Thursday, March 10, 2022

Chapter 18 Section 14

18.14

ధృత్యా యయా ధారయతే మనః ప్రాణే౦ద్రియక్రియాః {18.33}

యోగేనా వ్యభిచారిణ్యా ధృతి స్సా పార్థ సాత్త్వికీ

పార్థా! ఏ ధైర్యముచేత మనస్సు, ప్రాణము, ఇంద్రియ చేష్టలను మనుజుడు చెదరకుండా నిలుపు చున్నాడో అట్టి దానిని సాత్త్విక ధృతి అందురు

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున {18.34}

ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ రాజసీ

ఫలము నాశి౦చువాడు దేనిచేత ధర్మార్థకామములను ఆసక్తితో ఆశ్రయించుచున్నాడో, పార్థా! అది రాజస ధృతి యగును

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ {18.35}

న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్థ తామసీ

పార్థా! ఏ ధైర్యము చేత దుర్బుద్ధి గలవాడు స్వప్నమును, భయమును, శోకమును, విషాదమును, మదమును విడువకున్నాడో అట్టి ధృతి తామసిక ధృతి యగుచున్నది ఀ

వ్యక్తులను మేధస్సు లేదా తెలివితేటలతో కాక పట్టుదల గలవారుగా చూడవచ్చు. ప్రతిచోటా ఐ క్యు అనగా ఇంటెలిజన్స్ కోష౦ట్ నే చూస్తారు. అది ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. కాని పట్టుదల మేధ అంతటి ఉన్నత లక్షణము.

పట్టుదల తక్కువగా ఉంటే దానివలన మనం తీసికొనే నిర్ణయాలు కూడా అస్పష్టంగా ఉంటాయి.

సంస్కృతంలో పట్టుదలను ధృతి అంటారు. ధ్రి అనగా ఆధారము. దాని లోంచే ధర్మము కూడా వచ్చినది. ధృతి మనకు ఆదరవుగా ఉండి సామరస్యం, చైతన్యం, బలం ఇస్తుంది. గాంధీ "బలం శారీరిక పుష్టితో కాక అసాధ్యమైన పట్టుదలవలన వస్తుంది" అన్నారు. క్లిష్టమైన పరిస్థితులలో, సంపద హరించిపోయి, మిత్రులు వీడిపోయి ఉంటే పట్టుదలతో నిలదొక్కుకోవచ్చు. ఈ విషయం గాంధీ జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆయన అతి చెడ్డ ప్రతిపక్షాన్ని, దూషణని, నమ్మక ద్రోహాన్ని , తన జీవిత చరమదశ వరకు చూసేరు. అలాగే తెరెసా ఆఫ్ ఆవిలా, సెయింట్ ఫ్రాన్సిస్ మొదలగువారు.

గీత చెప్పేది: మనకు భద్రత, మన కాళ్ళ మీద నిలబడే శక్తి కావాలంటే మన పట్టుదలను వృద్ధి చేసికోవాలి. అలాగే ఇతరులను ప్రేమించి వారిచే ప్రేమించ బడడం, అవసరమైనప్పుడు మిత్రులు సహాయం చేయాలంటే పట్టుదల చాలా అవసరం. పట్టుదలను పెంపొందించు కోవాలంటే ప్రయత్నం, మెళుకువ అవసరం.

సాత్త్వికమైన ధృతి ప్రాణ శక్తిని శరీర అవయవాలకు, ఇంద్రియాలకు, మనస్సుకు సమంగా పంచుతుంది. ప్రాణ శక్తి కోరికలవలన వృధా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే బలమైన పట్టుదల, తెలివి ఉండాలి. మనస్సులో స్వార్థ పూరితమైన ఆలోచనలను కట్టిపెట్టి మంచి ఆలోచనలను పాటించాలి. ఒక స్వార్థ పూరితమైన ఆలోచనను నియంత్రించిన దాని వలన ప్రాణ శక్తితో ఎన్నో లాభములను పొందవచ్చును. ఇది ఎలాగంటే బ్యాంక్ లు ఇచ్చే చక్రవడ్డీ వంటిది. మన ప్రాణ శక్తిని కోరికలకై వ్యర్థం చేయకుండా ఉంటే, చైతన్యం చక్రవడ్డీలాగ పెరుగుతుంది.

ఇది అతిశయోక్తి కాదు. గాంధీ 60 ఏళ్ల వయస్సులో ఆయన దైనందిన కార్యక్రమము చూస్తే ఒక సామాన్యుని కన్న కోటి రెట్లు ప్రాణ శక్తి ఉన్నదనిపిస్తుంది. ఉదయం మూడు గంటల నుండి అర్థరాత్రి వరకు వివిధ నాయకులతో మంతనాలు చేసి, పాత్రికేయులతో మాట్లాడేవారు. భారత దేశ భవిష్యత్ ఆయన పలికే మాటల మీద ఆధారపడి ఉంది. ఆయన దాని గురించి వ్రాస్తూ తాను ఆ సమయంలో వృద్ధి చెందేనని చెప్పేరు. ఆయన దృష్టిలో సవాలు లేని జీవితం వ్యర్థమని. స్వార్థంతో కాక మన జీవితాన్ని మలచుకుంటే మనకున్న శక్తి బహిర్గితమవుతుంది. 421

Chapter 18 Section 13

Bhagavad Gita

18.13

బుద్ధేర్భేదం దృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు {18.29}

ప్రోచ్యమాన మసేషేణ పృథక్త్వేన ధనంజయ

ధనంజయా! గుణముల ననుసరించి బుద్ధి యొక్కయు, ధైర్యము యొక్కయు భేదము మూడువిధములుగ చెప్పబడినది. సంపూర్ణముగ, వేర్వేరుగ చెప్పబడు ఈ విషయమును ఆలకింపుము

ప్రవృత్తి౦ చ నివృత్తి౦ చ కార్యా కార్యే భయాభయే {18.30}

బంధం మోక్షం చ యావేత్తి బుధ్ధి స్సా పార్థః సాత్త్వికీ

అర్జునా! ప్రవృత్తి నివృత్తి విషయములను, కార్యాకార్యములను, భయాభయములను ఏదయితే తెలిసికొనుచున్నదో ఆ బుద్ధి సాత్త్వికమైనది

యయా ధర్మమధర్మం చ కార్యం చా కార్యమేవ చ {18.31}

అయథావ త్ప్రజానాతి బుద్ధిస్సా పార్థః రాజసీ

అర్జునా! ధర్మాధర్మములను, కార్యాకార్యములను ఉన్న దున్నట్లుగాక భిన్నముగ గ్రహించెడి బుద్ధి రాజస బుద్ధి యనబడును

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా ఆవృతా {18.32}

సర్వార్థాన్ విపరీతా౦శ్చ బుద్ధి స్సా పార్థ తామసీ

పార్థా! ఏ బుద్ధి అజ్ఞానముచేత కప్పబడి అధర్మమును ధర్మముగను, సమస్త విషయములను విపరీతముగను గ్రహించుచున్నదో అది తామసిక బధ్ధి యనబడును ఀ

ఈ పై శ్లోకాలు బుద్ధి గూర్చి చెపుతున్నాయి. బుద్ధి అనగా తెలివి తేటలనే గాదు. వివక్షతో గూడిన తెలివి తేటలు. ఒక వస్తువుని చూడడమే కాదు, దాని అంతర్భాగములను కూడా చూచుట. మనము వ్యక్తులను భౌతికమైనవిగా కాక, వారి ఆత్మను చూడవలెను. ప్రపంచాన్ని చూడడమే గాక, దాని లోపల యున్న ఐక్యమత్యాన్ని కూడా చూడాలి. అలాకాక పోతే ఏదీ అర్థము కాదు. మనకు మంచి చెడు ఎన్నికల మధ్య తేడా తెలియదు.

