Thursday, March 10, 2022

Chapter 18 Section 26

Bhagavat Gita

18.26

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా {18.63}

విమృశ్త్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు

ఈ విధముగ రహస్యము లన్నిటి కంటెను అతి రహస్యమైన జ్ఞానమును నేను నీకు బోధించితిని. దీనిని బాగా విచారించి, ఆ తరువాత నీకు తోచినట్లు చేయుము

సర్వగుహ్యతమం భూయః శృణు మే సరమ౦ వచః {18.64}

ఇష్టో అసి మే ధృడమితి తతో వక్ష్యామి తే హితమ్

రహస్యము లన్నిటి కంటెను రహస్యమైనదయు, ఉత్తమ మైనదియు నగు నా వచనములను మరల ఆలకింపుము. నీవు నాకు మిగుల ఇష్టుడవు. అందువలన నీ మేలు గోరి చెప్పుచున్నాను

శ్రీకృష్ణుడు చెప్పేది "నేను నీకు ఎక్కడా దొరకని జ్ఞానమును ఇచ్చేను. దానిని విచారించుము. దానిగురించి లోతుగా ఆలోచింపుము. దానిని అన్ని చోట్ల, ప్రతి పరిస్థితిలోనూ పరీక్ష చేయుము. నీకు తోచినది చేయుము". కానీ అతడు "నేను చెప్పినది చేయకపోతే వెయ్యేళ్ళు నరకమనుభవిస్తావు" అనలేదు. "మీరు హేతుబద్ధమైన వారు, శ్రధ్ధ గలవారు. మీకు మంచి చెడు, ఆరోగ్యం రోగం, ప్రేమ అసహ్యం గురించి తెలుసు. కాబట్టి మీరు ఎన్నిక చేసుకోండి" అని మనకి అతిగొప్ప నివాళి చేసేడు. ఇది గీత యొక్క గొప్పదనం: బెదిరింపులు లేకుండా పూర్తి గౌరవం.

ఇలా చెప్పడంలో ఒక కళ ఉంది. హిందూ సంప్రదాయంలో ధ్వని అనే అంశముంది. ఒక కళాకారుడు రెండు స్వరాలు మీటుతాడు. వాటి మధ్య శ్రావ్యత మనల్ని నింపుకోమంటాడు. ఇది మన ఊహకు నివాళి.

నా విద్యార్థులు ప్రతీ విషయాన్ని విపులంగా చెప్పాలని కోరేవారు. "నాకు మీరు చెప్పేది అర్థం కాలేదు. దాన్ని ఎక్కడా వాడలేను" అని నిర్మొహమాటంగా చెప్పేవారు. నేను వారిని ఆంగ్ల పద్యాలలో ఉన్న ధ్వనిని పరిశీలించండి అని చెప్పేవాడిని. అప్పడి నుంచి వాళ్ళు నే చెప్పే పాఠాన్ని ఆహ్లాదంగా వినేవారు.

కాళిదాసు ఒక గొప్ప రచయిత. అతని ప్రతి పద్యంలోనూ ధ్వని ఉంది. "వాని ప్రేమ అస్తమించిన సూర్యునివలె ఉన్నది" అని చదివితే కొత్తగా వచ్చిన విద్యార్థులు దిక్కులు చూసేవారు. నేను "మీకు తెలీదా సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడాని?" అనేవాడిని. వాళ్ళు అర్థం చేసికొని నేచెప్పేది శ్రద్ధగా వినేవారు. వాళ్ళకి ధ్వని గురించి చెప్పి ఆసక్తిని ఎక్కువ చేసేవాడిని.

నా ఉపాధ్యాయిని అటువంటి కళా కారిణి. ఆమె చెప్పే ప్రతి పాఠంలోనూ ధ్వని ఉంది. ఆమె నన్ను ఊహించడానికి ప్రోత్సాహించేది. ఆమె మహాభారతంలో అర్జునుడు చేసినది చెప్పేది. కాని దాని నుంచి నైతిక మైన ముగింపును చెప్పేది కాదు. ఆమెకు నా మీద అపారమైన అభిమానము౦డి, నేను ప్రయత్నించి నా జీవిత౦తో ఎలా అనుసంధానం చేయాలో తెలిసికొ౦టానని నమ్మేది. ఆమె చాలా తక్కువ మాట్లాడి, ఏదీ విపులంగా చెప్పేది కాదు. అందువలన ఆమె యందు నా గౌరవము ఎక్కువయ్యేది. ఇటువంటి బోధనలో సంపూర్ణమైన గౌరవము, ప్రేమ, నమ్మకము ఉన్నాయి. అది అనేకమైన ఆంక్షలతో కూడిన నేటి విద్యా విధానంకి పూర్తి వ్యతిరేకం. ఉపాధ్యాయుడు రెండు స్వరాలను చెప్తాడు. వాటి మధ్య మన౦ శ్రావ్యత పూరించుకోవాలి. 469

Chapter 18 Section 25

Bhagavat Gita

18.25

ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి {18.61}

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా

అర్జునా! ఈశ్వరుడు యంత్రము నారోహించిన వారివలె యున్న సకల ప్రాణులను తన మాయచేత త్రిప్పుచు, సమస్త జీవుల హృదయముల యందు వెల్గొందుచున్నాడు

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత {18.62}

తత్ప్రసాదాత్పరాం శా౦తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్

భారతా! సమస్త భావముల చేత అట్టి పరమేశ్వరునే శరణు పొందుము. అతని అనుగ్రహము వలన ఉత్తమమైన శాంతి, శాశ్వతమైన మోక్షమును పొందగలవు

నా గ్రామంలో ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు, అతని కొడుకులు అనేక వస్తువులు: కుండలు, ప్రమిదలు మొదలైనవి చేస్తూ ఉండేవారు. రోజూ ఉదయాన్నే అతడు నది దగ్గరకు వెళ్ళి బంక మన్నును సేకరించేవాడు. అతని కొడుకు చక్రాన్ని తిప్పుతూ ఉంటే ఆ మట్టితో వస్తువులు చేసేవాడు.

కొన్ని కోట్ల సంవత్సరాలు జీవుడు అనేక మార్లు పుట్టి, మరణించి, పరిణామ౦ చెంది కాలమనే చక్రములో తిరిగి, కర్మను పోగుచేసుకొని, తద్వారా మలచబడ్డాడు. అలా తిరగడం, మలచబడడం మాయ వలన జరుగుతుంది. మానవ జీవితం బంక మన్నుతో ఏ గుణాలూ --మంచి చెడు లేదా స్వార్థం నిస్వార్థం-- లేకుండా మొదలయ్యెను. కుమ్మరి మనమే. మనం చేసే కుండ సరిగ్గా లేకపోతే మనం దాన్ని వెనక్కి తీసికెళ్ళి మన సొమ్మును ఇమ్మని అడగలే౦.

బంక మన్ను ఎక్కువగా ఉంటే, ఆకారం సరిగ్గా లేని కుండను బాగు చేయవచ్చు. అది ఇంకా సరిగ్గా లేకపోతే దానిని పరులకు ఇవ్వచ్చు. కాబట్టి మనం పరులకై జీవిస్తే మన నష్టాలను భర్తీ చేసికోవచ్చు. ఈ విధంగా మన చెడ్డ కర్మను తగ్గించుకోవచ్చు.

కర్మ తక్కువవుతున్న కొద్దీ మనస్సు శాంతంగా ఉంటుంది. మన స్వార్థపూరిత కోర్కెలను తీర్చుకోవడానికై ప్రయత్నించడము వలన చెడు కర్మ పోగవుతుంది. ఇతరుల యందు దయతో ఉండి , మన సంస్కారములను నియంత్రించుకొంటే, చెడు కర్మ తగ్గి మనస్సు ప్రశాంతతను పొందుతుంది. క్రమంగా మనం కోర్కెలను త్యజించి, వాటికై ప్రయత్నించక ఉంటాము. ఒక సంస్కారము ఎదురైతే దానిని మంత్రము ద్వారా నియంత్రించవచ్చు. దానివలన చెడు కర్మ పోగు అవ్వదు. మన౦ క్రియలు, బంధాలు ఏర్పరచుకొన్నది మంచి కర్మను చేసి, చెడు కర్మను పోగొట్టుకోవడానికి.

