యంగా భావిస్తారు. కానీ
పరిమితమైనదానిని కోరుకుంటే వారికి పరమాత్మ గురించి
తెలియక, బంధాలలో మునిగితేలుతారు."

"పరమాత్మని ధ్యానం చేస్తే సృష్టిలో ప్రతి ఒక్కటీ--
శక్తి, ఆకాశం, అగ్ని, జలం, నామరూపాలు, జననం, మరణం,
మనస్సు, బుద్ధి, మాట, కర్మ, మంత్రం, ధ్యానం -- పరమాత్మ
నుండి ఆవిర్భవించినవని తెలుసుకొంటారు"

"పరమాత్మ ఏకం. ఎన్నో రూపాలతో అగుపడినా
అతడు అద్వితీయం. ఎవరైతే పరమాత్మని ధ్యానం
చేస్తారో వారు వృద్ధాప్యాన్ని, మరణాన్ని, వేర్పాటుని, దుఃఖాన్ని
అనుభవించరు. వారు అందరిలోనూ పరమాత్మను దర్శించి
వారి సమస్త కోర్కెలను తీర్చుకొంటారు."

"ఇంద్రియాలను నిగ్రహించి మనస్సుని శుద్ధంగా ఉంచుకో. శుద్ధమైన
మనస్సులో పరమాత్మ స్ఫురణ ఉంటుంది. ఎక్కడైతే పరమాత్మ
స్ఫురణ ఉంటుందో అక్కడ స్వతంత్రత బంధాలను,
ఆనందం దుఃఖాన్ని అంతం చేస్తాయి."

ఈ విధంగా సనత్కుమార ముని, నారద మహర్షికి బంధాలకు,
దుఃఖాలకు, చీకటికి అతీతంగా ఉన్న ప్రకాశవంతమైన
ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించెను.

ఆరవ భాగము



బ్రహ్మన్ నివసించే పురంలో ఒక గుప్తమైన ప్రదేశం ఉంది. అదే
హృదయ కమలం. ఆ ప్రదేశంలో ఒక ఆకాశం ఉంది. అదే
మన కోరికలను తీర్చేది. ఆ దహారాకాశాన్ని తెలుసుకోవడం
మన చిరకాల వాంఛ.

ఆకాశం ఎంత అపరిమితమో, దహరాకాశం కూడా అంతే. స్వర్గము
మరియు భూమి, అగ్ని మరియు గాలి, సూర్యుడు మరియు చంద్రుడు,
మెరుపు మరియు నక్షత్రాలు ఆ దహరాకాశంలో ఉన్నాయి. మనకు
తెలిసినా తెలియక పోయినా ఆ దహరాకాశంలో అన్నీ నిక్షిప్తమై
ఉన్నాయి.

ఆ పురాన్నివృద్ధాప్యం అనే భయం ఆవహిస్తుందని తలచకు; అందులో
నిక్షిప్తమైనవి ఎప్పుడో ఒకప్పుడు క్షీణిస్తాయని భయపడకు. దేహం క్షీణించినా
అది క్షీణించదు; దేహం మరణించినా అది మరణించదు. ఇది
బ్రహ్మన్ యొక్క నిజమైన పురం; అదే జరామరణాలు, దుఃఖం,
ఆకలిదప్పికలు లేని ఆత్మ. దానివలన అన్ని కోర్కెలు తీరుతాయి.

ఆత్మ నిజమైనదానినే కోరుతుంది; సత్యం తప్ప వేరొకదాని
గూర్చి ఆలోచించదు. ఇక్కడ ప్రజలు వారికి చెప్పినది చేస్తారు.
అందువలన వారు తమ దేశంపై, భూమిపై ఆధారపడి
ఉంకొకరి మీద ఆధారపడే కోర్కెలను సాధించలేక,
ఊర్ధ్వ లోకాలను కూడా పొందలేక ఉంటారు. ఎవరైతే
తామెవరమనేది లేదా తాము నిజంగా కోరేది ఏమిటి అని
తెలిసికోలేక ఉంటారో వారికి ఈ లోకంలోనూ
పరలోకంలోనూ స్వతంత్రత లేదు.