తామసికుని బుద్ధి చీకటితో నిండి ఉంటుంది. వాడు తప్పుని ఒప్పని, ఒప్పుని తప్పని వాదిస్తాడు. అది నీతికి సంబంధించిన విషయాలకే పరిమితం కాదు. తామసికుడు ఇతరుల యందు దయ చూపడు. వాని బుద్ధి తప్పుని ఒప్పని చెప్తున్నాసరే. సమిష్ఠిలో తామసమును చూడవలెనన దిన పత్రికల వార్తలను చదివితే చాలు.

రాజసికుని బుద్ధి కొన్ని సార్లు తేటగా ఉంటుంది. కానీ స్వార్థమునకు సంబంధించిన విషయాలలో గజిబిజిగా ఉంటుంది. నేను కలిసిన కొందరు వ్యక్తులు తమ ఉద్యోగాలలో మిక్కిలి ఘనత సాధించినవారు. కానీ వారు భావోద్వేగంతో ఉంటే మూర్ఖుల్లా లేదా పిల్లల్లా వ్యవహిరిస్తారు. అట్టి వాళ్ళు రాజసికులు. నేను తలచేది సైన్స్ తదితర విభాగాలు సాత్త్వికంగా, నిస్వార్థంగా ఉండాలని.

తామసికులు, రాజసికులు సైన్స్ లో చేతులుకలిపితే కలిగేది విపత్తు. తామసికునికి ఏది ఒప్పో ఏది తప్పో తెలియదు. రాజసికుడు ఏది ఏమైనా పట్టించుకోడు. జన్యు శాస్త్రజ్ఞ్నులు సూక్ష్మక్రిములలో జన్యువులను మార్చి, మనకు కావలిసిన రసాయనాలను చేసుకోవచ్చు అని ప్రకటించేరు. దీనిలో సత్యం ఉన్నది కాని వారి మానసిక స్థితి అలా కాదు. జీవితం నుండి ఏది బలవంతంగా లాగుకొన్నా దానికి పర్యావసానము ఉంటుంది. అది తామసిక పద్దతి.

"మేము పరిణామాన్ని వేగవంతం చేసేము. ఒక సూక్ష్మ క్రిమిని అధ్యయనం చేసి, దాని జన్యువులను మార్చి మనకు కావలసిన లక్షణాలను ఎన్నుకోవచ్చు" అని చెప్పేరు. ఇటువంటి సాంకేతికత ఎంతో శక్తివంతమై నియంత్రింపక బడక అనేక అనార్థాలను కలిగిస్తుంది. అణుశక్తి వ్యర్థాలను మనమెలాగ వదిలించుకోవాలో తెలీదు. వాటిని నదులలో పడేయలేము. ప్రాణుల గూర్చి అధ్యయనం చేసే ఇంజనీర్ లు సూక్ష్మక్రిములతో పనిచేయడానికి మొగ్గు చూపుతారు. ఆ క్రిములు అనేక వ్యాధులను తెచ్చేవి. ఇ కొలై అనబడే సూక్ష్మ క్రిమి మన ప్రేగులలో ఉంటుంది. అవిగాని జన్యుమార్పు చెంది మనం త్రాగే నీళ్ళలో, తినే ఆహారంలో ఉంటే ఎటువంటి అనార్థాలు కలుగుతాయో ఎవరూ చెప్పలేరు. క్రొత్త అంటువ్యాధులు రావచ్చు. సంస్థల తక్కువ కాలంలో వచ్చే లాభం కోసం, దీర్ఘ కాలంలో కలిగే సమస్యలను కప్పిపుచ్చుతాయి.

కొందరు మంచి శాస్త్రజ్ఞులు దీర్ఘంగా ఆలోచిస్తారు. ప్రొఫెసర్ లైబ్ కావలీరి (కార్నెల్ మెడికల్ స్కూల్) క్రిస్టియన్ సైన్స్ మానిటర్ లో వ్రాస్తూ మన ప్రస్తుత సమస్యలు శాస్త్రవేత్తలకు సంపూర్ణ అవగాహన లేకపోవడం వలననే అని చెప్పేరు. ఆ శాస్త్రవేత్తలే ఇప్పుడు జన్యువులను మార్పిడి చేద్దామంటున్నారు. వారి అవగాహన పూర్తిగా లేకపోవడం వలననే కదా ఇన్ని విపత్తులు కలుగతున్నాయి. జన్యువులని మార్చినంత మాత్రాన మనకున్న సమస్యలను పరిష్కరించలేము.

జన్యు శాస్త్రము యొక్క లోభత్వము విద్యాలయాలకు కూడా ప్రాకింది. రెండవ ప్రపంచ యుద్ధం లగాయతు విద్యాలయాలు ఆయుధాలు, ఆహారం, మందులు గూర్చి పరిశోధనలు చేసేయి. ఒక సైన్స్ విద్యార్థి తన చదువు భౌతికమైన ప్రపంచం గురించి కాక ఆయుధాలు మొదలగు అంశాలను పరిశోధన చేస్తున్నాడు. దానివలన కొందరు ప్రొఫెసర్ లు తమ పరిశోధనతో సంస్థలను స్థాపించి లాభం పొందాలని ఆశిస్తారు. ఇది మరింత లాభం పొందాలనే విద్యాలయాలకు సమ్మతము. నేను అట్టివారలను శాస్త్రజ్ఞులు అనను. వారు తీరికలో విద్యను బోధించే వ్యాపారస్తులు. నాకు ఒక ఉపాధ్యాయునికి బోధించడం ఇష్టం లేకపోతే ఫరవాలేదు. కానీ బోధన, తీవ్ర స్థాయిలో స్వార్థం కలిసి ఉండలేవు. అలాగే వాళ్ళకి తక్కువ వేతనం ఇయ్యమనట్లేదు. నేను చెప్పేది అమితమైన లాభం కోసం చేసే పనులు. వాళ్ళు నైతిక విలువను పాటించి తక్కినవాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు లాభాలకై పనిచేసే సంస్థలలో పనిచేయడం మంచిది కాదు.