క్రమంగా మనం చేసే కుండ చక్కగా అవుతుంది. మన వ్యక్తిత్వం లోని చెడున౦తా తొలగించి ఒక ఆదర్శవంతునిగా తయారవుతాము. కాని ఆ కుమ్మరి చక్రము వెంటనే ఆగదు. అది కొంచెంసేపు తిరిగి ఆగుతుంది. అలాగే సాధన చివరి దశలో ఇంకా కొన్ని కోర్కెలు ఉండవచ్చు. కాని వాటిని పట్టించుకోకపోతే అవి మన చేత క్రియలు చేయించలేవు.

నేను ఒకమారు ఒక మిత్రుని కారులో వెళుతున్నాను. అప్పుడు వర్షం పడింది. అతను విండ్ షీల్డ్ వైపర్ ల స్విచ్ వేసేడు. కానీ రెండిట్లో ఒకే వైపర్ పనిచేసింది. రెండోది తిరిగింది కానీ వర్షపు నీరుని తియ్యటం లేదు. ఈ విధంగానే ఒక పనికిరాని సంస్కారం పని చేస్తుంది. దానిని పట్టించుకోక పోతే మనకయ్యే నష్టం ఏమీ లేదు.

మనకు కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన అలవాట్ల వల మనస్సు కుమ్మరి చక్రం లాగా మళ్ళీ తిరగడం మొదలుపెడుతుంది. ఆ సమయంలో విచార పడకుండా, బంక మన్నుతో కుమ్మరి చక్రం మీద వస్తువులు చేయనట్లుగా ఉండాలి. ఒక బలమైన కోర్కె వస్తే దాన్ని పట్టించుకోకూడదు. అది ఎలా వచ్చిందో అలాగే పలాయనమౌతుంది.

ధ్యానంలోని ఏకాగ్రత వలన దేహంలో మార్పులు వస్తాయి. మన మనస్సుతో పాటు మన దేహంలో ఒకప్పుడు వేగంగా జరిగే మార్పులు నెమ్మదిగా జరుగుతాయి. ఉదాహరణకి మన ఉఛ్వాసనిశ్వాసలు నిమిషానికి 16 నుంచి 3 వరకు తగ్గుతాయి. ఆ వ్యవధిలో మన మనస్సు, అహంకారం పని చేయవు.

గీత చెప్పేది మనం ఈశ్వరుడికై పరిగెత్తి వెళ్ళి ఆయనిని ఆశ్రయించి మనశ్శాంతిని పొందమని. ఇది పారిపోవడం కాదు. మన నిజమైన ఇంటికి వెళ్ళడం. శ్రీకృష్ణుడు "నీ ఆత్మలో ఆశ్రయం పొందు" అని అంటున్నాడు. అక్కడ దేశకాలములు లేవు. కారణము, కార్యము, క్రియ అనబడే త్రిపుటి లేదు. పూర్ణమైన మనశ్శాంతి ఉంటుంది.

సాధన చివరి దశలో మన ధ్యానం ఎంత లోతుగా ఉంటుందంటే, ఒక పక్షి మన తల మీద వాలినా మనకు తెలియదు.

మన మనస్సులో ఏకగ్రీవత జరుగుతుంది. మోక్షం తప్ప వేరే కోరిక ఉండదు. మనకున్న ప్రతి కోరికను అనుభవించాలి. లేకపోతే మనస్సనే కుమ్మరి చక్రం మళ్ళీ తిరిగి క్రొత్త కర్మలను చేయిస్తుంది. ఒక రోజు ధ్యానంలో ఉన్నప్పుడు, సెయింట్ తెరెసా చెప్పినట్లు, దేవుడు పక్షిలా వచ్చి మనని ఆకాశంలోకి తీసుకవెళ్తాడు.

మన ఆ దశను ఇమ్మని దాబాయించి అడగలేము. మనం వినమ్రతతో "నా మనస్సు ఖాళీ అయింది. నా అహంకారం తొలగింది. నీవు ఎంతకాలం నిరీక్షించమంటే అంతకాలం నిరీక్షిస్తాను" అని ప్రార్ధన చేయగలం. అలా నిరీక్షించడం ఒక పరీక్ష వంటిది. దేవుడు చివరకు ప్రత్యక్షమైతే అది ఒక గొప్ప బహుమతి.

కఠ ఉపనిషత్లో "ఆత్మ ఎవరికి సాక్షాత్కారము చెయ్య దలచుకుందో వారికి కనబడుతుంది" అని చెప్పబడెను. మనం ఎంత ప్రయత్నించినా మనస్సు నిశ్చలము చేయడం చాలా కష్టం. అలాగే అహంకారాన్ని పూర్తిగా తీసేయలేము. "నేను ఇంతకన్నా ఏమీ చేయలేను" అని అవగాహనకు వస్తుంది. చివరకు మన సాధన ఫలిస్తుంది. 467

Chapter 18 Section 24

Bhagavat Gita

18.24

యదహంకార మాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే {18.59}

మిథ్త్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి

నీవు అహంకారమును ఆశ్రయించి, యుద్ధము చేయనని తలంచెదవేని నీ ప్రయత్నము వ్యర్థమగును. నీ స్వభావము నీ చేత ఆ పనిని చేయించును

స్వభావజేన కౌన్తేయ నిబద్ధ స్స్వేన కర్మణా {18.60}

కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్యవశో అపి తత్

అర్జునా! నీవు అవివేకము వలన నీ కర్మను ఆచరించ నిచ్చగింపకపోయినను, స్వభావసిద్ధమైన నీ కర్మ చేత బంధింపబడిన వాడవై, పరవశుడవై చేయుదువు

రెండు శక్తులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి: రాబోయే పరిణామం మరియు మన గతం. కాని ప్రతి అనుభవంలోనూ, స్వభావములోనూ ఒక ముఖ్యమైన పరిణామ కారణం ఉన్నది: మన జీవిత గమ్యానికి దగ్గర చేయడం.

మన౦ అనుభవించే ప్రతి సమస్య, లక్ష్యం దగ్గరకు తీసికెళ్ళే అవకాశం ఇస్తుంది. గాంధీకి 20 ఏళ్ల వయస్సులో, స్వదేశంలో ఉద్యోగం దొరకక, ఉద్యోగమునకై తక్కువ జీతానికి ఒప్పుకొని సౌత్ ఆఫ్రికా కి వలస వెళ్ళడం, ఆయన వ్యక్తిత్వం, స్వభావం మార్పు చెందిడానికి, అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశం ఒక అపజయాన్ని, నిరాశను కల్పించవచ్చు. దేవుడు ఆయనకు ఆత్మ జ్ఞానము, మరే భరోసా ఇవ్వలేదు. ఆయనకు కష్టాలు ఇచ్చేడు. అందువలన అతడు ఇతరులకై పాటు పడడానికి నిశ్చయించుకొన్నాడు. ఎన్నో వేల మంది సౌత్ ఆఫ్రికా లో అవమానాలు పొందేరు. కాని ఒక్క వ్యక్తి తనకు జరిగిన అమానుషత్వాన్ని ఎదుర్కొని అందరి తరపున పోరాడడానికై పూనుకొన్నాడు.

ప్రతి అంశం మన ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగ పడుతుంది. నేను ఒక తిరుగుబాటుదారుడను చూసి, అతని స్వభావ౦ ఒక కారణం వలన ఉన్నదని తలుస్తాను: లక్ష్యం చేరడానికై మన స్వార్థం మీద, అహంకారం మీద తిరుగుబాటు చేయాలి. ఎంతో మంది యోగులు తమ జీవితాల్లో వివేకంతో కూడి తిరుగబాటు చేసేరు. సెయింట్ తెరిసా ఇన్క్విజిషన్ పై తిరుగుబాటు చేసేరు. ఆమె చిన్నప్పుడు క్రూసేడ్స్ కి వ్యతిరేకంగా వెళ్లాలని ఊహించుకునేవారు. ఆమె తన తిరుగుబాటు స్వభావాన్ని సన్మార్గములో పెట్టి జీసస్ కై అంకితం చేసేరు. ఆమెపై ఇతరులు అభాండాలను వేసినా ఆమె చిరునవ్వుతో సహించేరు. ఆమె ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక మేధావి. ఎందుకంటే ఆమె తన తిరుగుబాటు స్వభావాన్ని తనకు కలిగిన అవరోధాలను తొలగించు కొనుటకై ఉపయోగించుకొన్నారు.

