Tuesday, March 21, 2023

Shvetashvatara Upanishat





శ్వేతాశ్వతర ఉపనిషత్















మొదటి భాగము



సృష్టికి కారణమేమిటి? అది బ్రహ్మనా?
మనమెక్కడనుంచి వచ్చేము? ఎలా జీవిస్తాము?
శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనల్ని
చుట్టుముట్టే సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు
ఏ శక్తులు కారణము?


కాలము, ప్రకృతి, ఆవశ్యకత, యాధృచ్చికము,
భూతాలు, శక్తి, బుద్ధి మొదటి కారణము కావు.
అవి ఆత్మని సుఖదుఃఖాలనుండి విముక్తము
చేసే కార్యాలు మాత్రమే.

గాఢ ధ్యానంలో జ్ఞానులు ప్రతి జీవి హృదయంలోనూ
వసించే పరమాత్మను దర్శించేరు. హృదయ
లోతుల్లో, త్రిగుణాల--సాత్విక, రాజస, తామస--తెర వెనుక
పరమాత్మ వసిస్తాడు. అతడే ఏక స్వరూపుడు. దేశకాలకారణాలను
పరిపాలించేవాడు అతనే.

ప్రపంచం పరమాత్మ తిప్పే చక్రం. దాని అంచులలో
జీవులు స్థితమై ఉన్నారు. ప్రపంచం ఒక నది వంటిది--పరమాత్మ
నుండి పుట్టి, పరమాత్మలోనే లయమవుతుంది.

సదా తిరిగే చక్రంలో మానవుడు తిరుగుతూ, ఒక జన్మ నుంచి
మరొక జన్మను పొంది, తాను ఒక ప్రత్యేకమైన
జీవినని తలచి, చివరకు పరమాత్మ స్వరూపాన్ని తెలిసికొని,
అఖండమైన అమృతత్వాన్ని పొందుతాడు.

అతడే మారని సనాతన సత్యం; శాస్త్రాలను వల్లించండి;
మన భూమి గూర్చి పాడ౦డి. ఎవరైతే పరమాత్మని
అన్ని జీవులలో చూస్తారో, వారు ఆయనలో ఐక్యమై
జననమరణ చక్రాన్ను౦డి విముక్తి పొందుతారు.

పరమాత్మ మారేవి, మారనివి, వ్యక్తమైనవి, అవ్యక్తమైనవి
తన చేతులలో ధరిస్తాడు. జీవాత్మ ,
పరమాత్మ ఎరుకలేక సుఖాల వెనుక పరిగెత్తి, బంధాలలో
తగులుకొంటుంది. పరమాత్మని దర్శించిన తరువాత
బంధ విముక్తిని పొందుతుంది.

చైతన్యవంతమైన ఆత్మ, అచేతనమైన పదార్థము
సృష్టి ఆది నుంచి ఉండి, మాయ చేత కప్పబడినవై,
మనలోని సంతోషము బాహ్య వస్తువులలో నుంచి
వచ్చేదని తప్పుడు నమ్మకాన్ని కలిగించేయి. ఆ
మూడూ ఒక్కటే అనే జ్ఞానము ఉదయించగానే,
పరమాత్మ తన పూర్ణ స్వరూపాన్ని జూపి,
మనము బ్రహ్మన్ యొక్క పనిముట్టుగా తెలిసికోబడతాము.

ఇంద్రియలోకంలో మార్పు సదా ఉండేది. కానీ
పరమాత్మలో ఎట్టి మార్పూ ఉండదు. అతనిని
ధ్యానించు; అతనిలో తన్మయత్వము పొందు;
వేర్పాటనే స్వప్నము నుండి మేల్కో.

పరమాత్మని తెలుసుకొంటే బంధాలన్నీ తెగిపోతాయి.
దేహంతో తాదాత్మ్యము చెందక జనన మరణాలను
దాటిపో. నీ కోర్కెలన్నీ పరమాత్మ వలన తీరి,
అతను తప్ప వేరేది లేదనే జ్ఞానం ఉదయిస్తుంది.