పరిశోధనలకు ప్రభుత్వం, సంస్థలు ఎక్కువ మొత్తంలో ధనాన్ని వెచ్చిస్తాయి. అట్టి పరిశోధనల ఉద్దేశం: ఆయుధాల తయారీ లేదా సాధారణమైన వినియోగదారులకు వస్తువులు తయారు చేయడం. క్రొత్తగా వచ్చే విద్యార్థులు వేరే ఎన్నిక లేక అవే చేస్తారు. నేను చెప్పేది స్థూలంగా డబ్బు మరియు మేధ ఆ పరిశోధనలకై వినియోగిస్తున్నారు. టోయిన్ బీ చెప్పినట్లు: మానవాళి సాంకేతిక పరిజ్ఞానం ఇంత ఎక్కువగా వృద్ధి చెందటానికి కారణం, అనేకమైన వ్యక్తులు తమ శక్తిని దానికై దారపోసేరు. ఇప్పుడు శాంతికై, మానవాళి స్వస్థత కై ముందుకు రావాలి. మనము వీటిలో విఫలమైతే భవిష్యత్ లో ఏ చరిత్రకారుడు మన కంప్యూటరు జ్ఞానం గురించి పొగుడుతూ వ్రాయడు. 419

Chapter 18 Section 12

Bhagavad Gita

18.12

ముక్తసంగో అనహంవాదీ ధృత్యుత్సాహ సమన్వితః {18.26}

సిద్ధ్యసిద్ద్యో ర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే

ఫలాపేక్ష రహితుడును, అహంకారము లేనివాడును, ధైర్యముతోను, ఉత్సాహముతోను గూడిన వాడును, కార్యములు సిద్ధించినను, సిద్ధించకపోయినను వికారము చెందని వాడును అగు కర్త సాత్త్విక కర్తయని చెప్పబడును

రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఅశుచిః {18.27}

హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః

అనురాగము గలవాడు, ఫలాశ గలవాడు, లోభియు, హింసా ప్రవృత్తి గలవాడు, శుచిత్వము లేనివాడు, హర్షశోకములతో గూడినవాడును అగు కర్త రాజస కర్తయని చెప్పబడును

ఆయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో అలసః {18.28}

విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే

యుక్తుడు గానివాడు, పామరుడు, జడుడు, వంచకుడు, ఇతరుల బ్రతుకులను పాడుచేయువాడు, సోమరి, దుఃఖించువాడు, కాలయాపన చేయువాడు తామస కర్త యని చెప్పబడెను

కర్త అనగా ఒక కార్యమును చేయువాడు. పై శ్లోకములు కర్త యొక్క లక్షణములు, నడవడిక వెనుకనున్న మానసిక స్థితి తెలుపుచున్నవి.

స్వార్థపూరితునకు రాజసిక, తామస ఆలోచనలు వచ్చిన, మనస్సు స్థిర భావనలతో గూడి, చేతనము యందు చీకటి నెలకొలును. అట్టివారు తమకు తెలియకుండానే చీకటిలో బ్రతికెదరు. వారికి తెలిసిన ప్రతిఒక్కటీ కాంతివంతమని తలుస్తారు. సరిగ్గా చూడలేక, వాళ్ళు దారుణమైన కార్యాలు చేస్తారు. ఎక్కడైతే ప్రమాదము లేదో వాళ్ళు అనుమానిస్తారు. ఎక్కడైతే జాగ్రత్తగా ఉండాలో వాళ్ళు పరిగెత్తుకు వెళతారు. వాళ్ళకు భాద్యత గల ఉద్యోగాలు ఇచ్చినా, వారి ఉద్దేశ్యములు మంచి వైనా వారి నిర్ణయములను నమ్మలేము.

సాత్త్వికునికి నిర్ధిస్టమైన ఆలోచనలు ఉంటాయి. వానికి జీవితములో ఒక గమ్యముండి ప్రతి రోజూ అమూల్యమైనదని తలచును. మన౦ చిరకాలం బ్రతకము. సాత్త్వికుడు ఆ విషయమును గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ఇతరుల మంచికొరకై పని చేయును.

మనమందరికి హృదయపు లోతులలో ఇటువంటి మంచి భావన ఉంటుంది. కాని చాలామందికి ఇతరులకు మంచిని ఏ కారణము లేక ప్రేమతో ఇవ్వడం తెలియదు. ఒకనికి దానము చేసిన వారు దానివలన కలిగే పేరు ప్రఖ్యాతుల గూర్చి అంచనా వేస్తారు. వారికి నిస్వార్థంగా ఒక గొప్ప కార్యమునకై ఇతరులతో కలసి పనిచేయుట తెలియదు. అట్టివారికి నిస్వార్థముతో తమ వస్తువులును, సమయాన్ని, ప్రతిభని ఇచ్చి తద్వారా మానసిక వొత్తిడిని లేదా స్పర్థని తొలగించుకోవటం తెలియదు.

నేను కాలేజీ లో చదువుతున్నపుడు వేసవి సెలవులలో నా గ్రామం చుట్టప్రక్కలున్న గ్రామాలలో తిరగాలని అనిపించింది.

అలా తిరుగుతూ ఉంటే నా గ్రామంకన్నా విలక్షణంగా ఉన్న ఒక గ్రామంకి వెళ్ళేను. ఆ గ్రామస్తులు నిరక్షరాస్యులు. వారికి చదవడం, వ్రాయడం రాదు. వారి గ్రామంలో ఒక పాఠశాల లేదు. వాళ్ళు ఒక ఉపాధ్యాయునికి వేతనమివ్వలేని పేదలు. వాళ్ళు నన్ను ఆ గ్రామంలో నివసించి తమకు చదువు చెప్పమని అడిగేరు. నేను ఎక్కడ నివసించాలని అడిగేను. వారు ఒకని ఇంట్లో ఉండవచ్చని చెప్పేరు. నాకున్నది మూడు నెలల సెలవులు. వాళ్ళకి ఏమి నేర్పించాలని సందిగ్దంలో పడ్డాను.

"మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటారు" అని అడిగేను.

"మాకు కావలసింది వ్యాపారానికి కావలసిన లెక్కలు చేయడం. పురాణాలు చదవగలిగేటంత, చుట్టాలకి, మిత్రులికి ఉత్తరాలు వ్రాసేట౦త అక్షర జ్ఞానం"

"అది చాలా కష్టమైన పని"

"కాని ఇది వేసవి. మేము ఉదయం పొలాల్లో పని చేసి, రాత్రి మీ దగ్గర చదువు నేర్చుకోవడానికి వస్తాము"

వారి పట్టుదల నన్ను కదలించింది. "మీకు పాఠశాల భవనం ఉందా?"

"లేదు కానీ రాత్రికి రాత్రి కట్టేస్తా౦"

నేను నమ్మలేకపోయాను. నా జీవితంలో మొదటి సారి గ్రామాల్లో నివసించే వారి పట్టుదలను చూసేను. నేను ఒక కొండ మీద ప్రదేశాన్ని చూపించి అక్కడ పాఠశాలను కట్టమని చెప్పేను.

రాత్రి 8 గంటలకు ప్రతి ఇంటినుంచి ఒక గ్రామస్తుడు పాఠశాలకు వచ్చేవారు. వాళ్ళు రోజంతా పొలాల్లో కష్టపడి పనిచేసి, రాత్రి చదువు నేర్చుకోవడానికి రావడం నన్ను ఆకట్టుకుంది.

అలాగ ఆ వేసవి అంతా వాళ్ళకు పాఠాలు చెప్పేను. వాళ్ళకి చదవడం, వ్రాయడం, లెక్క పెట్టడం క్రమంగా అబ్బింది. అది వాళ్ళ జీవితంలో సాధించిన గొప్ప కార్యము. అయినప్పటికీ నేను వాళ్ళ దగ్గర చాలా నేర్చుకొన్నాను. వాళ్ళ దగ్గరనుంచి ఒక పైసా కూడా తీసికోలేదు. వాళ్ళ ప్రేమకొద్దీ నాకు వాళ్ళ తోటలో పండిన పళ్ళు ఇచ్చేవారు. నేను వాళ్ళకు ఇచ్చిన దానికన్నా బదులుగా ఎక్కువు పొందేను. సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పినట్లు "ఇతరులకు ఇస్తే మనం ఎంతో తిరిగి పొందుతాము" 416