అలాకాక ఎవరికైతే తామెవారో తెలుసునో, తమ నిజమైన
కోర్కె తెలుసునో వారు ఇహపరలోకాలలో సంపూర్ణ
స్వతంత్రతతో ఉంటారు.

వారు మరణించిన పితృ దేవతలను చూడగలరా?
తప్పకుండా చూసి ఆనందం పొందుతారు. గతించిన తరువాత వారి
పరివారాన్ని మిత్రుల్ని చూడగలరా? తప్పకుండా
చూసి ఆనందం పొందుతారు. వారు సంగీతం,
పూల సువాసన, వాటి అందం అనుభవించగలరా?
వారు తలచుకొన్నంత మాత్రన అనుభవించగలరు.
వారేది కోరినా, ఆ వస్తువుని వారి ఆలోచనా శక్తి వల్ల
పొంది ఆనందిస్తారు.

ఇక్కడ మన నిస్వార్థ కోరికలు, స్వార్థ పూరిత
ఆలోచనలతో కప్పబడినవి. అవి నిజం కానీ
అవి మాయచే కప్పబడినవి. అందువలన ఇక్కడ
మరణించినవారిని మనము మళ్ళీ చూడలేము.
కానీ మన ప్రేమపాత్రులు, మరణించినప్పటికీ,
మన సమస్త కోరికలు, మనం కోరే వస్తువులు
మన దగ్గర లేకపోయినా, దహరాకాశంలో
పొందవచ్చు. అందులో మాయచేత కప్పబడినప్పటికీ
మన నిస్వార్థ కోర్కెలు తీర్చబడతాయి.

ఒకడు భూగర్భంలోని నిధి మీద నడుస్తూ, అక్కడ నిధి ఉందని
తెలియకపోతే ఎట్లో, అలాగే సుషుప్తిలో బ్రహ్మన్
ను పొందినా బ్రహ్మన్ గురించి తెలియక మాయలో
పడిపోతున్నారు.

ఆత్మ దహరాకాశంలో నిక్షిప్తమై ఉన్నది. ఎవరైతే
జీవులన్నిటినీ తమ ప్రతిబింబంగా చూస్తారో వారు
అంతర్గతమైన బ్రహ్మన్ కు దినదినము చేరువ
అవుతారు. వారు శాంతముతో గూడి, దేహాభిమానము
వీడి ఆత్మ యొక్క గొప్పదైన వెలుగును చూస్తారు.
అమృతము, అభయము అయిన ఆత్మ నిజంగా
బ్రహ్మన్. మర్త్య, దేవ లోకాలకు అతీతంగా ఉండి
అతడు రెండిటినీ కలిపి ఉంచుతాడు. ఇది తెలిసిన
వారు ఈ జన్మలోనే స్వర్గ౦లో పొందే సుఖాలను
అనుభవిస్తారు.

ఆత్మ సందేహాలను నివృత్తి చేసే, ఈ రెండు లోకాల మధ్య వారధి. రాత్రి పగలు,
వృద్ధాప్యము, మరణము, దుఃఖము, దుష్కర్మ, చివరకు ఎట్టి కర్మలు
ఆ వారధిని దాటలేవు. అన్ని చెడ్డ ఆలోచనలు తిరోగమము
చెందుతాయి. బ్రహ్మన్ ఉండే లోకంలో చెడుకు ఉనికి లేదు.

ఎవరైతే ఆ వారధిని దాటుతారో వారు అంధులైతే, అంధత్వము
ఉండదు; బాధలతో సతమతమౌతే బాధలు ఉండవు; దుఃఖముతో
విచారంగా ఉంటే దుఃఖము ఉండదు. ఆ లోక సరిహద్దులో
రాత్రి పగలవుతుంది. బ్రహ్మన్ యొక్క లోకంలో రాత్రికి ఉనికి లేదు.

ఎవరైతే పరిశుద్ధులో, నిగ్రహముగలవారో, వారే బ్రహ్మన్ యొక్క
లోకాన్ని పొందగలరు. వారికై ఆ లోకం ప్రత్యేకంగా
ఉన్నది. ఆ లోకంలో, తక్కిన మిగతా లోకాల్లో, వారు స్వతంత్రంగా
నిశ్చింతగా బ్రతుకుతారు.