నీ హృదయంలో అతడు ప్రతిష్ఠితమై ఉన్నాడని తెలుసుకో.
జీవితంలో వేరే దాన్ని గురించి తెలుసుకోనవసరం లేదు.
ధ్యానం చేసి ప్రపంచమంతా పరమాత్మ మయమని
తెలుసుకో.

కట్టెలో అగ్ని ఉన్నా, అది వెలుపలకి వచ్చేది
రాపిడి వలననే. అలాగే పరమాత్మ మన
హృదయంలో నిక్షిప్తమై, మంత్ర జపము వలన
తెలుసుకోబడతాడు.

నీ దేహము పై కట్టె; మంత్రము క్రింద కట్టె; ఈ
రెండు కట్టెల మధ్య రాపిడి ధ్యానం. ఈ విధంగా
పరమాత్మని పట్టుకో.

నువ్వులలో నూనె లాగ, పాలలో మీగడలాగ,
భూగర్భ జలాశయాల్లో నీరు లాగ, కట్టెలో
అగ్ని లాగ, పరమాత్మ మనస్సు లోతులలో
ఉన్నాడు. సత్యము, ధ్యానముల ద్వారా
అతనిని పట్టుకో.

వెన్నలో నెయ్య దాగి ఉన్నట్లు, పరమాత్మ
అందరి హృదయాలలో ఉన్నాడు. అట్టి
పరమాత్మను గాఢమైన ధ్యానంలో తెలుసుకో.
అతడే పరిపూర్ణుడు; జ్ఞానం యొక్క గమ్యం.

ఇది ఆధ్యాత్మిక చింతన పరాకాష్ట
ఇది ఆధ్యాత్మిక చింతన పరాకాష్ట

రెండవ భాగము



దేహాన్ని, మనస్సుని ఉపయోగించుకొని
సర్వ జీవులలో ప్రతిష్ఠితమైన పరమాత్ముని తెలుసుకొందాం.
ఏకాగ్రతతో ఆనందంగా పరమాత్మునితో
ఏకమవుదాం. ధ్యానం అవలంబించి
ఇంద్రియాలను పరమాత్మ సేవకై ఉపయోగిద్దా౦.

అపరిమితము, సర్వత్ర ఉండెడి, సర్వజ్ఞుని
కీర్తి అతి ఉత్కృష్ఠమైనది. ప్రాణ శక్తిని వృధా
చెయ్యని జ్ఞానులకు అతడు తెలుసును.

పరమోత్కృష్ఠమైన ఆనందం యొక్క
పిల్లలారా, వినండి: మీరు పరమాత్మతో
ఐక్యం అవ్వడానికి పుట్టేరు. జ్ఞానుల మార్గాన్ని
అనుసరించి పరమాత్మతో ఐక్యమవ్వండి.

ధ్యానంతో కుండలిని శక్తిని మేల్కొలపండి.
మనస్సును, శ్వాసను నియంత్రించుకోండి.
పరమాత్మ ప్రేమను ఆశ్వాదించండి. మీరు
తప్పక ఐక్య స్థితిని పొందుతారు.

సృష్టికి కారణమైన పరమాత్మ సేవ నిరతము
చెయ్యండి. మీ దుఃఖానికి కారణమైన
వాటిని తొలగిస్తాడు; కర్మ పాశాలనుంచి
విడుదల చేస్తాడు.

వెన్నెముక తిన్నగా పెట్టి, మనస్సుని,
ఇంద్రియాలను అంతర్గతం చెయ్యండి.
మంత్ర జపం చేస్తూ భవ సాగరాన్ని
దాటి జననమరణాలకు అతీతులవ్వ౦డి.

మీ ఇంద్రియాలకు సేవకులిగా తర్ఫీదు ఇవ్వండి.
మీ కర్మలు నియంత్రించి లక్ష్యం వైపు మళ్లించ౦డి.
గుర్రపు పగ్గాలు పట్టుకొంటున్నట్టు మీ మనస్సుని
నియంత్రించండి.