మనం చేసే ప్రతి తప్పుకు ఒక ప్రయోజనం ఉంది. అది కర్మ వలన చేయబడి, కర్మను తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇది జీవితంలో కలిగే పెద్ద యుద్ధం. చికాకు, అసంతృప్తి, మనస్సాక్షి వలన కలిగే ఇబ్బంది, మనలో పరిణామం వలన కలిగే పోరాటం వలననే. అలాగ పోరాటం లేకపోయినా, దాని అవగాహన ఉంటే మన పరిణామానికి మనమే బాధ్యత తీసికొన్నట్టు.

నేను సముద్రపుటొడ్డున నడవడానికై వెళ్తూ ఉంటాను. గాలి నన్ను ముందుకు తోస్తూ ఉంటే నడవడం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నేను తిరిగి వస్తున్నప్పుడు అదే గాలి నా మీదకి ఇసుక జల్లుతూ నాకు ఇబ్బంది కలిగిస్తుంది.

ఆ గాలివంటి అనుభవం మన మనస్సులో కూడా ఉంది. మనకి నచ్చే విషయాల పై మనను తీసికెళ్ళి, మనకి నచ్చని విషయాలనుంచి దూరం పెడుతుంది. మనం వెనక్కి వస్తున్నప్పుడు వేల కొలది ఆలోచనలు మన మొహం మీద ఇసుక జల్లినట్లు౦డి మనం చక్కగా చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు మనం చిన్న చిన్న అడుగులు వేసి ముందుకు వెళతాం. ఎక్కువ ఈదుర గాలి మన ప్రయత్నానికి ఆటంకం కలగించి మనకు నిరాశ కలిగించవచ్చు. దానికై మన దృష్టిని లక్ష్యం పై కేంద్రీకరించి, "సదా నీ చూపును నా మీదే ఉంచు" అని శ్రీకృష్ణుడు చెప్పినట్లు, అవరోధాలను అధిగమించాలి.

కొందరు "నా సంస్కారాలనే ఈదురు గాలిని ఎదిరించి బ్రతకలేను. నా మొహం మీద ఇసుక జల్లబడితే సహించలేను" అంటారు. ఇది మానవ సహజం. గీత ఇచ్చే సమాధానం కొంచెం కటువుగా ఉంటుంది. మీరు ఈదురు గాలిని ఎదిరించకపోతే, మీ సంస్కారాలు తిరగబడి మిమ్మల్ని దానిని అనుభవించేటట్టు చేస్తాయి అంటుంది. అదే దుఃఖం, బాధ. ఒకడు ఎంతో దుఃఖాన్ని అనుభవించ లేడు. దానికి ఒక పరిమితి ఉంది. దాని వలన మనశ్శాంతి కోల్పోయి, బంధుత్వాలను పోగొట్టుకొని, ఆరోగ్యం చెడి పోతుంది. శ్రీకృష్ణుడు "నా ఆదరువు నీకు ఎంతో అవసరమై, ఆ బాధే నిన్ను గాలికి ఎదురుగా నడిపింప జేస్తుంది" అంటాడు. మనం ఎంత దూరం పయనిస్తే, తిరిగి వెనక్కి అంత దూరం నడిచి, ఇంకా ఎక్కువ ఈదుర గాలిని ఎదుర్కోవాలి. "నీవు నడవలేని పరిస్థితి వచ్చే వరకు వేచి ఉండకు. వెనక్కి తిరిగి నీ సంస్కారాలను ఎదుర్కో" అని శ్రీకృష్ణుడు అంటాడు.

యోగులు శ్రీకృష్ణుని హెచ్చరికను వి౦టారు. తక్కినవాళ్లకు కొంచం కష్టం. మనం చేసే ప్రతి క్రియకూ ఒకే లక్ష్యం ఉంది. అది మనల్ని పరిమితమైన ప్రతి వస్తువు మీద అసంతృప్తిని కలుగజేసి, మన ఆత్మను గురించి తెలుసుకోడానికి ప్రోద్భలం చేస్తుంది.

ఈ మార్పు అకస్మాత్తుగా జరగక్కరలేదు. నేను సెయింట్ ఫ్రాన్సిస్ వంటి వాళ్ళ వలె నాటక ఫక్కీలో మార్పు జరుగుతుంది అనను. ఒక సాధారణ వ్యక్తి "నేను భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను" అని ఒప్పుకోకపోవచ్చు. "నేను మంచి జీవితాన్ని కోరుకుంటున్నాను. నాకు మనశ్శాంతి, మంచి బంధాలు అవసరం" అని అనవచ్చు. ఇది ధ్యానం మొదలుపెట్టడానికి చాలు. ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో మందులు వాడి, చివరకు ధ్యానం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు.

నేను 1959 నుంచి ధూమపానం అనారోగ్యమని చెప్తూ వచ్చేను. చాలామంది మిత్రులు ఆ అలవాటు ఎప్పటికీ పోదని, నేను సమయం వృధా చేస్తున్నానని అనేవారు.

కానీ కొన్నేళ్ళ తరువాత ధూమపానం అనారోగ్యమని అందరూ తెలిసికొన్నారు. చాలా మంది పట్టుదలతో ఆ అలవాటును మానుకొన్నారు. ఒక మనిషి ఒక దురలవాటుని మానడానికై ప్రయత్నిస్తే, ఎంతో హాని నుంచి రక్షింపబడతాడు.

ఈ విధంగానే సమాజం కూడా మారవచ్చు. ఒక మనిషి తరువాత ఉంకొకడు తమ అలవాట్లను మార్చుకొంటే, క్రమంగా సమాజంలో మార్పు వస్తుంది.

కొన్నేళ్ళ క్రిందట లాభాలనాశించి సంస్థలు చిన్న పిల్లలతో తమ పరిశ్రమలలో వారానికి 40 - 60 గంటలు పని చేయించుకొనేవారు. అటువంటి వెట్టి చాకిరీ ఈనాడు సంపన్న దేశాలలో చూడం. బాధ ఎక్కువవతున్నకొద్దీ మార్పు కై కోరిక ప్రబలుతుంది. ధూమపానం, పక్షపాతం, వెట్టి చాకిరీ, కాలుష్యం, యుద్ధం మొదలైనవాటివలన కలిగే అపార నష్టం వలన మార్పు తప్పక వస్తుంది.

సాధనలో పరిపక్వత పొందుతున్న కొద్దీ, మన అహంకారం తన ఆధిపత్యానికై పోరాడుతుంది. దానివలన మన సంస్కారాలు, ఇంద్రియాలు, భావాలు, భయాలు ప్రభావిత మవుతాయి. ఒకడు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడితే, అహంకారం వానిని ఇంకా ఎక్కువ అలవాటుపడడానికై ప్రోత్సాహం చేస్తుంది. బుద్ధుడు సన్న్యాసానికి ముందు రాజ సుఖాలు అనుభవించలేదా? అలాగే మనం కూడా అని అహంకారం వాదిస్తుంది.

మనం అచేతన మనస్సు లోతులకు వెళ్తున్న కొద్దీ, మన సంస్కారాలు మనం వెళ్ళిన త్రోవలోనే బయటకు వస్తాయి. చివరకు అవి మనతోనే యుద్ధానికి వస్తాయి. మనం వాటితో యుద్ధం చేయవలసిందే.

తెలివైనవారు ఇలాంటి సమయంలో మెలకువగా ఉంటారు. ఇంద్రియ సుఖాలు మనల్ని తప్పు దారి పట్టిస్తాయి. సంస్కారాన్ని ఎదిరించక పోతే అది మన పట్టుదలని సడలించడానికై ప్రయత్నిస్తుంది.

