Chapter 1
బుద్ధుడు దేవుని ప్రస్తావన చేయలేదు కదా?
అవును. కొందరు అతనిని నాస్తికుడని
అన్నారు. నిజానికి బుద్ధుడు ప్రజల దృష్టిని
ఇప్పుడే, ఇక్కడే పొందే ఆనందం
వైపు తిప్పేడు. అందువలన దేవుని
గూర్చి అంతగా ఆలోచించలేదు.
భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రం
మొదలగు శాస్త్రాల వలన ముక్తి
మరియు ఆత్మ జ్ఞానము పొందడం
సాధ్యమా?
చాలా తక్కువ. యోగా గురించి
అనేక గ్రంథాలు ఉన్నాయి. వాటిని
చదివి ఎంత జ్ఞానం సంపాదించినా
అనుభవం లేకపోతే అది సార్థకం
కాదు. ఒక గురువుద్వారా నేర్చుకొని
సాధన చెయ్యాలి. అంతర్దృష్టితో
సత్యాన్ని, దాని స్వభావం మరియు
ఉపయోగాన్ని తెలిసికోవాలని ఎంతో
కృషి చెయ్యవచ్చు. కానీ అనుభవం,
సత్సంగం లేకపోతే అది
ఆలోచనలకే పరిమితమవుతుంది. ఒక్క పుస్తక
జ్ఞానం ఉంటే దాని వలన లాభం
లేదు. ఆత్మ జ్ఞానం పొందితే మనస్సులో
మోసే తక్కినవన్ని౦టినీ తీసి
పారేయవచ్చు.
"మనం ఎక్కడనుంచి వచ్చేము?"
అని విచారణ చెయ్యనివారికి
పుస్తకాలు చదివితే ప్రయోజనం
లేదు. అట్టివారు అరిగిపోయిన
గ్రామొఫోన్ రికార్డ్ వలె ఉ౦టారు.
ముక్తి అహంకారంతో ప్రవర్తించే
చదువుకున్నవారికన్నా నిరక్షరాశ్యులకే
తేలికగా వస్తుంది. నిరక్షరాశ్యులకు
దేహాభిమానం ఉండదు; అనేక
తత్త్వ విచారణతో కూడిన ఆలోచనలు
ఉండవు; అలాగే సంపదల వెనుక
పరిగెత్తరు. కాబట్టి దుష్ప్రభావముల
నుండి విముక్తులై ఉంటారు.
చదువుకున్నవారే అజ్ఞానంతో
కూడిన భ్రాంతితో తమ హృదయ౦లో
వ్యవస్థితమైయున్న ఆత్మ యొక్క
విచారణ చెయ్యకుండా, ఆత్మ
నిజమా లేదా అసత్యమా, దానికి
రూపం ఉందా లేదా, అది ద్వైతమా
అద్వైతమా అని సతమతమవుతూ
ఉంటారు.
సంపూర్ణము, నిత్యము అయిన
పదార్థం నుంచి అది కాని
వస్తువు ఏదైనా తయారవుతుందా?
ఇటువంటి వాదనకి అంతం లేదు.
కాబట్టి అట్టి ఆలోచనల నుంచి
దూరంగా ఉండండి. మనస్సుని
అంతర్ముఖం చేయండి. అనుమానాలకు
అంతం ఉండదు.
శాస్త్రాలు ఉత్కృష్టమైన పరమాత్మ
గూర్చి వివరించి మనకు మార్గ
నిర్దేశకము చేస్తాయి. అది తప్పితే
వాటి వల్ల ఇంకే ఉపయోగం లేదు.
కానీ అవి కోకొల్లలుగా ఉండడం వల్ల
సాధకులపై వాటి ప్రభావం ఉండవచ్చు.
సాధకుడు సాధనతో జ్ఞానమనే
మెట్లను ఎక్కుతూ, ఒక్కొక్క మెట్టూ
తన గమ్య౦ కి చేరువుగా తీసికెళుతుందని
నమ్ముతాడు. అలా లక్ష్యాన్ని సాధిస్తే,
శాస్త్రాలు మొదలగు వాటి అవసరం
లేకుండాపోతుంది.
అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించే
శాఖలు విషయాన్ని కరతలామలకం
చేసి సత్యాన్ని చూపకుండా, లేనిపోని
తికమకలో పెడతాయి. ఏది అర్థం
చేసికోవాలన్నా ఆత్మ సత్ అని
భావించాలి. ఆత్మను అతి తేలికగా
తెలిసికోవచ్చు. కాబట్టి స్వస్వరూపంలో
ఎందుకుండగూడదు? అనాత్మ గురించి
ఆలోచించవలసిన అవసరమేది?
నేను అనాత్మ గూర్చి పరిశోధన
స్వతహాగా చెయ్యని
అదృష్టవంతుడను. అదే చేసుంటే
నేను ఆగమ్యగోచరంగా చరించే
వాడను. నా స్వభావం, సంస్కారాలు
వలన నేరుగా "నేనెవరిని?" అని
విచారణ మొదలుపెట్టేను. కాబట్టి
నేను అదృష్టవంతుడను.