ధ్యానానికి ఒక ప్రదేశం ఇలా చేసుకోండి:
శుభ్రత, ప్రశాంతత, చల్లదనము గలది;
రాళ్ళు, దుమ్ము లేని చదును నేల గల గుహ;
గాలి, వర్షము లేని స్థలము; కన్నులకు ఇంపుగా
నున్నది.

గాఢ ధ్యానంలో సాధకులు మంచు లేదా
పొగతో గూడిన రూపాలు చూస్తారు. ఈదురు
గాలి లేదా ఉష్ణము అనుభవిస్తారు. తమలో
దివ్యమైన కాంతిని చూస్తారు: మిణుగురు
పురుగులు, మెరుపులు, సూర్యుడు లేదా చంద్రుడు.
ఇవి బ్రహ్మన్ వైపు నడిచేటప్పుడు కలిగే చిహ్నాలు.

ఆరోగ్యం, తేలికైన దేహం, వాంఛలు లేకుండుట,
వర్చస్సు, మృదుమధుర గాత్రం, సువాసన: ఇవన్నీ
ధ్యానంలో పురోగతిని సూచిస్తాయి.

అద్దం మీద దుమ్ము తుడిచి వేస్తే ఎలా
మెరుస్తుందో, పరమాత్మను తెలుసుకున్నవారు
తేజస్సు కలిగి ఉంటారు. వారు జీవిత లక్ష్యాన్ని
సాధించి, దుఃఖాలను అధిగమిస్తారు.
సమాధి స్థితిలో పరమాత్మని తమ హృదయాలలో
చూస్తారు. పరిశుద్ధులై జనన మరణాలనుండి
విముక్తులవుతారు.

అన్ని జీవులలోని ఉన్న పరమాత్మ,
సృష్టి యోనిలో స్థితుడై ఉనాడు. అతడే
పుట్టినది, పుట్టబోయేది. అతని ముఖము
అన్ని చోట్లా ఉంది.

అగ్నిలోనూ, జలంలోనూ, మొక్కలలోనూ,
చెట్లలోనూ యున్న పరమాత్మని పూజిద్దా౦.

మూడవ భాగము



ఎటువంటి లక్షణాలు లేని బ్రహ్మన్ ప్రేమ
పూరితుడై తన వలతో సృష్టి పర్యంతము
కప్పి, దివ్య శక్తితో పరిపాలిస్తాడు.
అతడు సృష్టికి పూర్వము ఉన్నవాడు.
లయము తరువాత ఉండేవాడు. ఉన్నదంతా
అతడే. అతనిని తెలిసినవారు అమృతత్వమును
పొందెదరు.

ఉన్నదంతా పరమాత్మే. వేరొకటి లేదు.
అతడు అందరిలోనుండి పరిపాలిస్తాడు.
సృష్టిని తన నుండి వెలికి తీస్తాడు,
పాలిస్తాడు, కాలాంతమున
తిరిగి వెనక్కు తీసుకొంటాడు.

అతని కళ్ళు, నోరు, చేతులు, కాళ్ళు అన్ని
ప్రదేశాలలోనూ ఉన్నాయి. సృష్టిని
తన నుండి వెలికి దీసి, దాని స్థితికి
కారకుడు.

అతడే ప్రకృతి శక్తులకు యోని.
అతడు అందరినీ పరిపాలించే రాజు.
గొప్ప జ్ఞాని. సృష్టి యోనిలో శాశ్వతముగా
ఉండేవాడు. మన చేతన మనస్సును
పరశుద్ధము చేసేవాడు.

పరమాత్మా, మాకు శాంతి నీ
వలననే; నీ దివ్య స్వరూప దర్శనముతో
మా అపరిశుద్ధమైన ఆలోచనలు, భయములు
తొలగు గాక.

పరమాత్మా, ఎవరి వద్ద నుంచి అయితే మంత్రోపదేశము
అహంకారాన్ని అణచివేయుటకు పొందేమో,
మాకు దర్శనమివ్వు; మమ్మల్ని రక్షించు.