అర్జునుడు ఎలాగైతే తన బంధుమిత్రులతో యుద్ధానికి వెళ్ళనన్నాడో, అలాగే మన పట్టుదల సడలి సంస్కారాలతో యుద్ధం చేయలేనని అనవచ్చు.

శ్రీకృష్ణుడి చెప్పే యుద్ధ నిశ్చయతలో ఎన్నిక చేసికోవడానికి ఆస్కారం లేదు. మనం వద్దనుకొన్నా సంస్కారాలు మనతో యుద్ధానికి వస్తాయి. మన౦ కర్మ సిద్ధాంతం నుండి విముక్తిని పొందలేము. బ్రతికి ఉండడం వలన మనమీ యుద్ధాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. అందుకై మనం యుద్ధం చేయవచ్చు, లేదా పలాయనం చేయవచ్చు.

అర్జునుడు క్షత్రియుడు. నిజమైన క్షత్రియులు యుద్ధ భూమినుండి పలాయనము చేయరు. వారి దూకుడు, క్రోధం, గర్వం, సంకల్పం ఇందుకై ఉన్నాయి.

శ్రీకృష్ణుడు "మన స్వభావం మనలను మారుస్తుంది" అంటాడు. మనం వలలో చిక్కిన చేప వలె ఉన్నాము. ఆ వల చేసికొన్నది మనమే. చాలా కాలం దానికి అలవాటు పడి దానినుంచి బయటకు రావడానికి ఇష్ట పడం. శ్రీకృష్ణుడు ప్రకృతి మనలను చివరకు స్వంతంత్రులను చేస్తుందని అంటాడు. కటిక చీకటిలో ఒక కాంతి కిరణం వస్తే, దాని వైపే వెళతాం. ఒకడు కటిక చీకటి ఫరవాలేదు, దానిలో నివసించడానికి నాకు అభ్యంతరం లేదు అనవచ్చు. కాని దానివలన లాభం లేదు. ఎందుకంటే మనకు కావలసినది సార్వత్రిక కాంతి. 463

Chapter 18 Section 23

Bhagavat Gita

18.23

మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా త్తరిష్యసి {18.58}

అథ చేత్త్వమహంకారాత్ స శ్రోష్యసి వినంక్ష్యసి

నా యందు చిత్తము గల నీవు నా అనుగ్రహము వలన సర్వ సంకటములను దాటగలవు. ఒకవేళ నీవు అహంకారము వలన వినని యెడల చెడిపోయెదవు

మనం జీవిత అంచులలో బ్రతుకుతూ ఉంటే మన సమస్యలు కూడా చిన్నవై ఉంటాయి. అవి పెద్దవి అనిపిస్తే, మన౦ చేతన మనస్సు లోతులకు వెళ్లలేదని అర్థం. మన౦ లోతుకు వెళితే, ఇంకా ఎన్నో సమస్యలు ఎదురవ్వవచ్చు. కాని అవి మనం భరించలేనంతగా ఉండవు. మనం ఆధ్యాత్మికత వలన కలిగే కష్టాలను ఎదుర్కోలేమని అనుకోవడం శ్రద్ధ లేకపోవటం వలన. ఆ కష్టాలు సహజం, మరియు అవసరం కూడా. ప్రతి ఒక్కరూ వాటిని ఎదుర్కోగలరు. నా సాధనలో లోతుగా వెళ్ళే వేగం ఎక్కువైతే, నేనెంత క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్నా అంతర్ముఖుడినై, ఇంకా లోతుకు వెళ్ళి వాటిని పరిష్కరించే మార్గం వెతకుతాను. ఇటువంటి సాధన ప్రయత్నం చేసే వారందరికీ వర్తిస్తుంది. అలా చేయగలిగితే ఓటమివాదం పోతుంది.

మనము మానవాతీత శక్తి ఉంటే తప్ప సాధన చేయలేమని అనుకోవడం అపోహ. యోగులు కూడా ఏ ఒక్కడూ ఆత్మ జ్ఞానాన్ని తనంతట తానే కలుగజేసికోడు అని అంటారు. దానికి దైవ కృప ఉండాలి. మనం చెయ్యగలిగిందల్లా ప్రయత్నంతో, క్రమశిక్షణతో కూడిన సాధన. మనకున్న శక్తినంతా సాధనకై వెచ్చించక పోతే మన అహంకారం ధృడమవుతుంది. శ్రీకృష్ణుడు అందుకే "నువ్వు అహంకారంతో నా మాట వినకపోతే, నేను నిన్ను రక్షింపలేను" అని చెప్పెను. అలాగని శ్రీకృష్ణుడు మనయందు తన ప్రేమను వెన్నక్కి తీసికొ౦టానని చెప్పటం లేదు. కష్టాలు వస్తాయి అని చెప్పుచున్నాడు.

మన సాధన మొదట్లో అనేక అనుమానాలతో కూడి ఉంటాము. వాటిలో కొన్ని చిన్నవి కొన్నాళ్ళు సాధన చేస్తే తొలగిపోతాయి. కాని కొన్ని మన వ్యక్తిత్వంలో ధృడంగా పాతుకు పోయి మనకు లోతుకు వెళ్తే తప్ప అవగాహనకు రావు. ఆ సమయంలో ఎంతో విచారము పొందవచ్చు. "నేనేమి చేసేది? గీత సంపూర్ణమైన మనస్సుతో సాధన చెయ్యమంది. అది ఎలాగ?" అని నిరుత్సాహపడవచ్చు. ఇది సహజం. మన అహంకారాన్ని చంపుకోడానికి ప్రయత్నిస్తున్నాం. అది అంత సులభంగా కాక మనని ఒక వైపుకు లాగుతుంది. మన ఆత్మ మనల్ని ఉంకోవైపుకు లాగుతుంది. మన౦ చేసే ఎన్నికలకు, మన కోర్కెలకు వాడే శక్తిని ఆత్మ వైపుకు తిప్పుకోవాలి. శ్రీకృష్ణుడు తక్కినది చేస్తాడు. ఆగస్టీన్ "మనం చెయ్యగలిగింది చేస్తే, దేవుడు తన ఇష్టమైనట్టు చేస్తాడు" అనెను.

అచేతన మనస్సు అపారమైనది, అంతం లేనిది. దానిని అర్థం చేసికోవడం సాధ్యం కాదు. అచేతనమంటేనే మనకి చేతన మనస్సుతో విశ్లేషించడం సాధ్యం కానిది. కానీ యోగులు వినియపూర్వకంగా "అవును అది అసాధ్యం. కానీ మేము చేసేము. కాబట్టి మీరు కూడా చేయవచ్చు" అని చెప్తారు. ఇటువంటి అధ్బుతమైన జ్ఞానం, జగత్తులో ఎటువంటి దానితోనూ పోలిక పెట్టలేం. 456

Chapter 18 Section 22

Bhagavat Gita

18.22 చేతసా సర్వకర్మాణ్యపి మయి సన్న్యస్య మత్పరః {18.57}

బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ

చిత్తముచే సర్వ కర్మలను నాయందు సమర్పించి మత్పరాయనుడవై, బుద్ధి యోగమును ఆశ్రయించి, సదా నా యందే చిత్తము గలవాడవు కమ్ము

శ్రీకృష్ణుడు చివరగా అర్జునినికి బోధ చేయుచున్నాడు. "నీ మనస్సులో ఎటువంటి సంశయాలు ఉండకూడదు" అని పదే పదే చెప్పుచున్నాడు.

ఒక పేరుపొందిన గాయకుడు "నాకు ప్రేమలో పడడం చాలా ఇష్టం. కాని అది 6 నెలల ముచ్చట" అన్నాడు. బంధాలు భౌతికమైనవి అయితే 6 నెలలే ఎక్కువ. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ చెప్పేది: "నీవు నన్ను నీ హృదయంతో, బలముతో, ఆత్మతో ప్రేమించ గలిగితే నీవు సదా ప్రేమతో ఉంటావు".

కొంతమంది అడుగుతారు "పరమాత్మని సదా స్మరించడం అంటే ఏమిటి?" దానికి బదులుగా మనం ఆడగవలసింది పరమాత్మని స్మరించక పోతే ఏమవుతుంది? క్రోధం, శతృత్వం, చికాకు, అసహనం మొదలైన వాటితో కూడిన మానసిక స్థితి కలుగుతుంది. మన హృదయంలో దేవుని స్మరిస్తే, నిర్దయ రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దేవుడు అంటే ప్రేమ.