Chapter 18 Section 11

Bhagavad Gita

18.11

నియతం సంగరహిత మరాగద్వేషతః కృతమ్ {18.23}

అఫలప్రేప్సునా కర్మ యత్త త్సాత్త్విక ముచ్యతే

ఏ కర్మ నియతమై, సంగ రహితమై, ఫలాపేక్ష లేనిదియై, రాగద్వేషములు అంటనిదియై చేయబడునో అట్టి కర్మ సాత్త్విక కర్మ మనబడుచున్నది

యత్తు కామేప్సునా కర్మ సాహ౦కారేణ వా పునః {18.24}

క్రియతే బహులాయాసం తద్రాజస ముదాహృతమ్

ఆశచే, అహంకారముచే విశేషమగు ప్రయాసతో ఆచరింపుబడు కర్మ రాజస కర్మ యని చెప్పబడినది

అనుబంధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషం {18.25}

మోహా దారభ్యతే కర్మ యత్త త్తామస ముదాహృతమ్

పరిణామము నూహింపక, కలిగెడి హానిని తలచక, తన శక్తిని ఆలోచింపక అవివేకముతో ఆరంభించబడు కర్మ తామస కర్మయని చెప్పబడుచున్నది

తమస్ ప్రతి కర్మా గుడ్డిగా, మోహముతో చేయును. తన స్వార్థమే తామసికునిచే కర్మలు చేయిస్తుంది. అందువలన ఎంత ఖర్చైనా, ఎన్ని వనరులు వాడినా, ఇతరులకు ఎంత హాని కలిగినా అతడు పట్టించుకోడు. అతడు ప్రతీదీ వృధా చేస్తాడు. తామసిక కర్మ ప్రాణాన్ని, చైతన్యాన్ని హరిస్తుంది. తామసికుడు సమయాన్ని, కృషిని, జీవితాన్ని వృధా చేస్తాడు.

తామసిక పని ఇతరులకు హాని, గాయాలు లేదా చివరకు మరణాన్ని కూడా కలిగిస్తుంది. ఇది అన్నిటికన్నా నీచమైనది. గీత ప్రతి కర్మకు పర్యావసాన ముంటుందని చెప్తుంది. కాబట్టి మనము కర్మలకు బాధ్యులము.

ఒక దిన పత్రికలో ఒక అణు శాస్త్రజ్ఞుని కథనం చదివేను. అతడు ఎంతో తెలివి తేటలు, మేధ గలవాడు. కానీ అతను తన శక్తిని అణ్వాశ్త్రముల తయారీకయి ఉపయోగించేడు. అతను "శాస్త్రజ్ఞులు సిద్ధాంతాలు తయారుచేయుటల్లో సిద్ధ హస్తులు కానీ వాటి ఫలితాలను తెలిసికొనటంలో మూర్ఖులు" అని చెప్పెను.

అతడు రాజసికుడు. ఆయుధాలు నిర్మించే శాస్త్రజ్ఞులకు సవాలుగా ఒక మంచి కార్యాన్ని ఇస్తే, వారి మేధను దానికై ఉపయోగి౦చి మంచి ఫలితాలు పొందుతారు. రాజసిక పరిశోధకుడు క్రూరుడు కాడు. వానిని సంతృప్తి పరిచేది మానవ వినాశనం కాదు. అతనికి కావలసినది మేధకు సవాలు, ఇతర పరిశోధకుల గౌరవము, సమస్యలను పరిష్కరించడం, ఒక పనిచేసేనని అహంకారం.

ఇతర ఆయుధాల గురించి పరిశోధన చేసేవారు ఇలాగే ఆలోచించవచ్చు. వారికి ఉద్యోగం అవసరము. ఎక్కువ ఉద్యోగాలు ఆయుధాల తయారీలో ఉన్నాయి. కాబట్టి వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని చేస్తారు. వారి శక్తిని మంచి కార్యములకు ఉపయోగిస్తే అది నైతిక విలువలతో కూడిన ఆర్థిక ప్రగతి కలిగిస్తుంది. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థ ఉద్యోగులను, వనరులను ఎలా వాడుతున్నాయి? అది ఎవరికి సహాయపడుతుంది? అనే ప్రశ్నలు మనము అడగాలి.

కొందరు ఆయుధాల తయారీ వలననే అమెరికాలో కలిగిన ఆర్థిక మాంద్యం తొలగిందని నమ్ముతారు. అందు వలననే అమెరికా ప్రపంచంలో అత్యధిక ధనవంతమైన దేశముగా ఎదిగింది. తామసికుడు యుద్ధం వ్యాపారానికి మంచిదని భావిస్తాడు. వానికి విశ్లేషణం చేయడం రాదు కనుక ఆయుధాల తయారీ దేశానికి మంచిదని తలుస్తాడు.

ఆయుధాలు చేసే ఆర్థిక వ్యవస్థ మారక ద్రవ్యాలకు అలవాటుపడిన వ్యక్తిలాగ ఎక్కువ ఖర్చుకి అలవాటు పడుతుంది. ప్రతి ఆయుధ తయారీ ఆర్థిక వ్యవస్థను ఇంకొంత కొంచె౦ తక్కువగా ప్రభావితం చేస్తుంది. దానికై మరింత ధనము వెచ్చించాలి. ఒక విధంగా అటువంటి సంస్థల వలన ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయుధాలను తయారుచేయుటకై చేయవలసిన ఖర్చులను ఎవరూ నియంత్రించరు. ఎలాగంటే పెట్రోలియం ఆయిల్, ఆహార దినుసుల వ్యాపారాలలో గుత్తాధిపత్యం ఉంటే ధరలు ఎలా ఆకాశాన్నంటుతాయో, ఆయుధాల తయారీలలో కూడా అంతే. ఆయుధాలు ఎంత ఖారీదైనా ప్రభుత్వాలు వాటిని కొనడానికై ముందుకు వస్తాయి. ముందు ఇది బాగానే ఉంటుంది. క్రమంగా ఎక్కువ ధరలు, పన్నులు కట్టాల్సి వస్తుంది. దాని వలన ఆ దేశ నాణేల విలువ తగ్గుతుంది.

పెన్షన్ తో బ్రతికేవారికి ద్రవ్యోల్బణం వలన చాలా నష్టం కలుగుతుంది. వారి నిత్యావసర వస్తువుల ధరలు అధికమౌతాయి. ముఖ్యంగా ఆయుధాల తయారీవలన వనరులు వృధా అవుతాయి. ఒక ఆర్థిక వ్యవస్థలో అవసరమైన వస్తువులు తయారు చేయడానికి వీలవ్వదు.

తామసికుడు ఆయుధాల తయారీవలన ఉద్యోగాలు వృద్ధిచెందుతాయని వాదిస్తాడు. నిజానికి ఆయుధాల సంస్థల వలన ఉద్యోగాలు తక్కువ అవుతాయి. ఉదాహరణకి 100 కోట్లతో ఆయుధాల తయారీకి 28 వేల ఉద్యోగాలు కల్పింపబడితే, మిగతా సంస్థలలో దాని సంఖ్య ద్విగుణీకృత మౌతుంది.

ఈ విధంగా దేశ రక్షణకై లేదా యుద్ధాలకై వెచ్చించిన ధనము బ్రతకడానికి కావలసిన వస్తువుల తయారీకై కాకపోవడం వలన వాటి దిగుమతులకు దారితీస్తుంది. అలాగే వాహనాల ఇంధనాల వినియోగం తక్కువ చేయడం కాక, శాస్త్రజ్ఞులు యుద్ధానికై వాడే శబ్ద వేగంతో వెళ్ళే విమానాలు, లేదా ఎలక్ట్రానిక్స్ తయారీకి అంకితమౌతారు.