నువ్వు పరమోత్కృష్ఠమైన బ్రహ్మన్. కానీ నీవు
అందరి హృదయాలలోనూ ఉన్నావు.
నువ్వు సర్వ వ్యాపాకుడవు. నిన్ను తెలిసికొని
మేము అమృతత్వము పొందుతాము.

నేను పరమాత్మను అజ్ఞానాన్ని తొలగించే సూర్యుని
లాగ తెలుసుకొన్నాను. అతనిని తెలుసుకొన్నవారు
మృత్యువుని దాటుతారు. అమృతత్వానికి వేరొక
మార్గము లేదు.

అతనికంటే ఉన్నతమైనదేదీ లేదు. అతను తప్ప
వేరొకటి లేదు. అతని అపరిమిత్వము అన్నిటికన్నా
గొప్పది. అలాగే సూక్ష్మము. అతను తన స్వయం
ప్రపత్తితో సృష్టిని ఆవరించి యున్నాడు.

అతడు సృష్టిని ఆవహించి యున్నాడు. అలాగే సృష్టిని
అతిక్రమించి ఉన్నాడు. అతనిని తెలిసినవారు వేర్పాటు
పడరు. దుఃఖము, మరణము వారిని బాధించదు. పుట్టుక
బాధలను అనుభవించుటకే అని భావించరు.

పరమాత్మ సర్వ వ్యాపకుడు, అందరి హృదయాలలోనూ
ఉన్నవాడు, పరమ దయాళుడు, సృష్టి అంతా అతని
ముఖమును ప్రతిబింబిస్తుంది.

పరమాత్మ దయతో మన హృదయాలతో అతనిని
పొందే వ్యవస్థను సృష్టించేడు. అతడు ఎప్పటికీ
వెలిగే జ్యోతి.

అతడు హృదయంలో చిన్న జ్యోతిగా జీవుల
అంతర్గతంలో ఉన్నాడు. నిశ్చలమైన మనస్సుతోనే
అతనిని తెలుసుకోగలం. అతనిని తెలిసినవారు
అమృతత్వాన్ని పొందుతారు.

అతనికి వేల శిరస్సులు, కళ్ళు, కాళ్ళు ఉన్నాయి;
అన్ని దిక్కులనుండి సృష్టిని ఆవహించి యున్నాడు;
ఇట్టి అపరితమైన పరమాత్మ మన హృదయాలలోనూ
ఉన్నాడు. అతడే సృష్టిగా మారేడు. అతడు భూత,
భవిష్యత్ కాలాలకు చెందినవాడు. అయినప్పటికీ
మార్పు లేనివాడు. అమృతత్వాన్నిచ్చేవాడు.

అతని చేతులు, కాళ్ళు అంతటా ఉన్నాయి; అతని
శిరస్సులు, నోళ్ళు అంతటా ఉన్నాయి. అతడు
అన్నిటికీ ద్రష్ట, అన్నీ వింటాడు, సర్వ వ్యాపకుడు.

ఇంద్రియాలు లేకుండా దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు.
అతడు అందరికీ రాజు; అంతర్గతంలో పాలిస్తాడు.
రక్షకుడు. మిత్రుడు.

అతడు నవద్వారాలు కలిగిని పురంలో --
అనగా దేహంలో --నివసిస్తాడు. అతడు ప్రపంచంలో
తన అసంఖ్యాక రూపాలతో క్రీడిస్తాడు. అతడే
సృష్టికి యజమాని. జీవులు, జీవములేని పదార్థాలు
అతని రూపాలే.

అతడు కాళ్ళు లేకుండా పరిగెడతాడు; చేతులు
లేకుండా పట్టుకుంటాడు. కళ్ళు లేకుండా
చూస్తాడు. చెవులు లేకుండా వింటాడు. అందరినీ
తెలిసినవాడు. కానీ ఎవ్వరికీ అతను తెలియదు.
అతడే ప్రధముడు, గొప్పవాడు, చక్రవర్తి.