ఏడవ భాగము



ఒకమారు జగద్గురువైన ప్రజాపతి ఇలా ప్రకటించెను:
"ఆత్మ పరిశుద్ధమైనది; జరామరణము, ఆకలి దప్పికలు,
దుఃఖములు లేనిది. ఆత్మ సత్యము కానిదేదీ ఆశించదు;
మంచి కానిదేదీ చేయదు. అట్టి ఆత్మ గురించి తెలిసికొని,
ఆత్మ జ్ఞానాన్ని పొందండి. ఆత్మ జ్ఞానము వలన సమస్త
కోర్కెలు తీర్చుకొనవచ్చు. మహోత్కృష్ఠమైన జీవిత
లక్ష్యాన్ని సాధించవచ్చు".

దేవతలు, అసురులు అది విని "మనము ఆత్మ గురించి
తెలిసికొని అన్ని కోర్కెలు తీర్చుకుందాం" అని అనుకొన్నారు.
దేవతల రాజైన ఇంద్రుడు, ఆసురుల అధిపతి అయిన
విరోచనుడు ప్రజాపతి వద్దకు దర్భలు తీసికొని వెళ్ళేరు.
దర్భలు శిష్యరికానికి సూచన.
అక్కడ ముప్పైరెండు ఏళ్లు ప్రజాపతితో గడిపేరు. ప్రజాపతి
అన్నేళ్ళు తన వద్ద ఉండడానికి కారణమేమిటని అడిగెను.

ఇంద్రుడు, విరోచనుడు ఇలా సమాధాన మిచ్చేరు:
"మీ యొక్క ఊరడించే ప్రకటనను విన్నాం. మేమిక్కడ
ఎందుకు వసిస్తున్నామంటే మాకు ఆత్మ జ్ఞానము
పొందాలనే కోరికవలన. "

ప్రజాపతి "మీరు వేరొకని కళ్లలో చూసిన ప్రతిబింబమేదున్నదో
అది అభయమైన, మరణములేని ఆత్మ. అదే ఉత్కృష్ఠమైన
బ్రహ్మన్" అని చెప్పెను.

"మరి నీటిలో, అద్దంలో కనిపించే ప్రతిబింబము ఏమిటి"

ప్రజాపతి: "వాటిలో ప్రతిబింబించేది కూడా ఆత్మే"

ప్రజాపతి: "ఈ పాత్రలో ఉన్న నీటిలో మీ ప్రతిబింబం చూసుకొని,
మీరాత్మ గురించి ఏమి అడగదలచుకున్నారో అడగండి"

వారి ప్రతిబింబాలను వారు చూసుకొన్నారు.

ప్రజాపతి: "నీటిలో ఏమిటి చూసేరు?"

"మేము గోళ్లతో, వెంట్రుకలతో ఉన్న ఆత్మని చూసేము"

ప్రజాపతి: "మీ పూర్వ అపురూప వస్త్రాలను, ఆభరణాలను ధరించి
మళ్ళీ చూడండి"

వారు ప్రజాపతి చెప్పినది చేసి, ఆయన వద్దకు వచ్చేరు.

ప్రజాపతి: "మీరు నీటిలో ఏమిటి చూసేరు?"

"చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించిన ఆత్మను చూసేము"

ప్రజాపతి: "అదే అభయమైన, మరణములేని ఆత్మ. అదే ఉత్కృష్ఠమైన
బ్రహ్మన్" అని చెప్పెను.

ఇంద్రుడు, విరోచనుడు సంతృప్తి పడ్డారు. కానీ ప్రజాపతి
"వారు ఆత్మను చూసేరుగానీ, దానిని గుర్తించలేదు.
వారు దేహము ఆత్మ అనుకుంటున్నారు. ఎవరైతే
అలా భావిస్తారో వారు జీవిత గమ్యాన్ని తెలిసికోలేరు"
అని స్వగతంలో అనుకొనెను.