మీరు నాలాగ ఇళ్లలోనూ, బస్సు ల్లోనూ, దుకాణాల్లోనూ, హోటల్ లోనూ రోజూ కలిగే కలహాలు చూస్తే తెలుస్తుంది. మనకి భూమి మీద ఎంతో తక్కువ సమయం ఉండి, ఎంత చేయవలసినది ఉందో తలచుకొంటే అవి హాస్యాస్పదం గా ఉంటాయి. ఒక యోగికి జీవితమంతా వేగిరంగా సాగుతుంది. కలహాలు, స్వార్థ కర్మ, మొదలైన లక్ష్యాన్ని చేర్చలేని పనులకు వ్యర్థం చేసేట౦త సమయం లేదు.

అలా అని చిన్న చిన్న ఆనందాన్ని వద్దనటంలేదు. నా ఉదాహరణ తీసికో౦డి. నేను నా గురువు దయ వలన ఒక చిన్న యోగిని. నేను శ్రీకృష్ణుని ఎప్పుడూ మరచిపోను; నిద్రలో కూడా ఆయని ఎరుక ఉంటుంది. కానీ నేను జీవితాన్ని ఆహ్లాదంగా గడుపుతానని నా బంధు మిత్రులు చెప్తారు. నేను పోషకాహారాన్ని తింటాను; నాకు చాలా గట్టి బంధాలు ఉన్నాయి; సముద్రపు టొడ్డున దీర్ఘంగా నడుస్తాను; నేను పుస్తకాలు చదువుతాను; నేను సినిమాలకు, కచేరీలకు వెళ్తాను. నేను ఆనందం కలిగించే దానిని దేన్నీ విడవలేదు. కానీ నేను ఆనందించడానికై బ్రతకటం లేదు. నేను జీవితాన్ని ఆహ్లాదంగా అనుభవిస్తాను. ఎందుకంటే నేను ఇతరుల ఆనందానికై జీవిస్తాను కనుక. నేను చేసే ప్రతి కర్మా దానికై.

నా ప్రాధాన్యతలను మార్చుకోవడం మీకు లాగే కష్టం. ఒక కళాకారుడు తన కళను ఎలా ఆరాధిస్తాడో నేనూ అలాగే ఏకాగ్రతతో నా విధులను చేస్తాను. నేను చిన్నప్పుడు సాహిత్యం, సంగీతం, క్రీడలు చాలా ఇష్టపడేవాడిని. ధ్యానం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ, నేను శ్రీకృష్ణునికి దగ్గర అవ్వాలంటే నా ఇష్టాలను వదలి వెయ్యాలి అని గ్రహించేను.

నా కది మొదట్లో కష్టమనిపించి, ఎప్పటికీ చెయ్య లేననుకొనేవాడిని. నా బుద్ధి "ఇది అవసరమా? వీటి వలన కలిగే అపకారం ఏమిటి?" అని అడిగేది. నేను గొప్ప కవినైనా, నోబెల్ ప్రైజ్ పొందినా, అసంతృప్తిగా మరణిస్తానని అర్థం చేసికొని బంధాలను త్రె౦పుకొన్నాను. అటు తరువాత కళల మీద ఇష్టం పోయింది. ఇప్పుడు దేనిమీదా అయిష్టత లేదు. నేను పూర్తి స్వతంత్రంతో అన్నిటినీ ఆనందిస్తున్నాను. ఒకప్పుడు వాటిని త్యాగంచేయడం నష్టమనిపించింది. నాకిప్పుడు తెలుస్తోంది నేను ఎంత ఎక్కువ పొందేనో.

"నీ ప్రతి కర్మ నాకు అర్పిత౦ చేయి" అని శ్రీకృష్ణుడు చెప్పేడు. దాని అర్థం మన స్వీయ సంకల్పాన్ని వదులుకోవాలి. సాధన మార్గంలో --ముఖ్యంగా ధ్యాన మార్గంలో -- సారథ్యం వదలకూడదు. మనం ఎరుక క్రిందనున్న శక్తిని వెలికి తీస్తున్నాము. మన అచేతన మనస్సులోని శక్తులు మనకి ఎరుక లేకుండా సారథ్యం వహించవచ్చు.

చాలా సంవత్సరాల సాధనతోనే మన౦ సదా సారథ్యం వహించగలం. నేను సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా యొక్క ఉదాహరణ ఇస్తాను. ఆమె ధ్యానం లో ఉండగా ఒక పెద్ద గ్రద్ద వచ్చి, ఆమె శరీరాన్ని నేలపై విడచి, ఆకాశం లోకి తీసికెళ్ళినట్లు ఆమెకు అనిపించింది. కాని "నాకున్న ప్రేమ వలన నేను భయపడలేదు" అని చెప్పేరు. ఆమెకు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగేయి. ఆమెకి ఎంత నియంత్రణ శక్తి ఉందంటే, అన్నం వండుతున్నప్పుడు దేవుడే వచ్చి ఆకాశంలోకి తీసికివెళితే, ఆమె చెయ్యి గిన్నెను పట్టుకునే ఉంటుందని ఆమె సహచరులు చెప్పేరు.

మన మనస్సు చంచలంగా ఉంటే, అటువంటి అనుభవం వస్తే, మన లక్ష్యాన్ని చేర గలిగే ద్వారం మూసుకొంటుంది. పరవశం రాకుండా ఆశ గొల్పు సంఘటనలు కలుగుతాయి. కొందరు యోగులు వాటిని ఇలా చెప్తారు: "నేను దేవుడు అడుగుల చప్పుడు నా హృదయంలో విన్నాను. నేను ఎంతో ఉత్సాహపడుతుండగా ఆయన వెనక్కి తిరిగి వెళ్లిపోయేడు." అందుకే మీరు సారథిగా ఉండాలని చెప్పేది. భావోద్వేగము మిమ్మల్ని తప్పు దారులు పట్టించకుండా చూసుకోండి. ఉత్సాహం తరువాత నిరాశ వస్తుంది. మన దేవుని తిరోగమమం అటువంటిదే. సెయింట్ తెరెసా అది ఒక అతి వేదన కలిగించే ఘటన అంటారు. క్రిష్టియన్ లు దానిని డార్క్ నైట్ ఆఫ్ సోల్ అంటారు. నేను చెప్పేది అటువంటి డార్క్ నిరాశలు కలగకుండా చేసికోవచ్చు. దానికై మన మనస్సుని ఉత్సాహభరితం చేయకుండా ఉండాలి.

మన మనస్సులో కలిగే ప్రతి కోరిక, భయం, ఒక శక్తిని కూడి ఉంటాయి. చిన్న కోరికకైనా శక్తి ఉండి, క్రోధము, భయము, దురాశ ఒక తుపాను లాగ చెలరేగి తమ దారిలో ఉన్న ప్రతిదానిని అతలాకుతలం చేస్తాయి. మనం కోర్కెలను ఏకీకృతం చేసినా, మనమెలా మనస్సులో చెలరేగే తుపానులను ఎదుర్కోగలం? అవి ప్రతి మానవునిలో ఇలాగే ఉంటాయి. మంత్రోపాసన తోనూ, ధ్యానం వలన వాటిని నిరోధించవచ్చు.

ఒక తుపానుని మంత్రంతో ఎదుర్కొనడం, మన నమ్మకం బట్టి ఉంటుంది. చేతన మనస్సు అంచులలో -- క్రొత్తగా ధ్యానం మొదలు పెట్టినవారలలాగ -- మంత్రోచ్చారణ వలన గొప్ప శక్తి రాదు. అది మంత్రంలో శక్తి లేక కాదు. ఆ మంత్రాన్ని ఇంకా చేతన మనస్సు లోలోపలికి తీసికెళ్లలేదు కాబట్టి.