అతి సూక్ష్మమైన, అతి గొప్పవైన జీవరాసుల
హృదయాలలో పరమాత్మ ఉన్నాడు. అతని
కరుణ వలన మనము స్వార్థపూరిత కోర్కెలు,
దుఃఖాలనుండి విడుదల పొంది, అతనితో
ఐక్యమవుతాం.

శ్వేతాశ్వతార మహర్షి ఇలా చెప్పెను:
నాకు పరమాత్మ శాశ్వతుడు, అపరిమితుడు అని తెలుసును.
అందరి దేహాల్లో అతడే ఆత్మ. జ్ఞానులు అతనిని
నిత్యునిగా భావిస్తారు.

నాల్గవ భాగము



ప్రపంచాన్ని సృష్టించి, అనేక రూపాలను దాల్చి,
జీవులను తననుండి జనింపజేసి, వాటిని
తనలోనే లయముచేసే పరమాత్మ మాకు
జ్ఞానమును ప్రసాదించుగాక

అతడే అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు.
అతడే గాలి, సముద్రము, సృష్టి కర్త, ప్రజాపతి.

అతడీ బాలుడు; ఆ బాలిక; ఈ పురుషుడు; ఆ స్త్రీ;
ఆ కర్ర పట్టుకొని నడుస్తున్న వృద్ధుడు. అతని ముఖము
అంతటా ఉన్నది.

అతడే ఆ నీలిరంగు పక్షి; ఎర్రని కళ్ళతో యున్న
ఆకుపచ్చ పక్షి; ఉరుములు మెరుపులు కల్పించు
మేఘము. అతడే ఋతువులు, సముద్రాలు. అతనికి
ఆద్యంతాలు లేవు. సర్వ జగత్తులకు యోని.

అతని దివ్యమైన శక్తి వలన మాయ నుండి నామరూపాత్మకములు
పుట్టినవి. మనలో అవి బాధను, క్లేశాన్ని కలుగ జేస్తాయి.
ఆ మాయా తెరను తీసివేస్తే, బహు రూపాలుగా వ్యక్తమయ్యే
వానిని చూడగలం.

ఒక అందమైన పక్షుల జంట ఒకే చెట్టు మీద
నివసిస్తున్నాయి. ఒకటి బాధ, ఆనందములతో
కూడిన ఫలాలను ఆరగిస్తుంది. రెండవది
ఏమీ తినకుండా కాలం గడుపుతుంది.

మనము పరమాత్మ అంశలమని తెలియక,
సదా మారే ప్రపంచ వ్యాపారములలో తలమునకలై,
మన అసత్తువను ప్రకటిస్తాం. కానీ అందరిచేతా
పూజింప బడిన, ఉత్కృష్ఠుడైన పరమాత్మని తెలిసికొని,
దుఃఖాలను అధిగమిస్తాం.

శాస్త్రములన్నిటికీ ఒకటే యోని అని, వాటిని పాటించి
దేవతలు, లోకాలు ఉన్నవని తెలియనివానికి
వాటివల్ల ఏమి లాభం? పరమాత్మ తమ హృదయంలో
ప్రతిష్ఠుతుడై ఉన్నాడని తెలుసుకొనేవారు అమితమైన
ఆనందము అనుభవిస్తారు.

పరమాత్మ ఒక మాయవిలాగ తననుండే: శాస్త్రాలు,
యజ్ఞయాగాదులు, ఆధ్యాత్మిక కర్మలు, భూతభవిష్యత్
కాలాలు, సృష్టినంతా వెలికి తీసేడు. మాయ వలన
అదృశ్యమై అందరి హృదయాలలోనూ నెలకొనియున్నాడు.

అతడు ఒక మాయావి లాగ సమస్త లోకాలను తననుండే
సృష్టించేడు. అన్ని జీవులు అతని తేజస్సులో
ఓలలాడుతున్నాయని తెలుసుకో.