విరోచనుడు ప్రజాపతి చెప్పినది పూర్తిగా నమ్మి తన
రాజ్యానికి తిరిగి వచ్చి ఆసురులకు దేహమే
ఆత్మ; దాన్నే పోషించి, పూజించాలి అని చెప్పెను.
ఇంకా ఎవరైతే ఇంద్రియాలను సంతృప్తి పరుస్తారో,
ఇహపరలోకాలలో సుఖాలను పొందుతారు అని చెప్పెను.
ఈ రోజుల్లో కూడా భక్తి, ప్రేమ, దాన గుణము లేని వారు
అసురులు లేదా నాస్తికులు అని పిలువబడతారు.
వారు శవాలను కూడా దుస్తులతో, ఆభరణాలతో
అలంకరిస్తారు. ఎందుకంటే వారు ఊర్ధ్వ లోకంలో
తమ జీవితాలను ఉల్లాసంగా గడపాలని.

ఇంద్రునికి తనలోకానికి తిరిగి వెళ్ళే మార్గంలో
ఒక సందేహం కలిగింది: "ఆత్మ దేహమైతే,
దేహం మంచి దుస్తులు ధరిస్తే తాను మంచి
దుస్తులు ధరించి, దేహం ఆభరణాలు ధరిస్తే తాను
ఆభరణాలు ధరి౦చి ఉంటే దేహం గ్రుడ్డిదయితే
తాను కూడా గ్రుడ్డి అవ్వాలి; దేహం క్షీణిస్తే తానూ
క్షీణించాలి. అలాగే దేహం పడిపోతే, తానూ
మరణించాలి. ఇటువంటి జ్ఞానంతో నాకు
సంతృప్తి లేదు"

అలా ఆలోచించి ఇంద్రుడు దర్భలు
పట్టుకొని ప్రజాపతి వద్దకి
తిరిగి వెళ్ళి తన సందేహాన్ని వివరించెను.

ప్రజాపతి: "ఇంద్రా, నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావు. నాతో
ఉంకో ముప్పైరెండేళ్ళు గడిపితే నీకు
ఆత్మ గురించి ఇంకా చెప్తాను"

ఇంద్రుడు ముప్పైరెండేళ్ళు గడిపిన తరువాత
ప్రజాపతి "ఏదైతే కలల్లో కదులుతుందో,
ఆనందంతో ఉంటుందో, అదే అభయం,
జరామరణాలు లేని ఆత్మ. అదే పరమోత్కృష్ఠమైన
బ్రహ్మన్" అని చెప్పెను.

ఇంద్రుడు సంతృప్తి పడి తిరిగి దేవ లోకానికి
బయలదేరేడు. వెళ్తున్న దారిలో ఇంకో సందేహం
వచ్చింది:
"కలలో దేహం గ్రుడ్డిదయితే ఆత్మ గ్రుడ్డిదికాదు;
దేహం క్షీణించినదైతే ఆత్మ క్షీణించినది కాదు;
దేహం చంపబడితే, ఆత్మ చంప బడదు. కానీ
కలలో ఆత్మ దుఃఖం పొందినట్లు౦టుంది , చంప
బడుతున్నట్లు అనిపిస్తుంది. దానికి బాధ కలిగి, ఏడుస్తున్నట్లు
అనిపిస్తుంది. నాకు ఇటువంటి జ్ఞానంతో సంతృప్తి లేదు".

అలా ఆలోచించి ఇంద్రుడు మళ్ళీ దర్భలు పట్టుకొని
ప్రజాపతి వద్దకు వచ్చి తన సందేహాన్ని వివరించేడు.

ప్రజాపతి: "ఇంద్రా, నువ్వు చక్కగా ఆలోచిస్తున్నావు. ఇంకొక
ముప్పైరెండేళ్ళు నాతో ఉండు నీకు ఆత్మ జ్ఞానాన్ని
బోధిస్తాను" అని ప్రజాపతి అనెను.

ఇంద్రుడు ముప్పైరెండేళ్ళు గడిపిన తరువాత
ప్రజాపతి "సుషుప్తిలో వేరే ఎరుక ఉండక, కలలు
లేక, నిశ్చలమైన మనస్సుతో ఏదైతే ఉంటుందో
అదే అభయం, జరామరణాలు లేని ఆత్మ.
అదే పరమోత్కృష్ఠమైన బ్రహ్మన్" అని చెప్పెను.