కొందరు నాకు ఉత్తరాల్లో "మీరిచ్చిన మంత్రం పని చేయడం లేదు" అని వ్రాస్తారు. నా సమాధానం "మీరు గట్టి ప్రయత్నం చేయలేదు". మంత్రం ప్రతిసారీ పని చేస్తుంది. కానీ మనస్సులోని తుపానులను ఎదుర్కోవాలంటే ఆ మంత్రం అవి ఏ లోతులో ఉన్నాయో, అక్కడికి తీసికెళ్ళి ధ్యానించాలి.

నేను నా మంత్రాన్ని ఎడతెరిపి లేకుండా మననం చేసికొ౦టాను. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా, కొన్ని నిమిషాలు ఖాళీ దొరికితే, మంత్రాన్ని ధ్యానించు కుంటాను.

మొదట్లో నేను ఎక్కువ భక్తితో చేయలేదు. చాలా మంది హిందువులు తమకిష్టమైన దైవ స్వరూపాన్ని --కృష్ణుడు, రాముడు, శివుడు -- తలచుకొ౦టారు. కానీ నేను అలాగ చెయ్యను. ఇటువంటి భక్తి ప్రస్తుత కాలంలో చాలా తక్కువ మందిలో చూస్తాం. నేను మొదట నా అమ్మమ్మను ఆనందింప చేయడానికై మంత్రాన్ని మననం చేసేవాడిని. క్రమంగా అది శ్రీకృష్ణునిపై అపరిమిత ప్రేమగా మారింది. అందులో నా గురువు సహాయం కూడా ఉంది.

చాలా కాలం మననం యాంత్రికంగా జరిగేది. కానీ ధ్యానంలో పరిపక్వం చెందితే దానివలన భక్తి భావం కలుగుతుంది. నేను నా మంత్రాన్ని పట్టుదలతో, వీలైన ప్రతి సారీ, ఒక్కొక్కప్పుడు రాత్రి నిద్రలో గంటల తరబడి, చేసేను. ఎందుకంటే నేను అజపజపం అనే స్థితికి ఎదగాలని. అంటే చేతన మనస్సుకు తెలియకుండానే మంత్ర జపం జరగాలి. క్రిస్టియన్ గురువులు "ఆపకుండా ధ్యానం చెయ్యి" అని సెయింట్ పాల్ ను శాసించేరు. ప్రస్తుతం నా మంత్రం చేతన మనస్సు లోతులలో అమిత శక్తివంతమైనదిగా ఉన్నది. నిద్రలో స్వప్న దశ తరువాత, దానిని చేతన మనస్సులో ప్రతిధ్వనిస్తూ, దాని శక్తితో నా దేహాన్ని కంపింపజేస్తుంది. ఎలాగంటే ఒక యంత్రంతో నడపబడే పనిముట్టు వాడుతూ ఉంటే మన దేహం ఎలాగ కంపిస్తుందో అలాగ. కాని నాకు నిశ్శబ్దంగా ఉండి, చల్లని సంగీతంలాగ ఉత్సాహాన్ని ఇస్తుంది. 452

Chapter 18 Section 21

Bhagavat Gita

18.21

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి {18.54}

సమస్సర్వేషు భూతేషు మద్భక్తి౦ లభతే పరామ్

బ్రహ్మభూతుడైన ప్రసన్నాత్ముడు దేనిని గూర్చి దుఃఖి౦పడు. దేనిని కోరడు. సమస్త ప్రాణుల యందును సముడై ఉత్తమమైన నా భక్తిని పొందుచున్నాడు

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్శ్చాస్మి తత్త్వతః {18.55}

తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్

అతడు భక్తిచేత నేనెవడనో, నా ప్రభావమెట్టిదో తెలిసికొను చున్నాడు. నన్ను ఈ విధముగ వాస్తవముగ గ్రహించినవాడై అనంతరము నా యందే ప్రవేశించుచున్నాడు

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్ప్యపాశ్రయః {18.56}

మత్ప్రాసాదా దవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్

సర్వ కర్మములను సదా ఆచరించుచున్నను ఎవడైతే నన్ను శరణు పొంది యున్నాడో అట్టివాడు నా అనుగ్రహము వలన నాశరహితమైన మోక్షమును పొందుచున్నాడు

శాశ్వతమైన జీవితం గూర్చి గురువులు చెప్పెదరు. అది అతిశయోక్తి కాదు.

కొన్ని సంస్కృతులలో మరణం గురించి మాట్లాడరు. హిందూ మతములో మరణం ఒక తలుపు లాంటిది. ఇక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద ఒక సొరంగం ఉంది. దానిలోనుండి ఒక రహదారి వుంది. దాని లోకి నాలుగు వాహనాలు ఒకేమారు వెళ్ళవచ్చు. అలాగే నాలుగు వాహనాలు ఒకే మారు బయటకు రావచ్చు. చావు పుట్టుక అటువంటివే. ఒక వైపు వస్తే పుడతాము. రెండవవైపు వెళ్తే మరణిస్తాము.

ఒక విమానం ఆ సొరంగం లోంచి వెళ్ళక పైనించే ఎగిరి పోతుంది. . అదే సమాధిలో చేయగలం. మనం సొరంగం లోంచి, చేతనంలో ఎటువంటి మార్పు లేక వెళ్లగలం. అలాగే వెనక్కి వస్తాం. ఆ అనుభూతి మాటలలో చెప్పలేం. ఒక మరణిస్తున్న వ్యక్తితో ఆ రహదారి అంతమయ్యేవరకూ వెళ్ళి, మరణం గురించి ఉన్న అపోహలు తొలగించుకోవచ్చు.

సొరంగం ఆరంభం మన ఎరుక వంటిది. అక్కడ మరణం అంటే ఏమిటో తెలుస్తుంది. చేతన మైన జీవుడు, వ్యక్తిత్వము, లోతైన అచేతన మనస్సులోకి లాగ బడతాయి. ధ్యానంలో ఇదే జరుగుతుంది. మరణం ధ్యానం ద్వారా ఎరుకతో ఉండి అనుభవించవచ్చు. మరణం ఒక జీవుని అంతం కాదు. ఎందుకంటే ధ్యానంలో ఎరుకతో ఉండి మరణాన్ని అనుభవించి తిరిగి వెనక్కి రావచ్చు.

చేతన మనస్సు లోతులలో కాలం కదలదు; గతం, భవిష్యత్తులు లేవు; మనస్సు నిశ్చలమై ఉంటుంది. అక్కడ కాలం లేదు కాబట్టి ఎటువంటి కార్యము జరుగదు. గురువులు చెప్పేది అది శుద్ధమైన జీవి. ఇది తర్కమునకు అందనిది.

మనస్సు చంచలంగా ఉంటే ఆ స్థితిని పొందలేము. హిందూ సంప్రదాయంలో ధ్యానంలో ఒక్క కోరిక కలిగినా, సమాధి సాధ్యం కాదు. గాంధీ మహాత్ముడు దీనికై ఓర్పు ఎంత ఉండాలంటే సముద్రాన్ని గడ్డి పూచతో ఖాళీ చేయడం అని వర్ణించేరు. నా స్వీయ అనుభవంతో అది నిజమని చెప్పగలను. మనం ద్వారం దగ్గర ఉండి, తలుపు తెరుచుకోవడం చూస్తాము. కాని ఒక్క కోరిక కలిగినా, మనం లోపలికి వెళ్ళలే౦. నాకు పూర్వంలో చాలా ఓర్పు ఉండి ఎన్నిమార్లైనా ప్రయత్నించడానికి సిద్ధమయ్యేను. కాని నా మేధతో నేను చేయలేనని తెలిసికొన్నాను. దాని వలన నాకు చాలా విచారం కలిగింది. శ్రీరామకృష్ణ సాధనలో ఒక కత్తి పట్టుకొని దేవి కాళ్ళ మీద పడి "నువ్వు ప్రత్యక్షమవ్వకపోతే, నేను దేహాన్ని వీడుతాను" అని వేడుకొన్నారు. నేను అటువంటి స్థితి గురించి చెప్తున్నాను. మనం తలుపుని కొ౦చెం తెరిచి లోపల ఏముందో చూద్దామని అనుకొంటాం. కాని ఎంత ప్రయత్నించినా మనం లోపలికి వెళ్లగలిగినంత తలుపుని తెరవలేం.