ఇక్కడ జరిగేది లాభసాటి వ్యాపారం. ఆసురిక ఆర్థిక వ్యవస్థ, ఆయుధాలను తయారీ ప్రక్కన పెట్టినా, వనరులను వృధా చేయడం, లేదా దోపిడీ చేయడంలో అది సిద్ధహస్త మవుతుంది. ఇంకా నిరుద్యోగుల సంఖ్య అధికమై, సంస్థల సాంకేతికత వెనుక బడుతుంది. ఇతర దేశాల నుండి దిగుమతులు అధికమై, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది.

సాత్త్వికమైన ఆర్థిక వ్యవస్థ అందరి సంక్షేమానికై పనిచేస్తుంది. ప్రజలకు అవసరమైన వస్తువుల ధరలు సామాన్యంగా ఉండి, వారి లాభాలు తక్కువ కావు. ఆసురిక వ్యవస్థలో ఒక మంచి వస్తువును తయారుచేయు సంస్థలు ఉండవు. అవి దోపిడీ చేసి అధిక లాభం చేసికోవడానికే పనిచేస్తాయి. రాజసిక వ్యాపారుడు కూడా అంతే. వానికి కావలసింది అమితమైన లాభం. అందుకొరకు గణాంకాలను వాడి, అవసరమైతే వాని సంస్థలోని ఉద్యోగులకు ఉద్వాసన ఇస్తాడు. స్థూల జాతీయ ఉత్పత్తి పెరగుతుంటే, వాడు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అంచనా వేస్తాడు. రిచర్డ్ బార్నెట్ "వాహనాల ప్రమాదాల వలన లాభం చేసికొనే సంస్థలు, క్యాన్సర్ వంటి ఆర్థిక వ్యవస్థ, కాలుష్యం, నేరాలు అధికమై కొందరిని ధనవంతులను చేసినా, అటువంటి దేశం వెనుకబడినట్టే" అని అన్నారు.

ఆసురిక సంస్థలు చేసే వస్తువులు వృధా. అవి తమ ఉద్యోగుల, వినియోగదారుల స్వస్థతకై ఆలోచించవు. వాటికి ధనార్జనే ముఖ్యం. పర్యావరణాన్ని కాలుష్యంతో నింపుతాయి. కాని సంపద ఎక్కడి నుంచో రావాలి. అంటే కొన్ని దేశాలు పేదరికంతో ఉండాలి.

రాజసికుడు అనేక వనరులను -- సహజమైనవి, మానవులను -- తన ఇష్ట౦ వచ్చినట్లు వాడుతాడు. ఉద్యోగులకు ఇచ్చే వేతనం తగ్గించి, తద్వారా ఎక్కువ లాభం చేసికొంటాడు. దానిని ఎంతో మంది నమ్ముతారు కాబట్టి అమితమైన సంపన్నులు, బడుగు వర్గాల మధ్య బ్రతుకుతున్నారు.

ఇప్పుడు పేదరికం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది. ఆసురిక సంస్థలు తమకు కావలసిన ధరతో కార్మికులను కొనుక్కొ౦టున్నారు. వాటి లాభాలకై -- క్రూరత్వం వలన కాదు -- కొన్ని వర్గాలను పేదరికంలో ఉంచేయి. ఇది పెద్ద సంస్థలకు మంచిదే. దానివలన జాతీయ ఉత్పత్తి పెరగవచ్చు. కాని నేను ఏ దేశమూ బాగుపడదని భావిస్తాను. పేద దేశాలను ఇంకా పేద అవుతున్నాయి, సంపన్న దేశాలలో కూడా పేదవారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే సంస్థలు ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టి తక్కువ జీతంతో పనులు చేయించుకుంటున్నాయి. అలాగే వలస కార్మికులను తక్కువ వేతనానికి పనులు చేయించి వాడుకొంటున్నారు.

ఉదాహరణికి బ్రజిల్ ని చూద్దాం. రాజసికుని మంత్రము లాభం. అదే పారిశ్రామికంగా ఎదిగిన దేశాల సంపదకి కారణం. బ్రజిల్ లో జరిగినది ఒక అద్భుతం. సంపన్న దేశాలు బ్రజిల్ లో ఎక్కువ పెట్టుబడి చేసేయి. తద్వారా జాతీయ ఉత్పత్తి పెరిగి, సంపన్నుల సంఖ్య అధికమై, మధ్య తరగతి వృద్ధినొందింది. కానీ ద్రవ్యోల్బణము అధికమై, పేదవారు మరింత పేదరికము ననుభవిస్తున్నారు. అలాగే మధ్య తరగతివారికి ఎప్పుడు పేదరికం అనుభవిస్తామోనన్న ఆభద్రత అధికమై౦ది.

బ్రజిల్ పురోగతికి కారణం సంపన్న దేశాల పెట్టుబడులు. అది ఎలాగంటే నక్కని కోళ్లకు కాపుగా ఉంచడం. బ్రజిల్ నుంచి తమకు కావలసిన వనరులను ఎగుమతి చేశారు. బ్రజిలియన్స్ కు తమ వనరులపై వారసత్వపు హక్కు లేదు. దానివలన ఉద్యోగాలు ఎక్కువైనా బ్రజిలియన్స్ కు తక్కువ జీతాలు దక్కేవి. అలా కాకపోతే అభివృద్ధి జరిగేది కాదు. బ్రజిలియన్స్ కి పనితనం నేర్పకుండా పనితనం ఉన్న ఉద్యోగులను బయటనుంచి దిగుమతి చేసికొన్నారు. అలా వచ్చిన డబ్బు పేద బ్రజిలియన్స్ కనీస అవసరాలకు కాకుండా, ధనవంతుల ఖజానాకి, అతి పెద్ద సంస్థలకు, బ్యాంక్ లకు, బహుళ జాతీయ సంస్థలకు తరలించేరు. ఒక ప్రాంతీయ బ్యాంక్, సంస్థ, వ్యక్తి వారి లాభాలను తిరిగి తమ దేశంలోనే పెట్టుబడి చేయవచ్చు. కానీ అవి అమెరికా, స్విస్ బ్యాంక్ లలో అధిక లాభాలకోసం దాచుకొన్నారు. బ్రజిల్ జాతీయ ఉత్పత్తి పెరిగినా, అది ఎవరికి లాభం? వారి లాభాన్ని తిరిగి బ్రజిల్ లో పెట్టుబడికి పెట్టపోవడం వలన పేదలు, మధ్య తరగతి వారు అనేక ఇక్కట్లు పడుతున్నారు.

జాతీయ ఉత్పత్తి పెరిగినంత మాత్రాన దేశం పురోభవృద్ధి చెందినట్టు కాదు. ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువుల తయారీ లేకపోయినా అధిక లాభాలు పొందవచ్చు. రాజసికుడు ఇలాగ ఆలోచిస్తాడు: "ఎందుకు జీతాలు, వనరులు, మూలధనం ఖరీదైన దేశంతో పోటీ చేయడం? ఉత్పత్తి పెంచడం లేదా ఖర్చులు తగ్గించుకోవడం కన్న తక్కిన సంస్థలతో విలీనమైతే అధిక లాభం వస్తుంది". అలాగే అపారమైన పెట్టుబడులు, ఉపయోగపడే వస్తు తయారీలో కాక, తక్కువ సమయంలో వచ్చే లాభనికై వాడుతున్నారు. అవి సాధారణంగా వడ్డీ వ్యాపార సంస్థలు. ఎక్కువ శాతానికి వడ్డీ ఇస్తే ఇక సంస్థలను నడపడానికి పడే శ్రమ ఎందుకు? దానివలన ఎంతో లాభం పొందవచ్చు. కానీ ఎటువంటి ఉత్పత్తి లేదు. అమెరికా వంటి దేశం వలస రాజ్యం గా మారి, ప్రపంచ దేశాలకు తమ సహజ వనరులను పంపిణీ చేసి, అధిక ధరకి వారు చేసిన వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాది.