అతడు పరమోత్కృష్ఠమైన మాయావి లాగ
ఆడ, మగ, పక్షి, జంతువు రూపాలను ధరించి యున్నాడు.
అతడే మనకు దివ్య ఆశీస్సులు ఇచ్చేవాడు.
అతని వలన మన హృదయములు శాంతితో
నిండి ఉంటాయి.

అతడు దేవతలందిరికీ కారకుడు; జగత్తుకు ఏకైక
ఆధారము, బంగారు జీవ బీజానికి కారకుడు. అట్టివాడు
మనకు జ్ఞానము ప్రసాదించు గాక.

అతడు దేవతలకు దేవత. అతని వలన సమస్త
లోకాలూ శ్వాస తీసుకొంటున్నాయి. అంతర్గతం నుండి
అన్ని జీవులను పాలి౦చేవాడు. అతనిని అందరూ
పూజించుగాక.

అతడు అన్నిటినీ ఆవహించి యున్నాడు. ఆయన ముందు
సమస్త సృష్టి సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుకన్నా చిన్నది.
అట్టి శివుడు మన హృదయాలను అపరిమితమైన
శాంతితో నింపుగాక.

అతడు సృష్టికి రక్షకుడు. జీవుల అంతర్గతంలో నుండి
వాటిని రక్షిస్తాడు. అతనికి అన్ని జీవులు సమానము.
అట్టి శివుడు మనను మృత్యువు నుండి దాటించు గాక.

అతడు పరమోత్కృష్టుడు; మనందరి హృదయాలలో,
పాలలో మీగడ వలె యు౦డి సమస్త సృష్టిని
ఆవహించియున్నాడు. అట్టి శివుడు మనలను
బంధవిముక్తులను చేయుగాక.

అతడు విశ్వ కర్మయై జీవుల హృదయాలలో నెలకొన్నాడు.
అతనిని ధ్యానంతో పట్టుకో. అతడు మనకి
అమృతత్వము ప్రసాదించుగాక.

అతడు అన్ని మతాలకూ యోని; వెలిగే లోకాలకు
పాలకుడు; పగలు చీకటి లేని లోకాలకు కూడా;
ఇది ఉంది, ఇది లేదు అని చెప్పనలవికాని
శివుడు. అతనిని మనస్సుతో పట్టుకోవడం
సులభం కాదు. అతడే సకలం. అతని కీర్తి
సమస్త లోకాలలో మార్మ్రోగుతుంది.

అతడు చూపుకు అందడు. అతడే సర్వస్వం. అట్టి
శివుడు గాఢ ధ్యానములో మనకు కనిపించి,
అమృతత్వమును ప్రసాదించుగాక.

పరమాత్మా, నేను మృత్యువుకు భయపడుతాను;
నాకు నీ పాదాలే శరణ్యం. నన్ను రక్షించు.
మా పురుషులను, స్త్రీలను, పశువులను, గుర్రాలను
రక్షించు. మాలో ధైర్యవంతులు నిన్ను ఆశ్రయించి
మృత్యువును అధిగమించుగాక.

ఐదవ భాగము



జీవ ఐక్యతను తెలుసుకొంటే మృత్యువును
అధిగమించవచ్చు. అలా కాకపోతే మృత్యువాత
పడక తప్పదు. రెండూ అపరిమితమైన బ్రహ్మన్
యందు దాగి యున్నవి. అతడు వాటికి అతీతుడు.

అతడు అందరినీ వారి అంతర౦గంలో నుండి
పాలించేవాడు. కాలము మొదలు పెట్టినపుడు
బంగారు జీవ బీజాన్ని నాటుతాడు. దాని ద్వారా
జీవుల ఐక్యతను తెలుపుతాడు.

అతడు పుట్టుక, మరణములతో కూడిన వలను
వేసి తన వైపు లాక్కుంటాడు. అతడు సృష్టి
శక్తులకు కారకుడు.

సూర్యుడు సృష్టిని వెలుగుతో నింపినట్లు,
మన క్రింద, మీద, అన్ని వైపులనుండి పరమాత్మ
మన హృదయాలను కాంతితో నింపుతాడు.