మళ్ళీ సంతృప్తిపడినా, మార్గ మధ్యంలో ఒక సందేహము
తలెత్తింది:
"సుషుప్తిలో వేరే స్పృహ లేదు. అది మరణానికి
దగ్గరగా ఉన్న స్థితి. నాకు ఇటువంటి జ్ఞానంతో సంతృప్తి లేదు".

అలా ఆలోచించి ఇంద్రుడు మళ్ళీ దర్భలు పట్టుకొని
ప్రజాపతి వద్దకు వచ్చి తన సందేహాన్ని వివరించేడు.

ప్రజాపతి: "ఇంద్రా, నువ్వు చక్కగా ఆలోచిస్తున్నావు. ఇంకొక
ఐదేళ్ళు నాతో ఉండు నీకు ఆత్మ జ్ఞానాన్ని
బోధిస్తాను" అని ప్రజాపతి అనెను.

ఇంద్రుడు మరొక ఐదు ఏళ్లు ప్రజాపతి వద్ద గడిపెను.
అంతాకలిపి అతడు నూటొక్క సంవత్సరాలు
ప్రజాపతి వద్ద గడిపెను. ఈనాటికీ "ఇంద్రుడు కూడా
నూటొక్క సంవత్సరాలు గురువు దగ్గర
ఉన్నాడు" అనే నానుడి ఉన్నది. అప్పుడు ప్రజాపతి
పరమోత్కృష్ఠమైన ఆత్మ జ్ఞానం ఇలా బోధించెను:

"దేహం నశించేదే. కానీ దానిలో నశించని
ఆత్మ ఉన్నది. దేహము సుఖదుఃఖాలను అనుభవించేది;
ఎవరైతే దేహాభిమానంతో బ్రతుకుతారో వారికి
సుఖదుఃఖాలనుండి విముక్తి కలగదు. కానీ తాము
దేహమని ఎవరు తలంచరో వారు సుఖదుఃఖాలకు
అతీతమైన ఆనందాన్ని అనుభవిస్తారు."

"గాలి, మేఘాలు, పిడుగులు, మెరుపులు, ఆకాశంలో
ఒక స్థిరమైన ఆకారంలేక ఎలా ఉంటాయో, దేహాభిమానము
లేనివారు బ్రహ్మన్ వద్దకు తమ స్వస్వరూపమైన
ఆత్మతో వెళతారు."

"బంధాలు లేని ఆ స్థితిలో జ్ఞానులు వారిష్టానుసారం
నవ్వుతూ, క్రీడిస్తూ, ఆనందిస్తూ ఉంటారు. వారికి
దేహము ఆత్మ కాదని తెలుసు; అది దేహానికి ఎద్దు
బండికి కట్టబడినట్లు ఉన్నదని తెలుసు. వాసన చూసేది,
మాట్లాడేది, వినేది, ఆలోచించేది ఆత్మ అని తెలుసు.
ఇంద్రియాలు ఆత్మకి పనిముట్లని వారికి తెలుసు".

"బ్రహ్మన్ యొక్క లోకంలో ఆత్మను ఆరాధించి దేవతలు
వాళ్ళ లోకాలను పొంది, కోర్కెలు తీర్చుకున్నారు. ఎవరైతే
అట్టి ఆత్మ గూర్చి జ్ఞానం పొందేరో, వారు సమస్త
లోకాలను పొంది, కోర్కెలన్నీ తీర్చుకుంటారు"
అని ప్రజాపతి బోధించెను.

ఎనిమిదవ భాగము



కటిక చీకటినుంచి వచ్చి వ్యక్తమై
తిరిగి ఆ చీకటి వైపు వెళుతున్నాను.
గుర్రము శరీరము పైన అశుద్ధాన్ని ఎలా
జలదరించి తీసివేస్తుందో, నేను
అన్ని చెడు వాసనలను పారద్రోలేను.
జనన మరణాలనుండి చంద్రుడు రాహువు
నోటినుండి విముక్తుడైనట్లు విడిపడ్డాను.
నేను పరమ పవిత్రమైన బ్రహ్మన్ యొక్క లోకాన్ని పొందేను.

బ్రహ్మనే నా ఇల్లు. నేను దాన్ని వీడను.
నిజంగా నేను వేరే మార్గము అనుసరించను.


Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...