రాజసికుడు ఈ విధంగా నియంత్రణ లేని ఆర్థిక వ్యవస్థ ఒక క్యాన్సర్ వ్యాధి వంటిది అని తెలిసికొ౦టాడు. కానీ ఆసురిక సంస్థలు, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను కోరి, కూర్చున్న కొమ్మ తెగ్గొ౦టుకుంటాయి.

గీత చెప్పేది ఒకరిని ఎడంగా ఉంచే ఆర్థిక వ్యవస్థ ఎప్పటికైనా విఫలం చెందుతుందని. రాజసికుడు తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభం పొందాలనే ఆశతో, కొందరికి ఉపాధి కల్పించి, చివరకు మానవాళికంతటికీ అందుతుందని భావిస్తాడు. కాని అది తప్పు ఆలోచన. సంపన్నుల, పేదల మధ్య గల వ్యత్యాసము ప్రపంచం మొత్తంలో పెరిగి, అసంఖ్యాకమైన పేదవారిని చేసింది. మనము ఒక చిన్న గ్రహం మీద బ్రతుకుతున్నాం. దానివలన మనం అందరం కలిసిఉన్నాము. నియంత్రణ లేని లాభం మానవాళి వృద్ధికి కాక తమకై పొందుట తప్పు. దీని వలన తక్కిన వాళ్ళు, ముఖ్యంగా పేదలు, అనేక బాధలకు గురి అవుతారు. సాత్త్వికమైన ఆర్థిక వ్యవస్థ అట్లు కాక ప్రతి ఒక్కరి బాగుకయి, వృద్ధికయి ఉంటుంది. అది ఒక భోగము కాదు. అది అవసరమైనది. 412

Chapter 18 Section 10

Bhagavad Gita

18.10

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః {18.19}

ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్చృణు తాన్యపి

జ్ఞానము, కర్మ, కర్త యనునవి గుణభేదము ననుసరించి మూడు విధములుగ చెప్పబడుచున్నవి. వానిని గూడ వాస్తవముగ ఆలకింపుము

సర్వభూతేషు యేనైక౦ భావ మవ్యయ మీక్షతే {18.20}

అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్త్వికమ్

భిన్నములైన సర్వ ప్రాణుల యందు అభిన్నముగ నున్నట్టియు, అవ్యయమైనట్టియు ఒకే ఒక ఆత్మ ఏకముగా నున్నదని గ్రహించెడు జ్ఞానము సాత్త్విక జ్ఞానమని చెప్పబడుచున్నది

పృథక్త్వేన తు యజ్ఞానాం నానాభావా న్పృథగ్విధాన్ {18.21}

వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసమ్

సకల భూతము లందును వేరువేరుగా తెలిసికొనుచున్నాడో అట్టి జ్ఞానమును రాజస జ్ఞానమని గ్రహింపుము

యత్తు కృత్స్నవ దేకస్మి న్కార్యే సక్త మహైతుకమ్ {18.22}

అతత్త్వార్తవదల్ప౦ చ త త్తామస ముదాహృతమ్

హేతువు లేనిదియు, పరమార్థము గానిదియు, అల్ప మైనదియు నగు ఒకే విషయమునందు సమస్త జ్ఞానము ఇమిడి యున్నట్లు తలచెడి జ్ఞానము తామస జ్ఞానమని చెప్పబడును

పై శ్లోకములు సైన్స్ కి, ప్రస్తుత నాగరీతకు కూడా వర్తిస్తాయి.

తామసిక శాస్త్రజ్ఞుడు ఒక చిన్న కార్యమునందు నిమగ్నుడై నూతిలో కప్పవలె అదే ప్రపంచ మనుకొనును. ఈ విధముగా అనేక వేల శాస్త్రజ్ఞులు ఆయుధాలను, క్షిపణులను తయారు చేయుచున్నారు. ఈ శాస్త్రజ్ఞులు మంచివారే, సంస్కారవంతులే. కానీ వారికి సున్నితత్వము లేక ఒక చిన్న పాత్రను పోషించి అదే సర్వమని తలుతురు.

సంస్కృతములో సైన్స్ అనగా విద్య. దాని అర్థము ఒక భౌతికమైన విషయమును గూర్చి పూర్తి అవగాహన. ఇది సాత్త్విక సైన్స్ కున్న లక్షణము. న్యూటన్, ఐన్స్టీన్ ఈ కోవకు చెందినవారు. ఇటువంటివారు పెక్కు మంది ఉండి తమ జీవితమును సత్యాన్వేషణకై దారపోసిరి. కాని ప్రస్తుత కాలమందు సైన్స్ రాజసికులతో నిండి యున్నది. వారి లక్షణము ప్రకృతి గూర్చి అధ్యయనము చేయక దానిని దోపిడీ చేయడం. రాజసిక శాస్త్రజ్ఞులు "ఒకటి కనుగొనటం సాధ్యమైతే, దానిని అమ్మి డబ్బు చేసుకోవచ్చు" అని తలుస్తారు.

థామస్ ఎడిసన్ బ్రతికు ఉన్నప్పుడు సాత్త్విక సైన్స్ అయస్కాంత, ఎలెక్ట్రిక్ తరంగాలు ఒకటేనని అంచనా వేసింది. నాటి రాజసిక శాస్త్రజ్ఞులు వాటి ద్వారా పేటెంట్ లు పొంది ధనార్జన ఎలా చేయాలని ఆలోచించేరు. ఆ సమయంలో ఎడిసన్ అనేక ప్రయోగములు చేసి పేటెంట్ లను పొందెను. ముఖ్యముగా ఎలెక్ట్రిక్ బల్బ్, ఎలక్ట్రిక్ మీటర్ (దాని ద్వారా మనమెంత కరెంట్ ను వాడుతున్నామో తెలుస్తుంది), మొదలగునవి. ఎడిసన్ ఉద్దేశం కరెంట్ ని అందరికీ పంపిణీ చేసి, తద్వారా ధనార్జన చేయాలని.

ఎడిసన్ యొక్క విజయం చూసిన రాజసిక శాస్త్రజ్ఞులు వేరువేరుగా పరిశోధనలు చేస్తే అంత పురోభివృద్ధి కలగదని తలచి, ల్యాబ్ లను నెలకొల్పేరు. అందులో అనేకమైన శాస్త్రజ్ఞులు కలిసి పనిచేసి అనేకమైన వస్తువులను ఆవిష్కరించేరు. అటువంటి వానిలో మన్హాటన్ ప్రాజెక్టు ముఖ్య మైనది. ఆ ప్రాజెక్టు లో అనేక శాస్త్రజ్ఞులు చేరి ఎన్నో ఆయుధాలను తయారు చేసేరు. సత్యాన్వేషణకు బదులు మన భూగోళమును నాశనము చేసే శక్తివంతమైన ఆయుధాలను కనిపెట్టేరు. ఇది ఆసురిక సైన్స్.