అతని నుండి సృష్టి వచ్చినది; అతడు ప్రతి జీవి
తన స్వభావమును అనుసరించి పరిపూర్ణత పొందుతుందని ఆశించి శిక్షణ
నిస్తాడు. అతడు సర్వ జీవుల పగ్గాలను పట్టుకొన్న
పరమాత్మ.

శాస్త్రాలలో గుహ్యంగా యున్న సర్వోత్కృష్టమైన
సృష్టి కర్త అతడే; అతనిని తెలిసికొని దేవతలు,
జ్ఞానులు అమృతత్వాన్ని పొందేరు.

సుఖదుఃఖాల వలయంలో చిక్కుకొని మనం
బంధాలతో సతమతమవుతున్నాం. మన
కర్మకు మనమే కారణమైనప్పటికీ, పుట్టిన
దగ్గర నుంచి, మరణించే వరకు, క్రొత్త కర్మలు
చేస్తూ ఉంటాము.


పరమాత్మ ఒక బొటన వేలు పరిమాణంలో మన
హృదయంలో నుండి, సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు.
కాని అహంకారం తలెత్తితో అతడు సహించడు.
పరమాత్మ ఒక వెంట్రుక పరిమాణముకన్న చిన్న
దైనప్పటికీ, అతడు అపరిముతుడు.

పరమాత్మ దేహాన్ని ధరించి అనేక రూపాలు
పొందుతాడు: మన అవసరం బట్టి, క్రిందటి జన్మల కర్మలను బట్టి
లావు లేదా సన్నం గా కనపడుతాం. ఈ పరిణామము
వాని శాసనము.

వానిని ప్రేమించి స్వతంత్రుడవు కా. అతడు బహు
రూపములతో వ్యక్తమై, సృష్టిని ఆవరించి,
ఆద్యంతములు లేక ఉన్నాడు. పరిశుద్ధమైన
హృదయము ఉన్నవారు మాత్రమే అతనిని
పొందగలరు.

అట్టి సృష్టికర్త, లయకర్త అయిన, అమితమైన
సౌందర్యము, జ్ఞానము గల పరమ శివుడు
మనలను జన్మ మరణ చక్రం నుండి విడుదల
చేయుగాక.

ఆరవ భాగము



జ్ఞానులు జీవితము స్వయంగా మనము చేసుకొన్న
కర్మ అని అంటారు; కొందరు జీవితము కాలముతో
పరిణమించినది అంటారు. నిజానికి
సృష్టి పరమాత్మ నుండి ఆవిర్భవించినది.

అతడు శుద్ధ చైతన్యము, సర్వా౦తర్యామి,
గొప్ప శక్తులు గలవాడు, సర్వజ్ఞుడు, కాలాన్ని
సృష్టించినవాడు, త్రిగుణాలను జయించినవాడు.
జీవుల పరిణామమునకు కారకుడు.

ఎవరైతే నిస్వార్థముగా, క్రమశిక్షణతో జీవనము
సాగిస్తారో, వారు కాల క్రమమున పరమాత్మ
నియమమైన జీవులన్నీ సమానమని తెలుసుకొంటారు.
వారు పరమాత్మకై సేవచేసి కర్మ లేకుండా
ఉంటారు.

అతడు జీవులన్నిటికీ ప్రధమ యోని; అతని కీర్తి
సృష్టి అంతా వ్యాపించి ఉన్నది; అతడు
దేశకాలాలకు అతీతుడు. కానీ ధ్యానంలో
తెలుసుకొనబడేవాడు.

అతడు వృక్షము వంటి జీవితానికి అతీతుడు.
అతని శక్తి వలన గ్రహాలు తిరుగుతున్నాయి.
అతడే శాసన కర్త, దయామయుడు. కానీ
ధ్యానంలో తెలుసుకొనబడేవాడు.

అతడు కారణము లేని కారణము. అతనిని
మించి --తండ్రి కానీ, యజమాని కానీ --
ద్వితీయము లేదు. గూడులో సాలె పురుగు
వలె, జీవులలో నిఘూడంగా ఉన్న పరమాత్మ
మనకు జ్ఞానము ప్రసాదించు గాక.