ఇక్కడ గురువు ఆవశ్యకత ఉంది. నా గురువే లేకపోతే సమాధి స్థితి పొందడానికి ఆ తలుపుని పూర్తిగా తెరిచేవాడిని కాను.

ఒక మారు ద్వారం గుండా రావడం పోవడం చేయ గలిగితే, ఒక మరణిస్తున్న వ్యక్తితో ప్రయాణం చేసి, ద్వారం అవతలనుంచి తిరిగి అదే జీవిగా ప్రపంచంలోకి రావడం సాధ్యం కాదని తెలిసికొ౦టా౦. మరణిస్తున్న వ్యక్తి మన ప్రియుడు అయితే, వానితో మన౦ ఈ సంభాషణ చేయవచ్చు: మరణంతో అంతం కాదు. అది ఒక తలుపు, ద్వారం లేదా వంతెన వంటిది. దాన్ని దాటి కొంత కాలం విశ్రమించి మళ్ళీ వెనక్కి -- అంటే పరిణామంలో ఎక్కడ వీడి పోయేమో అక్కడికి--వస్తాం. ఈ విషయం తెలిసిన జ్ఞానికి చావు అంటే భయము౦డదు. అలాగే ఒక నూతన శరీరాన్ని ధరించి, మళ్ళీ జీవితాన్ని సాగించాలనే కోరిక కలగవచ్చు. 448

Chapter 18 Section 20

Bhagavat Gita

18.20

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం {18.53}

విముచ్య నిర్మమశ్శా౦తో బ్రహ్మభూయాయ కల్పతే

విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై, ధైర్యముతో మనో నిగ్రహమును పొంది, శబ్దాది విషయములను మరచి, రాగ ద్వేషములకు దూరుడై, ఏకాంత వాసియు, మితాహారియు, స్వాధీనమైన మనో వాక్కాయములు కలవాడు, సదా ధ్యాన యోగ పరాయణుడై యుండువాడు, వైరాగ్యమును చక్కగా ఆచరించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామమును, క్రోధమును, ద్రవ్య సంగ్రహమును విడిచినవాడు, మమకార రహితుడు, శాంతుడు నగువాడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు.

ఇద్దరు ఎంత అన్యోన్య౦గా ఉన్నా వారు వాళ్ళ ఏకాంతం కోరుకొంటారు. గాంధీగారు బ్రతికున్నప్పుడు ఆయన ఇంటికి ఎవరైనా వెళ్ళవచ్చు; ఆయన ఎలా జీవిస్తారో, ఆలోచిస్తారో, ఆయన ప్రేరణ ఏమిటో తెలిసికోవచ్చు. సాధారణ మానవులు అలా కారు.

మనం ఒకర్ని ప్రేమిస్తే, కొంత నిస్వార్థత ఉన్నా, మేము ఏకం అనడంతో, మన ప్రేమను భౌతిక శరీరానికే పరిమితం చేసేము. శ్రీకృష్ణుడు అటువంటి భౌతిక బంధాలలోని ప్రమాదాలను సూచించెను. అన్ని భౌతికమైన వస్తువుల లాగే భౌతిక బంధాలు మార్పు చెందుతాయి. కోరికలు క్షణికమైనవి.

స్వార్థమైన కోరికలు మనస్సులో అలజడి కలిగిస్తాయి. అది అలజడి కాకపోతే ఉత్తేజం చెందుతుంది. దానివలన ఆనందం, భద్రత క్షీణిస్తాయి. మనం ఆత్మ నుండి వేరౌతాము. కోరికలు ఆనందదాయకమే. గీత ఆనందం బాధ కలిగించేది అని చెప్పదు. గీత చెప్పేది ఆనంద౦ వచ్చి పోతూ ఉంటుంది. అది వెళ్ళినపుడు లేమి, నిరాశ, నిస్పృహలు కలిగిస్తుంది. సుఖ దుఃఖాలు కలసి ఉంటాయి. ఒకటి కోరుకొంటే రెండూ వస్తాయి.

నేను ఆనందానికై ప్రాకులాడిన వారితో మాట్లాడినప్పుడు అనేక విషయాలు తెలిసికొన్నాను. కొందరు స్వీయ జ్ఞానం ఉన్నవారు ఇలా చెప్పేరు: "నా దగ్గర డబ్బు౦ది, సమయముంది. ఆనందాన్నికలిగించే ప్రతి వస్తువును పోగుచేసికొన్నాను. నాకు ఏది కావాలనుకొన్నానో దాన్ని పొందేను. కాని దేన్నీ శాశ్వతంగా ఉంచ లేకపోయేను. ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత తక్కువ ఫలితం వచ్చింది. నిజంగా నాకు ఒకప్పుడు ఆనందం కలిగించినవి నను దుఃఖంలో ముంచేయి".

నాకు ఇది తెలిసికోవడానికి చాలా ఏళ్లు పట్టింది. ఆ కాలంలో సాధారణ వ్యక్తులవలె ఎన్నో తప్పులు చేసేను. నాకు అది తెలిసిన తరువాత నా అమ్మమ్మతో "నువ్వు ఆనందం గురించి చెప్పినవన్నీ నిజం" అన్నాను. ఆమె నా తలమీద చెయ్యి పెట్టి "నువ్వు తెలివైన వాడివి" అన్నది. నాకు ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అని అడగలేదు. ఆమె చెప్ప దలచుకొన్నది కొంత మంది ఎన్నటికీ తెలిసికోలేరు. కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని వెంటనే పొందకపోతే వ్యధ చెందక్కరలేదు. ప్రతి సాధకునికీ కొన్నేళ్ళు పడుతుంది. మనస్సును కుదిపితే గతాన్ని తవ్వి, మంచి చెడు లతో భావోద్వేగము చెందుతాము. దాని వలన మన సాధనకు అవరోధం కలుగుతుంది. మనస్సు మళ్ళీ కుదుటుపడడానికి చాలా కాలం పడుతుంది.

ఒక ఉన్నతమైన లక్ష్యానికై బంధాలను విడనాడితే దానిలో చాలా ఆనందం ఉంది. ప్రపంచానికి సహకరిస్తున్నామనే భావంలో చాలా సంతృప్తి ఉంది. "ఇందులో నిజమైన ఆనందం ఉంది" అని బెర్నార్డ్ షా అన్నారు.

"మనమొక ఉన్నతమైన లక్ష్యానికై జీవిస్తున్నామని తలిస్తే దాని వలన చాలా ఆనందం ఉంది. అది కొందరు స్వార్థపరులు, వ్యాధిగ్రస్తులు, తమకు ప్రపంచం ఆనందం కలిగించట్లేదనే ఫిర్యాదులు చేసేవారిలా కాక మనని శక్తివంతులను చేస్తుంది."

ఇది చాలా శక్తివంతమైన వ్యాఖ్యానము. కాని అది మన త్యాగానికై ఉత్తేజ పరుస్తుంది. గీత చెప్పేది ప్రకృతి యొక్క శక్తి వలె కాక పరమాత్మ చేతిలో ఒక పనిముట్టుగా ఉండమని. నిస్వార్థమైన జీవి ఒక శక్తిమంతుడు. వాని సహాయం ఎన్నటికీ వృధా పోదు. అది మానవాళి చైతన్యంలో కలిసి పోతుంది.

పూర్వ కాలంలో మన జీవితం మన చేతుల్లో లేదు, అంతా భగవత్ ప్రసాదం అనేవారు. నేను చిన్నప్పుడు పూజ పునస్కారాలతో పెరగలేదు. ఏదో శక్తి నన్ను ఇతరులకు సహకరించని కర్మల నుండి కాపాడింది. ఇటువంటి ప్రేరణ గాఢంగా కలిగితే స్వీయ సంకల్ప౦తో ఇతరులను ఎదిరించి బ్రతకవచ్చు. ఎలాగంటే ఒక బిడ్డకు తల్లి తన సుఖాన్ని పట్టించుకోకుండా బిడ్డని చూసుకుంటుంది. మన స్వార్థం గురించి సదా ఆలోచిస్తూ ఉంటే, మనం ప్రపంచానికి సహకరించే కర్మల నుండి విడదీయ బడతాం.

జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ప్రాణ శక్తిని ఏకీకృతం చేసి, ఉపయోగించి, సంరక్షించాలి. ఎందుకంటే అది మన ఆనందానికి ఉపయోగపడే శక్తి.

గర్భంలోని శిశువు ఎలా రక్షింప బడతాడో, మన ప్రాణ శక్తి తప్పులనుండి రక్షింప బడుతుంది. మనం ప్రాణాన్ని ఇంద్రియ సుఖాలకి వెచ్చించవచ్చు. కాని మన లోతులలో ఉన్న ప్రాణ శక్తి ధ్యానం ద్వారా వెలికి తీయాలి. ఇలాగ ఒక వ్యక్తి ఉన్నత మైన లక్ష్యం చేరడానికి ఎప్పుడైనా సంకల్పించవచ్చు. ప్రాణ శక్తి వెంట ఉంటుంది.

కానీ స్వీయ సంకల్పం వలన కలిగే అహంకారం బహు చెడ్డది. అందుకే సాధనకి ఉపయోగపడే ప్రాణ శక్తిని స్వార్థపూరిత పనులకై వృధా చేయరాదు.

ప్రాణ శక్తి ద్వారా మన బుద్ధి ఇంద్రియములను, అభిరుచులను, స్పర్థలను నియంత్రించవచ్చు. ఇది ఒక సృజనాత్మక శక్తి. అలాగే ప్రాణం లైంగిక కార్యాలకు కూడా వర్తిస్తుంది. ఆధ్యాత్మిక భాషలో రతి భౌతికమైనది కాక, ఒక సృజనాత్మక శక్తి. మనలోని క్లిష్టమైన స్వీయ ఏకీకరణ. రతి దానియొక్క భౌతిక వ్యక్తీకరణము. మనం భౌతిక మని తలచినంత కాలము, రతి చేత ప్రభావితమౌతాము. దాని మూలాలు మనస్సు లోతులలో నుండి మన ఆత్మ జ్ఞానమును పొందటానికి సహకరిస్తుంది.

రతి ఒక భార్య భర్తల అనుభందంలో ఎంతో ఉపయోగకరం. కానీ అక్కడ కూడా రతి భౌతిక మైనదేకాక ఒక శక్తి. భౌతికమైన సుఖాలను వదిలి పెట్టి ప్రేమించిన వ్యక్తికి దగ్గరవుతే ఆ బంధం సున్నితంగా, భద్రతతో, ఆనందంతో నిండి ఉంటుంది. మనం ప్రేమించిన వ్యక్తికై వారికి బాధను కలిగించే అలవాట్లు వదిలి, కలసి ఒక నిస్వార్థ సేవకై పాటు పడితే శాశ్వతమైన సుఖం, ఇంద్రియ సుఖం కన్నా అనేక రెట్లు, పొందుతామ. దీనివలన సాధారణ సుఖాలు లేవని కాదు. కానీ మనం ఒక ఉత్కృష్టమైన కార్యానికై ఉన్నామని గుర్తు పెట్టుకోవాలి.

ధృఢమైన లైంగిక వాంఛలు ఎక్కువ ప్రాణ శక్తిని సూచిస్తాయి. నేను బెర్క్లీ లో మొదట్లో ఇలాగే చెప్పేవాడిని. ఆ తరువాత కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసింది. వారు బలమైన లైంగిక కోరికలు ఉంటే ఆధ్యాత్మికంగా బహు దూరం ప్రయాణించవచ్చునని తలచేవారు. అందుకై అటువంటి కోరికలను పెంచుకోవాలనుకునేవారు. అది అవసరం లేదు. అది పెట్రోల్ డబ్బా దగ్గిరి ధూమపానం చేసినట్లు. ధృడమైన అభిరుచులు ఉన్న వ్యక్తి వాటిని ఉపయోగించి ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదగ వచ్చు. మనము అభిరుచులను నియంత్రించక పోతే అవి మనని నియంత్రిస్తాయి. కాబట్టి బలమైన అభిరుచులు ఉంటే బాధ చెందక, వాటిని ఆధ్యాత్మిక చింతనకు వాడాలి. అలాగే ఆ శక్తిని నిస్వార్థ సేవకై; ఓర్పు, సున్నితము, నిస్వార్థమైన బంధాలకు రూపాంతరము చేసి వాడాలి.

కొందరు నా వద్దకు వచ్చి "నాకు ధృఢమైన లైంగిక వాంఛలు లేవు. అంటే నాకు ప్రాణ శక్తి తక్కువగా ఉందా, నా లక్ష్యాన్ని చేరలేనా?" అని అడిగేవారు. నేను స్వీయ సంకల్పం ఉంటే చాలు అని సమాధానము ఇచ్చేవాడిని. గీత ప్రతి వ్యక్తికి పనికివచ్చే శాస్త్రం.

ప్రాణ శక్తిని యోగులు కుండలిని అని అంటారు. అది తరతరాలుగా వృద్ధినొందిన పరిణామ శక్తి. కుండలినిని ఒక స్ప్రింగ్ లా భావించవచ్చు. అది పరిణామంలో చాలా శక్తికలిగి కుదించుకుపోయి ఉంది. దాని శక్తిని విడుదల చేయడానికి మనం చేయగలిగందల్లా మన చేతులను వాడి దాని శక్తిని విడుదల చేయడం. నాతో కొందరు "నేను పురోగతి చెందటంలేదు. నాకు ఎక్కువగా లైంగిక ఆలోచనలు కలుగుతున్నాయి" అని చెప్పేవారు. నా సమాధానము: "మన కుండలిని అనబడే స్ప్రింగ్ కొన్ని కోట్ల సంవత్సరాలు కుదించుకు పోయి ఉంది. నీవిప్పుడు వట్టి చేతులతో దాని శక్తిని విడుదల చేయదలచుకున్నావు. అది ఒక్క రోజులో అవుతుందా?"

కొన్నేళ్ళు సాధన చేసిన తరువాత కుండలిని శక్తి విడుదలవుతున్నాదని తెలుస్తుంది. ఆ భావన సాధారణంగా నిద్రలో వస్తుంది. అది స్వప్నావస్థలో కాక, శుషుప్తిలో తెలుస్తుంది. అనగా మన చేతన మనస్సు నిద్రలో మునిగి, మన అచేతన మనస్సు వేకువలో ఉన్నప్పుడు. అది ఆత్మకి చాలా దగ్గరగా నుండును. అది సూచించేది ఇంకా ఎన్నో సవాళ్ళు జీవితంలో వస్తాయి, దానికై గొప్ప శక్తి విడుదల చేయబడుతున్నాదని. దానిని సక్రమంగా వాడాలంటే మనము నిస్వార్థ సేవ చేయగలగాలి.

సాధనలో పరిపక్వత పొందుతున్న కొద్దీ తప్పులు చేయకుండా ఉండాలి. దానికి ఒక గురువు సహాయం తీసికోవచ్చు. కాని ముఖ్యంగా తెలిసికోవలసినది మన శరీరము తన శక్తితో సాధనకు కలిగిన అవరోధాలను దాట గలగాలి. అలాగే మన నాడీ వ్యవస్థ కూడా. మన సాధనలో క్రొత్తగా ప్రవేశించిన సమయంలో నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి సావధానంతో, స్వాధీనంలో ఉండాలి.

సాధన చివరలో, కుండలిని శక్తిని విడుదల చేయడానికి వారాలు, నెలలు పట్టవచ్చు. దానికై అనేక ప్రయత్నములు చేయవచ్చు. దానివలన అలసట కలగవచ్చు. ఆ సమయంలో శుషుప్తిలో పరమాత్మ ప్రత్యక్షమై తన చిటికెన వేలుతో కుండలినిని విడుదల చేయవచ్చు. దాని వలన మన దేహం అనేక బాధలు అనుభవించవచ్చు. ఎందుకంటే కుండలినుండి విడుదలైన శక్తి ఒక సామాన్య మానవుడు భరించడం బహు కష్టం. మన దేహం ఎంత కష్టం అనుభవిస్తుందో మన చేతన మనస్సు అంత ఆనందిస్తుంది. 445

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...