ఫ్రీమన్ డైసన్ అనే శాస్త్రజ్ఞుడు రచించిన డిస్టర్బింగ్ ది యూనివర్స్ అనే పుస్తకంలో ల్యాబ్ లులో కలిసి పనిచేసే శాస్త్రజ్ఞులకు ఒకే ధ్యేయము ఉంటే వారి సమర్థత ఎంత ఎక్కువగా ఉంటుందో వర్ణించేరు. ఆయన ఇలాగ వ్రాసేరు:

"అది యువత, అతిశయము, అనధికారకత, ఏకగ్రీవమైన ఆశయం. అసూయ లేదా స్పర్థలు లేకుండా ఎన్నో గొప్ప వాటిని ఆవిష్కరించాలనే బలమైన కోరిక. వారికి నోబెల్ ప్రైజ్ వచ్చినా త్యాగ బుద్ధితో ఏఒక్కరూ దానిని తీసికోవడానకి ముందుకు రారు"

ఇది సాత్త్విక సైన్స్ యొక్క గుణము. కానీ లాస్ ఆలమోస్ లో తయారు చేసిన అణ్వాస్త్రములు వినాశమునకై వాడేరు.

ఈ విధముగా శాస్త్రజ్ఞులు వెర్రి తలలు ఎత్తి, అనేకమైన ఆయుధాలను, క్షిపణులను తయారు చేసేరు.

డైసన్ ను ఎక్కువగా ఆకర్షించినది ఫేనమాన్ అనే శాస్త్రజ్ఞుడు. అతడు అనేక అవరోధములను దాటి తను కనిపెట్టిన విషయాలను ఇతర శాస్త్రజ్ఞులచే ఒప్పించెను. "అతనికి ఒక ఊహను తన మనస్సులో మారకుండా ఉంచి, చివరకు దాని పూర్తి అవగాహన పొందే శక్తి గలవాడు" అని డైసన్ వ్రాసెను. గీత చెప్పేది ఇటువంటి శక్తి మనందరికీ ఉంది. కానీ దానిని పొందుటకై మనము ఇతరులకు మనకన్న అధిక ప్రాముఖ్యత నిచ్చి, ఒక ఉన్నతమైన ఆశయమునకై కష్టపడి పనిచేయాలి.

నాలాంటి సాధారణ మానవులు తమ స్వార్థమును విడనాడి పనిచేసిన, అనేక అసాధారణ విషయాలను కనిపెట్టవచ్చు. గాంధీ ఇలా చెప్పెను: "ఏ వ్యక్తి అయిననూ ప్రయత్నముతో, ఆశతో, విశ్వాసంతో నావలే కాగలడు. " మనమెంత చిన్న వారమైననూ ధ్యానంతో ప్రేమ, సత్యము, ఐకమత్యము పొంది ప్రపంచంలో వినాశకరమైన పరిస్థితులను నిర్మూలించవచ్చు. 405

Chapter 18 Section 9

Bhagavad Gita

18.9

యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య లిప్యతే {18.17}

హత్వాపి స ఇమాం ల్లోకాన్న హంతి న నిబధ్యతే

ఎవడు అహంకారమును, సంగమును విడుచునో వాడు లోకమునందు అందరిని చంపినను చంపినవాడు కాడు. మరియు వాడు కర్మలచేత బంధింపబడడు

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మ చోదనా {18.18}

కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః

కర్మ ప్రవృత్తికి జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత అను ఈ మూడును కారణములై యున్నవి. అలాగే కారణము, కర్త, కర్మ యనునవి కర్మకు ఆధారములని చెప్పబడినది

మనమందరము ఎన్నోకొన్ని తప్పులు చేసేము. సాధనలో ఎన్నో అవరోధాలను అనుభవించేము. మనకు కోపం వేగిర౦గా రావచ్చు. నిస్వార్థతో ఉండడం చాలా కష్టమనిపిస్తుంది. గీత "నీవు కళంకము లేనివాడవు, పరిశుద్ధుడవు. సమస్యలకు నువ్వు కారణము కాదు" అని చెప్పదు. అది మన లోపాలను గుర్తించి వాటిని తగ్గించుకొనుటకై మార్గమును చూపును. అనగా కొన్ని ప్రక్రియలతో ఆత్మ జ్ఞానమును పొందుటకు సహకరించును.

మనము అమితమైన కర్మ భారమును భుజాలపై మోస్తున్నాము. ఇది మన ధ్యానానికి అడ్డు వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతము వలన కలిగే తీవ్రమైన శిక్ష. దీనివలన సాధకులకు భయము కలుగవచ్చు. ఎప్పుడైతే అమితమైన కర్మ ఉంటుందో, మనస్సు కలవరముతో నిండి ఉంటుంది. అది సాధన ముందుకు సాగకుండా చేస్తుంది.

కర్మ భారము ఎంతో ఉన్నా, మనం దానిని భరించగలము. అది లేకుండా చేయడం కష్టమైనా, మనం దానిని మోయగలం. కర్మ గూర్చి నన్నిలా అడిగేవారు: "దాని భారాన్ని ఎలా లేకుండా చేసికోగలను?" దానికి సమాధానం ఇతరులకు మీకన్నా ఎక్కువ ప్రాముఖ్యత నివ్వ౦డి. వాళ్ళని సహించడం కష్టమైనప్పటికీ, మీదే పైచేయి ఉండాలని భావించకండి. ఎల్లప్పుడూ దయతో మెలగండి. మనకి కర్మ గురించి పూర్తి అవగాహన లేకున్నా, ఏ కర్మని తగ్గించుకోవాలో తెలియకపోయినా, ఇతరులయందు, ప్రతి రోజూ దయతో ఉండండి. ఇలా పనిచేస్తే మన శరీరము, ఇంద్రియాలు, మనస్సు, మేధ మనని కర్మ సిద్ధాంతం నుంచి విముక్తులను చేసి ప్రేమ పూరితమైన స్థితికి తీసికొనివెళ్తాయి.

అలా కాక మన ఇష్టాయిష్టాలు ప్రకారం జీవించాలంటే, పగ, శతృత్వం లతో కూడివుంటే కర్మ భారం అధికామవుతూ వస్తుంది. అహంకారం వలన కూడా కర్మపెంపొందుతుంది. దానివలన చెడు వాక్కు, క్రియలు సంభవిస్తాయి.

మనకు భౌతికమైన భారం గూర్చి తెలుసు. కాని ఒకని కర్మ భారంగా ఉందని తెలుసుకోవడం కష్టం. అట్టి వారి కళ్ళు నిస్తేజంగా ఉండి, రోజు గడుస్తేనే చాలని ఉంటారు. మనం వాళ్ళు అంతేలే అనుకోవచ్చు. వాళ్ళ భౌతిక శరీరాన్ని దాటి చూస్తే వారు కర్మ భారాన్ని మోస్తున్నారని తెలుస్తుంది.

కొన్నాళ్ళ క్రితం నా మిత్రుడొకడు బరువైన పుస్తకాలను పోస్ట్ ఆఫీసుకు తీసికొని వెళ్తున్నాడు. అతను కాలు జారి ప్రక్క నున్న నీటి గుంటలో పడ్డాడు. తరువాత అతను నాతో పుస్తకాల బరువుగా లేకపోతే తను పడేవాడు కాదని చెప్పేడు. ఇది ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఎందుకంటే భౌతికమైన బరువులగురించి అందరికీ తెలుసు. మనకన్న ఇతరులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే మన కర్మ భారం తగ్గుతుంది. అలకాక ఉంటే మన సాధనకు ప్రతికూలమవుతుంది. అలాగే అహంకారాన్ని లేకుండా చేసికొ౦టే కర్మ భారం తగ్గుతుంది.