అతడు మన అందరి హృదయాలలోనూ ఉన్నాడు.
అతడే సర్వానికి సాక్షి. శుద్ధ చైతన్యము. మన
కర్మలను అంతర్గతం నుండి చూస్తాడు. త్రిగుణాతీతుడు.

పరమాత్మ చేతిలో మనము పనిముట్లము. మనము
అతనిని చేతన మనస్సుతో పట్టుకొని, వర్ణింప
శక్యముకాని ఆనందమును అనుభవించెదము గాక.

మారే వాటిలో మారని వాడు. చైతన్యానికి
చైతన్యము. మన ప్రార్థనలను మన్నించేవాడు.
మనము చేతన మనస్సుతో అతనిని పట్టుకొని,
అతను ఒక్కడే ఇవ్వగలిగిన అమృతత్వమును
పొందెదము గాక.

అతనులేక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు,
మెరుపు, భూమి మీద అగ్ని ప్రకాశవంతములు గావు.
ప్రతీ వస్తువు ఆయన ప్రతిబింబము.
మనము చేతన మనస్సుతో అతనిని పట్టుకొని,
అతను ఒక్కడే ఇవ్వగలిగిన అమృతత్వమును
పొందెదము గాక.

అతడు సృష్టికర్త, స్వయంభు, సర్వజ్ఞుడు, మరణాన్ని
నశింపజేయగలవాడు, అందరి అంతర్గతంలో
ఉన్నవాడు, జననమరణ చక్రాన్ని
నడిపేవాడు. మనము చేతన మనస్సుతో అతనిని పట్టుకొని,
అతను ఒక్కడే ఇవ్వగలిగే అమృతత్వమును
పొందెదము గాక.

అతడు సృష్టిని రక్షించేవాడు; అతనికే పూర్ణ కీర్తి,
సర్వజ్ఞత్వము, సర్వవ్యాపాకత్వము. అతను లేక
వేరొక పరిపాలన కర్త ఎవ్వరు? మనము చేతన మనస్సుతో అతనిని పట్టుకొని,
అతను ఒక్కడే ఇవ్వగలిగిన అమృతత్వమును పొందెదము గాక.

నాకు జననమరణ చక్రాన్ను౦చి తప్పించ గలిగే శివుడే శరణ్యం.
కాలము మొదట్లో శాస్త్రములిచ్చిన శివుడే నాకు శరణ్యం.
పరిశుద్ధము, సంపూర్ణము ప్రసాదింపగలిగే శివుడే నాకు శరణ్యం.
మరణం నుండి అమృతత్వానికి వంతెన వంటి శివుడే నాకు శరణ్యం.
అతని పాదాలను పట్టుకోవాలనే తృష్ణ కలుగజేసిన శివుడే నాకు శరణ్యం.

మనము ప్రపంచాన్ని ఒక జింక చర్మము లాగ ఎలాగ చుట్టపెట్టగలం?
మన హృదయాలలో వసిస్తున్న పరమాత్మని తెలుసుకొనలేక
మన దైన్యమైన జీవితాలను ఎలా గడపగలం?

శ్వేతాష్వతర మహర్షి ధ్యానంలో పరమాత్మను తెలిసికొని,
అమితమైన ప్రేమతో, ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని తన
భక్తులైన శిష్యులకు ప్రసాదించెను.

సృష్టి ఆదిలో తెలిసికొన్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానము
పరిశుద్ధమైన హృదయముగల వారు లేదా
శిష్యులైనవారు తమ బిడ్డలకు బోధించవచ్చు.
నీకు పరమాత్మ యందు సంపూర్ణమైన ప్రేమ ఉంటే,
గురువుపై పూర్తి ప్రేమ ఉంటే, ఈ బోధతో నీ
హృదయము ప్రకాశిస్తుంది. అది తప్పక ప్రకాశిస్తుంది.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...