నేనీ మధ్య కంప్యూటరును ఉపయోగించి ఒక బ్యాంక్ ఉద్యోగి ఇతరుల సొమ్ము కాజేసేడని చదివేను. అతడు కొందరి ఖాతాలను మార్చి, వాటి మీద చేసిన జమను తన స్వంత ఖాతాకు జమ చేసికొని, వారి ఖాతాలో దొంగ లెక్కలు చూపించేడు. కర్మ ఖాతా కూడా ఇలాగే పనిచేస్తుంది. మన కర్మ ఖాతాను మూసేస్తే దానికి వచ్చే జమలు వస్తూనే ఉంటాయి. కాని అవి మన ఖాతాలో ఉండవు. బ్యాంక్ మనల్ని ఎవరి ఖాతాలో వేయమంటారు అని అడిగితే, మనకిష్టమొచ్చిన వారిని ఎన్నిక చేసికోవచ్చు. ఇలాగ మన పుణ్య కర్మను ఇతరులతో పంచుకొని వారి కర్మ భారాన్ని తగ్గించ వచ్చు. 401

Chapter 18 Section 8

Bhagavad Gita

18.8

అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ {18.14}

వివధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్

సర్వకర్మలు నెరవేరుటకు దేహము, కర్త, ఇంద్రియములు, వివిధములగు క్రియలు, దైవము అను ఈ ఐదు కారణములై యున్నవి

శరీరవాజ్ఞ్మనోభి ర్యత్కర్మ ప్రారభతే నరః {18.15}

న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః

మనోవాక్కాయములచేత మనుజుడు ప్రారంభించెడి కర్మ న్యాయమైనను, అన్యాయమైనను అట్టిదానికి ఈ ఐదును కారణములై యున్నవి

తత్త్రైవం సతి కర్తార మాత్మానం కేవలం తు యః {18.16}

పశ్య త్యకృతబుధ్ధిత్వా న్న స పశ్యతి దుర్మతిః

కర్మ విషయము ఇలా ఉండగా అకృత బుద్ధిచే ఎవడు కేవలము ఆత్మను కర్తగా తలచుచున్నాడో అట్టి అవివేకి సత్యమును గాంచలేకున్నాడు

సర్వ కర్మలు ప్రకృతి వలన చేయబడుచున్నవి. మన ఆత్మ, వ్యక్తిత్వము వలన కాదు. అహంకారం కర్మను నిర్ణయిస్తుంది. శరీరము కర్మను ఆచరిస్తుంది. ఇక్కడ దైవం అనగా విధి. గీత చెప్పేది ఏదీ ముందుగా నిర్ణయింప బడదు. అలాగే ఏదీ యాదృచ్ఛికంగా జరుగదు. మనము మన విధిని నిర్ణయించుకుంటాం. ఎందుకంటే ప్రతి కర్మకి పర్యావసానము ఉంటుంది కనుక. కర్మను చేయుటకు కలుగు ఇచ్ఛ కూడా మనమే ఎన్నిక చేసుకుంటాం. ఎలాగంటే ఒక విత్తనం పెరగాలంటే మట్టి, సూర్య కాంతి, వాతావరణం అవసరము. హిందువులు బౌద్ధులు చెప్పేదేమిటంటే కర్మ క్రియలోనే నిక్షిప్తమై యున్నది. ఒకానొక సమయంలో, పరిస్థితిలో అది వ్యక్తమవుచున్నది.

వీటిలో ఆత్మ గురించి ప్రస్తావన లేదు. ఆత్మపై అవగాహన లేకుండా, మన ఇష్టానుసారం ప్రవర్తించి "నేను కర్తను కాదు. నేను బాధ్యుని కాను" అనటం తప్పు. బ్రతుకుతున్నామంటే బాధ్యత వహించడం. అలాగే మన క్రియలకు కూడా మనమే బాధ్యుల౦. మనము బాధ్యత వహించినా లేదా కర్మను పోగుచేసుకొంటాం.

కరణం అనగా కర్మను చేయుటకు అవసరమైన సాధనం. అది చాలామటుకు కర్మను నిర్ణయిస్తుంది. మంచి ఫలితాలు రావాలంటే మంచి సాధనాలు ఉండాలి. తప్పు సాధనాలు పాప కర్మకు దారి తీస్తాయి. ఎలాగంటే నువ్వు గింజల నుండి ఆపిల్ చెట్టు రాదు. మనము కోరే గమ్యం ఎంత మంచిదైనా, మనకెంత సద్భావన ఉన్నా, తప్పు సాధనాలు తప్పు గమ్యాన్ని చేరుస్తాయి. ఎందుకంటే అహంకారం అడ్డు వస్తుంది. అలాగే క్రోధం, వ్యతిరేకత, మన మూర్ఖత్వం తప్పు గమ్యానికి దారి తీస్తాయి.

ప్రతి క్రియలోనూ కొన్ని దశలుంటాయి. మనము గమ్యాన్ని మరచి మొదటి లేదా మూడవ దశలోనే కొట్టుమిట్టాడితే లాభం లేదు. దానివలన మనం చిక్కుల్లో పడి, నిరాశ చెందవచ్చు. మనం ఆ క్రియను ఎంతో వేగిరముగా చేయాలని తలచవచ్చు. అలా చేస్తే దీర్ఘ కాలంలో మన ప్రయత్నం వ్యర్థమై, ఫలితాలు ప్రతికూలమవుతాయి.

క్రియలు నిర్వర్తించడంలో శ్రీకృష్ణుడు చెప్పే ఐదో అంశం: కర్మ సిద్ధాంతం. ఇది ఎన్నటికీ మరువరానిది.

నేను చిన్నప్పుడు, కర్మ అంటే అవగాహన లేకుండా నా అమ్మమ్మను ఒక ప్రశ్న అడిగేను. చాలా మంది పిల్లల లాగ నేనూ మహాభారత కథలను విన్నాను. పాండవులు మంచికి చిహ్నం. కౌరవులు చెడుకి సంకేతం. కానీ నాకు అర్థం కానిదేమిటంటే కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యేవరకూ కౌరవులు భోగభాగ్యాలను అనుభవించేరు. కానీ పాండవులు నానా ఇక్కట్లూ పడ్డారు.

నేను నా అమ్మమ్మని ఇలా అడిగేను: "పాండవులు కౌరవులలా కాక శ్రీకృష్ణుని నమ్ముకున్నారు. మంచి వారికి జరగాలి కాని చెడ్డ కాదు. ఎందుకు దానికి వ్యతిరేకంగా జరిగింది?". నా అమ్మమ్మ "నీవు భౌతికమైన సుఖాల గురించే ఆలోచిస్తున్నావు. మనం చూడాల్సినది ఆధ్యాత్మిక దృక్పథంతో" అని సమాధానమిచ్చింది. కర్మ సిద్ధాంతం మనను క్లిష్ట పరిస్థితులలో పెడుతుంది. అలాటప్పుడు మనం ఆధ్యాత్మికతను అలవాటు చేసికోవాలి. అదే పాండవులు చేసింది. పుణ్య కార్యాలు చేస్తే తప్ప చెడు కర్మను తగ్గించుకోలేము. అటువంటి పరీక్షలు లేనిదే సాధనలో పైకి ఎదగలేము. 399

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...